సంపన్న కుటుంబంలో పుట్టింది. దుష్ట శక్తులన్నీ ఏకమై పేగు బంధాన్ని తెంచేసి, పైశాసికానందాన్ని పొందాయి. అనాధగా మిగిలింది. చుట్టూ అంధకారం అలముకొన్నది. భవిష్యత్తు మీద బెంగ. దిక్కుతోచని స్థితి. ఎవరిని నమ్మాలో! ఎవరిని నమ్మకూడదో! అంతు పట్టడం లేదు. మరొక వైపు నీకేమమ్మా! 960 కి.మీ. సముద్ర తీరం, వంశధార, గోదారమ్మ, కృష్ణమ్మ, పెన్నార్ తల్లి, విశాలమైన మాగాణి భూములు, లక్షలాది ఎకరాల మెట్ట భూములు, అపారమైన ఖనిజ సంపద, అటవీ సంపద, ప్రఖ్యాతిగాంచిన దేవస్థానాలకు వారసురాలువని ఊదరగొడుతూ వాటిని కబళించే పనిలో దుష్ట శక్తులు చుట్టూ మూగాయి. పీక్కు తినడానికి వూర కుక్కలు, గద్దలు, రాబంధులా చుట్టు ముట్టాయి. రహదారి కూడలిలో కూలబడి ఉన్న పసికందుకు ఎటు వైపు అడుగు వేయాలో పాలుపోని దుస్థితి. ఇదీ స్థూలంగా నవ్యాంధ్రప్రదేశ్ నేటి మానసిక స్థితి.
దుష్ట రాజకీయ, దోపిడీ శక్తుల విషవలయంలో చిక్కి విలవిల్లాడుతున్న ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ప్రకృతి కూడా కక్ష గట్టింది. పద మూడు జిల్లాలలో ఐదు జిల్లాలు నిత్య కరువు పీడిత జిల్లాలైతే, మిగిలిన జిల్లాలు తుఫాను బాధిత జిల్లాలు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబాటుతనంతో కృంగి పోతున్నాయి. జనాభాలో 60% మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. విభజన తరువాత వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. విశాఖపట్నాన్ని మినహాయిస్తే చెప్పుకోతగ్గ భారీ పరిశ్రమలు రాష్ట్రంలో మరే జిల్లాలో లేవు. విద్యాధిక యువతకు ఉపాథి కల్పించే ఆధునిక పారిశ్రామికాభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. హైదరాబాదు అభివృద్ధిలో భాగస్వాములై పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు రాష్ట్రం విడిపోయినంత మాత్రాన జరిగిన నష్టం కానీ, వారి దోపిడికి ద్వారాలు మూసుకు పోవడంగానీ ఏమీ జరగలేదు. కానీ, హైదరాబాదు నా రాజధాని అనుకొని చమటోడ్చిన శ్రమ జీవులకు, వారి పిల్లలకు నీటిలోని చేపను బయటికి విసిరేసినట్లయ్యింది.
నాణ్యత, నైపుణ్యాన్ని అందించ గలిగిన ఉన్నత విద్యా సంస్థలు లేవు. పుష్కలంగా మానవ వనరులు ఉన్నా వాటిని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్ది, ఉత్ఫత్తి ప్రక్రియలో ఉపయోగించుకొనే మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు మృగ్యం. అసంఘటిత కార్మికులుగా దేశంలోని వివిధ పట్టణాలు, నగరాలకు మరియు గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళి బానిస బతుకు బతుకుతున్నారు. కనీసం మానవ వనరులను అభివృద్ధి చేస్తే స్వరాష్ట్రంలో కాకపోతే కడుపు చేతబట్టుకొని ఎక్కడికైనా వెళ్ళి హుందాగా జీవించడానికైనా అవకాశం ఉంటుంది. తద్వారానైనా ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాతృ గడ్డ అభివృద్ధిలో ఉడతా భక్తిగా భాగస్వాములు కావడానికి అవకాశం లభిస్తుంది.
రాజకీయమంటే సమాజాభివృద్ధికి పాటుపడడం. అంతే కానీ, సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టడం కాదు. స్వార్థం, సంకుచిత భావజాలం నేడు పైచేయి సాధించి, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది. కలసి సహజీవనం చేస్తూ, తమ శ్రమను మరియు జాతి సంపదను దోపిడీ చేస్తున్న దుష్ట శక్తులకు ఎదురొడ్డి నిలిచి సమరశంఖారావాన్ని పూరించాల్సిన ప్రజలను విడగొట్టి, విధ్వేషాలు రెచ్చగొట్టి, రావణ కాష్టంలా మనోభావాల చితిని రగిల్చి, ఆ చితి ఆరిపోకుండా ఆజ్యం పోస్తూ తమ పబ్బం గడుపుకొంటున్న దోపిడీ శక్తులు, వారి రాజకీయ దళారులకు సంతోషంగానే ఉన్నది. తెలుగు జాతి ముక్కలై ఏడాది గడచింది. రాష్ట్రం కావాలని దెబ్బలాడిన తెలంగాణా ప్రజల జీవన పరిస్థితుల్లో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇసుమంతైనా మెరుగుదల భూతద్దంి వేసి వెతికినా కానరావడం లేదు. దోపిడీ శక్తుల దోపిడీకి అడ్డుకట్ట పడలేదు. సమైక్య రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలని పరితపించి విఫలమైన ఉత్తరాంధ్ర , కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకాన్ని మాత్రం సమస్యల సుడిగుండంలోకి నెట్టివేశారు.
జాతీయ దృక్పథం కొరవడింది. తెలుగు జాతిని విభజించడంలో జాతీయ రాజకీయ పక్షాలే ప్రధాన భూమిక పోషించాయి. వాటిలో ఎవరి తాత్విక చింతనలు, ప్రయోజనాలు వారికున్నాయి. కేంద్రం బలంగా ఉండాలి, రాష్ట్రాలు బలహీనంగా ఉండాలనే భావజాలం కొందరిదైతే, అధికార దాహం కొందరిది, గాలి వాటం రాజకీయాలతో లబ్ధి పొందాలని ఉబలాట పడ్డవారు మరికొందరు, ఏతావాతా అందరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేయి చేయి కలిపి తెలుగు జాతిని విడగొట్టారు. ఇవాళ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించాలంటే ఆ పాపం మూట గట్టుకొన్న జాతీయ పార్టీలే ప్రధాన బాధ్యత వహించాలి. మరీ ముఖ్యంగా నాడు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నేడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, అలాగే నాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా విభజనకు సంపూర్ణ సహకారాన్ని అందించి నేడు అధికారంలో ఉన్న బిజెపి బాధ్యత వహించి, అన్ని విధాలా తోడ్పాటును అందించాలి. కానీ ఏడాది అనుభవాన్ని బట్టి దగాకోరు విధానాలనే ఈ రెండు పార్టీలు అనుసరిస్తున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, నాటి ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ రాజ్యసభ వేదికగా ఆదాయ వనరులు, మౌలిక సదుపాయాలు లేని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరగతి హోదాను కల్పించి, ఆర్థికాభివృద్ధికి అన్ని విధాల చేయూతనిస్తామని ఇచ్చిన వాగ్ధానాల అమలులో కేంద్ర ప్రభుత్వం నిరాశే మిగిల్చింది.
ప్రత్యేక హోదాపై గందరగోళాన్ని సృష్టించి, కొనసాగిస్తున్నది. వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తామని చట్టంలో పేర్కొన్నారే గానీ ఆ వైపుగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. రెవెన్యూ లోటును భర్తీ చేస్తామన్నారు. రెవెన్యూ లోటు 2014 -15 ఆర్థిక సం.లో రు.14,400 కోట్లుగా కాగ్ తేల్చిన తరువాత కూడా ఆ మేరకు నిథులను మంజూరు చేయకుండా కేవలం రు.2,300 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడం, బడ్జెట్లో రు.100 కోట్లు కేటాయించి, నిరసన ధ్వనులు వినిపించగానే రు. 2,000 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించడం మినహా ప్రాజెక్టు నిర్మాణానికి అవరోధంగా ఉన్న న్యాయపరమైన చిక్కులపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టిన సూచనలు కనపడడం లేదు. సుప్రీం కోర్టులో ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కేసు నుండి బయటపడేసి, ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలనే రాజకీయ సంకల్పం కొరవడింది. రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపధికపై నూతన రాజధాని నిర్మాణానికి నిథుల విడుదలపై కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే ప్రధాన బాధ్యత, తమది అరాకొర నిథులను సమకూర్చడం వరకే అన్న రీతిలో మోడీ ప్రభుత్వం వ్యవహారిస్తున్నది. వెనుకబడ్డ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతామని చట్టంలో పేర్కొన్నా, ప్రస్తుతం దాని ఊసే ఎత్తడం లేదు. మొత్తంగా చూస్తే ఏడాది గడచిపోయినా పునర్విభజన చట్టంలో పేర్కొన్న, రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన వాగ్ధానాల అమలులో అడుగులు ముందుకు పడడం లేదు.
పర్యవసానంగా ప్రజలలో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. మనోవేదనతో కృంగిపోతున్నారు. తల్లిదండ్రులను అత్యంత దారుణంగా చంపి, పిల్లలను అనాధలను చేసిన హంతకులే వీథికెక్కి అనాధలైన పిల్లలకు న్యాయం చేయండంటూ గావు కేకలు పెట్టిన చందంగా ప్రజల చేతుల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన పార్టీలు పునరుజ్జీవనం పొందాలనే ప్రయత్నంలో భాగంగా ఉనికి కోసo పడరానిపాట్లు పడుతున్నాయి.
కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బిజెపి కేవలం రాజకీయ ప్రయోజనాలే కొలబద్ధగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతున్నది. జాతీయ రాజకీయ పార్టీల్లో జాతీయ దృక్పథంగానీ, దేశ విశాల ప్రయోజనాలు గానీ పెద్దగా కనిపించని దుస్థితి నెలకొన్నది. ప్రాంతీయ పార్టీల స్వభావం సహజంగానే సంకుచితంగా ఉంటుంది. ఇలాంటి సంక్షోభాల నుండి ప్రజలను బయట పడేసే శక్తి సామర్థ్యాలు వాటికి చాలా పరిమితంగా ఉంటాయి. పైపెచ్చు ఓటు బ్యాంకు రాజకీయాలతో పాలక పార్టీలు ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతున్నది. రాష్ట్ర విభజనతో వారసత్వంగా జనాభా ప్రాతిపదికపై లక్షా పది వేల కోట్ల అప్పుల భారం నెత్తిన పడింది. ఆ అప్పులకు వడ్డీలు చెల్లించే శక్తి కూడా లేదు. కొత్తగా అప్పులు చేసే వేటలో ప్రభుత్వం ఉన్నది. ఉద్యోగులకు నెల వారి వేతనాల చెల్లించడానికే ఆపసోపాలు పడుతున్నది. ఆదాయ వనరుల లేమితో బాధపడుతున్నది. నిథులు, నీళ్ళు, ఉపాథి, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు లేక అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో సరిసమానంగా ఎదగడానికి అవరోధాలెన్నో అడ్డుగోడలుగా నిలిచాయి. పునర్విభజన చట్టంలో పొందుపరచబడ్డ అంశాలు, రాజ్యసభ వేదికగా ఇచ్చిన హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం అందడం లేదు. అయినా బాధ్యతగా ఆర్థిక క్రమశిక్షణతో వ్యవస్థను గాడిలో పెట్టవలసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు అత్యంత లోపభూయిష్టంగా ఉన్నాయి. ఈ చర్యలు ఆర్థిక సంక్షోభాన్నితీవ్రతరం చేసి, దీర్ఘకాలికంగా ప్రజలకు హాని కల్గిస్తాయనే స్పృహ ప్రభుత్వ పెద్దల్లో లోపించిందనిపిస్తోంది.
చివరలో న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక్క మాట. న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టుకోవడమే కాదు, తెలుగు ప్రజల గోడు వినిపించకుండా చెవులు కూడా మూసేసుకొంది. ప్రజలను రక్షించే వ్యవస్థ మరొకటి లేదు. ఇహ! చేసేదేముంది, అనుభవించడం తప్ప. న్యాయం చేయక పోయినా అన్యాయం చేస్తే గుర్తుంచుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు హక్కుతో రాజకీయ పార్టీలకు తగిన శిక్ష విధించే చైతన్యo మాత్రం ప్రజలకు పుష్కలంగా ఉన్నదన్న విషయం గుర్తుంచుకోవాలి.
No comments:
Post a Comment