సూర్య February 23, 2012
ప్రభుత్వ విశ్వసనీయతకు, జవాబుదారీతనానికి శాసన సభ ఆమోదించిన వార్షిక బడ్జెట్ అమలే గీటు రాయి. 2010-11 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అమలు తీరు తెన్నుల నేపథ్యం నుండి ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే, ప్రభుత్వ డొల్లతనం బహిర్గతమవుతున్నది. జలయజ్ఞం పేరు ఉచ్ఛరించడానికే జంకుతున్నట్లుంది. గత బడ్జెట్‌లో రూ.15,010 కోట్లు కేటాయించి, జనవరి నాటికి కేవలం రూ.8,459 కోట్లు ఖర్చు చేయడాన్ని బట్టి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పట్ల చిత్తశుద్ధి కొరవడినట్లు స్పష్టంగా కనబడుతున్నది.
గడచిన ఏడాదిలో నిథులను పూర్తిగా వ్యయం చేయలేక పోవడం మూలంగా ఈ సంవత్సరం కేటాయింపులు పెంచలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన వివరణను బట్టి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పసిద్ధి ప్రభుత్వానికి లేనట్లు చెప్పకనే చెప్పారు. ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు.మన రాష్ట్ర ప్రగతి ప్రధానంగా వ్యవసాయంపై అధారపడి ఉన్నది. నూటికి అరవై నాలుగు మందికి జీవనాధారం వ్యవసాయ రంగమే. నేడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. కరవుకాటకాలు నిత్యకృత్యమైనాయి.
ఈ ఏడాది కూడా ఇరవై రెండు జిల్లాలలో 876 మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. నిత్య కరవులను శాశ్వతంగా పారద్రోలాలంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేసుకోవడం ఒక్కటే మార్గం. ప్రాణప్రదంగా భావిస్తున్న పోలవరానికి వెయ్యి కోట్లు కేటాయించి రూ.452 కోట్లు వ్యయంచేసి, ఇప్పుడు రూ.850 కోట్లు ప్రతిపాదించారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రప్రభుత్వం నుండి ఆమోదం లభించబోతున్నదని, 90 శాతం నిథులు కేంద్రమే భరిస్తుందని, అన్ని శాఖల నుండి అనుమతి మంజూరై నిర్ణయం కేంద్ర మంత్రిమండలి ముంగిట ఉన్నదని ఊరిస్తున్నారు.
మరొకవైపు టెండర్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ, అవి బహిర్గతం కావడంతో వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. పర్యవసానంగా 2004 అంచనాల మేరకు రూ.8,198 కోట్లు వ్యయం అవుతుందనుకొన్నది రూ.17,000 కోట్లకు చేరుకొన్నది. కాలం గడచే కొద్ది ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం కూడా తడిసి మోపెడవుతూనే ఉంటుంది. ఇది అన్ని ప్రాజెక్టులకు వర్తిస్తుంది.
తెలంగాణలోని అత్యధిక మెట్ట ప్రాంతాలకు ప్రాణ ప్రదంగా భావిస్తున్న ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకానికి రూ.608 కోట్లు కేటాయించి 256 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రాజెక్టు సర్వే కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు రూ.1,050 కోట్లు ప్రతిపాదించారు. సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను త్వరితగతిన రూపొందించి, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి, జాతీయ ప్రాజెక్టు హోదా సాధించుకొంటేనే ఈ భారీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకోగలం. దుమ్మగూడెం సాగర్ టేల్ పాండ్ కు రూ.200 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.75 కోట్లు, చింతలపూడికి రూ.75 కోట్లు, మహేంద్రతనయకు రూ.35 కోట్లు, వంశధార మొదటి దశకు రూ.20 కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టలేదు. కల్వకుర్తికి రూ.250 కోట్లు కేటాయించి రూ.155 కోట్లు , భీమాకు రూ.260 కోట్లకు గాను రూ.77 కోట్లు, నెట్టంపాడుకు రూ.233 కోట్లకు రూ.75 కోట్లు , ఎస్.యల్.బి.సి.కి రూ.450 కోట్లకు రూ.297 కోట్లు, ఎస్సారెస్పీకి రూ.205 కోట్లకు కేవలం రూ.16 కోట్లు, ఇందిరా దుమ్మగూడెంకు రూ.150 కోట్లకు రూ.18 కోట్లు, గాలేరు నగరికి రూ.540 కోట్లకు రూ.277 కోట్లు, పిబిసి పథకానికి రూ.305 కోట్లకు రూ.83 కోట్లు ఖర్చు చేశారు. వార్షిక బడ్జెట్‌లో నిథులు కేటాయించడం, ఖర్చు చేయకుండా ప్రజలను దగా చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.
200511 సంవత్సరాల మధ్య రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటు సగటున 9.26 శాతం నమోదయిందని ఆర్థిక శాఖామాత్యులు ఘనంగా ప్రకటించుకొన్నారు. అందులో సంపద సృష్టి కర్తలైన సామాన్యుల వాటా ఎంత అన్న దానికి సమాధానం దొరకదు. సమాజం సృష్టిస్తున్న సంపద దోపిడీ దొంగల సొత్తుగా మారిపోతున్నది. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి గడచిన ఐదారు సంవత్సరాలలో రూ.71,292 కోట్లు ఖర్చు చేసినా రావలసిన సత్ఫలితాలు రాక పోవడానికి అవినీతే ప్రధాన కారణం. వ్యవసాయం కునారిల్లి పోతున్నది. ప్రకృతి వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. సంక్షోభంలో ఉన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి, వ్యవసాయానికి ఊపిరి పోసి, ఉపాథి అవకాశాలను మెరుగుపరచడానికి, కరవు కాటకాల బారినుండి ప్రజలను రక్షించడానికి, గ్రామసీమల నుండి వలసలను నివారించడానికి, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడానికి, వెనుకబడ్డ ప్రాంతాల ప్రజానీకాన్ని నాగరిక ప్రపంచంలో అంతర్భాగం చేయాలన్నా నదీజలాల సద్వినియోగంపై మాత్రమే ఆధారపడి ఉన్నది.
జల వనరులను అభివృద్ధిపరచి, ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు కృషి చేయాలి. నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతం నుండి నీటి కోసం కటకట లాడుతున్న ప్రాంతాల ప్రజల గొంతులు తడపాలన్నా, మరుభూములను పంట పొలాలుగా మార్చాలన్నా ప్రాజెక్టుల నిర్మాణాన్ని రాజకీయ సంకల్పంతో కొనసాగించాలి. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా నిథులను మంజూరు చేయకుండా, నిర్మాణ పనులను నత్త నడకన సాగించడం చూస్తుంటే ప్రస్తుత పాలకులకు ప్రాజెక్టుల సత్వర నిర్మాణం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదనిపిస్తున్నది. ఓట్ల రాజకీయంపై ఉన్న ధ్యాస దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పథకాలపై లేకపోవడం దీనికి ప్రధాన కారణం.
జలయజ్ఞంలో అంతర్భాగంగా 44 భారీ, 30 మధ్య తరహా పథకాలు, 8 ఆధునికీకరణ పథకాలు, నాలుగు వరద గట్ల మరమ్మతు కార్యక్రమాలకు రూ.1,85,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2012 జనవరి నాటికి రూ.71,292 కోట్లు ఖర్చు చేశారు. 97.3 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీటి సౌకర్యాన్ని , 9.45 లక్షల ఎకరాల భూమికి సాగు స్థిరీకరణ కల్పిస్తామని, దాంతో పాటు 6,553 గ్రామాలలోని 2.54 కోట్ల జనాభాకు మంచినీటిని అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకొనే నీటి పారుదల ప్రాజెక్టుల ప్రస్తుత నిర్మాణ తీరుతెన్నులపై శ్వేతపత్రం విడుదలచేస్తే దాని డొల్లతనం బయటపడుతుంది . 2004-05 తరువాత 13 ప్రాజెక్టులను సంపూర్ణంగా, 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 16.94 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీటి సౌకర్యాన్ని, 3.96 లక్షల ఎకరాలకు స్థిరీకరణ కల్పించామని కాకి లెక్కలు చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలుగు గంగ, యస్.ఆర్.బి.సి., గుండ్లకమ్మ వంటి ప్రాజెక్టులలో అంతర్భాగంగా రిజర్వాయర్లను , ప్రధాన కాల్వల నిర్మాణాలను పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్ సిస్టంను, పంట కాలువల నిర్మాణాన్ని చేపట్టకుండానే సాగునీరు విడుదల చేస్తున్నామని ప్రకటించి చేతులు దులిపేసుకొన్నారు. వీలున్న చోట్ల చెరువులకు నీటిని తరలించి, కొత్తగా సాగుకు నీరందిస్తున్నట్లు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు.
ప్రాధాన్యతా క్రమంలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నిపుణులు చేసిన సూచనలను పెడచెవిన పెట్టడం వల్ల ఈ దుస్థితి నెలకొన్నది. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న నానుడిగా ప్రభుత్వం ఇప్పుడు ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తామని కబుర్లు చెబుతున్నది. వాస్తవానికి ప్రభుత్వం ఆచరణలో నిష్క్రియగా తయారయ్యింది. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాలు గడప దాటటం లేదన్న నానుడిగా ప్రభుత్వ చర్యలున్నాయి. గుత్తేదారులు- చేసిన పనులకే డబ్బులు చెల్లించడంలేదని గోలచేస్తున్నారు. అప్పులు చేసి యంత్రాలను కొనుగోలు చేసి, నిర్మాణ పనులు చేసిన చిన్న గుత్తేదారులు వడ్డీలు చెల్లించుకోలేక దివాలా తీస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం నిథులను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నది. పర్యవసానంగా నిర్మాణ పనులు ఆలస్యం అయ్యేకొద్దీ నిర్మాణవ్యయం తడిసి మోపెడై అసలుకే మోసం జరిగే ప్రమాదం ముంచుకొస్తున్నది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మూలనపడతాయి. ఇప్పటికే కొన్నిప్రాజెక్టుల కింద తవ్విన ప్రధాన కాలువలు పూడిపోయి, చెట్లు మొలచిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.
ఈ దుస్థితినుండి బయట పడడానికి నిర్మాణంలో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి అంకితభావంతో పూనుకోవాలి. పోలవరం, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందడం ద్వారా ఆర్థిక వెసులుబాటు సాధించి, రాష్ట్ర నిధులతో మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేయడానికి ఇప్పటికైనా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలి. విద్యుత్ కొరతతో సతమతమౌతున్న పూర్వరంగంలో ఎత్తిపోతల పథకాల విద్యుదవసరాలను తీర్చడానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మరొక వైపు చర్యలు తీసుకొంటే తప్ప సత్ఫలితాలు పొందలేము.
No comments:
Post a Comment