Sunday, November 2, 2014

వివేకం, విసక్షణ లోపించిన నిర్ణయం

                               

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్నిజూన్ 2న నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అర్థరహితమైనది, అసంబద్ధమైనది, అప్రజాస్వామికమైనది, పదమూడు జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను అగౌరపరిచేది, ఆత్మవంచనతో కూడుకొన్నది. స్వాతంత్య్రానంతరం, తెలుగు నాట రాజకీయ చరిత్రలో మూడు ముఖ్యమైన రోజులున్నాయి.
ఒకటి: భాష ప్రాతిపదికపై తెలుగు ప్రజలకు ప్రత్యేక‌ రాష్ట్రం కావాలని ఉద్యమించి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన అక్టోబరు 1, 1953. అది దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి పునాది వేసిన పరిణామంగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.
రెండు: తెలుగు జాతి యావత్తు ఒకే పాలనా వ్యవస్థ క్రింద ఉండాలని, విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదంతో సాగించిన ప్రజాపోరాటం ఫలితంగా నవంబరు 1, 1956 వ తేదీన‌ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది.
మూడు: సంకుచిత రాజకీయాలకు తెలుగు జాతి బలైపోయింది. దుష్టరాజకీయ శక్తులు పైచేయి సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిరెండు ముక్కలు చేశాయి. పర్యవసానంగా తెలంగాణా రాష్ట్రం 2014 జూన్ 2న‌ పురుడు పోసుకొన్నది.
ఒకనాటి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులతో (కొద్ది పాటి మినహాయింపులతో) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉనికి కొనసాగుతున్నది. అందు వల్లనే నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదమూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణకు కె.సి.ఆర్. తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ‍ స్వీకారం చేశారు.
సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రజలు అలుపెరగని మహోద్యమాన్ని నిర్వహించారు. దుష్ట రాజకీయ శక్తులు కుట్రలు, కుతంత్రాలతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేసి రాష్ట్రాన్ని విభజించడంతో జూన్ 2ను తెలుగు జాతి విచ్ఛిన్న దినంగా నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఈ చారిత్రక సత్యాన్ని మరుగున పరుస్తూ, రాష్ట్ర విభజనతో తీవ్ర మనోవేధనకు గురైన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పడం అవమానకరమైన, అత్యంత‌ దారుణమైన విషయం.
ఆంధ్రప్రదేశ్ పేరుతోనే రాష్ట్రం కొనసాగుతున్నందున నవంబరు 1న రాష్ట్ర ఆవిర్భావదినోత్సవం నిర్వహించడం సముచితం లేదా ఆ రోజును తెలుగు జాతి ఐక్యతా దినంగా జరుపుకొంటూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అక్టోబరు 1న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకొన్నాఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ నాయకత్వం ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి, తాము తీసుకొన్న‌తప్పుడు నిర్ణయంపై పున:సమీక్షించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు భంగం కలగని రీతిలో వ్యవహరించాలి. తెలుగు జాతి విచ్ఛిన్న దినాన్ని పండుగ రోజుగా నేటి తరం, భావితరాలు జరుపుకోవలసిన దుర్గతి పట్టకుండా నివారించాలి. అలా చేయని పక్షంలో చరిత్ర క్షమించదు.

No comments:

Post a Comment