విద్యుదుత్పత్తి కోసమే శ్రీశైలం జలాశయం నిర్మించబడిందని, జలాశయంలో నీటి మట్టం 834 అడుగులకు పడిపోయే వరకు విద్యుదుత్పత్తిని కొనసాగించి తీరుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శబధం చేశారు. రోజు రోజుకూ తీవ్రమవుతున్నవిద్యుత్ సంక్షోభంతో తెలంగాణ ప్రజలు, పారిశ్రామిక రంగం, ప్రత్యేకించి రైతాంగం అసంతృప్తితో అట్టుడికి పోతున్నారు. పెల్లుబుకుతున్న అసంతృప్తిని ప్రత్యర్థులపైకి మళ్ళించే ప్రయత్నంలో భాగంగా తన రాజకీయ ప్రయోజనాలకు ఊపిరులూదుతున్న బ్రహ్మాస్త్రం లాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తిట్లదండకాన్నిమొదలుపెట్టి సంస్కారహీనమైన పదజాలాన్ని పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ప్రయోగించడం ద్వారా విమర్శలకు గురైనారు. వాదనలో పటుత్వం లేని వారే తిట్లదండకాన్ని లంకించుకొంటారని నానుడి. విడిపోయి ఎవరి బ్రతుకులు వారు బ్రతుకుదాం! అని రాష్ట్ర విభజనకు ముందు చిలక పలుకులు పలికిన కె.సి.ఆర్. రోజుకొక వివాదంతో వైషమ్యాలకు ఆజ్యం పోస్తున్నారు. తాజాగా శ్రీశైలం జలాశయం నీటి వినియోగంపై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఓ.నెం.69, 107 లను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రం నుండి ఉత్పత్తిని కొనసాగించడం వివాదానికి తెరలేపింది. ఈ వివాదం అనూహ్యమైనదేమీ కాదు. ఈ తరహా వివాదాలకు రాష్ట్ర విభజన ఆజ్యం పోసింది. తెలుగు జాతి మధ్య విద్వేషాలను ఆరనిచిచ్చులా కొనసాగించడంపైనే తమ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని టి.ఆర్.యస్. అధినాయకత్వం భావిస్తున్నట్లుంది. పర్యవసానంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు జఠిలంగా మారుతున్నాయి.
తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు క్రిష్ణా నదీ జలాలను తరలించే నీటి పారుదల వ్యవస్థకు
శ్రీశైలం జలాశయం గుండెకాయ లాంటిది. క్రిష్ణా జలాల పంపకానికి సంబంధించి బచావత్
ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తిరగదోడే అవకాశం లేదు. అందుకే బ్రజేశ్ కుమార్
ట్రిబ్యునల్ నీటి లభ్యతను 65% ప్రామాణికంగా తీసుకొని అదనంగా లభిస్తాయని అంచనా
వేసిన నీటిని, ఆపైన లభించే మిగులు జలాలను మాత్రమే అంచనా వేసి నదీ పరివాహక ప్రాంతంలోని
రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. ఆ తీర్పు వల్ల మనకు తీవ్ర నష్టం వాటిల్ల నుండడంతో
సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. విచారణానంతరం అత్యున్నత న్యాయస్థానం
వెల్లడించే తీర్పు అందరికీ శిరోధార్యంగా ఉంటుంది. ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా
శ్రీశైలం జలాశయం వద్ద నీటి నిల్వ, నిర్వహణ, వినియోగంపై ప్రస్తుతం అమలులో ఉన్నఉమ్మడి రాష్ట్ర
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు కట్టుబడి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించక
పోతే నీటి యుద్ధాలు తప్పక పోవచ్చు. రాష్ట్ర విభజన చట్టం నిర్ధేశించిన మేరకు
కేంద్ర ప్రభుత్వం క్రిష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ బోర్డు
ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు ప్రభుత్వాలు నడుచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం
ఆ బోర్డు మాటను కూడా లెక్కచేయమన్నట్లు వ్యవహరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో! వేచి
చూడాలి. విద్యుత్ సరఫరా విషయంలో అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తే
న్యాయ స్థానాలను ఆశ్రయించవచ్చు తప్పులేదు. కానీ శ్రీశైలం జలాశయం నీటి వినియోగానికి
సంబంధించి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తానంటే
సమర్థనీయం కాదు.
రాయలసీమ బలిపశువు: శ్రీశైలంపై మాకే హక్కున్నదనే పెద్ద మనుషులు ఆ జలాశయం
నిర్మాణం వెనుక దాగి ఉన్నచరిత్రను తెలుసుకొని మాట్లాడాలి. నిత్యకరవులతో జీవన్మరణ
పోరాటం చేస్తున్న రాయలసీమ ప్రజానీకం బతుకులతో రాజకీయ వ్యవస్థ ఆటలాడుకొంటున్నది.
వెనుకబడ్డ రాయలసీమకు అడుగడుగునా అన్యాయమే జరుగుతున్నది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం
సాగిన ఉద్యమ సందర్భంలో 1937 సం.లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం 'శ్రీబాగ్ ఒడంబడిక' కాలగర్భంలో కలిసి
పోయింది. కృష్ణా, తుంగభద్ర నదీ జలాల వినియోగంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తామని అందులో లిఖిత
పూర్వకంగా వాగ్దానం చేసి మొండి చేయి చూపెట్టారు. 1951లో కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం కూడా పొందిన
కృష్ణా - పెన్నార్ ప్రాజెక్టు ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు లభించే
సువర్ణావకాశం తలుపు తట్టినా ఇతర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలకు ఆ ప్రాజెక్టు మూలంగా
నష్టం జరుగుతుందని చెప్పి అడ్డుకొన్నారు. సిద్ధేశ్వరం, గండికోట జలాశయాలను నిర్మించి రాయలసీమకు న్యాయం
చేస్తామని నమ్మబలికి ఆ ప్రాంతాన్ని కరవు కాటకాలకు నిలయంగా మార్చేశారు. సిద్ధేశ్వరం
బదులు శ్రీశైలం జలాశయాన్ని జల విద్యుత్తు ప్రాజెక్టుగా నిర్మించి తీరని ద్రోహం
చేశారు.
ప్రజాందోళనకు తలవొగ్గి రాయలసీమకు జరిగిన అన్యాయాన్నికొంత మేరకైనా
సరిదిద్దడానికి శ్రీశైలం జలాశయాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మార్పు చేశారు.
శ్రీశైలం జలాశయం నిర్మాణానికి ముందు, తరువాత జరిగిన చరిత్ర తెలయని లేదా గుర్తించ
నిరాకరిస్తున్న వారు శ్రీశైలం జలాశయం నిర్మాణమే విద్యుదుత్పాదన కోసమేనని ఇంకా
అడ్డగోలుగా వాదిస్తున్నారు. ఆ వాదననే అంగీకరిస్తే శ్రీశైలం ఎడమ గట్టు
కాలువ(యస్.యల్.బి.సి.), కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా శ్రీశైలం
జలాశయం నుండి సాగు నీటినెలా నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు తరలిస్తారు? రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలో
మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటిని తరలించే హక్కు లేదని
వితండవాదం చేసే వారు విజ్ఞతతో ఆలోచించాలి. తాజా వివాదాన్ని విస్తృతం చేయకుండా
బాధ్యతాయుతంగా, రాగద్వేషాలకు అతీతంగా, సంకుచిత రాజకీయాలను పక్కకునెట్టి ఆలోచించాలి.
తెలుగు జాతి రెండు ముక్కలవుతుందని నాడు ఎవరూ ఊహించలేదు. కానీ ప్రాంతాల మధ్య
విద్వేషాలకు, వివాదాలకు తావు లేకుండా జాగ్రత్త పడాలనే సదుద్ధేశంతోనే 1996 జూన్ 15న జి.ఓ.నెం.69ని ఉమ్మడి రాష్ట్ర
ప్రభుత్వం జారీ చేసింది. అందులో శ్రీశైలం జలాశయం నుండి నీటి విడుదలకు సంబంధించి
ప్రాధాన్యతా క్రమం నిర్ధేశించబడింది. 1) జలాశయంలో 875 అడుగుల నీటి మట్టం ఉన్నసమయంలో జూలై నుండి అక్టోబరు
మాసాల మధ్య నెలకు 3.75 టి.యంం.సి. ల చొప్పున మద్రాసుకు 15 టి.యం.సి.ల
త్రాగునీటిని సరఫరా చేయాలి. కరవు పరిస్థితులు నెలకొన్న సంవత్సరాలలో
వరదలొచ్చినప్పుడు నీటిని విడుదల చేసి సర్దుబాటు చేయాలి. 2)
హైదరాబాదుకు త్రాగు నీరు. 3) శ్రీశైలం జలాశయానికి
కుడి వైపునున్న జల విద్యుత్ కేంద్రం నుండి విద్యుదుత్పత్తి. 4) కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్
ఆయకట్టుకు సాగునీరు విడుదల. 5) ప్రకాశం ఆనకట్ట క్రింద సాగునీటి అవసరాన్ని బట్టి
నాగార్జున సాగర్ జలాశయం వద్ద జల విద్యుదుత్పాదనకు అనుమతి. 6) శ్రీశైలం కుడి
బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.) ఆయకట్టుకు సాగునీరు. 7) తెలుగు గంగకు సాగునీరు. 8)
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ
(యస్.యల్.బి.సి.) ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలి.
శ్రీశైలం జలాశయం వద్ద నీటి విడుదలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను ఆ జి.ఓ.లో
పొందుపరచారు. నాగార్జునసాగర్ జలాశయం వద్ద నీటి అవసరాన్ని బట్టి శ్రీశైలం జలాశయం
నుండి నీటిని విడుదల చేయాలి. నాగార్జునసాగర్ జలాశయంలో సరిపడా నీరున్నప్పుడు
శ్రీశైలం జలాశయం నుండి క్రిందికి నీటిని విడుదల చేయకూడదు. అలాగే 834 అడుగుల నీటి
మట్టానికి క్రింద అనివార్యమైతే త్రాగు నీటికి తప్ప శ్రీశైలం జలాశయం నుండి నీటి
విడుదలపై ఆ జి.ఓ.లో నిషేధం విధించబడింది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగులు ఉంటే
దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లుగా భావించాలని పేర్కొన్నారు. 854 అడుగులకుపైన నీటి
మట్టం ఉంటేగానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నయ్ నగరానికి 15 టి.యం.సి.ల
త్రాగునీటిని, రాయలసీమలోని యస్.ఆర్.బి.సి.(19 టి.యం.సి.ల నికరజలాలు), కె.సి.కెనాల్(10 టి.యం.సి.ల నికరజలాలు), తెలుగు గంగ(29 టి.యం.సి.ల మిగులు జలాలు),
గాలేరు_నగరి(38 టి.యం.సి.ల మిగులు
జలాలు) ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయలేరు. అంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటి
మట్టాన్నిపరిరక్షించాలి. ఆ కారణంగానే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష
సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో తీసుకొన్న ఏకగ్రీవ తీర్మానం మేరకు
జి.ఓ.నెం.107ను 2004 సెప్టంబరు 28న జారీ చేసింది. ఈ వాస్తవాన్నిగుర్తుంచుకోవాలి.
విద్యుదుత్పాదనపై వివాదం: జల విద్యుదుత్పాదనకు సంబంధించి కూడా జి.ఓ.నెం.69లో విస్పష్టమైన
నిబంధనలను పేర్కొన్నారు. జలాశయంలో 885 అడుగులకు నీటి మట్టం చేరుకొన్నప్పుడు కుడి
వైపునున్న జల విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తికి నీటిని వదలాలి. నదీ ప్రవాహాన్ని
బట్టి ఎడమ వైపునున్న"పంప్ స్టోరేజ్ సిస్టం" ద్వారా విద్యుదుత్పత్తికి
నీటిని విడుదల చేయాలి. "పంప్ స్టోరేజ్ సిస్టం" ద్వారా జూలై - అక్టోబరు మాసాల మధ్య కాలంలో మాత్రమే విద్యుదుత్పత్తికి
అనుమతించబడింది. ఈ విధానంలో విద్యుత్తుకు ఎక్కువ డిమాండ్ ఉన్న సమయంలో జలాశయం నుండి
నీటిని వినియోగించుకొని విద్యుదుత్పత్తి చేసుకొని, విద్యుత్తుకు తక్కువ డిమాండ్ ఉన్న
సమయంలో(రాత్రిపూట) తిరిగి నీటిని జలాశయంలోకి పంప్ చేయాలి. నాగార్జున సాగర్ జలాశయం
వద్ద విద్యుదుత్పాదన యాదృచ్చికమైన చర్య మాత్రమే. ప్రకాశం బ్యారేజి వద్ద నీటి
అవసారాలకు అనుగుణంగా మాత్రమే నాగార్జున సాగర్ నుండి నీటిని విడుదల చేస్తూ
విద్యుదుత్పత్తి చేసుకోవాలి. అలాగే సాగర్ జలాశయం పూర్తిగా నిండిన తరువాత కూడా నదీ
ప్రవాహం ఉంటే ఉత్పత్తి చేసుకోవచ్చు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం తరువాత కొంత
వెసులుబాటు వచ్చింది. సాగర్ వద్ద విద్యుదుత్పాదనకు వినియోగించుకొన్న నీటిని
పులిచింతల జలాశయంలో నిల్వ చేసుకొనె సౌలభ్యం సమకూరింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 43.7 టి.యం.సి.లు.
ప్రస్తుత 20 టి.యం.సి.లకు పైగా నీటిని నిల్వ చేయడానికి అవకాశం
ఉన్నాముంపు ప్రాంతాల ప్రజానీకానికి పునరావాసం, నష్ట పరిహారం చెల్లింపు వంటి సమస్యలు అపరిష్కృతంగా
కొనసాగుతున్న కారణంగా 10 టి.యం.సి.లకు మించి నిల్వ చేయడానికి వీలుకాని
పరిస్థితి ఉన్నది. ఆ మేరకు ఇప్పుడు నీరు నిల్వ ఉన్నది. ప్రకాశం బ్యారేజిలోనూ నిల్వ
సామర్థ్యం(3.7 టి.యం.సి.) మేరకు నీరున్నది. పర్యవసానంగా సాగర్ వద్ద విద్యుదుత్పానకు
వినియోగించే నీరు వృథాగా సముద్రం పాలౌతున్నది.
తెలంగాణ ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభం నుండి ఉపశమనం పొందడానికి
ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషించాలే గానీ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన
ఉత్తర్వులను ఉల్లఘించి శ్రీశైలం జలాశయం వద్ద విద్యుదుత్పాదనను కొనసాగించడం
వివాదాలకు ఆజ్యం పోయడమే అవుతుంది. ఈ సమస్య ఇక్కడతో ఆగదు. విద్యుత్ సమస్య ఉన్నది
కాబట్టి శ్రీశైలం వద్ద జలవిద్యుదుత్పత్తిని కొనసాగించి తీరుతామని బీకరాలు పలుకుతూ
శ్రీశైలంపై తెలంగాణ వారికే హక్కున్నట్లు మాట్లాడుతున్నారు. ఈ వైఖరి
ప్రమాదకరమైనది.
జి.ఓ.నెం.69 విడుదలైన నాటికి కల్వకుర్తి, హంద్రీ -నీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులు నిర్మాణంలో లేవు, కాబట్టి వాటి
ప్రస్తావన ఆ జి.ఓ.లో లేదు. మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న కల్వకుర్తి
ఎత్తిపోతల పథకానికి 805 అడుగుల
యం.డి.డి.యల్. మరియు యస్.యల్.బి.సి.కి 824 అడుగుల నీటి మట్టం నుండే నీటిని తరలించడానికి
వీలుగా నిర్మాణాలు చేపట్టారు. అంటే జి.ఓ. నెం.69, 107 లను ఖాతరు చేయకుండా నీటిని తోడేస్తే
దుష్పరిణామాలెలా ఉంటాయో! ఊహించడం అసాధ్యం. క్రిష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఈ
సమస్యను తీవ్రంగా పరిగణించి, తక్షణం జోక్యం చేసుకొని శాశ్వత పరిష్కారానికి కృషి
చేయాలి. లేకపోతే విపత్కర పరిణామాలకు ఆస్కారం ఇచ్చిన వారవుతారు. సాధారణ వర్ష పాతం
మాత్రమే నమోదైన సంవత్సరాలలో చెన్నయ్ నగరానికి త్రాగు నీరు,
కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు, యస్.ఆర్.బి.సి., కె.సి.కెనాల్ కు
నికరజలాలు గానీ, తెలుగు గంగకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన 25 టి.యం.సి.లు
అందుతాయా! అన్నసందేహాలు ఆ ప్రాంత ప్రజల్లో రేకెత్తుతున్నాయి. అలాగే మిగులు జలాల
ఆధారంగా నిర్మించబడుతున్న హంద్రీ - నీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులు శాశ్వతంగా మూలనపడతాయని
భయాందోళనలు వ్యక్తఅవుతున్నాయి.
రైతుల కరెంటు బాధలు తీర్చేందుకే శ్రీశైలం జలాశయం వద్ద విద్యుదుత్పత్తి
చేస్తున్నామని చెప్పడం ద్వారా రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ ను విభజించిన తరువాత
కూడా తెలుగు ప్రజల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం దారుణం. తెలంగాణ
రైతాంగానికి విద్యుత్తును సరఫరా చేయాలి, పంటలను కాపాడాలి, రైతుల ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్ట వేయాలి. దీని
కోసం రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం అనివార్యం. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా
తోడ్పడాలి. వివాదాలు, విద్వేషాలు, తిట్లు సమస్యలకు పరిష్కారం చూపకపోగా జఠిలం
చేస్తాయి. అధికారంలో ఉన్న వారు విజ్ఞత ప్రదర్శించాలి.