Sunday, February 23, 2014

విధానాలే అజెండా కావాలి!



కూటముల కోసం పార్టీల అన్వేషణ
కంటిలో నలుసులా ఆమ్‌ ఆద్మీ
20 మంది ఎంపీ అభ్యర్ధుల ప్రకటన
వాగ్దానాలు నెరవేర్చేందుకు అడుగులు
దుందుడుకు చర్యలంటూ విమర్శలు
చిన్న ప్రయత్నానై్ననా ప్రోత్సహించాలి
ఆమ్‌ ఆద్మీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, బిజెపి
కార్పొరేట్ల చేతుల్లో రెండూ పావులే!
ప్రత్యామ్నాయం కోసం జనం ఎదురు చూపు


దేశంలో ఎన్నికల వేడి రాజుకొంటున్నది. రాజకీయ కూటముల ఏర్పాటులో రాజకీయ పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. అధికార పీఠాన్ని అధిష్ఠించి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఎ. కూటమికి, ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని ఉవ్విళ్ళూరుతున్న బి.జె.పి. నాయకత్వంలోని యన్‌.డి.ఎ. కూటమికి- ఆమ్‌ ఆద్మి పార్టీ కంటిలో నలుసులా పరిణమించినట్లు భావించడం జరుగుతోంది. ఇటీవల జరిగిన దేశ రాజధాని ఢిల్లీ శాసన సభకు జరిగిన ఎన్నికల ఫలితాలతో ఈ భావనకు బలం చేకూరింది. ఢిల్లీలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడడంతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ బి.జె.పి. ప్రభుత్వాన్ని నెలకొల్ప లేక పోయింది. రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడ్పాటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, తనదైన శైలిలో 48 రోజుల పాటు పరిపాలన సాగించారు. తన ఎన్నికల వాగ్దానమైన్‌ జన్‌ లోక్‌ పాల్‌ బిల్లును ప్రవేశ పెట్టడానికి శాసనసభ తిరస్కరించడంతో రాజీనామా చేసి, తిరిగి ప్రజా క్షేత్రంలోకి దూకారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే ఇరవై మంది అభ్యర్థుల పేర్లను అందరి కంటే ముందుగా ప్రకటించి ఎన్నికల యుద్ధభేరి మ్రోగించారు.

పార్టీ పేరు ఆమ్‌ ఆద్మీ. సిద్ధాంతపరంగా ఆశ్రీత పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఉండాలి. అంటే, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. అవినీతిని తుదముట్టించాలనే లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పంతో కార్యాచరణ. సంక్షేమ రాజ్యంలో సామాన్యుల జీవితాలకు ఊరట కలిగించే రాయితీలను ఇవ్వడం ప్రభుత్వ విధి అని విశ్వసిస్తున్న పార్టీ. ఇదే స్థూలంగా కేజ్రీవాల్‌ కేంద్ర బిందువుగా నెలకొల్పిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సైద్ధాంతిక పునాదిగా కనబడుతున్నది. ఆ పార్టీ ఆచరణను పరిశీలించినా అందుకు అనుగుణంగానే అంకిత భావంతో పని చేస్తున్న అభిప్రాయం కలుగుతున్నది. ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టిన వెనువెంటనే పలు ప్రాధాన్యతాంశాలపై దృష్టి సారించిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం మీటర్‌ల ఆధారంగా ప్రతి కుటుంబానికి రోజుకు 667 లీటర్ల ఉచిత నీటి సరఫరాను, నెలసరి 400 యూనిట్లకు లోపు విద్యుత్తును వినియోగించుకొనే కుటుంబాలకు చార్జీలలో 50 శాతం రాయితీ, విద్యుత్‌ బిల్లుల తయారీలో జరిగిన అవకతవకలను సరిదిద్దడంలో భాగంగా 24,000 మదిరకి బిల్లుల చెల్లింపులో 50 శాతం రాయితీ, నర్సరీ స్కూళ్ళ ప్రవేశాలలో అవినీతిని అరికట్టే ధ్యేయంతో సహాయ కేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రతి పాఠశాలకు లక్ష రూపాయల మంజూరు, బడా పెట్టుబడిదారులకు చెందిన ప్రయివేటు విద్యుత్‌ సరఫరా సంస్థల గణాంకాలను బహిరంగ పరచాలని డిమాండ్‌ చేయడం, వి.ఐ.పి. సం„స్కృతికి చెల్లు చీటీ పలుకుతూ ప్రభుత్వ వాహనాలపై రెడ్‌ అండ్‌ బ్లూ బుగ్గల తొలగింపు,

పొలీసుల దుశ్చర్యలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే సామూహిక ధర్నా, 2010లో కామన్‌ వెల్‌‌త క్రీడల నిర్వహణలో వెలుగు చూసిన అక్రమాలపై నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ పై ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేసి విచారణ చేపట్టాలని, సహజ వాయువు ధరల పెంపు అంశంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై రిలయన్‌‌స పరిశ్రమపైన, రిలయన్‌‌స పరిశ్రమ అధినేత ముఖేష్‌ అంబానితో- కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయి సహజ వాయువు ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచి, విద్యుత్తు చార్జీల పెరుగుదలకు దోహదపడ్డారని ఆరోపిస్తూ కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రిత్వ శాఖామాత్యులు వీరప్ప మొయిలీ, మాజీ కేంద్ర మంత్రి మురలి దియోరా లపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని ఎ.సి.బి.ని ఆదేశిస్తూ ఉత్తర్వుల జారీ చేయడం ఈ కోవ క్రిందికే వస్తాయి.కేజ్రివాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొన్న ఈ చర్యలన్నీ బహుళ ప్రాచుర్యం పొందాయి. వీటిపై కొన్ని తరగతుల నుండి విమర్శులు వెల్లువెత్తినా, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకత్వం- అధికార దాహంతో పని చేసిందని ఎవరూ అనలేరు. అనాలోచితంగా రాయితీల పందారం చేసిందనో, దుందుడుకు చర్యలకు పూనుకొన్నదనో, ముఖ్యమంత్రిగా ఉంటూ ఆందోళనలకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కల్పించడమేమిటి అనో- కొందరు ప్రశ్నించి ఉండవచ్చు. అంతే గానీ చేజిక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అడ్డదారులు తొక్కారని విమర్శించే సాహసం మాత్రం ఎవరూ చేయలేదు. భ్రష్ఠు పట్టిన రాజకీయ రంగాన్ని ప్రక్షాళన చేయడం అసాధ్యమనే నిరుత్సాహ వాతావరణం అలముకొని ఉన్న నేటి పరిస్థితుల్లో- ఒక చిరు ప్రయత్నం ఎవరు ఏ రూపంలో చేసినా శుభ పరిణామంగా భావించి, ప్రోత్సహిస్తే సమాజానికి కొంతైనా మేలు జరుగుతుందేమో! సమాజాన్ని నియంత్రిస్తూ, మౌలిక సమస్యలకు హేతుబద్ధమైన పరిష్కారాలను అన్వేషించి, అమలు చేస్తూ, ప్రగతికి బాటలు వేయవలసిన గురుతర బాధ్యత రాజకీయ వ్యవస్థపై ఉన్నది. సైద్ధాంతిక, రాజకీయ పరంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ పరిణతి చెందిన పార్టీ అని అభివర్ణించడం దుస్సాహసమే అవుతుంది. అపారమైన త్యాగాలతో సముపార్జించుకొన్న స్వాతంత్య్ర ఫలాలు సామాన్యుడికి అందని ద్రాక్ష పళ్ళుగానే మిగిలిపోయాయి.

దారిద్య్రం, నిరుద్యోగం, అధిక ధరలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అవినీతి అందలమెక్కి రాజ్యమేలు తున్నది. సమాజంలో అవినీతికి రాజకీయ అవినీతే మూలం. ధన బలం, కండ బలం ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం చేస్తున్నాయి. కడకు, మంద బలం ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన పార్లమెంటులోకి చొచ్చుకుపోయి ప్రజాస్వామ్యాన్ని గొడ్డలివేటుకు గురిచేసిన తాజా „సంఘటనలను చవిచూశాం. రాజకీయ పార్టీలలో అవకాశవాదం తారా స్థాయికి చేరింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఢిల్లీ శాసన సభలో కాంగ్రెస్‌, బి.జె.పి. రెండూ ఏకమయ్యాయి. అవినీతిపై పోరు సాగించడానికి శక్తివంతమైన జన్‌ లోక్‌ పాల్‌ చట్టాన్ని తీసుకొస్తే ప్రజల చేతుల్లో ఆయుధంగా ఉంటుందని సర్వత్రా అంగీకరిస్తున్న అంశం. సాంకేతికపరమైన కారణాలను సాకుగా చూపెట్టి ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ అభ్యంతరం చెప్పడం, కాంగ్రెస్‌- బి.జె.పి. ఒక్కటై శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడాన్ని బట్టి వాటి నిజస్వరూపం బట్టబయలైంది. తెలుగు జాతిని అడ్డగోలుగా రెండు ముక్కలు చేయడానికి పార్లమెంటు విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసే విధంగా ఆ రెండు పార్టీలు నిస్సిగ్గుగా ఏకమైనాయి. ఈ తాజా ఘటనలను పరిశీలించిన వారికెవరికైనా ఈ రెండు పార్టీలు ఒకే తానులోని ముక్కలేననే విషయం స్పష్టమవుతుంది. వీటి పట్ల విసుగు చెందిన ప్రజానీకం ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఎదురు చూస్తున్నారు.

రాజకీయ రంగంలో దినదినానికీ పతనమైపోతున్న నైతిక విలువలకు జీవం పోసే చిరు ప్రయత్నం ఎవరు చేసినా ఆధరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీకి లభించిన మద్దతే ప్రబల నిదర్శనం. అలాంటి ప్రయోగాలు విఫలమైతే ప్రజల్లో నిర్వేదం బలపడుతుంది. సుస్పష్టమైన సైద్ధాంతిక పునాది, సమకాలీన సమస్యలపై శాస్త్రీయమైన, హేతుబద్ధమైన చింతన లేకుండా వ్యక్తుల చుట్టూ పరిభ్రమించే రాజకీయ పార్టీల ప్రభావం సమాజంపై పరిమితంగానే ఉంటుంది. దీర్ఘకాలికంగా మనుగడ సాగించడమూ కష్టమే. అలాంటి పార్టీల్లో ప్రజాస్వామ్య పనివిధానానికి ఉండే అవకాశం తక్కువే. ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థిక వ్యవస్థ- కార్పొరేట్‌ రంగం గుప్పిటలోకి వెళ్ళిపోయింది. కార్పొరేట్‌ రంగంలోని ముఖేష్‌ అంబానీ వంటి దిగ్గజాల కనుసన్నల్లో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. దేశ సహజ వనరులను కొల్లగొట్టి, ఇబ్బడి ముబ్బడిగా లాభాలు గడించి, సంపదను గుట్టలు గుట్టలుగా పోగేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తున్న ఆశ్రీత పెట్టుబడిదారీ విధానాల వ్యతిరేకతను ఎన్నికల అజెండాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ మార్చడానికి చేస్తున్న ప్రయత్నం అభినందించతగినది.

అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, అధికారం కోసం అర్రులు చాస్తున్న బి.జె.పి. రెండూ కూడా కార్పొరేట్‌ రంగం చేతుల్లో పావులే. కార్పొరేట్‌ రంగ దిగ్గజాలు అందించే డబ్బు సంచులతోనే ఎన్నికల ప్రక్రియను ఒక ప్రహసనంగా మార్చి, ప్రజాస్వామ్యాన్ని చెరబడుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, బడా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, మాఫియా ముఠాలు, చీకటి వ్యాపారాలలో అందెవేసిన వ్యక్తులు- డబ్బు సంచులతో ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో- ధన ప్రభావం లేని రాజకీయాల కోసం అంకిత భావంతో ఎన్నికల బరిలో నీతి నిజాయితీ పరులను దించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రయత్నం స్వాగతించతగినది. కృష్ణా- గోదావరి బేసిన్‌ లో లభిస్తున్న సహజ వాయువును సొంతం చేసుకొని లక్షల కోట్ల రూపాయలు గడించడానికి రిలయన్‌‌స సంస్థకు కేంద్ర ప్రభుత్వం లైసెన్‌‌స ఇచ్చింది. ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థ ఒ.యన్‌.జి.సి.ని పక్కకు నెట్టి ముఖేష్‌ అంబానీకి అప్పగించింది. అమలులో ఉన్న ఒప్పందం మేరకు 2014 ఏప్రిల్‌ 1 వరకు సహజవాయువు ధరను ఒక మిలియన్‌ బ్రిటిష్‌ థెర్మల్‌ యూనిట్‌ కు రూ. 4.2 డాలర్లుగా నిర్ణయించారు. రిలయల్‌‌స సంస్థ అడుగులకు మడుగులొత్తే కేంద్ర ప్రభుత్వం- ఒప్పందం గడువు ముగియక ముందే యూనిట్‌ ధరను 8.4 డాలర్లకు పెంచుతూ నిర్ణయం చేసింది. తద్వారా ఏడాదికి రూ. 54,500 కోట్ల మేరకు ప్రజలపై భారం అడుతుంది.

అది చాలదన్నట్లు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు రిలయన్‌‌స సంస్థకు లబ్ధి చేకూర్చే విధంగా మరొక నిర్ణయం కూడా చేసింది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న సహజవాయువు అమ్మకపు ధరను రూపాయల్లో కాకుండా డాలర్లలో నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వ డొల్లతనం బయటపడుతున్నది. పర్యవసానంగా రసాయనిక ఎరువుల ధరలు, విద్యుత్తు చార్జీలు, వంట గ్యాస్‌ ధరలు ఇంకా పెరిగి సామాన్యుడి వెన్ను విరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ అండదండలతో రిలయన్‌‌స సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ చేస్తున్న ఘరానా దోపిడీని, కృష్ణా - గోదావరి బేసిన్‌ మన రాష్ట్రంలో ఉన్నా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలవరించలేక పోయింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏకంగా ఈ అవినీతి కుంభకోణానికి బాధ్యులైన వారందరిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం ద్వారా ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థపై తిరుగుబాటు బావుటాను ఎగరవేసింది. ఆశ్రీత పెట్టుబడిదారీ విధానాల వల్ల జరుగుతున్న దుష్ఫలితాలను, జాతికి జరుగుతున్న నష్టాన్ని ఎన్నికల అజెండాగా మార్చడం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసి, ప్రతిఘటనోద్యమానికి బాటలు వేయడం శుభƒ సూచికం. రానున్న ఎన్నికలు డబ్బు, మద్యం, కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికగా కాకుండా ప్రజల నిజజీవితాలతో చెలగాటమాడుతున్న రాజకీయ, ఆర్థిక విధానాల ప్రాతిపదికగా జరగడానికి ఎవరు ఏ చిన్న ప్రయత్నం చేసినా ప్రజలు స్వాగతించవలసి ఉన్నది.

Wednesday, January 29, 2014

రసకందాయంలో విభజన రాజకీయం



రాగ ద్వేషాలకు అతీతంగా, విజ్ఞతతో ఆలోచిస్తే ఎంతటి సమస్యకైనా పరిష్కా రం లభిస్తుంది. నేటి వివాదానికి బీజం వేసింది- ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు-2013 ను పైలెట్‌ చేస్తున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి. బిల్లు అసమగ్రంగా ఉన్నది, ఈ అంశంపై అర్థవంతమైన చర్చ చేయాలంటే సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వండని శాసనసభ్యులు చేసిన అభ్యర్థనను కేంద్ర హోంశాఖ కార్యదరిి్శ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి పంపితే, ఆయన- ఇది కేవలం ముసా యిదా బిల్లే- అని పునరుద్ఘాటించడంతో వివా దానికి తెరలేచింది. సమగ్రమైన సమాచారాన్ని పార్లమెంటుకు సమర్పిస్తాం. శాసన సభకు ఆ సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అత్యంత బాధ్యతారహితంగా సమాధానం చెప్పడం- శాసనసభను, శాసన మండలిని అవమానపరచ డమే. అలాగే బిల్లు, ముసాయిదాబిల్లు- ఏదైనా ఒకటేననడం బాధ్యతారాహిత్యం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 లో బిల్లు అని ప్రస్తావించారే గానీ ముసాయిదా బిల్లు అని పేర్కొనలేదు. కేంద్ర మంత్రి జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే వివాదానికి మరింత ఆజ్యం పోసిన వారవుతారు. న్యాయస్థానాల ముందు ఇలాగే వాదిం చగలరా? పైకి చూడడానికి- బిల్లు లేదా ముసాయిదా బిల్లు ఒక్కటే అనిపించ వచ్చు. కానీ ముసాయిదా బిల్లు సమగ్రరూపం దాల్చిన తరువాత బిల్లుగా రూపాంతరం చెందుతుంది. ముసాయిదా బిల్లును కేంద్ర హోంశాఖ తయారుచేసి, కేంద్ర మంత్రిమండలి ముందుంచి, ఆమోదంపొందిన బిల్లునే రాష్టప్రతిద్వారా రాష్ట్ర శాసన సభ, శాసన మండలికి పంపాలి. దానిపై అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. బిల్లుకు పార్లమెంటు సభ్యులుకానీ లేదా పార్లమెంటులో చర్చలప్రక్రియలో అంతర్భాగంగా ప్రభుత్వం అధికారికంగా కానీ సవరణలు ప్రతిపాదించవచ్చు.
వాటిని ఆమోదించడమో లేదా తిరస్కరించడమో జరిగిన మీదట బిల్లును చట్టసభ ఆమోదిస్తే, అది చట్టంగా రూపొందుతుంది. దానిపై రాష్టప్రతి రాజ ముద్ర పడ్డాక అమలులోకి వస్తుంది. ఈ ప్రక్రియపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా కేంద్ర మంత్రివర్యులు, చట్టసభల సభ్యులు మాట్లాడుతున్నారని భావించలేం కదా!శాసన సభకు/ శాసన మండలికి పంపిన బిల్లు సమగ్రంగా లేదని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. సమగ్రంగాఉన్నదని కొందరు వాదించవచ్చు. సమగ్ర సమాచారం లేదన్న వాదనలో బలం ఉన్నది కాబట్టే- కేంద్ర హోం శాఖ కార్యదర్శి విధిలేని పరిస్థితుల్లోనే ముసాయిదా బిల్లు అని పేర్కొని తప్పించుకోవాలని చూశారు. అది కాస్త నిజాయితీతో కూడిన మాటే. కానీ, అదే వివాదానికి తెరలేపిం ది. కేంద్ర మంత్రిమండలి రాజకీయ ప్రయోజనాలతో ఎన్నికలకు ముందు హడావు డిగా, అడ్డగోలుగా వ్యవహరిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయనడానికి మన రాష్ట్ర విభజన ఉదంతమే ప్రబల నిదర్శనం.
భాతర రాజ్య స్వభావం- సమాఖ్య (ఫెడరల్‌) వ్యవస్థ. భారత యూనియన్‌లో అంతర్భాగ మైన రాషా్టల్రు స్వయంప్రతిపత్తి కలిగిఉన్నాయి. కేంద్రప్రభుత్వం, రాషా్టల్రకున్న స్వయం ప్రతిపత్తిని, అధికారాలను క్రమంగా హరించివేస్తూ వస్తున్నది.

సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించే విధంగా రాషా్టల్ర చట్టసభ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తే ప్రమాదకర పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టే రాజ్యాంగసభలో ఈ అంశంపై లోతైనచర్చ చేశారు. బ్రిటిష్‌ వలసపాలనలో ఉన్న ప్రావిన్సెస్‌కు, భారత యూనియన్‌ లోని రాషా్టల్రకు మధ్య మౌలిక తేడా ఉన్నదని భారత రాజ్యాంగ నిర్మాత డా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆర్టికల్‌ మూడుపై జరిగిన చర్చలో విస్ఫష్టంగా పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలోఉన్న పార్టీ లేదా కూటమి సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం సమాఖ్యవ్యవస్థ స్వరూపాన్ని గొడ్డలి వేటుకు గురిచేయడానికి తెగిస్తే ప్రతిఘటించాల్సిన బాధ్యత భారత రాజ్యాంగంపై విశ్వాసంఉన్న ప్రతి పౌరుడిపై ఉన్నది. లేకుంటే దేశ ఐక్యతకు, సమగ్రతకే పెనుముప్పు వాటిల్లే ప్రమాదమున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను దుర్వినియోగం చేసి ప్రజలచేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసి రాష్టప్రతి పాలన విధిస్తే- అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసి, కట్టడి చేసిన దృష్టాంతాలున్నాయి. రాజ్యాంగానికి వక్రభాష్యాలు చెప్పి దుర్వినియోగానికి పాల్పడితే న్యాయ వ్యవస్థ స్పందించకుండా ఉండలేదు. ఏ సమస్యనైనా రాజ్యాంగ పరిథిలో పరిష్కరించు కోవలసిందే. మరో మార్గం లేదు. రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉందనుకొంటే దాన్ని మార్చుకోవాలి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక, గత 6 దశాబ్దాల కాలంలో సంభవించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల పర్యవసానంగా 98 సార్లు రాజ్యాంగానికి సవరణలు చేశారు. ఆ పంథాలోనే మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసుకోవాలి. సామాజికాభివృద్ధికి అనుగుణంగా రాజ్యాంగంలో, చట్టాల్లో మార్పులు అనివార్యం.

రాషా్టల్ర పునర్‌ వ్యవస్థీకరణపై రాజ్యాంగం: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై శాసన సభ కేవలం అభిప్రాయం చెప్పడం వరకేగానీ, ఆ అభిప్రాయాలకు ఎలాంటి విలువలేదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనది. భారత రాజ్యాంగంలో సమాఖ్యవ్యవస్థ పరిరక్షణఅంశం అంత బలహీనంగా ఉన్నదా అన్న అనుమానం వస్తుంది. రాష్ట్ర విభజన ప్రక్రియ రాష్ట్ర శాసనసభ తీర్మానంతోనే మొదలవుతుందని 2009లో నాటి హోంమంత్రి హోదాలో చిదంబరం ప్రకటించారు. శాసనసభ, శాసనమండలి అభిప్రాయాలకు విలువే లేకపోతే రాష్టప్రతి ముసాయిదా బిల్లును ఎందుకు పంపినట్లు? శాసన సభ, శాసన మండలి సభ్యులు కేవలం కంఠశోష వినిపించుకోవడానికేనా? రాజ్యంగంలోని ఆర్టికల్‌ 3 ఏం చెబుతున్నదో పైన పేర్కొనడం జరిగింది. ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వానిది దళారి పాత్రమాత్రమే. తనకుతానుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలులేదని స్పష్టమవు తున్నది. ఒకవేళ అధికార దుర్వినియోగానికి బరితెగిస్తే, రాజ్యాంగ పరిరక్షణకు ఇతర రాజ్యాంగబద్దమైన వ్యవస్థలు రంగప్రవేశం చేయకతప్పదు. అంబేడ్కర్‌ ప్రతిపాదిం చిన సవరణలను రాజ్యాంగసభ ఆమోదించింది.

1)రాషా్టల్ర సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై భారత ప్రభుత్వానికి అధికారాన్ని దఖలు పరుస్తూ ముసాయిదాలో చేసిన ప్రతిపాదనను తొలగించి, భారత ప్రభుత్వం బిల్లును రూపొందించినా లేదా పార్లమెంటు సభ్యులు ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని విన్నవించినా రాష్టప్రతి సిఫార్సు లేకుండా పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి వీల్లేదు. 2) రాష్టప్రతి అనుసరించే పద్ధతికి సంబంధించి కూడా స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి లేదా గవర్నర్‌ సంబంధిత శాసన సభ/ శాసన మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దానిపై చర్చించాలి. తద్వారా సంబంధిత రాష్ట్ర శాసనసభ నుండే ఈఅంశానికి సంబంధించిన ప్రస్తావనరావాలి లేదా చొరవ ప్రదర్శించాలి. అంతే గానీ పార్లమెంటు తనకు తానుగా ప్రస్తావన చేయడానికి వీలులేదు.3) భారత దేశంలోని రాషా్టల్రకు స్వయం ప్రతిపత్తి ఉన్నది.

రాషా్టల్ర సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై సంబంధిత రాషా్టల్ర నుండి అనుమతి పొందాలి. భారత యూనియన్‌ లో అంతర్భాగంగా స్వయం ప్రతిపత్తి ఉన్‌‌న రాషా్టల్రకు, ప్రావిన్సెస్‌కు మధ్య ఉన్న స్పష్టమైన మౌలిక వ్యత్యాసాన్ని, విభజన రేఖను అంబేడ్కర్‌ నొక్కి వక్కాణించారు. ఈ అంశాలను పరిశీలిస్తే- రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యక్తం చేసే అభిప్రాయమేదైనా దానికి విలువఉం టుందని బోధపడుతుంది. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యక్తంచేసే అభిప్రా యాన్ని రాజ్యాంగ పరిరక్షకుడుగా రాష్టప్రతి తృణీకారభావంతో తోసిపుచ్చలేరని కూడా అర్థవుతుంది. తెలంగాణతో ముడిపెట్టకుండా నిష్పాక్షిక దృష్టితో ఈ అంశాన్ని పరిశీలించాలి. చట్టసభలు అత్యంత జాగరూకతతో, బాధ్యతాయుతంగా, పారదర్శకగా తమ పనివిధానాన్ని మెరుగు పరచుకొంటూ సమాజ ప్రగతికి బాటలువేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం, పరమార్థం ఉంటాయి. వైవిధ్యభరితమైన మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకొనడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. అలాగే ప్రస్తుత రాజ్యాంగానికి వర్గస్వభావం ఉన్నది, తదనుగుణంకగా అనేక పరిమితులు ఉన్నాయి. అందులో ఇమిడిఉన్న ప్రజాస్వామిక భావనలను పరిరక్షించుకొంటూ, వాటికి కార్యరూపం సముపార్జించుకొంటూ, మెరుగైన రాజ్యాంగ వ్యవస్థకోసం అడుగులు ముందుకు వేయాలి. బహుళపార్టీ వ్యవస్థను పటిష్టవంతం చేసుకోవాలి. చట్టసభలు పట్టాలు తప్పి నడకసాగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం. వివక్షకు, అశాంతికి, అభివృద్ధి నిరోధానికి దారి తీసేలా చట్టసభలు ప్రవర్తిస్తే సామాజిక ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లవుతుంది.

తెలుగునాట ఒక సున్నితమైన, సంక్లిష్టమైన, జఠిలమైన విభజనసమస్య దేశం ముందుకొచ్చింది. ఈ సమస్యకు హేతుబద్ధమైన, న్యాయబద్ధమైన పరిష్కారానికి చిత్తశుద్ధితో అన్వేషణ జరగాలి, పరిష్కరించాలి. అదే సందర్భంలో ఈ వివాద పరిష్కారం మరెన్నో సమస్యల ఆవిర్భావానికి బీజం వేయకుండా రాజకీయ విజ్ఞత ప్రదర్శించాలి. నేడు తెలుగు ప్రజల మధ్య తలెత్తిన సమస్య పరిష్కారంలో కాంగ్రెస్‌పార్టీ, దాని నాయకత్వంలోని యుపిఎ- ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించాయనడం నిస్సందేహం. చట్ట సభలో విభజన అంశం అజెండాలో కొచ్చినప్పుడు సమగ్ర చర్చ జరిపి, ఏ నిర్ణయమైనా తీసుకోవడం ప్రజాస్వామ్య ప్రధాన లక్షణం.

Friday, January 24, 2014

శాసనసభ, శాసనమండలి అభిప్రాయానికి విలువే లేదా?





భాతర దేశం యొక్క రాజ్యo స్వభావం సమాఖ్య వ్యవస్థ (ఫెడరల్ వ్యవస్థ). భారత యూనియన్ లో అంతర్భాగమైన రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకున్న స్వయం ప్రతిపత్తిని, అధికారాలను కాలక్రమంలో హరించివేస్తూ వస్తున్నది. సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించే విధంగా  రాష్ట్రాల చట్ట సభల‌ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతతో వ్యవహరిస్తే ప్రమాదకర పరిణామాలు సంబవిస్తాయి. కాబట్టే రాజ్యాంగ సభలో ఈ అంశంపై లోతైన చర్చ చేశారు. బ్రిటిష్ వలస పాలనలో ఉన్న ప్రావిన్సెస్ కు, భారత యూనియన్ లోని రాష్ట్రాలకు మధ్య మౌలికమైన తేడా ఉన్నదని భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ మూడుపై జరిగిన చర్చ సందర్భంలో విస్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం సమాఖ్య వ్యవస్థ స్వరూపాన్ని గొడ్డలి పెట్టుకు గురిచేయడానికి బరితెగిస్తే ప్రతిఘటించాల్సిన బాధ్యత భారత రాజ్యాంగంపై విశ్వాసం ఉన్న ప్రతి పౌరుడిపైన ఉన్నది. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, స్పందించాల్సి ఉంది. లేనియడల దేశ ఐక్యతకు, సమగ్రతకే పెనుముప్పు వాటిల్లే ప్రమాదమున్నది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ను దుర్వినియోగం చేసి ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తే  అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసి,  కట్టడి చేసిన దుష్టాంతాలున్నాయి. రాజ్యాంగానికి వక్రభాష్యాలు చెప్పి అడ్డగోలుగా దుర్వినియోగానికి పాల్పడితే న్యాయ వ్యవస్థ స్పందించ కుండా ఉండలేదు. ఏ సమస్యనైనా రాజ్యాంగ పరిథిలో సామరస్యంగా పరిష్కరించుకోవలసిందే. మరో మార్గం లేదు. రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉందనుకొంటే దాన్ని మార్చుకోవాలి  లేదా అందులో సవరణలు చేసుకోవాలి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక గడచిన ఆరు దశాబ్దాల కాలంలో సంభవించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల పర్యవసానంగా 98 సార్లు రాజ్యాంగానికి సవరణలు చేశారు. ఆ పంథాలోనే మన ప్రజాస్వామ్య వ్యవస్థను  మరింత పటిష్టవంతం చేసుకోవాలి. సామాజికాభివృద్ధికి అనుగుణంగా రాజ్యాంగంలో, చట్టాల్లో మార్పులు అనివార్యం.
రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణపై రాజ్యాంగం ఏం చెబుతున్నది :
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై శాసన సభ కేవలం అభిప్రాయం చెప్పడం వరకే గానీ ఆ అభిప్రాయాలకు ఎలాంటి విలువలేదంటూ కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనది.  ఈ వాదనను సమర్థించే తీరులోనే ఒక‌ ఆంగ్ల దినపత్రికలో జనవరి 4న సుధీర్ క్రిష్ణస్వామిగారు వ్యాసం వ్రాశారు.  సహజంగానే వీటి ప్రభావం సామాన్య ప్రజలతో పాటు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులపై పడినట్లు కనిపిస్తున్నది. భారత రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ అంశం అంత బలహీనంగా ఉన్నదా? అన్న అనుమానం వస్తున్న‌ది. రాష్ట్ర విభజన ప్రక్రియ రాష్ట్ర శాసనసభ తీర్మానంతోనే మొదలవుతుందని 2009లో నాటి హోం మంత్రి హోదాలో చిదంబరంగారు ప్రకటించారు. ఆ తరువాత ఆయనే కేంద్ర ప్రభుత్వం తరుపున రాజ్యసభలో అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. శాసన సభ, శాసన మండలి అభిప్రాయాలకు విలువే లేకపోతే రాష్ట్రపతి ముసాయిదా బిల్లును ఎందుకు పంపినట్లు? శాసన సభ, శాసన మండలి సభ్యులు కేవల‍ం కంఠశోష వినిపించుకోవడానికేనా? రాజ్యంగంలోని ఆర్టికల్ మూడు ఏం చెబుతున్నది. “Formation of new States and alteration of areas, boundaries or names of existing States.- Parliament may by law: Provided that no Bill for the purpose shall be introduced in either House of Parliament except on the recommendation of the President and unless,  where  the proposal contained in the Bill affects  the  area, boundaries  or  name  of any of the States, the Bill  has  been referred  by  the  President  to the Legislature  of  that  State  for expressing its views thereon within such period as may be specified in the reference or within such further period as the President may allow and the period so specified or allowed has expired". ఈ వాక్యాల పరమార్థమేంటి? కేంద్ర ప్రభుత్వానిది దళారి పాత్ర మాత్రమే. తనకు తానుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలు లేదని స్పష్టమవుతున్నది. ఒకవేళ అధికార దుర్వినియోగానికి బరితెగిస్తే రాజ్యాంగ పరిరక్షణకు ఇతర రాజ్యాంగబద్దమైన‌ వ్యవస్థలు ర‍ంగ ప్రవేశం చేయక తప్పదు. ఈ ఆర్టికల్ రూపకల్పన పూర్వరంగాన్ని కూడా పరిశీలించాలి.
డా. అంబేద్కర్ సవరణల సారామేంటి ?
రాజ్యాంగ సభలో ఆర్టికల్ 3 పై సుదీర్ఘ చర్చ జరిగింది. రాజ్యాంగ సభ సభ్యుల మధ్య వాడివేడి వాదప్రతివాదనలు జరిగాయి. అంతిమంగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన సవరణలను రాజ్యాంగ సభ ఆమోదించింది. రాష్ట్రాల సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే అధికారం రాష్ట్రపతికి దఖలు పరచబడింది. ముసాయిదా రాజ్యాంగంలో మొదట ఈ హక్కును భారత ప్రభుత్వం ఖాతాలో చేర్చారు (“in original draft the power to introduce the Bill was given exclusively to the Government of India. No private Member of Parliament had the power"). అది పార్లమెంటు సభ్యుల హక్కులకు భంగం కలిగిస్తుందని రాజ్యాంగ సభ సభ్యులు కొందరు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తే (“Attention of the Drafting Committee was drawn to the fact that this was a somewhat severe and unnecessary curtailment of the right of the members of Parliament to move any motion they liked and in which they felt concerned”), దానిపై మేథోమదనం తదనంతరం ఆమోదించిన సవరణ‌లు. 
 1) రాష్ట్రాల సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై భారత ప్రభుత్వానికి అధికారాన్ని ధఖలు పరుస్తూ ముసాయిదాలో చేసిన ప్రతిపాదనను తొలగించి, భారత ప్రభుత్వం బిల్లును రూపొందించినా లేదా పార్లమెంటు సభ్యులు ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని విన్నవించినా రాష్ట్రపతి సిఫార్సు లేకుండా పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి వీల్లేదు. (“Consequently we deleted this provision giving the power exclusively to the Government of India, and gave it to the President and stated that any such Bill whether it was brought by the Government of India or by any private Member should have the recommendation of the President”.)
2) రాష్ట్రపతి అనుసరించే పద్ధతికి సంబంధించి కూడా స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి లేదా గవర్నర్ సంబంధిత శాసన సభ మరియు శాసన మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దానిపై చర్చించాలి. తద్వారా సంబంధిత రాష్ట్ర శాసన సభ నుండే ఈ అంశానికి సంబంధించిన ప్రస్తావన రావాలి లేదా చొరవ ప్రదర్శించబడాలి. అంతే గానీ పార్లమెంటు తనకు తానుగా ప్రస్తావన చేయడానికి వీలులేదు. ("The method of consulting, which the President will adopt, will be to ask either the Prime Minister or the Governor to table a resolution which may be discussed in the particular State legislature which may be affected, so that ultimately the initiation will be by the total legislature and not by the Parliament at all".)
3) భారత దేశంలోని రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నది. రాష్ట్రాల సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై సంబంధిత రాష్ట్రాల నుండి అనుమతి పొందాలి. బ్రిటిష్ కాలం నాటి ప్రావిన్సెస్ కు స్వయం ప్రతిపత్తి లేదు కాబట్టి వాటి సరిహద్దులలో మార్పులు చేయడానికి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. భారత యూనియన్ లో అంతర్భాగంగా స్వయం ప్రతిపత్తి ఉన్న‌ రాష్ట్రాలకు, ప్రావిన్సెస్ కు మధ్య ఉన్న స్పష్టమైన మౌలిక వ్యత్యాసాన్ని, విభజన రేఖను డా. అంబేద్కర్ గారు నొక్కి వక్కాణించారు. (“The States are sovereign States and the provinces are not sovereign States. Consequently, the Government need not be bound to require the consent of the provinces to change their boundaries; while in the case of the Indian States, it is appropriate, in view of the fact that sovereignty remains with them that their consent should be obtained".)
పై అంశాలను పరిశీలిస్తే రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యక్తం చేసే అభిప్రాయమేదైనా దానికి విలువ ఉంటుందని సామాన్యులకు సహితం బోధపడుతుంది. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యక్తం చేసే అభిప్రాయాన్ని రాజ్యాంగ పరిరక్షకుడుగా రాష్ట్రపతి తృణీకార భావంతో తోసిపుచ్చలేరని కూడా అర్థవుతుంది. తెలంగాణ అంశంతో ముడిపెట్ట‌కుండా నిష్పాక్షిక దృష్టితో ఈ అంశాన్ని పరిశీలించాలి.
పారదర్శకతపైనే చట్టసభల విశ్వసనీయత :
చట్ట సభలు అత్యంత జాగరూకతతో, బాధ్యతాయుతంగా, పారదర్శకoగా తమ పని విధానాన్ని మెరుగు పరచుకొంటూ సమాజ ప్రగతికి బాటలు వేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం, పరమార్థం ఉంటుంది. వైవిద్యభరితమైన మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకొనడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. అలాగే ప్రస్తుత‌ రాజ్యాంగానికి వర్గ స్వభావం ఉన్నది, తదనుగుణ‍ంగా అనేక పరిమితులు ఉన్నాయి. అందులో ఇమిడి ఉన్న ప్రజాస్వామిక భావనలను పరిరక్షించుకొంటూ, వాటికి కార్యరూపం సముపార్జించుకొంటూ, మెరుగైన రాజ్యాంగ వ్యవస్థ కోసం అడుగు ముందుకు వేయాలి. బహుళ పార్టీ వ్యవస్థను పటిష్టవంతం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో చట్ట సభలు పట్టాలు తప్పి నడకసాగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం. వివక్షతకు, అశాంతికి, అభివృద్ధి నిరోధానికి దారి తీసేలా చట్టసభలు ప్రవర్తిస్తే సామాజిక ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లవుతుంది.
తెలుగు నాట ఒక సున్నితమైన, సంక్లిష్టమైన, జఠిలమైన విభజన సమస్య దేశం ముందుకొచ్చింది. ఈ సమస్యకు హేతుబద్దమైన, న్యాయబద్దమైన పరిష్కారానికై చిత్తశుద్ధితో అన్వేషణ జరగాలి, పరిష్కరించబడాలి. అదే సంద‌ర్భంలో ఈ వివాద‌ పరిష్కారం మరెన్నో సమస్యల ఆవిర్భావానికి బీజం వేయకుండా రాజకీయ విజ్ఞత ప్రదర్శించాలి. ఈనాడు తెలుగు ప్రజల మధ్య తలెత్తిన సమస్య పరిష్కారంలో కాంగ్రెసు పార్టీ, దాని నాయకత్వంలోని యు.పి.ఎ.- II ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించిందనడంలో నిస్సందేహం. దాదాపు పది సంవత్సరాలుగా వారే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. నేడు రాష్ట్రపతిగా ఉన్న ప్రణాబ్ ముఖర్జీ యు.పి.ఎ.-I ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో కమిటీని ఏర్పాటు వేసినా నివేదికే ఇవ్వలేదు. అటుపై శ్రీకృష్ణ కమిటీని నియమిస్తే ఏడాది పాటు ఈ సమస్యపై వివిధ వర్గాల వాద ప్రతివాదనలను, సమాచారాన్నిసేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఆంటోని కమిటీని వేశారు. కేంద్ర మంత్రి మండలి ఉప సంఘాన్ని వేశారు. వారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలన్నింటినీ చట్ట సభల ముందుంచి పారదర్శకంగా చర్చించడానికి ప్రజాస్వామ్యంలో అవకాశం కల్పించాలి. అప్పుడే అర్థవంతమైన,  చర్చకు వీలుంటుందన్న వాదనలో బలం ఉంది. అలా కాకుండా కేవలం విభజనకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుపైనే చర్చ అంటే అది అసమగ్రమైన, పాక్షికమైన చర్చగానే ఉంటుంది. పర్యవసానంగా హేతుబద్ధమైన నిర్ణయానికి చట్టసభ రాలేదు. సుదీర్ఘకాలంగా చర్చించబడుతున్న సమస్యే కదా ! ఇంకా చర్చేంటి అని కొందరంటున్నారు. చట్ట సభలో విభజన అంశం అజెండాలోకొచ్చినప్పుడు సమగ్ర చర్చ జరిపి, ఏ నిర్ణయమైనా తీసుకోవడం ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన లక్షణం.


Wednesday, January 1, 2014

పెడధోరణులపైనే ప్రణబ్ గురి

Sakshi  January 01, 2014 
పెడధోరణులపైనే ప్రణబ్ గురి


 ఒకప్పుడు జనా భా నలభై ఐదు కోట్లుగా ఉన్నప్పుడే దేశాన్ని ఐక్యంగా ఉంచుకోలేక పోయాం. నేడు 125 కోట్ల జనాభాను ఒక్కటిగా ఉంచాలి. ఇది జాతి ముం దున్న అతి పెద్ద సవాలు. రాష్ట్రాల విభజన డిమాండ్లు చాలా ముందుకు వస్తున్నాయి. సవ్యమైన విధానాల రూపకల్పనకు దోహదపడే విధంగా వాస్తవాల ఆధారంగా, హేతుబద్ధమైన క్షేత్రస్థాయి సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత నిఘా సంస్థలపై ఉన్నదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గత నెల 19న అన్నారు.  తద్వారా అయన చాలా లోతైన అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలతో పాటూ పలు పెడ ధోరణులు పెచ్చరిల్లుతున్న పర్యవసానంగా జాతీయ ఐక్యత పెను సవాలు ఎదురవుతోందని ప్రణబ్ హెచ్చరించారా? ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన సమస్య నుంచి ఉత్పన్నమైన పరిస్థితుల కారణంగా పార్లమెంటు అచేతనమై పోవడం పట్ల కలత చెంది అలా వ్యాఖ్యానించారా? ప్రత్యేక తెలంగాణ లోతుపాతులు, పర్యవసానాలపై రాజకీయ విజ్ఞత లోపించిందని భావించారా? ఆ అంశంపై హేతుబద్ధమైన సమాచారాన్ని అందించడంలో నిఘా సంస్థల వైఫల్యాన్ని సూచించారా? ఏది ఏమైనా ఇవన్నీ నిశితంగా పరిశీలించాల్సిన ప్రశ్నలే.

 ‘విభజన’ మూలాలు: పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలకు అనుగుణంగానే మన రాష్ట్ర అభివృద్ధి గమనం ఉన్నది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డు, హైదరాబాద్‌లో ఆల్విన్, నిజామాబాద్‌లో నిజాం చక్కెర పరిశ్రమలు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు. 1965-75 మధ్య కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఈసీఐఎల్, బీహెచ్‌ఈఎల్, ఐడీపీఎల్ లాంటి భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది. పారిశ్రామిక కేంద్రంగా హైదరాబాద్‌కు (కొంత వరకు విశాఖపట్నానికి) పునాదులు పడ్డాయి. ఏ ఒక్క ప్రభుత్వమూ పారిశ్రామిక వికేంద్రీకరణ వైపు దృష్టి పెట్టలేదు. 1990 దశకం నుంచి ప్రవేశ పెట్టిన సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ఫలితంగా పట్టణాలు నగరాలుగా, నగరాలు మహానగరాలుగా ఎదిగి అభివృద్ధి నమూనాలుగా వెలిశాయి. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ఆర్థిక అసమానతలు అతి వేగంగా పెరిగిపోతుండగా ప్రజల్లో అసంతృప్తి ప్రజ్వరిల్లుతున్నది. ఈ పరిస్థితులు విభజనోద్యమాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనడంలో సందేహం లేదు. రాష్ట్రాలు బలహీనంగా ఉండాలన్న భావజాలంతో బీజేపీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉంది. అవకాశవాదాన్ని తలకెక్కించుకొన్న కాంగ్రెస్ ఓట్లు, సీట్లే కొలబద్దగా  ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానాన్ని అమలు చేస్తున్నది. ‘విభజించి పాలించు’ విధానాన్ని అనుసరిస్తోంది. అస్తిత్వ రాజకీయాల్లో భాగంగా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు పట్టంగట్టే రాజకీయ శక్తులు ఆ ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ‘ప్రత్యేక’ డిమాండ్లేవీ దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించవని కొందరి వాదన. శాంతియుత సహజీవనం సాగించాల్సిన ప్రజల మధ్య విషబీజాలను నాటుతున్నామనే స్పృహ లోపించడం శోచనీయం.

 అనుభవాల నుంచి ఏం నేర్చుకొన్నాం? బ్రిటిష్ పాలకులు పోతూ పోతూ కుట్రపూరితంగా దేశాన్ని రెండు ముక్కలు చేసి, సరిహద్దుల్లో రావణ కాష్టాన్ని రగిల్చి పోయారు. మన దేశం అండదండలతో సాగిన తూర్పు పాకిస్థాన్ విముక్తి ఉద్యమం ఫలితంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. దీంతో పాక్ మనపై మరింత కక్ష పెంచుకుంది. కాశ్మీర్ సమస్య సాకుతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్నది. అలాంటి సున్నిత రాష్ట్రం జమ్మూ-కాశ్మీర్‌ను జమ్మూ, కాశ్మీర్, లడఖ్ అనే మూడు రాష్ట్రాలుగా విడగొట్టాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈశాన్యంలో గ్రేటర్ నాగాలాండ్, బోడోలాండ్, గూర్ఖాలాండ్ వగైరా డిమాండ్లతో నిరంతరం ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో పొందుపరచిన 15 భాషలలో స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే సదుపాయాలు పార్లమెంటులోనే లేని దుస్థితి కొనసాగుతున్నది. జనాభాలో 38 శాతం హిందీ మాట్లాడుతున్నా దాన్ని అందరిపై రుద్దాలని చూస్తే ప్రతిఘటన తప్పదు. రాష్ట్రాల చట్టసభల్లో మాతృభాష అమలుకు సైతం చిత్తశుద్ధి ప్రయత్నించాల్సి ఉంది. పార్లమెంటు కార్యకలాపాలపై హిందీని రుద్దే ప్రయత్నాలకు దక్షిణాది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం సహజం. దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాది పెత్తనమే సాగుతోందనే అభిప్రాయం ఇప్పటికే బలంగా ఉంది.

 ఒకటి మాత్రం వాస్తవం... ప్రాంతీయ, భాషాపరమైన సమస్యల వంటి సున్నిత సమస్యలపై వివిధ ప్రాంతాల ప్రజల మనోభావాలు సున్నితంగా, జటిలంగా తయారవుతున్నాయి. అవి ఎప్పుడు ఎలా పరిణమిస్తాయోననే సందేహాలను కలుగజేస్తున్నాయి. రాష్ట్రపతి ఆ కోణాన్నే స్పృశించినట్లుంది. ఇలాంటి సమస్యలపై ఆషామాషీగా తీసుకునే నిర్ణయాల వల్ల పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయని రాష్ట్రపతి చెప్పకనే చెప్పారనిపిస్తుంది. నిఘా వర్గాలు నిష్పాక్షికంగా, వాస్తవాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని విధాన నిర్ణేతలకు అందించి, సముచిత నిర్ణయాల రూపకల్పనకు తోడ్పడాలని ప్రణబ్ ఉపదేశించారు.

 నేటి సంకీర్ణ రాజకీయాల యుగంలో సైతం అతి పెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏకమై ఎలాంటి లోపభూయిష్టమైన, హానికరమైన చట్టాన్నయినా తీసుకొచ్చి దేశంపై బలవంతంగా రుద్దగలవు. అలాంటి ప్రమాదమే చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ముంచుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేసి అడ్డగోలుగా రాష్ట్రాల విభజనకు అవి బరితెగించగలవనడానికి తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ పరిణామాలు. ఈ విషయంలో కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి, సమాఖ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి. తెలంగాణ అంశాన్ని నానబెట్టి ఎన్నికలు సమీపిస్తుండగా దుందుడుకుగా వ్యవహరించడంలోని హేతుబద్ధతను, లోపాలను ప్రతిపక్షాలు ప్రశ్నించకపోవడం, ప్రేక్షక పాత్ర పోషించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు.  
 టి. లక్ష్మీనారాయణ,  డెరైక్టర్  నీలం రాజశేఖరరెడ్డి  పరిశోధనా కేంద్రం
 

Tuesday, December 17, 2013

కరవు పీడితుల‌పై పిడుగు - ట్రిబ్యునల్‌ తీర్పు





కృష్ణా నది మిగులు జలాలను సంపూర్ణంగా వినియోగించుకొనే స్వేచ్ఛను హరించి వేసి, నిత్య కరవు పీడిత ప్రాంత‌ ప్రజల ఆశలను ఆవిరి చేసిన‌ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు యావత్తు తెలుగు జాతికి అశనిపాతం లాంటిది. తీర్పును ఆమూలాగ్రం పరిశీలిస్తే తెలుగు జాతి భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకొంటున్నాయి. నికృష్టమైన‌ బ్రిటీష్ వలస పాలన రోజుల్లో సర్ ఆర్థర్ కాటన్ కృషి ఫలితంగా కృష్ణా నదిపై 1852-56 మధ్య‌ కాలంలో విజయవాడ వద్ద ఆనకట్టను నిర్మించడం ద్వారా డెల్టా కాలువలు మరియు గుంటూరు కాలువ‌కు, కృష్ణా నదికి ఉపనది అయిన తుంగభద్ర పై 1861-72 మధ్య కాలంలో సుంకేసుల ఆనకట్టను కట్టి కర్నూలు కడప కాలువకు,  స్వాతంత్య్రం సముపార్జించుకొన్న‌ తొలినాళ్ళలోనే ఆధునిక దేవాలయంగా అభివర్ణించబడిన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 1955లోను, తుంగభద్ర ప్రాజెక్టు ఎగువ కాలువ రెండవ దశకు 1956లోను ప్రాణప్రతిష్ట‌ చేసుకోక‌పోయి ఉంటే నీటిపారుదల రంగంలో నేడు తెలుగు జాతి దుస్థితి ఎలా ఉండేదో ఊహించడం కష్టం. భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో కృష్ణా నదీ జలాల పున: పంపిణీ అంశంపై 1960 సెప్టంబరులో జరిగిన  అంతర్రాష్ట్ర మహాసభ సుధీర్ఘంగా చర్చించిన మీదట 1951 కి ముందు నిర్మించబడి నీటిని వినియోగించుకొంటున్న మరియు 1960 నాటికి ప్రణాళికా సంఘం ఆమోదంతో చట్టబద్దంగా నిర్మాణంలో ఉన్న‌ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి రక్షణ కల్పించాలని ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. నాటి ఆ నిర్ణయమే నేటికీ రక్షణ కవచంగా నిలిచి కృష్ణా నదిలో 75% విశ్వసనీయత ఆధారంగా లభిస్తున్న 2060 టి.యం.సి.లలో మన రాష్ట్ర వాటాగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 800 టి.యం.సి.లు పరిరక్షించబడ్డాయి.  
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్న‌ నానుడి బాగా ప్రాచుర్యంలో ఉన్నది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగు జాతికి శరాఘాతంగా పరిణమించడానికి మూల కారణం మన రాష్ట్ర రాజకీయ వ్యవస్థ ఘోరవైఫల్యమే. కాంగ్రెస్ పార్టీ , దాని నేతృత్వంలోని యు.పి.ఎ. -II ప్రభుత్వం విభజన రాజకీయాలతో వికృతమైన‌ రాచక్రీడ ఆడుతూ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసింది. సందట్లో సడేమియా అన్నట్లు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రలు అందొచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని కృష్ణా జలాల పున: పంపకంలో తాము కోరుకొన్న రీతిలో తీర్పును బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా చట్టబద్ద‍ం చేసుకొనే ప్రయత్నంలో సఫలమయ్యాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విభజన రాజకీయాల చుట్టూ పరిభ్రమిస్తూ కాలం వెళ్ళబుచ్చి "చేతులు కాలిన తరువాత‌ ఆకులు పట్టుకొన్నట్లు" ట్రిబ్యునల్ తీర్పుపై  గుండెలు బాదుకొంటున్నాయి. గడచిన అర్థదశాబ్దంగా ప్రజల జీవన్మరణ సమస్యలను పట్టించుకొనే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయింది. గాడితప్పిన‌ ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో పొడిచి, రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక‌ ప్రయోజనాలను పరిరక్షించుకోవడంలో తమ వంతు పాత్ర పోషించాల్సిన రాజకీయ పార్టీలు సంకుచిత రాజకీయాల ఊబిలో కూరుకపోయాయి. పర్యవసానంగా ప్రజల భవిష్యత్తు గాలిలో దీపంగా కొట్టుమిట్టాడుతున్నది. దుష్పరిణామాలు కమ్ముకొస్తున్నాయి. ఆ కోవలోనిదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉన్నప్పటి నుంచే కర్నాటక, మహారాష్ట్రలు మిగులు జలాలపై కన్నేసి, రాయలసీమ ప్రాంతంలోను, తెలంగాణా ప్రాంతంలోని మహబూబ్ నగర్ మరియు నల్లగొండ జిల్లాలలోనూ, కోస్తా ప్రాంతంలోని ప్రకాశం జిల్లాలో నిర్మించబడుతున్న ప్రాజెక్టులపై అభ్యంతారాలను లేవదీస్తూనే ఉన్నాయి. ఆ రాష్ట్రాలు 2000 మే 31న‌ ట్రిబ్యునల్ గడువు ముగియగానే ఈ సమస్యపై వివాదాన్ని రేపి, ఉడుంపట్టు పట్టి, అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగించి విజయం సాధించాయి. నదీ పరివాహక ప్రాంతంలో దిగువనున్న రాష్టం అనివార్యంగా ఎదుర్కొనే కష్ట నష్టాలను పరిగణలోకి తీసుకొన్న బచావత్ ట్రిబ్యునల్  మిగులు జలాల వినియోగానికి సంబంధించి న్యాయబద్దంగా కల్పించిన‌ స్వేచ్ఛను  కాపాడుకోవడంలో మనం చతికిలపడ్డాం. సంక్లిష్టమైన‌, జఠిలమైన అంతర్రాష్ట్ర నదీజలాల సమస్యను కేవలం న్యాయవాదుల సామర్థ్యానికే వదిపెట్టడం వల్ల కొంప మునిగింది. జలయజ్ఞంలో భాగంగా ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి, నిర్మాణంలో ఉన్న తెలుగు-గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ, నెట్టంపాడు, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది.
నీటి లభ్యతను నిర్ధారించడానికి ట్రిబ్యునల్  ఎంచుకొన్న‌ ప్రామాణికం అసంబద్దమైనది, అశాస్త్రీయమైనది. కర్నాటక, మహారాష్ట్రల కోర్కెలకు అనుగుణంగా నీటిని కేటాయించడానికే అన్నట్లుగా కొలమానాలను అమలు చేసినట్లు స్పష్టమవుతున్నది. మూడు రాష్ట్రాలలో నిర్మించబడిన జలాశయాలలో స్థూలంగా 1919 టి.యం.సి.ల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నదని, 1518 టి.యం.సి.ల (మహారాష్ట్ర+కర్నాటక+ ఆంధ్రప్రదేశ్ : 483.24+479.35+555.84=1518.43) మేరకు సజీవ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నదని , గరిష్టంగా 2313 టి.యం.సి. (మహారాష్ట్రలో 551.65 టి.యం.సి.లు, కర్నాటకలో 695.97 టి.యం.సి.లు, ఆంధ్రప్రదేశ్ లో 1065.44 టి.యం.సి.) నీటిని వినియోగించుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనా వేసి, తదనుగుణంగా 65% విశ్వసనీయత ఆధారంగా 2293 టి.యం.సి.లు లభిస్తాయని నిర్ధారించి, పందారం చేసింది. 1518.43 టి.యం.సి.లలో శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాలలో 'క్యారీ ఓవర్' నిల్వకు అనుమతించిన 150 టి.యం.సి.లను మినహాయిస్తే 1368.43 టి.యం.సి. సజీవ నిల్వ సామర్థ్యంతో, నీటి నిల్వ _  వినియోగ‌ నిష్పత్తి 1:1.40 గా ఉంటుందని ట్రిబ్యునల్ పేర్కొన్నది. ఇంకా నిర్మాణం పూర్తి కాని పులిచింతల జలాశయం నిల్వను కూడా లెక్కించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ మరియు తుంగభద్ర జలాశయాల్లో పూడిక‌ వల్ల తగ్గిపోయిన నీటి నిల్వను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. అలాగే ప్రకాశ‍ం ఆనకట్ట వద్ద నుండి అనివార్యంగా సముద్రం పాలౌతున్న నీటినీ లెక్కలోకి తీసుకోలేదు.
హేతుబద్దం కాని కొలమానాలు - పంపకాలు: బచావత్ ట్రిబ్యునల్ 1894-95 నుండి 1971-72 వరకు అందుబాటులో ఉన్న78 సంవత్సరాల నదీ ప్రవాహ గణాంకాలను పరిగణలోకి తీసుకొని 75% ప్రామాణికంగా 2060 టి.యం.సి. నికర జలాలు, 70 టి.యం.సి.ల పునరుత్పత్తి నీళ్ళు లభిస్తాయని నిర్ధారించి, ఆ మేరకు మహారాష్ట్రకు 585 (560 నికర జలాలు+25 పునరుత్పత్తి జలాలు) టి.యం.సి.లు, కర్నాటకకు 734(700+34) టి.యం.సి.లు, ఆంధ్రప్రదేశ్‌కు 811 (800+11) టి.యం.సి.లు కేటాయించింది. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 112 సం.ల నదీ ప్రవాహ గణాంకాలున్నప్పటికీ 1961-62 మొదలు 2007-08 వరకు 47 సంవత్సరాల నదీ  ప్రవాహ గణాంకాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని 65% విశ్వసనీయత ఆధారంగా నికరజలాలు 2293 టి.యం.సి.లు లభిస్తాయని నిర్దారించింది. అలాగే  75% విశ్వసనీయతపై 2173 టి.యం.సి.లు లభిస్తాయని, బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న నికరజలాలు 2060+ 70 పునరుత్పత్తి నీరు కలిపితే 2130 టి.యం.సి.లకు ఇవి సరిసమానంగా ఉన్నాయని పేర్కొన్నది. కాబట్టే! బచావత్ ట్రిబ్యునల్ చేసిన నికరజలాల కేటాయింపును యదాథదంగా కొనసాగిస్తూ, మిగిలిన 163 (2293-2130) టి.యం.సి.లను మూడు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారిగా కేటాయించింది.
నదీ జలాలను మొదట త్రాగు నీటికి, తరువాత వ్యవసాయానికి, అటుపై విద్యుదుత్పాదనకు కేటాయించాలని జాతీయ నదీ జలాల విధానం విస్పష్టంగా పేర్కొన్నది. కానీ తద్భిన్నంగా అభ్యంతారాలను బేఖాతరు చేసి ముంబాయ్ మరియు దాని పరిసర ప్రాంతాల విద్యుత్ అవసరాల దృష్ట్యా కోయినా జల విద్యుత్తు ప్రాజెక్టుకు ప్రస్తుతం ఉన్న 67.5 టి.యం.సి.లతో పాటు మరో 25 టి.యం.సి.లను, సాగు నీటి ప్రాజెక్టులకు 18 టి.యం.సి. వెరశి మొత్తం 43 టి.యం.సి.లను మహారాష్ట్రకు కేటాయించింది. కర్నాటకకు 65 టి.యం.సి.లను వివిధ సాగు నీటి పథకాలకు కేటాయించింది.
అక్కడితో ఆగ కుండా వార్షిక సగటు నీటి లభ్యత 2578 టి.యం.సి.లుగా నిర్ధారించి, 65% విశ్వసనీయతపై పేర్కొన్న 2293 టి.యం.సి.లు పోను 285 టి.యం.సి. లు మిగులు జలాలు లభిస్తాయని, వాటిలో మహారాష్ట్రకు 35 టి.యం.సి., కర్నాటకకు 105 టి.య‍ం.సి.లను ప్రాజెక్టుల వారిగా కేటాయించడం ద్వారా కేంద్ర జల సంఘం నుండి అనుమతులు పొంది ప్రాజెక్టులను నిర్మించుకోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. పైపెచ్చు మిగులు జలాలను కూడా పంపిణీ చేస్తున్నాము కాబట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇక మీదట నికర లేదా మిగులు జలాలన్న వివక్ష ఉండదని సెలవిచ్చింది.  ఇది చాలా ప్రమాదకరమైనది. మొత్తంగా మహారాష్ట్రకు  666 (585+43+35+3) టి.యం.సిలు, కర్నాటకకు 911(734+65+105+7) టి.యం.సి.ల కేటాయింపు జరిగింది. ఆ మేరకు ప్రాజెక్టులను నిర్మిస్తే ఇహ! మన రాష్ట్రానికి నీళ్ళొచ్చే అవకాశాలు మృగ్యం.
ఆల్మట్టి ఎత్తు పెంపు - మన నెత్తిన కుంపటి: కర్నాటకకు అప్పర్ కృష్ణా ప్రాంతంలో 130 టి.యం.సి. మేరకు కేటాయింపులు పెంచి, వాటిని నిల్వ చేసుకొనే అవకాశం కూడా కల్పించాలని పేర్కొంటూ ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న173 టి.యం.సి. నుండి 303 టి.యం.సి. లకు పెంచుతూ ట్రిబ్యునల్ ఆమోదముద్ర వేసింది. గతంలో సుప్రీంకోర్టు అనుమతించిన 519.6 మీటర్ల ఎత్తుతోనే ఆల్మట్టి డ్యాం నిర్మాణం తరువాత మన రాష్ట్రానికి వరదలు వచ్చినప్పుడు అనివార్యమైతే తప్ప, నీటిని విడుదల చేయలేదు. 2060 టి.యం.సి.ల నికరజలాలలో మహారాష్ట్రలోని 8,940 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంత‍ం నుండి 962.5(46.72%) టి.యం.సి.,  కర్నాటకలోని 6,113 చ.కి.మీ. పరివాహక ప్రాంత‍ం నుండి 760.9(36.94%) టి.యం.సి., ఆంధ్రప్రదేశ్లోని 1,929 చ.కి.మీ. పరివాహక ప్రాంత‍ం నుండి 336.6(16.34%) టి.యం.సి.లు లభిస్తున్నాయి. అంటే మన రాష్ట్రానికి కేటాయించిన 800 టి.యం.సి. లలో 336.6 టి.యం.సి.లను మినహాయించి మిగిలిన 463.4 టి.యం.సి. లు + మద్రాసుకు త్రాగు నీటి కోసం 10 టి.యం.సి.(మహారాష్ట్ర, కర్నాటక వాటా) + కనీస నదీ ప్రవాహం వెరసి దాదాపు 500 టి.యం.సి.ల నీరు ప్రతి ఏడాది కర్నాటక నుండి మన రాష్ట్రానికి అనివార్యంగా ప్రవహించాలి. కానీ, కర్నాటక రాష్ట్రం నుండి 2002-03 మరియు 2003-04 లో మన రాష్ట్రానికి ఒక్క టి.యం.సి. నీరు కూడా రాలేదు,  2000-01లో 317, 2001-02లో 140, 2004-05 లో 252 టి.యం.సి.లు మాత్రమే వచ్చాయి. మనకు కేటాయించిన నికర జలాలను కూడా పొందలేక పోయాం. నాడు నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టా క్రింద కరువు పరిస్ధితులు నెలకొన్న చేదు అనుభవం ఉన్నది. ఇలాంటి స్ధితిలో తాజా తీర్పు వల్ల‌ భవిష్యత్తులో మరింత‌ దుష్పపరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది.   .                                                                              
వివక్షతకు బలి: మన రాష్ట్రానికి వచ్చేటప్పటికీ ట్రిబ్యునల్ దుర్మార్గంగా వ్యవహరించింది. రాష్ట్రానికి 65% విశ్వసనీయత పద్దు క్రింద 43 టి.యం.సి. లను కేటాయించినట్లు పేర్కొంటూనే, కనికట్టు మాయాజాలం చేసింది. ఒక్క జూరాలకు మాత్రమే నిజాయితీగా 9 టి.యం.సి.లను కేటాయించింది. మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న ఏడు ప్రాజెక్టులకు నీటిని కేటాయించమని కోరితే పట్టించుకోకుండా ముసాయిదా తీర్పులో పొందుపరచని రాజోలి బండ మళ్ళింపు పథకం కుడి కాలువకు 4 టి.యం.సి.లను మంజూరు చేసి, వివాదానికి ఆజ్యం పోసింది. దారుణమైన అంశమేమంటే! 65% విశ్వసనీయత ప్రాతిపదికన రాష్ట్రానికి కేటాయించిన మిగిలిన 30 టి.యం.సి.లను కరవు పీడిత ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నపథకాలకు కేటాయించకుండా శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాల్లో క్యారీ ఓవర్ పద్దు క్రింద జమ చేసింది.  బచావత్ ట్రిబ్యునల్ 150 టి.యం.సి.ల మిగులు జలాలను క్యారీ ఓవర్  నిమిత్తం నిల్వ చేసుకోవడానికి  అనుమతించింది. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల్లో మన రాష్ట్రానికి 145 టి.యం.సి.లను మంజూరు చేసి, అందులో 120 టి.యం.సి. లను, వాటికి తోడు 65% విశ్వసనీత ఉన్న30 టి.యం.సి.లను వెరసి 150 టి.యం.సి.లను క్యారీ ఓవర్ నిల్వ కోసం కేటాయించింది. మూడు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న తెలుగు-గంగకు మాత్రం వస్తాయో! రావో! తెలియని మిగులు జలాల నుండి 25 టి.యం.సి.లను కేటాయించింది. పైగా ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ లభిస్తేనే ఇది వర్తిస్తుందని షరతు విధించింది. ఇది వెనుకబడ్డ రాయలసీమ‌కు దగా చేయడం కాక మరేమౌతుంది? బచావత్ ట్రిబ్యునల్ 811 టి.య‍ం.సి. ల నికరజలాలకు తోడు కృష్ణా డెల్టా మరియు నాగార్జునసాగర్ ఆయకట్టుకు జూన్, జూలై మాసాల్లోనే నీటిని అందించే నిమిత్తం 150 టి.యం.సి. లను మిగులు జలాల నుండి క్యారీ ఓవర్ పద్దు క్రింద మంజూరు చేస్తే! బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంకెల గారడీతో దగా చేసింది. పేరుకు 1005 టి.యం.సి.లను కేటాయించినట్లు పెర్కొన్నా, వాస్తవానికి 44 టి.యం.సి.లనే అదనంగా కేటాయించింది. అందులో నాలుగు టి.య‍ం.సి.లపై కర్నాటక వివాదాన్ని కొనసాగిస్తున్నది. నియంత్రణ మండలి ఉన్నా పై రాష్ట్రాలు ప్రాజెక్టులను నిర్మించుకొని నీటిని వినియోగించుకోవడం మొదలైన తరువాత ఇహ 75% లేదా 65% విశ్వసనీయతపై కేటాయించిన‌ నికరజలాలు లేదా మిగులు జలాలన్న విసక్షణ ఉండే అవకాశమే లేదు.
గడచిన అనుభవం ఆధారంగా నికర జలాల వినియోగంలో మహారాష్ట్రకు 99%, కర్నాటకకు 97% సఫలీకృత నిష్పత్తి (సక్సెస్ రేటు) ఉన్నదని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కు కేవలం 68% ఉన్నదని మొరపెట్టుకొన్నా ట్రిబ్యునల్ చెవికెక్కించుకోక పోగా, 75% విశ్వసనీయత ఆధారంగా కేటాయించిన నీటి వినియోగానికి దరిదాపుల్లో సఫలీకృత నిష్పత్తి ఉన్నదని పేర్కొంటు తృణీకారభావంతో మన రాష్ట్ర వాదనను తిరస్కరించింది.
కరవు ప్రాంతాల మధ్య‌ వివక్షతెందుకు? కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్రలో 50,242 చదరపు కిలోమీటర్లు, కర్నాటకలో 52,375 చ.కి.మీ., ఆంధ్రప్రదేశ్ లో 45,493 చ.కి.మీ. మేరకు కరవు పీడిత ప్రాంతాలు ఉన్నట్లు డి.పి.ఎ.పి. గణాంకాలను బట్టి స్పష్టమవుతున్నదని ట్రిబ్యునల్ గుర్తిస్తూనే, 65% విశ్వసనీయత ఆధారంగా లభిస్తాయని అంచనా వేసిన 163 టి.యం.సి.లు. మరియు మిగులు జలాలు 285 టి.యం.సి.లు, మొత్తం 448 టి.యం.సి.ల నీటిని పంపిణీ చేసేటప్పుడు మాత్రం మన రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు ట్రిబ్యునల్ మొండి చేయి చూపెట్టింది. ఏ మాత్రం కనికరం చూపెట్టలేదు. నదీ పరివాహక ప్రాంత‍ం పరిథిలోకి రాని రాష్ట్రాలకు నీటిని తరలించడంపై పరిమితులు విధించిన ట్రిబ్యునల్, పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలను ఒక యూనిట్ గా భావించి నీటిని తరలించడాన్ని చట్టబద్ధమైన చర్యగానే విస్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆచరణలో నీటి కేటాయింపుకు వచ్చేసరికి పరివాహక ప్రాంతంలోని కరవు పీడిత ప్రాంతాలన్న పేరుతో మహారాష్ట్ర , కర్నాటకలకు పొడుగు చేతుల పందారం చేసింది.  పరివాహక ప్రాంతంలోనే ఉన్న మన రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల పట్ల వివక్షత ప్రదర్శించింది.
నదీ ప్రవాహన్ని సజీవంగా ఉంచడం ద్వారా పర్యావరణ, వన్య జంతువుల పరిరక్షణ, సిల్ట్ ను సముద్రం వరకు తీసుకెళ్ళడం కోసం 65% విశ్వసనీయత ఉన్న‌16 టి.యం.సిలను మాత్రమే ట్రిబ్యునల్‌ కేటాయించింది. దీని వల్ల కూడా మన రాష్ట్రానికి తీవ్ర హాని జరుగుతుంది. నదికి ఎగువ భాగంలో ఉన్న‌ మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలోని జలాశయాల్లో ఓండ్రు మట్టి, ఇసుక, ఉప్పు పోగుబడకుండా దిగువనున్న మన రాష్ట్రంలోని జలాశయాల్లో పూడిక పెరిగిపోతుంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర జలాశయాలలో నీటి నిల్వ సామర్థ్యం భాగా పడిపోయి దాదాపు వంద టి.యం.సి.ల మేరకు నష్టపోతున్నామని నిపుణులు అంచనా. నదీ ప్రవాహానికి ప్రస్తుతం చేసిన 16 టి.యం.సి.లు నామమాత్రమే. వాటిని రెండుమూడింతలు పెంచాల్సిన అవసరముంది. తీర్పును అధికారికంగా ప్రకటించి, కేంద్రం మరియు మూడు రాష్ట్రాల ప్రతినిధులతో '''కృష్ణా నదీ జలాల తీర్పు - అమలు మండలి”ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ట్రిబ్యునల్ సిఫార్సు చేసింది. ‍తుంగభద్ర బోర్డు రద్దయిపోయి మొత్తం కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఒకే బోర్డు నియంత్రణలోకి వస్తుంది. తుంగభద్ర బోర్డు పని విధానానికి సంబందించిన చేదు అనుభవాలు మనకున్నాయి. ఈ తీర్పే చట్టబద్దమయితే మన రాష్ట్రానికి జరిగే నష్టం వర్ణనాతీతం.                                                                                                        
పిల్లికి చెలగాటం_ఎలుకకు ప్రాణ సంకటం: మరొక వైపున‌ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన‌ ముసాయిదా బిల్లులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జల వివాదాల పరిష్కారానికి మరొక జల‌ మండలిని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నేతృత్వంలో నెలకొల్పాలని సిఫార్సు చేసింది. నదీ జలాలు రాష్ట్రాల జాబితాలోకి వస్తాయి. అంటే విభజనంటూ జరిగితే నదీ జలాలపై కేంద్ర‍ం పెత్తనం చేస్తుందన్నమాట. ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాల అధికారాలను కబ్జా చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. తద్వారా తెలుగు నాట వివిధ ప్రాంతాల‌ మధ్య నెలకొన్నజఠిలమైన‌ నీటి సమస్యపై కోతి మద్దిస్తం చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆయుష్సును పెంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మ‌ధ్య కృష్ణా నదీ జలాల సమస్య పరిష్కార బాధ్యతను అప్పగిస్తామని పేర్కొనడం మరీ హాస్యాస్పదం. మిగులు జలాలపై మన రాష్ట్రానికి ఉన్న స్వేచ్ఛను కాలరాచి,  రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న హంద్రీ-నీవా, గాలేరు -నగరి, వెలుగొండ, నెట్టంపాడు, కల్వకుర్తి, యస్.యల్.బి.సి. పథకాల  నిర్మాణాన్ని గుర్తించనిరాకరించి, నీటి కేటాయింపుల్లో మొడి చేయి చూపెట్టి, వాటి భవిష్యత్తుపై గొడ్డలి పెట్టు వేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ ప్రాజెక్టులకు నీటిని ఎక్కడి నుంచి తెచ్చి కేటాయిస్తుంది? ఎవరిన్ని దగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నాటక మాడుతున్నది? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65% విశ్వసనీయతను ప్రామాణికంగా ఎంచుకొని నికరజలాలను నిర్ధారించి, మిగులు జలాలతో సహా మూడు రాష్ట్రాలకు పంపిణీ చేయడమే కాకుండా ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుకోవడానికి ఆమోదముద్ర వేసి ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసింది. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల మధ్య తంపులు పెట్టి, నీటి యుద్ధాలకు ఆజ్యం పోస్తున్నది.