Wednesday, April 29, 2015

చంద్రబాబునాయుడుపై కెసిఆర్ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపైన‌, నాగం జనార్దన్ రెడ్డి రాజకీయ వ్యూహంపైన వచ్చిన వూహాగానాలపై హెచ్.యం.టీ.వి.లో ఏప్రి 29, 2015న జరిగిన చర్చలో నాతో పాటు బిజెపి నాయకులు డా. నాగం జనార్దన్ రెడ్డి, టిడిపి నాయకులు శ్రీ రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ సమ్మారావు, టి.ఆర్.యస్. నాయకులు శ్రీ నాగేంద్ర గౌడ్ పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=eTW59P9wXu8

6టీవిలో ఏప్రిల్ 28 రాత్రి 'టిటిడి పాలక మండలి నియామకం _ సభ్యుల అర్హతలు' అన్న అంశంపై జరిగిన ప్రత్యేక చర్చలో నాతో పాటు ఆంధ్ర మేధావుల సంఘం, అధ్యక్షులు శ్రీ చలసాని శ్రీనివాస్, వై.యస్.ఆర్.సి.పి. నాయకురాలు శ్రీమతి లక్ష్మీపార్వతి, వి.హెచ్.పి.నాయకులు శ్రీ శ‌శిధర్ పాల్గొన్నారు. టిటిడి పాలక మండలి నియామకంలో సంకుచిత‌ రాజకీయ ప్రయోజనాలు, సభ్యులకు ఉండవలసిన‌ అర్హతలు, టిటిడి నిర్వర్తించాల్సిన‌ సామాజిక బాధ్యత, టిటిడి ఆర్థిక సహకారంతో నెలకొల్పబడిన విద్యా, వైద్య సంస్థలలో ఇతర మతాలకు చెందిన వారు ఉద్యోగాలకు, పదోన్నతులకు అనర్హులా! కాదా! అన్న పలు అంశాలపై చర్చ జరిగింది. నేను కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశాను. నేను మాట్లాడే సందర్భంలో వి.హెచ్.పి.నాయకులు కాస్త అడ్డుతగిలి మాట్లాడడంతో నేనూ కాస్త నోరుపెంచి మాట్లాడాల్సి వచ్చింది. ఆసక్తి ఉన్న మిత్రులు చూసి హేతుబద్ధమైన నిర్ధారణకు రాగలరు.

https://www.youtube.com/watch?v=SkYWOyYWXnE

Sunday, April 26, 2015

"ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా" అంశంపై కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా శీతారామన్ చేసిన వ్యాఖ్యలపైన, టి.ఆర్.యస్. ఫ్లీనం పైన హెచ్.యం.టీ.వి.లో ఈ రోజు ఉదయం జరిగిన చర్చలో నాతో పాటు కాంగ్రెస్ పార్టీ, ఆ.ప్ర. అధికార ప్రతినిథి డా. తులసిరెడ్డి, టిడిపి నాయకులు శ్రీ రామక్రిష్ణ, బిజెపి నాయకులు శ్రీ ప్రకాశ్ రెడ్డి, టి.ఆర్.యస్. నాయకులు శ్రీ గట్టు రామచంద్రరావులు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=mma1FDl81qc

వ్యవసాయ సంక్షోభం: రైతు ఆత్మ‌హత్యలు - భూసేకరణ చట్టానికి సవరణలు - ప్రభుత్వ నీతి

రెండు రోజుల క్రితం ఒక రైతు మిత్రుడు ఫోన్ చేశాడు. మేమిరువురం ఐదు నుండి పదవ తరగతి వరకు కడప జిల్లా చిట్వేలి ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకొన్నాం. అతను వ్యవసాయదారుడుగా వృత్తిని ఎంచుకొన్నాడు. ఇప్పుడు ఆర్థిక వడుదుడుకులతో సతమతమవుతున్నాడు. ఆశ పెట్టుకొన్న‌రుణ మాఫీ పథకం తనకు వర్తించ లేదని చెప్పాడు. ఆ మండలంలో ఆరేడు మంది రైతులు మాత్రమే రుణ మాఫీకి అర్హులుగా ఎంపికైనారని చెప్పాడు. ఆర్థికంగా నిలదొక్కుకొని, పిల్లల చదువులకు అంతరాయం కలగకుండా ఎలా నెట్టుకు రావాలనే ఆవేదన వ్యక్తం చేస్తూ ప్ర‌త్యామ్నాయ ఉపాథి కోసం గత కొంత కాల‍ంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఇవ్వలేదని బాధపడ్డాడు. ఇది రైతాంగం యొక్క‌ హృదయవిదారకమైన దుస్థితికి అద్దం పడుతున్న ఒక ఉదంతం.
దాదాపు 60% మందికి ఉపాథి కల్పిస్తూ, జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి బయటపడేసి, రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తున్న సమస్యల మూలాల్లోకెళ్ళి శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తేనే దేశం ప్రగతి బాటలో అడుగు ముందుకు వేయగలదు. అప్పుడే 120 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఆహార భద్రతకు భంగం కలగకుండా జాగ్రత్త పడగలం. సరళీకృత ఆర్థిక విధానాలతో రైతు కొనాల్సిన విత్తనాలు మొదలు రసాయనిక ఎరువులు, పురుగు మందులు, ఆధినిక యంత్ర సామగ్రి, పనిముట్లు వగైరా అన్నింటి ధరలూ హనుమంతుని తోకలా పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు రైతాంగం వెన్ను విరుస్తున్నాయి. మెట్ట ప్రాంతాల రైతాంగం, తమ‌ కళ్ళ ముందే వేసిన‌ పంటలు, పండ్ల తోటలు, ఇతర ఉద్యాన వన పంటలు మలమల మాడిపోతుంటే గుండె తరుక్కు పోయి, అడుగంటి పోతున్న భూగర్భ జలాల వెంట పరిగెడుతూ బోర్ల మీద బోర్లు వేసుకొంటూ అప్పుల ఊబిలో కూరుక పోతున్నారు.
మార్కెట్ లో ఖరీదైన‌ సరుకులుగా మారిపోయిన పిల్లల చదువు, కుటుంబ సభ్యులకు వైద్యం ఖర్చులకు అప్పుల మీదే ఆధారపడ వలసిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం వైపు పరుగులు తీస్తూనే ఉన్నాయి. రైతులపై ఆర్థిక భారం మోపే రంగాలను, పారిశ్రామిక వర్గాలను నియంత్రించక పోగా వారికే అన్ని రకాల రాయితీలు ఇస్తూ ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలిచి, ప్రోత్సహిస్తున్నాయి. వ్యవసాయ‌ రంగం సంక్షోభంలో కూరుకపోతున్న, నిరుద్యోగం పెరిగి పోతున్నా, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ముంచుకొస్తున్నా, పర్యావరణం ధ్వంసమౌతున్నా ఏ మాత్రం ఖాతరు చేయకుండా తాము పట్టిన‌ కుందేటికి మూడే కాళ్ళన్న నానుడిగా దేశ స్థూల జాతీయోత్ఫత్తి పెరగాలంటే విదేశీ మరియు స్వదేశీ కార్పోరేట్ సంస్థలకు ఎర్ర తివాచీ పరిచి, ఊడిగం చేస్తే తప్ప‌ పారిశ్రామికాభివృద్ధి జరగదన్న ఆర్థిక సిద్ధాంతాన్ని పాలకులు జపిస్తున్నారు.
రైతు పండించే పంటలకు మాత్రం లాభ సాటి ధరలను నిర్ణయించుకొనే కనీస‌ హక్కు లేదు. బ్రిటీష్ కాలం నాటి 1894 భూసేకరణ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని సాధించుకోవడానికి స్వాతంత్య్రానంతరం కూడా దశాబ్ధాల పాటు రైతాంగం అలుపెరగని ఉద్యమాలు చేసిన పలితంగా భూసేకరణ చట్టం_2013 వచ్చింది. అది 2014 జనవరి 1 నుండి అమలులోకి వస్తే కొన్ని నెలలు తిరగక ముందే పార్లమెంటు ఎన్నికలు రావడం, మోడీ నాయకత్వంలో నూతన ప్రభుత్వం అధికార పగ్గాలు చేబట్టడం చకచకా జరిగి పోయాయి. నూతన భూసేకరణ చట్టానికి ఏడాది వయసు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేయడానికి నిబంధనలను రూపొందించి, ప్రక్రియే మొదలు పెట్ట‌లేదు. అప్పుడే ఆ చట్టంలోని రైతాంగానికి అనుకూలమైన కీలకాంశాలను ఒక్క దెబ్బతో తొలగించే దుష్ట చర్యకు మోడీ ప్రభుత్వం పూనుకొన్నది. అత్యవసర ఉత్తర్వు(ఆర్డినెన్స్) ఒకటికి, రెండు సార్లు జారీ చేసింది. ఆరు నూరైనా అగ్రహారం పాడైనా లెక్క చేయను చట్టానికి సవరణలు చేసి తీరుతానన్న మూర్ఖత్వాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే తీరులో వ్యవహారాలను నడుపుతున్నది. రైతాంగ వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల ప్రభుత్వమన్న‌ ముద్ర పడినా వెనుకంజ వేయకపోవడాన్ని గమనిస్తే సంపన్న వర్గాలకు ప్రయోజనాలను వనగూడ్చి పెట్టడానికే ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నట్లు స్పష్టమవుతున్నది.
వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి, వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించి లాభసాటిగా మార్చాలి. రైతాంగ ఆత్మహత్యలను అరికట్టడానికి రాజకీయ‌ సంకల్పంతో అవసరమైన కార్యాచరణను అమలు చేయాలి. ఆహారభద్రతను మరియు పర్యావరణాన్ని పరిరక్షించుకొంటూ, ఉపాథి అవకాశాలను, ప్రజల కొనుగోలు శక్తిని, జీవన ప్రమాణాలను పెంపొందించే పారిశ్రామికాభివృద్ధి సాధన కోసం కృషి జరగాలి. ఈ దృక్పథంతో శక్తివంతమైన ప్రజా ఉద్యమాల ఆవశ్యకత రోజు రోజుకూ పెరుగుతున్నది. పాలకుల తాత్విక చింతన మారాలి. రెండున్న దశాబ్ధాలుగా అమలు చేయబడుతున్న‌ సరళీకృత ఆర్థిక విధానాలలోని మంచి చెడులపై లోతైన సమీక్ష జరగాలి. వాటిలో ఏ అంశాలైతే సమాజానికి మేలు చేశాయో! వాటిని స్వీకరించి, హానికరమైన అంశాలను నిర్ద్వందంగా తిరష్కరించాలి. 

Thursday, April 23, 2015

ఆ.ప్ర. నూతన రాజధాని చుట్టూ ముసురుకొన్న సమస్యలు

రాష్ట్ర విభజనతోనే విజయవాడ, గుంటూరు ప్రాంతాల భూయజమానుల మనస్తత్వంలో గణనీయమైన మార్పు చోటు చేసుకొన్నది. రాజధాని ప్రాంతంగా ప్రకటించబడిన తరువాత ఆ మనస్తత్వం మరింత బలపడిపోయింది. వారికి వ్యవసాయం కంటే భూముల ధరల పెరుగుదలపై బాగా మక్కువ పెరిగిందనడంలో నిస్సందేహం. భూమి ఖరీదైన‌ సరుకుగా మారిపోయి వాణిజ్య లక్షణాన్ని సంపూర్ణంగా సంతరించుకొని, షేర్ మార్కెట్ తరహాలో భూముల ధరల పెరుగుదల, తగ్గుదల ఒక జూదంగా పరిణమించింది.  కొద్ది కాలంలోనే ఆ దుష్పరిణామాల‌ పర్యవసానాలను గమనిస్తూనే ఉన్నాం. స్తిరాస్థి వ్యాపారస్తులు కొందరు ఆత్మహత్యలు చేసుకొన్న ఉదంతాలు వెలుగులోకి కూడా వచ్చాయి.
ఆహార భద్రత దేవుడెరుగు, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంలోను, దాని పరిసర ప్రాంతాల్లో సామాన్యులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం దుర్లబంగా మారనున్నది. ఉపాథిని వెతుక్కొంటూ నూతన రాజధానికి వచ్చే వెనుకబడ్డ‌ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులకు స్థిర నివాసం ఒక కలగానే మిగిలిపోతుంది. ఇంటి అద్దెలు కూడా చెల్లించుకోలేని దుస్థితి నెలకొని, ఇది సంపన్నుల రాజధాని, సామాన్యులకు ఇక్కడ చోటు లేదనే భావన ఏర్పడడం ఖాయం.
రాజధాని ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ‌ అతి పెద్ద సమస్యగా రూపుదాల్చే ప్రమాదం స్పష్టంగా కనబడుతున్నది. దాన్ని కొంత వరకైనా నివారించాలంటే పులిచింతల జలాశయం నుండి ప్రకాశం ఆనకట్ట వరకు, కృష్ణా నది ఒడ్డుకు రెండు, మూడు కిలో మీటర్ల వరకు 'గ్రీన్ బెల్ట్' గా ప్రకటిస్తూ ప్రత్యేక చట్టాన్ని తేవాలి. భష్టు పట్టిన ఈ రాజకీయ వ్యవస్థ భవిష్యత్తులో ఆ చట్టానికి తూట్లు పొడవరా! అంటే అలా జరగదని ఏ ఒక్కరూ బరోసా ఇవ్వలేరు. కాకపోతే తమ జీవితాలతో మెలివేసుకొన్న అలాంటి చట్టాన్ని పరిరక్షించుకొనే చైతన్యం ప్రజల్లో వస్తే దాన్ని ఎవరు అధికారంలోకి వచ్చినా బలహీన పరచడం అంత సులువు కాకపోవచ్చు. అలాంటి చట్టాన్నే రూపొందించక పోతే కృష్ణా నది పూర్తిగా కలుషితమై హైదరాబాదు మహానగరం మధ్యలో ప్రవహిస్తున్న మూసీలా తయారవ్వడం ముమ్మాటికీ ఖాయం.
తీవ్ర ఉష్ణోగ్రతలకు నెలవుగా ఉన్న రాజధాని ప్రాంతంలో వచ్చే నూతన నిర్మాణాల తరువాత ఉన్న పచ్చదనం కూడా ధ్వంసమై మరింత ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు విల‌విల్లాడవలసి వస్తుంది. ప్రత్యేక‌ చట్టాన్ని తీసుకు రాకపోతే భూములు రైతుల చేతుల్లో మిగిలే ప్రసక్తే లేదు. స్థిరాస్థి వ్యాపారస్తులు, పారిశ్రామిక వర్గాలు భూముల‌ ధరలు పెంచి, ప్రలోభ పెట్టి, రైతుల ను‍ండి భూములను కొనేసి వాణిజ్యపరం చేస్తారు. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకుండా కేవలం ప్రయివేటు వ్యవహారంగా వదిలేస్తే ల్యాండ్ మాఫియాలు విజృంభించే అవకాశం ఉన్నది. ఈ ప్రక్రియ అనివార్యంగా జరిగిపోతుంది. అది ఏ మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఈ తరహా అంశాలపైన లోతైన చర్చ జరగాలి.