మొన్న ఇరాక్, నిన్న లిబియా, నేడు ఇరాన్ చమురు నిక్షేపాలపై అమెరికా కళ్ళు పడ్డాయి. యురేనియం అభివృద్ధి పథకాన్ని కొనసాగిస్తూ, అణ్వాయుధాల సామర్థ్యాన్ని సముపార్జించుకొనే ప్రయత్నం లో ఇరాన్ ఉన్నదని, ఆ దేశాన్ని కట్టడి చేయకపోతే ప్రపం చానికే ప్రమాదమని అంటూ అమెరికా ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలను విధించింది. ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెచ్చి ఆంక్షలు విధింపజేసింది. ఆర్థిక ఆంక్షలతో పాటు ఇరాన్‌ను అష్టదిగ్భంధంలో ఉంచి ఎలాగై నా లొం గ దీసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్న ది. తమ వ్యూహాత్మక భాగస్వాములైన ఐరోపా యూనియన్‌ను, ఇజ్రాయిల్‌ను ఉసిగొలిపింది. ఐరోపా యూనియన్ ఆంక్షల అమలుకు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది.
2012 జూలై 1 నుండి క్రూడ్ ఆయిల్‌ను ఇరాన్ నుండి దిగుమతి చేసుకోవడంపై నిషేధం విధించింది. తద్వారా ఆ దేశాన్నిఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టాలని నిశ్చయించుకొన్నది. ఐరోపా యూనియన్ విధించిన వేసవి గడువు కంటే ముందే ఐరోపా దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేస్తామని ఇరాన్ కూడా హెచ్చరించింది. మరొక వైపున అమెరికా ప్రోద్భలంతో ఇజ్రాయిల్ ఇరాన్ యురేనియం అభివృద్ధి, అణ్వస్త్ర తయారీ కేంద్రాలపై సైనిక దాడికి పూనుకొని చావు దెబ్బ కొట్టాలని ఉవ్విళ్ళూరుతున్నది. తాజా పరిణామాలను గమనిస్తే యుద్ధ వాతావరణం రోజు రోజుకూ వేడెక్కుతున్నది.
ఇరాన్ ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధమైంది. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు మహ్మోద్ అహ్మది నెజాద్ నిర్ద్వందంగా ప్రకటించారు. పర్షియన్ గల్ఫ్- గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌ను భౌగోళికంగా అనుసంధానం చేసే, వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్‌గా పిలిచే కేవలం 54 కి.మీ. వెడల్పు ఉన్న సన్నటి సముద్ర జల మార్గం ద్వారానే గల్ఫ్ దేశాల నుండి ఎగుమతి చేసే ముడి చమురులో తొంబై శాతం, ప్రపంచ వ్యాపిత సరఫరాలో ఇరవై శాతం రవాణా కావాలి. గల్ఫ్‌కు ముఖ ద్వారమైన ఆ కీలక మార్గాన్ని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం అమెరికా సైనిక విమానాలు, ప్రెంచ్- బ్రిటిష్ యుద్ధ నౌకలు గల్ఫ్ ప్రాంతంలోకి ప్రవేశించి, చమురు రవాణాకు అవరోధాలు కల్పిస్తే సహించేది లేదన్న రీతిలో బలప్రదర్శన కూడా చేశాయి. ఇరాన్ యురేనియం అభివృద్ధి పథకంపై ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వేదికల ద్వారా నిజనిర్ధారణ, చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది. కానీ అమెరికా విధానాలతో సమస్య మరింత జఠిలమవుతున్నది. పర్యవసానంగా ఇరాన్ పై యుద్ధ మేఘాలు కమ్ముకొని ప్రపంచ శాంతికి విఘ్నం కలిగే ప్రమాదం ముంచుకొస్తున్నది. టెహ్రాన్‌కు పశ్చిమంగా 130 కి.మీ. దూరంలో ఉన్న ఒక భూగర్భ కేంద్రంలో అధునాతన యంత్ర సామగ్రితో నిర్వహిస్తున్న యురేనియo అభివృద్ధి కార్యకలాపాలను ఐ.ఎ.ఇ.ఎ. బృందం ఇటీవల పరిశీలించిందని వార్తలొచ్చాయి.
అణ్వస్త్రాల తయారీకి యురేనియం అభివృద్ధి పథకాన్ని చేపట్ట లేదని, అణు ఇంధనం- వైద్యం వంటి సమాజిక అవసరాల కోసమే నిర్వహిస్తున్నామని ఇరాన్ చెబుతున్నది. తమ దగ్గర అణ్వాయుధాలను గుట్టలు గుట్టలుగా పోగేసుకొన్న అమెరికా మాత్రం ఇరాన్ యురేనియం అభివృద్ధి పథకాన్ని వివాదాస్పదం చేస్తూ అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నది.భారత్ వంటి చమురు దిగుమతి దేశాల పరిస్థితి పెనంమీద నుండి పొయ్యిలో పడ్డట్లు తయారు కాబోతున్నది. ఇది మన దేశాన్ని మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుంది. యూపీఏ-2 ప్రభుత్వం అమెరికా అనుకూల విదేశాంగ విధానాన్ని అమలు చేస్తూ ఇప్పటికే ఇరాన్‌కు వ్యతిరేకంగా ఐ.ఎ.ఇ.ఎ.లో రెండు సార్లు ఓటు వేసింది. ముడి చమురు ధరల ఎగుడు దిగుడలతో దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి.
కువాయిత్‌పై ఇరాక్ యుద్ధం మొదలుకొని, ఇరాక్- లిబియా దేశాలపై అమెరికా దురాక్రమణ యుద్ధాల సందర్భంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగి, తద్వారా దేశీయంగా చమురు ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు పడిన బాధలు వర్ణనాతీతం. తీవ్ర రూపం దాల్చిన ద్రవ్యోల్బణం బారిన పడి నేటికీ ఆ కష్టాలను అనుభవిస్తూనే ఉన్నాం. ముడి చమురు ఉత్పత్తిచేస్తున్న మొదటి పది దేశాలలో నాలుగో స్థానంలో ఉన్న దేశం ఇరాన్. అలాంటి దేశంపై అమెరికా విధించిన ఆంక్షల అమలు వల్ల భారత్ వంటి దేశాలు మూల్యం చెల్లించుకోవలసి వస్తున్నది. అంతర్జాతీయ కరెన్సీగా చెలామణి అవుతున్న డాలర్లలోనే మనం దిగుమతి చేసుకొనే ముడిచమురుకు విలువ కట్టి చెల్లింపులు చేయాలి- లేదా యూరో కరెన్సీలోనే చేయాలి. డాలర్ల చెల్లింపుపైన , ఇరాన్ కేంద్ర బ్యాంకుతో లావాదేవీలు నెరపడానికి వీల్లేకుండా అమెరికా నిషేధం విధించింది. దాంతో ఇరాన్ చమురు అమ్మకాలకు, అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాల కొనసాగింపుకు అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ దుష్ఫలితాలు ఇరాన్ ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్రంగా పడతాయి.
అంతర్జాతీయంగా చమురుఎగుమతుల్లో నాలుగవ స్థానంలోఉన్న ఇరాన్‌నుండి ఎగుమతులు దిగ్బంధనకు గురైతే ముడిచమురు ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం బ్యారెల్ ధర వంద డాలర్లకు అటు ఇటూ కదలాడుతున్నది. అది కాస్తా 150 డాలర్ల వరకు పెరిగినా ఆశ్చర్యం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పరిస్థితే దాపురిస్తే మన ఆర్థిక వ్యవస్థ అనివార్యంగా సంక్షోభంలో పడుతుందనడంలో సందేహం లేదు. ప్రపంచంలో కెల్లా ముడి చమురు నిల్వల్లో మూడవ దేశంగా, సహజ వాయువు నిక్షేపాలలో రెండవ స్థానంలోఉన్న ఇరాన్ నుండి ఎలాంటి అవాంతరాలు లేకుండా మన అవసరాల మేరకు దిగుమతి చేసుకోవడానికి వీలుగా పాకిస్థాన్ మీదుగా నిర్మించ తలపెట్టిన పైప్ లైన్ నిర్మాణాన్ని అమెరికా వ్యతిరేకించి, అడ్డుకొట్టింది.
మనకు, పాకిస్థాన్‌కు ఉభయతారకంగా రూపొందవలసిన ఆ పథకం మూలనబడింది. ఇరాన్ నుండి ముడి చమురును దిగుమతి చేసుకొంటున్న దేశాలలో చైనా తరువాత మన దేశమే రెండవ స్థానంలో ఉన్నది. దాదాపు రూ. 60,000 కోట్ల విలువజేసే ముడి చమురును దిగుమతి చేసుకొంటున్నాము. మన చమురు అవసరాలలో 80 శాతం- దిగుమతులపై ఆధారపడి ఉన్నాము. అందులో 12 శాతానికిపైగా ఇరాన్‌నుండే దిగుమతి చేసుకొంటున్నాము.ఇరాన్ నుండి ముడి చమురు దిగుమతులకు ఎదురౌతున్న ఆటంకాలను అదిగమించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించామని మన కేంద్ర ఇంధన శాఖ మంత్రి అంటున్నారు. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మన దేశం బంగారాన్ని వినియోగించబోతున్నట్లు ఇజ్రాయిల్ దుష్ప్రచారం మొదలు పెట్టింది. గతంలో భారత్, రష్యాల మధ్య కుదుర్చుకొన్న రూపాయి, రూబుల్ కరెన్సీలలో చెల్లింపులకు వీలు కల్పించిన వాణిజ్య ఒప్పందం తరహాలో ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం తక్షణావసరం. అదే సందర్భంలో ఇరాన్ సంక్షోభానికి పరిష్కారాన్ని అన్వేషించాలి. అలాగే వస్తుమార్పిడి వాణిజ్య , వ్యాపార లావాదేవీల ఒప్పందాలకున్న అవకాశాలను శీఘ్రగతిన ఆలోచించాలి . కాకపోతే నట్వర్ సింగ్ నేతృత్వంలో గతంలో జరిగిన కుంభకోణం లాంటి వాటికి ఆస్కారం లేని విధంగా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలి .
అదే సందర్భంలో ఇరాన్ సంక్షోభానికి పరిష్కారాన్ని అన్వేషించాల్సిన బాధ్యత కూడా మన దేశ నాయకత్వంపై ఉన్నదని గుర్తించాలి . అలీనోద్యమ స్ఫూర్తితో స్వతంత్ర విదేశాంగ విధానానికి కట్టుబడి అమెరికా మరియు దాని పెత్తనంలోని నాటో కూటమి దేశాల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి కృషి చేయాలి . బ్రెజిల్ , రష్యా , ఇండియా , చైనా మరియు దక్షిణాఫ్రికా కూటమి ( బ్రిక్స్ ) తదితర అంతర్జాతీయ వేదికలు , ప్రాంతీయ కూటములను క్రియాశీలంగా వినియోగించుకొని ప్రపంచ శాంతికి విఘాతం కలగకుండా తన వంతు పాత్ర పోషించడానికి మన ప్రభుత్వం చొరవ ప్రదర్శించాలి .
No comments:
Post a Comment