published in Surya daily on 27th January 2012
భారత పౌరులందరికీ గుర్తిం పు కార్డులు జారీ చేయా లని కేంద్ర ప్రభు త్వం పథక రచన చేసింది. ప్రభుత్వం అందించే పౌర సేవలన్నింటికీ ఆధార్ కార్డే ప్రామా ణికమని ఊదరగొట్టి, హడావుడి సృష్టించింది. ప్రభుత్వం జారీ చేస్తున్న గుర్తింపు కార్డుల్లో కెల్లా ఇదే విశిష్టమై న గుర్తింపు కార్డని ప్రకటించింది. ప్రభు త్వ ఆర్థిక రంగ సంస్థ లైన బ్యాంకులు అంద జేసే సేవలను పొందడానికి పేదలు, వెనుకబడ్డ పౌరులందరికీ ఇది అవకాశాన్ని కల్పిస్తుంది, ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములను చేస్తుంది. వలస వెళుతున్న ప్రజలకు గుర్తింపునిస్తుంది. ఇలాంటి లక్షణాలెన్నో చెప్పారు. దేశ పౌరులందరూ విధిగా ఆధార్ కార్డులు తీసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.
బయోమెట్రిక్స్ విధానంలో చిరునామాలను, పది చేతి వేళ్ళ ముద్రలను, ఐరిస్ కెమెరాలతో కళ్ళ ఫోటోలను, సంతకాలను సేకరిస్తూ నమోదు ప్రక్రియను దాదాపు ఏడాది క్రితం మొదలు పెట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులను పొందాలన్నా, వంట గ్యాస్ కనెక్షన్ మంజూరు మొదలుకొని గ్యాస్ సరఫరాకు, మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పనకు, సబ్సీడీ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు విశ్వసనీయ ఆధారం ‘ఆధార్ కార్డు’ అన్న వాతావరణాన్ని, సామాన్య ప్రజానీకంలో భయాందోళనలను సృష్టించింది. ఆలసించిన ఆశాభంగం, నష్టదాయకం, త్వరపడండని ప్రజలను ఒత్తిడికి గురిచేసింది. తీరా చూస్తే కేంద్ర ప్రభుత్వంలోనే ఈ పథకం పట్ల స్పష్టత పూర్తిగా కొరవడింది. దీనిని బట్టి పౌరుల భద్రతతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని స్పష్టమవుతున్నది.
ఆధార్ కార్డుల జారీకి అవసరమైన సమాచారాన్ని బయోమెట్రిక్స్ విధానంలో సేకరించడం ఎవరి ఆధీనంలో జరగాలనే అంశంపై తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం రాసిన ఉత్తరాన్ని బట్టి బహిర్గతమయ్యింది. హోమ్ మంత్రిత్వ శాదా, లేక ప్రణాళికా సంఘానిదా అన్న సమస్యకు పరిష్కారాన్ని చూపెట్టమని ఆ ఉత్తరం ద్వారా కోరారు. సమాచారాన్ని సేకరించవలసినది హోమ్ మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేసే రిజిష్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) ఆధ్వర్యలోనా, లేదా ప్రణాళికా సంఘం అధీనంలోని యునీక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ) సంస్థ ఆధ్వర్యంలోనా అనేది తేల్చిచెప్పమన్నారు. ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో సమాచారాన్ని సేకరిస్తే భద్రతా సమస్యలు తలెత్తుతాయని, నిక్షిప్తం చేసిన సమాచారానికి రక్షణ కరవవుతుందని, సమాచార సేకరణ ప్రభుత్వాధికారుల అజమాయిషీలో జరగడం లేదని అందులో విస్పష్టంగా పేర్కొన్నారు.
ఆర్.జి.ఐ. సమాచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్ళి జవాబుదారీతనంతో పౌరుల నుండి సేకరిస్తారని, యు.ఐ.డి.ఎ.ఐ.- బయోమెట్రిక్స్ సమాచారాన్ని కాంట్రాక్టు తీసుకొన్న కిరాయి సంస్థల వారు నెలకొల్పుకొన్న నమోదు కేంద్రాల వద్దకు ప్రజలను రప్పించుకొని సేకరిస్తుందని, పర్యవసానంగా భద్రత కొరవడిందని స్వయంగా హోమ్ మంత్రి చెప్పడం సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. కార్డులను పౌరులకు మాత్రమే కాకుండా దేశంలో నివాసం ఉంటున్న ప్రజలందరికీ ఇవ్వాలన్నది లక్ష్యం. చట్ట వ్యతిరేకంగా దేశంలోకి ప్రవేశించిన చొరబాటుదారులు కూడా ఆధార్ కార్డులు పొందే అవకాశం ఉందని చెప్పడం చూస్తే, ఉగ్రవాదుల దాడులకు తరచూ గురవుతూ తల్లడిల్లిపోతున్న మన దేశం మరిన్ని సమస్యలను కొనితెచ్చుకొన్నట్ల వుతుంది.దేశ జనాభా గణాంకాల సేకరణ కార్యక్రమం- పౌరుల నమోదు శాఖ సంచాలకులు/ జనాభా సేకరణ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో పౌర సమాచార నిథి ఏర్పాటు నిమిత్తం బయోమెట్రిక్ నమోదు కార్యక్రమం జరుగుతున్నది.
మరొకవైపున ఈ పథకం రూపశిల్పి నందన్ నీలేకని ఛైర్మన్‌గా ఉన్న యునిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (యు.ఐ.డి.ఎ.ఐ.) సంస్థ ఆధ్వర్యంలో బయోమెట్రిక్స్‌ను సేకరించడానికి ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకొన్నది. ‘1955 పౌరసత్వ చట్టం’, 2003 నుండి అమలులో ఉన్న ‘పౌరసత్వ నిబంధన’ల మేరకు పౌరులందరూ విధిగా నమోదు చేసుకోవాలి. కానీ బయోమెట్రిక్ నమోదు కాదు. అంటే ముందుగా చట్టానికి సవరణ చేయాలి. పౌరుల సమాచారం దుర్వినియోగం కాకుండా భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలి. అలాగే ఆధార్ కార్డులకు సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి సంబంధమూ లేకుండా చేయాలి. అత్యంత కీలకమైన ఈ తరహా అంశాలన్నింటిపైన సమగ్రంగా పార్లమెంటులో చర్చించిన మీదట ప్రతిపాదిత నేషనల్ ఐడెంటిఫికేషన్ అధారిటి ఆఫ్ ఇండియా బిల్లుకు ఆమోద ముద్ర పడకముందే ప్రభుత్వం పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది.
ఈ పూర్వరంగంలోనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ పథకంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ బిల్లును తిరస్కరించింది.చట్ట సభలను ఖాతరు చేయకుండా, ప్రస్తుత శాసనాలను ఉల్లంఘించి, మౌలికమైన, విధానపరమైన చర్యలు చేపట్టకుండానే కేంద్ర ప్రభుత్వం పథకం ఈ అమలుకు పచ్చజెండా ఊపి, అనుమతులు మంజూరు చేయడం అనాలోచితం , బాధ్యతారాహిత్యం, చట్ట వ్యతిరేకం. దేశంలోని దాదాపు నూట ఇరవై కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేయడానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఆధార్ ప్రాజెక్టు మిషన్ డైరెక్టర్ రామ్ సేవక్ శర్మ వెల్లడించారు.
సంక్షేమ పథకాల అమలుకు ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని, ఆధార్ కార్డుల జారీతో ఆ పథకాల అమలులో జరుగుతున్న అవకతవక లను అరికట్టడం ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చునని, అందు వల్ల ఈ పథకానికి వెచ్చించే మొత్తం అత్యల్పమని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని తిరష్కరించక పోయినా రెండు సంస్థల ద్వారా సమాచార సేకరణకు అభ్యంతరం చెప్పినట్లు వార్తలు పొక్కాయి. కానీ ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.2014 సంవత్సరం నాటికి అరవై శాతం మంది ప్రజల బయోమెట్రిక్ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకొన్నారు.
2012 మార్చి నాటికి ప్రథమంగా ఇరవై కోట్ల మందికి ఆధార్ కార్డులను జారీ చేయాలన్న ఒప్పందం మేరకు యు.ఐ.డి.ఎ.ఐ.తో కాంట్రాక్టు కుదుర్చుకొన్న ప్రైవేటు సంస్థలు పౌరుల వివరాలను సేకరిస్తున్నాయి. ఇప్పటికే పన్నెండు కోట్లమంది నుండి బయోమెట్రిక్ నమోదు ప్రక్రియలో భాగంగా నివాస చిరునామాలను, చేతి వేళ్ళ ముద్రలను, ఐరిస్ కెమరాలతో కళ్ళ ఫోటోలను, సంతకాలను సేకరించాయి. వివరాలు అందజేసి, నమోదు చేసుకొన్న పౌరులకు మూడు నెలల వ్యవధిలో ఆధార్ కార్డులు పోస్టు ద్వారా సురక్షితంగా వారి చిరునామాలకు అందుతాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రాథమిక దశలో కొంత మందికి కార్డులను అందజేశారు. 2011 మే మాసంలో ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్ళి నమోదు చేసుకొన్న వారికి నేటికీ కార్డులు జారీ కాలేదు.
మరొకవైపున మొత్తం దేశ ప్రజలందరికీ ఆధార్ కార్డులను అందించే బాధ్యతను యు.ఐ.డి.ఎ.ఐ.కే అప్పగించాలని ప్రభుత్వం తలపోస్తున్నది. ప్రస్తుతం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలం కావడమే కాకుండా ఆధార్ కార్డుల జారీ విధానాన్నే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పదంగా ఒకరి మీద ఒకరు నెపం మోపుకొంటూ దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ పథకం అమలులో ప్రస్తుతానికి స్తబ్దత నెలకొన్నట్లు బోధపడుతున్నది . పథకం భవిష్యత్తు కేంద్ర మంత్రివర్గ నిర్ణయంపై ఆధారపడి ఉన్నదని యు.ఐ.డి.ఎ.ఐ. ఛైర్మన్ నీలేకని ప్రకటించారు. ప్రజల జీవితాలతో ఆటలాడుకొనే లోపభూయిష్టమైన విధానాలకు ప్రభుత్వం తక్షణం స్వస్తి చెప్పి, మెరుగైన ఆలోచనలు చేయాలి.
No comments:
Post a Comment