తెలంగాణ శాసన మండలికి ఆరుగురు సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. ఫిరాయింపుల సమస్య మరొకసారి చర్చనీయాంశంగా తెరపైకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ హిందూ దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఎలాంటి తటపటాయింపులు లేకుండా ఫిరాయింపులను సమర్థించుకొన్న తీరు చూస్తే నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ డొల్లతనం బహిర్గతమవుతున్నది. టిడిపి, కాంగ్రెస్ పార్టీల ఎన్నికల గుర్తులపై గెలుపొందిన శాసన సభ్యులు, అధికార పార్టీ అయిన టి.ఆర్.యస్.లోకి ఫిరాయించడంపై స్పందనను కోరగా భారత దేశంలో ఏ ఒక్క పార్టీ అయినా తమ పార్టీలో చేరడానికి సిద్ధపడి, ఫిరాయింపులకు పాల్పడ్డ చట్ట సభ సభ్యులను చేర్చుకోని ఘటన ఒక్కటి చూపండని కేసిఆర్ ఎదురు ప్రశ్న వేశారు. తద్వారా ఫిరాయింపులు తప్పు కాదని బహిరంగంగా వ్యాఖ్యానించడమే కాదు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూర్చారు. అది అనైతికమన్న భావనే వారి మాటల్లో ధ్వనించలేదు.
చట్ట సభ సభ్యుడు తాను స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసినా, పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి ఓటింగ్ లో పాల్గొన్నా ఫిరాయింపుల నిరోధక చట్టం-1985(55వ రాజ్యాంగ సవరణ) ప్రకారం సభ్యత్వం కోల్పోవాలి. ఆ చట్టానికి తరువాత కొంత కాలానికి పదవ షెడ్యూలును జత చేర్చారు. అందులో పొందు పరచబడిన మూడవ పేరా ప్రకారం పార్టీ శాసన సభాపక్షం నుండి మూడవ వంతు సభ్యులు చీలిపోతే ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని పేర్కొనడం ద్వారా చట్టాన్ని నీరుగార్చారు. మళ్ళీ 2003లో ఆ పేరాను 91వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. 2004 జనవరి 1 నుండి అమలులో ఉన్న చట్టం మేరకు మాతృ పార్టీ నుండి రాజీనామా చేసినా లేదా విప్ ను దిక్కరించి ఓటింగ్ లో పాల్గొన్నా సభ్యత్వం కోల్పోవాలి. కానీ అలా జరగడం లేదు.
ఉదా: శ్రీనివాస్ యాదవ్ టిడిపి ఎన్నికల గుర్తుపై పోటీ చేసి శాసన సభ్యుడుగా ఎన్నికై టి.ఆర్.యస్.లోకి ఫిరాయించడమే కాకుండా రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల సంఘం, శాసన సభ రికార్డుల ప్రకారం ఆయన సాంకేతికంగా నేటికీ టిడిపి సభ్యుడే. అలాగే టిడిపి నుండి మరో నలుగురు, కాంగ్రెస్ నుండి నలుగురు శాసన సభ్యులు, పలువురు శాసన మండలి సభ్యులు అధికార పార్టీలోకి ఫిరాయించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఒక చట్టు బండగా, నిరుపయోగమైన చట్టంగా మారిపోయిందనడానికి ఇంత కంటే వేరే సాక్ష్యాలు కావాలా!
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నవ్వుల పాలు చేస్తూ ఒక్క తెలంగాణా రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనూ, దేశంలోని వివిధ రాష్ట్రాలలోని శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు నిస్సిగ్గుగా బట్టలు మార్చినంత సులువుగా పార్టీలను మార్చేస్తున్నారు.
చట్ట సభలకు ఎన్నికైన సభ్యులు నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, రాజకీయాలను వ్యాపారంగా మార్చుకొని, స్వప్రయోజనాలే పరమావధిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే అత్యున్నతమైనదని తలెత్తుకొని చెప్పుకోగలమా! విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి.
No comments:
Post a Comment