Wednesday, November 26, 2014

తుళ్ళూరు చుట్టూ రాజకీయం

సూర్యా దినపత్రిక, నవంబరు 26,27 తేదీలలో రెండు భాగాలు ప్రచురించబడిన వ్యాసం.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం, వెనుకబడిన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి, నిథుల కేటాయింపుతో సమాంతరంగా అమలు చేయవలసిన తరుణంలో తుళ్ళూరు చుట్టూనే ప్రభుత్వం, రాజకీయ పార్టీలు పరిభ్రమిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు చుట్టూనే అభివృద్ధంతా జరగడంతో సంబవించిన దుష్పరిణామాల అనుభవాల పూర్వరంగంలో కూడా గుణపాఠాలు నేర్చుకొన్నట్లు కనపడడ‍ం లేదు. రాష్ట్ర‌ విభజనతో కోస్తాంధ్ర, ప్రత్యేకించి వెనుకబడ్డ‌ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల‌ ప్రజానీకం తీవ్రంగా నష్టపోయారు. మరొకసారి అలాంటి దుస్థితి దాపురించకుండా ఉండాలంటే అభివృద్ధి వికేంద్రీకరించబడాలని వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలు బలంగా కోరుకొంటున్నారు.
ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రం ఇవాళ‌ పెనుసవాళ్ళను ఎదుర్కొంటున్నది. రాజధాని లేదు. ఆస్తుల పంపకంలో వివక్షతకు గురి చేయబడింది. అప్పుల భారాన్నిమాత్రం జనాభా ప్రాతిపదికపై మోపారు. విద్యుత్తును వినియోగం ప్రాతిపదికపై కేటాయించారు. ఆదాయ వనరులకు కల్పతరువుగా ఉన్న హైదరాబాదును ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయారు. విభజన‌ చట్టంలో పొందుపరచిన అంశాల అమలులో అస్పష్టత, జాప్యం కొనసాగుతున్నది. లోటు బడ్జెట్ ను భర్తీ చేస్తామన్న వాగ్ధానం అమలుకు నోచుకోలేదు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి, వెనుకబడ్ద రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీల హామీలపై కేంద్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఇస్తామన్నారు. చట్టంలో పొందుపరచిన మరియు పార్లమెంటులో నాటి ప్రధాన మంత్రి చేసిన వాగ్ధానాలన్నింటినీ తూ.ఛా. తప్పకుండా అమలు చేసి తీరుతామని కేంద్ర మంత్రులు తరచూ వల్లె వేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంట పడుతున్నా, ప్రధాన మంత్రి నరేంద్ర‌ మోడీ మాత్రం తన నోటి నుండి ఒక్క మాట మాట్లాడిన ఉదంతం లేకపోవడంతో ప్రజానీకంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూద్దామా! అధ్వాన్నంగా ఉన్నాయి. రైతులకు రుణమాఫీ పథకాన్నిఅమలు చేస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్ధానం అమలులో ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. గోరుచుట్టపై రోకటి పోటన్నట్లు హుద్ హుద్ తుఫాను ఉత్తరాంధ్రను, ప్రత్యేకించి పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నాన్ని గొడ్డలిపెట్టుకు గురిచేసింది. ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధిలో, ఉపాథికల్పనలో ముఖ్యభూమిక పోషిస్తుందనుకొన్న విశాఖ పునర్నిర్మాణ దశలో ఉన్నది. ఆర్థిక సహాయం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నది.
ఈ నేపథ్యంలోనే పరిపాలనా కేంద్రమైన రాష్ట్ర రాజధాని నిర్మాణానికి త్వరితగతిన కార్యాచరణను అమలు చేయాల్సిన అనివార్య‌ పరిస్థితి నెలకొని ఉన్నది. రాష్ట్ర విభజనతో భవిష్యత్తే ప్రశ్నార్థకంగా పరిణమించిన వెనుకబడిన, కరవు పీడిత ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణనూ అమలు చేయడం అంతే ప్రాధాన్యతాంశం. ఈ రెండింటినీ వేరువేరుగా చూడడం కుదరదు. అలాగే జనాభాలో అత్యధిక భాగంగా ఉన్న యువతకు ఉపాథి కల్పించి, ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలెక్కించడంలో భాగస్వాములను చేయడం ఎంతైనా అవసరం. అలాగే దాదాపు 70% మంది జనాభాకు జీవనాధారంగా ఉంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవాలి. ధాన్యాగారంగా విలసిల్లుతున్న కోస్తా ప్రాంతంలోని క్రిష్ణా, గోదావరి, పెన్నార్ డెల్టాలోని మాగాణి భూముల స్వభావాన్ని మార్చి స్థిరాస్తి వ్యాపారం, వాణిజ్య, పారిశ్రామిక‌ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున వినియోగించడం ద్వారా ఆహార భద్రతకు భంగం కలిగించే చర్యలకు పూనుకోకూడదు. పట్టణీకరణ, నగరీకరణ, ప్రారిశ్రామికీకరణ పేరిట గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతి వృత్తులు మరియు సేవా రంగంపై ఆధారపడిన ప్రజానీకాన్ని నిరుద్యోగులుగా మార్చి వీధుల పాలు చేయకూడదు. పర్యావరణ సమతుల్యతను పరిరక్షించాలి. అనాలోచిత విధానాలు, చర్యలతో ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా జాగరూకతతో వ్యవహరించాలి. విభజనతో ఎదురైన ఆర్థిక సంక్షోభాన్నుండి కోలుకొని, త్వరితగతిన వృద్ధి చెందాలనే తపనలో తప్పటడులు వేసి  పారిశ్రామికాభివృద్ధి పేరిట‌ ప్రజల ఉమ్మడి ఆస్తి అయిన సహజ వనరులను లూటీ చేయడానికి, పర్యావరణాన్ని ధ్వంసం చేయడానికి దేశీయ‌ కార్పోరేట్ సంస్థలు, బహుళ జాతి సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కల్పించకూడదు. ఈ అన్ని అంశాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజధాని నిర్మాణంతో ముడిపడి ఉన్నాయన్న వాస్తవాన్ని ముందుగా గుర్తించాలి. రాజధాని  నిర్మాణం వేరు, మిగిలిన అంశాలు వేరన్న దోరణిని ప్రభుత్వం ప్రదర్శిస్తున్నట్లు కనబడుతున్నది. ఈ దృక్పథం ఏ మాత్రం సమర్థనీయం కాదు. సమగ్ర ప్రణాళికలో అంతర్భాగంగానే రాజధాని నిర్మాణానికి పూనుకోవాలి.
రాజధాని నిర్మాణం పరిథిలోకి వచ్చే గ్రామాల రైతు ప్రతినిథులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నెలకొల్పే సంస్థలు, పరిశ్రమలు మొదటగా రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేయబడతాయని ముఖ్యమంత్రి ప్రకటించడం అసమంజసమైనది. భూసమీకరణకు రైతులను ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి మాటలు చెప్పి ఉండవచ్చు. కానీ వెనుకబడ్ద ప్రాంతాల ప్రజానీకంలో అపోహలకు ఇలాంటి మాటలు ఆజ్యం పోస్తాయి. ప్రతి రైతును పారిశ్రామిక వేత్తగా తయారు చేస్తాననడం హాస్యాస్పదంగా ఉన్నది. ఇలాంటి మాటలు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికే దోహదపడతాయి. ఇటీవల కాలంలో సాగు భూములు వాణిజ్య పరమవుతున్న ప్రక్రియను గమనిసూనే ఉన్నాము. గుంటూరు, క్రిష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబరు 15 వరకు వచ్చిన ఆదాయాన్ని బట్టి భూముల క్రయవిక్రయాలు ఎంత‌ జోరుగా నడుస్తున్నాయో ఇట్టే అర్థమవుతున్నది. రాష్ట్ర ఖజానాకు వచ్చిన రు.1560 కోట్ల ఆదాయంలో రు.1075 కోట్లు ఆ ఐదు జిల్లాల నుండే వచ్చిందనడాన్ని బట్టే ఆ జిల్లాలలో స్థిరాస్థి వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతున్నదో! బోధపడుతున్నది. భూముల రేట్లు ఆకాశం వైపు పరుగులు తీస్తున్నాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఇప్పటికే పెరిగిపోయాయి. ఈ పరిణామం తీవ్రఆందోళన కలిగిస్తున్నది. ఆదాయం వస్తే చాలు అన్నట్లు ప్రభుత్వం వ్యవహరించడం శ్రేయస్కరం కాదు.
రాజధానీ నగరాన్నిఎంత విశాలంగా, సుందరంగా, ఆకర్షణీయంగా, అత్యాధునికంగా, అంతర్జాతీయ సమాజం నోరెళ్ళబెట్టి చూసేలా నిర్మించాలనే ఊహల్లో ప్రభుత్వంలోని పెద్దలు విహరిస్తున్నారు.  రాష్ట్ర విభజన పర్యవసానంగా ఆర్థిక వనరులకు, ఉపాథి అవకాశాలకు, మౌలిక సదుపాయాలకు నిలయంగా అభివృద్ధి చెందిన‌ హైదరాబాదు మహానగరాన్ని కోల్పోయి, విభజన శక్తుల చేతుల్లో ఓటమి పాలై దగాపడ్డ ప్రజానీకంలో కూడా హైదరాబాదును తలదన్నే విధంగా రాష్ట్ర రాజధానీ నగరాన్ని నిర్మించుకోవాలనే ప్రగాడమైన ఆకాంక్ష వ్యక్తమవుతున్నది. అందులో తప్పు లేదు. హైదరాబాదులో ఐటి పరిశ్రమను అభివృద్ధి చేసి సైబరాబాదు నిర్మాణానికి పునాదులేశానని పదే పదే పునరుద్ఘాటిస్తున్నరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొత్త రాజధానీ నగరాన్నిగొప్పగా నిర్మించడం ద్వారా చరిత్ర పుటల్లో నిలిచిపోవాలని కలలు కంటున్నారు. అందుకే దృష్టంతా రాజధాని నిర్మాణంపైనే కేంద్రీకృతం చేశారనిపిస్తోంది.
రాజధాని ఎంపికలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ రాష్ట్రానికి నడిబొడ్డులో ఉన్న విజయవాడ పరిసర ప్రాంతమే అనువైన ప్రదేశమని విధాన నిర్ణయం తీసుకొని, శాసన సభలో ఆమోద ముద్ర వేయించుకొని ప్రభుత్వం తొలి అడుగు వేసింది. గుంటూరు - విజయవాడ నగరాలను ఏకం చేసే వ్యూహంలో భాగంగా రాజధానీ నగర నిర్మాణానికి తుళ్ళూరు మండలం కేంద్ర బిందువుగా 29 గ్రామాలను ఎంపిక చేసుకొని మరొక‌ ముందుడు వేసింది. ఇప్పుడు అసలు సమస్య ముందుకొచ్చింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని ఎలా సేకరించాలి? కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్టం -2013 ప్రకారం భూసేకరణ చేయాలా! లేదా భూసమీకరణ పద్ధతిలో చేయాలా! అన్న దాన్ని చర్చనీయాంశం చేసి, భూసమీకరణ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నాల్లో ఉన్నది.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న చట్టం, పార్లమెంటు చేసిన చట్టానికి మధ్య వైరుద్యం తలెత్తదా! అన్న అంశాన్ని పరిశీలించాలి. అలాగే రైతులకు భూసేకరణ విధానం వల్ల మేలు జరుగుతుందా! భూసమీకరణ పద్ధతి వల్ల మెరుగైన ప్రయోజనం జరుగుతుందా! అన్నదే ముఖ్యమైన‌ ప్రశ్న. మరొకవైపున‌ మొదటి దశలో ముప్పయ్ వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్దమయ్యింది. అంత భూమి అవసరమా? అన్నదానిపై కూడా తీవ్రస్థాయిలో  చర్చ జరుగుతున్నది. రాజధాని నిర్మాణానికి ఐదు ఎకరాలు చాలన్న వింత వాదన చేస్తున్న వారూ లేక పోలేదు. ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల‌ కార్యాలయాలు, ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహించబడే విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రోడ్లు, పార్కులు, గృహ నిర్మాణాలు, తదితర మౌలిక సదుపాయాలు, భవిష్యత్తులో సామాజిక మరియు ప్రభుత్వ‌ అవసరాల నిమిత్తం అవసరమైనంత భూమిని సేకరించుకోవడానికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. ప్రభుత్వం రైతుల నుండి భూమిని సేకరించి లేదా సమీకరించి ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేసే ఆలోచన ఉంటే మాత్రం తీవ్రపరిణామాలకు దారితీస్తుంది. అలాంటి దురాలోచన ఉంటే ప్రభుత్వ పెద్దలు విరమించుకోవాలి.
ప్రభుత్వం నిర్వహిస్తున్న‌అధ్యయనానికి సంబంధించి బహిర్గతమైన‌ సమాచారం మేరకు రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన 25 గ్రామాలలో ఉన్న పట్టా భూములు 40,094 ఎకరాలు. ఇందులో  93% భూములకు సాగు నీటి సౌకర్యం ఉన్నది. 30% సాగు భూమిలో  పత్తి, 32.5% లో వరి, మొక్క జొన్న, మిగిలిన భూముల్లో అరటి, మిరప, చెరకు, కూరగాయలు తదితర పంటలు, తోటలు ఉన్నాయి. దేవాదాయ, వక్ఫ్, చెరువులు, గుట్టలు, డి.కె.టి. భూములు, గ్రామ నెత్తం భూములు దాదాపుగా ఏడు వేల ఎకరాలుంటాయని అంచనా వేస్తున్నారు.  డొంక‌ రోడ్లు, ఇతర రహదారులు, వాగులు, వంకలు, కాలువలు దాదాపు పదకొండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయంటున్నారు. ఈ గ్రామాల్లో ఒక్క ఎకరా అటవీ భూమి లేదు. ఈ గ్రామాలలోని జనాభాలో 17.55% రైతులుంటే, వ్యవసాయ కూలీలు 56.3% ఉన్నారని నిర్ధారించారు. మిగిలిన వారు గ్రామీణ‌ చేతి వృత్తులు, సేవా రంగాలలో జీవనోపాథి పొందుతున్నారు. ఇళ్ళు లేని పేదలు 6,426. రైతుల సంఖ్య 22,404. రైతాంగంలో అత్యధికులు చిన్న సన్నకారు, మధ్య తరగతి రైతులే. వీరిలో ఎకరంలోపు భూమి ఉన్నవారు 44.5%, ఎకరం నుండి రెండెకరాల వరకు ఉన్న వారు 26.41% మంది ఉన్నారు. మరో నాలుగు గ్రామాల్లో అధ్యయనం కొనసాగుతున్నదని చెప్పబడుతున్నది. ఈ గ్రామాల్లో మాత్రమే కొంత‌ అటవీ భూమి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముప్పయ్ వేల ఎకరాల భూమిని సమీకరించడానికి ప్రభుత్వం నడుంకట్టింది. ఇందులో ఎన్ని వేల ఎకరాల పట్టా భూములను రైతుల నుండి సేకరించాలని ప్రభుత్వం తలపోస్తున్నదో ఇప్పటి వరకు స్పష్టంగా ప్రకటించలేదు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న‌అధ్యయనానికి సంబంధించి బహిర్గతమైన‌ సమాచారం మేరకు రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన 25 గ్రామాలలో ఉన్న పట్టా భూములు 40,094 ఎకరాలు. ఇందులో  93% భూములకు సాగు నీటి సౌకర్యం ఉన్నది. దేవాదాయ, వక్ఫ్, చెరువులు, గుట్టలు, డి.కె.టి. భూములు, గ్రామ నెత్తం భూములు దాదాపుగా ఏడు వేల ఎకరాలుంటాయని అంచనా వేస్తున్నారు.  డొంక‌ రోడ్లు, ఇతర రహదారులు, వాగులు, వంకలు, కాలువలు దాదాపు పదకొండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయంటున్నారు. ఈ గ్రామాల్లో ఒక్క ఎకరా అటవీ భూమి లేదు. ఈ గ్రామాలలోని జనాభాలో 17.55% రైతులుంటే, వ్యవసాయ కూలీలు 56.3%, మిగిలిన వారు గ్రామీణ‌ చేతి వృత్తులు, సేవా రంగాలలో జీవనోపాథి పొందుతున్నారు. ఇళ్ళు లేని పేదలు 6,426. రైతుల సంఖ్య 22,404. రైతాంగంలో అత్యధికులు చిన్న సన్నకారు, మధ్య తరగతి రైతులే. వీరిలో ఎకరంలోపు భూమి ఉన్నవారు 44.5%, ఎకరం నుండి రెండెకరాల వరకు ఉన్న వారు 26.41% మంది ఉన్నారు. మరో నాలుగు గ్రామాల్లో అధ్యయనం కొనసాగుతున్నదని చెప్పబడుతున్నది. ఈ గ్రామాల్లో మాత్రమే కొంత‌ అటవీ భూమి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముప్పయ్ వేల ఎకరాల భూమిని సమీకరించడానికి ప్రభుత్వం నడుంకట్టింది. ఇందులో ఎన్ని వేల ఎకరాల పట్టా భూములను రైతుల నుండి సేకరించాలని ప్రభుత్వం తలపోస్తున్నదో ఇప్పటి వరకు స్పష్టంగా ప్రకటించలేదు.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సి.ఆర్.డి.ఎ)ను నెలకొల్పి, దానికి రు.1,000 కోట్లతో మూలధనాన్ని, కార్యకలాపాల నిర్వహణ కోసం మరో రు.250 కోట్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిథుల సేకరణ బాధ్యతను ఈ సంస్థ భుజస్కందాలపై పెట్టబోతున్నారట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయానికి తోడు ప్రభుత్వ స్థిర, చరాస్తుల అమ్మకం, రుణాల సేకరణ తదితర పద్ధతుల్లో నిథులను పోగేసుకోవాలని దిశానిర్ధేశం చేస్తున్నట్లు చెప్పబడుతున్నది. ప్రభుత్వం దగ్గర భూసేకరణకే నిథుల్లేవు, ఇహ! ప్రపంచ స్థాయి రాజధానీ నగర‌ నిర్మాణానికి నిథులెక్కడ నుంచి వస్తాయి? అందుకే  ముఖ్యమంత్రి 'డెవలపర్' అవతారమెత్తాడన్న ఆరోపణలు చేయబడుతున్నాయి. భూసేకరణ కాకుండా భూసమీకరణ పల్లవి ఎత్తుకోవడానికి కూడా కారణమదేనంటున్నారు. ఈ పద్ధతి అమలు చేస్తే భూ యజమానులకు తక్షణం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కౌలు(రెంట్) క్రింద ఎకరాకు ఏడాదికి రు.25,000/_ చొప్పున పదేళ్ళ పాటు చెల్లిస్తామని, అభివృద్ధి చేసిన స్థలంలో వెయ్యి గజాలు ఇస్తామని, ఈ మేరకు భూములిచ్చిన రైతులకు ధృవీకరణ పత్రాలను ప్రభుత్వం ఇస్తుందని చెబుతున్నారు. అభివృద్ధి చేశాక‌ వెయ్యి గజాల స్థలాన్ని అమ్ముకొంటే కోట్లు వచ్చి పడతాయని నోరూరిస్తున్నారు. ఆ ప్రాంతంలో నడుస్తున్న‌ స్థిరాస్తి వ్యాపార లావాదేవీలను పరిశీలిస్తే అది వాస్తవమే కావచ్చు.
విధాన ప్రకటన అవశ్యం: ఈ క్రింద పేర్కొన్న అతిముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం ప్రజలకు బరోసా కల్పిస్తూ విధాన ప్రకటన చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
1. రాజధాని నిర్మాణానికి సంబంధించిన సమగ్రమైన ప్రణాళికను ప్రజల ముందుంచాలి. దానికి అవసరమైన భూమి ఎంతో స్పష్టంగా పేర్కొనాలి. 2. రాజధాని నిర్మాణం సంపన్నులకు, కార్పోరేట్ సంస్థలకు నిలయంగా ఉండబోతుందా? లేదా సామాన్యులకు నెలవుగా నిర్మించబడుతుందా? ఉన్నతోద్యోగులు, ఉద్యోగులు, విలేకరులు తదితర తరగతుల ప్రజానీకానికి ఇళ్ళ స్థలాలను కేటాయించే సాంప్రదాయాన్నిప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ‌ గృహ నిర్మాణ సంస్థలు ప్రభుత్వ‌ స్థలాలను వేల‍ వేసి నిథులు పోగేసే పనిలో ఉన్నాయి. రైతుల నుండి సేకరించిన భూమి అభివృద్ధి చేసిన తరువాత చదరపు గజం     రు.20,000 నుండి 50,000 వరకు ధర పలుకుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అంటే పేద, మధ్యతరగతి ప్రజానీకం నూతన రాజధానీ నగరంలో కనీసం స్థిర నివాసం ఏర్పాటు చేసుకోగలడా? ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టే ప్రణాళిక‌ ప్రభుత్వం దగ్గర ఉన్నదా?  3.కాలుష్య రహిత పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే పరిశ్రమలను, సంస్థలను నెలకొల్పడానికి అవసరమైన భూమిని ప్రయివేటు సంస్థలు సమీకరించుకోవడానికి ప్రభుత్వం కేవలం మధ్యవర్తి(పెసిలిటేటర్)గా వ్యవహరించి రైతుల అభీష్టం మేరకు సహకరించవచ్చు. 4. నాగార్జున సాగర్ జలాశయం నుండి ప్రకాశం ఆనకట్ట వరకు క్రిష్ణా నదికి ఇరువైపుల ఐదు కిలో మీటర్ల పరిథిలో పరిశ్రమలను నెలకొల్పడానికి, నదీ జలాలను కలుషితం చేసే నిర్మాణ కారకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించ కుండా కఠినమైన చట్టాన్ని రూపొందించాలి. 5. పర్యావరణ పరిరక్షణకు, క్రిష్ణా నదీ జలాలు కాలుష్యానికి గురి కాకుండా ఎలాంటి కార్యాచరణను అమలు చేయబోతున్నాదో ప్రభుత్వం విస్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. గంగా, యమున నదులు ఏ విధంగా కాలుష్యానికి గురైనాయో చూస్తూనే ఉన్నాం. అలాగే విజయవాడ దగ్గర‌ క్రిషా నదీ జలాలు ఎలా కలుషితం అవుతున్నాయో వేరే చెప్పనక్కర లేదు. 6. రాజధాని నగర నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారసంస్థ పరిథిలోకి వచ్చే (విజయవాడ, తెనాలి.గుంటూరు, మంగళగిరి) ప్రాంతాలలో అత్యధిక భూమి క్రిష్ణా డెల్టా పరిథిలో ఉన్నది. నేడు సారవంతమైన సాగు భూములుగా ఉన్న‌ఈ భూముల స్వభావం మారిపోయి ప్రభుత్వ అవసరాలు, నగరీకరణ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల నిమిత్తం వినియోగంలోకి తీసుకురాబడుతున్నాయి. తద్వారా ఆదా అయ్యే క్రిష్ణా నది నికర జలాలను నిత్య‌ కరవు పీడిత‌ ప్రాంతమైన‌ రాయలసీమలో నిర్మాణంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులకు కేటాయించడం ద్వారా డెల్టాలో కోల్పోతున్న సాగు భూమికి ప్రత్యామ్నాయంగా సాగు భూమిని అభివృద్ధి చేయడానికి, తద్వారా ఆహార భద్రతకు భంగం కలగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.


"రుణ మాఫీ..తొలి జాబితా" నేను పాల్గొన్న ఈటీవి ప్రతిధ్వని వీడియో.



చర్చా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘ‍ం ఉపాధ్యక్షులు శ్రీ సి.కుటుంబరావు, వ్యవసాయ రంగ నిపుణులు శ్రీ సుబ్బయ్య చౌదరి, ఆంధ్రా బ్యాంకు పూర్వ జనరల్ మేనేజర్ శ్రీ ఎ.యల్.నాగేశ్వరరావు గార్లు పాల్గొన్నారు.  

 http://www.youtube.com/watch?v=uGCvG5YqqXE

Sunday, November 23, 2014

"ఆంధ్రప్రదేశ్ రాజధాని‍ - భూసమీకరణ"


  • "ఆంధ్రప్రదేశ్ రాజధాని‍ - భూసమీకరణ" అన్న అంశంపై జన ఛైతన్య‌ వేదిక అధ్యక్షులు మిత్రులు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 నుండి 1 గంట వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చర్చా కార్యక్రమం నిర్వహించబడింది. నేను పాల్గొని మాట్లాడడమే కాకుండా నా అభిప్రాయాలను వ్రాత పూర్వకంగా సమర్పించాను. ఆ పత్రాన్ని నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. దానిపై మిత్రులు ఎవరైనా స్పందించి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. చర్చా వేదికలో పాల్గొని మాట్లాడిన ప్రముఖులలో ఆ.ప్ర. హైకోర్టు మాజీ జడ్జి, జస్టిస్ లక్ష్మణరెడ్డి గారు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు డా. యం.వి.మైసూరారెడ్డి గారు, రాజ్యసభ మాజీ సభ్యులు డా. యన్. తులసిరెడ్డి గారు, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మిత్రులు నీలాయపాలెం విజయకుమార్, సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు మిత్రులు కె.రామక్రిష్ణ, కాంగ్రెస్ పార్టీ యస్.సి.సెల్ అధ్యక్షులు మిత్రులు వినయ్ కుమార్, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి వాసిరెడ్డి పద్మ‌  వివిధ రంగాలకు చెందిన మరికొంత మంది ప్రముఖులు, రాజకీయ పార్టీల ప్రతినిథులు పాల్గొన్నారు. చర్చా కారక్రమం ఆద్యంతం ఆసక్తిగాను, ప్రశాంతంగాను జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం - వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం, వెనుకబడిన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలను సమాంతరంగా అమలు చేసినప్పుడు మాత్రమే అపోహలకు తావులేకుండా ఉంటుంది.  ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధంతా కేవలం హైదరాబాదు కేంద్ర బిందువుగా జరిగిన పర్యవసానంగా విభజనతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకం తీవ్రంగా నష్టపోయి దగాపడ్డ  చేదు అనుభవం ఉన్నది. మరొకసారి అలాంటి దుస్థితి దాపురించకుండా ఉండాలంటే అభివృద్ధి వికేంద్రీకరించబడాలని వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలు బలంగా కోరుకొంటున్నారు. రాజధాని నిర్మాణం పరిథిలోకి వచ్చే గ్రామాల రైతు ప్రతినిథులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నెలకొల్పే సంస్థలు, పరిశ్రమలు మొదటగా రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేయబడతాయని ముఖ్యమంత్రి
ప్రకటించడం అసమంజసమైనది.                                                                                               
2. రాజధాని నగరాన్ని ఎక్కడ నిర్మించాలన్న అంశంపై శాసనసభలో తీర్మానం చేయడం ద్వారా ఆ సమస్యకు తెరదించారు. ఇప్పుడు రాజధాని నిర్మాణానికి ఎంత భూమి అవసరం, దాన్ని ఎలా సేకరిస్తారన్న సమస్య తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం  రూపొందించిన భూసేకరణ చట్టం -2013 ప్రకారం భూసేకరణ చేయాలా! లేదా భూసమీకరణ పద్ధతిలో చేయాలా! అన్న దాన్ని చర్చనీయాంశం చేసి, భూసమీకరణ వైపే రాష్ట్ర‌ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నాల్లో ఉన్నది.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న చట్టం, పార్లమెంటు చేసిన చట్టానికి మధ్య వైరుద్యం తలెత్తదా! అన్న అంశాన్ని కూడా పరిశీలించాలి.                                

3. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సి.ఆర్.డి.ఎ)ను నెలకొల్పి, దానికి రు.1,000 కోట్లతో మూలధనాన్ని, కార్యకలాపాల నిర్వహణ కోసం మరో రు.250 కోట్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిథుల సేకరణ బాధ్యతను ఈ సంస్థ భుజస్కందాలపై పెట్టబోతున్నారట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయానికి తోడు ప్రభుత్వ స్థిర, చరాస్తుల అమ్మకం, రుణాల సేకరణ తదితర పద్ధతుల్లో నిథులను పోగేసుకోవాలని దిశానిర్ధేశం చేస్తున్నట్లు చెప్పబడుతున్నది. ప్రభుత్వం దగ్గర భూసేకరణకే నిథుల్లేవు, ఇహ! ప్రపంచ స్థాయి రాజధానీ నగర‌ నిర్మాణానికి నిథులెక్కడ నుంచి వస్తాయి? అందుకే  ముఖ్యమంత్రి 'డెవలపర్' అవతారమెత్తాడనిపిస్తోంది. కాబట్టే భూసేకరణ కాకుండా భూసమీకరణ పల్లవి ఎత్తుకొన్నట్లుంది. ఈ పద్ధతి అమలు చేస్తే భూ యజమానులకు తక్షణం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కౌలు(రెంట్) క్రింద ఎకరాకు ఏడాదికి రు.25,000/- చొప్పున పదేళ్ళ పాటు చెల్లిస్తామని, అభివృద్ధి చేసిన స్థలంలో వెయ్యి గజాలు ఇస్తామని, ఈ మేరకు భూములిచ్చిన రైతులకు ధృవీకరణ పత్రాలను ప్రభుత్వం ఇస్తుందని చెబుతున్నారు. అభివృద్ధి చేశాక‌ వెయ్యి గజాల స్థలాన్ని అమ్ముకొంటే కోట్లు వచ్చి పడతాయని నోరూరిస్తున్నారు. తమ ప్రాంతంలో రాజధాని రావడం పట్ల రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే తమ‌ భూములు పోకుండా ఉంటే తరువాత భూముల విలువ మరింత పెరిగి లబ్ధి పొందవచ్చని ఆశ పడుతున్నారు. భూసమీకరణకు హేతుబద్ధమైన, చట్టబద్ధమైన విధానాన్ని అమలు చేయడం ద్వరా భూములు కోల్పోతున్న రైతాంగానికి, వారితో పాటు ఉపాథి కోల్పోతున్న కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతి వృత్తుల వారికి మెరుగైన నష్ట పరిహారాన్ని ఇచ్చి, పునరావాసాన్ని కల్పించాలి.                                                                                                                                                   

4. రాజధాని నిర్మాణానికి సంబంధించిన సమగ్రమైన ప్రణాళికను ప్రజల ముందుంచాలి. దానికి అవసరమైన భూమి (ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా, వైద్య, క్రిడా సదుపాయాలు, గృహ నిర్మాణాలు, రోడ్లు, పార్కులు తదితర మౌలిక వసతులకు, భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రజోపయోగాలకు వగైరా) ఎంతో స్పష్టంగా ప్రకటించాలి.                                                                                                  

5. రాజధాని నిర్మాణం సంపన్నులకు, కార్పోరేట్ సంస్థలకు నిలయంగా ఉండబోతుందా? లేదా సామాన్యులకు నెలవుగా నిర్మించబడుతుందా? భూముల రేట్లు ఆకాశం వైపు పరుగులు తీస్తున్నాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఇప్పటికే పెరిగిపోయాయి. ఈ పరిణామం తీవ్రఆందోళన కలిగిస్తున్నది. ఉన్నతోద్యోగులు, ఉద్యోగులు, విలేకరులు తదితర తరగతుల ప్రజానీకానికి ఇళ్ళ స్థలాలను కేటాయించే సాంప్రదాయాన్నిప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ‌ గృహ నిర్మాణ సంస్థలు ప్రభుత్వ‌ స్థలాలను వేల‍ వేసి నిథులు పోగేసే పద్ధతులను అమలు చేస్తున్నాయి. రైతుల నుండి సేకరించిన భూమి అభివృద్ధి చేసిన తరువాత చదరపు గజం రు.20,000 నుండి 50,000 వరకు ధర పలుకుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అంటే పేద, మధ్యతరగతి ప్రజానీకం నూతన రాజధానీ నగరంలో కనీసం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థిరనివాసాన్ని అపార్ట్ మెంట్స్ లో కూడా కొనుక్కొనే పరిస్థితి ఉండదు. ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టే ప్రణాళిక‌ ప్రభుత్వం దగ్గర ఉన్నదా?              
6. రైతుల నుండి ప్రభుత్వం సమీకరించే లేదా సేకరించే భూమిని ప్రభుత్వ అవసరాలకే వినియోగిస్తారా? లేదా ప్రయివేటు సంస్థలకు కూడా కేటాయించే లేదా విక్రయించే ఆలోచన ఏమైనా ఉన్నదా! అన్న అంశాన్ని స్పష్టంగా వెల్లడించాలి.                                                                                                                                                

7. రాజధాని నిర్మాణానికి ఆర్థిక వనరుల సేకరణ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంపై వివరణ, రైతుల నుండి సేకరించిన భూములను అభివృద్ధి చేసిన మీదట రైతులకిచ్చే వాటా, ప్రభుత్వ అవసరాలకు పోను మిగిలిన భూమిని ప్రభుత్వమే స్థిరాస్తి వ్యాపారం చేసి స్వదేశీ, విదేశీ కార్పోరేట్ సంస్థలకు విక్రయించడం ద్వారా నిథులను సమీకరించుకోవాలని గానీ లేదా రాజధాని నగర నిర్మాణాన్ని అలాంటి సంస్థలకు "జనరల్ పవర్ ఆఫ్ అటార్ని(జి.పి.ఎ) తరహా ఒప్పందాలు చేసుకొని అప్పగించి, భూముల్లో వాటా ఇచ్చే ఆలోచనలు చేస్తున్నదో! లేదో! కూడా స్పష్టంగా ప్రకటించాలి.

8. కాలుష్య రహిత పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే పరిశ్రమలను, సంస్థలను నెలకొల్పడానికి అవసరమైన భూమిని ప్రయివేటు సంస్థలు సమీకరించుకోవడానికి ప్రభుత్వం కేవలం మధ్యవర్తి(పెసిలిటేటర్)గా వ్యవహరించి రైతుల అభీష్టం మేరకు సహకరించవచ్చు.                                                                                                      

9. నాగార్జున సాగర్ జలాశయం నుండి ప్రకాశం ఆనకట్ట వరకు క్రిష్ణా నదికి ఇరువైపుల ఐదు కిలో మీటర్ల పరిథిలో పరిశ్రమలను నెలకొల్పడానికి, నదీ జలాలను కలుషితం చేసే నిర్మాణ కారకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించ కుండా కఠినమైన చట్టాన్ని రూపొందించాలి.                                                                                                                                          

10. పర్యావరణ పరిరక్షణకు, క్రిష్ణా నదీ జలాలు కాలుష్యానికి గురి కాకుండా ఎలాంటి కార్యాచరణను అమలు చేయబోతున్నాదో ప్రభుత్వం విస్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. గంగా, యమున నదులు ఏ విధంగా కాలుష్యానికి గురైనాయో చూస్తూనే ఉన్నాం. అలాగే విజయవాడ దగ్గర‌ క్రిషా నదీ జలాలు ఎలా కలుషితం అవుతున్నాయో వేరే చెప్పనక్కర లేదు. పర్యావరణ సమతుల్యతను పరిరక్షించాలి. అనాలోచిత విధానాలు, చర్యలతో ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా జాగరూకతతో వ్యవహరించాలి.                                                                                                                                              
11. రాజధాని నగర నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార  సంస్థ పరిథిలోకి వచ్చే (విజయవాడ, తెనాలి, గుంటూరు, మంగళగిరి) ప్రాంతాలలో ఉన్న సాగు భూమి అత్యధికంగా క్రిష్ణా డెల్టా పరిథిలో ఉన్నది. నేడు సారవంతమైన సాగు భూములుగా ఉన్న‌ ఈ భూముల స్వభావం మారిపోయే ప్రక్రియ కొనసాగుతున్నది. తద్వారా క్రిష్ణా డెల్టాలో క్రిష్ణా నది నికర జలాల వినియోగం తగ్గుతుంది. అలా ఆదా అయ్యే నీటిని నిత్య‌ కరవు పీడిత‌ ప్రాంతమైన‌ రాయలసీమలో నిర్మాణంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులకు కేటాయించడం ద్వారా డెల్టాలో కోల్పోతున్న సాగు భూమికి ప్రత్యామ్నాయంగా సాగు భూమిని అభివృద్ధి చేయడానికి, తద్వారా ఆహార భద్రతకు భంగం కలగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.                                                                                                                                                                                                
12. ధాన్యాగారంగా విలసిల్లుతున్న కోస్తా ప్రాంతంలోని క్రిష్ణా, గోదావరి, పెన్నార్ డెల్టాలోని మాగాణి భూముల స్వభావాన్ని మార్చి స్థిరాస్తి వ్యాపారం, వాణిజ్య, పారిశ్రామిక‌ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున వినియోగించడం ద్వారా ఆహార భద్రతకు భంగం కలిగించే చర్యలకు పూనుకోకూడదు. పట్టణీకరణ, నగరీకరణ, ప్రారిశ్రామికీకరణ పేరిట గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతి వృత్తులు మరియు సేవా రంగంపై ఆధారపడిన ప్రజానీకాన్ని నిరుద్యోగులుగా మార్చి వీధుల పాలు చేయకూడదు.                                                                                                                                              

పై అన్ని అంశాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజధాని నిర్మాణంతో ముడిపడి ఉన్నాయన్న వాస్తవాన్ని ముందుగా గుర్తించాలి. రాజధాని  నిర్మాణం వేరు, మిగిలిన అంశాలు వేరన్న దోరణిని ప్రభుత్వం ప్రదర్శించకూడదు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో అంతర్భాగంగానే రాజధాని నిర్మాణానికి పూనుకోవాలి.