Sunday, November 23, 2014

"ఆంధ్రప్రదేశ్ రాజధాని‍ - భూసమీకరణ"


  • "ఆంధ్రప్రదేశ్ రాజధాని‍ - భూసమీకరణ" అన్న అంశంపై జన ఛైతన్య‌ వేదిక అధ్యక్షులు మిత్రులు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 నుండి 1 గంట వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చర్చా కార్యక్రమం నిర్వహించబడింది. నేను పాల్గొని మాట్లాడడమే కాకుండా నా అభిప్రాయాలను వ్రాత పూర్వకంగా సమర్పించాను. ఆ పత్రాన్ని నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. దానిపై మిత్రులు ఎవరైనా స్పందించి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. చర్చా వేదికలో పాల్గొని మాట్లాడిన ప్రముఖులలో ఆ.ప్ర. హైకోర్టు మాజీ జడ్జి, జస్టిస్ లక్ష్మణరెడ్డి గారు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు డా. యం.వి.మైసూరారెడ్డి గారు, రాజ్యసభ మాజీ సభ్యులు డా. యన్. తులసిరెడ్డి గారు, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మిత్రులు నీలాయపాలెం విజయకుమార్, సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు మిత్రులు కె.రామక్రిష్ణ, కాంగ్రెస్ పార్టీ యస్.సి.సెల్ అధ్యక్షులు మిత్రులు వినయ్ కుమార్, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి వాసిరెడ్డి పద్మ‌  వివిధ రంగాలకు చెందిన మరికొంత మంది ప్రముఖులు, రాజకీయ పార్టీల ప్రతినిథులు పాల్గొన్నారు. చర్చా కారక్రమం ఆద్యంతం ఆసక్తిగాను, ప్రశాంతంగాను జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం - వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం, వెనుకబడిన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలను సమాంతరంగా అమలు చేసినప్పుడు మాత్రమే అపోహలకు తావులేకుండా ఉంటుంది.  ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధంతా కేవలం హైదరాబాదు కేంద్ర బిందువుగా జరిగిన పర్యవసానంగా విభజనతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకం తీవ్రంగా నష్టపోయి దగాపడ్డ  చేదు అనుభవం ఉన్నది. మరొకసారి అలాంటి దుస్థితి దాపురించకుండా ఉండాలంటే అభివృద్ధి వికేంద్రీకరించబడాలని వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలు బలంగా కోరుకొంటున్నారు. రాజధాని నిర్మాణం పరిథిలోకి వచ్చే గ్రామాల రైతు ప్రతినిథులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నెలకొల్పే సంస్థలు, పరిశ్రమలు మొదటగా రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేయబడతాయని ముఖ్యమంత్రి
ప్రకటించడం అసమంజసమైనది.                                                                                               
2. రాజధాని నగరాన్ని ఎక్కడ నిర్మించాలన్న అంశంపై శాసనసభలో తీర్మానం చేయడం ద్వారా ఆ సమస్యకు తెరదించారు. ఇప్పుడు రాజధాని నిర్మాణానికి ఎంత భూమి అవసరం, దాన్ని ఎలా సేకరిస్తారన్న సమస్య తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం  రూపొందించిన భూసేకరణ చట్టం -2013 ప్రకారం భూసేకరణ చేయాలా! లేదా భూసమీకరణ పద్ధతిలో చేయాలా! అన్న దాన్ని చర్చనీయాంశం చేసి, భూసమీకరణ వైపే రాష్ట్ర‌ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నాల్లో ఉన్నది.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న చట్టం, పార్లమెంటు చేసిన చట్టానికి మధ్య వైరుద్యం తలెత్తదా! అన్న అంశాన్ని కూడా పరిశీలించాలి.                                

3. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సి.ఆర్.డి.ఎ)ను నెలకొల్పి, దానికి రు.1,000 కోట్లతో మూలధనాన్ని, కార్యకలాపాల నిర్వహణ కోసం మరో రు.250 కోట్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిథుల సేకరణ బాధ్యతను ఈ సంస్థ భుజస్కందాలపై పెట్టబోతున్నారట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయానికి తోడు ప్రభుత్వ స్థిర, చరాస్తుల అమ్మకం, రుణాల సేకరణ తదితర పద్ధతుల్లో నిథులను పోగేసుకోవాలని దిశానిర్ధేశం చేస్తున్నట్లు చెప్పబడుతున్నది. ప్రభుత్వం దగ్గర భూసేకరణకే నిథుల్లేవు, ఇహ! ప్రపంచ స్థాయి రాజధానీ నగర‌ నిర్మాణానికి నిథులెక్కడ నుంచి వస్తాయి? అందుకే  ముఖ్యమంత్రి 'డెవలపర్' అవతారమెత్తాడనిపిస్తోంది. కాబట్టే భూసేకరణ కాకుండా భూసమీకరణ పల్లవి ఎత్తుకొన్నట్లుంది. ఈ పద్ధతి అమలు చేస్తే భూ యజమానులకు తక్షణం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కౌలు(రెంట్) క్రింద ఎకరాకు ఏడాదికి రు.25,000/- చొప్పున పదేళ్ళ పాటు చెల్లిస్తామని, అభివృద్ధి చేసిన స్థలంలో వెయ్యి గజాలు ఇస్తామని, ఈ మేరకు భూములిచ్చిన రైతులకు ధృవీకరణ పత్రాలను ప్రభుత్వం ఇస్తుందని చెబుతున్నారు. అభివృద్ధి చేశాక‌ వెయ్యి గజాల స్థలాన్ని అమ్ముకొంటే కోట్లు వచ్చి పడతాయని నోరూరిస్తున్నారు. తమ ప్రాంతంలో రాజధాని రావడం పట్ల రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే తమ‌ భూములు పోకుండా ఉంటే తరువాత భూముల విలువ మరింత పెరిగి లబ్ధి పొందవచ్చని ఆశ పడుతున్నారు. భూసమీకరణకు హేతుబద్ధమైన, చట్టబద్ధమైన విధానాన్ని అమలు చేయడం ద్వరా భూములు కోల్పోతున్న రైతాంగానికి, వారితో పాటు ఉపాథి కోల్పోతున్న కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతి వృత్తుల వారికి మెరుగైన నష్ట పరిహారాన్ని ఇచ్చి, పునరావాసాన్ని కల్పించాలి.                                                                                                                                                   

4. రాజధాని నిర్మాణానికి సంబంధించిన సమగ్రమైన ప్రణాళికను ప్రజల ముందుంచాలి. దానికి అవసరమైన భూమి (ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా, వైద్య, క్రిడా సదుపాయాలు, గృహ నిర్మాణాలు, రోడ్లు, పార్కులు తదితర మౌలిక వసతులకు, భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రజోపయోగాలకు వగైరా) ఎంతో స్పష్టంగా ప్రకటించాలి.                                                                                                  

5. రాజధాని నిర్మాణం సంపన్నులకు, కార్పోరేట్ సంస్థలకు నిలయంగా ఉండబోతుందా? లేదా సామాన్యులకు నెలవుగా నిర్మించబడుతుందా? భూముల రేట్లు ఆకాశం వైపు పరుగులు తీస్తున్నాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఇప్పటికే పెరిగిపోయాయి. ఈ పరిణామం తీవ్రఆందోళన కలిగిస్తున్నది. ఉన్నతోద్యోగులు, ఉద్యోగులు, విలేకరులు తదితర తరగతుల ప్రజానీకానికి ఇళ్ళ స్థలాలను కేటాయించే సాంప్రదాయాన్నిప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ‌ గృహ నిర్మాణ సంస్థలు ప్రభుత్వ‌ స్థలాలను వేల‍ వేసి నిథులు పోగేసే పద్ధతులను అమలు చేస్తున్నాయి. రైతుల నుండి సేకరించిన భూమి అభివృద్ధి చేసిన తరువాత చదరపు గజం రు.20,000 నుండి 50,000 వరకు ధర పలుకుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అంటే పేద, మధ్యతరగతి ప్రజానీకం నూతన రాజధానీ నగరంలో కనీసం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థిరనివాసాన్ని అపార్ట్ మెంట్స్ లో కూడా కొనుక్కొనే పరిస్థితి ఉండదు. ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టే ప్రణాళిక‌ ప్రభుత్వం దగ్గర ఉన్నదా?              
6. రైతుల నుండి ప్రభుత్వం సమీకరించే లేదా సేకరించే భూమిని ప్రభుత్వ అవసరాలకే వినియోగిస్తారా? లేదా ప్రయివేటు సంస్థలకు కూడా కేటాయించే లేదా విక్రయించే ఆలోచన ఏమైనా ఉన్నదా! అన్న అంశాన్ని స్పష్టంగా వెల్లడించాలి.                                                                                                                                                

7. రాజధాని నిర్మాణానికి ఆర్థిక వనరుల సేకరణ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంపై వివరణ, రైతుల నుండి సేకరించిన భూములను అభివృద్ధి చేసిన మీదట రైతులకిచ్చే వాటా, ప్రభుత్వ అవసరాలకు పోను మిగిలిన భూమిని ప్రభుత్వమే స్థిరాస్తి వ్యాపారం చేసి స్వదేశీ, విదేశీ కార్పోరేట్ సంస్థలకు విక్రయించడం ద్వారా నిథులను సమీకరించుకోవాలని గానీ లేదా రాజధాని నగర నిర్మాణాన్ని అలాంటి సంస్థలకు "జనరల్ పవర్ ఆఫ్ అటార్ని(జి.పి.ఎ) తరహా ఒప్పందాలు చేసుకొని అప్పగించి, భూముల్లో వాటా ఇచ్చే ఆలోచనలు చేస్తున్నదో! లేదో! కూడా స్పష్టంగా ప్రకటించాలి.

8. కాలుష్య రహిత పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే పరిశ్రమలను, సంస్థలను నెలకొల్పడానికి అవసరమైన భూమిని ప్రయివేటు సంస్థలు సమీకరించుకోవడానికి ప్రభుత్వం కేవలం మధ్యవర్తి(పెసిలిటేటర్)గా వ్యవహరించి రైతుల అభీష్టం మేరకు సహకరించవచ్చు.                                                                                                      

9. నాగార్జున సాగర్ జలాశయం నుండి ప్రకాశం ఆనకట్ట వరకు క్రిష్ణా నదికి ఇరువైపుల ఐదు కిలో మీటర్ల పరిథిలో పరిశ్రమలను నెలకొల్పడానికి, నదీ జలాలను కలుషితం చేసే నిర్మాణ కారకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించ కుండా కఠినమైన చట్టాన్ని రూపొందించాలి.                                                                                                                                          

10. పర్యావరణ పరిరక్షణకు, క్రిష్ణా నదీ జలాలు కాలుష్యానికి గురి కాకుండా ఎలాంటి కార్యాచరణను అమలు చేయబోతున్నాదో ప్రభుత్వం విస్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. గంగా, యమున నదులు ఏ విధంగా కాలుష్యానికి గురైనాయో చూస్తూనే ఉన్నాం. అలాగే విజయవాడ దగ్గర‌ క్రిషా నదీ జలాలు ఎలా కలుషితం అవుతున్నాయో వేరే చెప్పనక్కర లేదు. పర్యావరణ సమతుల్యతను పరిరక్షించాలి. అనాలోచిత విధానాలు, చర్యలతో ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా జాగరూకతతో వ్యవహరించాలి.                                                                                                                                              
11. రాజధాని నగర నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార  సంస్థ పరిథిలోకి వచ్చే (విజయవాడ, తెనాలి, గుంటూరు, మంగళగిరి) ప్రాంతాలలో ఉన్న సాగు భూమి అత్యధికంగా క్రిష్ణా డెల్టా పరిథిలో ఉన్నది. నేడు సారవంతమైన సాగు భూములుగా ఉన్న‌ ఈ భూముల స్వభావం మారిపోయే ప్రక్రియ కొనసాగుతున్నది. తద్వారా క్రిష్ణా డెల్టాలో క్రిష్ణా నది నికర జలాల వినియోగం తగ్గుతుంది. అలా ఆదా అయ్యే నీటిని నిత్య‌ కరవు పీడిత‌ ప్రాంతమైన‌ రాయలసీమలో నిర్మాణంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులకు కేటాయించడం ద్వారా డెల్టాలో కోల్పోతున్న సాగు భూమికి ప్రత్యామ్నాయంగా సాగు భూమిని అభివృద్ధి చేయడానికి, తద్వారా ఆహార భద్రతకు భంగం కలగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.                                                                                                                                                                                                
12. ధాన్యాగారంగా విలసిల్లుతున్న కోస్తా ప్రాంతంలోని క్రిష్ణా, గోదావరి, పెన్నార్ డెల్టాలోని మాగాణి భూముల స్వభావాన్ని మార్చి స్థిరాస్తి వ్యాపారం, వాణిజ్య, పారిశ్రామిక‌ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున వినియోగించడం ద్వారా ఆహార భద్రతకు భంగం కలిగించే చర్యలకు పూనుకోకూడదు. పట్టణీకరణ, నగరీకరణ, ప్రారిశ్రామికీకరణ పేరిట గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతి వృత్తులు మరియు సేవా రంగంపై ఆధారపడిన ప్రజానీకాన్ని నిరుద్యోగులుగా మార్చి వీధుల పాలు చేయకూడదు.                                                                                                                                              

పై అన్ని అంశాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజధాని నిర్మాణంతో ముడిపడి ఉన్నాయన్న వాస్తవాన్ని ముందుగా గుర్తించాలి. రాజధాని  నిర్మాణం వేరు, మిగిలిన అంశాలు వేరన్న దోరణిని ప్రభుత్వం ప్రదర్శించకూడదు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో అంతర్భాగంగానే రాజధాని నిర్మాణానికి పూనుకోవాలి.  


No comments:

Post a Comment