1. నినాదం బాగుంది. భారత రాజ్యాంగం స్ఫూర్తికి
లోబడి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, బహుళ పార్టీల వ్యవస్థ,
సమాఖ్య వ్యవస్థలను పటిష్టవంతం చేసుకోవడానికి ఈ ఆలోచన దోహదపడుతుందో!
లేదో! లోతైన అధ్యయనం చేయాలి. సమగ్ర
ఎన్నికల సంస్కరణల వైపు ప్రయాణం చేయాలి.
ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టి పోయిందని, డబ్బు
ప్రభావం పెరిగి పోయిందని, ఎక్కడో ఒక చోట ఏదో
ఒక ఎన్నికలు జరుగుతుండడంతో ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించి పని చేయలేక పోతున్నాయని,
ఎన్నికల నిబంధనలు అవరోధంగా నిలుస్తున్నాయని వగైరా వగైరా వాదనలతో
'ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు' అన్న ప్రతిపాదనను ముందుకు
తెచ్చారు. ఒక్కసారిగా ఎన్నికల తంతు పూర్తి అయిపోతే,
ఇహ! స్థిరమైన పాలనతో, అభివృద్ధిపైనే ప్రభుత్వాలు దృష్టి లగ్నం చేసి, జాతి
సంపదను ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చేస్తాయని, అన్ని సమస్యలకు పరిష్కారం
లభిస్తుందన్న భ్రమలు కల్పించే దోరణిలో చర్చకు తెర లేపారు.
2. ఈ సమస్య అత్యంత సంక్లిష్టమైనది.
మంచి చెడులపై లోతైన చర్చ జరగాలి.
స్వాతంత్ర్యానంతరం మొదటి సాధారణ ఎన్నికలు
జరిగిన 1952 మొదలు 1967లో జరిగిన నాలుగవ
లోక్ సభ ఎన్నికల వరకు
రాష్ట్రాల శాసనసభలతో కలిపే ఒకేసారి జరిగాయి.
అటుపై వేరుపడి పోవడానికి దారి తీసిన పరిణామాలేంటో
నిశితంగా పరిశీలించాలి.
3. మొట్ట
మొదటిసారి ఇందిరా
గాంధీ లోక్ సభను రద్దు
చేసి గడువు ప్రకారం 1972లో
జరగాల్సిన ఎన్నికలను 1971లోనే నిర్వహించేలా ముందస్తు
ఎన్నికలకు వెళ్ళారు. మొత్తం 16 లోక్ సభ ఎన్నికలు
జరిగితే ఏడు దఫాలు ముందస్తుగానే
ఎన్నికలు జరిగాయి. పదమూడు రోజులకే కేంద్ర ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు జరిగిన చరిత్ర కూడా ఉన్నది. రాష్ట్రాల్లో
ప్రభుత్వాలు పడిపోతే రాష్ట్రపతి పాలన పెట్టడానికి రాజ్యాంగం
అనుమతిస్తుంది, కానీ, కేంద్ర ప్రభుత్వం
పడిపోతే ఆ సౌలభ్యం లేదు.
విధిగా ఎన్నికలకు వెళ్ళాల్సిందే.
4. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను 125 సార్లుకుపైగా ప్రయోగించింది. సమాఖ్య
వ్యవస్థను గొడ్డలి పెట్టుకు గురి చేస్తూ, రాష్టాలలో
రాష్ట్రపతి పాలనను విధించింది. ప్రప్రథమంగా 1957లో కేరళలో ప్రజల
చేత ఎన్నుకోబడిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని, నాటి జవహర్ లాల్
నెహ్రూ ప్రభుత్వం 1959లో రద్దు చేసి
రాష్ట్రపతి పాలన విధించింది. అప్పటి
నుంచి మొదలైన ఆర్టికల్ 356 దుర్వినియోగం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే అత్యధిక
సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు. ఈ మధ్య కాలంలోనే
మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తారాకాండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో రాష్ట్రపతి పాలన
విధిస్తే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొన్న ఉదంతాలు కళ్ళ ముందు కదలాడుతూనే
ఉన్నాయి.
5. తాజాగా ఎన్నికలు జరిగిన గోవా, మణిపూర్ రాష్ట్రాలలో
అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన పార్టీని ప్రక్కకు నెట్టేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఫిరాయింపులను
కూడా ప్రోత్సహించి ఏరీతిలో అధికార పగ్గాలు చెరబట్టిందో అందరికీ విధితమే. కంచే చేను మేసినట్లు
ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నంపై గెలుపొందిన శాసనసభ్యుడ్ని అక్కున చేర్చుకొని, అతనికి మంత్రి పదవి కట్టబెట్టి, మణిపూర్
లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
6. దేశంలో చిన్న రాష్ట్రాల సంఖ్య
పెరిగి పోతున్నది. చిన్న రాష్ట్రాల భావజాలానికి
బిజెపి అనుకూలం. చిన్న రాష్ట్రాలలో తరచూ
రాజకీయ అస్థిరత నెలకొంటున్న పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాం. అరుణాచల్ ప్రదేశ్ చక్కటి ఉదాహరణ. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్
పార్టీ విజయం సాధించి అధికార
పగ్గాలు చేపట్టింది. అక్కడ ఇప్పుడు బిజెపి
ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల్లో అత్యధికులు
వివిధ పల్టీలు కొట్టి అంత్యమంగా బిజెపిలో చేరి, ప్రభుత్వ రంగును
ఊసరి వెల్లి లాగా రూపాంతరం చెందించారు.
చిన్న రాష్ట్రాలలో అవకాశాలు అంది వచ్చినప్పుడల్లా కేంద్రంలోని
పాలక జాతీయ పార్టీ ఈ
తరహా అనైతిక చర్యలకే పాల్పడుతుందని చరిత్ర నేర్పుతున్న పాఠం.
7. జాతీయ పార్టీల వైఫల్యం పర్యవసానంగా ప్రజల్లో నెలకొన్న ప్రాంతీయ ఆకాంక్షల ప్రాతిపదికగా ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించి, చాలా రాష్ట్రాలలో బలంగా
వేళ్ళూనుకొని ఉన్నాయి. కుటుంబ వారసత్వ రాజకీయాలతోను, వారసులు లేక పోవడం మూలంగాను
కొన్ని పార్టీలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నా, ఇంకా పలు రాష్ట్రాలలో
పలు ప్రాంతీయ పార్టీలు పటిష్టంగానే ఉన్నాయి.
8. జాతీయ పార్టీల్లో ఒకనాడు కాంగ్రెస్ ఏకచత్రాధిపత్యo చెలాయించింది. నేడు
దాని పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది. కాంగ్రెస్ దుష్టపాలన పుణ్యమాయని బిజెపి అధికారంలోకి వచ్చింది. దీని తాత్విక చింతన
కేంద్రం బలంగా ఉండాలి, రాష్ట్రాలు
బలహీనంగా ఉండాలన్నదే. ఒకనాడు ఎన్.టి.ఆర్.
కేంద్రం మిథ్య, రాష్ట్రాలే వాస్తవం అని వ్యాఖ్యానించారు. మాటల్లో
సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటూనే కేంద్రమే వాస్తవం, రాష్ట్రాలు మిథ్య అన్న భావజాలంతో
నరేంద్ర మోడీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. అదే
ఆయన పార్టీ భావజాలమన్నదీ సుస్పష్టం. దాంట్లో దాపరికం లేదు. అది మంచిదా!
కాదా! అన్నది దేశ ప్రజలు ఆలోచించు
కోవాలి అంతే.
9. కేంద్రంలో,
రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో
ఉండే రోజులకు కాలం చెల్లి పోయింది.
పైపెచ్చు, కొన్ని దశాబ్ధాలుగా కేంద్రం, రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాల పాలన కొనసాగుతున్నది. కాంగ్రెస్
పాలనతో విసిగెత్తిన ప్రజల్లో
నెలకొన్న తీవ్ర అసంతృప్తి జ్వాలలను
సానుకూలంగా మలచుకొని ఏకపార్టీ పాలనకు సరిపడ బలాన్ని 2014 ఎన్నికల్లో
మోడీ సమకూర్చు కొన్నప్పటికీ, సంకీర్ణ ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారు. ఏక పార్టీ పాలనకు
కాలం చెల్లిపోయిందనే భావం బలపడుతున్న కాలంలో
కాస్త మార్పు కనిపించినా అదే పరిస్థితి కొనసాగుతుందని
చెప్పలేం.
10. సంకీర్ణ
ప్రభుత్వాల స్థిరత్వం భాగస్వామ్య పార్టీలపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి పొరపొచ్చాలు పొడచూపినా ప్రభుత్వాలు కూలిపోవడం చూశాం. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే ఎన్నికలకు అనివార్యంగా వెళ్ళ వలసిందే. అప్పుడు
అన్ని రాష్ట్రాల శాసనసభలను రద్దు చేసి ఒకేసారి
ఎన్నికలు నిర్వహిస్తారా? ఒక వేళ అలా
చేశారనుకోండి, ఆ చర్య ప్రజాస్వామ్యానికి
అద్దం పడుతుందా! ప్రజల చేత ఎన్నుకోబడిన
రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా రద్దు చేస్తారు?
11. కొంత మంది అమెరికాతో పోలుస్తున్నారు.
ఆ దేశంలో ఉన్నది అధ్యక్ష తరహా ఎన్నికల వ్యవస్థ,
మన రాజ్యాంగ నిర్ణేతలు మన దేశానికి పార్లమెంటరీ
ప్రజాస్వామ్య వ్యవస్థ శ్రేష్టమైనదని నిర్ధారించారు. అమెరికా వ్యవస్థలో ఉన్న బలహీనతలేంటో డోనాల్డ్ ట్రంప్
అధ్యక్షుడైన తరువాత యావత్తు ప్రపంచానికి మరొకసారి తెలియజేస్తున్నారు.
12. ఐదేళ్ళ వరకు ఇహ! ప్రజల
దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదు అన్న
భావం పాలక పార్టీల్లో బలపడి,
నియంతృత్వ పోకడలతో, పెత్తందారీతనంతో వ్యవహరించవనే 'గ్యారెంటీ' ఏముoది! అధికారంలోకి
వచ్చాక పాలక పార్టీ అప్రజాస్వామిక
విధానాలను అమలు చేస్తే అవిశ్వాస
తీర్మానం పెట్టి గద్దెదించే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఒక వేళ ప్రతిపక్షాలు
అవిశ్వాస తీర్మానం పెట్టి విజయం సాధిస్తే, లేదా,
వార్షిక బడ్జెటుకు కోత తీర్మానాలు పెట్టి
నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. పాలక పార్టీలో చీలికొచ్చి
ప్రభుత్వం మెజారిటీ మద్ధతు కోల్పోయి కూలి పోవచ్చు. ఏ
కారణం చేత రాష్ట్ర ప్రభుత్వాలు
పడిపోయినా అప్పుడు ప్రత్యామ్నాయమేంటి? రాష్ట్రపతి పాలన విధించి, కేంద్ర
ప్రభుత్వం పెత్తనం చేస్తుందా? అలా చేస్తే, రాజ్యాంగ
స్ఫూర్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ లక్ష్యాలకు వ్యతిరేకం కాదా?
13. మన దేశం సువిశాలమైనది. 125 కోట్ల
జనాభాతో వైవిధ్యబరితమైనది. వివిధ మతాలు, జాతులు,
కులాలు, తెగలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశం. అందరి
ఆకాంక్షలు ప్రతిబింబించినప్పుడే మన పార్లమెంటరీ వ్యవస్థ,
బహుళ పార్టీ వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ మనుగడ సాగిస్తుంది, పటిష్టవంతం
అవుతుంది.
14. డబ్బు ప్రభావం, ఆర్థిక నేరస్తుల ప్రవేశం, నేరమయ రాజకీయాలు, వ్యాపారమయమైన
రాజకీయ వ్యవస్థ పర్యవసానంగా ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టి పోయింది. ఎన్నికల
వ్యవస్థను సమగ్ర ఎన్నికల సంస్కరణలతో
సత్వరం ప్రక్షాళన చేయాలి. దీనికి సంబంధించి పలు కమిటీలు, కమీషన్లు
కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. వాటికి దుమ్ముదులిపి, వాటిలో ఆమోదయోగ్యమైన అంశాలను అమలు చేస్తే ప్రయోజనం
ఉంటుంది. దామాషా ఎన్నికల విధానం లాంటి ప్రతిపాదనలపై ఎందుకు
ఆలోచించడం లేదు. ఎందుకో మరి
మోడీ ప్రభుత్వానికి సమగ్ర ఎన్నికల సంస్కరణలపై
ఆసక్తి ఉన్నట్లు కనబడడం లేదు.
15. మనది సమాఖ్య వ్యవస్థ. మన రాజ్యాంగంలోని 7వ షెడ్యూలులోని ఒకటవ పట్టికలో పొందు పరచిన 97 అంశాలను కేంద్రం అధికార పరిథిలోను, రెండవ పట్టికలో పొందు పరచిన 61 అంశాలను రాష్ట్రాల అధికార పరిథిలోను, మిగిలిన 52 అంశాలను ఉమ్మడి జాబితాలోను పొందు పరిచారు. ఎన్నికల సంస్కరణలపై చేసే ఆలోచనలు సమాఖ్య వ్యవస్థను పటిష్టపరిచే దృక్పథంతోనే సాగాలి.
స్థానిక
సంస్థలకు అధికారాలను, బాధ్యతలను, ఆర్థిక వనరులను బదలాయిస్తూ రాజ్యాంగానికి 73,74 సవరణలు చేయబడ్డాయి. కానీ, అవి పాక్షికంగానే
అమలుకు నోచుకొన్నాయి. ఆ రాజ్యాంగ సవరణల
మేరకు తక్షణం స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. వాటికి కూడా క్రమం తప్పకుండా
ఎన్నికలను నిర్వహించాలి.
టి.లక్ష్మీనారాయణ
No comments:
Post a Comment