కేసీఆర్ మానసపుత్రిక "కాళేశ్వరం" భవిష్యత్తు?
సీడబ్ల్యూసీకి అస్సలు బాధ్యత లేదా!
1. గోదావరి నదిలో ప్రాణహిత ఉపనది కలిసిన తర్వాత దాదాపు 20 కి.మీ. దిగువన కాళేశ్వరం గ్రామం వద్ద కేసీఆర్ ప్రభుత్వం లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీని నిర్మించింది. అది సముద్ర మట్టానికి +100 మీ. ఎత్తులో ఉన్నది. ఈ బ్యారేజీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఆయువుపట్టు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్స్ దెబ్బతిని - కుంగడం, దాని పైభాగంలో అనుబంధంగా నిర్మించబడిన అన్నారం బ్యారేజీ నుండి ఊట రూపంలో నీరు క్రిందికి ప్రవహిస్తుండడంతో తీవ్ర ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. నేషనల్ డ్యాం సేఫ్టీ సంస్థ నివేదిక ప్రమాద హెచ్చరిక గంటలు మ్రోగిస్తున్నది. ఒకసారి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం యొక్క పూర్వరంగాన్ని గుర్తు చేసుకోవడం కూడా అవసరం.
2. దేశంలో గంగా నది తర్వాత రెండవ అతిపెద్ద నది గోదావరి. బచావత్ ట్రిబ్యునల్ 1980లో గోదావరి నదీ పరివాహక రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర నీటి పంపిణీ ఒప్పందాల ప్రాతిపదికన తీర్పు ఇచ్చింది. ఆ అవార్డు మేరకు 75% ప్రామాణికంగా నికర జలాలు నాటి ఆంధ్రప్రదేశ్ కు 1469 టియంసిలు దక్కాయి. తెలంగాణ భూభాగం సముద్ర మట్టానికి +100 నుండి +700 మీ. ఎత్తులో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై శ్రీరాం సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను నిర్మించింది. మిగిలిన లక్షలాది ఎకరాల భూములకు గోదావరి నదీ జలాలను అందించాలంటే ఎత్తిపోతల పథకాలే శరణ్యం. ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత దిగువన ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలన్న ప్రతిపాదన బచావత్ ట్రిబ్యునల్ కాలం నుండే ఉన్నది. గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరీ నదుల అనుసంధాన పథకాన్ని ఇచ్ఛంపల్లి నుండే చేపట్టాలన్న ప్రతిపాదన కూడా చర్చనీయాంశంగా ఉన్నది.
3. కేంద్ర జల సంఘం నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనంచేసి తుమ్మిడిహట్టి వద్ద 75% ప్రామాణికంగా 165 టీఎంసీ నికర జలాలు మరియు 63 టీఎంసీ మిగులు జలాలు లభిస్తాయని అంచనా వేసి, ఎగువ రాష్ట్రాల నుంచి ప్రవహించే 63 టీఎంసీల మిగులు జలాలు భవిష్యత్తులో లభించే అవకాశం ఉండకపోవచ్చని కూడా స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత - చేవెళ్ళ సుజల స్రవంతి పథకాన్ని 2007-08 సం.లో రూపొందించింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి, 160 టీఎంసీలను తరలించి, 16.40 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా నిర్దేశించుకొని, నిర్మాణం చేపట్టింది. దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వ్యయం కూడా చేసిందని చెప్పబడుతున్నది.
4. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈ ప్రాజెక్టుపై సంప్రదింపులు చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద +148 మీ. ఎత్తులో ప్రాజెక్టు నిర్మించుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. గోదావరి నదిపై 20 టియంసిల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయరు కూడా +148 మీ. ఎత్తులోనే ఉన్నది. అంటే, ఎల్లంపల్లి రిజర్వాయరు వరకు దాదాపు "గ్రావిటీ" మీదనే నీటిని తుమ్మిడిహెట్టి నుండి చేర్చవచ్చని కొందరు ఇంజనీర్లు, కొన్ని రాజకీయ పార్టీలు మరియు రైతు సంఘాలు కూడా సానుకూల అభిప్రాయాలు వెల్లడించాయి. ఇంతజరిగాక, కేసీఆర్ మనసు మార్చుకున్నారు.
5. తుమ్మిడిహెట్టి వద్ద అవసరమైన నీరు లభించదని, మేడిగడ్డ వద్ద అయితే 284 టీఎంసీలు లభిస్తాయని కేసీఅర్ ప్రభుత్వం అంచనా వేసింది. ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్టును రెండుగా విడగొట్టింది. ఒకటి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు. ప్రాణహిత నదిలో వైన్ గంగ, వార్ధా నదుల సంగమం అయ్యే తుమ్మిడిహెట్టి వద్ద ఒక బ్యారేజీ నిర్మించి, 20 టీఎంసీ నీటిని మళ్లించి, ఉమ్మడి అదిలాబాదు జిల్లాలో రెండు లక్షల ఎకరాల సాగుకు నీళ్ళందించడం లక్ష్యం. రెండవది, గోదావరి నదిలో ప్రాణహిత కలిసిన తర్వాత 20 కి.మీ. దిగువన కాళేశ్వరం గ్రామం సమీపంలో మరొక ఎత్తిపోతల పథకం నిర్మాణం. ఆ ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీని నిర్మించి, 195 టీఎంసీలను తరలించి, 18,25,700 ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టును "రీడిజైన్" చేశారు.
6. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుతోపాటు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు మొదటి దశ, రెండవ దశ మరియు వరద ప్రవాహ కాలువ, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల క్రింద ఉన్న 18,82,970 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నీటిని అందజేస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు. ప్రాణహిత - చేవెళ్ళ పథకంలో ప్రస్తావించిన మేరకు హైదరాబాదు మరియు సికింద్రాబాదు జంటనగరాలకు 30 టీఎంసీ మరియు గ్రామాలకు 10 టీఎంసీ త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 16 టిఎంసి సరఫరా చేస్తామని, తదనుగుణంగా 148 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ (+103 మీ.)తో సహా మొత్తం 20 జలాశయాల నిర్మాణానికి పూనుకొన్నారు.
7. మేడిగడ్డ ప్రధాన బ్యారేజీ నుంచి తరలించే 195 టీఎంసీలతోపాటు ఎల్లంపల్లి రిజర్వాయరు నుంచి మరో 20 టీఎంసీ మరియు 25 టీఎంసీల భూగర్భ జలాలను కలిపి మొత్తం 240 టీఎంసీలు వినియోగ లక్ష్యంగా ప్రాజెక్టు నివేదికను రూపొందించి కేంద్ర జల సంఘానికి పంపారు. 2018 జూన్ 14న జరిగిన సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ 136వ సమావేశం ఆమోదించిన నివేదిక మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు క్రింద వార్షిక సాగు భూమి 23,75,911 ఎకరాలు, వివిధ ప్రాజెక్టుల క్రింద స్థిరీకరణ 18,83,012 ఎకరాలు, మొత్తం 42,58,923 ఎకరాలుగా పేర్కొనబడింది. అలాగే, 4,627 మెగా వాట్స్ విద్యుత్తు అవసరమని, 2015 -16 ధరల ప్రకారం అంచనా వ్యయం రు.80,190 కోట్లుగా పేర్కొనబడింది. ప్రాజెక్టు నిర్మాణానికి లక్ష నుండి లక్షా ఇరవై ఐదు వేల కోట్ల వరకు అప్పుచేసిమరీ వ్యయం చేసిందన్న విమర్శలను నేడు కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది.
8. 2019 జూన్ 21న ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకమని కేసీఆర్ ప్రభుత్వం అభివర్ణించింది. మేడిగడ్డ బ్యారేజీ పంప్ హౌస్ నుండి మొదటి ఏడాది రోజుకు రెండు టియంసిల చొప్పున 90 రోజుల్లో 180 టియంసిలు, రెండవ ఏడాది నుంచి రోజుకు మూడు టియంసిల చొప్పున తరలిస్తామని చెప్పారు. అటుపై మరొక అడుగు ముందుకేసి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి జూన్ - నవంబరు మధ్య 360 టియంసిలు, నవంబరు - జూన్ మధ్య మరో 40 టియంసిలు, మొత్తం 400 టియంసిలు తరలిస్తామని చేసిన ప్రకటనలు విధితమే. సహజంగానే తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించాయి. కానీ, నేడు ఆ కలల ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
9. గడచిన నాలుగేళ్ళలో మేడిగడ్డ నుండి 154 టియంసిలు ఎత్తిపోస్తే, అందులో దాదాపు వంద టియంసిలు వినియోగంలోకి రాలేదట. దానికి కారణాలు స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి. గోదావరి నదిపై గొలుసుకట్టు నమూనాలో బ్యారేజీలను నిర్మించారు. మేడిగడ్డ, దాని పైభాగంలో అన్నారం, దాని పైభాగంలో సుందిళ్ళ, దాన్నుండి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయరులోకి నీటిని ఎత్తిపోయడం, ఈలోపు గోదావరి నదికి వరదరావడంతో మేడిగడ్డ బ్యారేజీ నుండి ఎత్తిపోసిన నీళ్ళు, వరద ప్రవాహంతో కలిసి ఎల్లంపల్లి రిజర్వాయరు నుండి మళ్ళీ క్రిందికి ప్రవహించి, మేడిగడ్డ మీదుగా సముద్రంలోకి వెళ్ళిపోవడం జరిగింది. "గోరుచుట్టపై రోకలి పోటు" అన్న సామెతగా, గత ఏడాది మేడిగడ్డ పంప్ హౌస్ గోదావరి వరద నీటిలో మునిగిపోయింది. తాజాగా అసలు ప్రాజెక్టు భవిష్యత్తునే ప్రశ్నార్థకంచేస్తూ మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు దెబ్బతిని, చీలికలొచ్చి, కుంగడం, అటుపై అన్నారం బ్యారేజీలోని నీరు ఊటగా క్రిందికి ప్రవహిస్తుండడం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నది.
10. శ్రీరాం సాగర్ జలాశయాన్ని 90 టియంసి నిల్వ సామర్థ్యంతోను, శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయరును 20 టియంసి నిల్వ సామర్థ్యంతోను, పటిష్టంగా నిర్మించబడ్డాయి. మేడిగడ్డ (16.17 టియంసి ), అన్నారం (11.9 టియంసి), సుందిళ్ళ (8.9 టియంసి) నిల్వ సామర్థ్యంతో కేసీఆర్ ప్రభుత్వం బ్యారేజీలుగా నిర్మించింది. ఐదు టియంసిల గరిష్ట నిల్వ సామర్థ్యంతో బ్యారేజీలను నిర్మించాల్సి ఉంటే అంతకుమించన నిల్వ సామర్థ్యంతో బ్యారేజీలను నిర్మించడం, సమగ్ర భూగర్భ పరిశోధనలు చేయకపోవడం సరిదిద్దుకోలేని తప్పులని ఇంజనీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.
11. గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీని మూడు టియంసిల కంటే తక్కువ నిల్వ సామర్థ్యంతోనే నిర్మించారు. కృష్ణా నదిపై మూడు టియంసిల నిల్వ సామర్థ్యంతోనే ప్రకాశం బ్యారేజీ నిర్మింబడింది. బ్రిటిష్ వలస ప్రభుత్వ కాలంలో నిర్మించబడిన ఆ బ్యారేజీలను పునర్నిర్మాణం చేసినప్పుడు కూడా వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచలేదన్న విషయం గమనార్హం.
12. ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్, నిర్మాణం అత్యంత లోపభూయిష్టంగా ఉన్నదని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధ్యయన కమిటీ నివేదిక ఇచ్చిందన్న వార్తలతో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమయ్యింది. కాళేశ్వరం భారీ సాగునీటి పారుదల ప్రాజెక్టు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్)ను లోపభూయిష్టంగా తెలంగాణ ప్రభుత్వం తయారుచేసి పంపితే కేంద్ర జల సంఘం(సీడబ్లూసీ) ఎలా అమోదించింది! కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఇతర వ్యవస్థలకు ఎలాంటి బాధ్యత, జవాబుదారీతనం లేదా! అన్న ప్రశ్నలు తలెత్తడం సహజమే కదా!
టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు
No comments:
Post a Comment