పాలమూరు - రంగారెడ్డి, నక్కలగంాడి ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. శంఖుస్థాపనలు చేసి, కృష్ణా నీటి వినియోగ హక్కులపై అసంబద్ధమైన వ్యాఖ్యలు, అవాకులు చవాకులు మాట్లాడడంతో నీటి వివాదాల సమస్యపై మళ్ళొకసారి వాడి వేడి చర్చ జరిగిన నేపథ్యంలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కాస్త దృష్టిసారిoచి ఉభయ రాష్ట్రాల నీటి పారుదల రంగానికి చెందిన అధికారులను డిల్లీకి పిలిచి చర్చించింది. వర్షా కాలం మొదలయ్యింది. కానీ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర జలాశయాలలోకి నీటి ప్రవాహం లేదు. జలాశయాలలో కనీస నీటి నిల్వలు కూడా లేని దుస్థితి నెలకొన్నది. ఖరీప్ సీజన్ సమీపిస్తున్నది. కృష్ణా నదికి ప్రస్తుతానికి నీటి ప్రవాహం లేకపోయినా ఈ ఏడాది నీటి వినియోగానికి సంబంధిoచి వివాదం తలెత్తకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం తలంచినట్లు, ఉభయ రాష్ట్రాల అధికారులతో రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశానంతరం వెల్లడించిన అంశాలను బట్టి స్పష్టమవుతున్నది.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు 2000 మే 31తో ముగిసినా అటుపై నియమించబడిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండడంతో అది అమలులోకి రాలేదు. పర్యవసానంగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మరియు కేంద్ర జల సంఘం ఆమోదించిన ప్రాజెక్టులకు చేసిన నీటి కేటాయింపుల ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ 512 టియంసిలు, తెలంగాణ 299 టియంసిల కృష్ణా జలాలను వాడుకోవాలని ఆదేశించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జఠిలంగా మారుతున్న కృష్ణా నీటి వినియోగ హక్కులకు సంబంధించిన వివాదం మూలాల్లోకెళ్ళి చర్చ చేపట్టి కొత్త ఒప్పందమమేమీ కుదర్చలేదనది సుస్పష్టం. ప్రస్తుతానికి బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా మాత్రమే ఈ ఏడాది నీటిని వాడుకోవాలని, ఆ మేరకు నీటి విడుదలను నియంత్రిoచడానికి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. అందులో ఉభయ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల ఇంజనీరింగ్ ఛీప్స్ ను, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని సభ్యులుగా నియమించారు. అంత వరకు స్థూలంగా బాగానే ఉన్నది.
కానీ, సుబ్బి పెళ్ళి వెంకి చావుకు వచ్చింది అన్న నానుడిగా ఈ తాత్కాలిక యుద్ధ విరమణ (నీటిపై) వడంబడిక ద్వారా రాయలసీమకు అన్యాయం జరిగే ప్రమాదపు ఛాయలు కనబడుతున్నాయి.
1. అత్యంత కరువు పీడిత జిల్లాగా పరిగణించబడుతున్న అనంతపురం జిల్లా నీటి దాహాన్ని కొంత వరకైనా తీర్చాలన్న లక్ష్యంతో తుంగభద్ర జలాశయం నుండి కడప-కర్నూలు కాలువ(కె.సి.కెనాల్)కు బచావత్ ట్రిబునల్ కేటాయించిన 10 టియం్సిలను పెన్నా అహోబిలం రిజర్వాయర్(పిఎబిఆర్)కు మళ్ళిoచి, అంతే నీటిని శ్రీశైలంన జలాశయం నుoడి కె.సి.కెనాల్ కు సర్దుబాటు చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా అమలులో ఉన్న ఆ సర్దుబాటుకు సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లే అనిపించడ లేదు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పరిగణలోకి తీసుకోలేదో! ఏం జరిగిందో తెలియదు కానీ పిఎబిఆర్ నీటి సమస్య మళ్ళీ మొదటికొచ్చినట్లు అనిపిస్తున్నది. ఫలితంగా అనంతపురం జిల్లాకు తీవ్రంగా నష్టం వాటిల్లనున్నది. కారణం కె.సి.కెనాల్ కు శ్రీశైలం జలాశయం నుoడి నీటిని విడుదల చేయక పోతే సహజంగానే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు తుంగభద్ర జలాశయం నుండి 10 టియంసిల నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.
2. కేంద్ర ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు నీటిని వినియోగించుకోమని చెబుతూనే ఉమ్మడి రాష్ట్రంలో చేసిన రెండు సర్దుబాట్లకు మాత్రం ఆమోద ముద్ర వేసింది. కారణం, ఆ రెండు సర్దుబాట్లకు కేంద్ర జల వనరుల సంఘం గతంలోనే ఆమోదం తెలియజేసి ఉండడం కావచ్చేమో! అందులో ఒకటి: కృష్ణా డెల్టా ఆధునీకీకరణ ద్వారా ఆదా అయ్యే 29 టియంసిలలో మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మించబడుతున్న భీమా ఎత్తిపోతల పథకానికి 20 టియంసిలు, పులిచింతల జలాశయానికి 9 టియంసిల నికర జలాలను సర్దుబాటు చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం చేత ఆమోద ముద్ర వేయించుకొన్నది.
రెండవది: బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు పునరుత్పత్తి జలాలలో ఉమ్మడి రాష్ట్రానికి లభించిన 11 టియంసిలతో పాటు కె.సి.కెనాల్ ఆధునీకీకరణ ద్వారా ఆదా అయ్యే 8 టియంసిలను కలిపి 19 టియంసిలను శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.) కు శ్రీశైలం జలాశయం నుండి కేటాయించి కేంద్ర జల సంఘం నుండి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సర్దుబాట్లను పరిగణలోకి తీసుకొనడం సముచితమైన నిర్ణయం. ఆ మేరకు పాక్షికమైన తాత్కాలిక ఒప్పందాన్నిరెండు రాష్ట్రాల మధ్య ఈ ఏడాదికి కృష్ణా నది నికర జలాల వినియోగానికి సంబంధించిన కేటాయింపులను నిర్ధారించింది.
3. బచావత్ ట్రిబ్యునల్ దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు మిగులు జలాలను వాడుకొనే స్వేచ్ఛను ఇచ్చింది. ఆ మేరకు మిగులు జలాల ఆధారంగా నిర్మించబడిన తెలుగు గంగకు 29 టియంసిల నీటి విడుదలకు సంబంధించిన ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం కుర్చిన ఒప్పంద పత్రంలో లేకపోవడం తీవ్ర అభ్యంతకరం, రాయలసీమకు తీవ్ర నష్టాన్ని కలిగించే చర్య.
4. శ్రీశైలం జలాశయం ఆవిరి పద్దు క్రింద బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 33 టియంసిలను మాత్రం మూడు భాగాలు చేసి రాయలసీమ వాటాగా 11 టియంసిలను చూపెట్టడం ఎంత వరకు సమంజసం? శ్రీశైలంస జల విద్యుదుత్పాదన వల్ల ప్రయోజనం పొందే వారెవరు, శ్రీశైలం జలాశయం నుండి నికర జలాల వినియోగంలో రాయలసీమ వాటా ఎంత అన్న అంశాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా గుండు గుత్తగా పద్దులు రాసేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
5. చెన్నయ్ నగరానికి 15 టియంసిలు త్రాగు నీటి కోసం ఇవ్వడానికి మహారాష్ట్ర, కర్నాటకలతో పాటు ఉమ్మడి రాష్ట్రం ఒప్పందం చేసుకొన్నది. అందులో భాగంగా సరఫరా చేయాల్సిన 5 టియంసిలను కూడా మూడు వాటాలు చేసి, ఆంధ్రప్రదేశ్ వాటా 3.63 టియంాసిలుగా పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొనే ముందు ఒక శాస్త్రీయమైన ప్రాతిపదికను నిర్ధారించాలి కదా!
6. హైదరాబాదు త్రాగు నీటి అవసరాల కోసం నీటి కేటాయింపు అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలమైన వైఖరి ప్రదర్శించడం సమర్థనియం.
ముగింపులో ఒక్క మాట. నీటి కేటాయింపుల విషయంలో బట్టి పోలు పంచాయితీ కేంద్ర ప్రభుత్వం చేస్తే, దానికి రాష్ట్ర ప్రభుత్వం తలూపితే భవిష్యత్తులో సమస్యలు ఉత్ఫన్నమవుతాయన్న స్పృహ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొరవడినట్లు స్పష్టంగా కనబడుతున్నది. కరువు పీడిత రాయలసీమ నీటి సమస్య మరింత సంక్లిష్టంగా, జఠిలంగా, అపరిష్కృతంగా కొనసాగడానికి దోహదపడే చర్యలకు అవగాహనారాహిత్యంతో పూనుకొన్నా భవిష్యత్తులో సంభవించే దుష్పరిణామాలకు నేటి పాలకులే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నీటి వినియోగంలో తలెత్తిన సమస్యలకు, రాష్ట్రం రెండు ముక్కలైన తరువాత తలెత్తుతున్న, భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలపై సంపూర్ణ అవగాహనతో బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన తరుణమిదని గుర్తుoచుకోవాలి.
అలా అని పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో హేతుబద్ధంకాని, అసంబద్ధమైన నీటి వివాదాలకు దిగి తెలుగు జాతి మధ్య అగాంధం పెంచమని కాదని కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణలోని అత్యంత కరువు పీడిత మరియు వెనుకబడ్డ జిల్లాలైన మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డిలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం మరియు ప్రకాశం జిల్లా నీటి అవసరాలు తీర్చడానికి శాశ్వత పరిష్కారం కోసం అంకిత భావంతో కృషి చేయాలి. గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానమే తెలుగు ప్రజల ముందున్న ఏకైక పరిష్కార మార్గంగా స్పష్టంగా గోచరిస్తున్నది. పోలవరంతో పాటు దుమ్మగూడెం-నాగార్జునసాగర్ లింక్ పథకం కూడా అమలులోకి వచ్చినప్పుడు మాత్రమే వెనుకబడ్ద ప్రాంతాల నీటి సమస్య కొంత వరకైనా తీరుతుంది.
No comments:
Post a Comment