Wednesday, October 15, 2014

రుణమాఫీ చుట్టూ రాజకీయం! ప్రచురణ: అక్టోబరు 15, 2014 సూర్య దినపత్రిక‌

 తెలుగు నాట ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై ప్రజానీకాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. రాష్ట్ర‌ విభజనానంతరం అభివృద్ధిలో తెలంగాణ ఉరకలు పరుగులు తీస్తుందని ఉద్యమకారులు అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టారు. అప్పులను జనాభా ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ కు 58%, తెలంగాణాకు 42% చొప్పున‌ పంచి, విద్యుత్తును మాత్రం వినియోగం ప్రాతిపదికన  ఆంధ్రప్రదేశ్ కు 48%, తెలంగాణాకు 52% చొప్పున‌ పంచారు. అయినా విద్యుత్తు సమస్యతో తెలంగాణా విలవిల్లాడి పోతున్నది. రాష్ట్ర రెవెన్యూ ఆదాయం కూడా 42%కు పడిపోతుందనే అనుమానాన్ని 14వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో తెలంగాణా ప్రభుత్వం వ్యక్తం చేసింది. పదమూడు జిల్లాలతో కూడిన‌ నేటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక‌ దుస్థితి వర్ణనాతీతం. రాష్ట్ర విభజనను కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకం కోరుకోలేదు. వారిపై నిరంకుశంగా రుద్దబడింది. విభజనతో కుంగిపోయిన ప్రజానీకం మనోధైర్యాన్ని కూడగట్టుకొని ప్రతికూల పరిస్థితులను సవాలుగా స్వీకరించి అభివృద్ధి చెందాలనే పట్టుదలతో ఉన్నట్లు కనబడుతున్నది. ఈ సానుకూలాంశమే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కాస్తా బరోసా ఇస్తున్నది. కానీ, రాష్ట్ర విభజనలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వాములైన రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న దివాలాకోరు  విధానాలు ఆ రాష్ట్రాభివృద్ధికి అవరోధంగా తయారవుతున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నది. సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యమాని తీవ్రసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న‌ఈ రంగాన్ని కాపాడుకొని ఆహారభద్రతను పరిరక్షించుకోవడమెలా! అన్నదే జాతి ముందున్న అతిపెద్ద సవాలు.
రుణమాఫీ - హేతుబద్ధత: జాతీయ స్థూల ఉత్ఫత్తి(జి.డి.పి.)లో 13.7%(2012-13) వాటానే ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయo, దాని అనుబంధ రంగాలు జీవనాడి. ఉపాథి కల్పనలో వీటి వాటా 60% పైగానే ఉన్నది. నూట ఇరవై కోట్ల దేశ జనాభాకు అవసరమైన వ్యవసాయ‌ ఉత్ఫత్తులను చేస్తూ రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకపోయి విలవిల్లాడి పోతున్నారు. వరుసగా సంబవిస్తున్న‌ ప్రకృతి వైపరీత్యాలు కోలుకోని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ఇన్ పుట్స్ ధరలు విపరీతంగా పెరిగాయి. వ్యవసాయ ఉత్ఫత్తులకు లాభసాటి ధరల మాట అటుంచి పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి చేతికిరాని దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. మార్కెట్ మాయాజాలంలో రైతాంగం తీవ్ర దోపిడీకి గురౌతున్నది. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ప్రభుత్వాలు కాగితాలకే పరిమితం చేశాయి. పర్యవసానంగా అన్నదాతలు దివాలా తీసి దేశ వ్యాపితంగా లక్షల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకొన్నారు. సేద్యం అటకెక్కింది. ఆహార భద్రత ప్రమాదంలో పడుతున్నది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం వైపు పరుగులు తీస్తున్నాయి. వినియోగదారులు నిలువు దోపిడీకి గురౌతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగాన్నిరుణ విముక్తుల్ని చేయడమన్నది దేశ విస్తృత‌ ప్రయోజనాలు, ఆహార భద్రతతో ముడిపడిన అంశంగా అందరూ పరిగణించాలి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ పథకాన్ని ఈ కోణంలో ఆలోచించాలి.
తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మరొక‌ రంగం చేనేత. చేనేత కార్మికుల‌ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. అసంఘటిత రంగ‍ంలోని చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకొని, ప్రత్యామ్నాయ ఉపాథి అవకాశాలను కల్పించాల్సిన‌ బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. రైతులకు, చేనేత కార్మికులకు, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ అంశం చుట్టూ నేడు తెలుగు నాట రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు ఈ సమస్యను అడ్డంపెట్టుకొని సంకుచిత రాజకీయ ప్రయోజనాలు పొందాలని నిర్లజ్జగా ప్రయత్నిస్తున్నాయి. ఏ రుణమాఫీ పథకాన్నైనా ఉపాథి, ఉత్పత్తితో అనుసంధానం చేసి అమలు చేస్తే సత్ఫలితాలుంటాయి. ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలు వనగూడుతాయి. మరీ ప్రత్యేకించి అడ్డగోలు విభజనతో ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేసే ప్రతి రూపాయి అత్యంత విలువైనది. అనుత్పాదక రంగాలకు, అన‌ర్హులకు లబ్ధి చేకూర్చే వ్యయాన్ని బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు, సంస్థలు, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించకూడదు. ఆర్థిక విధానాల అమలులో రాష్ట్రం యొక్క విశాల ప్రయోజనాలే గీటు రాయిగా పరిగణించబడాలి.
ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న‌ సమస్యలపైన జాతీయ పార్టీలు జాతీయ దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం సముచితంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు జాతీయ దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆశించడం దురాశే అవుతుంది. రుణాల మాఫీ అంశాన్నే తీసుకొందాం. తెలుగు నాట రుణాలను మాఫీ చేయాలంటున్న జాతీయ రాజకీయ పార్టీలు దేశ వ్యాపితంగా కూడా మాఫీ చేయాలని మాట వరసకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరకపోవడం ఆశ్చర్యకరంగా ఉన్నది. పైపెచ్చు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఉంటూ ఒక జాతీయ విధానమంటూ లేకుండా తెలుగు ప్రజలను నిరంకుశత్వంతో విభజించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ప్రజల‌ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన ఆ పార్టీకి చెందిన నాయకులు రుణమాఫీపై మాట్లాడుతుంటే అసహ్యమేస్తున్నది. వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైఖరిని కాస్తా అర్థం చేసుకోవచ్చు. కారణం రుణమాఫీ అమలు అసాధ్యమని భావించి ఎన్నికల్లో వాగ్ధానం చేయలేదని ఆ పార్టీ బహిరంగంగానే ప్రకటించింది. ఓటమికి ఇతర కారణాలున్నా రుణమాఫీ వాగ్ధానం చేయక పోవడం మూలంగా నష్టపోయామన్న‌ భావనకు ఆ పార్టీ శ్రేణులు వచ్చాయి. దాంతో ఎన్నికల వాగ్ధానానికి కట్టుబడి తూఛా తప్పకుండా రుణమాఫీ పథకాన్ని అమలు చేయాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ద్వారా పాలక పార్టీని ఎండగట్టాలనే ప్రయత్నం చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో శాసనసభలో ఏకైక‌ ప్రతిపక్ష పార్టీగా ఉన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ రాష్ట్రం ఎదుర్కొంటున్న క్లిష్టమైన‌ సమస్యలపై కూడా దృష్టి సారిస్తే కష్టాల్లో ఉన్న‌ ప్రజలకు మేలు జరుగుతుంది. ఎన్నికల వాగ్ధానాలను అమలు చేయక పోతే పాలక పార్టీలైన‌ తెలుగు దేశం, భాజపాలను నిలదీసే హక్కు ప్రజలకు, ప్రతిపక్షాలకు ఉన్నది. అయితే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన‌ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ నైతిక హక్కును కోల్పోయింది. విభజనను సమర్థించిన భాజపా నేతృత్వంలోని యన్.డి.ఎ. ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలుపై నోరు మెదపడం లేదు. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో వారూ భాగస్వాములే. మరి కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకోవలసిన బాధ్యత వారికి లేదా?
అందరూ అర్హులేనా?: ప్రజల సొమ్మును ఖర్చు చేసే ప్రభుత్వ‌ పథకాల అమలుపై అన్ని రాజకీయ పార్టీలు హేతుబద్ధంగా ఆలోచించాల్సిన బాధ్యతను విస్మరించకూడదు. విభజనను బలపరిచిన, వ్యతిరేకించినట్లు నటించిన పార్టీల నాయకత్వాలుగానీ నేడు విజ్ఞతతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి, సమగ్రాభివృద్ధికి దోహదపడే విధానాలు, పథకాల అమలు కోసం ప్రభుత్వంపై వత్తిడి చేస్తే సామాజిక బాధ్యతను నిర్వర్తించిన వాళ్ళవుతారు. ఆ కోణంలో రుణమాఫీ అంశాన్ని కూడా నిశితంగా పరిశీలించాలి. అర్హులైన రైతులందరినీ రుణ విముక్తులను చేయాల్సిందే. అర్హులంటే ఎవరు? అన్న ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది. మచ్చుకు కొన్ని అంశాలను పరిశీలిద్దాం! రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలలోనే ఉంటుందని శాసనసభలో తీర్మానం చేశారు. దాంతో ఒక్కసారిగా భూముల స్వభావం మారిపోయింది. సాగు భూమి వాణిజ్య భూమిగా రూపాంతరం చెందుతున్నది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో రాజధాని ప్రాంత పరిథిలోకి వస్తాయన్న మండలాలలోని భూముల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ సమస్య‌ కూడా రోజు రోజుకూ జఠిలమవుతున్నది. ఎకరా భూమి కోట్ల రూపాయల ధర పలుకుతున్నది. ఆ భూ యజమానులకు కూడా రుణమాఫీ ప్రయోజనాన్ని అందించడమంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? కొందరు భూ యజమానులు భూములను కౌలుకిచ్చి యజమాన్య హక్కులకు సంబంధించిన డాక్యుమెంట్లను బ్యాంకుల్లో తనఖాపెట్టి పంట రుణాలు తీసుకొని, ఆ డబ్బును వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలలో పెట్టుబడిగా మార్చుకొన్న వారూ లేక పోలేదు. మ‌రికొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు బ్యాంకు అధికారుల‌ చేతులు తడిపి ఒకే భూమిపై రెండు మూడు బ్యాంకుల్లో రుణాలు తీసుకొన్న ఘరానా పెద్ద మనుషులూ  లేకపోలేదు. ఇలాంటి వారందరికీ రైతు రుణమాఫీ క్రింద ప్రజాధనాన్ని వెచ్చించాలని కోరడం సమర్థనీయమా? చంద్రబాబునాయుడు అందరికీ రుణమాఫీ పథకాన్ని ప్రకటించి ఉండవచ్చు. ఈవాళ కాస్తా మాట మార్చి ఒక్కో రైతు కుటుంబానికి లక్షన్నర వరకే రుణమాఫీ అని, రిజర్వు బ్యాంకు మరియు రుణాలిచ్చిన‌ వాణిజ్య బ్యాంకులు రుణమాఫీ పథకానికి సహకరించడం లేదు కాబట్టి రుణమాఫీ కాదు, దశల వారిగా రుణ విముక్తులను చేస్తానని పిల్లిమొగ్గలు వేస్తున్న మాటా వాస్తవమే. రైతు సాధికార సంస్థను నెలకొల్పి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తానని సరికొత్త పల్లవి అందుకొన్నారు. కానీ, ఎన్నికల వాగ్ధానం చేశారు కాబట్టి చచ్చినట్లు అందరికీ అమలు చేయాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ద్వారా ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి మేలు జరుగుతుందా! కీడు జరుగుతుందా! అన్న అంశాన్ని హేతుబద్ధంగా ఆలోచించాలి.
టిడిపి చేసిన ఎన్నికల  వాగ్ధానం మేరకు రైతులకు, చేనేత కార్మికులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పథకాన్నిఅమలు చేయాలంటే లక్ష‌ కోట్ల రూపాయలకు పైగా కావాలసి ఉంటుందని ఒక దశలో అంచనా వేశారు. రుణాలిచ్చిన బ్యాంకులు దివాలా తీస్తామని సహాయ నిరాకరణకు పూనుకొన్నాయి. రుణాలిచ్చిన బ్యాంకులన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకులన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. కార్పోరేట్ సంస్థలకు, బడా పారిశ్రామిక వేత్తలకు లక్షలాది కోట్ల రూపాయల రాయితీలిస్తున్న‌ కేంద్ర ప్రభుత్వం అన్నదాతల రుణమాఫీ అంశం వచ్చే సరికి మౌనమే తన విధానం అన్నట్లు వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన‌ విధాన ప్రకటన ప్రకారం ఒక్కోక్క రైతు కుటుంబానికి లక్షన్నర రూపాయలన్నా రు.45,000 కోట్లు కావాలంటున్నారు. నిజమైన లబ్ధిదారుల సంఖ్య తేలితే తప్ప రుణమాఫీ పథకం భారమెంతో తేలదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూద్దామా అధ్వాన్నంగా ఉన్నది. 2014-15 సం. వార్షిక బడ్జెటులో కేవలం ఐదు వేల కోట్లను రైతు రుణమాఫీకి  కేటాయించారు. నిల్వ ఉన్న‌ఎర్రచందనం దుంగలను వేలం వేసి తద్వారా వచ్చే డబ్బును ఈ పథకానికి వెచ్చిస్తామని చెప్పి చతికిల పడ్డారు. ఇప్పుడేమో 20% నిథులను మంజూరు చేసి రైతు సాధికార సంస్థ ద్వారా మొదటి దశలోను, మిగిలిన మొత్తాన్ని నాలుగు సంవత్సరాలలో విడతల వారిగా చెల్లిస్తామని చెప్పడం ద్వారా ఈ పథకాన్నిరాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రహసనంగా మార్చి  రైతాంగాన్ని నిరాశా నిస్పృహలకు గురిచేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వంగానీ, రాజకీయ పార్టీలుగానీ నిజాయితీగా వ్యవహరించాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. విభజన పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకపోయి ఉన్నది.  విభజన చట్టం మేరకు జనాభా ప్రాతిపదికన రు.92,000 కోట్లకు పైగా అప్పుల భారం రాష్ట్రంపై పడింది. దానికి తోడు 2014-15 వార్షిక బడ్జెట్ లో ప్రస్తావించిన ప్రకారం రు.15,505 కోట్లను బహిరంగ మార్కెట్ నుండి రుణాలను సేకరించబోతున్నారు. అంటే మొత్తంగా రు.1,10,634 కోట్లకుపైగా రాష్ట్రానికి రుణ భారం ఉన్నట్లు బడ్జెట్ పత్రాలలో తేల్చారు. ఇది చాలదన్నట్లు ప్రణాళికేతర వ్యయాన్ని మరింత పెంచే వైపు వాగ్ధానాలు చేస్తూ పోతున్నారు. మరొకవైపు సొంత వనరుల ద్వారా రాష్ట్ర ఖజానాకు సమకూరే ఆదాయం రు.37,398 కోట్లు మాత్రమేనని బడ్జెట్ లో అంచనా వేశారు. ఈ పూర్వరంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడడం, ఆశలు రేకెత్తించి నిరాశపరచడం సమంజసం కాదు. రుణమాఫీ పథకానికి అర్హులైన‌  లబ్ధిదారుల ఎంపికే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ప్రజాధనం వినియోగంలో పారదర్శకత, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం పట్ల అంకిత భావంతో వ్యవహరిస్తాయని ఆశిద్ధాం!                                                                                                                                                                                   

                                                                                                                                   

No comments:

Post a Comment