Saturday, December 9, 2023

దుర్భిక్షం - మిచౌంగ్ తుఫాను - ప్రభుత్వ అలసత్వం

 దుర్భిక్షం - మిచౌంగ్ తుఫాను - ప్రభుత్వ అలసత్వం 

రైతుల ఆక్రందన - సంక్షోభంలో వ్యవసాయం 


1. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వందల మండలాలకుపైగా దుర్భిక్షం కోరల్లో చిక్కుకున్నా, గ్రామాలకు గ్రామాలే వలసలు వెళుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని రైతులు , వ్యవసాయ కార్మికులు తీవ్రఆందోళన చెందుతున్న నేపథ్యంలో "మిచౌంగ్" తుఫాను విరుచుకుపడింది. చేతికందాల్సిన వరి పంట బుగ్గిపాలయ్యిందని, అరటి - బొప్పాయి - నిమ్మ, తదితర పండ్ల తోటలు ధ్వంసమైనాయని రైతులు ఆవేదనతో కృంగిపోతున్నారు. ఏడెనిమిది వేల కోట్ల రూపాయల వరకు నష్టం జరిగి ఉండవచ్చంటున్నారు. రైతుల పరిస్థితి "గోరు చుట్టపై రోకటి పోటన్న" నానుడిగా తయారయ్యింది.


2. బంగాళాఖాతంలో ప్రతి ఏడాది నవంబరు - డిసెంబరు మాసాల్లో వాయుగుండాలు సంభవిస్తాయని అందరికీ విధితమే. వాటి ప్రభావం ఒక్కోసారి తక్కువగా ఉండవచ్చు, ఒక్కోసారి తీవ్రంగా ఉండవచ్చు. 1977లో దివిసీమపై ఉప్పెన విరుచుకుపడ్డట్లు పడానూ వచ్చు. నేడు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వాలు అంచనా వేసి, ముందస్తు కార్యాచరణ అమలు చేయాలి. అలా చేస్తే, ప్రకృతి విపత్తు వల్ల సంభవించే నష్టాన్ని పూర్తిగా నిరోధించలేకపోయినా, కొంత మేరకు నివారించవచ్చు. 


3. డెల్టా ప్రాంతంలో జూన్ 15 నాటికే నారుమళ్లకు నీటిని విడుదలచేస్తే, నవంబరు చివరి నాటికి పంట చేతికొచ్చేస్తుంది. ఆ మేరకు ప్రణాళిక అమలు చేయాలన్న విధాన నిర్ణయానికి కట్టుబడి కార్యాచరణ అమలు చేయాల్సి ఉన్నది. ఈ సంవత్సరం కరవు వచ్చింది. కృష్ణా నది ఎగవ నుండి శ్రీశైలానికి, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద ప్రవాహం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని, అందుబాటులో ఉన్న పులిచింతల నీటిని మరియు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని తరలించి, ఆ మేరకు ప్రణాళికాబద్ధంగా సాగు నీటిని సరఫరా చేసి, నవంబరులోపే పంట చేతికొచ్చేలా కార్యాచరణను ప్రభుత్వం అమలు చేసి ఉండాల్సింది. అలా జరిగిందా!


4. తాజాగా "మిచౌంగ్" తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసాయి. చేతికొచ్చిన పంట నీట మునిగింది. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ప్రకృతి విపత్తు, దానికి ప్రభుత్వం ఏంచేస్తుందని, ఎవరైనా అమాయకంగా అనవచ్చు! ప్రభుత్వం చేయాల్సిన పనులు చేసిందా? అన్నదే ప్రశ్న. 


5. వర్షపు నీరు పంట పొలాల్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి వీలుగా డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, మరమ్మత్తులపై ప్రభుత్వం దృష్టి సారించిందా! నీటి ప్రవాహానికి అవరోధాలు లేకుండా పంట కాలువల వ్యవస్థను నిర్వహించాల్సిన బాధ్యత నీటి పారుదల శాఖదే కదా! అవసరమైన నిధులు కేటాయించి, ఆ పనులు చేశారా!


6. కృష్ణా డెల్టాలో ఆధునికీకరణకు ఒక పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. దశాబ్దాలు గడిచిపోయినా ఆ పథకంలోని నిర్మాణ పనులు పూర్తి కాకపోవడానికి ప్రభుత్వమే కదా! బాధ్యత వహించాలి.


7. తెనాలి ప్రాంతం నుండి ప్రొ.విశ్వనాథంగారు ఫోన్ చేశారు. ఆయన వ్యవసాయం చేస్తున్నారు. ఒక వైపున తుపాను ముంచుకొస్తున్నదని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తూనే, మరొక వైపు డెల్టా పంట కాలువలకు నీటిని వదిలిపెట్టారని, పర్యవసానంగా వర్షపు నీరు పొలాల్లో నిల్వ ఉండిపోయి, చేతికొచ్చిన పంట నీట మునిగిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయారని బాధపడ్డారు. దీనికి ఎవరు బాధ్యతవహించాలి? సాగునీటి పారుదల శాఖ బాధ్యతవహించదా!


8. ముఖ్యమంత్రిగానీ, జలవనరుల శాఖామంత్రిగానీ, "మిచౌంగ్" తుపాన్ హెచ్చరికల పూర్వరంగంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమై ముందస్తు కార్యాచరణను రూపొందించి, అమలు చేశారా! కృష్ణా డెల్టా ఆధునీకీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయకపోవడం, పంట కాలువల వ్యవస్థకు మరమ్మత్తులు చేసి - సక్రమంగా నిర్వహించక పోవడం, తుపాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తుందన్న అంచనా ఉన్నా కాలువలకు నీళ్ళు వదలడం, ప్రభుత్వ తప్పిదమా! లేదా, ప్రకృతి వైపరీత్యమా!


9. ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి? తడిసిన ధాన్యాన్ని రైతుల నుండి యుద్ధప్రాతిపదికన కొనాలి. బోనస్ ఇవ్వాలి. పెట్టుబడి రాయితీ ఇచ్చి ఆదుకోవాలి. దాదాపు 80%గా ఉన్న కౌలు రైతులకు సమన్యాయం అందించాలి. 


10. డెల్టా ప్రాంతంతోపాటు మెట్ట ప్రాంతాల్లోని రైతాంగం ఒకవైపు కరవు వల్ల, "మిచౌంగ్" తుపాన్ వల్ల నష్టపోయింది. అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో గాలుల వల్ల అరటి, బొప్పాయి, నిమ్మ, వగైరా నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి ఆర్థిక తోడ్పాటును అందజేసి, భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.


టి. లక్ష్మీనారాయణ 

No comments:

Post a Comment