Sunday, May 13, 2018


ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కు: మన ప్రజలకు అదెంత దూరంలో ఉన్నది!

1. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండు పర్యటన సందర్భంగా అక్కడి ఆరోగ్య వ్యవస్థను పరిశీలించే సదవకాశం నాకు లభించింది.  కొంత ఆసక్తి కనబరిచాను.

2. ఆ సమయంలో, నా మెదడులో ఒక విషయం మెదలాడింది. లండన్ కేంద్రంగానే కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగెల్స్ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని గ్రంధస్తం చేశారు. మార్క్సిజం మార్గదర్శకత్వంలో రష్యాలో 1917 అక్టోబరు మహావిప్లవం ఘనవిజయం సాధించింది. అటుపై రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఫాసిజంపై సోవియట్ యూనియన్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దాని ప్రభావం ప్రపంచం మీద, ప్రత్యేకించి యూరప్ ఖండం, పశ్చిమ దేశాలపై గణనీయంగా పడింది. తూర్పు ఐరోపా దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించాయి. ఈ నేపథ్యంలో తమను తాము రక్షించు కోవాలంటే సంక్షేమ పథకాలను కొన్నింటిని అమలు చేసి, శ్రామిక వర్గాన్ని కొంత సంతృప్తి పరిస్తే తప్ప కమ్యూనిస్టు భావజాలం నుండి పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోలేమన్న భయం అమెరికా, బ్రిటన్ మొదలుకొని వివిధ దేశాలను వెంటాడిందని, దాంతో జాతీయ ఆరోగ్య పథకం, పెన్షన్ స్కీమ్స్ అమలు, పేద విద్యార్థులు చదువు కోవడానికి వీలు కల్పిస్తూ విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి ధనికులు, పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు ఆర్థిక వనరులను సమకూర్చాలన్న నిర్ణయానికి వచ్చి ప్రభుత్వాలు ఆ వైపు కార్యాచరణకు పూనుకొన్నాయని చరిత్ర పుటల నుండి గ్రహించిన అంశం గుర్తొచ్చింది. అందులో భాగంగానే జాతీయ ఆరోగ్య పథకం(నేషనల్ హెల్త్ స్కీమ్)ను యునైటెడ్ కింగ్డమ్(యు.కె.) 1948 నుండి అమలు చేయడం మొదలు పెట్టిందని చరిత్ర చెబుతున్నది.

3. నా శ్రీమతి, ప్రశాంతి డాక్టర్. ఆమెకు వైద్య కళాశాలలో సహ విద్యార్థులైన డా.జి.లక్ష్మీనారాయణ, డా.లలిత చలసాని, మరో ముగ్గురు ఇంగ్లండులో వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. మా పర్యటన సందర్భంగా డా.లలిత చలసాని, ఆమె భర్త డా.సత్యప్రసాద్ కోయ గారు చొరవ తీసుకొని, వారి పూర్వ సహచర విద్యార్థులతో పాటు మిత్రులైన మరికొందరు డాక్టర్స్ కుటుంబాలను వారింటికి ఆహ్వానించి, విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా పిచ్చాపాటి కబుర్లుతో పాటు మన దేశం, తెలుగు నాట రాజకీయాలు, వామపక్ష ఉద్యమానికి సంబంధించి ముచ్చటించు కోవడం జరిగింది. ఇంగ్లండులోని ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పని తీరు కేంద్ర బిందువుగా సంభాషణ జరిగింది.  

4. లివర్ పూల్ ప్రాంతం పరిథిలో డా.సత్యప్రసాద్ కోయ, డా.లలిత చలసాని గార్లు నిర్వహిస్తున్న"హౌ గ్రీన్ హెల్త్ పార్క్" ను సందర్శించి అక్కడి ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పని తీరును తెలుసుకొనే ప్రయత్నం చేశాను. ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా కేంద్రాల వ్యవస్థ, మౌలిక వసతులు, వాటి పని తీరును తెలుసుకొనే సదవకాశం కలిగింది. ఆక్స్ పర్డ్ నుండి కోవెంట్రీ కు బస్సులో వెళ్ళి, అక్కడ నుండి లివర్ పూల్ కు డా.జి.లక్ష్మీనారాయణ గారితో కలిసి కారులో ప్రయాణం చేసిన సమయంలో ఆరోగ్య విధానం, స్థూల జాతీయోత్ఫత్తిలో ఆ దేశం వెచ్చిస్తున్న నిథుల నిష్పత్తి, తదితర కొంత సమాచారాన్ని ఆయన తెలియజేశారు. లండన్ లో ఉద్యోగం చేస్తున్న మరొక మిత్రుడు, తన జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నదని, ఆమెకు అందుతున్న ఉచిత(అత్యంత ఖరీదైన) వైద్య సహయాన్ని గురించి అతను వివరించాడు.

5. పిల్లల ఆరోగ్య పరిరక్షణ, పోషణ, విద్యకు సంబంధించిన అంశాలపై ఆ ప్రభుత్వ విధానాన్ని మరి కొందరు మిత్రులు తెలియజేశారు. పుట్టిన రోజు మొదలు 16 సం.ల వయస్సు వచ్చే వరకు ఏడాదికి 1500 పౌండ్లు చొప్పున బిడ్డ పేరుతో బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. ఐర్లండులో కూడా ఇదే రీతిలో పిల్లల పోషణకు నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానం అమలులో ఉన్నదని, ఇద్దరు పిల్లల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని విధిగా అందిస్తున్నదని, ఒకవేళ కవల పిల్లలు పుడితే మూడింతలు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నదని ఒక మిత్రుడు తెలియజేశాడు. పిల్లలను హింసిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందితే సత్వరం స్పందించి తల్లిదండ్రులపై చర్యలకు ఉపక్రమిస్తారని, ఒకసారి వారి పిల్లాడు పొరపాటున పోలీసుల అత్యవసర నెంబరుకు ఫోన్ చేస్తే పోలీసులు ఇంటికొచ్చారని, జరిగిన పొరపాటును తెలియజేసి, వివరణ ఇచ్చుకొన్నామని, ఈ తరహా ఘటన పునరావృతం కాకుండా చూసుకొమ్మని హెచ్చరించి వెళ్ళారని, ఒక మిత్రుడు చెప్పాడు.

6. యునైటెడ్ కింగ్డమ్(యు.కె.) ఒక సామ్రాజ్యవాద దేశం. సూర్యుడస్తమించని సామ్రాజ్యాన్ని ఒకనాడు ఏలిన దేశం. భారత దేశంతో సహా పలు ప్రపంచ దేశాలను అడ్డంగా దోచుకొని, సంపదను పోగేసుకొన్న దేశం. ఆ దేశానికి సంబంధించిన నాటి, నేటి చరిత్ర సామ్రాజ్యవాద దోపిడీ చరిత్రే. నేను దాని జోలికి వెళ్ళడం లేదు. ఆ దేశంలో అమలులో ఉన్న ఆరోగ్య వ్యవస్థ, అందులోని సానుకూలాంశాలేమైనా ఉన్నాయా! మన ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచు కోవడానికి దోహదపడే అంశాలేమైనా ఉన్నాయా! అన్న అంశం వరకే పరిమితమౌ తున్నాను.

7. సామాజిక, ఆర్థిక, లింగ, జాతి, కుల, మతపరమైన వివక్ష లేకుండా దేశ పౌరులందరికీ "ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు"గా గుర్తించాలని ప్రపంచ వ్యాపితంగా ఉద్యమాలు నడుస్తున్నాయి. మన దేశంలోనే కాదు అంతర్జాతీయ సమాజం కూడా ఈ దృక్పథంతోనే కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు.హెచ్.ఒ.) కూడా ఈ లక్ష్య సాధన కోసం ప్రపంచ దేశాలపై వత్తిడి చేస్తున్నది. సహస్రాబ్ధి లక్ష్యాలలో కూడా ఇదొక ప్రధానమైన లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి నిర్ధేశించింది. సమాజాభివృద్ధిలో పౌరుల ఆరోగ్యం ముఖ్యభూమిక పోషిస్తుందన్న అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు.

8. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా విడుదల చేసిన 2014 సం. గణాంకాల ప్రకారం మన నేతలు ఆదర్శంగా చూపెడుతున్న అభివృద్ధి చెందిన దేశాలు, అలాగే మన ఇరుగుపొరుగు దేశాల ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్ల ద్వారా వెచ్చించిన నిథులను పరిశీలిద్దాం. అమెరికా 21.3%, యు.కె. 16.5%, శ్రీలంక 11.2%, నేపాల్ 11.2%, చైనా 10.4% వెచ్చించాయి. ఆ దేశాల స్థూల జాతీయోత్ఫత్తిలో ఆరోగ్య రంగంపై చేసిన ప్రభుత్వ మరియు ప్రయివేటు మొత్తం వ్యయం వివరాలను పరిశీలిస్తే అమెరికా 8.3%, యు.కె. 7.6%, చైనా 3.1%, నేపాల్ 2.3%, శ్రీలంక 2% గా ఉన్నాయి. మన దేశంలో 2018 -19 వార్షిక బడ్జెట్ లో 5% కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. జిడిపిలో 1.15% మాత్రమే. 2025 నాటికి జిడిపిలో 2.5% కు తీసుకెళ్ళాలని జాతీయ ఆరోగ్య విధానం - 2017లో లక్ష్యంగా పెట్టుకొన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రస్తుతం ఖర్చు చేస్తున్న రెండు లక్షల కోట్ల నుండి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పెంచితే తప్ప మన ఆరోగ్య వ్యవస్థ మెరుగైన సేవలను అందించలేదని నిపుణులు చెబుతున్న మాట.

9. యునైటెడ్ కింగ్డమ్(యు.కె.)లో ఇంగ్లండు, నార్త్ ఐర్లండు, స్కాట్ లాండ్, వేల్స్ ప్రాంతాలు వేరు వేరుగా ఆరోగ్య వ్యవస్థలను నెలకొల్పుకొని, ప్రభుత్వ నిథులతో నిర్వహిస్తున్నాయి. జాతీయ ఆరోగ్య సేవ(ఎన్.హెచ్.యస్.) పేరిట ఇంగ్లండు ప్రభుత్వం 1948 నుండి ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నది. పౌరులందరి ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా బాధ్యతను జనరల్ ప్రాక్టీషనర్స్(జీ.పి.)లకు అప్పగించబడింది. జీ.పి.లకు నిర్ధేశించిన ప్రాంతంలో నివాసముంటున్న పౌరులందరూ, పసి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు తప్పని సరిగా పేర్లు నమోదు చేసుకోవాలి.  రోగులు తమకందే వైద్య సేవల నిమిత్తం ఫీజులు చెల్లించాల్సిన పని లేదు. ప్రభుత్వమే నెల వారిగా నిథులను సమకూర్చుతుంది. అందులో నర్సులు, వైద్య సిబ్బంది, టెక్నీషియన్స్, ఇతర సిబ్బంది వేతనాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు చేరి ఉంటాయి. అంతే కాదు జీ.పి.లు నిర్వహించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలకు కూడా అద్దె ప్రభుత్వమే చెల్లిస్తుంది.  పౌరులందరి ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా బాధ్యతను జనరల్ ప్రాక్టీషనర్స్(జి.పి.)లకు అప్పగించబడింది. ప్రాథమిక వైద్య సేవలన్నింటినీ జీ.పి. లే అందిస్తారు. వ్యాధిగ్రస్తులు (ప్రజాప్రతినిథులు, ప్రభుత్వ పెద్దలతో సహా) ముందు జీ.పి.ల వద్దకు వెళ్ళి ప్రాథమిక చికిత్స చేయించుకోవాలి. జబ్బుల తీవ్రతను బట్టీ అవసరమైతే ఆపై స్థాయి ఆసుపత్రులకు రోగులను 'రెపర్' చేస్తారు.

10. తీవ్రమైన జబ్బు చేసినప్పుడు అత్యవసర చికిత్స నిమిత్తం రోగులు నేరుగా 'రెపరల్' ఆసుపత్రులకు వెళ్ళి చేరినా, ఆ వెంటనే ఆ విషయాన్ని వారి సంబంధిత జీ.పి.కి విధిగా తెలియజేయాలి. జీ.పి.ల వద్ద నిక్షిప్తం చేయబడి ఉన్న పౌరుల ఆరోగ్యానికి సంబంధించిన పూర్వ సమాచారం, జన్మదినం, నివాసం, జీ.పి. వద్ద నమోదు సంఖ్య వగైరా వ్యక్తిగత వివరాలను సేకరించుకోవాలి. ఆధునిక, సాంకేతిక యుగంలో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండడం మూలంగా క్షణాల మీద సమాచార మార్పిడి చేసుకోగలుగు తున్నారు.

11. రోగులు జీ.పి.ల వద్ద అపాయింట్ మెంట్స్ తీసుకోవడం, చికిత్సకు సంబంధిన మందుల సమాచారాన్ని నేరుగా  మందుల దుకాణాలకు పంపడం లాంటి లావాదేవీలనన్నింటినీ కూడా ఇంటర్నెట్ ద్వారానే సాగిస్తున్నారు. తద్వారా మందుల చీటీల వ్రాతల్లో తప్పులు దొర్లడానికి అవకాశం ఉండదు. గంటల తరబడి ఆసుపత్రులు, మందుల షాపుల వద్ద వేచి ఉండే బాధ రోగులకు లేకుండా సాంకేతిక పరిజ్ణానాన్ని, పరికరాలను సద్వినియోగం చేసుకొంటున్నారు.

12. ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రంలో ఉన్న మౌలిక సదుపాయాలను చూసి ఆశ్చర్య పోయాను. పరిశుభ్రమైన, విశాలమైన వాతావరణం. వాహనాల పార్కింగ్ కు విధిగా స్థలం. డాక్టర్లకే కాదు, నర్సింగ్ స్టాఫ్ కు, టెక్నీషియన్స్ కు, వైద్య పరీక్షలకు వేరు వేరుగా గదులున్నాయి. ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రానికి అనుబంధంగా పని చేసే స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలు స్థానిక ప్రజలతో మమేకమై పని చేస్తుంటారు. స్థానిక పరిపాలనా సంస్థలకు ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రాలు జవాబుదారిగా ఉండాలి. ఆసుపత్రిలో ఒక సభా మందిరం ఉన్నది. నెల కొకసారి లేదా అవసరాన్ని బట్టి పక్షం రోజుల కొకసారి స్థానిక సంస్థల ప్రతినిథులు, ఆరోగ్య కార్యకర్తలతో కూడిన సంయుక్త సమావేశాలను నిర్వహిస్తూ, సేవా కేంద్రం పని విధానాన్ని సమీక్షిస్తూ ఉండాలి.  

13. ఇంగ్లండులో వైద్యానికి అయ్యే ఖర్చులో అత్యధిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్య రంగానికి 2017-18 బడ్జెటులో122.5 బిలియన్ పౌండ్స్ కేటాయించారు. వైద్య భీమా సంస్థలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.

14. మన దేశంలో ఉన్న దాదాపు 29,000 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, లక్షా యాభై వేలకుపైగా ఉపకేంద్రాలు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయి. చాలా వరకు ఒక డాక్టర్ తోనే నిర్వహించ బడుతున్నాయి. అనేక పి.హెచ్.సి.లలో డాక్టర్స్, నర్సులు, టెక్నీషియన్స్, ఉపకేంద్రాలలో పని చేసే ఎ.యన్.యం.లు కొరత తీవ్రంగా ఉన్నది.  మారుమూల గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో సిబ్బంది సమస్య, మందుల కొరత జఠిలంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న సిబ్బందిని వైద్యేతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. జనరల్ ఫిజీషియన్స్ కనుమరుగై పోయారు. మౌలిక సదుపాయాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. రోగుల సంతృప్తి నమోదుపై ద్యాసే లేదు. స్థానిక సంస్థల పరిథిలోకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీసుకురావాలని 73, 74 రాజ్యాంగ సవరణలలో పొందు పరచినా అమలుకు నోచుకోలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ఆరోగ్య సేవలను మెరుగుపరచ వచ్చు.

15. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యానికి బరోసా లభిస్తుంది. అనేక రోగాలు ప్రాథమిక దశలోనే నివారించబడతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులపై వత్తిడి తగ్గుతుంది. వైద్యాన్ని అంగడి సరుకుగా మార్చి సొమ్ము చేసుకొంటున్న ప్రయివేటు, కార్పోరేట్ ఆసుపత్రుల దోపిడీ బారి నుండి ప్రజలను కాపాడవచ్చు. కొన్ని అధ్యయనాలను బట్టి సామాన్య ప్రజలు, వారి ఆదాయంలో అత్యధిక భాగాన్ని వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారని వెల్లడయ్యింది. మన దేశ జనాభా 130 కోట్లు దాటింది. పర్యవసానంగా మౌలిక సమస్యలు జఠిలమౌతున్నాయి. ఆర్థికాభివృద్ధిలో ముఖ్యభూమిక పోషించే ఆరోగ్యాన్ని రాజ్యాంగ పరమైన ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించి, ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసి, ప్రజలకు బరోసా కల్పించాలి.

టి.లక్ష్మీనారాయణ

Friday, May 4, 2018

కారల్ మార్క్స్ ద్విశత జయంతి నేడే

మార్క్సిజం - అజరామరమైనది

1. కారల్ మార్క్స్ దేవుడా! మత ప్రవాక్తా! ఋషా! కాదే. మరి, మార్క్స్ ను మానవాళి ఎందుకు మననం చేసుకోవాలి? నిజమే, కారల్ మార్క్స్ ఒక సామాన్య మానవుడు. అందుకే ఆయన, ఆయన కుటుంబ సభ్యులు నికృష్టమైన దారిద్ర్యాన్ని అనుభవించారు. అష్టకష్టాలు పడ్డారు. కానీ, కారల్ మార్క్స్ మానవాళి యావత్తు గర్వించతగ్గ అరుదైన గొప్ప మేధావి. దోపిడీ వ్యవస్థకు సమాధికట్టి, సంపద సృష్టికర్తలైన శ్రామిక వర్గాన్ని దోపిడీ సంకెళ్ళ నుండి శాశ్వతంగా విముక్తి చేసే, సమసమాజ నిర్మాణం కోసం పరితపిస్తూ, తన ముందు తరాల తత్వవేత్తలు సిద్ధాంతీకరించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విజ్ఞానాన్ని శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసి, తన అపారమైన మేధస్సుతో విమర్శనాత్మకంగా విశ్లేషించి,  కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించి, శ్రామిక జన బాహుళ్యానికి ఆరాధ్యుడుగా మానవాళి చరిత్ర పుటల్లోకెక్కారు.

2. పెట్టుబడిదారీ వ్యవస్థ 15వ శతాబ్ధంలో పురుడు పోసుకొని, 16వ శతాబ్ధంలో పట్టాలెక్కి, అభివృద్ధి చెందడం మొదలైన నాటి నుంచి సామాజిక, ఆర్థిక రంగాలలో దాని ప్రభావం ప్రజలపై పడడం మొదలయ్యింది. నాటి నుంచే ఆ వ్యవస్థ నుండి బయటపడే ఆలోచనలకు అంకురార్పణ కూడా జరిగింది. అవి అశాస్త్రీయమైనవి కాబట్టి ఊహాజనిత భావాల పరిథికే పరిమితమైనాయి. మార్క్సిజం మానవ జాతికి ఒక నూతన తత్వశాస్త్రాన్ని, రాజకీయ అర్థ శాస్త్రాన్ని, శ్రామిక వర్గానికి ఒక విప్ల సిద్ధాంతాన్ని అందించింది.

3. మానవ విజ్ఞాన పరిథి విస్తృతం కావడానికి రసాయన శాస్త్రం, ఖగోళశాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయ అర్థశాస్త్రం, భాషా శాస్త్రం, భూగోళశాస్త్రం, తదితర శాస్త్ర రంగాలలో విప్లవాత్మకమైన పరిశోధనలు, ఫలితాలు సాధించబడ్డాయి. డార్విన్ పరిణామ సిద్ధాంతం. జీవజాలంలో కణ నిర్మాణాన్ని కనుగొనటం, శక్తి రూపం, నిత్యత్వ సూత్రం, నూతన విజ్ఞాన పరిశోదనలు ప్రకృతి శాస్త్రానికి సంబంధించి పాత భావనలను పటాపంచలు చేశాయి. విశ్వం, సమాజం, మానవ చైతన్యానికి సంబంధించిన మానవుని ఆలోచనా విధానంలో మౌలిక మార్పుకు దారి తీశాయి.

4. మరొక వైపు జర్మన్ తత్వశాస్త్రం, ఇంగ్లండ్ అర్థశాస్త్రం, ఫ్రెంచ్ సోషలిస్టు భావాలు అభివృద్ధి చెందాయి. తన ముందు తరాలకు చెందిన తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తల భావాలను నిక్షిప్తం చేసిన విజ్ఞానాన్ని కారల్ మార్క్స్ ఆపోశనం పట్టారు. భావవాద పునాదిగా ఉన్న హెగెల్ తాత్విక చింతన, భౌతికవాద పునాదిగా ఉన్న ఫ్యూర్ బా తాత్విక చింతనను, ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డోల రాజకీయ అర్థశాస్త్రాలను అధ్యయనం చేసిన మీదట "తత్వవేత్తలు ప్రపంచానికి రకరకాలుగా భాష్యాలు చెప్పారు. అయితే సమస్య ఏమిటంటే - ప్రపంచాన్ని 'మార్చటం' ఎలా అన్నదే" అని కారల్ మార్క్స్ వ్యాఖ్యానించారు. 19వ శతాబ్ధం మధ్య కాలానికి శ్రామికవర్గం ఒక శక్తిగా ఆవిర్భవించి, వర్గ పోరాటాలకు అంకురార్పణ చేసింది.

5. ఈ ఆలోచనా స్రవంతులన్నింటినీ, ముందుకు తీసుకు పోవడమే కాదు, తన మేదడుకు పదును పెట్టి, ఫెడరిక్ ఏంగెల్స్ తో కలిసి, శాస్త్రీయ దృక్పథంతో విమర్శనాత్మక వివేచన చేసి, గతితార్కిక - చారిత్రక భౌతికవాదం, పెట్టుబడిదారీ విధానపు అర్థశాస్త్రం,  శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించారు. 

6. ప్రకృతి, సమాజ పరిణామాన్ని శాసిస్తున్న సార్వత్రిక నియమాలను, మానవుడి ఆలోచనల అభివృద్ధిని వివేచనతో లోతైన అధ్యయనం, పరిశోధనల ద్వారా పసిగట్టి శాస్త్రీయ విజ్ఞానాన్నిసిద్ధాంతీకరించి సమాజానికి అందించిన విలక్షణమైన, అరుదైన సామాజిక శాస్త్రవేత్త కారల్ మార్క్స్.

7. మానవుడి ఆవిర్భావానికి ముందే ప్రకృతి ఉనికిలో ఉన్నది. ప్రకృతి పదార్థ నిర్మితమేనన్న శాస్త్రీయ విజ్ఞానాన్ని కారల్ మార్క్స్ , ఫెడరిక్ ఏంగిల్స్ పదిలం చేశారు. పదార్థమే ప్రాథమికం. మానవుని ఆవిర్బావంతోటే ఆలోచన/ భావం పుట్టింది. దేవుడు మానవుడి సృష్టే . దేవుడి చుట్టూ మత విశ్వాసాల అల్లిక జరిగింది. దేవుడు లేడని ప్రభోదించే మత భావనలు కొన్ని మార్క్స్ కాలం నాటికే ఉన్నాయి. కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగిల్స్ పదార్థమే ప్రాథమికమని శాస్త్రీయ విజ్ఞానంతో భావవాదాన్ని తునాతునకలు చేస్తూ గతితార్కిక భౌతికవాదం, నూతన తాత్విక చింతనను ఆవిష్కరించారు.

8. సమాజ పరిణామక్రమాన్ని, మానవాళి అభివృద్ధి దశలను, చరిత్రను శాస్త్రీయ దృక్పథంతో మూలాల్లోకెళ్ళి అధ్యయనం చేసి, విమర్శనాత్మకంగా విశ్లేషించి, చారిత్రక భౌతికవాదాన్ని ఆవిష్కరించి, మానవాళి చరిత్ర అధ్యయనానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చి మార్గదర్శులుగా కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగల్స్ చరిత్రలో నిలిచి పోయారు.

9. సంపద సృష్టికి శ్రమే మూలమని రాజకీయ అర్థశాస్త్రంతో నిగ్గుదేల్చి, దోపిడీ వర్గమైన భూస్వాములు, పెట్టుబడిదారులు, సంపద సృష్టికర్తలైన కార్మిక వర్గాన్నిఎలా దోపిడీ చేస్తున్నారో "పెట్టుబడి" గ్రంథం ద్వారా శాస్త్రీయ ఆధారాలతో శ్రామిక వర్గానికి కనువిప్పు కల్పిస్తూ, అదనపు విలువ సిద్ధాంతాన్ని కార్మిక వర్గానికి శక్తివంతమైన ఆయుధంగా అందించారు. దోపిడీ చేసే వర్గం, దోపిడీకి గురయ్యే వర్గం ఉన్నంత కాలం వర్గాల మధ్య వైరుధ్యాలు అనివార్యమని, వాటి మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూనే ఉంటుందని, ఆ వర్గ సంఘర్షణే విప్లవాలకు బాటలు వేసి, సామాజిక మార్పుకు అనివార్యంగా దారితీస్తుందన్న శాస్త్రీయ భావజాలాన్నికారల్ మార్క్స్ ఆవిష్కరించి, సమాజ భవిష్యత్తును దర్శింప చేశారు. 

10. కారల్ మార్క్స్ కాలం నాటికి ఎలక్ట్రానిక్స్, సైబర్నెటిక్స్, స్పేస్ టెక్నాలజీ, ఇంటర్నెట్, రోబోస్, రాకెట్స్, శాటలైట్స్, డ్రోన్స్ వగైరా వగైరా శాస్త్ర సాంకేతిక, సమాచార రంగాలలో విప్లవాత్మక మార్పులు జరగలేదు. శ్రమ దోపిడీ పునాదులపై అభివృద్ధి చెందుతున్న ఆనాటి పెట్టుబడిదారీ సమాజ గమనాన్ని, దాని బలం - బలహీనతలను పసిగట్టి, భవిష్యత్తు సమాజ పరిణామక్రమాన్ని తన మేధో సంపత్తితో శాస్త్రీయ సోషలిజాన్ని ఆవిష్కరించిన మహోన్నతమైన దార్శనికుడు కారల్ మార్క్స్.

11. కారల్ మార్క్స్ తదనంతర కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంబవించిన విప్లవాత్మక మార్పులను నేడు మనం చూస్తున్నాం, వాటి వల్ల వనగూడుతున్న సత్ఫలితాలను అనుభవిస్తున్నాం, సమాజపరం కావలసిన ఆ శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానంపై యాజమాన్య హక్కులు దోపిడీ శక్తుల వశం కావడంతో సంబవిస్తున్న దుష్పలితాలను శ్రామిక ప్రజలు అనుభవిస్తున్నారు. కంటికి కనపడని రీతిలో, కార్మిక వర్గం పసిగట్టలేని స్థాయిలో దోపిడీ నిష్పత్తి పెరిగి పోయింది. సంపద గుట్టలు గుట్టలుగా పోగుబడుతున్నది. మరొక వైపున దారిద్ర్యం, నిరుద్యోగం, ఆర్థిక _ సాంఘిక అసమానతలు పెరిగి పోతున్నాయి. సామాజిక భద్రత లేదు.

12. కారల్ మార్క్స్ ద్వితీయ శత జయంతి సందర్భంగా ఆయనను మననం చేసుకోవడమంటే మార్క్సిజం భావజాలానికి పునరంకితం కావడమే. ప్రపంచ గమనాన్ని త్వరితం చేసే, మార్చే శక్తి, మార్క్సిజానికి మాత్రమే ఉన్నదని శ్రామిక జన బాహుళ్యం విశ్వసించడమే కాదు, పెట్టుబడిదారీ వర్గం గుండె చప్పుళ్ళు విన్నాబోధపడుతుంది.

13. సామ్రాజ్యవాద దేశంగా అభివృద్ధి చెంది, ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని పరితపిస్తున్న అమెరికా 2008లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ఆ సంక్షోభం నుండి బయట పడడానికి పాక్షాత్య దేశాల ఆర్థిక వేత్తలు సహితం మార్క్సిజం ఏమైనా దారి చూపెడుతుందేమోనని గంపెడాశతో మార్క్సిస్టు గ్రంథాలను, ప్రత్యేకించి రాజకీయ అర్థశాస్త్రాన్ని అధ్యయన చేస్తున్నారన్న వార్తలు, 'పెట్టుబడి' గ్రంథం అమ్మకాలకు మంచి గిరాకీ వచ్చిందన్న వార్తలు కొంత కాలం క్రితం హల్ చల్ చేశాయి. మార్క్సిస్టు భావజాలం ఎంతటి మహాశక్తి సంపన్నమైనదో ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.

14. మానవ సమాజం ఏఏ దశలను దాటుకొని నేటి దశకు ఎలా చేరుకొన్నదో, చరిత్రకు సంబంధించిన భౌతికవాద దృక్పథంతో అధ్యయనం చేసి, విశ్లేషించి, "ఇంత వరకు నడచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే", దోపిడీ పునాదులపై నిర్మితమైన పెట్టుబడిదారీ సమాజం ఆంతరంగిక వైరుధ్యాల మూలంగానే కుప్పకూలి పోతుందని, కారల్ మార్క్స్  భవిష్యత్తు దర్శనాన్నిఅంచనా వేశారు. "సకల దేశాల కార్మికులారా ఏకం కండి" అంటూ విప్లవ శంఖారావాన్ని పూరించారు.

15. "యూరప్ ను ఒక భూతం ఆవహించింది _ కమ్యూనిజం అనే భూతం" అన్న మొదటి వాక్యంతో కారల్ మార్క్స్, ఫెడిరిక్ ఏంగిల్స్ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను రచించారు.

రష్యా గడ్డపై 1917 అక్టోబరు మహావిప్లవం ఘనవిజయం సాధించి, ప్రపంచ గమనాన్ని మార్చి వేసింది. బ్రిటీష్ సామ్రాజ్యవాదం కబంద హస్తాల నుండి విముక్తి పొందడానికి భారత దేశం లాంటి వలస దేశాల్లో స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం సాగిస్తున్న వీరోచిత పోరాటాలకు స్ఫూర్తినిచ్చి, విజయపథాన నడిచేలా చేసింది. 1990 దశకానికి ముందు ప్రపంచంలో మూడవ వంతు జనాభా కలిగిన దేశాలలో సోషలిస్టు ప్రభుత్వాలు రాజ్యమేలినాయి.

మార్క్సిజం - లెనినిజం సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడంలో, సోషలిజం నిర్మాణంలో పొడచూపిన తప్పిదాల పర్యవసానంగా సోవియట్ యూనియన్ మరియు తూర్పు యూరప్ దేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాలు కుప్పకూలి పోయాయి. దాని దుష్ప్రభావం అంతర్జాతీయ కమ్యూనిస్టు, కార్మికోద్యమాలపై పడింది.

నేడు మనుగడలో ఉన్న అతిపెద్ద దేశమైన చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం నిర్మిస్తున్న వ్యవస్థ సోషలిస్టు వ్యవస్థేనా! అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సోషలిస్టు దేశాలలో సంబవించిన దుష్పరిణామాలను అవకాశంగా మలచుకొని పెట్టుబడిదారీ ఆర్థిక వేత్తలు మార్క్సిజంపై ముప్పేట దాడి చేస్తున్నారు.
నేడు అంతర్జాతీయంగా కమ్యూనిస్టు ఉద్యమం పెనుసవాళ్ళను ఎదుర్కొంటున్నది. మార్క్సిజం పిడివాదం కాదు, శాస్త్రీయ భావజాలం. శాస్త్రీయ విజ్ఞానంతో ఆవిష్కరించబడిన సిద్ధాంతం. కాబట్టే మార్క్సిజం అజరామరమైనది.

2018 మార్చి 6వ తేదీన లండన్ హైగేట్ సిమెటరీలో కారల్ మార్క్స్ సమాథి వద్ద నేను, నా జీవిత భాగస్వామి డా.కొల్లి ప్రశాంతి నివాళులర్పిస్తున్న దృశ్యాలు. కారల్ మార్క్స్ సమాథి వద్ద గడపిన ఆ సమయం, నా జీవితంలో అత్యంత సంతృప్తిని కలిగించిన అపురూపమైన, అరుదైన ఘటన.

టి.లక్ష్మీనారాయణ

Monday, April 16, 2018


వైద్య విద్యా శాఖ - వింత పోకడలు:
నైర్యాశ్యంలో అధ్యాపకులు - సంక్షోభంలో వైద్య విద్య

1. మొదట తాజా సమస్యను ప్రస్తావిస్తా. ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు పదోన్నతులలో 2010 సం. నుండి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతామని ఉత్తర్వులు జారీ చేసి ఆరు మాసాలు గడచి పోతున్నా అమలు చేయకుండా జాప్యమెందుకు చేస్తున్నట్లని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అధ్యాపకులు ఆందోళన చేయడం సమర్థనీయం.

2. ప్రభుత్వం వైద్య విద్యను అంగడి సరుకుగా మార్చి, ప్రమాణాలకు పాతరేసింది. దాని దుష్పలితాలను సమాజం అనుభవిస్తున్నది.

3. ప్రభుత్వ వైద్య కళాశాలలు నైపుణ్యం ఉన్న అధ్యాపకుల లేమితో కునారిల్లి పోతున్నాయి. ఈ పరిస్థితికి ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన, బాధ్యతారహితమైన, అనాలోచిత విధానాలు, అవినీతే ప్రధాన కారణం.

4. గడచిన దశాబ్ధ కాలానికి సంబంధించిన అధ్యాపకుల పదోన్నతుల అంశాన్ని పరిశీలిస్తే వైద్య విద్యా శాఖ డొల్లతనం బోధపడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును గుర్తించి, సరిదిద్దడానికి నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "Career Advancement Scheme(Time bound pay scales)" ను అమలు చేస్తామని 2017 అక్టోబర్ 16న జి.ఓ.నెం.163ని వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసింది. ఆ ఉత్తర్వులు నేటికీ అమలుకు నోచుకోలేదు. పర్యవసానంగా అధ్యాపకులు ఆందోళన బాటపట్టారు.

5. సమస్య నేపథ్యాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకుల ఆందోళన ఎంతటి న్యాయబద్ధమైనదో బోధపడుతుంది. ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకుల పదోన్నతుల విధానంపై పిల్లి మొగ్గలు వేయడం చూస్తుంటే ప్రభుత్వానికి ఒక స్థిరమైన, చట్టబద్ధమైన విధానాన్ని అమలు చేయాలన్న చిత్తశుద్ధి లోపించినట్లు భావించాల్సి వస్తున్నది.

6. యు.జి.సి. నిబంధనల మేరకు "Career
Advancement Scheme"ను  అమలు చేయడానికి ఉద్ధేశించిన జి.ఓ.నెం.32ను 2010 ఫిబ్రవరి 2న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇంత కాలం దాన్ని అటకెక్కించి కూర్చున్నారు.

7. ఆయా విభాగాల్లో ఖాళీలు ఏర్పడితేనే పదోన్నతి కల్పించే అసంబద్ధమైన పదోన్నతుల విధానాన్నే కొనసాగించారు. పర్యవసానంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులైన వారు ఒక్క పదోన్నతికి కూడా నోచుకోకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ గానే పదవీ విరమణ చేసిన వారి జాబితా పెద్దది. అలాగే, సర్వీసు మొత్తంలో ఒక్క పదోన్నతి పొంది అసోసియేట్ ప్రొఫెసర్ గానే పదవీ విరమణ చేసిన వారు ఉన్నారు. పదోన్నతులలో 'రోస్టర్ పాయింట్స్' అమలులో అవకతవకలకు పాల్పడడం, పైరవీకారుల ప్రలోభాలకు లొంగి అవినీతికి పాల్పడి అనర్హులకు పదోన్నతి ఇవ్వడం వంటి అక్రమాల వల్ల అర్హులైన వారికి నష్టం వాటిల్లిన ఉదంతాలూ ఉన్నాయి.

8. పదోన్నతులలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దమని 2010 ఫిబ్రవరి 2న జారీ చేసిన జి.ఓ.నెం.32ను అమలు చేయాలని అధ్యాపకులు దీర్ఘకాలికంగా చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 అక్టోబరు 16న జి.ఓ.నెం.163 ను విడుదల చేయడంతో అధ్యాపకులు కాస్తా సంబరపడ్డారు.

9. ఆ జి.ఓ. లో "The Career Advancement Scheme (CAS) shall be implemented with effect from 01.11.2006 and monetary benefit shall be given with effect from the date of issue of these orders" అని పేర్కొన్నారు. 2010 ఫిబ్రవరి 2న జారీ చేసిన జి.ఓ.నెం.32  ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ గా పని చేసిన అధ్యాపకుల సర్వీసును లెక్కగట్టి, ఎం.సి.ఐ. నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తామని, తదనుగుణంగా 'స్కేల్స్' ను నిర్ధారించి, వేతనాల పెరుగుదలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాన్ని మాత్రం 2017 అక్టోబరు 16 నుండి వర్తింప చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతులు వస్తే చాల్లే అన్న సద్భావనతో అధ్యాపకులు సంతోషపడ్డారు.

10(a). 2017లో ఎం.సి.ఐ. జారీ చేసిన  సవరణలతో కూడిన నిబంధనలకు లోబడి ప్రచురించబడిన అధ్యయన పత్రాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే పదోన్నతులు కల్పిస్తామని షరతు విధించారు. గతంలో పదోన్నతులు పొందిన వారికి ఈ షరతును సడలింపులతో అమలు చేస్తూ వచ్చారు.

(b) అధ్యయన పత్రాలకు సంబంధించి గతంలో 'పస్ట్ ఆథర్, సెకండ్ ఆథర్' అనే నిబంధన ఉండేది. ఇప్పుడు, 'పస్ట్ ఆథర్, కరస్పాండింగ్ ఆథర్' అన్న కొత్త నిబంధన మేరకు ప్రచురించబడిన అధ్యయన పత్రాలనే పరిగణలోకి తీసుకొంటామని పేచీకోరు నిబంధనొకటి ఉత్తర్వుల్లో పొందు పరిచారు.     
        
(c) 'కరస్పాండింగ్ ఆథర్' అన్న 'కాన్సెప్ట్' ను ఎం.సి.ఐ. 2017 నుండి మాత్రమే అమలు చేస్తున్నది. ఆ షరతును ఈ జి.ఓ. అమలుతో ముడిపెట్టడం అర్థరహితం.

(d) ఎవరైతే ప్రచురించబడిన అధ్యయన పత్రాలను సమర్పిస్తారో వారే పదోన్నతులకు అర్హులు అన్నంత వరకు సబబే. అంతే కానీ, 'పస్ట్ ఆథర్, సెకండ్ ఆథర్/ కరస్పాండింగ్ ఆథర్' అన్న పేచీ పెట్టి అర్హులైన అధ్యాపకులకు పదోన్నతులు నిరాకరించడమో! లేదా! జి.ఓ. మొత్తం అమలుకే ఎసరు పెట్టడం గర్హనీయం.

(e) ఈ వివాదానికి తెరదించుతూ ఎం.సి.ఐ. విస్పష్టమైన వివరణ ఇచ్చింది. ఎం.సి.ఐ. నోటిఫికేషన్ జారీ చేసిన 2017 జూన్ 5కు ముందు "పస్ట్ ఆథర్, సెకండ్ ఆథర్" నిబంధన వర్తిస్తుందని, తరువాత మాత్రమే "పస్ట్ ఆథర్, కరస్పాండింగ్ ఆథర్" అన్న నిబంధన వర్తిస్తుందని అందులో పేర్కొన్నది. అయినా "Career Advancement Scheme Scales and grade pay" అమలుకు త్వరితగతిన చర్యలు చేపట్టక పోవడాన్ని ఏమనాలి?

11. అధ్యాపకులు నిరంతర విద్యార్థులుగా కొనసాగేలా ప్రోత్సహించడానికి దోహదపడే నిబంధన "పదోన్నతులు పొందడానికి పరిశోధనా పత్రాల ప్రచురణ నకళ్ళను సమర్పించాలి" అన్న నిబంధనను అమలు చేయడం సమంజసం, సమర్థనీయం, విధిగా అమలు చేయాల్సిన నిబంధన.

కానీ, ఈ నిబంధన అమలులో వైద్య విద్యా శాఖ పిల్లిమొగ్గలు వేయడం అత్యంత గర్హనీయం. ఒక్కొక్కసారి ఈ నిబంధనొకటి ఉన్నదనే అంశాన్ని విస్మరించి పదోన్నతులు కల్పించిన ఉదంతాలు కోకొల్లలు. సర్వీసుంటే చాలని పరిశోధనా పత్రాల నిబంధనను ప్రక్కన పెట్టి గతంలో పదోన్నతులు ఇచ్చారు. దాంతో అధ్యాపకుల్లో పరిశోధనల పట్ల అనాసక్తత నెలకొన్నది. అడపాదడపా వైద్య శాఖాధికారులు ఈ నిబంధనను అమలు చేయడానికి పూనుకొంటున్నారు కాబట్టి 'కట్ & పేస్ట్' తరహాలో పత్రాలను తయారు చేసి, ఏ విధమైన నాణ్యతా ప్రమాణాలు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అంతర్జాల పత్రికలలో ప్రచురింప చేయించుకొని, నకళ్ళు సమర్పించి, అడ్డదారులు తొక్కిన అధ్యాపకులు లేరని చెప్పలేం!

మొత్తం సర్వీసులో ఒక్క అధ్యయన/పరిశోధన పత్రాన్ని ప్రమాణాలున్న పత్రికలో ప్రచురించురింప చేసుకోని వారిలో పదోన్నతులు పొంది అధికారులుగా, అధ్యాపకులుగా  ప్రస్తుతం ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వైద్య విద్యా శాఖ అనుసరించిన, అమలు చేసిన అసంబద్ధ, అలసత్వంతో కూడిన విధానాలే కారణమని చెప్పక తప్పదు. నిబంధనలను నిస్పాక్షికంగా, విధిగా అమలు చేసి ఉంటే నేడు ఈ దుస్థితి దాపురించేది కాదు.

12. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే విదేశాలకు వెళ్ళి, డబ్బు సంపాదించుకొని కొన్ని సంవత్సరాల తరువాత తిరిగొచ్చి ఉద్యోగంలో చేరినా వారికి క్రమశిక్షణారాహిత్యం క్రింద చర్యలు తీసుకోక పోగా పదోన్నతులు కల్పించడాన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయో  ఊహించవచ్చు.

13. వృత్తి ధర్మానికి అంకిత భావంతో కట్టుబడి, నూతన విజ్ఞానాన్ని సముపార్జించుకొంటూ, నాణ్యతా ప్రమాణాలతో వైద్య విద్యను బోధించాలన్న తృష్ణ, తపన పడుతున్న అధ్యాపకులు లేక పోలేదు.

14. ఒకేసారి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా సర్వీసులో చేరిన వారిలో కొందరు పదోన్నతికి నోచుకోక అదే స్థాయిలో పని చేస్తుంటే కొందరేమో అసోషియేట్ ప్రొఫెసర్లుగా, మరికొందరు ప్రొఫెసర్లుగా, శాఖాధిపతులుగా పదోన్నతి పొందారు. అలాగే తమ దగ్గర విద్యనార్జించి పట్టభద్రులైన విద్యార్థులు ప్రయివేటు వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రవేశించి, త్వరితగతిన పదోన్నతులు పొంది ప్రొఫెసర్లు అయ్యి 'ఎగ్జామినర్స్' గా, ఎం.సి.ఐ. పర్యవేక్షక అధికారులుగా వస్తున్నారనే న్యాయమైన మనోవేదన కూడా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులకు ఉన్నది.

15. వైద్య విద్యా రంగంలో అధ్యయనాలను, పరిశోధనలను ప్రోత్సహించే వాతావరణం యన్.టి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయంలో పూర్తిగా కొరవడింది. వైద్య విద్యా రంగంలోని వివిధ విభాగాలలో పరిశోధనలపై ఆసక్తి కనబరిచే విద్యార్థులకు ప్రవేశం కల్పించే విధానం లోపభూయిష్టంగా ఉన్నది, కళాశాలల్లో 'గైడ్స్' కొరత తీవ్రసమస్యగా ఉన్నది. ఈ సమస్యను అదిగమించాలన్న ద్యాసే విశ్వవిద్యాలయానికి లేదు. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు ఈ దృక్పథమే లోపించింది.

16. ఎం.సి.ఐ. బృందాలు ప్రతి ఏడాది వైద్య కళాశాలలను సందర్శించి నిబంధనలకు అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోషియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్ అన్ని విభాగాల్లో ఉన్నారా! లేదా! అన్న వాస్తవాలను నిర్ధారించుకొన్న మీదటే 'గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్' ఉన్న సీట్ల సంఖ్యను కొనసాగించడం కానీ, పెంపుదలకు అనుమతించడం కానీ చేస్తుంటుంది. ఈ నిబంధనను అక్రమ మార్గాలలో అధిగమించడంలో ప్రయివేటు వైద్య కళాశాలల యాజమన్యాలది అందె వేసిన చేయి.

ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలల్లో అన్ని స్థాయిల్లో అధ్యాపకుల కొరత లేకుండా నియమించి లేదా పదోన్నతులు కల్పించి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకుండా ఎం.సి.ఐ. బృందాలు పర్యవేక్షణకు వచ్చినప్పుడు 'డెప్యూటేషన్స్' లేదా తప్పుడు రికార్డులను సృష్టించి చూపెట్టడం లాంటి తప్పుడు పద్ధతులను కూడా అనుసరిస్తున్నారనడంలో సందేహం లేదు.

17(a). ఏడవ వేతన సంఘం సిఫార్సులకు (యు.జి.సి. కమీషన్) అనుగుణంగా "Career Advancement Scheme Scales and grade pay" సవరించి అమలు చేయాలని కూడా  జి.ఓ.లో పేర్కొన్నారు.

(b).7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా సవరించిన యు.జి.సి. వేతనాల చెల్లింపుకు సంబంధించిన జి.ఓ.ను కూడా విడుదల చేశారు. కానీ, దాన్ని అమలు చేయలేదు.

18. ఇలాంటి అసంబద్ధ విధానాలతో నైపుణ్యం ఉన్న నిపుణులైన అధ్యాపకులను ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలలు కోల్పోతున్నాయి. పని చేస్తున్న అధ్యాపకులను నిరుత్సాహానికి గురిచేసి వారిలో అలసత్వం పెరిగేలా ప్రభుత్వ చర్యలు దోహదపడుతున్నాయి.

19. జాప్యం చేయడం కానీ, జి.ఓ.నెం.163 ను అటకెక్కించాలని భావించినా వైద్య విద్యా రంగానికి తీవ్రహాని తలపెట్టిన వారౌతారు.

20. చివరలో ఒక్క మాట. ఎం.సి.ఐ. సంస్థే అవినీతి, అక్రమాలకు నెలవుగా మారిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కుంభకోణాలు వేలుగు చూశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికపై వైద్య విద్యా రంగ ప్రక్షాళనకు పూనుకోవాలి.

"వైద్య విద్యా ప్రమాణాలను పరిరక్షించాలి! సమాజానికి నైపుణ్యం గల వైద్యులను అందించాలి".

టి.లక్ష్మీనారాయణ
రాజకీయ, సామాజికాంశాల విశ్లేషకులు

Saturday, February 10, 2018

కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతాల సమగ్రాభివృద్ధి పట్టదా!



1. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జెట్లీ మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకానికి నిథులిచ్చామని దగాకోరు ప్రకటన చేశారు.

2. నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ హరిబాబు, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిథి శ్రీ నరసింహరావు మూడేళ్ళలో ఇచ్చిన నిథుల మొత్తం చాలా పెద్ద మొత్తమన్నట్లు ప్రకటించుకొన్నారు.

3. రాష్ట్ర ప్రభుత్వం రు.24,350 కోట్ల వ్యయం అంచనాతో రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్లు శాసనసభలో ప్రకటించారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం తృణీకార భావంతో చెత్తబుట్టలో వేసినట్లున్నది.

4. జిల్లాకు, ఏడాదికి రు.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు ఏడాదికి రు.350 కోట్ల చొప్పున మూడేళ్ళలో రు.1,050 కోట్లు ఇచ్చారట. ఏ మాత్రం సిగ్గు, బిడియం లేకుండా ఈ నిథుల కేటాయింపును గొప్పగా చెప్పుకొంటున్నారంటే వెనుకబడ్డ, కరవు పీడిత ప్రాంతాల అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి కి ఎంతటి చిత్తశుద్ధి ఉన్నదో తేటతెల్లమౌతున్నది.

5. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ దేశాభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని ఉపన్యాసాన్ని మొదలెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జెట్లీకి ఆ అభివృద్ధిలో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను భాగస్వాములను చేయాలన్న స్పృహ ఎందుకు లేక పోయింది? ఈ ఏడాది బడ్జేట్లో నిథుల కేటాయింపు ఊసే లేదే?

6. దేశ వ్యాపితంగా 117 జిల్లాలను వెనుకబడ్డ జిల్లాలుగా  గుర్తించారట, వాటి అభివృద్ధికి పాటు పడతామని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. అంటే, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను ఆ జాబితాలో కలిపేశారా? విభజన చట్టంలో పొందు పరచిన అభివృద్ధి పథకానికి స్వస్తి పలికారా? 

7. విభజన చట్టం మేరకు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాన్ని సాధించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు కనపడడం లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన పార్లమెంటు సభ్యుల్లోనూ ఆ స్పృహ కొరవడింది.

8. కేంద్ర ప్రభుత్వం దగాకోరు విధానాలతో వెనుకబడ్డ, కరవు పీడిత ప్రాంతాలను వివక్షతకు గురి చేస్తున్నది. రాయలసీమ ప్రాంతంలో ఒక్క భారీ పరిశ్రమ లేదు. విభజన చట్టంలో పొందు పరచిన మేరకు కడప ఉక్కు పరిశ్రమనైనా నెలకొల్పితే, పారిశ్రామికాభివృద్ధి వైపు అడుగులు పడతాయన్న ఆ ప్రాంత ప్రజల ఆశలను అడియాశలను చేసే దోరణిలో కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది.

9. రాయలసీమ ప్రాంతం నుండి పాలక, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎనిమిది మంది లోక్ సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నా వారికి ఈ సమస్యలపై గట్టిగా పార్లమెంటు లోపల, బయట కేంద్ర ప్రభుత్వాన్ని నిలవేద్ధామన్న స్పృహ లేక పోవడం గర్హనీయం.

10. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటి నుంచి గడచిన పది రోజుల్లో ఎనిమిది టీవిల్లో పదమూడు, పద్నాలుగు 'డిబేట్స్'లో విభజన చట్టంలో పొందు పరచిన అంశాలను త్వరితగతిన అమలు చేయడానికి వీలుగా నిథులను కేటాయించక పోగా వివక్షతకు గురి చేయడంపైన ప్రజల పక్షాన గొంతెత్తడంతో పాటు వెనుకబడ్డ, కరవు పీడిత ప్రాంతాల ప్రజల వాణిని గట్టిగా వినిపించే ప్రయత్నం చేశాను. ఈ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిథులు అనుసరిస్తున్న విధానాలు, వైఖరులపై ప్రజలే ఆలోచించుకోవాలి.

టి.లక్ష్మీనారాయణ

Wednesday, January 24, 2018

ఆంధ్రప్రదేశ్ లో అధికార యంత్రాంగం పని విధానం ఎంత అధ్వాన్నంగా ఉన్నదో తెలియజేస్తున్న ఒక స్వానుభవాన్ని మిత్రులతో పంచుకొంటున్నాను.

1. ఇరవై ఐదు రోజుల అనుభవంతో ఈ వ్యాఖ్య చేస్తున్నాను. పౌరులు హక్కుగా అధికార యంత్రాంగం నుంచి పొంద వలసిన సేవలకు కూడా లంచం ఇచ్చుకొని అవినీతికి పాల్పడక పోతే, లేదా, దళారుల ద్వారా పైరవీలతో పనులు చక్క బెట్టుకొనే కళ లేక పోతే, లేదా, ధౌర్జన్యంతో అధికారులను లొంగగొట్టుకొనే కండ బలం లేక పోతే ఈ సమాజంలో బ్రతకడం కష్టమన్న భావన సామాన్యుల్లో రోజు రోజుకూ బలపడుతున్నది.

2. ప్రభుత్వాలు, వాటి అధినేతలు జవాబుదారీతనంతో, సుపరిపాలన అందిస్తామని వల్లించే మాటలు దగాకోరు మాటలుగా ఆచరణలో మిగిలి పోతున్నాయి.

3. జరిగిన ఉదంతం: అత్యున్నత వృత్తి విద్యా సంస్థ(వైద్య కళాశాల), వైద్య విద్యా డైరెక్టర్ కార్యాలయం, వైద్య ఆరోగ్య- వైద్య విద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ప్రిన్సిపుల్ సెక్రటరీ కార్యాలయం, ఇవన్నీ ఎంత గొప్పగా పని చేస్తున్నాయనడానికి ఈ ఘటన ప్రబల నిదర్శనం!

గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసోసియేట్  ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఒక డాక్టర్ ఇంగ్లండ్ కు వెళ్ళి తన అక్క కుమార్తె "డిగ్రీ కాన్వకేషన్" కు హాజరు కావడం కోసం " నో అబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్.ఒ.సి.) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంటే 25 రోజులు గడచి పోయినా అనుమతి మంజూరు చేయడమో, తిరస్కరించడమో చేయక పోతే, ఈ ప్రభుత్వం పని చేస్తున్నట్టా, నిద్ర పోతున్నట్టా!

4. ఫైల్ క్లియర్ చేయాల్సిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి బృందంలో దావోస్ పర్యటనకు వెళ్ళి, ఫైల్ ను పెండింగ్ లో పెట్టి కూర్చొన్నారు. ' ఇన్ ఛార్జ్' గా మరొక ఐ.ఎ.ఎస్. అధికారికి ' బాధ్యత బదలాయించి, వెళ్ళారు. కానీ, సాదాసీదా ' పైల్స్ ను క్లియర్' చేసే అధికారాన్ని కూడా ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వలేదు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నది. బాధ్యతారహిత్యం కాదా! దీన్ని జవాబుదారీతనంతో కూడిన పాలనంటారా!

5. ఆ దరఖాస్తు ప్రిన్సిపల్ ఆఫీసు నుండి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసు చేరడానికి వారం రోజులు పడితే, డి.యం.ఇ. ఆఫీసులోని 'ఇన్ వర్డ్ సెక్షన్' నుండి దరఖాస్తును పరిశీలించే సెక్షన్ కు చేరడానికి నాలుగు రోజులు, ఆ కార్యాలయం నుండి విముక్తి పొంది సెక్రటేరియట్ లోని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసుకు చేరిన ఫైల్ రోజులు గడచి పోతున్నా, ఆ ఫైల్ కు మోక్షం లభించ లేదు. వీసాకు దరఖాస్తు చేసుకొన్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్యుమెంట్స్ సమర్పించు కోవలసిన గడువు ముగిసి పోతున్నా, ఉన్నతాధికారి అలసత్వం పర్యవసానంగా "యన్.ఒ.సి." సమర్పించుకోలేని దుస్థితి నెలకొన్నది.

6. ఉన్నత విద్యా సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగికే ఈ చేదు అనుభవం ఎదురైతే పేద, సామాన్య ప్రజలకు పౌర సేవలు ఏ విధంగా అందని ద్రాక్ష పండ్లులా తయారైనాయో ఊహించవచ్చు.

7. నిజాయితీగా, బాధ్యతాయుతంగా విధి నిర్వహణ చేసే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవమే ఈ ఘటన. తన శ్రమతో ఆర్జించుకొన్న సొమ్ములతో, తనకు హక్కుగా లభిస్తున్న సెలవు దినాలను వినియోగించుకొని, పక్షం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే ఈ అధికార యంత్రాంగం సృష్టిస్తున్న అవరోధాలు వర్ణనాతీతం. వారు మాత్రం ప్రజాధనంతో నిత్యం విదేశీ పర్యటనల్లో కాలం గడిపేస్తూనే ఉంటారు.

8. పౌరులకు హక్కుగా అందించ వలసిన సేవల పట్ల అత్యంత బాధ్యతారాహిత్యంతో, అలసత్వంతో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టి, పని సంస్కృతి పెంపొందించి, ప్రక్షాళన చేయక పోతే ప్రజాస్వామ్యం మరింత దిగదుడుపుగా తయారౌతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలోచించండి.

9. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలనే సదుద్ధేశంతో రెండు లేఖలు వ్రాసి "ఎపి సియం కాన్టాక్ట్" అన్న కైజాలా ఆప్ ద్వారా పంపాను. కానీ, స్పందన లేదు.

టి.లక్ష్మీనారాయణ
కమ్యూనిస్టు, రాజకీయ విశ్లేషకులు