సూర్యా దినపత్రిక:
1-2-2015
డిల్లీలో ఎన్నికల వేడి మొదలయ్యింది. కాషాయ
శక్తులు మోహరించాయి. బిజెపిని గట్టెక్కించుకోవడానికి కేంద్ర మంత్రులు రంగ ప్రవేశం
చేశారు. ఫిబ్రవరి 7న శాసనసభకు జరుగనున్న ఎన్నికల సమరం
రసవత్తరంగా సాగనున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి డిల్లీ చేజారి పోతే
పతనం మొదలయ్యిందనే భావన దేశ ప్రజల్లో కలుగుతుందనే భయంతో బిజెపి అగ్రనాయకత్వం
సర్వశక్తులను ఒడ్డడానికి పూనుకొన్నది. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను
బలహీనపరచడానికి ఆ పార్టీల నాయకులను ప్రలోబపెట్టి బిజెపిలో చేర్చుకొనే ప్రక్రియను
కొనసాగిస్తున్నది. 2014 మే మాసంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డిల్లీలోని 70 శాసనసభ
స్థానాల్లో 60 స్థానాల్లో ఆధిక్యం పొందిన బిజెపికి ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ
గట్టి సవాల్ విసరడమే కాకుండా పైచేయి సాధించినట్లు పలు ఎన్నికల అధ్యయనాల నివేదికలు
వెల్లడించాయి.
గతాన్ని ఒకసారి పరిశీలిస్తే, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పురుడు పోసుకొన్న ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో
వ్యవస్థీకృతమైన అవినీతిని తుదముట్టిస్తామన్న నినాదంతో గత డిల్లీ శాసనసభ
ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసి 'ఛీపురు'ను ఎన్నికల గుర్తుగా ఎంపిక చేసుకొన్నది. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి దేశ
ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఛీపురు దేశ ప్రజల దృష్టిలో పడింది. ఆ పార్టీ
అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రి గద్దెనెక్కి నెల రోజులు పాలన
చేశారు. కొన్ని సంచలనాత్మక నిర్ణయాలను కూడా తీసుకొని, అమలు చేయడానికి తనదైన శైలిలో ప్రయత్నించారు. శాసనసభలో మెజారిటీ లేని
కెజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని కొనసాగించలేక రాజీనామా
చేశారు. ఫలితంగా గవర్నర్ పాలన విధించబడింది. కేంద్రంలో అధికారంలోకొచ్చిన బిజెపి
శాసనసభను రద్దు చేసి వెంటనే ఎన్నికలను నిర్వహించడంలో తటపటాయిస్తూ జాప్యం చేయడంతో
పాటు ప్రభుత్వ ఏర్పాటుకు లోపాయికారిగా ప్రయత్నించి, విఫలమయ్యింది. విధిలేని పరిస్థితుల్లో శాసనసభను రద్దు చేసి తాజాగా ఎన్నికలు
నిర్వహించక తప్పలేదు.
బయటబడిన బలహీనత: నరేంద్ర మోడి ఛారిస్మా పలచబడిందో! లేదా! తన ఛారిస్మాతోనే డిల్లీ శాసన సభ
ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యం కాదేమోనన్న అనుమానంతోనో! కిరణ్ బెడీ ఛారిస్మాను
కూడా తోడు తెచ్చుకొంటేగానీ గెలవలేమని మోడీ భావించారో! ఏదైతేనేం, కిరణ్ బేడీని బిజెపిలో చేర్చుకొని,
ముఖ్యమంత్రి
అభ్యర్థిగా ప్రకటించారు. తద్వారా బిజెపి బలహీనత కాస్తా బహిర్గతమయ్యింది. పైపెచ్చు
బిజెపికి బలమున్న స్థానంలోనే కిరణ్ బేడీని అభ్యర్థిగా నిలబెట్టింది. అంటే, ఆమెకు తనకున్న ఛారిస్మాతో ఏ నియోజకర్గంలోనైనా పోటీ చేసి, గెలిచే సత్తా లేదని పరోక్షంగా చెప్పకనే చెప్పారు.
డిల్లీ బిజెపిలో సమర్థుడైన నాయకుడు లేడని, జనవరి 10న మోడీ హాజరైన ఎన్నికల బహిరంగ సభకు ఆశించిన మేరకు జనం హాజరు కాకపోవడంతో
కంగుతిన్న బిజెపి నాయకత్వం ఆఘమేగాలపై పావులు కదిపి కిరణ్ బేడిని పార్టీలోకి
సాదరంగా ఆహ్వానించి, నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టమతున్నది.
కారణం సుస్పష్టమే. డిల్లీ మహిళా ఓటర్లలో బిజెపి కంటే ఆమ్ ఆద్మీ పార్టీకే మొగ్గు
ఉన్నదని కొన్నితాజా సర్వేలు వెల్లడించాయి.
దేశ రాజథానిలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై తిరగబడ్డ మహిళలు గత
ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలిచారు. నాడు శాసనసభకు ఎన్నికైన ముగ్గురు
మహిళలు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారు కావడమే దీనికి నిదర్శనం. కాబట్టే! కిరణ్
బేడీ ఛారిస్మాను బిజెపి ఆశ్రయించినట్లున్నది. అధికార వ్యామోహంతో ఇలాంటి అవకాశవాద, అపవిత్ర రాజకీయ అనుబంధాలను దేశ రాజధానీ ప్రజానీకం ఆదరిస్తారో! లేదో! వేచి
చూడాలి. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యి,
ప్రచారం ఊపందుకొంటున్న
పూర్వరంగంలో దేశ 66వ గణతంత్ర దినోత్సవాలు వచ్చాయి.
గణతంత్ర దినోత్సవానికి విశిష్ట అతిథిగా అమెరికా
అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరు కావడంతో డిల్లీ కేంద్రంగా ఉన్న జాతీయ ప్రసార
మాధ్యమాలు ఒబామా పర్యటన చుట్టూ పరిభ్రమించాయి. పర్యవసానంగా డిల్లీ శాసనసభ ఎన్నికల
ప్రచారానికి సంబంధించిన వార్తలు మీడియాలో కనిపించలేదు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు
డిల్లీ మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానించకపోగా భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా
ప్రకటించబడిన కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడమే కాకుండా ముందు వరసలో
కూర్చొనేలా ఏర్పాటు చేయడంపై మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ విమర్శనాస్త్రం
సంధించడంతో తిరిగి ఎన్నికల కాక మొదలైయ్యింది.
డిల్లీ ఎన్నికలు - జాతీయ పార్టీల దుస్థితి : దేశ రాజధాని, అధికార కేంద్రం, జాతీయ రాజకీయాలకు కేంద్ర స్థానం
అయిన డిల్లీ శాసన సభ ఎన్నికలకు సహజంగానే అత్యంత ప్రాధాన్యత ఉన్నది. డిల్లీ
ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రధాన
ప్రత్యర్థులుగా ఉన్నాయని భావించబడుతున్నది. భాజపా కిరణ్ బేడీని ముఖ్యమంత్రి
అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నికల
సమరంగా మార్చబడింది. గాంధేయవాది అన్నాహజారే నేతృత్వంలో డిల్లీ కేంద్రంగా
నిర్వహించబడిన అవినీతి వ్యతిరేక ఆందోళనలో క్రియాశీల భూమిక పోషించిన అరవింద్
కేజ్రీవాల్, కిరణ్ బేడీలు రాష్ట్రాధికారాన్ని
చేజిక్కించుకోవడానికి నేడు రాజకీయ ప్రత్యర్థులుగా ఎదురెదురు నిలిచి
చమడోడుస్తున్నారు. ఈ పరిణామాన్ని పరిశీలించిన వారికెవరికైనా జాతీయ రాజకీయ పార్టీల
దుస్థితి ప్రస్ఫుటంగా ద్యోతకమవుతున్నది.
నూట ఇరవై సంవత్సరాలకు పైబడిన సుదీర్ఘ చరిత్రకు
వారసులమని చెప్పుకొనే నేటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మనుగడ కోసం ఆపసోపాలు
పడుతున్నది. లోక్ సభ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన తరువాత ఇంకా తేరుకొన్న సూచనలు ఏ
మాత్రం కనపడడం లేదు. పైపెచ్చు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ& కాశ్మీర్ శాసనసభల ఎన్నికల్లో మూడు, నాలుగు స్థానాల్లోకి నెట్టివేయబడడంతో దేశ వ్యాపితంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు
నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. 2013లో జరిగిన డిల్లీ శాసనసభ ఎన్నికల్లో 24.5% ఓట్లను కాంగ్రెస్ పార్టీ పొందినా 8 స్థానాలే దక్కాయి. ఈ పూర్వరంగంలో డిల్లీ ఎన్నికలు ఆ పార్టీకి ఒక పరీక్షగా
పరిణమించాయి. యు.పి.ఎ. -II ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా
బాధ్యతలు నిర్వహించిన, డిల్లీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు
క్రిష్ణ తిరత్ కాంగ్రెసుకు రాజీనామా చేసి బిజెపిలో చేరడాన్ని బట్టి ఆ పార్టీ ఏ
స్థితిలో ఉన్నదో అర్థమవుతుంది.
బిజెపి బలమైన పార్టీగా ఉండడమే కాకుండా గతంలో డిల్లీ
ముఖ్యమంత్రులుగా ఆ పార్టీ నాయకులు పాలన చేసిన చరిత్ర ఉన్నది. నరేంద్ర మోడీ 2013 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయినా, బి.జె.పి. 33% ఓట్లుతో, 31 స్థానాల్లో విజయం సాధించి
అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన
బలం లేక చతికల బడింది. నేడు కేంద్రంలో ఉన్న
అధికారాన్ని ఉపయోగించుకొని ఎలాగైనా గెలవాలనే వ్యూహ రచనతో అడుగులు వేస్తున్నది.
నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా అధికార పగ్గాలు చేపట్టగానే మహాత్మాగాంధీ కలలుగన్న
స్వచ్ఛ భారత్ నినాదాన్ని తనదైన శైలిలో పాక్షిక దృష్టితో సొంతం చేసుకొన్నారు. ఆ నినాదంతో అరవింద్ కేజ్రీవాల్ చేతుల్లోని 'ఛీపురు'ను లాగేసుకొని జనావాసాల పరిసర
ప్రాంతాల్లోని చెత్తను ఊడ్చే కార్యక్రమానికి 'బ్రాండ్ అంబేజడర్'గా మారారు. కేంద్రంలో అధికారంలో
ఉంటూ డిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైతే దాని దుస్ప్రభావం పెద్ద ఎత్తున
ఉంటుందనే భావనతో ప్రజలను ఆకట్టుకోవడానికి సర్వప్రయత్నాలు చేస్తున్నారు. కడకు
భావజాలాన్ని, ఆ పార్టీ ఇటీవల కాలంలో జరిగిన
మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ&కాశ్మీర్ శాసనసభ ఎన్నికలకు ముందస్తుగా ముఖ్యమంత్రి
అభ్యర్థులను ప్రకటించని సాంప్రదాయాన్నిపక్కనపెట్టి కిరణ్ బేడీని ముఖ్యమంత్రిగా
ప్రకటించడమే దీనికి ప్రబల నిదర్శనం.
బి.యస్.పి., సమాజ్ వాది పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, తదితర రాజకీయ పక్షాలు గత శాసనసభ
ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావాన్ని చూపెట్ట లేకపోయాయి. ఈ ఎన్నికల ముఖచిత్రాన్ని
చూసినా వాటి ప్రభావం పెద్దగా ఉండే అవకాశాలు కనపడడం లేదు. డిల్లీకి ఇరుగు పొరుగున
ఉన్న రాష్ట్రాలలో అధికారంలో ఉన్నబలమైన ప్రాంతీయ పార్టీలు సహితం డిల్లీలో
వేళ్ళూనుకోలేక పోతున్నాయి.
కాషాయానికి అడ్డుకట్ట పడేనా?: కిరణ్ బేడీ అభ్యర్థిత్వం పట్ల
బిజెపి శ్రేణులు భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణా రాహితం, గ్రూపు తగాదాలతో ఆ పార్టీ సతమతమవుతున్నది. 'ఘర్ వాప్సి' నినాదంతో సంఘ పరివార్ చేపట్టిన బలవంతపు మతమార్పిడుల సమస్య, రాముని సంతానమో! అక్రమసంతానమో! తేల్చుకోవాలని కేంద్ర మంత్రి సాద్వి నిరంజన్
జ్యోతి చేసిన వ్యాఖ్య, భారత రాజ్యాంగాని కంటే భగవత్ గీతే
ప్రామాణిక గ్రంథమని కేంద్ర మంత్రి సుశ్మా స్వరాజ్ మాట్లాడడం, భారత రాజ్యాంగ ముఖపత్రంలోని సామ్యవాదం, లౌకికతత్వం అంశాలను వివాదాస్పదం చేయడం, అలాగే పలువు బిజెపి పార్లమెంటు
సభ్యులు, నాయకులు మరియు ఆర్.యస్.యస్. చేస్తున్న ప్రకటనలు, హిందుత్వవాదులు ప్రదర్శిస్తున్న దూకుడు భారత దేశ లౌకిక వ్యవస్థ మూలాలపై
ఎక్కుపెట్టిన దాడిగా లౌకికవాద శక్తులు భావిస్తున్నాయి. డిల్లీ జనాభాలో 12% ఉన్న ముస్లింలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తునారు.
దాన్ని పసిగట్టిన కిరణ్ బేడీ స్వరం మార్చి మానవతే నా మతం అని ప్రకటించుకొన్నారు. సంపన్న
వర్గాలకు అనుకూలమైన పార్టీగా బిజెపిని పరిగణిస్తున్న మురికివాడల్లో నివసిస్తున్న పేదలు, దళితుల్లో అత్యధికులు ఆప్ వైపు మొగ్గు చూపుతున్నారని కొన్ని ప్రసార మాధ్యమాలు
తాజాగా నిర్వహించిన సర్వేలు వెల్లడించాయి.
అవినీతి, అధిక ధరల వ్యతిరేక పోరు బాట నుండి రాజకీయ అరంగేట్రం
చేసి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ గత ఎన్నికల్లో వినూత్నమైన
ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకొని, ప్రజల పక్షాన పోరాడుతున్న
నాయకుడుగా ఆదరణ పొంది, ఉద్యమ కార్యాచరణలో సహచరులుగా మరియు
కార్యకర్తలుగా పని చేసిన వారి తోడ్పాటుతో 29.5% ఓట్లు సాధించుకొని, 28 స్థానాల్లో గెలుపొందారు. కేవలం వ్యక్తి చుట్టూ పరిభ్రమించే ఆమ్ ఆద్మీ పార్టీ
అనేక బాలారిష్టాలతో సతమతమవుతూ, భావజాల రీత్యా బలమైన నిర్మాణం, ఆర్థిక వనరులు, అన్నింటికీమించి అధికార బలం ఉన్న
బిజెపిని నిలవరిస్తుందో! లేదో! అన్న ఆసక్తితో ప్రజలు డిల్లీ ఎన్నికలను గమనిస్తున్నారు. ఇప్పుడు బిజెపిని నిలవరించ గలిగిన స్థాయిలో ప్రధాన ప్రత్యర్థిగా ఒక్క ఆమ్
ఆద్మ్ పార్టీనే ఉన్నదన్న భావన కూడా వ్యక్తమతున్నది. పర్యవసానంగా గతంలో
కాంగ్రెసుకు ఓటేసిన వారు ఆప్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. దేశ రాజధానీగా
ఉన్న డిల్లీ మహానగర ప్రజల తీర్పు తప్పని సరిగా భవిష్యత్తు రాజకీయ పరిణామాలను
ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు.
No comments:
Post a Comment