Tuesday, October 7, 2014

సిద్ధాంతమా, స్వప్రయోజనమా!




ప్రచురణ: సూర్యా దినపత్రిక, అక్టోబరు 7,2014

దేశ రాజకీయాలు స్వప్రయోజనాల చుట్టే పరిభ్రమిస్తున్నాయి. సంకీర్ణ రాజకీయాలలో సిద్ధాంతాలు, రాజకీయ విధానాల ప్రాతిపతికపై రాజకీయ కూటములు ఏర్పడడానికి బదులు ఆయా పార్టీల అవసరార్థం ఏర్పడుతున్నాయి. కూటమిలోని రెండు పార్టీలు సమఉజ్జీవులుగా ఉంటే ఆ కూటమిపై ఎవరిది పెత్తనం అన్న అంశం వివాదాస్పదమై అంత్యమంగా విచ్ఛిన్నమైపోతున్నది.  మహారాష్ట్ర శాసనసభకు ఈనెల 15న జరుగనున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లపై శివసేన - భారతీయ జనతా పార్టీల మధ్య పొడచూపిన విభేదాలు అంతిమంగా వారి మధ్య ఇరవై అయిదు(1989 - 2014) సంవత్సరాలుగా కొనసాగుతున్న స్నేహ బంధాన్ని తెంచేశాయి. రెండు పార్టీల భావజాలం హిందుత్వమే. ఆ కారణంగానే వాటి మధ్య‌ సుదీర్ఘ కాలం పాటు మిత్రత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగింది. కానీ, తాజా పరిణామాన్ని పరిశీలిస్తే భావజాలాని కంటే ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కాలన్న అంశమే పై చేయి సాధించింది. మహారాష్ట్ర శాసనసభలో ఉన్న‌ 288 స్థానాలకుగాను 151 స్థానాల్లో పోటీ చేయడం ద్వారా కూటమిపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని శివసేన పట్టువిడుపులులేని వైఖరిని ప్రదర్శించింది. శివసేన ఆధిపత్యానికి గండికొట్టాలని ప్రయత్నించిన భాజపా విఫలం చెంది స్వతంత్రంగా ఎన్నికల బరిలో దిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చారిష్మా మహారాష్ట్రలో అధికారాన్ని సంపాదించి పెడుతుందన్న కొండంత ఆశతో శివసేనకు భాజపా 'గుడ్ బై' చెప్పేసింది. అధికారం కోసం జరుగుతున్న పోరులో హిందుత్వ బంధం తృణప్రాయంగా తెగిపోయింది.
ఈ రాజకీయ పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని అంశాలను గమనించవచ్చు. నేడు దేశంలో సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్నాయి. హిందుత్వ భావజాలం పునాదులపై భాజపా_శివసేన పార్టీలు కూటమిగా ఏర్పడి రెండున్నర దశాబ్దాల పాటు కొనసాగి ఇప్పుడు చిన్నాభిన్నమయ్యింది. తద్వారా రాజకీయ కూటముల‌ ఉనికిపై చర్చకు తెర లేపినట్లయ్యింది. దీనికి కొంత నేపథ్యం కూడా ఉన్నది. రాష్ట్రాలలోనే కాదు కేంద్రంలో కూడా రెండు దశాబ్దాలకుపైగా సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. 2014 మే మాసంలో లోక్ సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు సాధారణ మెజారిటీ రాక పోవచ్చని, మిత్రులపై ఆధారపడే పరిస్థితి అనివార్య‌oగా నెలకొంటుందన్న చాలా మంది అంచనాలు తారుమారైనాయి. భాజపా అనూహ్యమైన ఫలితాలను సాధించి నరేంద్ర మోడీ నేతృత్వంలో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఆధిక్యతను సాధించుకొన్నది. అయినప్పటికీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన మిత్రపక్షాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్నే మోడీ ఏర్పాటు చేశారు. కానీ, మిత్రపక్షాల మాట అంత చెల్లుబాటు కాని పరిస్థితి నెలకొని ఉన్నది. తన కనుసైగలతో ప్రధాన మంత్రి మోడీ కేంద్ర ప్రభుత్వాన్నినడిపిస్తున్నారు. అలాగే  అత్యంత‌ శక్తిమంతుడుగా భాజపా శ్రేణుల చేత మోడీ కీర్తించబడుతున్నారు. సొంత పార్టీలో తిరుగులేని నాయకుడుగా ఆవిర్భవించి, అంతా తానై పార్టీ యంత్రాంగాన్ని తన చేతుల్లోకి తీసుకొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన అమిత్ షాను పార్టీ అధ్యక్షుడుగా నియమింపజేసుకొన్నారు.
దృక్పథంలో మార్పు: సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించి, కేంద్రంలో అధికారంలోకి వచ్చినా భాజపాకు ఉన్న బలం, బలహీనతలు పట్ల‌ ఆ పార్టీ నాయకత్వానికి, ప్రత్యేకించి దాని మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.యస్.యస్.)కు స్పష్టంగా తెలుసు. అందుకే నరేంద్ర మోడీ చారిష్మా ఆవిరై పోక ముందే పార్టీని దేశ నలుమూలలకు నిర్మాణాన్ని విస్తరించుకొని రాజకీయ లబ్ధి పొందాలని భాజపా నాయకత్వం ఉవ్విళ్ళూరుతున్నది. ఇది ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణమే. ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. కాకపోతే హిందుత్వ భావజాలానికే కట్టుబడిన‌ శివసేనను సహితం బలహీనపరచడం ద్వారా మహారాష్ట్రలో తాము ఆధిపత్యంలోకి రావాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేసి అమలు చేయడమే ఆశ్చర్యకరమైనది. కాబట్టే దీన్ని ఒక‌ సాధారణమైన రాజకీయ పరిణామంగా పరిగణించలేము. భాజపా అనుసరిస్తున్న వైఖరి పర్యవసానంగా భవిష్యత్తులో ఎలాంటి పర్యవసానాలు సంబవిస్తాయో! వేచి చూడాలి.
భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి(ఎన్.డి.ఎ.)లో శివసేన రెండవ పెద్ద పార్టీ. ఆ పార్టీకి లోక్ సభలో 18 మంది సభ్యులు, రాజ్యసభలో ముగ్గురు సభ్యులున్నారు. భాజపాకు లోక్ సభలో సాధారణ మెజారిటీ ఉన్నది. ఆ పార్టీ మరొక పార్టీపై ఆధారపడి లేదు. కానీ, నాలుగు మాసాలు కూడా గడవక ముందే ఎన్.డి.ఎ.లో భాగస్వామ్య‌ పార్టీలుగా ఉన్న భాజపా, శివసేనలు మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రంగంలోకి దిగడం రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యం కలిగించింది. కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న‌ తమ ఏకైక కేంద్ర మంత్రి అనంత్ గీతే రాజీనామా చేస్తారని ప్రకటించిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కాస్తా వెనక్కి తగ్గి మోడీతో సంప్రదించాకే తుది నిర్ణయం తీసుకొంటామని సెలవిచ్చారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంబంధిత మంత్రి ప్రకటించారు. దీన్ని బట్టి శివసేన అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నట్లు కనబడుతున్నది. మంత్రితో రాజీనామా చేయించి మోడీ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు కొనసాగిస్తారన్న ఊహాగానాల వార్తలు ప్రసారమాధ్యమాలలో వచ్చాయి. శివసేన నిర్ణయం ఎలా ఉన్నా ఎన్.డి.ఎ. మిత్రపక్షాల మధ్య వచ్చిన ఈ చీలిక ప్రభావం ఏదో ఒక మేరకు ఉంటుంది. రాజ్యసభలో మైనారిటీలో ఉన్నప్రభుత్వానికి మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమూ లేకపోలేదు.
 లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయంతో భాజపా ఆలోచనా విధానంలో కొట్టొచ్చినట్లు మార్పు కనపడుతున్నది. భాజపా ఉనికి లేని లేదా బలహీనంగా ఉన్న లేదా మిత్రపక్షాలైన ప్రాంతీయ పార్టీలకు 'జూనియర్ పార్ట్నర్' గా ఉన్న రాష్ట్రాలలో విస్తరించడానికి, బలోపేతం కావడానికి ఉన్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలన్న ధ్యేయంతో పావులు కదుపుతున్నది. 2014 ఎన్నికల్లో ఓటమి పాలై కుదేలై ఉన్న‌ ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టు మరియు అధికారంలో ఉన్న‌ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి ఎదగాలనే కోరికతో పాటు మిత్రపక్షాల‌ ఓటు బ్యాంకు పునాదుల్లోకి కూడా చొచ్చుకొని పోయి సొంత బలాన్ని పెంచుకొనే పనిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు మహారాష్ట్ర ఎన్నికల ఎత్తుగడలను బట్టి స్పష్టమవుతున్నది. లోక్ సభ ఎన్నికల్లో విజయడంకా మ్రోగించిన‌ప్పటికీ అధికారంలో ఉన్న‌ గుజరాత్, రాజస్తాన్, లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన‌ ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోని కొన్ని శాసనసభా స్థానాలకు సెప్టంబరులో ఉపఎన్నికలు జరిగితే భాజపా ఘోరపరాజయాన్ని చవిచూసింది. అయినా మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల్లో తమదే విజయమన్న అహంభావంతో భాజపా మిత్రపక్షాల పట్ల‌ వ్యవహరిస్తున్నది.
మహారాష్ట్రకు సరిహద్దు రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాలలో భాజపా ప్రభుత్వాలే ఉన్నాయి. శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే లేనిలోటును ఉద్ధవ్ థాకరే భర్తీ చేయలేక పోతున్నాడు. పైపెచ్చు రాజ్ థాకరే మహరాష్ట్ర నవనిర్మాణ సమితి(యం.యన్.యస్.) పేరుతో  వేరుకుంపటి పెట్టుకొని శివసేనకు కంటిలో నలుచులా తయారయ్యాడు. బలమైన సమర్థ నాయకత్వ లేమితో బాధపడుతున్న శివసేనను కట్టడిచేసి, తాను బలపడాలని భాజపా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. మరొక వైపు నిన్నటి వరకు ఇటు మహారాష్ట్రలోను, అటు కేంద్రంలోనూ ఐక్య ప్రగతిశీల కూటమి(యు.పి.ఎ.)లో భాగస్వాములుగా ఉంటూ పదిహేనేళ్ళ పాటు పాలనాధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(యన్.సి.పి.)లు విడిపోయి జుట్లు పట్టుకొని తిట్టుకొంటున్నాయి. ఆదర్శ్ అపార్ట్ మెంట్స్ నిర్మాణం తదితర‌ అవినీతి కుంభకోణాలు, అసమర్థ పాలనతో అప్రతిష్టపాలైన కాంగ్రెస్ - యన్.సి.పి కూటమి ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న‌ ప్రజావ్యతిరేకతను సొమ్ము చేసుకొని మహారాష్ట్రలో కూడా తమ నేతృత్వంలో ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్న బలమైన‌ ఆకాంక్షతో భాజపా నాయకత్వం ఉన్నట్లు కనబడుతున్నది. భాజపా అంతరంగాన్ని అర్థం చేసుకొన్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఉభయుల విశాల ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందేమోనన్న సంశయం ఉన్నా సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు ప్రదర్శించ లేదు. దీన్ని సాకుగా చూపెట్టి భాజపా నాయకత్వం ఆ పార్టీతో తెగతెంపులు చేసుకొని మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతున్నది. భవిష్యత్తులో కూడా ఇదే వైఖరిని మిగిలిన మిత్రపక్షాలైన అకాలీదళ్, తెలుగు దేశం అధికారంలో ఉన్నపంజాబ్, ఆంధ్రప్రదేశ్ లలో భాజపా అనుసరించే అవకాశాలే మెండుగా ఉన్నాయి.
జాతీయ పార్టీల వైఫల్యం పర్యవసానంగా ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించి, బలపడి, పలు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చాయి. ప్రాంతీయ పార్టీలు వ్యక్తులు, కుటుంబాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఆయా ప్రాంతీయ‌ పార్టీల అధినేతలు మరణిస్తేనో లేదా అవినీతి కేసుల్లో ఇరుక్కొని లేదా ప్రజావ్యతిరేక పాలన సాగించి అప్రతిష్ట పాలైతే ఆ పార్టీల మనుగడే ప్రశ్నార్థకమవుతున్న ప్రక్రియను గమనిస్తూనే ఉన్నాం. బీహార్ లో లాలూప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్.జె.డి., ఉత్తరప్రదేశ్ లో మాయావతి నేతృత్వంలోని బి.యస్.పి., తమిళనాట డి.యం.కె., తాజాగా జయలలిత అరెస్టుతో ఎ.ఐ.ఎ.డి.యం.కె. ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను ఉదహరించుకోవచ్చు.
చిన్న రాష్ట్రాల సిద్ధాంతంతో రాష్ట్రాలను ముక్క చెక్కలు చేయడం ద్వారా బలంగా ఉన్న‌ ప్రాంతీయ పార్టీలను, రాజకీయ శక్తులను బలహీనపరిచి, వాటి మాటకు డిల్లీలో విలువ లేకుండా చేయడం ద్వారా దేశంపై పెత్తనాన్ని కొనసాగించాలని, రెండు పార్టీల వ్యవస్థను నెలకొల్పాలని భాజపా, కాంగ్రెస్ తలపోస్తున్నాయి. గడచిన పదేళ్ళుగా దుష్టపాలన సాగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఛీత్కారానికి గురై కోలుకోలేని దుస్థితిలో ఉన్నది. ఇదే అదనుగా ఉత్తర భారత దేశానికే పరిమితమై ఉన్న భాజపా దేశ వ్యాపితంగా విస్తరించాలని, బలాన్ని పెంచుకొని ప్రాంతీయ పార్టీల స్థానంలో తాము ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి పథకాలు రచించుకొని పనిచేస్తున్నది.
పార్లమెంటుకు 2019లో జరిగే ఎన్నికల తదనంతరం దక్షిణాది రాష్ట్రాలలో సాధించుకొనే స్థానాలపై ఆధారపడే కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకొంటామన్న‌ ధీమాను కొందరు భాజపా నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారంటే వారి వ్యూహమేంటో బోధపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి మిత్రపక్షంగా ఉంటూనే రాబోయే ఎన్నికల నాటికి మేమే ప్రత్నామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని బాహాటంగానే ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. సమైక్య‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల ఛీత్కారానికి కాంగ్రెస్ గురయ్యింది. వై.యస్. ఆర్. కాంగ్రెస్ అధినేత అవినీతి ఆరోపణ కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా తామే ప్రత్యామ్నాయ‍ రాజకీయ శక్తిగా ఎదుగుతామని భాజపా చెప్పుకొంటున్నది. తెలంగాణలోనూ అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయమంటున్నారు. తమిళనాడు పరిణామాలను అనుకూలంగా మలచుకోవడం ద్వారా కర్నాటకకే పరిమితమైన భాజపా దక్షిణాదిలో విస్తరించాలని కలలు కంటున్నది. ఒక రాజకీయ పార్టీగా బలపడాలని భాజపా కోరుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. ప్రజలను విభజించే మత రాజకీయాలతో కాకుండా ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ, ప్రజాభ్యుదయం కోసం పరితపిస్తూ, ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ప్రజల మన్ననలు పొంది ఏ రాజకీయ పార్టీ అయినా అభివృద్ధి చెందవచ్చు. అలాంటి అవకాశాన్ని భారత రాజ్యాంగం పుష్కలంగా కల్పించింది.
                                                                                                                           

No comments:

Post a Comment