Thursday, May 26, 2011

విద్యాహక్కు చట్టం - 2009 'అమలు'కు రాజకీయ దృఢసంకల్పం ఆవశ్యకం

విద్యాహక్కు చట్టం - 2009 'అమలు'కు రాజకీయ దృఢసంకల్పం ఆవశ్యకం
Tue, 29 Jun 2010, విశాలాంధ్ర టి. టి.లక్ష్మీనారాయణ

మానవ వికాసానికి, సమాజాభివృద్దికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనం. మనిషికి చైత న్యంతోపాటు సత్‌ప్రవర్తన, సంస్కారం, నైతిక విలు వలు, నీతి నియమాలను ఉపదేశించడం ద్వారా సమగ్ర మానవుడిగా తీర్చిదిద్దగల శక్తి ఒక్క విద్యకే ఉన్నదని మేథావులు, తత్వవేత్తలు, విద్యావేత్తలెందరో నొక్కి వక్కాణించారు. విద్యా హక్కు మానవ హక్కుల్లో ప్రథమ శ్రేణిది. విద్యావ్యవస్థకు సంబందించి ఒక్కో దేశానికి ఒక్కో చరిత్ర ఉన్నది. ఆయా దేశాల్లోని సామాజిక, ఆర్ధిక ప్రగతికి అనుగుణంగానే విద్యా విధానాన్ని రూపొందించి, అమలు చేయబడుతుంది. దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించగల శక్తి ఆ వ్యవస్థకు ఉండదు. పర్యవసానంగా విద్యా వ్యవస్థ లక్ష్యం, సారాంశం, యంత్రాంగం అన్నింటినీ ఆయా చారిత్రక దశల్లో ఉన్న సామాజిక ఆర్ధిక చట్రమే నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ సామాజిక, ఆర్థికాభివృద్ధికి రూపురేఖలు దిద్దడం, ప్రభావితం చేయడం, మార్పు వైపున సమాజాన్ని ముందుకు నడిపించడంలో విద్య క్రియాశీల పాత్ర పోషిస్తుంది. విద్యాభివృద్ధి అన్ని రంగాలతోపాటు ముఖ్యంగా ఆర్థిక ప్రగతికి మార్గాన్ని సుగమం చేస్తుంది. మెరుగైన ఉత్పత్తి సాధనాల అన్వేషణ ద్వారా జాతి సంపద ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. దాని ఫలాలు మనలాంటి వ్యవస్థలో అందరికీ అందకపోవచ్చు. కారణం ఉత్పత్తి అయిన సంపద పంపిణీ ఆ నిర్థిష్ట కాలంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వర్గ స్వభావాన్ని బట్టి ఉంటుంది. సంపద పెరిగేకొద్దీ విద్యాభివృద్ధికి అవకాశాలు మెరుగు పడతాయి. విజ్ఞానాన్వేషణ పెరుగుతుంది. అందరికీ విద్యను అందించడం సాధ్యమవుతుంది. పర్యవ సానంగా బుద్దిజీవులు, శ్రమజీవుల నైపుణ్యం, సామర్ధ్యం పెరిగే కొద్దీ ఉత్పత్తి పెరుగుతుంది. తరతారాలుగా సముపార్జించుకొన్న విజ్ఞానంతో పాటు, అనుభవాలను జోడించి, నాణ్యమైన పరి శోధనలను కొనసాగించి నూతన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఆర్జిస్తూ సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో విద్య పునాదిరాయి పాత్ర పోషి స్తుంది. సమాజంలోని లోపాలను, సమస్యలను పసిగట్ట గల సంపూర్ణ మానవుని తీర్చిదిద్దగల శక్తి ఒక్క విద్యకే ఉన్నది. కులం, మతం, జాతి, ప్రాంతం, లింగ భేదం లేకుండా స్త్రీ, పురుషుల్లోని విజ్ఞాన వంతులు వ్యక్తులుగా, సమూహంగా, సమష్ఠిగా సామాజిక మార్పుకు, మానవీయ సమాజ నిర్మా ణానికి కావాలసిన చైతన్యాన్ని విద్య అందిస్తుంది. సమాజానికి, విద్యకు మధ్య ఉన్న అనుబంధం విడ దీయరానిదని గతి తర్కం ద్వారా బోధపడుతుంది. సమాజంలో విద్యకున్న ప్రాధాన్యత వర్ణనాతీతం. కానీ విద్య అందరికీ అందుబాటులో నేటివరకు లేదు. మన భారత సమాజంలో మానవుల మధ్య అంతరాలు, వివక్ష కొనసాగుతున్నది. అత్యధిక ప్రజానీకం విద్యకు నోచుకోకుండా ఈ సమాజం వెలివేసింది. నేడున్న దురదృష్టకర పరిస్థితిని గమనిస్తే అన్ని వస్తువుల్లాగే విద్యకూడా పూర్తి స్థాయిలో వినియోగవస్తువుగా బహిరంగ మార్కెట్‌లో నిస్సిగ్గుగా అమ్మబడుతున్నది. ఒకనాడు సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు, సమాజసేవలో అంతర్భాగంగా స్వచ్చంద సేవాసంస్థలు, వ్యక్తులు విద్యా సంస్థలను నెలకొల్పి, విద్యా వ్యాప్తికి అంకిత భావంతో పాటు పడ్డారు. మార్కెట్‌ ఆర్ధిక నీతి రాజ్యమేలుతున్న ఈనాడు లాభనష్టాల కొలబద్దతో విద్యా వ్యవస్థ నిర్వహణను కూడా బేరీజు వేసుకొనే హీనస్థితికి దిగజారాం.

ఈ పూర్వరంగంలో విద్యార్థిలోకం, సామాజిక వర్గాలు సాగించిన దశాబ్దాల పోరాటానికి పాక్షిక విజయం లభించింది. రాజ్యాంగ బద్దంగా విద్యను ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం చేయడం సామా జిక ప్రగతిలో నిస్సందేహంగా ఒక ముందడుగు. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఆరు దశాబ్దాల తరువాత గానీ ఈ హక్కు భావిభారత పౌరులైన బాల బాలికలకు దక్కలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 మొదలు పది సంవత్సరాల కాల వ్యవధిలో 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత, నిర్భంద ప్రాథమిక విద్యను అందించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 45 లోని ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. దశాబ్దం కాదు ఆరు దశాబ్దాలు గడచిపోయాయి. ఆదేశిక సూత్రాలకు ఆచరణ కరువైయింది. ఆ లక్ష్య సాధనలో ఘోరవైఫల్యం చెందాం. బడి గడప తొక్కని వారు, బడిలో అడుగుపెట్టి మధ్యలో మానేసిన పిల్లలు నిరక్షరాస్యులుగా, బాలకార్మికులుగా నికృష్ఠ మైన జీవితాలతో మగ్గి పోతున్నారు. అలా రెండు తరాలు గడచిపోయాయి. సామాజికంగా, ఆర్ధికంగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తూ నాగరిక ప్రపంచంలో దూసుకుపోతున్నా మని, ప్రపంచదేశాలతో పోటీపడుతున్నామని, ప్రపం చంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనని దేశాధినేతలు చంకలు చరుచుకొంటున్నారు. కాని ''అందరికి విద్య'' మాత్రం ''అందని ద్రాక్షపండు'' లాగే మిగిలిపోయింది. మానవ హక్కులు, ప్రజా స్వామ్య హక్కులు బడుగు బలహీన వర్గాలు, వారి పిల్లలలో అత్యధికులకు అందుబాటులోలేని స్థితి. పర్యవసానంగా ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. ''ఎడ్యుకేషన్‌ ఈజ్‌ ఎ రైట్‌ నాట్‌ ఎ ప్రివిలేజ్‌ '' (విద్య ప్రత్యేక సౌకర్యం కాదు హక్కు), విద్యా హక్కును రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని దేశవ్యాపితంగా సమరశీల ఉద్యమాలెన్నో నిర్వహించబడ్డాయి. యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థల వత్తిడి పెరిగింది. ఈ పూర్వరంగంలో భారత ప్రభుత్వం సార్వత్రిక మరియు ఉచిత విద్యను ప్రాథ మిక హక్కుగా గుర్తించి రాజ్యాంగంలో పొందుపరచి 2010 ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి తీసుకురావడం హర్షణీయం. ''ఇల్లు అలకగానే పండుగ అయి పోలేదు'' అన్న సామెతగా చట్టం తీసుకురాగానే పిల్లలందరికీ విద్య అందదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, స్త్రీ పురుషులకు సమానమైన ఆస్తి హక్కు చట్టం, వరకట్న నిషేధ చట్టం, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ మరియు నిషేధ చట్టం, బాలకార్మికుల నిషేధ చట్టం లాంటి సామాజిక ప్రగతికి దోహదపడే పలు అత్యంత ప్రాధాన్యత గల చట్టాలు చట్టుబండలుగా మారిపోయిన దుస్థితి గమనిస్తూనే ఉన్నాం. వీటి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. విద్యా హక్కు చట్టం-2009ని పూర్తిస్థాయిలో అమలుచేయడానికి పాలక వర్గాలకు దృఢమైన రాజకీయ సంకల్పం, దీక్షాదక్షతలు, నిబద్దత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. 2002 సవంత్సరంలో రాజ్యాంగానికి 86 వ సవరణ చేసి విద్యా హక్కును అమలులోకి తెస్తున్నామని చెప్పి అందులో పిల్లల తల్లిదండ్రులను, సంరక్షకులను బాధ్యులుగా చేసే నిబంధన చేర్చారు. తద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాయి.

నాటి నుంచి నేటి వరకు ఏడేళ్ళపాటు సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్‌ 21 ఎ మూడవభాగం, ఆర్టికల్‌ 45(3) ను సవరించి నూతన క్లాజ్‌ (కె) ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతలకు సంబందించిన ఆర్టికల్‌ క్రింద జతచేయడంద్వారా ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఇప్పుడు రాష్ట్రపతి రాజముద్రతో అమలులోకి వచ్చింది. పలు ప్రసవవేదనలతో రూపొందిన ఈ విద్యా హక్కు చట్టం అమలు నిస్సందేహంగా పెనుసవాలే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, పిల్లల సంరక్షకులు, మొత్తం సమాజం ఈ సవాలును స్వీకరించి సమర్థవంతంగా ఎదుర్కోవలసిన చారిత్రిక అవసరం ఎంతైనా ఉన్నది.

నిధుల సమస్య: చట్టాన్ని పార్లమెంటు ఆమో దించింది. కాని నిధుల కేటాయింపు అంశంపై నిర్ధిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించలేదు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యను పిల్లలందరికీ అందించే ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. దానికి అవసరమైన నిధులను వారే సమకూర్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక దుస్థితిని గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాలైతే అప్పుల ఊబిలో నిండా కూరుకుపోయి, వార్షిక బడ్జెట్ల కేటాయింపులకే భారీగా కోతలు పెడుతూ విశ్వసనీయతను కోల్పోయాయి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ధిక భారం మోపితే అసలుకే మోసం జరుగుతుంది. కేవలం 10% నిధులను వెచ్చించి కేంద్రప్రభుత్వం నుండి 90% ఆర్ధిక సహాయాన్ని పొందడానికి వీలైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లాంటి పథకాల అమలులో కూడా అస మర్థంగా వ్యవహరిస్తూ లబ్దిదారులకు ప్రయోజనం అందకుండా చేస్తున్నారు. ఈ చేదు అనుభవాలను పరిగణలోనికి తీసుకొంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సామాజిక బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించ లేవనడం ముమ్మాటికీ నిజం. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ లాంటి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వమే నిధుల కేటాయింపు బాధ్యతను తీసుకోవాలని బహిరంగంగానే కోరారు. కేంద్ర ప్రభుత్వం 55:45 నిష్ఫత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం 90:10 నిష్పత్తిలో నిధుల సహాయం చేస్తామని ప్రకటించింది.

సాకారం కాని ‘ప్రపంచ’ స్వప్నం

సాకారం కాని ‘ప్రపంచ’ స్వప్నం
‘సహస్రాబ్ది లక్ష్య సాధన’ ఎజెండా స్థితి-గతి
విశ్లేషణ...

అభివృద్ధి చెందుతున్న దేశాలలో (భారతదేశంతో సహా) పేదరికానికి సంబంధించి గణాంకాలతో కూడిన తాజా అంచనాల నివేదికను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అది తీవ్ర ఆందోళన కలిగించడమే కాదు, మన దేశాధినేతలు అనుసరిస్తున్న విధానాల డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. సహస్రాబ్ది లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి నాడు ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలను తారుమారు చేస్తూ దారిద్య్రంలో మగ్గిపోతున్న ప్రజల సంఖ్య అధికంగా ఉన్నదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా పేదల సంఖ్య గణనీయంగా తగ్గిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు ఈ నివేదిక ఒక చెంపపెట్టు.

ఐక్యరాజ్య సమితిలో సామాజిక స్పృహ వికసిం చింది. ప్రపంచ దేశాధినేతలంతా ఒకే వేదికపై గుమి గూడారు. అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలలో బలంగా వేళ్లూనుకుని ఉన్న కటిక దారిద్య్రాన్ని, ఆకలి బాధలను కనీసం సగానికన్నా తగ్గిస్తామని శపథం చేశారు. సార్వజనీన ప్రాథమిక విద్య, లింగ వివక్ష లేని సమానత్వం, మహిళా సాధికారత, శిశుమరణాల తగ్గింపు, తల్లుల ఆరోగ్య పరిరక్షణ, హెచ్‌ఐవీ / ఎయిడ్స్ మలేరియా తదితర భయానక అంటువ్యాధులను నిరోధించడం, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి ధ్యేయంగా అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రతినబూనారు.

ఈ మేరకు 2000 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 179 సభ్యదేశాల ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అన్ని వర్గాల ప్రజలను మానవాభివృద్ది ప్రక్రియలో భాగస్వాములను చేయడం దీని ఉద్దేశం. 2015 నాటికి ఈ లక్ష్యాలను సాధిస్తామని గడువు విధించుకున్నారు. ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగిడిన సందర్భంగా నిర్దేశించుకున్న ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధన’లో ప్రగతిని సమీక్షించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 20-22 తేదీల్లో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఒక సదస్సు నిర్వహించింది. ప్రతిజ్ఞ చేసి దశాబ్దం గడచిపోయింది. ఇహ! మిగిలింది ఐదు సంవత్సరాలు మాత్రమే. లక్ష్యాలను అసలు చేరుకోగలమా? అన్నది శేష ప్రశ్న.

ఈ ఆశావహదృక్పథాన్ని 2007-08 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పునా దులనే కుదిపేసిన ఆర్థిక సంక్షోభం నీరు గార్చింది. సంక్షోభ దుష్పరిణామాల పర్యవసానంగా ప్రపంచ ప్రజానీకం కష్టాల ఊబిలో కూరుకుపోయారు. వివిధ రూపాలలో దాని ప్రభావం నేటికీ కొనసాగుతున్నది. మన దేశంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. నిరుద్యోగుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఆహార సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పేద, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. ఆహార ద్రవ్యోల్బణం 17.9 శాతానికి ఎగబాకి ఆహార భద్రతకు పెనుసవాలు విసిరింది. రెండంకెల ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసి ఒక అంకెకు దించుతామని ప్రభుత్వాధినేతలు బీరాలు పలికారు.

కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించి హనుమంతుని తోకలా పెరుగుతూ అది ప్రస్తుతం 15.9 శాతం చేరింది. దాన్ని అదుపు చేసే శక్తి లేక, పోయిన ఏడాది వర్షాలు సరిగా పడలేదని, కరువు కాటకాలు సంభవించాయని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు మూలంగా పేదల కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్‌లో ‘డిమాండ్-సప్లయ్’ సూత్రాన్ననుసరించి ఆహార వస్తువుల ధరలు పెరిగాయని నమ్మబలుకుతూ ప్రభుత్వంలోని పెద్దలు తప్పించుకుంటున్నారు. అసలు కారణాల జోలికి పోవడం లేదు. ఐక్యరాజ్యసమితి తాజా అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచంలో 20 కోట్ల మందికి ఆహార భద్రత కొరవడింది. మహిళలు, ఐదేళ్లలోపు పిల్లలలో పౌష్టికాహార లోపాల సమస్య పెరుగు తున్నది. 47 శాతం మంది పిల్లలు తక్కువ బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఉదాహరణకు మన రాష్ట్రంలో స్ర్తీ శిశు సంక్షేమశాఖ బహిర్గతం చేసిన సమాచారం మేరకు 50.94 లక్షల మంది పిల్లల బరువు చూస్తే వారిలో 24 లక్షల మంది పోషకాహార లోపాలవల్ల తక్కువ బరువు కలిగివున్నారని తేలింది.

ఈ పూర్వరంగంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలలో (భారతదేశంతో సహా) పేదరికానికి సంబంధించి గణాంకాలతో కూడిన తాజా అంచనాల నివేదికను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అది తీవ్ర ఆందోళన కలిగించడమే కాదు, మన దేశాధినేతలు అనుసరిస్తున్న విధానాల డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. సహస్రాబ్ది లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి నాడు ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలను తారుమారు చేస్తూ దారిద్య్రంలో మగ్గిపోతున్న ప్రజల సంఖ్య అధికంగా ఉన్నదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా పేదల సంఖ్య గణనీయంగా తగ్గిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు ఈ నివేదిక ఒక చెంపపెట్టు. ఒక్క 2009 సంవత్సరంలోనే అదనంగా 5.3 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు చేరుకున్నారని పేర్కొంది. ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధన’ తిరోగమన దిశలో సాగుతున్నదన డానికి ఇది ఒక ప్రబల నిదర్శనంగా ఉదహరించింది. ఈ నివేదికను 2005లో ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా రూపొందించారు.

నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూఅదుపులేకుండా పెరగడంతో పేద ప్రజల కొనుగోలు శక్తి ఇప్పుడు ఇంకా క్షీణించింది. మరొక వైపున పేదరికాన్ని అంచనా వేయడానికి ఉపయోగి స్తున్న కొలమానాలపై కూడా భిన్నాభిప్రాయా లున్నాయి. ఒక అమెరికన్ డాలర్ అంటే రూ. 46ల దినసరి ఆదాయానికి కింద ఉన్న వారిని పేదలుగా గుర్తిస్తున్నారు. తిండి, గుడ్డ, ఇల్లే కాదు, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, రక్షిత మంచినీరు, మౌలిక వసతులు వగైరా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని మానవహక్కులుగా నాగరిక సమాజం, న్యాయవ్యవస్థ అంగీకరించాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1990వ సంవత్సరంలో 37.5 మంది దారిద్య్రరేఖ కింద జీవిస్తున్నారని, ఈ సంఖ్యను 2015 నాటికి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 18.75 శాతానికి తగ్గిస్తామని, తదనుగుణంగా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని 2006 ఫిబ్రవరిలో ప్రభుత్వం విధాన ప్రకటన చేసింది. 2009-10 ఆర్థిక సర్వేలో పొందుపరిచిన మేరకు 2004-05 ఆర్థిక సంవత్సరం లో గ్రామీణ ప్రాంతాల్లో 28.3 శాతం పట్టణ ప్రాంతాలలో 25.7 శాతం, మొత్తం దేశంలో సరాసరిన 27.5 శాతం దరిద్ర నారాయణలున్నారని ప్రణాళికా సంఘం అంచనా వేసింది.

విశ్వసనీయత ఉన్న ఇతర సంస్థల అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 41.8 శాతం, పట్టణ ప్రాంతాలలో 37.2 శాతం, సరాసరిన 39.5 శాతం ఉన్నారని కూడా ఆర్థిక సర్వేలోనే పేర్కొన్నారు.
ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు దక్కేవిధంగా విధానాలను రూపొందించి అమలు చేస్తున్నామని, తద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడానికి మన దేశం కృషి చేస్తున్నదని విదేశాంగ శాఖామా త్యులు ఎస్.ఎం.కృష్ణ ఐక్యరాజ్యసమితి సదస్సులో సెలవిచ్చారు. ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం నుండి బయటపడ్డామని, ఆర్థిక వృద్ధిరేటు ఆశించిన దానికన్నా వేగంగా పెరుగుతున్నదని, జూన్ నెలతో ముగిసిన రెండవ త్రైమాసికాంతానికి 8.8గా నమోదయిందని ఆర్థిక శాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల సూచిక మేరకు జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ. 61,64,178 కోట్లుగా ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 2009 డిసెంబర్ నాటికి 284 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. జాతీయ తలసరి ఆదాయం రూ. 43,749కు పెరిగింది. ఎంత ఎక్కువగా ఆర్థికాభివృద్ధి సాధిస్తే అంత ఎక్కువగా సామాజికాభివృద్ధికి నిధులు లభ్యమవుతాయని ప్రజలు కలలుగంటారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజానీకానికి సమపాళ్లలో పంపిణీ జరగాలి. మరీ ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలకు వారి వాటా వారికి చేరాలి. అప్పుడే దారిద్య్ర నిర్మూలనా లక్ష్యం నెరవేరుతుంది.

సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలలో మొదటి సమస్య అయిన దారిద్య్ర నిర్మూలన నిరాశాజనకంగా ఉన్నది. రెండవది- సార్వజనీన ప్రాథమిక విద్య. చిన్నారులను 100 శాతం బడిలో చేర్పించాలి. బడిమానేసే పిల్లల సంఖ్యను పూర్తిగా నిరోధించాలి. 2007 సంవత్సర గణాంకాలను పరిశీలిస్తే 15 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు ఉన్న వయోజనులలో అక్షరాస్యత 66 శాతం. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల నమోదు 61 శాతంగా ఉన్నది. నిష్ర్కమించేవారు దాదాపు 35 శాతం ఉన్నారు. కొన్ని పరిమితులున్నా విద్యాహక్కు చట్టాన్ని తీసుకురావడం నిస్సందేహంగా ముందడుగే. మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత, ప్రైవేట్ పాఠశాలల్లో సీట్ల కేటాయింపు, నిర్దేశిత పరిధిలో పాఠశాలలు వగైరా సంక్లిష్ట సమస్యలను పరిష్కారం లభిస్తేనే చట్టంవల్ల ప్రయోజనం చేకూరు తుంది. మూడవది- ఐదు సంవత్సరాలలోపు శిశు మరణాల నిష్పత్తిని వెయ్యి జననాలకు కనీసం 42కు తగ్గించడం. కానీ ఆడ శిశువుల్లో 55, మగశిశువుల్లో 52, సరాసరి 53 మరణాలు సంభవిస్తున్నాయి. నాలుగవది- ప్రసూతి మరణాలను లక్ష జననాలకు 109కి తగ్గించడం. 2004-06 నాటికి ఇది 354కు మాత్రమే తగ్గింది.

ఐదవది లింగ సమానత్వం. మహిళా సాధికారత సాధనలో అడుగు ముందుకుపడటం లేదు. చట్ట సభల్లో మూడవవంతు రిజర్వేషన్ల కోసం మహిళా లోకం ఉద్యమాలు చేస్తున్నది. ముసాయిదా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇదిగో అదిగో అని ఊరిస్తున్నారు తప్ప, వ్యతిరేకించేవాళ్ల నిజస్వరూపాన్ని ఎండగట్టి, బిల్లుకు ఆమోదాన్ని పొందలేకపోతున్నారు.

ఆరవది హెచ్‌ఐవీ / ఎయిడ్స్ రోగుల సమస్య. ప్రపంచ వ్యాప్తంగా 2008 డిసెంబర్ నాటికి 3.34 కోట్ల మంది హెచ్‌ఐవీ పీడితులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. వీరిలో 15 సంవత్సరాల లోపు పిల్లలు 21 లక్షల మంది ఉన్నారు. ఈ వ్యాధివల్ల మరణించిన 20 లక్షల మందిలో దాదాపు మూడు లక్షల మంది పిల్లలే. 2006 నాటికి మన దేశంలో 25 లక్షలకు పైగా ఉన్నారని జాతీయ ఎయిడ్స్ నిరోధక సంస్థ అంచనా వేసింది. అసంఘటిత కార్మికులు అత్యధికంగా ఈ వ్యాధికి బలైపోతున్నారు. మన రాష్ట్రంలో విషజ్వరాల బారినపడి మరణిస్తున్న గిరిజనులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవు తున్నది. ఏడవది- పర్యావరణ పరిరక్షణ అంశం. నేడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా తయా రైంది. మొత్తం భూమి విస్తీర్ణంలో 20.64 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అటవీ సంపదను, సహజ వనరులను రక్షించుకుంటూ, కాలుష్యాన్ని అరికట్టే చర్యలను పకడ్బందీగా అమలు చేయాలి, చేసి పచ్చదనాన్ని కాపాడుకోకపోతే ఆహార భద్రతకు పెను ముప్పు వాటిల్లుతుంది.

ఎనిమిది- నిధులకు సంబంధించిన అంశం. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ దేశాల భాగస్వామ్యంలో అంతర్భాగంగా అభివృద్ధి చెందిన దేశాలు వారి స్థూల జాతీయోత్ప త్తిలో 0.7 శాతం నిధులను అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలను ఆర్థిక సహాయంగా అందిస్తా మని చేసిన వాగ్దానాన్ని ఐదు దేశాలు మాత్రమే పాక్షికంగా అమలు చేశాయి. రుణ భారాలతో పీకల్లోతు కష్టాలలో ఉన్న దేశాలకు ఈ లక్ష్యాలను చేరుకోవడం అందుకే దుర్లభమవుతున్నది.

అభివృద్ధి, సామాజిక న్యాయం, శాంతియుత సహజీవనం, స్థిరమైన ఆర్థిక, సామాజికాభివృద్ధి, అధిక ఉత్పాదకత సాధించాలన్నా, విద్య, ఆరోగ్యం, ఆవాసం వగైరా మానవహక్కులు అందరూ సంపూర్ణంగా అనుభవించాలన్నా ముందు షరతు దారిద్య్రాన్ని నిర్మూలించాలి. ప్రజల నాణ్యమైన జీవన ప్రమాణాల ప్రాతిపదికగానే ఏ దేశమైనా అభివృద్ధి చెందిందా? లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనే ధ్యేయంగా కార్యాచరణకు మన దేశం పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Wednesday, April 20, 2011

అవినీతిని అరికడితేనే అభివృద్ధి!

published in Sakshi Telugu daily on 2011 April 18

అవినీతిని అరికడితేనే అభివృద్ధి!
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే నేతృత్వంలో సాగుతున్న అవినీతి వ్యతిరేక పోరాటం జాతి దృష్టిని ఆకర్షించి అనూహ్యమైన మద్దతును సాధించడం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. అధికార పీఠంపై ఉన్న పెద్దలు ఆగమేఘాలపై కదిలి లోక్‌పాల్ బిల్లును రూపొందించడానికి పదిమందితో కూడిన అధికార, అనధికార సభ్యులతో కమిటీని నియమిస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వం మెడలు వంచగలిగామని ఉద్యమకారుల్లోనూ, దేశ నలుమూలలా హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. ప్రజాశక్తి ముందు పాలకులు బలాదూర్ అన్న భావన సర్వత్రా నెలకొన్నది. ఇది శుభపరిణామం. పోరాటాలతోనే ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసం సామాన్య ప్రజానీకంలో కూడా కలిగింది. అవినీతిపై తొలి విజయం సాధించా మని, ‘‘జన్ లోక్‌పాల్’’ బిల్లును యూపీఏ-2 ప్రభుత్వం చచ్చినట్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయిస్తుందని, అవినీతి అంతానికి రోజులు దగ్గర పడ్డా యని భ్రమించేవారు ఎవరైనా ఉంటే ఉండవచ్చు. కానీ, ఇది బలంగా వేళ్లూనుకొని పాతుకుపోయి ఉన్న దీర్ఘకాలిక సమస్య. అయితే, విస్తృతస్థాయి చర్చకు, కార్యాచరణకు మాత్రం ఈ ఆందోళన అనుమానం లేకుండా తెరలేపింది. ప్రజల ఎజెండాగా దేశం ముందుకు వచ్చింది.
‘‘మాయల పకీరు ప్రాణం సప్తసముద్రాల ఆవల ఉన్న మర్రిచెట్టు తొరల్రో దాగి ఉన్న చిలకలో ఉందన్న’’ చందంగా అవినీతి మూలాలు ఈ వ్యవస్థలోనే ఉన్నాయి.

దోపిడీకి మూలం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ. చట్టబద్ధ దోపిడీని ‘అవినీతి’గా నామకరణం చేసి, దానికి వ్యతి రేకంగా పోరాడుతున్నాం. లోపభూయిష్టమైన వ్యవస్థలో మౌలిక మార్పుల కోసం ఉద్యమిస్తే అది యావత్తు మాన వాళిని దోపిడీ నుండి విముక్తి చేస్తుంది. అవినీతిని పెంచి పోషిస్తున్న రాజకీయ వ్యవస్థను ప్రజలు చీదరించుకుం టున్నారు. అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించే చట్టాలు కావాలనే ప్రగాఢమైన వాంఛ వారిలో ఉన్నది. అందుకే మచ్చలేని గాంధేయవాది అన్నా నిజాయితీగా, అహింసా పద్ధతుల్లో పోరాటానికి నడుంకడితే అందరూ మద్దతు పలకడానికి ‘క్యూ’కట్టారు. వివిధ రంగాల ప్రముఖులు, సామాన్య ప్రజలు, బుద్ధి జీవులు, సమాజం ఉన్నతంగా ఉండాలనే ఆకాంక్ష కలిగిన విద్యార్థి, యువ జనుల నుండి కార్పొరేట్ సంస్థల పెద్దలదాకా మద్దతు పలికారు.

కానీ... నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలలో పని చేస్తూ, సమాజానికి నిస్వార్థ సేవలు అందిస్తున్న వారిని భాగస్వాములను చేయకపోవడం ఈ ఉద్యమం బలహీనత. రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఉద్య మాన్ని నిర్మించాలనడం సమంజసం. కానీ సమాజాన్ని నియంత్రించే రాజకీయాలనే దూరంగా పెట్టాలన్న ఆలోచన సత్ఫలితాలను ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను మాత్రమే రూపొందించగలదు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు పొందగలిగినప్పుడు మాత్రమే ఆ బిల్లు పార్ల మెంట్ ఉభయ సభల్లో ఆమోదంపొంది చట్టంగా రూపొం ది ప్రజల చేతుల్లో ఆయుధంగా మారుతుంది.

అభివృద్ధికి ఆగర్భ శత్రువు

ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి అవినీతి అతి పెద్ద అవ రోధం. అభివృద్ధి ముసుగులో అవినీతిని ప్రోత్సహిస్తు న్నది, వటవృక్షంలా పెంచి పోషిస్తున్నది, పాలకుల విధానాలే. నీతికి, నిజాయితీకి మారుపేరుగా పేరొందిన మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వాస్తవానికి అవినీతిని పెంచి పోషిస్తున్న నయా ఉదారవాద సరళీకృత ఆర్థిక విధానాల రూపశిల్పి. 2జీ స్పెక్ట్రం కుంభకోణం ద్వారా లక్షా డెబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాయల జాతి సంపదను కొల్లగొడితే, సంకీర్ణ రాజకీయాల వల్ల రాజీపడి, నిస్సహాయుడిగా మిగిలిపోయానని నిస్సిగ్గుగా బహిరంగ ప్రకటన చేసిన దీక్షాదక్షుడు. అవినీతిని పెంచి పోషిస్తున్న అలాంటి ప్రభుత్వ పెద్దలు అన్నా దీక్షకు మాత్రం తక్షణం స్పందించారు. దీనికి ప్రధానంగా రెండు మూడు కార ణాలు కనిపిస్తున్నాయి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత వేదికయిన పార్ల మెంటులో ప్రతిపక్షాల ఆందోళనను లెక్క చేయకుండా, బాధ్యతారహితంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సానుకూలంగా ముందుకు రావడానికి గల కారణం అయిదు రాష్ట్రాలలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలే. అన్నా దీక్షతో అవినీతి వ్యతిరేక పోరాటం మరింత విస్తరించి, బలపడితే రాజకీయంగా తీవ్ర నష్టం జరిగి, ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఘోరపరాజం చవిచూడాల్సి వస్తుందని భయపడ్డారు. ఉద్యమకారుల డిమాండ్లను సూత్రప్రాయంగా అంగీక రించడం ద్వారా ఉద్యమ ఉధృతికి అడ్డుకట్ట వేయ వచ్చు. అవినీతికి మేమూ వ్యతిరేకమే. ఇదిగో, లోక్ పాల్ బిల్లును తీసుకు రాబోతున్నామనే సంకేతాన్ని వెల్లడించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రస్తుతానికి గండం గడిస్తే, తరువాత సంగతి చూద్దాం! అపరచాణక్యుడు ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ పని చేస్తుంది కాబట్టి ‘జన్ లోక్‌పాల్’ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించడం, దానిపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించి, ఆమోదించడం అంత సులభం కాదనే భరోసా ఉండవచ్చు. పార్లమెంటు పొందికపై వారికి పూర్తి అవగాహన ఉన్నది. అభివృద్ధికి నమూ నాగా పెరిగిపోతున్న కుబేరులు, అపర కుబేరులు, కార్పొరేట్ సంస్థల అక్రమ సంపాదనకు కాపలా కుక్కలుగా పనిచేస్తున్న వారు అక్కడున్నారు. ఎన్నికల్లో కోట్లకు కోట్లు కుమ్మరించి పదవులను చెరబట్టిన ప్రజాకంటకులూ ఉన్నారు. అక్రమ సంపాదనాపరులు, అవినీతిపరులూ అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటులో అవినీతికి సమాధికట్టే ‘జన్ లోక్‌పాల్’ బిల్లుకు ఆమోదముద్ర పడటం అంతసులభం కాదని వారికి బాగా తెలుసు.

నాలుగు దశాబ్దాల కాలంలో ఎనిమిదిసార్లు లోక్‌పాల్ ముసాయిదా బిల్లులు సభలో ప్రవేశపెట్టినా ఒనగూడిం దేమీలేదన్న అనుభవం వారి ముందున్నది. పెపైచ్చు అవినీతి ఊబిలో కూరుకుపోయి ఉన్న రాజకీయపార్టీల మద్దతు అడక్కుండానే లభిస్తుందన్న ధీమా!

నీతికి పట్టం కట్టాలి

అవినీతిని గూర్చి మాట్లాడే వాళ్లు, దాని పునాదులు ఎక్కడున్నాయో కూడా ఆలోచించాలి. రాజకీయ అవినీతి అత్యంత ప్రధానమైనది. మొత్తం వ్యవస్థను అది భ్రష్టు పట్టిస్తున్నది. ప్రజాస్వామ్యవ్యవస్థనే అపహాస్యం చేసి క్రియాశూన్యం చేస్తున్నది. చట్టబద్ధ పాలనకు చరమగీతం పాడుతూ అవినీతి, అక్రమాలు, అక్రమ సంపాదన, అధికార దాహం అందలం ఎక్కి కూర్చున్నాయి. ‘‘గొంగళ్లో కూర్చోని అన్నం తింటూ వెంట్రుకలు రాకూడదని’’ భావిస్తే ఫలితం ఉండదు. అందుకే ఈ లోపభూయిష్టమైన వ్యవస్థపైన కన్నెర్ర జేయాలి. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి. అధికార దుర్వి నియోగానికి ఎదురొడ్డి నిలవాలి. ప్రజానుకూల చట్టాల కోసం ఉద్యమించాలి, సాధించాలి. కేవలం చట్టాల సాధనతోనే ఫలితాలు ప్రజల ముంగిటకు రావు. సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, వరకట్న నిషేధ చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టాలు, కార్మికుల హక్కులను పరిరక్షించడానికి ఉన్న కార్మిక చట్టాలు, భూసంస్కరణల చట్టం లాంటి అనేక చట్టా లున్నా అమలులో చట్టుబండలుగా మారిపోయాయి. అధికార పీఠాన్ని అధిరోహించిన వారికి రాజకీయ సంకల్పం, అంకితభావం లేని పక్షంలో ఆశించిన ఫలి తాలు చేకూరవు. చట్టాలు ప్రజల చేతుల్లో నిజమైన ఆయుధాలుగా మారాలి. లేనిపక్షంలో నిరుపయోగంగా మూలన పడిపోతాయి. 1988 సంవత్సరంలో చేయబడిన అవినీతి నిరోధక చట్టానికి ఇదే గతి పట్టింది. కడకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గోడలకూ అవినీతి చెదలు పట్టింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, ఏసీబీ లాంటి సంస్థలూ పాలక పార్టీల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. కాగ్ నివేదికలకు విలువ లేకుండా పోయింది.

వీటన్నింటి పర్యవసానంగానే అవినీతికి సంబంధించిన కేసుల నమోదు, విచారణ, శిక్షణలు విధించడం, అమలు చేసే సర్వహక్కులను జన్ లోక్‌పాల్ చట్టానికి దఖలు పరచాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. చట్ట పరిధిలోకి ప్రధాన మంత్రి మొదలుకొని మంత్రులు, ప్రజాప్రతినిధులు, హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు, ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులం దరినీ చట్ట పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకొన్నది. అలాగే ఇదే తరహాలో అన్ని రాష్ట్రాలలో లోకాయుక్త చట్టాలను తీసుకొచ్చి అమలు చేయాలి. వీటన్నింటిపైన దేశ వ్యాపితంగా అర్థవంతమైన, సమగ్ర చర్చ జరిపి, అవినీతి నిరోధానికి దోహదపడే కఠిన తరమైన చట్టాన్ని త్వరితగతిన తీసుకురావడానికి ప్రజా ఉద్యమం కొనసాగాలి.

అలాగే లోక్‌పాల్ చట్టమొక్కటే సర్వరోగ నివారిణి కాజాలదు. దేశంలో రాజకీయ ప్రక్షాళన జరగాలి. ఎన్నికల సంస్కరణలు తక్షణావసరం. కొందరు అవగాహనా రాహిత్యంతోనే కావచ్చు అన్నా హజారేను నేటి తరం గాంధీగా పోల్చారు. ఆయన దాన్ని నమ్రతతో తోసి పుచ్చారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న అన్నా హజారే ‘‘నేను ఎన్నికల్లో పోటీచేస్తే డిపాజిట్ కూడా రాదని’’ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. డబ్బు, మద్యం రాజ్యమేలు తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారమే పార్లమెంటుకు రూ.40 లక్షలు, శాసనసభకు రూ.16 లక్షలు ఖర్చు చేయవచ్చు. వాస్తవానికి కోట్లలో ఖర్చు చేసి, ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల ప్రక్రియను అభాసుపాలు చేశారు. దీనంతటికీ కారణం అవినీతి సొమ్ము, నల్లధనం, అక్రమ సంపాదన. ప్రజా స్వామ్యం మనుగడకు భంగం వాటిల్లకూడదంటే డబ్బు ప్రభావాన్ని అరికట్టాలి. దామాషా ఎన్నికల విధానం మంచిదనే ఆలోచనలూ ఉన్నాయి. ఎన్నికల సంస్కరణల పైనా ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. 73, 74 రాజ్యాంగ సవరణల మేరకు అధికార వికేంద్రీకరణ జరగాలి. స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా ఎదగాలి. అవినీతికి నిలయాలుగా మారిన వివిధ రంగాలలో సమూలమైన మార్పుల కోసం శక్తిమంతమైన, నిరంతర ప్రజా పోరు తప్పనిసరి.

Monday, April 4, 2011

‘నిండుసభ ’ సాక్షిగా ‘కృష్ణా’ర్పణం!

published on April 2 2011,in sakshi Telugu daily

బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా మన రాష్ట్రానికి సంక్రమించిన ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించుకొంటూ, వెనుకబడిన ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను సాధించుకోవలసిన బృహత్తర కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఈ పూర్వరంగంలో దాదాపు నెలన్నర రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాలలో ఈ జీవన్మరణ సమస్యపై చర్చించి, వ్యూహ రచన చేసుకోకపోవడం చట్ట సభలపై ప్రజలకున్న విశ్వాసాన్ని వమ్ము చేసింది.

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమా వేశాలు ఫిబ్రవరి 17న ప్రారం భమై, ఒక ప్రహసనంగా కొన సాగి, మార్చి 29న నిరర్ధకంగా ముగిశాయి. నిర్వహించాలి కాబ ట్టి మొక్కుబడిగా శాసనసభ, శాసన మండలి సమావేశాలను, సభ్యుల హాజరుతో నిమిత్తం లేకుండా, అత్యధిక కుర్చీలు ఖాళీగా ఉన్నా నిండు సభగా భావించి, నిర్వహించి ఊపిరి పీల్చుకొన్నారు ప్రభుత్వ పెద్దలు. వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర కోసమే అన్నట్లు సభా నిర్వహణ తంతు నడిచింది.

గవర్నర్ ప్రసంగంపైన గానీ, బడ్జెట్ ప్రతిపాదనలపైన గానీ, శాఖల వారి పద్దులపైన గానీ, రాష్ట్రం మరియు ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ దీర్ఘకాలిక సమస్యలపైన గానీ సభలో చర్చించిన పాపాన పోలేదు. ధూషణ భూషణ లతో విధ్వంసాలు, భౌతిక దాడులకు, వాక్ స్వాతంత్య్రం పై, ప్రజాస్వామ్య హక్కులపై ఫాసిస్టు తరహా దాడులకు సమావేశాలు సాక్షీభూతంగా నిలిచాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవాలయంగా భావించే శాసనసభలో సభా ప్రాంగణంలో జరిగిన ఘటనలు రాష్ర్ట చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.

సమస్య అందరిదీ, కానీ ఎవరికీ పట్టలేదు!
కృష్ణా నదీ జలాల సమస్య తెలుగు ప్రజలందరి జీవన్మరణ సమస్య. నదీ జలాల పునఃపంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మొత్తం రాష్ట్ర ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. మన రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవాలనే అంశంపై ఎవరికీ పెద్దగా భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం లేదు. ఉప ప్రాంతీయ భావజాలంతో కొట్టుకుపోతున్న వారు ఈ సమస్యకు నేడు అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు.

కానీ, రాష్ట్ర వ్యాపితంగా విస్తరించి ఉన్న రాజకీయ పార్టీల వైఖరి ప్రజలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇది అందరి సమస్య. కానీ ఎవ్వరికీ పట్టలేదు. ట్రిబ్యునల్ తీర్పు మూలంగా సంభవించే దుష్పరిణామాలపై సభలో సమగ్రంగా చర్చిం చి, నష్ట నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సమష్టి గా రూపొందించుకోవడానికి జవాబుదారీ తనంతో ప్రభు త్వం వ్యవహరించకపోవడం అత్యంత బాధ్యతారహితం.

రాజకీయ అనిశ్చితితో ప్రభుత్వ మనుగడే ప్రస్తుతం మిణుకు మిణుకుమంటున్నది. అపవిత్ర కలయికలు, మ్యాచ్‌ఫిక్సింగ్స్ ద్వారా వీలైనంత కాలం మనుగడ సాగిం చాలన్న ధ్యాసే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదు. ఈ పూర్వ రంగంలో సభ సజావుగా జరగకపోవడం పాలక పార్టీకి ఊరట కలిగించింది. దినదినగండంగా రోజులు గడుపుతున్న అత్యంత బలహీన మైన కిరణ్‌కుమార్ సర్కారు ఆ విధంగా ఊపిరి పీల్చుకొంది.

న్యాయం కోసం రాజీలేని పోరాటం
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులోని కీలకాంశాలను పరిశీలిస్తే మన రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో స్పష్టమవుతుంది.

నికర జలాల నిర్ధారణకు బచావత్ ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకొన్న 75 శాతం నీటి లభ్యత ప్రామాణికాన్ని తిరస్కరించి 65 శాతాన్ని తీసుకోవడం.

సగటు వార్షిక నదీ ప్రవాహంలో నుంచి నికర జలాలను మినహాయించగా లభించే నీటిని మిగులు జలాలుగా నామకరణం చేసి మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం.

ప్రకాశం బ్యారేజీ నుండి అనివార్యంగా కిందికి ప్రవహించి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని లెక్కలోకి తీసుకోవడానికి నిర్ద్వంద్వంగా తిరస్కరిం చడమే కాదు. అదొక మిథ్యగా చులకన భావంతో కొట్టిపారేయడం.

‘‘క్యారీ ఓవర్’’ పద్దు కింద శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవ డానికి ఆమోదముద్ర వేస్తూ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తిరగదోడి, దానికి కాలం చెల్లిపోయిందని, ప్రస్తుతం మన రాష్ట్రా నికి మిగులు జలాలలో వచ్చిన 145 టీఎంసీలతోపాటు 65 శాతం ప్రామాణికం ఆధారంగా అదనంగా రాష్ట్రా నికి కేటాయించిన 39 టీఎంసీల నికర జలాలలోని 5 టీఎంసీలను కలిపి మొత్తం 150 టీఎంసీలను ‘‘క్యారీ ఓవర్’’ ‘‘స్టోరేజి’’ పద్దు కింద కేటాయించడం పెద్ద దగా. మిగిలిన నీటిలో 9 టీఎంసీలను జూరాల ప్రియ దర్శినికి, 25 టీఎంసీలను తెలుగుగంగకు ట్రిబ్యునల్ షరతులతో కేటాయించింది.

పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకముందే 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని, నీటి లభ్యతను నిర్ధారించే గణాంకాలకు కలిపి లెక్కించడం.

దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపకరించే తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణానికి ఆమోదం తెలపక పోగా కర్ణాటక వాదనను బలపరుస్తూ, కృష్ణానదీ పరీవాహక ప్రాంతం బయటికి నీటిని తరలించుకుపో వాలనే దుర్బుద్ధి మన రాష్ట్రానికి ఉన్నట్లు ట్రిబ్యునల్ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించింది. తుంగభద్ర రిజర్వాయరులో పూడిక మూలంగా నీటి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీల నుండి 104.34 టీఎంసీలకు పడిపోయిందని నిపుణుల అంచనా. పర్యవసానంగా బచావత్ ట్రిబ్యునల్ 230 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయరు కింద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వినియోగానికి కేటాయించినా, ప్రస్తుత 212 టీఎంసీలకు మించి వాడుకోలేని దుస్థితి. కర్ణాటక మాత్రం పూర్తి స్థాయిలో నీటిని వాడుకొంటూ మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది. 186 కి.మీ. పొడవు గల తుంగభద్ర హైలెవల్ కెనాల్ (హెచ్‌ఎల్‌సి) 105 కి.మీ. ఉమ్మడి కాలువగా కర్నాటక భూభాగంలోనే ప్రవహిస్తున్నది. ఈ కాలువ కింద కేటాయించిన 50 టీఎంసీలలో 32.5 టీఎంసీలు మన రాష్ట్రానికి రావాలి. కానీ ఏనాడు మన వాటా మేరకు నీరు అందింది లేదు.

కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోనే ఉన్నా నిత్య కరువులతో కృంగికృషించిపోతున్న జిల్లాల నీటి అవసరాలను తృణీకార భావంతో లెక్కలోకే తీసుకో లేదు. వలసలకు మారు పేరుగా నిలిచి, అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాలకు 9 టీఎంసీలు అదనంగా కేటాయించడం మినహాయిస్తే, మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు, నల్ల గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం) ప్రాజెక్టుకు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా ప్రయోజనం కలిగించే హంద్రీ-నీవా సృజల స్రవంతికి మిగులు జలాలను పంచుతున్న సందర్భంలోనైనా నీటి కేటాయింపులు చేయాలనే స్పృహ ట్రిబ్యునల్‌కు కొరవ డింది. కృష్ణా మిగులు జలాల తరలింపు తప్ప మరో ప్రత్యామ్నాయం లేని ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలుగొండ, కడప, చిత్తూరు జిల్లాల ప్రజల గొం తులు తడిపే గాలేరు-నగరి ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు.

మానవీయ కోణంలో ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానదీ పరీ వాహక ప్రాంతంలోనే ఉన్న నిత్య కరువు పీడిత, అత్యంత వెనుకబడిన జిల్లాల నీటి కడగండ్లను తీర్చడం ద్వారా సమన్యాయాన్ని అమలు చేయాలని ట్రిబ్యునల్ భావించ లేదు. మన రాష్ట్రానికి కేటాయించిన నీటిలో 49 శాతం పరీ వాహక ప్రాంతానికి వెలుపల ఉన్న ప్రాజెక్టులకు ఇప్పటికే కేటాయించడం జరిగింది కాబట్టి మరే ఇతర ప్రాజెక్టుకు నీటిని కేటాయించడం సాధ్యంకాదని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించింది.


అదనపు నీటిని సాధించుకోవాలి
బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు లోబడి మన రాష్ట్ర పరిధిలో కొన్ని ‘‘సర్దుబాట్లు’’ ద్వారా కొన్ని ప్రాజెక్టులకు అఖిల పక్ష సమావేశాలలో చర్చించి నికర జలాలను కేటాయించడం జరిగింది. అవి
కృష్ణా డెల్టా ఆధునికీకరణ ద్వారా 19 టీఎంసీలను ఆదా చేసి భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించారు.

కేసీ కెనాల్ ఆధునికీకరణ ద్వారా 8 టీఎంసీలు ఆదా చేసి పునరుత్పత్తి ద్వారా మన రాష్ట్రానికి లభించిన 11 టీఎంసీలను కలిపి 19 టీఎంసీలను శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (యస్‌ఆర్‌బీసీ)కు కేటాయించారు.

తుంగభద్ర రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు కేటాయించిన 10 టీఎంసీలను అనంతపురం జిల్లా పెన్నా అహోబిలం రిజర్వాయర్ (పీఏబిఆర్)కు కేటాయించి, శ్రీశైలం రిజర్వాయరు నుంచి ఆ మేరకు కేసీ కెనాల్‌కు సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంతరంగిక సర్దుబాట్ల ద్వారా భీమా, ఎస్‌ఆర్‌బీసీ, పీఏబీఆర్ ప్రాజెక్టులకు కేటాయించిన నికర జలాలను అదనంగా సాధించుకోవడానికి కృషి చేయాలి. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా మన రాష్ట్రానికి సంక్రమించిన ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించుకొంటూ, వెనుకబడిన ప్రాంతాలలో నిర్మా ణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను సాధించుకోవలసిన బృహత్తర కర్తవ్యం రాష్ట్ర ప్రభు త్వంపై ఉన్నది. ఈ పూర్వ రంగంలో దాదాపు నెలన్నర రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాలలో ఈ జీవన్మరణ సమస్యపై చర్చించి, వ్యూహ రచన చేసుకోకపోవడం చట్ట సభలపై ప్రజలకున్న విశ్వాసాన్ని వమ్ము చేసింది.

Friday, February 25, 2011

విద్యా హక్కు చట్టం పై విశాలాంధ్రలో వ్యాసం

విద్యాహక్కు చట్టం - 2009 'అమలు'కు రాజకీయ దృఢసంకల్పం ఆవశ్యకం
Tue, 29 Jun 2010
టి. లకీëనారాయణ

మానవ వికాసానికి, సమాజాభివృద్దికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనం. మనిషికి చైత న్యంతోపాటు సత్‌ప్రవర్తన, సంస్కారం, నైతిక విలు వలు, నీతి నియమాలను ఉపదేశించడం ద్వారా సమగ్ర మానవుడిగా తీర్చిదిద్దగల శక్తి ఒక్క విద్యకే ఉన్నదని మేథావులు, తత్వవేత్తలు, విద్యావేత్తలెందరో నొక్కి వక్కాణించారు. విద్యా హక్కు మానవ హక్కుల్లో ప్రథమ శ్రేణిది. విద్యావ్యవస్థకు సంబందించి ఒక్కో దేశానికి ఒక్కో చరిత్ర ఉన్నది. ఆయా దేశాల్లోని సామాజిక, ఆర్ధిక ప్రగతికి అనుగుణంగానే విద్యా విధానాన్ని రూపొందించి, అమలు చేయబడుతుంది. దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించగల శక్తి ఆ వ్యవస్థకు ఉండదు. పర్యవసానంగా విద్యా వ్యవస్థ లక్ష్యం, సారాంశం, యంత్రాంగం అన్నింటినీ ఆయా చారిత్రక దశల్లో ఉన్న సామాజిక ఆర్ధిక చట్రమే నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ సామాజిక, ఆర్థికాభివృద్ధికి రూపురేఖలు దిద్దడం, ప్రభావితం చేయడం, మార్పు వైపున సమాజాన్ని ముందుకు నడిపించడంలో విద్య క్రియాశీల పాత్ర పోషిస్తుంది. విద్యాభివృద్ధి అన్ని రంగాలతోపాటు ముఖ్యంగా ఆర్థిక ప్రగతికి మార్గాన్ని సుగమం చేస్తుంది. మెరుగైన ఉత్పత్తి సాధనాల అన్వేషణ ద్వారా జాతి సంపద ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. దాని ఫలాలు మనలాంటి వ్యవస్థలో అందరికీ అందకపోవచ్చు. కారణం ఉత్పత్తి అయిన సంపద పంపిణీ ఆ నిర్థిష్ట కాలంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వర్గ స్వభావాన్ని బట్టి ఉంటుంది. సంపద పెరిగేకొద్దీ విద్యాభివృద్ధికి అవకాశాలు మెరుగు పడతాయి. విజ్ఞానాన్వేషణ పెరుగుతుంది. అందరికీ విద్యను అందించడం సాధ్యమవుతుంది. పర్యవ సానంగా బుద్దిజీవులు, శ్రమజీవుల నైపుణ్యం, సామర్ధ్యం పెరిగే కొద్దీ ఉత్పత్తి పెరుగుతుంది. తరతారాలుగా సముపార్జించుకొన్న విజ్ఞానంతో పాటు, అనుభవాలను జోడించి, నాణ్యమైన పరి శోధనలను కొనసాగించి నూతన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఆర్జిస్తూ సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో విద్య పునాదిరాయి పాత్ర పోషి స్తుంది. సమాజంలోని లోపాలను, సమస్యలను పసిగట్ట గల సంపూర్ణ మానవుని తీర్చిదిద్దగల శక్తి ఒక్క విద్యకే ఉన్నది. కులం, మతం, జాతి, ప్రాంతం, లింగ భేదం లేకుండా స్త్రీ, పురుషుల్లోని విజ్ఞాన వంతులు వ్యక్తులుగా, సమూహంగా, సమష్ఠిగా సామాజిక మార్పుకు, మానవీయ సమాజ నిర్మా ణానికి కావాలసిన చైతన్యాన్ని విద్య అందిస్తుంది. సమాజానికి, విద్యకు మధ్య ఉన్న అనుబంధం విడ దీయరానిదని గతి తర్కం ద్వారా బోధపడుతుంది. సమాజంలో విద్యకున్న ప్రాధాన్యత వర్ణనాతీతం. కానీ విద్య అందరికీ అందుబాటులో నేటివరకు లేదు. మన భారత సమాజంలో మానవుల మధ్య అంతరాలు, వివక్ష కొనసాగుతున్నది. అత్యధిక ప్రజానీకం విద్యకు నోచుకోకుండా ఈ సమాజం వెలివేసింది. నేడున్న దురదృష్టకర పరిస్థితిని గమనిస్తే అన్ని వస్తువుల్లాగే విద్యకూడా పూర్తి స్థాయిలో వినియోగవస్తువుగా బహిరంగ మార్కెట్‌లో నిస్సిగ్గుగా అమ్మబడుతున్నది. ఒకనాడు సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు, సమాజసేవలో అంతర్భాగంగా స్వచ్చంద సేవాసంస్థలు, వ్యక్తులు విద్యా సంస్థలను నెలకొల్పి, విద్యా వ్యాప్తికి అంకిత భావంతో పాటు పడ్డారు. మార్కెట్‌ ఆర్ధిక నీతి రాజ్యమేలుతున్న ఈనాడు లాభనష్టాల కొలబద్దతో విద్యా వ్యవస్థ నిర్వహణను కూడా బేరీజు వేసుకొనే హీనస్థితికి దిగజారాం.

ఈ పూర్వరంగంలో విద్యార్థిలోకం, సామాజిక వర్గాలు సాగించిన దశాబ్దాల పోరాటానికి పాక్షిక విజయం లభించింది. రాజ్యాంగ బద్దంగా విద్యను ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం చేయడం సామా జిక ప్రగతిలో నిస్సందేహంగా ఒక ముందడుగు. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఆరు దశాబ్దాల తరువాత గానీ ఈ హక్కు భావిభారత పౌరులైన బాల బాలికలకు దక్కలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 మొదలు పది సంవత్సరాల కాల వ్యవధిలో 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత, నిర్భంద ప్రాథమిక విద్యను అందించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 45 లోని ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. దశాబ్దం కాదు ఆరు దశాబ్దాలు గడచిపోయాయి. ఆదేశిక సూత్రాలకు ఆచరణ కరువైయింది. ఆ లక్ష్య సాధనలో ఘోరవైఫల్యం చెందాం. బడి గడప తొక్కని వారు, బడిలో అడుగుపెట్టి మధ్యలో మానేసిన పిల్లలు నిరక్షరాస్యులుగా, బాలకార్మికులుగా నికృష్ఠ మైన జీవితాలతో మగ్గి పోతున్నారు. అలా రెండు తరాలు గడచిపోయాయి. సామాజికంగా, ఆర్ధికంగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తూ నాగరిక ప్రపంచంలో దూసుకుపోతున్నా మని, ప్రపంచదేశాలతో పోటీపడుతున్నామని, ప్రపం చంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనని దేశాధినేతలు చంకలు చరుచుకొంటున్నారు. కాని ''అందరికి విద్య'' మాత్రం ''అందని ద్రాక్షపండు'' లాగే మిగిలిపోయింది. మానవ హక్కులు, ప్రజా స్వామ్య హక్కులు బడుగు బలహీన వర్గాలు, వారి పిల్లలలో అత్యధికులకు అందుబాటులోలేని స్థితి. పర్యవసానంగా ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. ''ఎడ్యుకేషన్‌ ఈజ్‌ ఎ రైట్‌ నాట్‌ ఎ ప్రివిలేజ్‌ '' (విద్య ప్రత్యేక సౌకర్యం కాదు హక్కు), విద్యా హక్కును రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని దేశవ్యాపితంగా సమరశీల ఉద్యమాలెన్నో నిర్వహించబడ్డాయి. యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థల వత్తిడి పెరిగింది. ఈ పూర్వరంగంలో భారత ప్రభుత్వం సార్వత్రిక మరియు ఉచిత విద్యను ప్రాథ మిక హక్కుగా గుర్తించి రాజ్యాంగంలో పొందుపరచి 2010 ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి తీసుకురావడం హర్షణీయం. ''ఇల్లు అలకగానే పండుగ అయి పోలేదు'' అన్న సామెతగా చట్టం తీసుకురాగానే పిల్లలందరికీ విద్య అందదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, స్త్రీ పురుషులకు సమానమైన ఆస్తి హక్కు చట్టం, వరకట్న నిషేధ చట్టం, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ మరియు నిషేధ చట్టం, బాలకార్మికుల నిషేధ చట్టం లాంటి సామాజిక ప్రగతికి దోహదపడే పలు అత్యంత ప్రాధాన్యత గల చట్టాలు చట్టుబండలుగా మారిపోయిన దుస్థితి గమనిస్తూనే ఉన్నాం. వీటి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. విద్యా హక్కు చట్టం-2009ని పూర్తిస్థాయిలో అమలుచేయడానికి పాలక వర్గాలకు దృఢమైన రాజకీయ సంకల్పం, దీక్షాదక్షతలు, నిబద్దత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. 2002 సవంత్సరంలో రాజ్యాంగానికి 86 వ సవరణ చేసి విద్యా హక్కును అమలులోకి తెస్తున్నామని చెప్పి అందులో పిల్లల తల్లిదండ్రులను, సంరక్షకులను బాధ్యులుగా చేసే నిబంధన చేర్చారు. తద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాయి.

నాటి నుంచి నేటి వరకు ఏడేళ్ళపాటు సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్‌ 21 ఎ మూడవభాగం, ఆర్టికల్‌ 45(3) ను సవరించి నూతన క్లాజ్‌ (కె) ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతలకు సంబందించిన ఆర్టికల్‌ క్రింద జతచేయడంద్వారా ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఇప్పుడు రాష్ట్రపతి రాజముద్రతో అమలులోకి వచ్చింది. పలు ప్రసవవేదనలతో రూపొందిన ఈ విద్యా హక్కు చట్టం అమలు నిస్సందేహంగా పెనుసవాలే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, పిల్లల సంరక్షకులు, మొత్తం సమాజం ఈ సవాలును స్వీకరించి సమర్థవంతంగా ఎదుర్కోవలసిన చారిత్రిక అవసరం ఎంతైనా ఉన్నది.

నిధుల సమస్య: చట్టాన్ని పార్లమెంటు ఆమో దించింది. కాని నిధుల కేటాయింపు అంశంపై నిర్ధిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించలేదు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యను పిల్లలందరికీ అందించే ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. దానికి అవసరమైన నిధులను వారే సమకూర్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక దుస్థితిని గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాలైతే అప్పుల ఊబిలో నిండా కూరుకుపోయి, వార్షిక బడ్జెట్ల కేటాయింపులకే భారీగా కోతలు పెడుతూ విశ్వసనీయతను కోల్పోయాయి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ధిక భారం మోపితే అసలుకే మోసం జరుగుతుంది. కేవలం 10% నిధులను వెచ్చించి కేంద్రప్రభుత్వం నుండి 90% ఆర్ధిక సహాయాన్ని పొందడానికి వీలైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లాంటి పథకాల అమలులో కూడా అస మర్థంగా వ్యవహరిస్తూ లబ్దిదారులకు ప్రయోజనం అందకుండా చేస్తున్నారు. ఈ చేదు అనుభవాలను పరిగణలోనికి తీసుకొంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సామాజిక బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించ లేవనడం ముమ్మాటికీ నిజం. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ లాంటి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వమే నిధుల కేటాయింపు బాధ్యతను తీసుకోవాలని బహిరంగంగానే కోరారు. కేంద్ర ప్రభుత్వం 55:45 నిష్ఫత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం 90:10 నిష్పత్తిలో నిధుల సహాయం చేస్తామని ప్రకటించింది.

T.Lakshminarayana

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై సాక్షి దినపత్రికలో వ్యాసం

సంక్షోభంలో సంక్షేమం!
విశ్లేషణ

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తీవ్ర రూపందాలుస్తున్న కొద్దీ, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞాన్ని నేటి బడ్జెట్ పూర్తిగా విస్మరించినట్టే కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టు పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, విద్యార్థుల భవిష్యత్తుతో పెనవేసుకున్న బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు, పేదలకు నీడ కల్పించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం చెల్లించాల్సిన బకాయిలూ... వగైరా తక్షణం చెల్లించాలని పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.


విశ్వసనీయతకు, జవాబుదారీ తనానికి ఆమడ దూరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రాజకీయ అభద్రతాభా వానికి అద్దంపడుతున్నది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్నకొద్దీ, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతు న్నది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞాన్ని నేటి బడ్జెట్ పూర్తిగా విస్మరించినట్టే కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టు పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, విద్యార్థుల భవిష్యత్తుతో పెనవేసుకున్న బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు, పేదలకు నీడ కల్పించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం చెల్లించాల్సిన బకాయిలూ... వగైరా తక్షణం చెల్లించాలని పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

ప్రభుత్వ రంగంలోని విద్యాసంస్థలు, విశ్వ విద్యాలయాలకు నిధులు విడుదలకాక ఆర్థిక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపుకే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ ధైర్యంతో రూ. 1,28,770 కోట్ల భారీ వార్షిక బడ్జెట్‌ను రూపొందించిందో అర్థంకాదు. వాస్తవాల ఆధారంగా, నిజాయితీతో ఆదాయ వ్యయాలను, గత అనుభవాల ప్రాతిపదికగా శాస్ర్తీయ దృక్పథంతో అంచనా వేసి బడ్జెట్‌ను తయారు చేయలేద న్నది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్స రానికి నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థికశాఖా మాత్యులు కె.రోశయ్య రూ. 1,13,660 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం పొందారు. దాన్ని రూ. 1,11,057 కోట్లుగా తరువాత సవరించారు. అందులో ఖర్చు చేసిన గణాంకాలు మరో ఏడాదికిగానీ బహిర్గతం కావు.

కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను వంచించడానికి బరితెగించిందని చెప్పక తప్పదు. కేటాయింపులు చేసినట్లు కాగితాలపై చూపి, ఆచరణలో ఎగనామం పెట్టేదిగా ప్రస్తుత బడ్జెట్ రూపొందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జలయజ్ఞానికి రూ. 15,021 కోట్లు కేటాయించారు. సవరించిన బడ్జెట్‌లో దాన్ని రూ. 11 వేల కోట్లకు కుదించారు. ఇప్పటికి కేవలం రూ. 5,500 కోట్లు విడుదల చేశారు. మరో రూ. 3,800 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలున్నాయి. గత బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 10 వేల కోట్లు కూడా వ్యయం చేయలేదని స్పష్టమవుతున్నది. కానీ రానున్న ఆర్థిక సంవత్సరానికి మళ్లీ రూ. 15,010 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు కేటాయించడం మంచిదే కానీ, ముగుస్తున్న సంవత్స రంలో రూ. 700 కోట్లు కేటాయించి రూ. 43 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ప్రాణహిత-చేవెళ్లకు రూ. 700 కోట్లు కేటాయించి రూ. 34 కోట్లు విడుదల చేశారు. మళ్లీ రూ. 608 కోట్లు కేటాయించారు. గాలేరు-నగరికి రూ. 660 కోట్లు కేటాయించి రూ. 160 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు రూ. 540 కోట్లు కేటాయించారు. చిన్న నీటి పారుదలకు రూ. 1,680 కోట్లు కేటాయించి రూ. 503 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం రూ. 2,092 కోట్లు కేటాయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ రాజకీయంగా సంతృప్తి పరచడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయిగానీ, చిత్తశుద్ధితో వ్యయం చేసే ఉద్దేశంతో కాదన్నది స్పష్టం.

సన్నగిల్లుతున్న విశ్వాసం
ప్రతి ఏడాది పండుగలు, జాతీయ సెలవు దినాలు వచ్చి పోతున్నట్లే వార్షిక బడ్జెట్‌ను కూడా సాదాసీదా వ్యవహారంగా పాలకులు తీసుకుంటున్నట్లు కనబడుతున్నది. రాజ్యాంగబద్దమైన కర్తవ్యాన్ని బాధ్య తగా నిర్వహించాలనే రాజకీయ సంకల్పంగానీ, చట్టసభ ఆమోదం తరువాత బడ్జెట్ కేటాయింపులకు అను గుణంగా నిధులు విడుదల చేసి, జవాబుదారీతనంతో వ్యవహరించాలనే బాధ్యతనుగానీ గుర్తించడం లేదు. పైరవీకారులు, దళారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ యాజమాన్యాల ఒత్తిళ్లు, అవినీతి, అధికార దుర్వినియోగం, పాలక పార్టీ రాజకీయ అవసరాల మీద ఆధారపడి నిధుల విడుదల, మళ్లింపులు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఈ మార్చి 31తో ముగిసే బడ్జెట్‌లో రూ. 1,800 కోట్లు కేటాయించి, వెయ్యి కోట్లు ఖర్చు చేశారు.

ఇప్పుడు రూ. 2,300 కోట్లు కేటాయించారు. రెండు రూపాయలకు కేజీ బియ్యం పథకానికి రూ. 3 వేల కోట్ల నుండి రూ. 2,500 కోట్లకు కుదించారు. ఒకవైపున రేషన్‌కార్డుల సంఖ్య పెరుగుతున్నది, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన నెలకు 30 కేజీల హామీ ఉండనే ఉన్నది. కానీ బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కోతపెట్టారు. బోధనా ఫీజులకు, స్కాలర్‌షిప్‌లకు రూ. 1,742 కోట్ల కేటాయింపుల్లో నిధులను విడుదల చేయలేదు. దాదాపు రూ. 3,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసి, బకాయిల చెల్లింపుపై నిర్దిష్ట గడువు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న పూర్వరంగంలో కూడా నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించింది. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ల కోసం గతంలో లాగే రూ. 1,932 కోట్లు కేటాయించి, పెరుగుతున్న అవసరాలను గుర్తించ నిరాకరించింది. మహిళా సాధికారతపై గొప్పలు చెప్పే ప్రభుత్వం స్వయం సహాయ బృందాలకు వడ్డీ రాయితీ నిమిత్తం ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకానికి రూ. 400 కోట్లు కేటాయించారు.

పావలా వడ్డీ రుణాలు ప్రభుత్వం నుండి లభించకనే పేద మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించి అధిక వడ్డీలతో అప్పులు చేసి, తీర్చలేక పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్న నేపధ్యాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లిపోతున్న గ్రామీణ పేదల కోసం చట్టబద్ధంగా ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కోసం చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని రూ. 300 నుండి రూ. 600 కోట్లకు పెంచారు. కానీ, ఇది ఏ మూలకు సరిపోతుంది? ఇందులోని అవినీతిని పక్కనపెడితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజులకు మరో 25 రోజుల పనిని అదనంగా రాష్ట్రంలో కల్పిస్తామని రచ్చబండలో హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయాలంటే నిధులు ఎలా సరిపోతాయి. అలాగే ఈ తరహా పథకాన్ని పట్టణ ప్రాంత పేదలకు కూడా అమలు చేస్తామన్నారు. బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. వైఎస్ అభయహస్తం పెన్షన్ పథకం పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తుకు కేటాయింపులు పెంచలేదు.

ఉపాధి కల్పనా రంగాలకు మొండిచెయ్యి
వ్యవసాయ రంగమే నేటికీ గ్రామీణ జనాభాలో అత్యధికులకు జీవనాధారం. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న ఈ రంగానికి ప్రణాళికా పద్దు కింద కేవలం రూ.2,814 కోట్లు కేటాయించారు. అలాగే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి పారిశ్రామిక రంగానికి ప్రణాళిక వ్యయంలో రూ. 775 కోట్లు కేటాయించారు. యువత భవిష్యత్తుపై కబుర్లు చెప్పే ఈ ప్రభుత్వం ఉపాధి అవకాశాలను పెంపొందించ కుండా రాష్ట్ర ప్రగతిలో యువత భాగస్వామ్యాన్ని ఎలా పెంపొందిస్తారు? పోనీ సేవా రంగం అభివృద్ధికి, విస్తరణకు దోహదపడే విధంగా ఆ రంగానికి నిధులను కేటాయించారంటే అదీ లేదు.

కీలకమైన విద్యుత్ రంగా నికి నామమాత్రంగా రూ. 625 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులతో రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా హామీ నెరవేరదు. ఇంతటి కీలక రంగంలో దూరదృష్టితో ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు పెట్టకుండా ప్రైవేట్ రంగంపై ఆధారపడే విధానాన్ని అమలుచేస్తే పర్యవసా నాలు తీవ్రంగా ఉంటాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక భద్రత, ఉపాధికల్పన, వస్తూత్పత్తి రంగాలపై కేంద్రీకరణ లోపించింది. రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులను వెచ్చించే దృష్టితో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి పేరిట రూ. 400 కోట్లు కేటాయించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటంగానే భావించాలి.

మోయలేని రుణభారం
రాష్ట్ర ప్రజలపై రుణభారం ఏటేటా పెరిగిపోతోంది. 2000-01 ఆర్థిక సంవత్సరంలో రూ. 35,651 కోట్లు ఉన్న అప్పులు, 2010-11లో సవరించిన బడ్జెట్ గణాంకాల మేరకు రూ. 1,23,227 కోట్లకు చేరుకుంటుంది. 2011-12 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం రుణభారం రూ. 1,41,151 కోట్లకు పెరగబోతున్నది. దీనికి అదనంగా రూ. 40 వేల కోట్లకు పైగా స్వయం ప్రతిపత్తి కలిగిన స్థానిక సంస్థలు, కార్పొరేషన్స్ చేసిన అప్పుల భారం ఉండనే ఉంది. అంటే మొత్తం రూ. 1,80,000 కోట్లకు పైగా ప్రజల నెత్తిన ఉన్నది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ. 17,602 కోట్లుగా ఉంటుందని ఆర్థిక మంత్రి వెల్లడిం చారు. ఆ మేరకు అప్పులు చేయనున్నారని చెప్పకనే చెప్పారు. బడ్జెట్ స్థితిగతులపై పొందుపరచిన గణాంకా లలో ఆదాయం పద్దుకింద రూ. 1,00,995 కోట్లుగా, రుణాల సేకరణ ద్వారా రూ. 26,475 కోట్లుగా పేర్కొన్నారు.

ప్రజలపై భారం
రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 46,999 కోట్ల ఆదాయం వస్తుండగా, వచ్చే ఏడాది 20 శాతం అదనంగా 56,438 కోట్లు రాబట్టుకోవాలన్న ప్రయత్నాలు మొదలెట్టారు. ఒక వైపు అప్పుల భారాన్ని పెంచుతూ, మరో వైపు ప్రజలపై భారాలు మోపై ప్రజావ్యతిరేక బడ్జెట్ ఇది.

టి.లక్ష్మీనారాయణ
సీపీఐ నాయకులు

Wednesday, February 9, 2011

పోలవరానికి జాతీయ హోదా కల్పించాలి- సాక్షి లో వ్యాసం

జాతీయహోదా తప్పనిసరి!
రాష్ట్రంలో సాగునీటి సమస్యలను పరిష్కరించడానికి, తాగునీటి కొరతను నివారించి, పారిశ్రామికాభివృద్ధిని సాధించడానికి పోల వరం ప్రాజెక్టు నిర్మాణం అవశ్యంగా మారింది. సముద్రం పాలవుతున్న దాదాపు 3 వేల టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకోవడానికి అనువుగా పోలవరాన్ని డిజైన్ చేశారు. స్వాతంత్రానికి పూర్వం నుంచే పోలవరం ప్రతిపాదనలు రూపొందాయన్నది గమనార్హం. ఏడు దశాబ్దాలకు పైగా ఈ ప్రాజెక్టును సాకారం చేసుకోవడానికి ప్రజలు అలుపెరుగని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ‘జలయజ్ఞం’లో భాగంగా పోలవరం నిర్మాణ పనులు చేపట్టడంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. పశ్చిమగోదావరి జిల్లా, పోలవరం మండలం, రామయ్యపేట గ్రామం వద్ద ‘ఇందిరాసాగర్ ప్రాజెక్టు’ పేర నిర్మిస్తున్న పోలవరం బహుళప్రయోజనకారి. 150 అడుగుల ఎత్తులో ‘ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం’ను 194.6 టీఎంసీల సామర ్థ్యంతో నిర్మించి, 301.38 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి ఉద్దేశించిన మహత్తర ప్రాజెక్టు ఇది.

ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షల 58 వేల ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 2,49,872 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 62 వేల ఎకరాలు, విశాఖ జిల్లాలో లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అలాగే, విశాఖ మహానగరంతో సహా 48 మండలాల్లో 540 గ్రామాలకు రక్షిత మంచి నీటి సదుపాయం కల్పించవచ్చు. సామాజికాభివృద్ధికి విద్యుత్తు ఇరుసు వంటిది. విద్యుత్ కొరత రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. తెలంగాణ మెట్ట ప్రాంతాలకు నీటిని తరలించడానికి ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం వగైరా ఎత్తిపోతల పథకాలకు పెద్ద ఎత్తున విద్యుత్తు కావాలి. ఈ నేపథ్యంలో 960 మెగావాట్ల జల విద్యుదుత్పాదనకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి, విశాఖ-కాకినాడ మధ్య నెలకొల్పే పారిశ్రామిక సముదాయాలకు అవసరమైన 23.44 టీఎంసీల నీటిని తరలించడం సాధ్యమవుతుంది. కృష్ణాడెల్టా ఆయకట్టుకు స్థిరత్వం కల్పించే సదుద్దేశంతో, గోదావరి నదీజలాల వివాదాల పరిష్కారానికి నియమించిన బచావత్ ట్రిబ్యునల్ మూడు దశాబ్దాల క్రితమే పోలవరం నిర్మాణం ద్వారా 80 టీఎంసీల నీటి తరలింపునకు ఆమోదం తెలిపింది.

ఈ పూర్వరంగంలో గోదావరి, కృష్ణానదీ జలాల అనుసంధానం తక్షణావసరం. పోలవరం ప్రాజెక్టును సత్వరం నిర్మించి, కృష్టాడెల్టా ఆయకట్టుకు నీరందించడం ద్వారా, ఆమేరకు ఆదా అయ్యే కృష్టా నీటిని కరువు పీడిత ప్రాంతాలలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కొంతైనా నీటిని కేటాయించవచ్చు. 80 టీఎంసీలలో 35 టీఎంసీల నీటిని కర్ణాటక, మహారాష్టల్రకు ఇవ్వాలని గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఒప్పందంలో పేర్కొన్న అంశాన్ని రద్దు చేయాలని మన రాష్ట్రప్రభుత్వం డిమాండ్ చేయాలి. ఎందుకంటే, పోలవరాన్ని మన నిధులతో నిర్మించుకుంటున్నాం. పెపైచ్చు కృష్ణా జలాల పంపిణీలో కర్ణాటక, మహారాష్టల్రకు వారు ఆశించిన దానికంటే అధికంగా వాటాను పొందారు. దీనితో దిగువన ఉన్న మన రాష్ట్రానికి శాశ్వత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని కొంతైనా పూడ్చుకోవడానికి ఇది దోహదం చేస్తుంది.

మెరుగైన పునరావాసం కల్పించాలి
పోలవరం నిర్మాణంలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యాలు ఇమిడి ఉన్నాయన్నది తెలిసిందే. అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన దీని నిర్మాణానికి, రూ. 9,072 కోట్లు ఖర్చవుతుందని 2003-04 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేసింది. ‘వినాయకుడి పెళ్లికి వేయి విఘ్నాలు’ అన్న చందంగా, ఈ ప్రాజెక్టును పలు రకాల జటిల సమస్యలు చుట్టుముట్టాయి. వాటిలో నిర్వాసితుల సమస్య అత్యంత ప్రధానమైనది. మన రాష్ట్రంలో 94,375 ఎకరాలతో 299 గ్రామాల్లోని 1,05,200 మంది నిర్వాసితులవుతారని అంచనా. ముంపునకు గురయ్యే ప్రాంతాలు అత్యధికంగా ఖమ్మం జిల్లాలోను, మరికొంత తూర్పుగోదావరి జిల్లాలోను ఉంది. వీరిలో 45 శాతం మంది గిరిజనులే.

వీరి సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల సహా వృత్తులు, ఉపాధి, భూమి, నివాస స్థలాలు, గిరిజనుల పరిరక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలతో సహా సర్వం కోల్పోతామన్న ఆవేదన వారిలో నెలకొన్నది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం నష్టపోతున్న గిరిజన, గిరిజనేతర నిర్వాసితులకు న్యాయబద్ధమైన, మెరుగైన పునరావాస ప్యాకేజిని ప్రకటించి, ముందుగానే నిధులు కేటాయించడం సముచితం. పునరావాస కార్యక్రమాలకు రూ. 2 వేల కోట్లు ఖర్చవుతాయన్నది అంచనా. ఇప్పటికే నష్ట పరిహారం కింద రూ. 350 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ప్రజానీకంలో భయాందోళనలు రెచ్చగొట్టడానికి కొన్ని దుష్ట శక్తులు విష ప్రచారానికి పూనుకున్నాయి. ఇందిరాసాగర్ రిజర్వాయర్ ఏ కారణాలతోనైనా బద్దలైతే ఉపద్రవం సంభవిస్తుందనీ రాజమం డ్రి, కోవూరు సహా చుట్టు పక్కల ప్రాంతాలు జలసమాధి అవుతాయనీ ప్రచారం చేయడం రాష్ట్ర ప్రయోజనాల రీత్యా నేరపూరితమైన చర్యగా పరిగణించాలి.

జాతీయ హోదా కల్పించాలి
కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించాలి. త్వరితగతిన నిర్మాణానికి ఉపక్రమించాలి. కాలం గడిచే కొద్దీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిపోతుందన్నది గమనంలో ఉంచుకోవాలి. ఆరేళ్ల క్రితం రూ. 9,072 కోట్లుగా ఉన్న అంచనా,ప్రస్తుతం రూ. 16 వేల కోట్లకు పెరగడం గమనార్హం. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను గమనిస్తుంటే, 2014 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లేదు. 25,713 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఇప్పటికి 21 వేల ఎకరాలు మాత్రమే సేకరించినట్టు తెలుస్తోంది. కుడి, ఎడమల ప్రధాన కాల్వల నిర్మాణంపై 2010 జూలై నాటికి రూ. 3,229 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో రూ. 1,035 కోట్లు కేటాయించినప్పటికీ, వంద కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నది ప్రధాన విమర్శ.

గతంలో చేసిన నిర్ణయం మేరకు 36 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో అనుమతించి, మళ్లీ 50 లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి పెంచాలని కేంద్ర జలసంఘం చేసిన సిఫార్సు మూలంగా డిజైన్‌ను మార్చాల్సి రావడంతో రిజర్వాయర్, స్పిల్‌వే నిర్మాణ పనులు ఇంకా చేపట్టలేదు. దాంతో మొత్తం ప్రాజెక్టు నిర్మాణంపైనే నీలినీడలు కమ్ముకున్నాయి.

ఆహార భద్రత కోసం చట్టాన్ని తెస్తామని వాగ్దానాలు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం, దానికి ఉపకరించే పోలవరం బహుళార్థకసాధక ప్రాజెక్టు నిర్మాణానికి ఇకనైనా అంకిత భావంతో ముందడుగు వేయాలి. వృథాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేయడానికి మార్గాన్ని సుగమం చేయాలి. అన్నపూర్ణగా ప్రఖ్యాతిగాంచిన గోదావరి- కృష్ణా డెల్టా ఆయకట్టుకు స్థిరత్వం కల్పించాలి. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పోలవరం నిర్మాణమే శాశ్వత పరిష్కారం అన్నది గుర్తించాలి.
టి.లక్ష్మీనారాయణ
సీపీఐ రాష్ట్ర నాయకులు