బిజెపి అగ్రనేత శ్రీ యల్.కె.అద్వానీ యదాలాపంగా వ్యాఖ్యానించారో! లేదా
హృదయాంతరాళ నుండి ఆ మాటలు బయటికి తన్నుకొచ్చాయో! తెలియదు గానీ దేశ ప్రజలను, ఆ మాటకొస్తే అంతర్జాతీయ
సమాజాన్ని మాత్రం ఉలికి పాటుకు గురిచేసి, కాస్త ఆలోచనలో పడేశారు. భవిష్యత్తులో మళ్ళీ ఎమర్జన్సీ
విధించబడదని చెప్పలేని పరిస్థితులు నేడు దేశంలో నెలకొని ఉన్నాయన్న ఆయన వ్యాఖ్యలను
ఆషామాషిగా కొట్టిపారేయలేం. ప్రజాస్వామ్య శక్తులు అత్యంత బలహీనంగా ఉన్నాయని, నియంతృత్వ శక్తులు పై
చేయి సాధిస్తున్నాయని ఆద్వానీ గారు నేటి రాజకీయ పరిస్థితులను విశ్లేషించడమే
విశేషం. నలబై ఏళ్ళ నాటి చేదు అనుభవాలను నెమరు వేసుకొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను సంఘ్
పరివార్ కూటమి తేలిక భావంతో కొట్టిపారేసింది. కాషాయదళం అధికారంలోకి వచ్చినా
పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ తనకు ఎలాంటి ప్రాధాన్యత లభించలేదన్నఅసంతృప్తితో ఆయన లోలోపల
కుమిలిపోతున్నారేమో! అది కొంత వరకు వాస్తవం కావచ్చు. కానీ మరొక కోణంలో నుంచి
ఆలోచిస్తే మోడీ ఏడాది పాలనను నిశితంగా గమనిస్తున్న రాజకీయ కురువృద్ధుడుగా మోడీ
పరిపాలనా శైలి, రాజ్యాంగ వ్యవస్థల పట్ల, అధికార యంత్రాంగం పట్ల ఆయన ప్రదర్శిస్తున్న వైఖరి పార్లమెంటరీ
ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా లేదన్న భావన ఆద్వానీకి కలిగిందేమో! పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతాతానై
అధికార కేంద్రీకరణతో పెత్తదారీ పోకడలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అందుకే ఒక
హెచ్చరికగా ఆద్వానీ ఆ వ్యాఖ్యలు చేశారేమోననిపిస్తోది. ప్రణాళికా సంఘం రద్దు
మొదలుకొని న్యాయ వ్యవస్థను తన కనుసన్నల్లోకి తెచ్చుకోవాలని వ్యూహాత్మకంగా మోడీ
వేస్తున్న అడుగులు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ బద్ధమైన సంస్థలను
నిర్వీర్యం చేస్తూ, కాషాయీకరణ చేసే ప్రక్రియ చాప క్రింద నీరులా
జరిగిపోతున్నదన్న ఆరోపణలు గుప్పు మంటున్నాయి.
స్వాతంత్య్రానంతరం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను ఎంచుకొన్న భారత దేశంలో
నియంతృత్వం పెచ్చరిల్లి, అత్యవసర పరిస్థితి(ఎమర్జన్సీ) విధించబడి 22 నెలల పాటు చీకటి పాలన
సాగింది. 40 సంవత్సరాల క్రితం, 1975 జూన్ 25న నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నియంతృత్వ పోకడలతో
ఎమర్జన్సీని విధించి, ప్రజాస్వామ్య హక్కులు మరియు మానవ హక్కులపై ఉక్కు పాదం
మోపారు. స్వేచ్ఛను హరించారు. ప్రజా ఉద్యమాలపై కన్నెర్ర చేశారు. పోలీసు రాజ్యం చేదు
అనుభవాలు నాటి తరం ప్రజల స్పృతి పథం నుండి తొలగిపోలేదు. ఆ అనుభవాలు లేని నేటి
తరానికి అత్యవసర పరిస్థితి అంటే ఎంతటి దుర్మార్గమైన పాలనో ఊహించుకోవడమే కష్టం.
ఆ నిరంకుశ పాలనలో నాకు ఒక చిన్న చేదు అనుభవం ఉన్నది. డిగ్రీ విద్యార్థులకు
సంబంధించిన ఒక న్యాయబద్ధమైన సమస్యపై కార్యాచరణకు పూనుకొంటే పోలీసులు నిష్కారణంగా
అరెస్టు చేశారు. నెనప్పుడు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బి.కాం.
ప్రథమ సంవత్సరం విద్యార్థిగా ఉన్నాను. నాడు డిగ్రీ విద్యార్థులకు విశ్వవిద్యాలయం
వార్షిక పరీక్షలను రోజుకొకటి చొప్పున నిర్వహించేది. పరీక్షలను రోజు మార్చి రోజు
నిర్వహించాలని కోరుతూ మా యస్.వి.ఆర్ట్స్ కళాశాల క్రీడా ప్రాంగణానికి చుట్టూ ఉన్న
ప్రహరీ గోడలపై ఒక రోజు అర్థరాత్రి వాలరైటింగ్స్ వ్రాస్తుంటే రాత్రి పూట
పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు దళం నాతో పాటు ఉన్న మరో నలుగురిని అరెస్టు చేసింది.
మమ్మల్ని ఏ చట్టం క్రింద అరెస్టు చేశారని అడిగిన పాపానికి నా మిత్రులిద్దర్ని
పోలీసులు చితకబాదారు. తిరుపతిలోని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, తూర్పు పోలీస్ స్టేషన్లకు
తీసుకెళ్ళి ఖాళీ లేకపోవడంతో పశ్చిమ పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ నిర్భందించి, ఉదయం బేయిల్ పై విడుదల
చేశారు. అరెస్టు అయిన విద్యార్థుల్లో ఒకతను హెడ్ కానిస్టేబులు కుమారుడు కూడా
ఉన్నాడు. కారణం చెప్పకుండా అప్రజాస్వామ్యంగా అరెస్టులు చేసి జైళ్ళలో నెలల తరబడి
నిర్భందిచే వారు. ఎలాంటి విచారణలు జరిపే వారు కాదు.
సంపూర్ణ విప్లవం పేరుతో జయప్రకాశ్ నారాయణ నిర్వహించిన ఉద్యమాన్ని మితవాద
అభివృద్ధి నిరోధక ఉద్యమంగా, ఫాసిస్టు ఉద్యమంగా అభివర్ణించి, ఆ ప్రతీఘాత ఉద్యమానికి వ్యతిరేకంగా 1975 డిసెంబరు మొదటి వారంలో
ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక మహాసభను పాట్నాలో నిర్వహించారు. దానికి 50 దేశాల నుండి సౌహార్థ
ప్రతినిథులు కూడా వచ్చి పాల్గొన్నారు. భారత దేశ నలుమూలల నుండి దాదాపు ఆరు వేల
మంది ప్రతినిథులు హాజరైనారు. నేను ఎ.ఐ.యస్.ఎఫ్. ప్రతినిథిగా తిరుపతి నుండి వెళ్ళి
పాల్గొన్నాను. మహాసభ ముగింపులో జరిగిన బహిరంగ సభకు ఐదు లక్షల మందికిపైగా ప్రజానీకం
పాల్గొన్నారని వేదికపై నుంచి నిర్వాహకులు ప్రకటించారు. నా జీవితంలో మొట్టమొదట
పాల్గొన్న భారీ బహిరంగ సభ అదే. గడ్డ గట్టే చలిలో తరలివచ్చిన ఆ ప్రజానీకానికి
వివిధ దేశాలు, మన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రతినిథులు జేజేలు పలికారు. ఫాసిస్టు శక్తులకు
వ్యతిరేకంగా జనభాహుళ్యం కదం తోక్కిందని నా నాంటి వెర్రి వెంగళప్పలు కేరింతలు
కొట్టాం. విషాదకరమైన అంశమేమంటే అత్యవసర పరిస్థితిని విధించడాన్ని బలపరచి, అటుపై దుష్టపాలనను
కళ్ళారా చూసి నాలుక కరుచుకొని, బహిరంగంగా పక్షాత్తాపం వ్యక్తం చేసింది నా మాతృ సంస్థ. ఆ
నియంతృత్వ పాలన చరిత్ర భావితరాలకు తెలియాలి. భారత దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య
వ్యవస్థ పటిష్టవంతంగా రూపుదిద్దుకోవాలని బలంగా కోరుకొంటూ! నియంతృత్వ పోకడలు ఏ
రూపంలో ఎక్కడ పొడచూపినా మొగ్గలోనే తుంచేసే చైతన్యం భారతీయ సమాజంలో పెంపొందాలని
ఆకాంక్షిస్తున్నా!