హైదరాబాదు హైకోర్టు ఇటీవల రెండు కీలకమైన తీర్పులను ఇచ్చిoది. హైకోర్టును తక్షణమే విభజించాలని దాఖలైన కేసులో 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ భూ భాగంలో నిర్వహించడానికి
చట్టం అనుమతిoచదని' హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్ర
ఉన్నత విద్యా మండలి బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివాదంలో హైకోర్టు తలుపు తట్టితే 'ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి'కి ఉనికే లేదని,
తెలంగాణ గడ్డపై ఉన్న స్థిర, చరాస్తులన్నీతెలంగాణ ఉన్నత విద్యా మండలికే చెందుతాయని
తీర్పు చెప్పింది. గడచిన విద్యా సంవత్సరంలో వృత్తి విదా కోర్సుల ప్రవేశాలపై పొడ
చూపిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే
ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోనే ప్రవేశాలను
నిర్వహించాలని నాడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. రాష్ట్ర విభజన
పర్యవసానంగా తలెత్తుతున్న ఒక్కొక్క వివాదంపై హైకోర్టు, సుప్రీం కోర్టులో కేసులు దాఖలైనప్పుడల్లా విభిన్న దృక్పథాలతో తీర్పులు
వెలువడుతున్నాయని భోధపడుతున్నది.
హైకోర్టు ఇచ్చిన రెండు తీర్పుల పట్ల తెలంగాణ వారు విభిన్నంగా స్పందించారు. 1. హైకోర్టు విభజనకు సంబంధించిన తీర్పు తెలంగాణ న్యాయవాదులను
తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. తీర్పిచ్చిన బెంచ్ కి నేతృత్వం వహిoచిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అయితే ఆయన
గౌరవార్థం సంప్రదాయకంగా నిర్వహించాల్సిన వీడ్కోలు సభను కూడా నిర్వహించలేదు.
ఉమ్మడి హైకోర్టులో తమకు విశ్వాసం లేదంటూ టి.ఆర్.యస్. ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు శ్రీ కె.కేశవరావు తెలంగాణ కేసులను పొరుగు
రాష్ట్రాలైన మహారాష్ట్ర,
కర్నాటక హైకోర్టులకు బదిలీ చేయాలన్న డిమాండు
కూడా తెరకైకి తెచ్చారు.
ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులకు కూడా అసంతృప్తి కలిగించింది. హైకోర్టును
విభజించి సత్వరం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హైకోర్టును నెలకొల్పాలని ఆ రాష్ట్రంలోని
న్యాయవాదులు ఆందోళన చేస్తుడడం అందరికీ విధితమే.
2. ఉన్నత విద్యా మండలి బ్యాంకు ఖాతాపై చెలరేగిన వివాదంపై
ఇచ్చిన తీర్పు తెలంగాణ వారికి లేని బలాన్ని సమకూర్చినట్లయ్యింది. ఆలసించిన ఆశాభగం
అన్న నానుడిగా శరవేగంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని, తెలంగాణ ఉన్నత విద్యా మండలి వారు స్వాధీనం చేసుకొన్నారు.
సుప్రీం కోర్టును ఆశ్రయిoచాల్సిన
దుస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్టబడింది. ఈ తీర్పు ఉన్నత విద్యా మండలికే
పరిమితం కాదు. దీని దుష్పరిణామాలు ఆంధ్రప్రదేశ్ అనుభవించాల్సి వస్తుంది. గోరు
చుట్టపై రోకటి పోటు అన్నట్లు రాష్ట్ర విభజనతో సంక్షోభంలోకి నెట్టబడిన ఆంధ్రప్రదేశ్
కు దీని వల్ల మరింత నష్టం వాటిల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పార్లమెంటు ఎలాంటి చెత్త చట్టాలను చేసి ప్రజలను, వ్యవస్థలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టుతున్నదో రెండు
కేసుల్లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుల ద్వారా తేటతెల్లమయ్యింది. రెండు
రాష్ట్రాల మధ్య సంక్లిష్ట
సమస్యల కుంపటి రగిలించి, తెలుగు జాతిని రెండు ముక్కలు చేస్తూ పార్లమెంటు ఆమోద ముద్ర
వేసిన 'ఆంధ్రప్రదేశ్
పునర్విభజన చట్టం' డొల్లతనాన్ని హైకోర్టు చెప్పకనే చెప్పిoది. ఈ చట్టం రాజ్యాoగ వ్యతిరేకాంశాలతో నిండిన తప్పుల తడక అన్న భావన ప్రజల్లో
మరింత బలపడేలా ఈ తీర్పులున్నాయనడంలో నిస్సందేహం. రాష్ట్రాన్ని విభజించి రాజకియ
పార్టీలు పైశాచికానందం పొంది ఉండవచ్చు. కానీ, యావత్తు తెలుగు జాతిని సమస్యల సుడిగుండంలోకి నెట్టేశారు.
ఒక రాష్ట్ర భూభాగంలో మరొక రాష్ట్ర హైకోర్టును అనుమతించడం కుదరదన్న హైకోర్టు
విస్పష్టమైన తీర్పు, ఉమ్మడి రాజధానిగా ప్రకటించబడిన హైదరాబాదు కేంద్రంగా పని
చేసున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి అసలు ఉనికే లేదని, ఆ సంస్థకు చెందిన స్థిర, చరాస్తులు తెలంగాణ ఉన్నత విద్యా మండలికే చెoదుతాయని ఇచ్చిన తీర్పులతో లోపభూయిష్టమైన విభజన చట్టానికి
ఆమోద ముద్ర వేసిన పార్లమెంటు ముక్కు నేలకు రాసి జాతికి క్షమాపణ చెప్పాలి
భారత రాజ్యాంగాన్నితుంగలో తొక్కి హైదరాబాదును రెండు రాష్ట్రాలకు ఉమ్మడి
రాజధానిగా చట్టంలో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు పదేళ్ళు
కొనసాగుతుందని గడువు విధించారు. చట్టబద్ధంగా హైదరాబాదు ఉమ్మడి రాజధాని అయిన
భౌగోళికంగా భూభాగం తెలంగాణ
రాష్ట్రానిదే, ఆoధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ఏ హక్కు లేదని హైకోర్టు నొక్కివక్కాణించిoది. ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికున్న
హక్కులేంటి? గౌరవ మరాదలేమిటి? అన్న ప్రశ్న ఉద్భవిoచడం సహజం.
ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదు గడ్డపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉండడానికే
వీల్లేనప్పుడు, మరి రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి, మంత్రులు వగైరా ఏ హక్కుతో హైదరాబాదు కేంద్రంగా పని చేస్తాయి, చేస్తారు? రాజ్యాంగం, చట్టం ఎలా అనుమతిస్తాయి?
నీరు, విద్యుత్తు, విద్యార్థుల పరీక్షల
నిర్వహణ, ఉమ్మడి రాజధాని, ఉమ్మడి ఆస్తులు, చరాస్తుల పంపిణి వగైరా
అనేక సమస్యల పరిష్కారానికి ఉన్నత న్యాయస్థానాలలో కేసులు దాఖలవుతుంటే వాటి వరకే
పరిమితమై ఉన్నత న్యాయస్థానాలు తీర్పులు
చెబుతున్నాయి. అసలు మొత్తం చట్టమే లోపభూయిష్టమైనదని సుప్రీం కోర్టులో దాఖలైన
కేసులపై తక్షణం విచారణను వేగవంతం చేసి హేతుబద్ధమైన తీర్పు చెబితే, ఒక్కసారిగా లోపాలను సరిదిద్దుకోవడానికి పార్లమెoటు విజ్ఞతతో ఇప్పుడైనా దృష్టి సారిoచడానికి దోహదపడుతుంది కదా!
ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమేంటంటే తమ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక విన్నపాన్ని ఫోస్టు ద్వారా
పంపుకోవాలంటే చిరునామా వ్రాసేటప్పుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ముఖ్యమంత్రి, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం అని వ్రాయాలి. ఉమ్మడి రాజధాని
అయిన హైదరాబాదుకు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే ప్రయివేటు వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం
విధించిన అదనపు వాహన పన్నును రద్దు చేయాలని ప్రయివేటు వాహనాల యజమానులు హైకోర్టుకు
వెళితే పన్ను చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. అంటే తమ రాష్ట్ర రాజధానికి
వచ్చి ప్రభుత్వాధి నేతలకు, అధికారులకు వినతి పత్రాలు
సమర్పించుకోవడానికి కూడా పన్నులు చెల్లించుకోవలసిన దుర్గతి ఆంధ్రప్రదేశ్ పౌరులకు
ఏర్పడింది. పౌరులకు ఇంతకంటే అవమానకరమైన అంశం ప్రజాస్వామ్య వ్యవస్థలో మరొకటి
ఉంటుందా! ఆలోచిoచాలి.
ఉమ్మడి రాజధాని అని చట్టంలో పేర్కొని ఆంధ్రప్రదేశ్ పౌరులను పార్లమెoటు దగా చేసింది. ఏ మాత్రం విజ్ఞత ప్రదర్శించకుండా
రాష్ట్రాన్ని విభజించిన,
విభజనను సమర్థించిన రాజకీయ పార్టీలను ఏమనాలి? వాటి స్థాయి, నాణ్యత ఏ పాటిది? సంకుచిత భావాలకు బానిసలై, అనాలోచిత నిర్ణయాలతో ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ఈ తరహా చట్టాలను
చేసే రాజకీయ పార్టీలు,
వాటి ప్రతినిథులతో నిండి పోయిన పార్లమెంటు
వల్ల మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మేలు జరుగుతుందనుకోవడం భ్రమే!
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నాసిరకం చట్టాలను, దుర్మార్గమైన చట్టాలను మంద బలంతో రాజకీయ పార్టీలు
పార్లమెంటరీ వ్యవస్థనే అపహాస్యం చేస్తూ చట్టాలను రూపొందిస్తుంటే, ఆ లోపభూయిష్టమైన చట్టాలపై
తక్షణం స్పందిoచి, ప్రభుత్వాలు గాడి
తప్పకుండా కట్టడి చేయమని పౌరులు సుప్రీం కోర్టు తలుపులు తట్టినా కుంభకర్ణునిలా
వ్యవహరించిన న్యాయవ్యవస్థ వల్ల ఈ దేశానికి మేలు జరుగుతుందా! అంటే సామాన్యుడికి
విశ్వాసం కలగడం లేదు. లోపభూయిష్టమైన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని తన
దృష్టికి వచ్చిన వెనువెంటనే ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి, సముచితమైన తీర్పు చెప్పి
ఉంటే నేడు ఈ దుస్థితి నెలకొని ఉండేది కాదు
కదా! యథారాజా తథా ప్రజ అన్న నానుడిగా పార్లమెంటు, ఉన్నత న్యాయ వ్యవస్థ వ్యవహరించిన తీరు వల్ల ఈవాళ రెండు
రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు కష్టాలు, సమస్యల కుంపటిలోకి నెట్టబడ్డారు. ఇప్పటికైనా విజ్ఞత
ప్రదర్శించి తప్పుల తడకగా రూపొందించబడిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని
లోపాలను సరిదిద్ది, రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు న్యాయం చేకూర్చి, సమతుల్యమైన, సమగ్రాభివృద్ధి, ప్రగతి సాధించడంలో ఇతర
రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీ పడే స్థితి ఈ రెండు రాష్ట్రాలకు కల్పించే బాధ్యత
కేంద్ర ప్రభుత్వానిది, రాజకీయ పార్టీలదే.
No comments:
Post a Comment