Sunday, May 13, 2018


ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కు: మన ప్రజలకు అదెంత దూరంలో ఉన్నది!

1. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండు పర్యటన సందర్భంగా అక్కడి ఆరోగ్య వ్యవస్థను పరిశీలించే సదవకాశం నాకు లభించింది.  కొంత ఆసక్తి కనబరిచాను.

2. ఆ సమయంలో, నా మెదడులో ఒక విషయం మెదలాడింది. లండన్ కేంద్రంగానే కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగెల్స్ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని గ్రంధస్తం చేశారు. మార్క్సిజం మార్గదర్శకత్వంలో రష్యాలో 1917 అక్టోబరు మహావిప్లవం ఘనవిజయం సాధించింది. అటుపై రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఫాసిజంపై సోవియట్ యూనియన్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దాని ప్రభావం ప్రపంచం మీద, ప్రత్యేకించి యూరప్ ఖండం, పశ్చిమ దేశాలపై గణనీయంగా పడింది. తూర్పు ఐరోపా దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించాయి. ఈ నేపథ్యంలో తమను తాము రక్షించు కోవాలంటే సంక్షేమ పథకాలను కొన్నింటిని అమలు చేసి, శ్రామిక వర్గాన్ని కొంత సంతృప్తి పరిస్తే తప్ప కమ్యూనిస్టు భావజాలం నుండి పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోలేమన్న భయం అమెరికా, బ్రిటన్ మొదలుకొని వివిధ దేశాలను వెంటాడిందని, దాంతో జాతీయ ఆరోగ్య పథకం, పెన్షన్ స్కీమ్స్ అమలు, పేద విద్యార్థులు చదువు కోవడానికి వీలు కల్పిస్తూ విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి ధనికులు, పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు ఆర్థిక వనరులను సమకూర్చాలన్న నిర్ణయానికి వచ్చి ప్రభుత్వాలు ఆ వైపు కార్యాచరణకు పూనుకొన్నాయని చరిత్ర పుటల నుండి గ్రహించిన అంశం గుర్తొచ్చింది. అందులో భాగంగానే జాతీయ ఆరోగ్య పథకం(నేషనల్ హెల్త్ స్కీమ్)ను యునైటెడ్ కింగ్డమ్(యు.కె.) 1948 నుండి అమలు చేయడం మొదలు పెట్టిందని చరిత్ర చెబుతున్నది.

3. నా శ్రీమతి, ప్రశాంతి డాక్టర్. ఆమెకు వైద్య కళాశాలలో సహ విద్యార్థులైన డా.జి.లక్ష్మీనారాయణ, డా.లలిత చలసాని, మరో ముగ్గురు ఇంగ్లండులో వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. మా పర్యటన సందర్భంగా డా.లలిత చలసాని, ఆమె భర్త డా.సత్యప్రసాద్ కోయ గారు చొరవ తీసుకొని, వారి పూర్వ సహచర విద్యార్థులతో పాటు మిత్రులైన మరికొందరు డాక్టర్స్ కుటుంబాలను వారింటికి ఆహ్వానించి, విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా పిచ్చాపాటి కబుర్లుతో పాటు మన దేశం, తెలుగు నాట రాజకీయాలు, వామపక్ష ఉద్యమానికి సంబంధించి ముచ్చటించు కోవడం జరిగింది. ఇంగ్లండులోని ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పని తీరు కేంద్ర బిందువుగా సంభాషణ జరిగింది.  

4. లివర్ పూల్ ప్రాంతం పరిథిలో డా.సత్యప్రసాద్ కోయ, డా.లలిత చలసాని గార్లు నిర్వహిస్తున్న"హౌ గ్రీన్ హెల్త్ పార్క్" ను సందర్శించి అక్కడి ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పని తీరును తెలుసుకొనే ప్రయత్నం చేశాను. ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా కేంద్రాల వ్యవస్థ, మౌలిక వసతులు, వాటి పని తీరును తెలుసుకొనే సదవకాశం కలిగింది. ఆక్స్ పర్డ్ నుండి కోవెంట్రీ కు బస్సులో వెళ్ళి, అక్కడ నుండి లివర్ పూల్ కు డా.జి.లక్ష్మీనారాయణ గారితో కలిసి కారులో ప్రయాణం చేసిన సమయంలో ఆరోగ్య విధానం, స్థూల జాతీయోత్ఫత్తిలో ఆ దేశం వెచ్చిస్తున్న నిథుల నిష్పత్తి, తదితర కొంత సమాచారాన్ని ఆయన తెలియజేశారు. లండన్ లో ఉద్యోగం చేస్తున్న మరొక మిత్రుడు, తన జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నదని, ఆమెకు అందుతున్న ఉచిత(అత్యంత ఖరీదైన) వైద్య సహయాన్ని గురించి అతను వివరించాడు.

5. పిల్లల ఆరోగ్య పరిరక్షణ, పోషణ, విద్యకు సంబంధించిన అంశాలపై ఆ ప్రభుత్వ విధానాన్ని మరి కొందరు మిత్రులు తెలియజేశారు. పుట్టిన రోజు మొదలు 16 సం.ల వయస్సు వచ్చే వరకు ఏడాదికి 1500 పౌండ్లు చొప్పున బిడ్డ పేరుతో బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. ఐర్లండులో కూడా ఇదే రీతిలో పిల్లల పోషణకు నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానం అమలులో ఉన్నదని, ఇద్దరు పిల్లల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని విధిగా అందిస్తున్నదని, ఒకవేళ కవల పిల్లలు పుడితే మూడింతలు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నదని ఒక మిత్రుడు తెలియజేశాడు. పిల్లలను హింసిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందితే సత్వరం స్పందించి తల్లిదండ్రులపై చర్యలకు ఉపక్రమిస్తారని, ఒకసారి వారి పిల్లాడు పొరపాటున పోలీసుల అత్యవసర నెంబరుకు ఫోన్ చేస్తే పోలీసులు ఇంటికొచ్చారని, జరిగిన పొరపాటును తెలియజేసి, వివరణ ఇచ్చుకొన్నామని, ఈ తరహా ఘటన పునరావృతం కాకుండా చూసుకొమ్మని హెచ్చరించి వెళ్ళారని, ఒక మిత్రుడు చెప్పాడు.

6. యునైటెడ్ కింగ్డమ్(యు.కె.) ఒక సామ్రాజ్యవాద దేశం. సూర్యుడస్తమించని సామ్రాజ్యాన్ని ఒకనాడు ఏలిన దేశం. భారత దేశంతో సహా పలు ప్రపంచ దేశాలను అడ్డంగా దోచుకొని, సంపదను పోగేసుకొన్న దేశం. ఆ దేశానికి సంబంధించిన నాటి, నేటి చరిత్ర సామ్రాజ్యవాద దోపిడీ చరిత్రే. నేను దాని జోలికి వెళ్ళడం లేదు. ఆ దేశంలో అమలులో ఉన్న ఆరోగ్య వ్యవస్థ, అందులోని సానుకూలాంశాలేమైనా ఉన్నాయా! మన ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచు కోవడానికి దోహదపడే అంశాలేమైనా ఉన్నాయా! అన్న అంశం వరకే పరిమితమౌ తున్నాను.

7. సామాజిక, ఆర్థిక, లింగ, జాతి, కుల, మతపరమైన వివక్ష లేకుండా దేశ పౌరులందరికీ "ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు"గా గుర్తించాలని ప్రపంచ వ్యాపితంగా ఉద్యమాలు నడుస్తున్నాయి. మన దేశంలోనే కాదు అంతర్జాతీయ సమాజం కూడా ఈ దృక్పథంతోనే కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు.హెచ్.ఒ.) కూడా ఈ లక్ష్య సాధన కోసం ప్రపంచ దేశాలపై వత్తిడి చేస్తున్నది. సహస్రాబ్ధి లక్ష్యాలలో కూడా ఇదొక ప్రధానమైన లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి నిర్ధేశించింది. సమాజాభివృద్ధిలో పౌరుల ఆరోగ్యం ముఖ్యభూమిక పోషిస్తుందన్న అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు.

8. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా విడుదల చేసిన 2014 సం. గణాంకాల ప్రకారం మన నేతలు ఆదర్శంగా చూపెడుతున్న అభివృద్ధి చెందిన దేశాలు, అలాగే మన ఇరుగుపొరుగు దేశాల ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్ల ద్వారా వెచ్చించిన నిథులను పరిశీలిద్దాం. అమెరికా 21.3%, యు.కె. 16.5%, శ్రీలంక 11.2%, నేపాల్ 11.2%, చైనా 10.4% వెచ్చించాయి. ఆ దేశాల స్థూల జాతీయోత్ఫత్తిలో ఆరోగ్య రంగంపై చేసిన ప్రభుత్వ మరియు ప్రయివేటు మొత్తం వ్యయం వివరాలను పరిశీలిస్తే అమెరికా 8.3%, యు.కె. 7.6%, చైనా 3.1%, నేపాల్ 2.3%, శ్రీలంక 2% గా ఉన్నాయి. మన దేశంలో 2018 -19 వార్షిక బడ్జెట్ లో 5% కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. జిడిపిలో 1.15% మాత్రమే. 2025 నాటికి జిడిపిలో 2.5% కు తీసుకెళ్ళాలని జాతీయ ఆరోగ్య విధానం - 2017లో లక్ష్యంగా పెట్టుకొన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రస్తుతం ఖర్చు చేస్తున్న రెండు లక్షల కోట్ల నుండి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పెంచితే తప్ప మన ఆరోగ్య వ్యవస్థ మెరుగైన సేవలను అందించలేదని నిపుణులు చెబుతున్న మాట.

9. యునైటెడ్ కింగ్డమ్(యు.కె.)లో ఇంగ్లండు, నార్త్ ఐర్లండు, స్కాట్ లాండ్, వేల్స్ ప్రాంతాలు వేరు వేరుగా ఆరోగ్య వ్యవస్థలను నెలకొల్పుకొని, ప్రభుత్వ నిథులతో నిర్వహిస్తున్నాయి. జాతీయ ఆరోగ్య సేవ(ఎన్.హెచ్.యస్.) పేరిట ఇంగ్లండు ప్రభుత్వం 1948 నుండి ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నది. పౌరులందరి ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా బాధ్యతను జనరల్ ప్రాక్టీషనర్స్(జీ.పి.)లకు అప్పగించబడింది. జీ.పి.లకు నిర్ధేశించిన ప్రాంతంలో నివాసముంటున్న పౌరులందరూ, పసి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు తప్పని సరిగా పేర్లు నమోదు చేసుకోవాలి.  రోగులు తమకందే వైద్య సేవల నిమిత్తం ఫీజులు చెల్లించాల్సిన పని లేదు. ప్రభుత్వమే నెల వారిగా నిథులను సమకూర్చుతుంది. అందులో నర్సులు, వైద్య సిబ్బంది, టెక్నీషియన్స్, ఇతర సిబ్బంది వేతనాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు చేరి ఉంటాయి. అంతే కాదు జీ.పి.లు నిర్వహించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలకు కూడా అద్దె ప్రభుత్వమే చెల్లిస్తుంది.  పౌరులందరి ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా బాధ్యతను జనరల్ ప్రాక్టీషనర్స్(జి.పి.)లకు అప్పగించబడింది. ప్రాథమిక వైద్య సేవలన్నింటినీ జీ.పి. లే అందిస్తారు. వ్యాధిగ్రస్తులు (ప్రజాప్రతినిథులు, ప్రభుత్వ పెద్దలతో సహా) ముందు జీ.పి.ల వద్దకు వెళ్ళి ప్రాథమిక చికిత్స చేయించుకోవాలి. జబ్బుల తీవ్రతను బట్టీ అవసరమైతే ఆపై స్థాయి ఆసుపత్రులకు రోగులను 'రెపర్' చేస్తారు.

10. తీవ్రమైన జబ్బు చేసినప్పుడు అత్యవసర చికిత్స నిమిత్తం రోగులు నేరుగా 'రెపరల్' ఆసుపత్రులకు వెళ్ళి చేరినా, ఆ వెంటనే ఆ విషయాన్ని వారి సంబంధిత జీ.పి.కి విధిగా తెలియజేయాలి. జీ.పి.ల వద్ద నిక్షిప్తం చేయబడి ఉన్న పౌరుల ఆరోగ్యానికి సంబంధించిన పూర్వ సమాచారం, జన్మదినం, నివాసం, జీ.పి. వద్ద నమోదు సంఖ్య వగైరా వ్యక్తిగత వివరాలను సేకరించుకోవాలి. ఆధునిక, సాంకేతిక యుగంలో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండడం మూలంగా క్షణాల మీద సమాచార మార్పిడి చేసుకోగలుగు తున్నారు.

11. రోగులు జీ.పి.ల వద్ద అపాయింట్ మెంట్స్ తీసుకోవడం, చికిత్సకు సంబంధిన మందుల సమాచారాన్ని నేరుగా  మందుల దుకాణాలకు పంపడం లాంటి లావాదేవీలనన్నింటినీ కూడా ఇంటర్నెట్ ద్వారానే సాగిస్తున్నారు. తద్వారా మందుల చీటీల వ్రాతల్లో తప్పులు దొర్లడానికి అవకాశం ఉండదు. గంటల తరబడి ఆసుపత్రులు, మందుల షాపుల వద్ద వేచి ఉండే బాధ రోగులకు లేకుండా సాంకేతిక పరిజ్ణానాన్ని, పరికరాలను సద్వినియోగం చేసుకొంటున్నారు.

12. ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రంలో ఉన్న మౌలిక సదుపాయాలను చూసి ఆశ్చర్య పోయాను. పరిశుభ్రమైన, విశాలమైన వాతావరణం. వాహనాల పార్కింగ్ కు విధిగా స్థలం. డాక్టర్లకే కాదు, నర్సింగ్ స్టాఫ్ కు, టెక్నీషియన్స్ కు, వైద్య పరీక్షలకు వేరు వేరుగా గదులున్నాయి. ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రానికి అనుబంధంగా పని చేసే స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలు స్థానిక ప్రజలతో మమేకమై పని చేస్తుంటారు. స్థానిక పరిపాలనా సంస్థలకు ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రాలు జవాబుదారిగా ఉండాలి. ఆసుపత్రిలో ఒక సభా మందిరం ఉన్నది. నెల కొకసారి లేదా అవసరాన్ని బట్టి పక్షం రోజుల కొకసారి స్థానిక సంస్థల ప్రతినిథులు, ఆరోగ్య కార్యకర్తలతో కూడిన సంయుక్త సమావేశాలను నిర్వహిస్తూ, సేవా కేంద్రం పని విధానాన్ని సమీక్షిస్తూ ఉండాలి.  

13. ఇంగ్లండులో వైద్యానికి అయ్యే ఖర్చులో అత్యధిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్య రంగానికి 2017-18 బడ్జెటులో122.5 బిలియన్ పౌండ్స్ కేటాయించారు. వైద్య భీమా సంస్థలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.

14. మన దేశంలో ఉన్న దాదాపు 29,000 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, లక్షా యాభై వేలకుపైగా ఉపకేంద్రాలు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయి. చాలా వరకు ఒక డాక్టర్ తోనే నిర్వహించ బడుతున్నాయి. అనేక పి.హెచ్.సి.లలో డాక్టర్స్, నర్సులు, టెక్నీషియన్స్, ఉపకేంద్రాలలో పని చేసే ఎ.యన్.యం.లు కొరత తీవ్రంగా ఉన్నది.  మారుమూల గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో సిబ్బంది సమస్య, మందుల కొరత జఠిలంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న సిబ్బందిని వైద్యేతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. జనరల్ ఫిజీషియన్స్ కనుమరుగై పోయారు. మౌలిక సదుపాయాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. రోగుల సంతృప్తి నమోదుపై ద్యాసే లేదు. స్థానిక సంస్థల పరిథిలోకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీసుకురావాలని 73, 74 రాజ్యాంగ సవరణలలో పొందు పరచినా అమలుకు నోచుకోలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ఆరోగ్య సేవలను మెరుగుపరచ వచ్చు.

15. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యానికి బరోసా లభిస్తుంది. అనేక రోగాలు ప్రాథమిక దశలోనే నివారించబడతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులపై వత్తిడి తగ్గుతుంది. వైద్యాన్ని అంగడి సరుకుగా మార్చి సొమ్ము చేసుకొంటున్న ప్రయివేటు, కార్పోరేట్ ఆసుపత్రుల దోపిడీ బారి నుండి ప్రజలను కాపాడవచ్చు. కొన్ని అధ్యయనాలను బట్టి సామాన్య ప్రజలు, వారి ఆదాయంలో అత్యధిక భాగాన్ని వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారని వెల్లడయ్యింది. మన దేశ జనాభా 130 కోట్లు దాటింది. పర్యవసానంగా మౌలిక సమస్యలు జఠిలమౌతున్నాయి. ఆర్థికాభివృద్ధిలో ముఖ్యభూమిక పోషించే ఆరోగ్యాన్ని రాజ్యాంగ పరమైన ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించి, ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసి, ప్రజలకు బరోసా కల్పించాలి.

టి.లక్ష్మీనారాయణ

No comments:

Post a Comment