Monday, July 11, 2011
జనానికి ‘చమురు’ కంపెనీలకు కాసులు!
చమురు కంపెనీలు నష్టాలలో కూరుకుపోయి సంక్షోభంలో ఉన్నాయని, అంతర్జాతీయ ధరలకనుగుణంగా మన దేశంలో చమురు ధరలను సర్దుబాటు చేసుకోకపోతే చమురు సరఫరాలో ఇబ్బంది ఏర్పడవచ్చని కేంద్ర ప్రభుత్వం నమ్మబలుకుతున్నది. ప్రజలతో వ్యాపారం, కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు. ఇదీ! ప్రభుత్వ దుష్టనీతి. జపించే మంత్రం మాత్రం ‘సంక్షేమ రాజ్యం’. చమురు ఉత్పత్తుల మార్కెట్‌పై నియంత్రణ కొనసాగించడం ద్వారా, ప్రత్యామ్నాయ ఇందన వనరులను అభివృద్ధి చేసి స్వయం పోషకత్వం సాధించడం ద్వారా సామాన్య ప్రజల ఇంధన కష్టాలను కొంతమేరనైనా తగ్గించడానికి కేంద్రం వెనువెంటనే పూనుకోకుంటే యూపీఏ-2 సర్కారుకు ఆయుక్షీణం తప్పదు.
పెట్రోల్ ధరలపై నియంత్రణను తొలగించిన విధంగానే డీజిల్ ధరలపై కూడా నియంత్రణను ఎత్తివేసి స్వేచ్ఛా మార్కెట్‌కు అనుమతించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వంపై తాజాగా తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నది. దీనికి ప్రభుత్వం తలొగ్గితే, ధరల పెరుగుదలతో ఇప్పటికే బతుకు పోరు చేస్తున్న పేద, మధ్య తరగతి ప్రజానీకానికి జీవనం పెను భారంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం తీరుతెన్నులను గమనిస్తే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనిపిస్తున్నది.
[Image]
చమురు కంపెనీలు నష్టాలలో కూరుకుపోయి సంక్షోభంలో ఉన్నాయని, అంతర్జాతీయ ధరలకనుగుణంగా మన దేశంలో చమురు ధరలను సర్దుబాటు చేసుకోకపోతే చమురు సరఫరాలో ఇబ్బంది ఏర్పడవచ్చని కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌మెయిల్ చేస్తున్నది. లేదా నమ్మబలుకుతున్నది. ఇందులో ఉన్న వాస్తవమెంత? అన్నదే అసలు సమస్య. నెల క్రితం పెట్రోల్, ఇప్పుడు డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంచడం నిజంగా ఆయిల్ కంపెనీల నష్టాలను పూడ్చడానికా? లేదా అధిక లాభాలను ఆర్జించిపెట్టటానికా? అన్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. చమురు కంపెనీల ఆదాయ, వ్యయాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు పెట్రోలియం రంగం నుండి సమకూరుతున్న ఆదాయానికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో నివేదికను రూపొందించి ప్రజల ముందుంచాలి. అప్పుడు అంకెల గారడీ, కనికట్టు మాయాజాలంతో వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారో లేదో బహిర్గతమవుతుంది.
దేశ ముడి చమురు అవసరాలలో 84 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నామని, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలను పెంచక తప్పడం లేదని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కి 110 డాలర్లు అంటే రూ.4,950. బ్యారెల్ అంటే దాదాపు 160 లీటర్లు. దాని ప్రకారం లీటరుకు (4,950/160 30.94) దాదాపు రూ.31లు పడుతుంది. చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్ అమ్ముతున్న ధర రూ.71ల పైన ఉన్నది. దీన్ని బట్టి రూ.40లు (56 శాతంపైగా) అదనంగా వినియోగదారుడిపై భారం మోపుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు రంగాన్ని అత్యంత ప్రధానమైన ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, చమురు అభివృద్ధి పన్ను, రహదారుల పన్ను, విద్య పన్ను, చమురు కంపెనీలు ఆర్జించిన లాభాలపై ఆదాయపు పన్ను, అలాగే రాయల్టీ ద్వారా 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ.71,767 కోట్లు ఆర్జించింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకపు పన్ను (వ్యాట్) విధించి ఖజానాలను నింపుకొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం చమురు ఉత్పత్తుల ధరలను పెంచినప్పుడల్లా మన రాష్ట్ర ప్రభుత్వానికి మహదానందం కలుగుతుంది. కారణం, పెట్రోల్‌పై దేశంలోకెల్లా అత్యధికంగా మన రాష్ట్రంలో 33 శాతం, అలాగే డీజిల్‌పై 22.5 శాతం, కిరోసిన్‌పై 4 శాతం, వంటగ్యాస్‌పై 4 శాతం అమ్మకం పన్నును విధించడం ద్వారా చెవులు పిండి ఖజానాను నింపుకొంటున్నారు.
దారిద్య్రరేఖ దిగువన ఉన్న వారికి నామమాత్రంగా కొంత మొత్తాన్ని సబ్సిడీగా నగదు బదిలీ పథకం ద్వారా అందించి, పెట్రోల్ లాగా వంట గ్యాస్ పైన ఉన్న నియంత్రణను కూడా తొలగించి రూ.750లకు పెంచాలనే దురాలో చనలో ఉన్నది కేంద్రం. తద్వారా చమురు రంగంలో సబ్సిడీల విధానానికి చరమగీతం పాడాలని భావిస్తున్నది. అలాగే, చమురు రంగంలో పనిచేస్తున్న కార్మికుల, ఉద్యోగుల సంఖ్యను పెద్ద ఎత్తున కుదించి, వేతనాలపై పెడుతున్న ఖర్చును తగ్గించుకొంటున్నారు. 2009, ఏప్రిల్ 1 నాటికి 1,38,973 మంది ఉంటే 2010, ఏప్రిల్ 1 నాటికి 1,29,988కి తగ్గించడం ద్వారా ఉన్న కార్మికులపై పని భారం పెంచారు.
కానీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా ఆర్జించిన సొమ్మెంతో వెల్లడించలేదు. ఉదాహరణకు 2006-07 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.23,320 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. ఈ రంగం నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్జించిన మొత్తం రూ.6,51,000 కోట్లు అని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఒక్క కేంద్ర ప్రభుత్వమే 2009-10లో రూ.71,767 కోట్లు వివిధ పన్నుల ద్వారా ఆర్జించి, కేవలం రూ.14,954 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. దీన్ని బట్టి ఇస్తున్న సబ్సిడీల మొత్తంతో, ప్రభుత్వాలు ఆర్జిస్తున్న మొత్తమెంతో తేటతేల్లమవుతున్నది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి. ఎలాంటి పన్నులను విధించకుండా లీటర్ పెట్రోల్‌ను కేవలం రూ.28లకే ప్రైవేట్ విమానయాన కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. ప్రజలతో లాభార్జనతో కూడిన వ్యాపారం, కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు. ఇదీ! ప్రభుత్వ దుష్టనీతి. జపించే మంత్రం మాత్రం ‘సంక్షేమ రాజ్యం’.
ముడి చమురుపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించి, 5 శాతం కస్టమ్స్ డ్యూటీని తొలగించడంతో పాటు పెట్రోల్, డీజిల్‌లపై ఉన్న 7.5 శాతం కస్టమ్స్ డ్యూటీని 2.5 శాతానికి తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వం రూ.26,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని, డీజిల్‌పై లీటర్‌కు రూ.4.60 పైసల చొప్పున ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని రూ.2లకు తగ్గించడంతో రూ.23,000 కోట్లు, మొత్తం రూ.49,000 కోట్ల ఆదాయాన్ని త్యాగం చేసినప్పటికీ ఇంకా రూ.1,22,000 కోట్లు చమురు కంపెనీలు నష్టపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం మొసలి కన్నీరు కార్చింది.
ఇది పచ్చి అబద్ధం. ఇవి నష్టాలు కావు. చమురు కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా కట్టుకొన్న ఆదాయంలో తరుగుదల (అండర్ రికవరీ) మాత్రమే. ఈ తరహా అండర్ రివకరీ మొత్తం 2009-10లో రూ.34,391 కోట్లుగా కిరోసిన్, వంటగ్యాస్ పద్దు కింద ఉన్నాయని మాత్రమే అధికారిక గణాంకాలే తెలియజేస్తున్నాయి. 2006-07 నుండి 2009-10 మధ్య నాలుగు సంవత్సరాల కాలంలో చమురు కంపెనీలు రూ.1,26,000 కోట్ల లాభాలను ఆర్జించాయని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ మాజీ మంత్రివర్యులు మురళీ దేవరా స్వయంగా ఒకానొక సందర్భంలో ప్రకటించారు. 2009-10లో ఆదాయపు పన్ను చెల్లింపు తరువాత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు రూ.37,319 కోట్లు నికరలాభాలను ఆర్జించాయని చమురు, సహజవాయువు మంత్రిత్వశాఖ నివేదిక ద్వారా వెల్లడవుతున్నది. ఇవి ప్రబల నిదర్శనాలు.
‘నందిని పందిని, పందిని నందిని చేసినట్లు’ అన్న సామెతగా కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీ మ్రాతం గతంలో పోగుబడ్డ రూ.1,80,000 కోట్లకు తోడు 2010-11 ఆర్థిక సంవత్సరంలోనే రూ.78,000 కోట్ల మేర చమురు కంపెనీలు నష్టపోయాయన్న దగాకోరు ప్రకటన చేశారు.
మన దేశ వినియోగావసరాలలో 25 నుండి 30 శాతం వరకు కృష్ణా - గోదావరి బేసిన్, ముంబై, అసోం, గుజరాత్, చెన్నై తదితర ప్రాంతాలలో చమురు ఉత్పత్తి జరుగుతున్నది. దానికి కూడా అంతర్జాతీయ చమురు ధరలకు సమానంగా ధరలు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. ఒకవైపున దేశీయంగా చమురు అవసరాలు పెరుగుతూ, తీవ్ర ఒత్తిడి ఉన్న పూర్వరంగం లోనే మన దేశం నుంచి రూ.1,44,037 కోట్ల విలువ చేసే 50,974 మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ చమురు కంపెనీలకు లెసైన్సులు మంజూరు చేసి, అధిక లాభాలు గడించుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది.
నేడు సహజవాయువు అందరూ కోరుకొనే సహజసిద్ధమైన ప్రాధాన్యతా ఇంధనంగా అవతరించింది. సహజవాయువు ఇంధన భద్రతను కూడా పెంచు తుంది. ఇది చౌక ధరకు లభించే ప్రత్యామ్నాయ ఇంధనం. కాలుష్యరహితం. నేడు దేశ ఇంధనావసరాలలో 10 శాతం మాత్రమే సహజవాయువు తీర్చగలుగు తున్నది. దాదాపు 25 శాతం ఉన్న ప్రపంచ సరాసరి వినియోగానికి మన దేశం చాలా దూరంలో ఉన్నది. మన దేశంలోనూ పుష్కలంగా సహజవాయువు నిక్షేపాలున్నాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బహిర్గతం చేసిన నివేదిక నుంచి గుణపాఠాలు నేర్చుకొని, రిలయన్స్, ఎస్సార్ ఆయిల్ లిమిటెడ్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అడ్డగోలుగా దోచిపెట్టే విధానాలకు స్వస్తి చెప్పి, సహజవాయువు నిక్షేపాలను ప్రణాళికాబద్దంగా వెలికితీసి, ప్రజా ప్రయోజ నాలే గీటురాయిగా, సక్రమంగా వినియోగించుకొనే రాజకీయ సంకల్పాన్ని ప్రభుత్వాలు ప్రదర్శిస్తే దేశ ఇంధన అవసరాలు గణనీయంగా తీరుతాయన డంలో ఎలాంటి సందేహం లేదు.
మన రాష్ట్రంలో దాదాపు ఒక కోటి ఇరవై ఏడున్నర లక్షల ఎల్‌పీజీ వినియోగదారులున్నారు. ఎల్‌పీజీకి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎల్‌పీజీ స్థానంలో పీఎన్‌జీ (పైప్ నేచురల్ గ్యాస్)ని వీలైనంత ఎక్కువగా వినియోగంలోకి తీసుకురాగలిగితే, చౌకగా వంట గ్యాస్‌ను వినియోగదారులకు అందించడమే కాకుండా ప్రభుత్వంపై సబ్సిడీల భారం గణనీయంగా తగ్గుతుంది. ఇంధన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గుతుంది.
అంతర్జాతీయ మార్కెట్‌ను తన చెప్పుచేతల్లో పెట్టుకొని, ఘరానా దోపిడీకి, అన్ని రకాల పెత్తనానికి బరితెగించిన అమెరికన్ సామ్రాజ్యవాదానికి కొంతైనా అడ్డుకట్ట వేయవచ్చు. 2009-10 సంవత్సరంలో 15.93 కోట్ల టన్నుల ముడి చమురు, 1.47 కోట్ల చమురు ఉత్పత్తుల దిగుమతుల కోసం రూ.4,18,475 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాం. దాంట్లో కొంతైనా ఆదా చేసుకోవచ్చును. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పెట్టుబడులు పెట్టడం ద్వారా చమురు రంగంలో ఒక మేర స్వయం పోషకత్వాన్ని సాధించే అవకాశమూ ఉంది.
ఇలాంటి చర్యలపైన దృష్టి సారించడానికి బదులు ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలను, పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం బరితెగించింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.45,000 కోట్లు సమకూర్చుకోవాలని నిర్దేశించుకొన్న వ్యూహంలో భాగంగానే చమురు కంపెనీలను మంచి లాభాలు గడిస్తున్న సంస్థలుగా చూపెట్టి అంగడిలో అమ్మకానికి పెడుతున్నారు. అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్ దిగ్గజాల కనుసన్నల్లో నడుస్తున్న స్టాక్ మార్కెట్‌లే ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తున్నాయి.
సరళీకృత ఆర్థిక విధానాలే ఈ దుష్పరిణామాలకు మూలం. చమురు ఉత్పత్తుల మార్కెట్‌పై నియంత్రణ కొనసాగించడం ద్వారా, ప్రత్యామ్నాయ ఇందన వనరులను అభివృద్ధి చేసి స్వయం పోషకత్వం సాధించడం ద్వారా సామాన్య ప్రజల ఇంధన కష్టాలను కొంతమేరనైనా తగ్గించడానికి కేంద్రం వెనువెంటనే పూనుకోకుంటే యూపీఏ-2 సర్కారుకు ఆయుక్షీణం తప్పదు.
Tuesday, June 28, 2011
మథనమే తప్ప మేధ లేదు
సైద్ధాంతిక, ఆర్థిక, రాజకీయాంశాలపై సద్విమర్శలను ఆహ్వానించాలి. విమర్శకులు నమ్రత, విజ్ఞత ప్రదర్శించాలి. తద్భిన్నంగా, సోషలిస్టు భావజాలం, కమ్యూనిస్టులపై విషం వెళ్ళగక్కడమే లక్ష్యంగా జాహ్నవి వ్యాసరచనా వ్యాసంగం సాగుతున్నది. ఆయనకున్నంత తెలివి తేటలు మరొకరికి లేకపోవచ్చు.
అందుకే కాబోలు సోషలిస్టు భావజాలాన్ని తాలిబాన్‌ల భావజాలంతో పోల్చ గలిగారు. పెద్ద సాహసమే చేయగలిగారు. 'వేల సంవత్సరాల క్రితం రాసిన మత గ్రంథాల ఆధారంగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, సమాజాన్ని మెడలు వంచి నడిపించాలని కోరుకునేవారు కొందరు; అలా తాలిబాన్‌ల ఆధిపత్యంలో నడిచిన అఫ్ఘానిస్తాన్ కడు పేదరికంతో, అవిద్యతో నరకప్రాయంగా తయారైన విషయం కళ్ళముందు కనిపించినా వారి మతస్వప్నం వీడదు.
అలాగే అహేతుకం, అశాస్త్రీయం అని తేలినా, తెలిసినా కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన సోషలిస్టు పవిత్ర గ్రంథాల ఆధారంగా కార్మిక వర్గంపేరిట నియంతృత్వాన్ని నడపాలని కోరుకునేవారు మరి కొందరు. ఇద్దరూ అధర్మవాదులే, ఇద్దరికీ ఆదర్శం నియంతృత్వమే. ఇద్దరి స్వభావం ఒక్కటే, కానీ ఇద్దరూ బద్ద శత్రువులు. ఇద్దరూ వ్యక్తి స్వేచ్ఛకు, వ్యక్తి వికాసానికి శాశ్వత శత్రువులు'- జాహ్నవి రాసిన ఈ మాటలను చదివాక ఆయనెంత కూపస్థ మండూకమో అనిపించింది.
'బురఖా ధరించడం మంచిదో, కాదో! వేసుకోకుండా ఉండే స్వేచ్ఛ, ఏ స్త్ర్రీకి ఉండదు. స్త్రీలు ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళకూడదు' అని చక్కగానే రాశారు. కానీ, ఆ స్వేచ్ఛను కల్పించే సోషలిస్టు భావజాలాన్ని, మత మౌఢ్యాన్ని పెంచి పోషించిన తాలిబాన్‌ల భావజాలానికి తేడా లేదని చెప్పడం ద్వారా తన మూర్ఖత్వాన్ని మాత్రం నగ్నంగా బయపెట్టుకున్నారని చెప్పక తప్పదు. సోషలిజాన్ని, మత మౌఢ్యాన్ని ఒకే గాటన కట్టిన మహా మేధావి జాహ్నవి.
అఫ్ఘాన్‌లో 'ఏప్రిల్ విప్లవం' ద్వారా కమ్యూనిస్టుల భాగస్వామ్యంతో అధికారంలోకి వచ్చిన నజీబుల్లా నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో యువతులుస్వేచ్ఛగా, బురఖాలు లేకుండా, వారికి నచ్చిన బట్టలు ధరించి, కళాశాలలకు వెళ్ళి విద్య నభ్యసించినడం నేను కళ్ళారా చూశాను. 1988 ఫిబ్రవరి 11-13 తేదీలలో కాబూల్‌లో 'విద్య, అభివృద్ధి, సమాజం-విద్యార్థుల దృక్పథం' అన్న అంశంపై ఆసియా ప్రాంత విద్యార్థుల సమాచార కేంద్రం, అఫ్ఘానిస్తాన్ ప్రజాతంత్ర యువజనసంఘం సంయుక్తంగా నిర్వహించిన ఒక సదస్సులో నేను పాల్గొన్నాను.
ఆ సందర్భంగా ఆ వ్యవస్థను పరిశీలించే అవకాశం నాకు లభించింది. విద్యా ఉద్యోగాలు, సమాజాభివృద్ధిలో పురుషులతో పోటీ పడాలనే తపనతో పాలీటెక్నిక్ మొదలుకొని అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థినులు విద్యనభ్యసించడం చూశాను. మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం వెలుగులో 'జాతీయ పునర్నిర్మాణ విధానాన్ని' రూపొందించుకొని అమలు చేయడం ద్వారా మంచి సత్ఫలితాలను సాధిస్తూ నజీబుల్లా ప్రభుత్వం ఆ ప్రగతికి బాటవేసింది. తరువాత అమెరికన్ సామ్రాజ్యవాదుల అండదండలతో నజీబుల్లా ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చిన తాలిబాన్‌లు అఫ్ఘాన్‌ను నేటి దుస్థితికి దిగజార్చారు.
ఈ నిప్పులాంటి నిజాన్ని గుర్తించగలిగిన చైతన్యం జాహ్నవికి లేనట్లుంది. 'మరి వ్యక్తి స్వేచ్ఛ ఏ పాటిదో ఊహించుకోగలం' అని నొక్కి వక్కాణించిన జాహ్నవికి ఏ తరహా స్వేచ్ఛ కావాలో! వ్యవస్థ కావాలో! నిర్ణయించుకునే స్వేచ్ఛ మాత్రం ఉంది. అంతే కాని సోషలిస్టు భావజాలంపై అవగాహనారాహిత్యంతో కూడిన అర్థరహితమైన కువిమర్శలకు పాల్పడడం తగనిపని.
అమానుషమైన దోపిడీకి, అసమానతలకు నిలయమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు ఊడిగం చేసే మనస్తత్వంతో జాహ్నవి ఉద్దేశపూర్వకంగానే సైద్ధాంతిక ఘర్షణకు తెరలేపుతున్నారు. తద్వారా సోషలిస్టు భావజాలానికి ప్రభావితులైన శ్రామిక ప్రజానీకంలో గందరగోళాన్ని, అపనమ్మకాన్ని కల్గించడానికి పూనుకున్నారు. ఆ దుర్భుద్దితోనే పుంఖానుపుంఖాలుగా అశాస్త్రీయమైన భావాలను తన వ్యాసాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
విజ్ఞానాధార వ్యవస్థ ప్రారంభదశలో నేడు మనం ఉన్నాం. మేధో సంపత్తిపై యాజమాన్య హక్కు, దాన్ని వినియోగించుకొనే సామర్థ్యంపైన ఆధారపడి సంపద సృష్టిలో దాని పాత్ర ఇనుమడిస్తుంది. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థలో భూమే ప్రధానమైన ఉత్పత్తి సాధనం. తరువాత పారిశ్రామిక ఆధారిత ఆర్థిక వ్యవస్థలో భూమితో పాటు పరిశ్రమలు ప్రధానమైన ఉత్పత్తి సాధనాలుగా ఉన్నాయి.
ఇప్పుడు పురోగమిస్తున్న విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థలో మేధో సంపత్తి ఉత్పత్తి శక్తుల అభివృద్ధిలో అంతర్భాగమే. భూమిపై హక్కులేని వ్యవసాయ కూలి ఎంత నైపుణ్యంతో ఆరుగాలం పనిచేసినా భూస్వామి కాలేడు. పారిశ్రామిక కార్మికుడు వృత్తి నైపుణ్యంతో జీవితకాలం ఒళ్లు గుల్ల చేసుకొని శ్రమించినా చిన్న పరిశ్రమకు కూడా యజమాని కాలేడు. మేధో కార్మికులు చేతల కంటే మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే తేడా. కాకపోతే భౌతిక శ్రమకు, మేధో శ్రమకు విలువ కట్టడంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు కన్పించవచ్చు.
'ఈ వ్యవస్థలో ఏ స్థాయి వారయినా యజమాని కావచ్చు. జీతానికి పనిచేసే వారైనా కావచ్చు. అది వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడిఉంటుందే తప్ప అసహాయత కాదు' అన్న గొప్ప సత్యాన్ని జాహ్నవి వెల్లడించారు. వివిధరంగాలలో చరిత్ర పుటలకెక్కిన ప్రఖ్యాత మేధావులు, నోబెల్ గ్రహీతలైన ప్రముఖ ఆర్థికవేత్తలు, మేధా సంపన్నులు కుబేరులు కాలేదు. మన ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఇద్దరు ఏ మేధా సంపత్తితో ప్రపంచ కుబేరులలో నాల్గవ, ఐదవ స్థానానికి ఎగబాకగలిగారో జాహ్నవి హేతుబద్ధంగా వివరించగలరా? 'రైతైనా, రాక్‌ఫెల్లరైనా ఉత్పత్తి చేయాలంటే మేధస్సు కావాలి, స్వలాభాపేక్ష ఉండాలి, చెయ్యనిచ్చే స్వేచ్ఛ ఉండాలి. వీటిలోఏదీ లేకున్నా, ఉత్పత్తి జరగదు' అని జాహ్నవి అన్నారు.
మరి ఇప్పుడు ఎవరికి ఏది అడ్డుగా ఉన్నదో కూడా సెలవీయండి. అలాగే రైతన్నలు వారికున్న మెళకులవలన్నిటినీ వినియోగించి పగలనక, రాత్రనక ఆరుగాలం పనిచేసినా వ్యవసాయం జూదంగా మారిపోవడంతో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఏ ఒక్క రైతు అయినా కుబేరుడుగా మారిన చరిత్ర ఉందా? కార్పొరేట్ అధిపతులు ఆత్మహత్యలు చేసుకోకపోగా జాతీయ బ్యాంకులను ముంచి తాము మాత్రం కుబేరులుగా అవతరిస్తున్నారు. దేశాన్ని, జనాన్నినిండా ముంచుతున్నారు. ఇందులో ఉన్న మేధో సంపన్నమైన మర్మమేంటో జాహ్నవికే బోధపడాలి.
'లేని వర్గాలను సృజించి, లేకి భాషలో వాళ్ళ మధ్య సంఘర్షణ, నిస్పృహల విషం చిలకరించే దోపిడీదారులు ఇంకెవరు?' అని తనకున్న 'లేకి'తనాన్ని, మానసిక వర్గస్వభావాన్ని, శ్రామిక వర్గ, కమ్యూనిస్టు బద్ధ వ్యతిరేకతను జాహ్నవి నిస్సిగ్గుగా వెల్లడించుకున్నారు. ఇందుకు ఆయనను అభినందించాల్సిందే. అందరికీ అన్నం పెట్టే రైతుకు తక్కువ వడ్డీకి పంటరుణాలు ఇచ్చినా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కాస్త రుణాలు మాఫీచేసినా, ఎరువులపైన, క్రిమిసంహారక మందులపైన, హైబ్రిడ్ విత్తనాలపైన ప్రభుత్వం రాయితీలు వగైరా సహాయం, సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని ఆదుకోవడానికి ఉచిత విద్యుత్తు లాంటి పథకాలను అమలు చేసినా ఆయనకు చిర్రెత్తుకొస్తుంది.
పేదరికం నిర్మూలనకు, ఆహార భద్రతకు, సామాజిక సంక్షేమానికి ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తే సహించలేరు. ఎప్పుడొస్తుందో తెలియని ఆహార భద్రతా చట్టానికి, రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకపోవడానికి లేని లింకు పెట్టి జాహ్నవి అసంబద్ధమైన అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదని 'డిమాండ్-సప్లయ్' సూత్రం ప్రకారం మార్కెట్ శక్తులే ధరలను నిర్ణయించుకొనే సంపూర్ణ స్వేచ్ఛ కావాలంటున్నారు.
సరళీకృత ఆర్థిక విధానాల పర్యవసానంగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో, ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేయడంతో హద్దు పద్దు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరల పెనుభారంతో సామాన్య ప్రజలు ఎలా బతకాలో దిక్కుతోచక ఘోరంగా జీవిత పోరు సాగిస్తున్నారు. జాహ్నవి ఇవేమీ పట్టించుకోకుండా మార్కెట్ శక్తులకు ఇంకా స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
కార్పొరేటు సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు రాయితీలను వార్షిక బడ్జెట్ల ద్వారా రాజమార్గంలోనే దోచిపెడుతున్నా జాహ్నవి పల్లెత్తు విమర్శచేయరు. ఆయన పెట్టుబడిదారీ విధానం పట్ల కనబరుస్తున్న స్వామి భక్తికిది ప్రబల నిదర్శనం. సోషలిస్టు భావజాలంపై దుమ్మెత్తి పోయడం, 'మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం' పై శ్రామికవర్గ ప్రజానీకంలో గందరగోళాన్ని సృష్టించడం, ప్రజానీకంలో కమ్యూనిస్టు వ్యతిరేక విషబీజాలను నాటడమే జాహ్నవి వృత్తిగా పెట్టుకున్నారు.
'మేధో మథనం' శీర్షికన ఆయన గత కొంతకాలంగా 'ఎవరి శ్రమ ఎవరు దోస్తున్నా రు?'; 'సోషలిజం మత్తు మందు కాదా?', 'విప్లవం ఒక ఉన్మాదం', 'ఒసామావాదం సశేషం', 'గెలిచిందెవరు?', 'వ్యర్థ సిద్ధాంతాలు', ధాన్యం-దైన్యం' వగైరా శీర్షికలతో వ్యాసపరంపర కొనసాగిస్తున్నారు. ఇలాంటి కరుడుగట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకులెందరో కాలగర్భంలో కలిసిపోయారు. మార్క్సిజం అజరామరమైనది. శ్రామికు ల మెదళ్ళకు పదును పెట్టి, వారి చేతుల్లో శక్తిమంతమైన ఆయుధమై, దోపిడీ వ్యవస్థకు సమాధి కడుతుంది. అదే సత్యం.
-టి.లక్ష్మీనారాయణ
భాతర కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు
Thursday, May 26, 2011
నేతలకు ఓటరు గుణపాఠం!
| | |
| నేతలకు ఓటరు గుణపాఠం! మే 26, 2011 సాక్షి దినపత్రిక | |
| | |
| | |
| | |
| | |
| | |
|
విద్యాహక్కు చట్టం - 2009 'అమలు'కు రాజకీయ దృఢసంకల్పం ఆవశ్యకం
Tue, 29 Jun 2010, విశాలాంధ్ర టి. టి.లక్ష్మీనారాయణ
మానవ వికాసానికి, సమాజాభివృద్దికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనం. మనిషికి చైత న్యంతోపాటు సత్‌ప్రవర్తన, సంస్కారం, నైతిక విలు వలు, నీతి నియమాలను ఉపదేశించడం ద్వారా సమగ్ర మానవుడిగా తీర్చిదిద్దగల శక్తి ఒక్క విద్యకే ఉన్నదని మేథావులు, తత్వవేత్తలు, విద్యావేత్తలెందరో నొక్కి వక్కాణించారు. విద్యా హక్కు మానవ హక్కుల్లో ప్రథమ శ్రేణిది. విద్యావ్యవస్థకు సంబందించి ఒక్కో దేశానికి ఒక్కో చరిత్ర ఉన్నది. ఆయా దేశాల్లోని సామాజిక, ఆర్ధిక ప్రగతికి అనుగుణంగానే విద్యా విధానాన్ని రూపొందించి, అమలు చేయబడుతుంది. దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించగల శక్తి ఆ వ్యవస్థకు ఉండదు. పర్యవసానంగా విద్యా వ్యవస్థ లక్ష్యం, సారాంశం, యంత్రాంగం అన్నింటినీ ఆయా చారిత్రక దశల్లో ఉన్న సామాజిక ఆర్ధిక చట్రమే నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ సామాజిక, ఆర్థికాభివృద్ధికి రూపురేఖలు దిద్దడం, ప్రభావితం చేయడం, మార్పు వైపున సమాజాన్ని ముందుకు నడిపించడంలో విద్య క్రియాశీల పాత్ర పోషిస్తుంది. విద్యాభివృద్ధి అన్ని రంగాలతోపాటు ముఖ్యంగా ఆర్థిక ప్రగతికి మార్గాన్ని సుగమం చేస్తుంది. మెరుగైన ఉత్పత్తి సాధనాల అన్వేషణ ద్వారా జాతి సంపద ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. దాని ఫలాలు మనలాంటి వ్యవస్థలో అందరికీ అందకపోవచ్చు. కారణం ఉత్పత్తి అయిన సంపద పంపిణీ ఆ నిర్థిష్ట కాలంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వర్గ స్వభావాన్ని బట్టి ఉంటుంది. సంపద పెరిగేకొద్దీ విద్యాభివృద్ధికి అవకాశాలు మెరుగు పడతాయి. విజ్ఞానాన్వేషణ పెరుగుతుంది. అందరికీ విద్యను అందించడం సాధ్యమవుతుంది. పర్యవ సానంగా బుద్దిజీవులు, శ్రమజీవుల నైపుణ్యం, సామర్ధ్యం పెరిగే కొద్దీ ఉత్పత్తి పెరుగుతుంది. తరతారాలుగా సముపార్జించుకొన్న విజ్ఞానంతో పాటు, అనుభవాలను జోడించి, నాణ్యమైన పరి శోధనలను కొనసాగించి నూతన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఆర్జిస్తూ సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో విద్య పునాదిరాయి పాత్ర పోషి స్తుంది. సమాజంలోని లోపాలను, సమస్యలను పసిగట్ట గల సంపూర్ణ మానవుని తీర్చిదిద్దగల శక్తి ఒక్క విద్యకే ఉన్నది. కులం, మతం, జాతి, ప్రాంతం, లింగ భేదం లేకుండా స్త్రీ, పురుషుల్లోని విజ్ఞాన వంతులు వ్యక్తులుగా, సమూహంగా, సమష్ఠిగా సామాజిక మార్పుకు, మానవీయ సమాజ నిర్మా ణానికి కావాలసిన చైతన్యాన్ని విద్య అందిస్తుంది. సమాజానికి, విద్యకు మధ్య ఉన్న అనుబంధం విడ దీయరానిదని గతి తర్కం ద్వారా బోధపడుతుంది. సమాజంలో విద్యకున్న ప్రాధాన్యత వర్ణనాతీతం. కానీ విద్య అందరికీ అందుబాటులో నేటివరకు లేదు. మన భారత సమాజంలో మానవుల మధ్య అంతరాలు, వివక్ష కొనసాగుతున్నది. అత్యధిక ప్రజానీకం విద్యకు నోచుకోకుండా ఈ సమాజం వెలివేసింది. నేడున్న దురదృష్టకర పరిస్థితిని గమనిస్తే అన్ని వస్తువుల్లాగే విద్యకూడా పూర్తి స్థాయిలో వినియోగవస్తువుగా బహిరంగ మార్కెట్‌లో నిస్సిగ్గుగా అమ్మబడుతున్నది. ఒకనాడు సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు, సమాజసేవలో అంతర్భాగంగా స్వచ్చంద సేవాసంస్థలు, వ్యక్తులు విద్యా సంస్థలను నెలకొల్పి, విద్యా వ్యాప్తికి అంకిత భావంతో పాటు పడ్డారు. మార్కెట్ ఆర్ధిక నీతి రాజ్యమేలుతున్న ఈనాడు లాభనష్టాల కొలబద్దతో విద్యా వ్యవస్థ నిర్వహణను కూడా బేరీజు వేసుకొనే హీనస్థితికి దిగజారాం.
ఈ పూర్వరంగంలో విద్యార్థిలోకం, సామాజిక వర్గాలు సాగించిన దశాబ్దాల పోరాటానికి పాక్షిక విజయం లభించింది. రాజ్యాంగ బద్దంగా విద్యను ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం చేయడం సామా జిక ప్రగతిలో నిస్సందేహంగా ఒక ముందడుగు. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఆరు దశాబ్దాల తరువాత గానీ ఈ హక్కు భావిభారత పౌరులైన బాల బాలికలకు దక్కలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 మొదలు పది సంవత్సరాల కాల వ్యవధిలో 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత, నిర్భంద ప్రాథమిక విద్యను అందించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 లోని ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. దశాబ్దం కాదు ఆరు దశాబ్దాలు గడచిపోయాయి. ఆదేశిక సూత్రాలకు ఆచరణ కరువైయింది. ఆ లక్ష్య సాధనలో ఘోరవైఫల్యం చెందాం. బడి గడప తొక్కని వారు, బడిలో అడుగుపెట్టి మధ్యలో మానేసిన పిల్లలు నిరక్షరాస్యులుగా, బాలకార్మికులుగా నికృష్ఠ మైన జీవితాలతో మగ్గి పోతున్నారు. అలా రెండు తరాలు గడచిపోయాయి. సామాజికంగా, ఆర్ధికంగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తూ నాగరిక ప్రపంచంలో దూసుకుపోతున్నా మని, ప్రపంచదేశాలతో పోటీపడుతున్నామని, ప్రపం చంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనని దేశాధినేతలు చంకలు చరుచుకొంటున్నారు. కాని ''అందరికి విద్య'' మాత్రం ''అందని ద్రాక్షపండు'' లాగే మిగిలిపోయింది. మానవ హక్కులు, ప్రజా స్వామ్య హక్కులు బడుగు బలహీన వర్గాలు, వారి పిల్లలలో అత్యధికులకు అందుబాటులోలేని స్థితి. పర్యవసానంగా ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. ''ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రైట్ నాట్ ఎ ప్రివిలేజ్ '' (విద్య ప్రత్యేక సౌకర్యం కాదు హక్కు), విద్యా హక్కును రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని దేశవ్యాపితంగా సమరశీల ఉద్యమాలెన్నో నిర్వహించబడ్డాయి. యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థల వత్తిడి పెరిగింది. ఈ పూర్వరంగంలో భారత ప్రభుత్వం సార్వత్రిక మరియు ఉచిత విద్యను ప్రాథ మిక హక్కుగా గుర్తించి రాజ్యాంగంలో పొందుపరచి 2010 ఏప్రిల్ 1 నుండి అమలులోకి తీసుకురావడం హర్షణీయం. ''ఇల్లు అలకగానే పండుగ అయి పోలేదు'' అన్న సామెతగా చట్టం తీసుకురాగానే పిల్లలందరికీ విద్య అందదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, స్త్రీ పురుషులకు సమానమైన ఆస్తి హక్కు చట్టం, వరకట్న నిషేధ చట్టం, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ మరియు నిషేధ చట్టం, బాలకార్మికుల నిషేధ చట్టం లాంటి సామాజిక ప్రగతికి దోహదపడే పలు అత్యంత ప్రాధాన్యత గల చట్టాలు చట్టుబండలుగా మారిపోయిన దుస్థితి గమనిస్తూనే ఉన్నాం. వీటి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. విద్యా హక్కు చట్టం-2009ని పూర్తిస్థాయిలో అమలుచేయడానికి పాలక వర్గాలకు దృఢమైన రాజకీయ సంకల్పం, దీక్షాదక్షతలు, నిబద్దత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. 2002 సవంత్సరంలో రాజ్యాంగానికి 86 వ సవరణ చేసి విద్యా హక్కును అమలులోకి తెస్తున్నామని చెప్పి అందులో పిల్లల తల్లిదండ్రులను, సంరక్షకులను బాధ్యులుగా చేసే నిబంధన చేర్చారు. తద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాయి.
నాటి నుంచి నేటి వరకు ఏడేళ్ళపాటు సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్ 21 ఎ మూడవభాగం, ఆర్టికల్ 45(3) ను సవరించి నూతన క్లాజ్ (కె) ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతలకు సంబందించిన ఆర్టికల్ క్రింద జతచేయడంద్వారా ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఇప్పుడు రాష్ట్రపతి రాజముద్రతో అమలులోకి వచ్చింది. పలు ప్రసవవేదనలతో రూపొందిన ఈ విద్యా హక్కు చట్టం అమలు నిస్సందేహంగా పెనుసవాలే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, పిల్లల సంరక్షకులు, మొత్తం సమాజం ఈ సవాలును స్వీకరించి సమర్థవంతంగా ఎదుర్కోవలసిన చారిత్రిక అవసరం ఎంతైనా ఉన్నది.
నిధుల సమస్య: చట్టాన్ని పార్లమెంటు ఆమో దించింది. కాని నిధుల కేటాయింపు అంశంపై నిర్ధిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించలేదు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యను పిల్లలందరికీ అందించే ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. దానికి అవసరమైన నిధులను వారే సమకూర్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక దుస్థితిని గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాలైతే అప్పుల ఊబిలో నిండా కూరుకుపోయి, వార్షిక బడ్జెట్ల కేటాయింపులకే భారీగా కోతలు పెడుతూ విశ్వసనీయతను కోల్పోయాయి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ధిక భారం మోపితే అసలుకే మోసం జరుగుతుంది. కేవలం 10% నిధులను వెచ్చించి కేంద్రప్రభుత్వం నుండి 90% ఆర్ధిక సహాయాన్ని పొందడానికి వీలైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లాంటి పథకాల అమలులో కూడా అస మర్థంగా వ్యవహరిస్తూ లబ్దిదారులకు ప్రయోజనం అందకుండా చేస్తున్నారు. ఈ చేదు అనుభవాలను పరిగణలోనికి తీసుకొంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సామాజిక బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించ లేవనడం ముమ్మాటికీ నిజం. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, బీహార్ లాంటి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వమే నిధుల కేటాయింపు బాధ్యతను తీసుకోవాలని బహిరంగంగానే కోరారు. కేంద్ర ప్రభుత్వం 55:45 నిష్ఫత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం 90:10 నిష్పత్తిలో నిధుల సహాయం చేస్తామని ప్రకటించింది.
సాకారం కాని ‘ప్రపంచ’ స్వప్నం
‘సహస్రాబ్ది లక్ష్య సాధన’ ఎజెండా స్థితి-గతి
విశ్లేషణ...
అభివృద్ధి చెందుతున్న దేశాలలో (భారతదేశంతో సహా) పేదరికానికి సంబంధించి గణాంకాలతో కూడిన తాజా అంచనాల నివేదికను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అది తీవ్ర ఆందోళన కలిగించడమే కాదు, మన దేశాధినేతలు అనుసరిస్తున్న విధానాల డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. సహస్రాబ్ది లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి నాడు ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలను తారుమారు చేస్తూ దారిద్య్రంలో మగ్గిపోతున్న ప్రజల సంఖ్య అధికంగా ఉన్నదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా పేదల సంఖ్య గణనీయంగా తగ్గిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు ఈ నివేదిక ఒక చెంపపెట్టు.
ఐక్యరాజ్య సమితిలో సామాజిక స్పృహ వికసిం చింది. ప్రపంచ దేశాధినేతలంతా ఒకే వేదికపై గుమి గూడారు. అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలలో బలంగా వేళ్లూనుకుని ఉన్న కటిక దారిద్య్రాన్ని, ఆకలి బాధలను కనీసం సగానికన్నా తగ్గిస్తామని శపథం చేశారు. సార్వజనీన ప్రాథమిక విద్య, లింగ వివక్ష లేని సమానత్వం, మహిళా సాధికారత, శిశుమరణాల తగ్గింపు, తల్లుల ఆరోగ్య పరిరక్షణ, హెచ్‌ఐవీ / ఎయిడ్స్ మలేరియా తదితర భయానక అంటువ్యాధులను నిరోధించడం, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి ధ్యేయంగా అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రతినబూనారు.
ఈ మేరకు 2000 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 179 సభ్యదేశాల ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అన్ని వర్గాల ప్రజలను మానవాభివృద్ది ప్రక్రియలో భాగస్వాములను చేయడం దీని ఉద్దేశం. 2015 నాటికి ఈ లక్ష్యాలను సాధిస్తామని గడువు విధించుకున్నారు. ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగిడిన సందర్భంగా నిర్దేశించుకున్న ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధన’లో ప్రగతిని సమీక్షించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 20-22 తేదీల్లో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఒక సదస్సు నిర్వహించింది. ప్రతిజ్ఞ చేసి దశాబ్దం గడచిపోయింది. ఇహ! మిగిలింది ఐదు సంవత్సరాలు మాత్రమే. లక్ష్యాలను అసలు చేరుకోగలమా? అన్నది శేష ప్రశ్న.
ఈ ఆశావహదృక్పథాన్ని 2007-08 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పునా దులనే కుదిపేసిన ఆర్థిక సంక్షోభం నీరు గార్చింది. సంక్షోభ దుష్పరిణామాల పర్యవసానంగా ప్రపంచ ప్రజానీకం కష్టాల ఊబిలో కూరుకుపోయారు. వివిధ రూపాలలో దాని ప్రభావం నేటికీ కొనసాగుతున్నది. మన దేశంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. నిరుద్యోగుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఆహార సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పేద, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. ఆహార ద్రవ్యోల్బణం 17.9 శాతానికి ఎగబాకి ఆహార భద్రతకు పెనుసవాలు విసిరింది. రెండంకెల ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసి ఒక అంకెకు దించుతామని ప్రభుత్వాధినేతలు బీరాలు పలికారు.
కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించి హనుమంతుని తోకలా పెరుగుతూ అది ప్రస్తుతం 15.9 శాతం చేరింది. దాన్ని అదుపు చేసే శక్తి లేక, పోయిన ఏడాది వర్షాలు సరిగా పడలేదని, కరువు కాటకాలు సంభవించాయని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు మూలంగా పేదల కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్‌లో ‘డిమాండ్-సప్లయ్’ సూత్రాన్ననుసరించి ఆహార వస్తువుల ధరలు పెరిగాయని నమ్మబలుకుతూ ప్రభుత్వంలోని పెద్దలు తప్పించుకుంటున్నారు. అసలు కారణాల జోలికి పోవడం లేదు. ఐక్యరాజ్యసమితి తాజా అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచంలో 20 కోట్ల మందికి ఆహార భద్రత కొరవడింది. మహిళలు, ఐదేళ్లలోపు పిల్లలలో పౌష్టికాహార లోపాల సమస్య పెరుగు తున్నది. 47 శాతం మంది పిల్లలు తక్కువ బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఉదాహరణకు మన రాష్ట్రంలో స్ర్తీ శిశు సంక్షేమశాఖ బహిర్గతం చేసిన సమాచారం మేరకు 50.94 లక్షల మంది పిల్లల బరువు చూస్తే వారిలో 24 లక్షల మంది పోషకాహార లోపాలవల్ల తక్కువ బరువు కలిగివున్నారని తేలింది.
ఈ పూర్వరంగంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలలో (భారతదేశంతో సహా) పేదరికానికి సంబంధించి గణాంకాలతో కూడిన తాజా అంచనాల నివేదికను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అది తీవ్ర ఆందోళన కలిగించడమే కాదు, మన దేశాధినేతలు అనుసరిస్తున్న విధానాల డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. సహస్రాబ్ది లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి నాడు ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలను తారుమారు చేస్తూ దారిద్య్రంలో మగ్గిపోతున్న ప్రజల సంఖ్య అధికంగా ఉన్నదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా పేదల సంఖ్య గణనీయంగా తగ్గిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు ఈ నివేదిక ఒక చెంపపెట్టు. ఒక్క 2009 సంవత్సరంలోనే అదనంగా 5.3 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు చేరుకున్నారని పేర్కొంది. ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధన’ తిరోగమన దిశలో సాగుతున్నదన డానికి ఇది ఒక ప్రబల నిదర్శనంగా ఉదహరించింది. ఈ నివేదికను 2005లో ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా రూపొందించారు.
నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూఅదుపులేకుండా పెరగడంతో పేద ప్రజల కొనుగోలు శక్తి ఇప్పుడు ఇంకా క్షీణించింది. మరొక వైపున పేదరికాన్ని అంచనా వేయడానికి ఉపయోగి స్తున్న కొలమానాలపై కూడా భిన్నాభిప్రాయా లున్నాయి. ఒక అమెరికన్ డాలర్ అంటే రూ. 46ల దినసరి ఆదాయానికి కింద ఉన్న వారిని పేదలుగా గుర్తిస్తున్నారు. తిండి, గుడ్డ, ఇల్లే కాదు, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, రక్షిత మంచినీరు, మౌలిక వసతులు వగైరా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని మానవహక్కులుగా నాగరిక సమాజం, న్యాయవ్యవస్థ అంగీకరించాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1990వ సంవత్సరంలో 37.5 మంది దారిద్య్రరేఖ కింద జీవిస్తున్నారని, ఈ సంఖ్యను 2015 నాటికి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 18.75 శాతానికి తగ్గిస్తామని, తదనుగుణంగా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని 2006 ఫిబ్రవరిలో ప్రభుత్వం విధాన ప్రకటన చేసింది. 2009-10 ఆర్థిక సర్వేలో పొందుపరిచిన మేరకు 2004-05 ఆర్థిక సంవత్సరం లో గ్రామీణ ప్రాంతాల్లో 28.3 శాతం పట్టణ ప్రాంతాలలో 25.7 శాతం, మొత్తం దేశంలో సరాసరిన 27.5 శాతం దరిద్ర నారాయణలున్నారని ప్రణాళికా సంఘం అంచనా వేసింది.
విశ్వసనీయత ఉన్న ఇతర సంస్థల అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 41.8 శాతం, పట్టణ ప్రాంతాలలో 37.2 శాతం, సరాసరిన 39.5 శాతం ఉన్నారని కూడా ఆర్థిక సర్వేలోనే పేర్కొన్నారు.
ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు దక్కేవిధంగా విధానాలను రూపొందించి అమలు చేస్తున్నామని, తద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడానికి మన దేశం కృషి చేస్తున్నదని విదేశాంగ శాఖామా త్యులు ఎస్.ఎం.కృష్ణ ఐక్యరాజ్యసమితి సదస్సులో సెలవిచ్చారు. ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం నుండి బయటపడ్డామని, ఆర్థిక వృద్ధిరేటు ఆశించిన దానికన్నా వేగంగా పెరుగుతున్నదని, జూన్ నెలతో ముగిసిన రెండవ త్రైమాసికాంతానికి 8.8గా నమోదయిందని ఆర్థిక శాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల సూచిక మేరకు జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ. 61,64,178 కోట్లుగా ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 2009 డిసెంబర్ నాటికి 284 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. జాతీయ తలసరి ఆదాయం రూ. 43,749కు పెరిగింది. ఎంత ఎక్కువగా ఆర్థికాభివృద్ధి సాధిస్తే అంత ఎక్కువగా సామాజికాభివృద్ధికి నిధులు లభ్యమవుతాయని ప్రజలు కలలుగంటారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజానీకానికి సమపాళ్లలో పంపిణీ జరగాలి. మరీ ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలకు వారి వాటా వారికి చేరాలి. అప్పుడే దారిద్య్ర నిర్మూలనా లక్ష్యం నెరవేరుతుంది.
సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలలో మొదటి సమస్య అయిన దారిద్య్ర నిర్మూలన నిరాశాజనకంగా ఉన్నది. రెండవది- సార్వజనీన ప్రాథమిక విద్య. చిన్నారులను 100 శాతం బడిలో చేర్పించాలి. బడిమానేసే పిల్లల సంఖ్యను పూర్తిగా నిరోధించాలి. 2007 సంవత్సర గణాంకాలను పరిశీలిస్తే 15 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు ఉన్న వయోజనులలో అక్షరాస్యత 66 శాతం. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల నమోదు 61 శాతంగా ఉన్నది. నిష్ర్కమించేవారు దాదాపు 35 శాతం ఉన్నారు. కొన్ని పరిమితులున్నా విద్యాహక్కు చట్టాన్ని తీసుకురావడం నిస్సందేహంగా ముందడుగే. మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత, ప్రైవేట్ పాఠశాలల్లో సీట్ల కేటాయింపు, నిర్దేశిత పరిధిలో పాఠశాలలు వగైరా సంక్లిష్ట సమస్యలను పరిష్కారం లభిస్తేనే చట్టంవల్ల ప్రయోజనం చేకూరు తుంది. మూడవది- ఐదు సంవత్సరాలలోపు శిశు మరణాల నిష్పత్తిని వెయ్యి జననాలకు కనీసం 42కు తగ్గించడం. కానీ ఆడ శిశువుల్లో 55, మగశిశువుల్లో 52, సరాసరి 53 మరణాలు సంభవిస్తున్నాయి. నాలుగవది- ప్రసూతి మరణాలను లక్ష జననాలకు 109కి తగ్గించడం. 2004-06 నాటికి ఇది 354కు మాత్రమే తగ్గింది.
ఐదవది లింగ సమానత్వం. మహిళా సాధికారత సాధనలో అడుగు ముందుకుపడటం లేదు. చట్ట సభల్లో మూడవవంతు రిజర్వేషన్ల కోసం మహిళా లోకం ఉద్యమాలు చేస్తున్నది. ముసాయిదా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇదిగో అదిగో అని ఊరిస్తున్నారు తప్ప, వ్యతిరేకించేవాళ్ల నిజస్వరూపాన్ని ఎండగట్టి, బిల్లుకు ఆమోదాన్ని పొందలేకపోతున్నారు.
ఆరవది హెచ్‌ఐవీ / ఎయిడ్స్ రోగుల సమస్య. ప్రపంచ వ్యాప్తంగా 2008 డిసెంబర్ నాటికి 3.34 కోట్ల మంది హెచ్‌ఐవీ పీడితులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. వీరిలో 15 సంవత్సరాల లోపు పిల్లలు 21 లక్షల మంది ఉన్నారు. ఈ వ్యాధివల్ల మరణించిన 20 లక్షల మందిలో దాదాపు మూడు లక్షల మంది పిల్లలే. 2006 నాటికి మన దేశంలో 25 లక్షలకు పైగా ఉన్నారని జాతీయ ఎయిడ్స్ నిరోధక సంస్థ అంచనా వేసింది. అసంఘటిత కార్మికులు అత్యధికంగా ఈ వ్యాధికి బలైపోతున్నారు. మన రాష్ట్రంలో విషజ్వరాల బారినపడి మరణిస్తున్న గిరిజనులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవు తున్నది. ఏడవది- పర్యావరణ పరిరక్షణ అంశం. నేడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా తయా రైంది. మొత్తం భూమి విస్తీర్ణంలో 20.64 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అటవీ సంపదను, సహజ వనరులను రక్షించుకుంటూ, కాలుష్యాన్ని అరికట్టే చర్యలను పకడ్బందీగా అమలు చేయాలి, చేసి పచ్చదనాన్ని కాపాడుకోకపోతే ఆహార భద్రతకు పెను ముప్పు వాటిల్లుతుంది.
ఎనిమిది- నిధులకు సంబంధించిన అంశం. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ దేశాల భాగస్వామ్యంలో అంతర్భాగంగా అభివృద్ధి చెందిన దేశాలు వారి స్థూల జాతీయోత్ప త్తిలో 0.7 శాతం నిధులను అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలను ఆర్థిక సహాయంగా అందిస్తా మని చేసిన వాగ్దానాన్ని ఐదు దేశాలు మాత్రమే పాక్షికంగా అమలు చేశాయి. రుణ భారాలతో పీకల్లోతు కష్టాలలో ఉన్న దేశాలకు ఈ లక్ష్యాలను చేరుకోవడం అందుకే దుర్లభమవుతున్నది.
అభివృద్ధి, సామాజిక న్యాయం, శాంతియుత సహజీవనం, స్థిరమైన ఆర్థిక, సామాజికాభివృద్ధి, అధిక ఉత్పాదకత సాధించాలన్నా, విద్య, ఆరోగ్యం, ఆవాసం వగైరా మానవహక్కులు అందరూ సంపూర్ణంగా అనుభవించాలన్నా ముందు షరతు దారిద్య్రాన్ని నిర్మూలించాలి. ప్రజల నాణ్యమైన జీవన ప్రమాణాల ప్రాతిపదికగానే ఏ దేశమైనా అభివృద్ధి చెందిందా? లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనే ధ్యేయంగా కార్యాచరణకు మన దేశం పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
Wednesday, April 20, 2011
అవినీతిని అరికడితేనే అభివృద్ధి!
అవినీతిని అరికడితేనే అభివృద్ధి!
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే నేతృత్వంలో సాగుతున్న అవినీతి వ్యతిరేక పోరాటం జాతి దృష్టిని ఆకర్షించి అనూహ్యమైన మద్దతును సాధించడం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. అధికార పీఠంపై ఉన్న పెద్దలు ఆగమేఘాలపై కదిలి లోక్‌పాల్ బిల్లును రూపొందించడానికి పదిమందితో కూడిన అధికార, అనధికార సభ్యులతో కమిటీని నియమిస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వం మెడలు వంచగలిగామని ఉద్యమకారుల్లోనూ, దేశ నలుమూలలా హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. ప్రజాశక్తి ముందు పాలకులు బలాదూర్ అన్న భావన సర్వత్రా నెలకొన్నది. ఇది శుభపరిణామం. పోరాటాలతోనే ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసం సామాన్య ప్రజానీకంలో కూడా కలిగింది. అవినీతిపై తొలి విజయం సాధించా మని, ‘‘జన్ లోక్‌పాల్’’ బిల్లును యూపీఏ-2 ప్రభుత్వం చచ్చినట్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయిస్తుందని, అవినీతి అంతానికి రోజులు దగ్గర పడ్డా యని భ్రమించేవారు ఎవరైనా ఉంటే ఉండవచ్చు. కానీ, ఇది బలంగా వేళ్లూనుకొని పాతుకుపోయి ఉన్న దీర్ఘకాలిక సమస్య. అయితే, విస్తృతస్థాయి చర్చకు, కార్యాచరణకు మాత్రం ఈ ఆందోళన అనుమానం లేకుండా తెరలేపింది. ప్రజల ఎజెండాగా దేశం ముందుకు వచ్చింది.
‘‘మాయల పకీరు ప్రాణం సప్తసముద్రాల ఆవల ఉన్న మర్రిచెట్టు తొరల్రో దాగి ఉన్న చిలకలో ఉందన్న’’ చందంగా అవినీతి మూలాలు ఈ వ్యవస్థలోనే ఉన్నాయి.
దోపిడీకి మూలం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ. చట్టబద్ధ దోపిడీని ‘అవినీతి’గా నామకరణం చేసి, దానికి వ్యతి రేకంగా పోరాడుతున్నాం. లోపభూయిష్టమైన వ్యవస్థలో మౌలిక మార్పుల కోసం ఉద్యమిస్తే అది యావత్తు మాన వాళిని దోపిడీ నుండి విముక్తి చేస్తుంది. అవినీతిని పెంచి పోషిస్తున్న రాజకీయ వ్యవస్థను ప్రజలు చీదరించుకుం టున్నారు. అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించే చట్టాలు కావాలనే ప్రగాఢమైన వాంఛ వారిలో ఉన్నది. అందుకే మచ్చలేని గాంధేయవాది అన్నా నిజాయితీగా, అహింసా పద్ధతుల్లో పోరాటానికి నడుంకడితే అందరూ మద్దతు పలకడానికి ‘క్యూ’కట్టారు. వివిధ రంగాల ప్రముఖులు, సామాన్య ప్రజలు, బుద్ధి జీవులు, సమాజం ఉన్నతంగా ఉండాలనే ఆకాంక్ష కలిగిన విద్యార్థి, యువ జనుల నుండి కార్పొరేట్ సంస్థల పెద్దలదాకా మద్దతు పలికారు.
కానీ... నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలలో పని చేస్తూ, సమాజానికి నిస్వార్థ సేవలు అందిస్తున్న వారిని భాగస్వాములను చేయకపోవడం ఈ ఉద్యమం బలహీనత. రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఉద్య మాన్ని నిర్మించాలనడం సమంజసం. కానీ సమాజాన్ని నియంత్రించే రాజకీయాలనే దూరంగా పెట్టాలన్న ఆలోచన సత్ఫలితాలను ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను మాత్రమే రూపొందించగలదు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు పొందగలిగినప్పుడు మాత్రమే ఆ బిల్లు పార్ల మెంట్ ఉభయ సభల్లో ఆమోదంపొంది చట్టంగా రూపొం ది ప్రజల చేతుల్లో ఆయుధంగా మారుతుంది.
అభివృద్ధికి ఆగర్భ శత్రువు
ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి అవినీతి అతి పెద్ద అవ రోధం. అభివృద్ధి ముసుగులో అవినీతిని ప్రోత్సహిస్తు న్నది, వటవృక్షంలా పెంచి పోషిస్తున్నది, పాలకుల విధానాలే. నీతికి, నిజాయితీకి మారుపేరుగా పేరొందిన మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వాస్తవానికి అవినీతిని పెంచి పోషిస్తున్న నయా ఉదారవాద సరళీకృత ఆర్థిక విధానాల రూపశిల్పి. 2జీ స్పెక్ట్రం కుంభకోణం ద్వారా లక్షా డెబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాయల జాతి సంపదను కొల్లగొడితే, సంకీర్ణ రాజకీయాల వల్ల రాజీపడి, నిస్సహాయుడిగా మిగిలిపోయానని నిస్సిగ్గుగా బహిరంగ ప్రకటన చేసిన దీక్షాదక్షుడు. అవినీతిని పెంచి పోషిస్తున్న అలాంటి ప్రభుత్వ పెద్దలు అన్నా దీక్షకు మాత్రం తక్షణం స్పందించారు. దీనికి ప్రధానంగా రెండు మూడు కార ణాలు కనిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత వేదికయిన పార్ల మెంటులో ప్రతిపక్షాల ఆందోళనను లెక్క చేయకుండా, బాధ్యతారహితంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సానుకూలంగా ముందుకు రావడానికి గల కారణం అయిదు రాష్ట్రాలలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలే. అన్నా దీక్షతో అవినీతి వ్యతిరేక పోరాటం మరింత విస్తరించి, బలపడితే రాజకీయంగా తీవ్ర నష్టం జరిగి, ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఘోరపరాజం చవిచూడాల్సి వస్తుందని భయపడ్డారు. ఉద్యమకారుల డిమాండ్లను సూత్రప్రాయంగా అంగీక రించడం ద్వారా ఉద్యమ ఉధృతికి అడ్డుకట్ట వేయ వచ్చు. అవినీతికి మేమూ వ్యతిరేకమే. ఇదిగో, లోక్ పాల్ బిల్లును తీసుకు రాబోతున్నామనే సంకేతాన్ని వెల్లడించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రస్తుతానికి గండం గడిస్తే, తరువాత సంగతి చూద్దాం! అపరచాణక్యుడు ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ పని చేస్తుంది కాబట్టి ‘జన్ లోక్‌పాల్’ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించడం, దానిపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించి, ఆమోదించడం అంత సులభం కాదనే భరోసా ఉండవచ్చు. పార్లమెంటు పొందికపై వారికి పూర్తి అవగాహన ఉన్నది. అభివృద్ధికి నమూ నాగా పెరిగిపోతున్న కుబేరులు, అపర కుబేరులు, కార్పొరేట్ సంస్థల అక్రమ సంపాదనకు కాపలా కుక్కలుగా పనిచేస్తున్న వారు అక్కడున్నారు. ఎన్నికల్లో కోట్లకు కోట్లు కుమ్మరించి పదవులను చెరబట్టిన ప్రజాకంటకులూ ఉన్నారు. అక్రమ సంపాదనాపరులు, అవినీతిపరులూ అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటులో అవినీతికి సమాధికట్టే ‘జన్ లోక్‌పాల్’ బిల్లుకు ఆమోదముద్ర పడటం అంతసులభం కాదని వారికి బాగా తెలుసు.
నాలుగు దశాబ్దాల కాలంలో ఎనిమిదిసార్లు లోక్‌పాల్ ముసాయిదా బిల్లులు సభలో ప్రవేశపెట్టినా ఒనగూడిం దేమీలేదన్న అనుభవం వారి ముందున్నది. పెపైచ్చు అవినీతి ఊబిలో కూరుకుపోయి ఉన్న రాజకీయపార్టీల మద్దతు అడక్కుండానే లభిస్తుందన్న ధీమా!
నీతికి పట్టం కట్టాలి
అవినీతిని గూర్చి మాట్లాడే వాళ్లు, దాని పునాదులు ఎక్కడున్నాయో కూడా ఆలోచించాలి. రాజకీయ అవినీతి అత్యంత ప్రధానమైనది. మొత్తం వ్యవస్థను అది భ్రష్టు పట్టిస్తున్నది. ప్రజాస్వామ్యవ్యవస్థనే అపహాస్యం చేసి క్రియాశూన్యం చేస్తున్నది. చట్టబద్ధ పాలనకు చరమగీతం పాడుతూ అవినీతి, అక్రమాలు, అక్రమ సంపాదన, అధికార దాహం అందలం ఎక్కి కూర్చున్నాయి. ‘‘గొంగళ్లో కూర్చోని అన్నం తింటూ వెంట్రుకలు రాకూడదని’’ భావిస్తే ఫలితం ఉండదు. అందుకే ఈ లోపభూయిష్టమైన వ్యవస్థపైన కన్నెర్ర జేయాలి. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి. అధికార దుర్వి నియోగానికి ఎదురొడ్డి నిలవాలి. ప్రజానుకూల చట్టాల కోసం ఉద్యమించాలి, సాధించాలి. కేవలం చట్టాల సాధనతోనే ఫలితాలు ప్రజల ముంగిటకు రావు. సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, వరకట్న నిషేధ చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టాలు, కార్మికుల హక్కులను పరిరక్షించడానికి ఉన్న కార్మిక చట్టాలు, భూసంస్కరణల చట్టం లాంటి అనేక చట్టా లున్నా అమలులో చట్టుబండలుగా మారిపోయాయి. అధికార పీఠాన్ని అధిరోహించిన వారికి రాజకీయ సంకల్పం, అంకితభావం లేని పక్షంలో ఆశించిన ఫలి తాలు చేకూరవు. చట్టాలు ప్రజల చేతుల్లో నిజమైన ఆయుధాలుగా మారాలి. లేనిపక్షంలో నిరుపయోగంగా మూలన పడిపోతాయి. 1988 సంవత్సరంలో చేయబడిన అవినీతి నిరోధక చట్టానికి ఇదే గతి పట్టింది. కడకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గోడలకూ అవినీతి చెదలు పట్టింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, ఏసీబీ లాంటి సంస్థలూ పాలక పార్టీల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. కాగ్ నివేదికలకు విలువ లేకుండా పోయింది.
వీటన్నింటి పర్యవసానంగానే అవినీతికి సంబంధించిన కేసుల నమోదు, విచారణ, శిక్షణలు విధించడం, అమలు చేసే సర్వహక్కులను జన్ లోక్‌పాల్ చట్టానికి దఖలు పరచాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. చట్ట పరిధిలోకి ప్రధాన మంత్రి మొదలుకొని మంత్రులు, ప్రజాప్రతినిధులు, హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు, ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులం దరినీ చట్ట పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకొన్నది. అలాగే ఇదే తరహాలో అన్ని రాష్ట్రాలలో లోకాయుక్త చట్టాలను తీసుకొచ్చి అమలు చేయాలి. వీటన్నింటిపైన దేశ వ్యాపితంగా అర్థవంతమైన, సమగ్ర చర్చ జరిపి, అవినీతి నిరోధానికి దోహదపడే కఠిన తరమైన చట్టాన్ని త్వరితగతిన తీసుకురావడానికి ప్రజా ఉద్యమం కొనసాగాలి.
అలాగే లోక్‌పాల్ చట్టమొక్కటే సర్వరోగ నివారిణి కాజాలదు. దేశంలో రాజకీయ ప్రక్షాళన జరగాలి. ఎన్నికల సంస్కరణలు తక్షణావసరం. కొందరు అవగాహనా రాహిత్యంతోనే కావచ్చు అన్నా హజారేను నేటి తరం గాంధీగా పోల్చారు. ఆయన దాన్ని నమ్రతతో తోసి పుచ్చారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న అన్నా హజారే ‘‘నేను ఎన్నికల్లో పోటీచేస్తే డిపాజిట్ కూడా రాదని’’ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. డబ్బు, మద్యం రాజ్యమేలు తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారమే పార్లమెంటుకు రూ.40 లక్షలు, శాసనసభకు రూ.16 లక్షలు ఖర్చు చేయవచ్చు. వాస్తవానికి కోట్లలో ఖర్చు చేసి, ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల ప్రక్రియను అభాసుపాలు చేశారు. దీనంతటికీ కారణం అవినీతి సొమ్ము, నల్లధనం, అక్రమ సంపాదన. ప్రజా స్వామ్యం మనుగడకు భంగం వాటిల్లకూడదంటే డబ్బు ప్రభావాన్ని అరికట్టాలి. దామాషా ఎన్నికల విధానం మంచిదనే ఆలోచనలూ ఉన్నాయి. ఎన్నికల సంస్కరణల పైనా ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. 73, 74 రాజ్యాంగ సవరణల మేరకు అధికార వికేంద్రీకరణ జరగాలి. స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా ఎదగాలి. అవినీతికి నిలయాలుగా మారిన వివిధ రంగాలలో సమూలమైన మార్పుల కోసం శక్తిమంతమైన, నిరంతర ప్రజా పోరు తప్పనిసరి.
Monday, April 4, 2011
‘నిండుసభ ’ సాక్షిగా ‘కృష్ణా’ర్పణం!
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా మన రాష్ట్రానికి సంక్రమించిన ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించుకొంటూ, వెనుకబడిన ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను సాధించుకోవలసిన బృహత్తర కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఈ పూర్వరంగంలో దాదాపు నెలన్నర రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాలలో ఈ జీవన్మరణ సమస్యపై చర్చించి, వ్యూహ రచన చేసుకోకపోవడం చట్ట సభలపై ప్రజలకున్న విశ్వాసాన్ని వమ్ము చేసింది.
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమా వేశాలు ఫిబ్రవరి 17న ప్రారం భమై, ఒక ప్రహసనంగా కొన సాగి, మార్చి 29న నిరర్ధకంగా ముగిశాయి. నిర్వహించాలి కాబ ట్టి మొక్కుబడిగా శాసనసభ, శాసన మండలి సమావేశాలను, సభ్యుల హాజరుతో నిమిత్తం లేకుండా, అత్యధిక కుర్చీలు ఖాళీగా ఉన్నా నిండు సభగా భావించి, నిర్వహించి ఊపిరి పీల్చుకొన్నారు ప్రభుత్వ పెద్దలు. వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర కోసమే అన్నట్లు సభా నిర్వహణ తంతు నడిచింది.
గవర్నర్ ప్రసంగంపైన గానీ, బడ్జెట్ ప్రతిపాదనలపైన గానీ, శాఖల వారి పద్దులపైన గానీ, రాష్ట్రం మరియు ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ దీర్ఘకాలిక సమస్యలపైన గానీ సభలో చర్చించిన పాపాన పోలేదు. ధూషణ భూషణ లతో విధ్వంసాలు, భౌతిక దాడులకు, వాక్ స్వాతంత్య్రం పై, ప్రజాస్వామ్య హక్కులపై ఫాసిస్టు తరహా దాడులకు సమావేశాలు సాక్షీభూతంగా నిలిచాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవాలయంగా భావించే శాసనసభలో సభా ప్రాంగణంలో జరిగిన ఘటనలు రాష్ర్ట చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.
సమస్య అందరిదీ, కానీ ఎవరికీ పట్టలేదు!
కృష్ణా నదీ జలాల సమస్య తెలుగు ప్రజలందరి జీవన్మరణ సమస్య. నదీ జలాల పునఃపంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మొత్తం రాష్ట్ర ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. మన రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవాలనే అంశంపై ఎవరికీ పెద్దగా భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం లేదు. ఉప ప్రాంతీయ భావజాలంతో కొట్టుకుపోతున్న వారు ఈ సమస్యకు నేడు అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు.
కానీ, రాష్ట్ర వ్యాపితంగా విస్తరించి ఉన్న రాజకీయ పార్టీల వైఖరి ప్రజలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇది అందరి సమస్య. కానీ ఎవ్వరికీ పట్టలేదు. ట్రిబ్యునల్ తీర్పు మూలంగా సంభవించే దుష్పరిణామాలపై సభలో సమగ్రంగా చర్చిం చి, నష్ట నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సమష్టి గా రూపొందించుకోవడానికి జవాబుదారీ తనంతో ప్రభు త్వం వ్యవహరించకపోవడం అత్యంత బాధ్యతారహితం.
రాజకీయ అనిశ్చితితో ప్రభుత్వ మనుగడే ప్రస్తుతం మిణుకు మిణుకుమంటున్నది. అపవిత్ర కలయికలు, మ్యాచ్‌ఫిక్సింగ్స్ ద్వారా వీలైనంత కాలం మనుగడ సాగిం చాలన్న ధ్యాసే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదు. ఈ పూర్వ రంగంలో సభ సజావుగా జరగకపోవడం పాలక పార్టీకి ఊరట కలిగించింది. దినదినగండంగా రోజులు గడుపుతున్న అత్యంత బలహీన మైన కిరణ్‌కుమార్ సర్కారు ఆ విధంగా ఊపిరి పీల్చుకొంది.
న్యాయం కోసం రాజీలేని పోరాటం
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులోని కీలకాంశాలను పరిశీలిస్తే మన రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో స్పష్టమవుతుంది.
నికర జలాల నిర్ధారణకు బచావత్ ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకొన్న 75 శాతం నీటి లభ్యత ప్రామాణికాన్ని తిరస్కరించి 65 శాతాన్ని తీసుకోవడం.
సగటు వార్షిక నదీ ప్రవాహంలో నుంచి నికర జలాలను మినహాయించగా లభించే నీటిని మిగులు జలాలుగా నామకరణం చేసి మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం.
ప్రకాశం బ్యారేజీ నుండి అనివార్యంగా కిందికి ప్రవహించి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని లెక్కలోకి తీసుకోవడానికి నిర్ద్వంద్వంగా తిరస్కరిం చడమే కాదు. అదొక మిథ్యగా చులకన భావంతో కొట్టిపారేయడం.
‘‘క్యారీ ఓవర్’’ పద్దు కింద శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవ డానికి ఆమోదముద్ర వేస్తూ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తిరగదోడి, దానికి కాలం చెల్లిపోయిందని, ప్రస్తుతం మన రాష్ట్రా నికి మిగులు జలాలలో వచ్చిన 145 టీఎంసీలతోపాటు 65 శాతం ప్రామాణికం ఆధారంగా అదనంగా రాష్ట్రా నికి కేటాయించిన 39 టీఎంసీల నికర జలాలలోని 5 టీఎంసీలను కలిపి మొత్తం 150 టీఎంసీలను ‘‘క్యారీ ఓవర్’’ ‘‘స్టోరేజి’’ పద్దు కింద కేటాయించడం పెద్ద దగా. మిగిలిన నీటిలో 9 టీఎంసీలను జూరాల ప్రియ దర్శినికి, 25 టీఎంసీలను తెలుగుగంగకు ట్రిబ్యునల్ షరతులతో కేటాయించింది.
పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకముందే 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని, నీటి లభ్యతను నిర్ధారించే గణాంకాలకు కలిపి లెక్కించడం.
దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపకరించే తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణానికి ఆమోదం తెలపక పోగా కర్ణాటక వాదనను బలపరుస్తూ, కృష్ణానదీ పరీవాహక ప్రాంతం బయటికి నీటిని తరలించుకుపో వాలనే దుర్బుద్ధి మన రాష్ట్రానికి ఉన్నట్లు ట్రిబ్యునల్ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించింది. తుంగభద్ర రిజర్వాయరులో పూడిక మూలంగా నీటి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీల నుండి 104.34 టీఎంసీలకు పడిపోయిందని నిపుణుల అంచనా. పర్యవసానంగా బచావత్ ట్రిబ్యునల్ 230 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయరు కింద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వినియోగానికి కేటాయించినా, ప్రస్తుత 212 టీఎంసీలకు మించి వాడుకోలేని దుస్థితి. కర్ణాటక మాత్రం పూర్తి స్థాయిలో నీటిని వాడుకొంటూ మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది. 186 కి.మీ. పొడవు గల తుంగభద్ర హైలెవల్ కెనాల్ (హెచ్‌ఎల్‌సి) 105 కి.మీ. ఉమ్మడి కాలువగా కర్నాటక భూభాగంలోనే ప్రవహిస్తున్నది. ఈ కాలువ కింద కేటాయించిన 50 టీఎంసీలలో 32.5 టీఎంసీలు మన రాష్ట్రానికి రావాలి. కానీ ఏనాడు మన వాటా మేరకు నీరు అందింది లేదు.
కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోనే ఉన్నా నిత్య కరువులతో కృంగికృషించిపోతున్న జిల్లాల నీటి అవసరాలను తృణీకార భావంతో లెక్కలోకే తీసుకో లేదు. వలసలకు మారు పేరుగా నిలిచి, అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాలకు 9 టీఎంసీలు అదనంగా కేటాయించడం మినహాయిస్తే, మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు, నల్ల గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం) ప్రాజెక్టుకు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా ప్రయోజనం కలిగించే హంద్రీ-నీవా సృజల స్రవంతికి మిగులు జలాలను పంచుతున్న సందర్భంలోనైనా నీటి కేటాయింపులు చేయాలనే స్పృహ ట్రిబ్యునల్‌కు కొరవ డింది. కృష్ణా మిగులు జలాల తరలింపు తప్ప మరో ప్రత్యామ్నాయం లేని ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలుగొండ, కడప, చిత్తూరు జిల్లాల ప్రజల గొం తులు తడిపే గాలేరు-నగరి ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు.
మానవీయ కోణంలో ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానదీ పరీ వాహక ప్రాంతంలోనే ఉన్న నిత్య కరువు పీడిత, అత్యంత వెనుకబడిన జిల్లాల నీటి కడగండ్లను తీర్చడం ద్వారా సమన్యాయాన్ని అమలు చేయాలని ట్రిబ్యునల్ భావించ లేదు. మన రాష్ట్రానికి కేటాయించిన నీటిలో 49 శాతం పరీ వాహక ప్రాంతానికి వెలుపల ఉన్న ప్రాజెక్టులకు ఇప్పటికే కేటాయించడం జరిగింది కాబట్టి మరే ఇతర ప్రాజెక్టుకు నీటిని కేటాయించడం సాధ్యంకాదని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించింది.
అదనపు నీటిని సాధించుకోవాలి
బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు లోబడి మన రాష్ట్ర పరిధిలో కొన్ని ‘‘సర్దుబాట్లు’’ ద్వారా కొన్ని ప్రాజెక్టులకు అఖిల పక్ష సమావేశాలలో చర్చించి నికర జలాలను కేటాయించడం జరిగింది. అవి
కృష్ణా డెల్టా ఆధునికీకరణ ద్వారా 19 టీఎంసీలను ఆదా చేసి భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించారు.
కేసీ కెనాల్ ఆధునికీకరణ ద్వారా 8 టీఎంసీలు ఆదా చేసి పునరుత్పత్తి ద్వారా మన రాష్ట్రానికి లభించిన 11 టీఎంసీలను కలిపి 19 టీఎంసీలను శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (యస్‌ఆర్‌బీసీ)కు కేటాయించారు.
తుంగభద్ర రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు కేటాయించిన 10 టీఎంసీలను అనంతపురం జిల్లా పెన్నా అహోబిలం రిజర్వాయర్ (పీఏబిఆర్)కు కేటాయించి, శ్రీశైలం రిజర్వాయరు నుంచి ఆ మేరకు కేసీ కెనాల్‌కు సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంతరంగిక సర్దుబాట్ల ద్వారా భీమా, ఎస్‌ఆర్‌బీసీ, పీఏబీఆర్ ప్రాజెక్టులకు కేటాయించిన నికర జలాలను అదనంగా సాధించుకోవడానికి కృషి చేయాలి. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా మన రాష్ట్రానికి సంక్రమించిన ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించుకొంటూ, వెనుకబడిన ప్రాంతాలలో నిర్మా ణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను సాధించుకోవలసిన బృహత్తర కర్తవ్యం రాష్ట్ర ప్రభు త్వంపై ఉన్నది. ఈ పూర్వ రంగంలో దాదాపు నెలన్నర రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాలలో ఈ జీవన్మరణ సమస్యపై చర్చించి, వ్యూహ రచన చేసుకోకపోవడం చట్ట సభలపై ప్రజలకున్న విశ్వాసాన్ని వమ్ము చేసింది.