Friday, May 4, 2018

కారల్ మార్క్స్ ద్విశత జయంతి నేడే

మార్క్సిజం - అజరామరమైనది

1. కారల్ మార్క్స్ దేవుడా! మత ప్రవాక్తా! ఋషా! కాదే. మరి, మార్క్స్ ను మానవాళి ఎందుకు మననం చేసుకోవాలి? నిజమే, కారల్ మార్క్స్ ఒక సామాన్య మానవుడు. అందుకే ఆయన, ఆయన కుటుంబ సభ్యులు నికృష్టమైన దారిద్ర్యాన్ని అనుభవించారు. అష్టకష్టాలు పడ్డారు. కానీ, కారల్ మార్క్స్ మానవాళి యావత్తు గర్వించతగ్గ అరుదైన గొప్ప మేధావి. దోపిడీ వ్యవస్థకు సమాధికట్టి, సంపద సృష్టికర్తలైన శ్రామిక వర్గాన్ని దోపిడీ సంకెళ్ళ నుండి శాశ్వతంగా విముక్తి చేసే, సమసమాజ నిర్మాణం కోసం పరితపిస్తూ, తన ముందు తరాల తత్వవేత్తలు సిద్ధాంతీకరించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విజ్ఞానాన్ని శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసి, తన అపారమైన మేధస్సుతో విమర్శనాత్మకంగా విశ్లేషించి,  కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించి, శ్రామిక జన బాహుళ్యానికి ఆరాధ్యుడుగా మానవాళి చరిత్ర పుటల్లోకెక్కారు.

2. పెట్టుబడిదారీ వ్యవస్థ 15వ శతాబ్ధంలో పురుడు పోసుకొని, 16వ శతాబ్ధంలో పట్టాలెక్కి, అభివృద్ధి చెందడం మొదలైన నాటి నుంచి సామాజిక, ఆర్థిక రంగాలలో దాని ప్రభావం ప్రజలపై పడడం మొదలయ్యింది. నాటి నుంచే ఆ వ్యవస్థ నుండి బయటపడే ఆలోచనలకు అంకురార్పణ కూడా జరిగింది. అవి అశాస్త్రీయమైనవి కాబట్టి ఊహాజనిత భావాల పరిథికే పరిమితమైనాయి. మార్క్సిజం మానవ జాతికి ఒక నూతన తత్వశాస్త్రాన్ని, రాజకీయ అర్థ శాస్త్రాన్ని, శ్రామిక వర్గానికి ఒక విప్ల సిద్ధాంతాన్ని అందించింది.

3. మానవ విజ్ఞాన పరిథి విస్తృతం కావడానికి రసాయన శాస్త్రం, ఖగోళశాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయ అర్థశాస్త్రం, భాషా శాస్త్రం, భూగోళశాస్త్రం, తదితర శాస్త్ర రంగాలలో విప్లవాత్మకమైన పరిశోధనలు, ఫలితాలు సాధించబడ్డాయి. డార్విన్ పరిణామ సిద్ధాంతం. జీవజాలంలో కణ నిర్మాణాన్ని కనుగొనటం, శక్తి రూపం, నిత్యత్వ సూత్రం, నూతన విజ్ఞాన పరిశోదనలు ప్రకృతి శాస్త్రానికి సంబంధించి పాత భావనలను పటాపంచలు చేశాయి. విశ్వం, సమాజం, మానవ చైతన్యానికి సంబంధించిన మానవుని ఆలోచనా విధానంలో మౌలిక మార్పుకు దారి తీశాయి.

4. మరొక వైపు జర్మన్ తత్వశాస్త్రం, ఇంగ్లండ్ అర్థశాస్త్రం, ఫ్రెంచ్ సోషలిస్టు భావాలు అభివృద్ధి చెందాయి. తన ముందు తరాలకు చెందిన తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తల భావాలను నిక్షిప్తం చేసిన విజ్ఞానాన్ని కారల్ మార్క్స్ ఆపోశనం పట్టారు. భావవాద పునాదిగా ఉన్న హెగెల్ తాత్విక చింతన, భౌతికవాద పునాదిగా ఉన్న ఫ్యూర్ బా తాత్విక చింతనను, ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డోల రాజకీయ అర్థశాస్త్రాలను అధ్యయనం చేసిన మీదట "తత్వవేత్తలు ప్రపంచానికి రకరకాలుగా భాష్యాలు చెప్పారు. అయితే సమస్య ఏమిటంటే - ప్రపంచాన్ని 'మార్చటం' ఎలా అన్నదే" అని కారల్ మార్క్స్ వ్యాఖ్యానించారు. 19వ శతాబ్ధం మధ్య కాలానికి శ్రామికవర్గం ఒక శక్తిగా ఆవిర్భవించి, వర్గ పోరాటాలకు అంకురార్పణ చేసింది.

5. ఈ ఆలోచనా స్రవంతులన్నింటినీ, ముందుకు తీసుకు పోవడమే కాదు, తన మేదడుకు పదును పెట్టి, ఫెడరిక్ ఏంగెల్స్ తో కలిసి, శాస్త్రీయ దృక్పథంతో విమర్శనాత్మక వివేచన చేసి, గతితార్కిక - చారిత్రక భౌతికవాదం, పెట్టుబడిదారీ విధానపు అర్థశాస్త్రం,  శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించారు. 

6. ప్రకృతి, సమాజ పరిణామాన్ని శాసిస్తున్న సార్వత్రిక నియమాలను, మానవుడి ఆలోచనల అభివృద్ధిని వివేచనతో లోతైన అధ్యయనం, పరిశోధనల ద్వారా పసిగట్టి శాస్త్రీయ విజ్ఞానాన్నిసిద్ధాంతీకరించి సమాజానికి అందించిన విలక్షణమైన, అరుదైన సామాజిక శాస్త్రవేత్త కారల్ మార్క్స్.

7. మానవుడి ఆవిర్భావానికి ముందే ప్రకృతి ఉనికిలో ఉన్నది. ప్రకృతి పదార్థ నిర్మితమేనన్న శాస్త్రీయ విజ్ఞానాన్ని కారల్ మార్క్స్ , ఫెడరిక్ ఏంగిల్స్ పదిలం చేశారు. పదార్థమే ప్రాథమికం. మానవుని ఆవిర్బావంతోటే ఆలోచన/ భావం పుట్టింది. దేవుడు మానవుడి సృష్టే . దేవుడి చుట్టూ మత విశ్వాసాల అల్లిక జరిగింది. దేవుడు లేడని ప్రభోదించే మత భావనలు కొన్ని మార్క్స్ కాలం నాటికే ఉన్నాయి. కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగిల్స్ పదార్థమే ప్రాథమికమని శాస్త్రీయ విజ్ఞానంతో భావవాదాన్ని తునాతునకలు చేస్తూ గతితార్కిక భౌతికవాదం, నూతన తాత్విక చింతనను ఆవిష్కరించారు.

8. సమాజ పరిణామక్రమాన్ని, మానవాళి అభివృద్ధి దశలను, చరిత్రను శాస్త్రీయ దృక్పథంతో మూలాల్లోకెళ్ళి అధ్యయనం చేసి, విమర్శనాత్మకంగా విశ్లేషించి, చారిత్రక భౌతికవాదాన్ని ఆవిష్కరించి, మానవాళి చరిత్ర అధ్యయనానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చి మార్గదర్శులుగా కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగల్స్ చరిత్రలో నిలిచి పోయారు.

9. సంపద సృష్టికి శ్రమే మూలమని రాజకీయ అర్థశాస్త్రంతో నిగ్గుదేల్చి, దోపిడీ వర్గమైన భూస్వాములు, పెట్టుబడిదారులు, సంపద సృష్టికర్తలైన కార్మిక వర్గాన్నిఎలా దోపిడీ చేస్తున్నారో "పెట్టుబడి" గ్రంథం ద్వారా శాస్త్రీయ ఆధారాలతో శ్రామిక వర్గానికి కనువిప్పు కల్పిస్తూ, అదనపు విలువ సిద్ధాంతాన్ని కార్మిక వర్గానికి శక్తివంతమైన ఆయుధంగా అందించారు. దోపిడీ చేసే వర్గం, దోపిడీకి గురయ్యే వర్గం ఉన్నంత కాలం వర్గాల మధ్య వైరుధ్యాలు అనివార్యమని, వాటి మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూనే ఉంటుందని, ఆ వర్గ సంఘర్షణే విప్లవాలకు బాటలు వేసి, సామాజిక మార్పుకు అనివార్యంగా దారితీస్తుందన్న శాస్త్రీయ భావజాలాన్నికారల్ మార్క్స్ ఆవిష్కరించి, సమాజ భవిష్యత్తును దర్శింప చేశారు. 

10. కారల్ మార్క్స్ కాలం నాటికి ఎలక్ట్రానిక్స్, సైబర్నెటిక్స్, స్పేస్ టెక్నాలజీ, ఇంటర్నెట్, రోబోస్, రాకెట్స్, శాటలైట్స్, డ్రోన్స్ వగైరా వగైరా శాస్త్ర సాంకేతిక, సమాచార రంగాలలో విప్లవాత్మక మార్పులు జరగలేదు. శ్రమ దోపిడీ పునాదులపై అభివృద్ధి చెందుతున్న ఆనాటి పెట్టుబడిదారీ సమాజ గమనాన్ని, దాని బలం - బలహీనతలను పసిగట్టి, భవిష్యత్తు సమాజ పరిణామక్రమాన్ని తన మేధో సంపత్తితో శాస్త్రీయ సోషలిజాన్ని ఆవిష్కరించిన మహోన్నతమైన దార్శనికుడు కారల్ మార్క్స్.

11. కారల్ మార్క్స్ తదనంతర కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంబవించిన విప్లవాత్మక మార్పులను నేడు మనం చూస్తున్నాం, వాటి వల్ల వనగూడుతున్న సత్ఫలితాలను అనుభవిస్తున్నాం, సమాజపరం కావలసిన ఆ శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానంపై యాజమాన్య హక్కులు దోపిడీ శక్తుల వశం కావడంతో సంబవిస్తున్న దుష్పలితాలను శ్రామిక ప్రజలు అనుభవిస్తున్నారు. కంటికి కనపడని రీతిలో, కార్మిక వర్గం పసిగట్టలేని స్థాయిలో దోపిడీ నిష్పత్తి పెరిగి పోయింది. సంపద గుట్టలు గుట్టలుగా పోగుబడుతున్నది. మరొక వైపున దారిద్ర్యం, నిరుద్యోగం, ఆర్థిక _ సాంఘిక అసమానతలు పెరిగి పోతున్నాయి. సామాజిక భద్రత లేదు.

12. కారల్ మార్క్స్ ద్వితీయ శత జయంతి సందర్భంగా ఆయనను మననం చేసుకోవడమంటే మార్క్సిజం భావజాలానికి పునరంకితం కావడమే. ప్రపంచ గమనాన్ని త్వరితం చేసే, మార్చే శక్తి, మార్క్సిజానికి మాత్రమే ఉన్నదని శ్రామిక జన బాహుళ్యం విశ్వసించడమే కాదు, పెట్టుబడిదారీ వర్గం గుండె చప్పుళ్ళు విన్నాబోధపడుతుంది.

13. సామ్రాజ్యవాద దేశంగా అభివృద్ధి చెంది, ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని పరితపిస్తున్న అమెరికా 2008లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ఆ సంక్షోభం నుండి బయట పడడానికి పాక్షాత్య దేశాల ఆర్థిక వేత్తలు సహితం మార్క్సిజం ఏమైనా దారి చూపెడుతుందేమోనని గంపెడాశతో మార్క్సిస్టు గ్రంథాలను, ప్రత్యేకించి రాజకీయ అర్థశాస్త్రాన్ని అధ్యయన చేస్తున్నారన్న వార్తలు, 'పెట్టుబడి' గ్రంథం అమ్మకాలకు మంచి గిరాకీ వచ్చిందన్న వార్తలు కొంత కాలం క్రితం హల్ చల్ చేశాయి. మార్క్సిస్టు భావజాలం ఎంతటి మహాశక్తి సంపన్నమైనదో ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.

14. మానవ సమాజం ఏఏ దశలను దాటుకొని నేటి దశకు ఎలా చేరుకొన్నదో, చరిత్రకు సంబంధించిన భౌతికవాద దృక్పథంతో అధ్యయనం చేసి, విశ్లేషించి, "ఇంత వరకు నడచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే", దోపిడీ పునాదులపై నిర్మితమైన పెట్టుబడిదారీ సమాజం ఆంతరంగిక వైరుధ్యాల మూలంగానే కుప్పకూలి పోతుందని, కారల్ మార్క్స్  భవిష్యత్తు దర్శనాన్నిఅంచనా వేశారు. "సకల దేశాల కార్మికులారా ఏకం కండి" అంటూ విప్లవ శంఖారావాన్ని పూరించారు.

15. "యూరప్ ను ఒక భూతం ఆవహించింది _ కమ్యూనిజం అనే భూతం" అన్న మొదటి వాక్యంతో కారల్ మార్క్స్, ఫెడిరిక్ ఏంగిల్స్ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను రచించారు.

రష్యా గడ్డపై 1917 అక్టోబరు మహావిప్లవం ఘనవిజయం సాధించి, ప్రపంచ గమనాన్ని మార్చి వేసింది. బ్రిటీష్ సామ్రాజ్యవాదం కబంద హస్తాల నుండి విముక్తి పొందడానికి భారత దేశం లాంటి వలస దేశాల్లో స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం సాగిస్తున్న వీరోచిత పోరాటాలకు స్ఫూర్తినిచ్చి, విజయపథాన నడిచేలా చేసింది. 1990 దశకానికి ముందు ప్రపంచంలో మూడవ వంతు జనాభా కలిగిన దేశాలలో సోషలిస్టు ప్రభుత్వాలు రాజ్యమేలినాయి.

మార్క్సిజం - లెనినిజం సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడంలో, సోషలిజం నిర్మాణంలో పొడచూపిన తప్పిదాల పర్యవసానంగా సోవియట్ యూనియన్ మరియు తూర్పు యూరప్ దేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాలు కుప్పకూలి పోయాయి. దాని దుష్ప్రభావం అంతర్జాతీయ కమ్యూనిస్టు, కార్మికోద్యమాలపై పడింది.

నేడు మనుగడలో ఉన్న అతిపెద్ద దేశమైన చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం నిర్మిస్తున్న వ్యవస్థ సోషలిస్టు వ్యవస్థేనా! అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సోషలిస్టు దేశాలలో సంబవించిన దుష్పరిణామాలను అవకాశంగా మలచుకొని పెట్టుబడిదారీ ఆర్థిక వేత్తలు మార్క్సిజంపై ముప్పేట దాడి చేస్తున్నారు.
నేడు అంతర్జాతీయంగా కమ్యూనిస్టు ఉద్యమం పెనుసవాళ్ళను ఎదుర్కొంటున్నది. మార్క్సిజం పిడివాదం కాదు, శాస్త్రీయ భావజాలం. శాస్త్రీయ విజ్ఞానంతో ఆవిష్కరించబడిన సిద్ధాంతం. కాబట్టే మార్క్సిజం అజరామరమైనది.

2018 మార్చి 6వ తేదీన లండన్ హైగేట్ సిమెటరీలో కారల్ మార్క్స్ సమాథి వద్ద నేను, నా జీవిత భాగస్వామి డా.కొల్లి ప్రశాంతి నివాళులర్పిస్తున్న దృశ్యాలు. కారల్ మార్క్స్ సమాథి వద్ద గడపిన ఆ సమయం, నా జీవితంలో అత్యంత సంతృప్తిని కలిగించిన అపురూపమైన, అరుదైన ఘటన.

టి.లక్ష్మీనారాయణ

No comments:

Post a Comment