సూర్య దినపత్రిక , పిబ్రవరి ౧౦,2012
ఒక మధ్య తరగతి ఉద్యోగి లేదా ఒక సామాన్యుడు తన కష్టార్జితంలో కాస్త కూడబెట్టుకొని అపార్ట్ మెంట్ లేదా ఇంటి స్థలం లేదా ఏదైనా స్థిరాస్థి కొని, కొంత కాలం తరువాత డబ్బు అవసరమై ఆ స్థిరాస్థిని విక్రయిస్తే ఆదాయపు పన్ను శాఖ మూలధన లాభం (క్యాపిటల్ గెయిన్స్ ) పై పన్ను వసూలు చేస్తుంది. కానీ విదేశీ సంస్థలు ప్రత్యక్ష పెట్టుబడుల ముసుగులో భారత గడ్డపై అడుగుపెట్టి, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి ఆస్తులను వృద్ధి చేసుకొని, వాటి క్రయ విక్రయాల లావాదేవీలను- రెండు విదేశీ కంపెనీలు- విదేశీ గడ్డపై జరిపితే మూలధన లాభంపై పన్నువిధించే అధికారం ప్రస్తుత ఆదాయపన్ను చట్టం ప్రకారం భారత ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ప్రపంచీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ముసుగులో బహుళ జాతి సంస్థలు సాగిస్తున్న దోపిడీ, మోసానికి వొడా ఫోన్- హచ్ ఈస్సర్ కంపెనీల మధ్య జరిగిన క్రయవిక్రయాల తంతే ప్రబల నిదర్శనం. ఈ దోపిడీకి సుప్రీం కోర్టు తీర్పు చట్టబద్ధత కల్పించినట్లయ్యింది. భారత ప్రభుత్వానికి, వొడాఫోన్ సంస్థకు మధ్య పన్నువివాదం కేసు పూర్వపరాలను పరిశీలిస్తే మోసం, దగా బోధపడుతుంది. భారత మొబైల్ రంగ వ్యాపార సంస్థ హాంగ్ కాంగ్ కుచెందిన హుట్చిసన్ వాంపోయా (హచ్)కు చెందిన 67 శాతం వాటాను బ్రిటిష్ టెలికమ్యూనికేషన్స్ రంగంలో బడా కంపెనీ అయిన వొడాఫోన్ గ్రూప్ సంస్థ రూ.54,000 కోట్లకు (11.08 బిలియన్స్)కు 2007లో కొన్నది. ఆదాయపు చట్టం ప్రకారం మూలధన లాభాలపై 22 శాతం పన్ను చెల్లించాలి.
ఆ మేరకు ఆదాయ వనరు వద్ద పన్ను మినహాయింపు (టిడి.ఎస్) నిబంధన మేరకు హుట్చిసన్ వాంపోయా సంస్థకు చెల్లించాల్సిన మొత్తం నుండి మూలధన లాభంపై పన్నును ఆదాయపన్ను శాఖకు జమచేసి మిగిలిన సొమ్మును చెల్లించాల్సిన బాధ్యత వొడాఫోన్ గ్రూప్ సంస్థపై ఉన్నది. పన్ను భారాన్ని తప్పించుకొనే దురుద్దేశంతో పన్నురహిత దేశాలు(టాక్స్ హెవెన్ కంట్రీస్)గా పేరొందిన కేంద్రాలలో క్రయవిక్రయాల లావాదేవీలను నిర్వహించడం బహుళ జాతి సంస్థలకు పరిపాటిగా మారింది.
ఆదాయపు పన్ను శాఖ 2007లో హుట్చిసన్ వాంపోయా సంస్థకు, వొడాఫోన్ సంస్థకు మధ్య జరిగిన క్రయవిక్రయాలకు సంబంధించిన మూలధన లాభంపై రూ.11,000 కోట్ల పన్ను చెల్లించాలని వొడాఫోన్ సంస్థకు తాకీదిచ్చింది. దాన్నిసవాలు చేస్తూ వొడాఫోన్ సంస్థ ముంబాయి హైకోర్టులో దావా వేసింది. పన్ను చెల్లించాల్సిందేనని 2010 సెప్టెంబర్‌లో కోర్టూ తీర్పు చెప్పగా వొడాఫోన్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం భారత ప్రభుత్వానికి ప్రతికూలమైన తీర్పును 2012 జనవరి 20న వెలువరించింది. హచ్ సంస్థకు చెందిన భారత దేశంలోని మొబైల్ ఆస్తులను వొడాఫోన్ కొనుగోలు చేసిన ఆర్థిక లావాదేవీలు విదేశాలలో జరిగాయి కాబట్టి అవి భారత దేశ ఆదాయపు పన్ను చట్టం పరిథిలోకి రావని ప్రధానన్యాయమూర్తి ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది.
ఆదాయ పన్ను శాఖ వద్ద డిపాజిట్ చేసిన రూ.2,500 కోట్లను 4 శాతం వడ్డీతో సహా వొడాఫోన్ సంస్థకు రెండు మాసాల లోపు తిరిగిచెల్లించాలని, అలాగే రూ.8,500 కోట్లకు ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీ పత్రాలను నాలుగు వారాల్లోపు వాపసు ఇవ్వాలని ఆదేశించింది. భారత ప్రభుత్వం, వొడాఫోన్ సంస్థల మధ్య చెలరేగిన పన్ను వివాదంపై సుప్రీం కోర్పు ఇచ్చిన ఈ తీర్పు పర్యవసానాలు భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి.
2-జి స్పెక్ట్రం కుంభకోణంలో సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు నిచ్చి దేశ సంపదను కొల్లగొట్టడానికి బరితెగించిన విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థల అడ్డగోలు దోపిడీ, అవినీతికి అడ్డుకట్ట వేసిందని దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. 2-జి కుంభకోణం వ్యవహారంలో వొడాఫోన్ సంస్థ కూడా భాగస్వామే. ఈ సంస్థపై సీబీఐ 2011 నవంబర్‌లో దాడులు చేసింది. టెలికమ్యూనికేషన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) 49 శాతానికి పరిమితం చేస్తున్న నిబంధనను 2005 నవంబర్ 3న తొలగించి- 74 శాతం వరకు అనుమతించిన తర్వాత సంభవిస్తున్న దుష్పరిణామాలల్లో ఇదొకటి.
హచ్ సంస్థకు చెందిన 67 శాతం వాటాలను కొన్న వొడాఫోన్ సంస్థ , మిగిలిన 33 శాతం వాటాదారూగా ఉన్న ఈస్సర్ సంస్థతో కలిసి 2007 నుండి వొడాఫోన్ ఈస్సర్ సంయుక్త సంస్థగా మన దేశంలో భారత కంపెనీగానే వ్యాపారాన్ని కొనసాగించింది. ఆనాడు దాని ఆస్తుల అంచనా విలువ రూ.92,000 కోట్లు (18.8 బిలియన్లు). అటుపై ఆ రెండు సంస్థల మధ్య వివాదం పొడచూపడంతో ఈస్సర్ సంస్థ వాటాలను కూడా 2011 జూలైలో కొని మొత్తం కంపెనీకి యజమానిగా మారింది.
మన లాంటి దేశాల చట్టాల కళ్ళు కప్పి ఆదాయ పన్నులను చెల్లించకుండా తప్పించుకొనే దురుద్దేశంతోనే బహుళ జాతి సంస్థలు ఆదాయపు పన్నురహిత చట్టాల అమలులో ప్రసిద్ధి చెందిన కేమన్ దీవులు, నెదర్లాండ్, మారిషస్ వగైరా దేశాలలో పేరుకు మాత్రమే కంపెనీలను రిజిస్టర్ చేసి, అక్కడనుంచి వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు రికార్టులు సృషి స్తున్నాయి. ఆ కోవలోనే భారత దేశంలోని ఆస్తులను విక్రయించే ముందస్తు పథకంలో భాగంగానే హచ్ సంస్థ కేమన్ దీవుల్లో బోగస్ సంస్థను నెలకొల్పింది. నెదర్లాండ్‌లో రిజిస్టర్ అయిన వొడాఫోన్ గ్రూపుకు చెందిన సంస్థతో క్రయవిక్రయాల వ్యవహారాన్ని నడిపింది. ఇదంతా బూటకపు వ్యవహారమనే తేలుతోంది.
సుప్రీం కోర్టు తీర్పును శిరోధార్యంగా భావించి కేంద్ర ప్రభుత్వం నిష్క్రియగా కూచుంటే భవిష్యత్తులో విదేశీ కంపెనీలే కాదు, స్వదేశీ కంపెనీలూ ఇదే బాటపట్టి పన్నులు ఎగ్గొట్టే అనైతిక వ్యవహారాలు నడుపుతాయి. ఇప్పటికే ఆ మార్గంలో పలు కార్పొరేట్ సంస్థలు ప్రయాణిస్తున్నాయి. తాజా ఆర్థిక కుంభకోణాల చరిత్రలో ఇదొక కీలకాంశం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారత ప్రభుత్వం, ఆ కంపెనీలు ఆదాయపు పన్నుచట్టంనుండి తప్పించుకోవడానికి వీలులేని చట్టానికి పదును పెట్టాలి.
No comments:
Post a Comment