Wednesday, January 4, 2012

కొరియన్ల కల నెరవేరేనా!

published in Surya daily on January 4 , 2012

- దక్షిణ కొరియాలో అమెరికన్ల తిష్ఠ
- పునరేకీకరణే ఉత్తర, దక్షిణ కొరియన్ల వాంఛ
- నాయకుడి మృతితో దిగాలుపడ్డ ఉత్తర కొరియా
- ఆంతరంగిక సంక్షోభంపై ఊహాగానాలు
- సోషలిస్టు నిర్మాణంలో ఉత్తర కొరియా
- ఉన్నత విద్యావంతుల్లో మహిళలే అధికం


కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మరణించారని అధికా రికంగా 2011 డిసెంబరు 19న ప్రకటించగానే ఉత్తర కొరియా ప్రజలు దుఖః సాగరంలో మునిగిపోయారు. అమెరికా, పశ్చిమ దేశాల ప్రసారమాధ్యమాలు ఉత్తర కొరియాలో ఆంతరంగిక సంక్షోభం తలెత్తు తుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు చేశాయి. అమెరికా అడుగులకు మడుగులొత్తే దేశంగా పరిగణన పొందుతున్న దక్షిణ కొరియా సరిహద్దుల్లో సైనిక దళాలను అప్రమత్తం చేశాయి. నాయకుడి మృతితో దిగాలు పడ్డ ఉత్తర కొరియాలో రాజకీయ సంక్షోభాన్ని ప్రేరేపిం చడానికేమైనా అవకాశాలున్నాయా అని శతవిధాలా ప్రయత్నించాయి. వారి ఆశలు అడియాశలయ్యాయి.

ఉక్కు క్రమ శిక్షణకు, విశ్వసనీయతకు, నిబద్ధతకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన డెమోక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా పౌరులు రాజకీయ పరిణతితో నాయకత్వ మార్పిడిని ఒక సాధారణ ప్రక్రియగా పూర్తి చేశారు.
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల ప్రజల ప్రగాఢ వాంఛ- స్వచ్ఛంద పునరేకీకరణ జరగాలన్నదే! డెమొక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా (డి.పి.ఆర్‌. కె./ ఉత్తర కొరియా)కు గొప్ప నాయకుడుగా కీర్తినందుకున్న కిమ్‌ ఇల్‌ సంగ్‌ శకం అనంతరం అధికారపగ్గాలు చేపట్టిన కిమ్‌ జాంగ్‌ ఇల్‌ శకం ముగిసింది. మూడవ తరం నేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అధికార పీఠాన్ని అధిరోహించారు. రెండు పదుల వయస్సులో ఉన్న, పరిణతి చెందని కిమ్‌ జాంగ్‌ ఉన్‌ నేతృత్వంలో ఆ దేశం గడ్డు పరీక్షను ఎదుర్కొంటున్నదని భావించవచ్చు. కానీ, ఉత్తర, దక్షిణ కొరియా దేశాల పునరేకీకరణ, ఒకే కొరియా అన్న కిమ్‌ ఇల్‌ సంగ్‌ కన్న కలలను నెరవేర్చడానికన్నట్లు దృఢ చిత్తంతో జాతి ఐక్యతను ప్రదర్శించారు.

మార్క్సిస్టు సిద్ధాంతం వెలుగులో కిమ్‌ ఇల్‌ సంగ్‌ ఆలోచనా సరళికి అనుగుణంగా జూచే (స్వయంపోషకత్వ) భావజాలం ఉత్తర కొరియాలో అమలవుతున్నది. వ్యక్తి ఆరాధన కేంద్ర బిందువుగా వ్యవస్థ నిర్మితమైంది. వారసత్వ ప్రాతిపదికపై అధికార మార్పిడి జరుగుతున్నది. ఈ లక్షణాల వల్ల సహజంగానే ఆ వ్యవస్థ కొన్నిపరిమితులకు లోబడి పనిచేస్తున్నదని భావించవచ్చు. కానీ స్థూలంగా సోషలిస్టువ్యవస్థ నిర్మాణానికి కట్టుబడి ప్రయాణం సాగిస్తున్నది. చైనాకు సరిహద్దు దేశమైన ఉత్తర కొరియాను ఎలాగైనా లొంగదీసుకొవాలని దశాబ్దాలుగా అమెరికా ప్రయత్నిస్తున్నది.1950లో జరిగిన కొరియన్‌ యుద్ధంలో ఉత్తర భాగంలో బాంబుల వర్షం కురిపించి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పట్టణాలను ధ్వంసం చేసింది. 28,000 మంది సైనికుల్ని దక్షిణ కొరియాలో తిష్ఠ వేయించి అమెరికా ఆ దేశాన్ని శాశ్వతంగా సైనిక స్థావరంగా మార్చుకొన్నది. అణ్వాయుధాలతో అమెరికన్‌ నావికా దళాలు కొరియన్‌ పెనిన్సులాలో చక్కెర్లు కొడుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి.

2005లో లిబియా, ఇరాన్‌ దేశాలతో బాటు ఉత్తర కొరియాను కూడా కలిపి ‘రోగ్‌ కంట్రీస్‌’గా అమెరికా ప్రకటించింది. అణ్వాయుధాలను సమకూర్చుకొంటున్నదనే కారణం చూపెట్టి ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను విధించింది. సహాయ సహకారాలందిస్తూ వచ్చిన సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం ఉత్తర కొరియా తన రక్షణ వ్యూహంలో భాగంగా అణ్వాయుధాలను సముపార్జించుకోవడానికి 2006లో అణు పరీక్షలు నిర్వహించింది. దక్షిణ కొరియా భూభాగం నుంచి పొంచిఉన్న ప్రమాదం నుండి తనను తాను రక్షించుకొనే విధానంలో భాగంగా అణ్వాయుధాల తయారీ, రక్షణ రంగాన్ని శక్తిమంతంగా తయారు చేసుకోవాలనే దృష్టితో కిమ్‌ జాంగ్‌ ఇల్‌ ఆర్మి పస్ట్‌ (సాంగ్‌ అన్‌) అన్న నినాదంతో భారీగా నిధులు వెచ్చించింది.

దానికి తోడు ఇటీవలి కాలంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవలసి వచ్చినా ఆర్థిక ఒడిదుడుకుల్ని సమర్థవంతంగానే నెట్టుకొచ్చింది. ఉత్తర కొరియా మహిళా సాధికారతను సాధించడమే కాదు, ఉన్నత విద్యను ఆర్జించిన వారిలో పురుషుల కంటే మహిళలే అధికం. రాజకీయ, రక్షణ రంగాలలో ముందంజలో ఉన్నది. ఆ దేశానికున్న పరిమితమైన ఆర్థిక వనరుల్లోనే పౌరులకు సామాజిక సేవలను అందించడంలో, అందరికీ చదువు, ఉపాథి , పౌష్టికాహారం, గృహ వసతి కల్పించడంలో శ్రద్ధ వహించిందని, శిశు మరణాల సంఖ్య చాలా తక్కువని, ఆయుర్దాయం రేటు ఎక్కువని, అవినీతికి ఆస్కారం లేని దేశమనీ- అంతర్జాతీయ సంస్థలే వ్యాఖ్యానించాయి.

దేశ వ్యాపితంగా వ్యాధి నిరోధక ఆరోగ్య పథకాన్ని అమలు చేయడంలో, డాక్టర్లు, నర్సుల కొరత లేని దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూ.హెచ్‌.ఒ.) డైరెక్టర్‌ జనరల్‌ ప్రశంసించారు. ఉత్తర కొరియా నిఖారె్సైన సామ్రాజ్యవాద వ్యతిరేక దేశంగా ఎదిగి, మనుగడ సాగిస్తున్నది. 1950లో జరిగిన యుద్ధం పర్యవసానంగా తీవ్రంగా నష్ట పోయిన ఈ దేశం మరొక యుద్ధాన్ని ఏ మాత్రం కోరుకోవడం లేదు . కొరియన్‌ ప్రజలు ఆత్మగౌరవంతో, ఇతరుల జోక్యానికి తావివ్వకుండా కిమ్‌ ఇల్‌ సంగ్‌ స్పూర్తితో ఉత్తర- దక్షిణ కొరియాల పునరేకీకరణను, శాంతి, భద్రత, సోషలిస్టు పంథాలో అభివృద్ధిని సాధించాలని ప్రగాఢంగా కోరుకొంటున్నారు .

ఉత్తర కొరియాలో నిర్వహించిన13వ ప్రపంచ యువజన విద్యార్ధి ఉత్సవాలలో ఆ దేశానికి బద్ధ శతృత్వం వహించే అమెరికా, జపాన్‌ దేశాల నుండి కూడా యువత పాల్గొన్నది. కొరియన్‌ పెనున్సుల ఐక్యతకు దక్షిణ కొరియా యువజన, విద్యార్థులు ఏ విధంగా పరితపిస్తున్నారో వెల్లడించడానికి ఒక యువ మహిళా ప్రతినిథి రిమ్‌సు జియోంగ్‌ అక్కడి నిర్బంధాలను ఛేదించుకొని వచ్చి ఈ ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలచారు. యువజనోత్సవాలలో అంతర్భాగంగా కొరియన్‌ సంఘీభావ సభ జరిగింది. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల స్వచ్ఛంద పునరేకీకరణ, జాతీయ స్వతంత్ర ప్రతిపత్తి ఆధారంగా శాంతి, అభివృద్ధి సాధించాలన్న కొరియన్‌ ప్రజల ఆకాంక్షలకు సభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రిమ్‌ సు జియోంగ్‌ తిరిగి దక్షిణ కొరియా సరిహద్దుల్లో అడుగు పెట్టగానే ఆమెను అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు.

తాజాగా కిమ్‌ జాంగ్‌ ఇల్‌ అంతిమ యాత్రలో పాల్గొనడానికి వెళ్ళే ప్రయత్నం చేసిన దక్షిణ కొరియా పౌరులను నిర్దయగా ఆ దేశ ప్రభుత్వం అడ్డుకొన్నది. నియంతృత్వ పాలన ఉత్తర కొరియాలో ఉన్నదో, దక్షిణ కొరియాలో ఉన్నదో ఈ ఘటనలను బట్టి స్పష్టమవుతుంది. సియోల్‌లో జరిగిన ఒలంపిక్స్‌ క్రీడల సందర్భంగా దక్షిణ కొరియా ప్రజలను అమెరికా ఏ విధంగా అవమానించిందో కూడా ఆ దేశ యువతకు బాగా గుర్తుండే ఉంటుంది . అందుకే కొరియన్ల ఐక్యతకు పరితపిస్తున్నారు.
2000లో ఉత్తర, దక్షిణ కొరియా ప్రభుత్వాలు పునరేకీకరణ ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలని సూత్ర ప్రాయంగా అమోదిస్తూ పియోంగ్యాంగ్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఆ ప్రాంతంలో, అలాగే ప్రపంచ శాంతికి దోహదపడే కొరియన్‌ పెనున్సులా ఐక్యతను అందరూ కోరుకొంటున్నారు. తెర వెనుక నుంచి అమెరికా- అడుగు ముందుకు పడకుండా దక్షిణ కొరియాను కట్టడిచేస్తూ సియోల్‌ కేంద్రంగానే పునరేకీకరణ జరగాలని, వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ఉత్తర కొరియా ప్రాభవాన్ని దెబ్బకొట్టి, సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి స్వస్తిపలికేలా చేసి, ఐక్య కొరియా దేశాన్ని తమ కనుసన్నల్లో ఉంచుకోవాలని బలంగా ఆశిస్తోంది.
ఈ పూర్వరంగంలో పాలనా పగ్గాలు చేబట్టిన కిమ్‌ జాంగ్‌ ఉల్‌ కు కొరియన్‌ దేశాల ఐక్యతా చర్చలు, అత్యంత క్లిష్టమైన- అణు శక్తి వినియోగ పథకంపై కొనసాగుతున్న అంతర్జాతీయ సంప్రదింపులు, కిమ్‌ ఇల్‌ సంగ్‌ ప్రభోధించిన జుచే భావజాలానికి అనుగుణంగా సోషలిస్టు వ్యవస్థ నిర్మాణంలో ముందుకు సాగిపోవడం పెద్ద సవాలుగా నిలిచాయి. కష్ట కాలంలో ఉత్తర కొరియా ప్రజలు ప్రదర్శించిన ఐక్యత ఉత్తర- దక్షిణ కొరియా దేశాల పునరేకీకరణకు మార్గాన్ని సుగమం చేస్తుందని, ప్రపంచ శాంతికి ఉపకరిస్తుందని ఆశించవచ్చు.

No comments:

Post a Comment