Sunday, July 26, 2020

రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధనకు అంకితభావం – రాజకీయ సంకల్పం నేటి తక్షణావసరం


రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధనకు అంకితభావం –
రాజకీయ సంకల్పం నేటి తక్షణావసరం

‍-టి.లక్ష్మీనారాయణ‌

ఈ శీర్షికతో, నేను సిపిఐ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలో, ఈ వ్యాసాన్ని 24 సం.ల క్రితం వ్రాశాను. భారత కమ్యూనిస్టు పార్టీ, కడప జిల్లా “స్వర్ణోత్సవాల ప్రత్యేక సంచిక -1996” లో ప్రచురించబడింది. నీటి పారుదల ప్రాజెక్టులు - వాటి స్థితిగతులు, ప్రత్యేకించి కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికపై నిర్మించాలని లేకపోతే మిగులు జలాల వినియోగానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ కల్పించిన స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తున్నదని అందులో ప్రస్తావించాను. మిగులు జలాల ఆధారంగా రూపొందించబడిన ప్రాజెక్టులు కాబట్టి రాష్ట్రం సొంత వనరులతోనే నిర్మించుకోవలసి ఉంటుంది. కాబట్టి ఒక ప్రత్యేక కార్పోరేషన్ ను నెలకొల్పి నిథులను సమీకరించుకోవాలన్న ఆలోచనను కూడా పంచుకొన్నాను. దాదాపు రెండున్నర దశాబ్ధాల తర్వాత నేడు రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా "స్పెషల్ పర్పస్ వెహికల్"ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాయలసీమ నాలుగు జిల్లాలు, దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలు, ప్రకాశం జిల్లా తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నాను. ప్రాజెక్టుల సాధన కోసం కడప జిల్లాలో 1991-96 మధ్య కాలంలో విస్తృత స్థాయిలో జాతాలు, ధ‌ర్నాలు, పికెటింగ్స్, పలుసార్లు కలెక్టర్ కార్యాలయం దిగ్భందనం, ఇలా‌ వివిధ రూపాలలో ఉద్యమాలు నిర్వహించాం. లాఠీదెబ్బలు తిన్నాం. అరెస్టు అయ్యాం.

గోదావరి - కృష్ణా నదుల అనుసంధాన పథకం శాశ్వత పరిష్కారమని నాడే ఆ వ్యాసం ద్వారా నా వాణి వినిపించాను. 24 ఏళ్ళు గడిచిపోయాయి. పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులుగానే కొనసాగుతున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు గడువు ముగిసింది. కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం రెండవ ట్రిబ్యునల్ బ్రజేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల లభ్యతను కూడా అంచనా వేసి నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడంతో ఆ తీర్పు తెలుగు ప్రజలకు శరాఘాతంగా పరిణమించింది. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. రాష్ట్రం రెండుగా చీల్చబడింది. నదీ జలాల సమస్యలపై వివాదం జఠిలమయ్యింది.

ఇహ! ప్రాజెక్టుల నిర్మాణం చూద్ధామంటే, జుగుప్సాకరమైన పరిస్థితి. 19 టియంసిల నికర జలాల కేటాయింపు ఉన్న‌ శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న తెలుగు గంగ ప్రాజెక్టు పరిస్థితి అంతే. పోయిన ఏడాది 70 రోజులకుపైగా శ్రీశైలం జలాశయం పొంగి పొరలినా తెలుగు గంగలో భాగమైన బ్రహ్మంగారిమఠం రిజర్వాయరు సామర్థ్యంలో మూడవ వంతు నీటిని కూడా చేర్చలేకపోయారు. పంట కాలువల వ్యవస్థ నిర్మాణం అస్తవ్యస్థంగానే కొనసాగుతున్నది. హంద్రీ - నీవా మొదటి దశ నిర్మాణానికి సంబంధించి ప్రధాన కాలువ, రిజర్వాయర్లు, బ్రాంచి కాలువల నిర్మాణంలో పురోగతి ఉన్నా, పంట కాలువల వ్యవ‌స్థపై దృష్టిలేదు. రెండవ దశ నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియదు. గాలేరు-నగరిలో అంతర్భాగమైన గండికోట ప్రధాన జలాశయాన్ని, ముప్పయ్ వేల ఎకరాలకు నీటి సదుపాయాన్ని కల్పించే మొదటి దశ నిర్మాణంపైనే ప్రభుత్వం కేంద్రీకరించింది. రెండవ దశ నిర్మాణాన్ని దుర్మార్గంగా అటకెక్కించి కూర్చొన్నది. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై ఊరిస్తూనే ఉన్నారు. ఈ పూర్వరంగంలో నాడు నేను వ్రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో 'షేర్' చేస్తున్నాను.

“స్వాతంత్య్రం సముపార్జించుకొని ఐదు దశాబ్ధాలు(నేటికి దాదాపు ఏడు దశాబ్ధాలు), విశాలాంధ్ర(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ఏర్పడి నాలుగు దశాబ్ధాలు(ఆనాటికి) గడుస్తున్నాయి. తెలుగు నాట జీవన పరిస్థితులను నిష్పాక్షిక దృష్టితో పరిశీలిస్తే వివిధ రంగాలలో ప్రాంతాల మధ్య, జిల్లాల మధ్య అభివృద్ధిలో ఎంత అసమానత్వం, అంతరాలు ఉన్నాయో కళ్ళకు కట్టినట్లు గోచరిస్తాయి. సమతుల్య అభివృద్ధి జరగక పోవడానికి ఎవరు బాధులు? ఎందుకిలా జరిగింది? పరిస్థితిని సరిదిద్ది తెలుగు జాతి సర్వతోముఖాభివృద్ధికి చేపట్టవలసిన కార్యాచరణ పథకాలేమిటి? రాయలసీమ, తెలంగాణ, కోస్తా ప్రాంతాల మధ్య, అదే సందర్భంలో వివిధ జిల్లాల మధ్య నేడున్న సాంఘిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి చిత్తశుద్ధితో కూడిన మార్గాన్వేషణ తక్షణావసరం. దృక్కోణం నుండి చేసిన ఆలోచనల్లో ఒక భాగమే వ్యాసంలోని అంశాలు.

పంట భూములన్నీ సస్యశ్యామలం కావాలంటే!: వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన రాష్ట్రం మనది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి వ్యవసాయం వివిధ ప్రాంతాలలో వర్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నది. నిత్యం కరువు కాటకాల విషకౌగిలిలో చిక్కి త్రాగి నీటికి _సాగునీటికి ఆర్తనాదం చేసే ప్రజానీకం ఒకవైపు, తుఫానులు _వరదల బారినపడి ప్రాణ నష్టం, పంట నష్టంతో కృంగిపోతున్న ప్రాంతాల ప్రజానీకం మరొకవైపు జీవన పోరాటం చేస్తున్నారు. గుండె తరుక్కుపోయేలా చేస్తున్న హృదయ విదారక దృశ్యాలను ఇంకెంత కాలం వీక్షిస్తూ పోవాలి? వీటిని నివారించడానికి మార్గాలే లేవా? శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని పథకాలను రూపొందించి కాలబద్ధంగా అమలు చేయడానికి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికపై పూనుకోవాలి.

నదులకు పేరుగాంచిన రాష్ట్రం మనది. ఉధృతంగా ప్రవహించే కృష్ణా, గోదావరి నదులున్నాయి. పెన్నా, తుంగభద్ర, వంశధార, మంజీరా, ప్రాణహిత, మూసి, నాగావళి, చెయ్యేరు, చిత్రావతి, స్వర్ణముఖి లాంటి 37 చిన్న, పెద్ద నదులు గలగలా పారే నేల మనది. వాగులు, వంకలకు కొదవ లేదు. వీటన్నింటి ద్వారా రాష్ట్రంలో 7,565 శతకోటి ఘనపుటడుగుల(టి.యం.సి.) నీటి వనరులు లభమవుతున్నాయని సాంకేతిక నిపుణుల అంచనాలు తెలియజేస్తున్నాయి. నీటితో రాష్ట్రం యొక్క 277 లక్షల భూ విస్తీర్ణంలో సాగుకు వీలైన 165 లక్షల హెక్టార్ల భూమిలో దాదాపు 125 లక్షల హెక్టార్లను సాగు క్రిందికి తేవచ్చునని కూడా అంచనా వేశారు. కానీ కేవలం 50 లక్షల హెక్టార్ల భూమి మాత్రమే నేటికి సాగునీటి క్రిందికి తేబడిందని చెప్పబడుతున్నది. లెక్కలు కాస్త అటూ ఇటూ ఉన్నా ఒకటి మాత్రం నిజం. ప్రకృతి ప్రసాదమైన సహజవనరుల్లో ప్రాణప్రదమైన జలవనరులు పుష్కలంగా లభ్యమవుతున్నాయి. అదే సందర్భంలో సాగు నీటికి నోచుకోని లక్షలాది ఎకరాల సారవంతమైన భూములు నిరుపయోగంగా పడివున్నాయి.

నీటి వనరులను శాస్త్రీయంగా, సక్రమంగా వినియోగించుకొని భూమిని, రైతాంగం_వ్యవసాయ కార్మికుల శ్రమశక్తిని సమర్థవంతంగా వాడుకొంటే వ్యవసాయోత్ఫత్తులను అధికం చేయవచ్చు. కరువులు, వరదల బారి నుండి ప్రజానీకాన్ని శాశ్వతంగా విముక్తి చేయవచ్చు. రైతాంగం - వ్యవసాయ కార్మికుల జీవన ప్రమాణాలను పెంచవచ్చు. తద్వారా నేటి గ్రామీణ జీవన విధాన రూపురేఖలే మారిపోతాయి. ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయవచ్చు. అందుచేత రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే రీతిలో సమగ్ర నీటి పారుదల పథకాన్ని రూపొందించి, అమలు పరచాలి. అలాంటి పథకాల రూపకల్పన జరగలేదా? చాలా వరకు జరిగాయి. కానీ కొన్ని పైళ్ళకు పరిమితమై ఆచరణకు నోచుకోక దుమ్ముకొట్టుకు పోతున్నాయి. మరికొన్ని నత్తనడకన అమలు పరచబడుతున్నాయి. అలా అని స్వాతంత్య్రానంతరం నీటి పారుదల రంగంలో ఎలాంటి ప్రగతి సాధించలేదని కాదు. కాలంలో పలు భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. వాటి సత్ఫలితాలను అనుభవిస్తున్నాము. అదే, సందర్భంలో, ప్రాజెక్టుల నిర్మాణంలో నేటికీ వివక్షతకు గురౌతున్న రాయలసీమ, మహబూబ్ నగర్, నల్లగొండ, ప్రకాశం జిల్లాల మెట్ట ప్రాంతాల నీటి సమస్యలు వర్ణనాతీతమనే కఠోర సత్యాన్ని కూడా అందరూ గుర్తించారు. కానీ ఫలితమేమిటి?

ప్రకృతి నిరాదరణ - పాలకుల వంచన మధ్య బ్రతుకు పోరు: కరువు కాటకాల కరాళ నృత్యానికి ఆటపట్టుగా మారిందీ భూమి. పాలకుల పుణ్యమాని శాశ్వత నీటి పారుదల సౌకర్యాలు ఎండమావులుగా దర్శనమిస్తున్నాయి. కరువు సీమ కడగండ్లు తీర్చడానికి జీవనాధారమైన కృష్ణా నదీ జలాల తరలింపులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సవతి తల్లి ప్రేమ ప్రాంతాల ప్రజానీకానికి శాపంగా మారింది. మానవ మనుగడకు, నాగరికతకు ప్రాణాధారమైన జలవనరులు సంవత్సర సంవత్సరానికి అంతరించి పోతున్నాయి. వర్షంపై ఆధారపడి వ్యవసాయం చేసి బ్రతుకులీడ్చాలి. వర్షాల రాకపోకలలో స్థిరత్వం లేదు. సగటు వర్షపాతానికి కూడా ప్రాంతాలు ఎక్కువ సంవత్సరాలు నోచుకోవడం లేదు. ప్రతి మూడు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరువు విలయతాండవం చేస్తూ గ్రామీణ ప్రజల వెన్ను విరుస్తున్నది. బావుల సేద్యం అంతరించి పదుల సంవత్సరాలు గడచిపోయాయి. అటుపై వచ్చిన బోర్లపై ఆధారపడిన సేద్యానికీ రోజులు చెల్లిపోతున్నాయి. దాదాపు లక్ష రూపాయలు వెచ్చించి 600 అడుగుల లోతైన సబ్ మెర్సబుల్ బోర్లు వేసుకోగలిగిన స్తోమత ఉన్నవారే గడ్డన వ్యవసాయానికి నేడు సాహసించగలరు. వారికీ అదృష్టం కలిసివస్తే గడ్డన పడతారు. లేదా దివాలా తీస్తారు. నికృష్ట పరిస్థితులు అనుభవిస్తూ వరుణదేవుని కరుణామయ చూపుకోసం ఆకాశం వైపు ఎదురు తెన్నులు చూస్తూ జీవచ్ఛవాల్లా రైతాంగం భారమైన బ్రతుకీడుస్తున్నారు. ప్రకృతి నిరాధరణకు, పాలకుల వంచనలకు విసిగివేసారి పోయిన ప్రాంత ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది.

 "మాటలు కోటలు దాటుతున్నాయి - కాలు గడప దాటడం లేదు": నానుడికి రాయల్సీమ ప్రాజెక్టుల నిర్మాణం అద్దం పడుతున్నాయి. తెలుగు గంగ, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, గాలేరు-నగరి, హంద్రీ -నీవా ప్రాజెక్టుల ద్వారా కృష్ణమ్మ తల్లి సీమను స్పృశించి పచ్చని పైర్లతో సమగ్రాభివృద్ధి వైపు పయనింప చేయబడుతుందని కొండంత ఆశతో ప్రజానీకం ధీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ నిర్మాణానికి కేంద్ర ప్రణాళికా సంఘం 1981 .లోనే ఆమోదించింది. 1985-86 ఆర్థిక సం.నాటికే పూర్తి కావలసిన ప్రాజెక్టు నిర్మాణం నేటికీ నత్తనడకన సాగుతున్నది. టెండర్ల కుంభకోణాలు, గూండాయిజం, పెద్ద అవరోధంగా నిలిచాయి. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం ఉన్న ఎస్.ఆర్.బి.సి. నిర్మాణ పరిస్థితే ఇంత అగమ్యగోచరంగా వుంటే ఇతర ప్రాజెక్టుల నిర్మాణం గురించి చెప్పబట్టదు.

రాయలసిమకు వరప్రసాదమని చెప్పబడిన తెలుగు గంగ ద్వారా కర్నూలు, కడప జిల్లాలలో 2.75 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంటే కేవలం 50 వేల ఎకరాలకులోపే సాగు నీరుఇచ్చి, మద్రాసుకు త్రాగునీటిని 1996 జనవరి 1 తేదీకి విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షా అరవై ఏడు వేల ఎకరాల ఆయకట్టు ఉన్న కడప జిల్లాలో 8 వేల ఎకరాలకు నీరిస్తారట. తెలుగు గంగలో అంతర్భాగమైన బ్రహ్మంగారిమఠం రిజర్వాయరు ద్వారా లక్షా యాభై వేల ఎకరాల భూమికి నీరెప్పుడిస్తారో, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన వారికి అంతు చిక్కడం లేదు. రు.637 కోట్ల ఖర్చు అంచనాతో 1983-84 ఆర్థిక సం.లో ప్రారంభించబడి 1990 సం.నికి పూర్తి కావలసిన ప్రాజెక్టు 1995 సం. గడచిపోతున్నా, రు.800 కోట్లు వ్యయం చేసినా ఇంకా రు.1200 కోట్లకుపైగా వెచ్చించాల్సిన స్థితిలో నిర్మాణం సాగుతున్నది.

అనంతపురం, దాని పరిసర ప్రాంతాలు సమీప భవిష్యత్తులో పాక్షిక ఎడారి ప్రాంతాలుగా రూపాంతరం చెందే ప్రమాదం ముంచుకొస్తున్నదని శాస్త్రజ్ఞలు హెచ్చరిస్తున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల మెట్ట ప్రాంతాలకు, ప్రత్యేకించి 3,92,500 ఎకరాల ఆయకట్టు కలిగిన అనంతపురం జిల్లాకు హంద్రీ_నీవా ప్రాజెక్టు ప్రాణాధారం. ప్రస్తుత అంచనా ప్రకారంరు.1,970 కోట్లు వ్యయం కాగల ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మొత్తం 6,02,500 ఎకరాలకు సాగునీరు అందించించగలదు. మరి దీనికి పునాదిరాయి ఎప్పుడు పడుతుందో వేచి చూడవలసిందే!

కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో 3.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో గండికోట అంతర్భాగంగా గాలేరు-నగరి ప్రాజెక్టు, రాజకీయ చిక్కుముడులను ఛేదించుకొని నిర్మాణానికి సిద్ధంగా ఉన్నది. రు.1,877 కోట్లు వ్యయం అంచనా గల ప్రాజెక్టు నిర్మాణాన్ని గండికోట రిజర్వాయరుకు 1996 జనవరిలో శంకుస్థాపనతో చేయడంతో ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. గత ఆరేడు సం.లుగా హంద్రీ_నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్ లో నిథులు కేటాయించడం, ఖర్చు చేయకపోవడం పరిపాటైంది. ఆర్థిక సం.లో కూడా రు.25 కోట్లు చొప్పున కేటాయించి, అంకెల గారడీ చేశారు. 1989 సం.లో రాష్ట్ర ప్రభుత్వంచే ప్రకటించిన రెండు పథకాల నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఇంకా ముహూర్తం దగ్గరపడలేదు. ఇహ! వాటి ద్వారా నీరెప్పుడు ప్రవహిస్తుందో!

ప్రకాశం జిల్లా ప్రాంతాలకు ప్రధానంగా ఉద్ధేశించబడిన వెలుగొండ ప్రాజెక్టుకు దాదాపు రు1,000 కోట్ల అంచనా వ్యయంతో నివేదిక తయారైంది. ప్రాజెక్టు ద్వారా కడప, నెల్లూరు జిల్లాల ఆయకట్టుతో కలిపి మొత్తం 4,38,000 ఎకరాలు సాగూన్నది. మహబూబ్ నగర్ జిల్లాకు ఉపయోగపడే భీమా ఎత్తి పోతల పథకం రు.747 కోట్ల వ్యయం అంచనాతో నిర్మాణానికై ఎదురు చూస్తున్నది. రు.1,200 కోట్ల తాజా అంచనాతో శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం నల్లగొండ జిల్లా మెట్ట ప్రాంత ప్రజల కడగండ్లు తీర్చడానికి రూపొందించబడింది. మరి వీటికి మోక్షమెప్పుడు కలుగుతుందో!

ప్రాజెక్టులన్నీ కృష్ణా నదీ మిగులు జలాల ఆధారంగా రూపొందించబడినవే. కృష్ణా నదీ జలాల వివాదంపై తీర్పు ఇచ్చిన బచావత్ అవార్డు పున:పరిశీలనకు వచ్చే కీ..2000 సం.నాటికి, పూర్తిగా కాకపోయినా కనీసం ప్రాజెక్టుల నిర్మాణాన్ని 75% మన్నా పూర్తి చేసుకొంటే నిత్యం కరువు బారిన పడుతున్న ప్రాంతాలను శాశ్వతంగా విముక్తి  చేయడానికి దోహదపడుతుంది. లేదా, శాశ్వతంగా కరువు వాతపడతాయి.

మిగులు జలాలను వాడుకొనే హక్కును బచావత్ అవార్డు మనకు సంక్రమింపచేసి దశాబ్ధాలు గడిచిపోయాయి. వేలాది టియంసిల నీళ్ళు ప్రతి యేడాది సముద్రం పాలవుతున్నాయి. వాటికి అడ్డుకట్టవేసి, దారి మళ్ళించి పంట పొలాలను సస్యశ్యామలం చేయవలసిన పాలకులు క్షమించరాని జాప్యంతో పుణ్యకాలం కాస్త గడిపేశారు. ఇప్పుడు మిగిలింది నాలుగు సం.లు మాత్రమే. ఇంకా నోరూరించే ప్రకటనలతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. కర్నాటక రాష్ట్రం ఒంటికాలిపై మనతో తగాదాకు వస్తూ, మన ప్రాజెక్టుల నిర్మాణాన్ని వివాదాల్లోకి నెట్టి మరొకవైపు ఆల్మట్టి డ్యాం ఎత్తుపెంచి శీఘ్రగతిన నిర్మాణానికి పూనుకున్నది.

కృష్ణా బేసిన్ లో నిర్మిస్తున్న మేజర్ ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులను పెంచడమే గాక అవసరమైన నిథుల సేకరణకు స్వతంత్ర ప్రతిపత్తి గల "కృష్ణా భాగ్యజల నిగమ్" అనే ప్రత్యేక సంస్థను నెలకొల్పి ముందుకెళుతున్నది. మహారాష్ట్ర సైతం "కృష్ణా బేసిన్ కార్ఫోరేషన్"ను ఏర్పాటు చేసి ప్రాజెక్టుల సత్వర పూర్తికి నిథుల సేకరణలో నిమగ్నమై ఉన్నది. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రకటన దశలోనే ఉన్నది. "మాటలు కోటలు దాటుతున్నాయి. కాలు గడప దాటడం లేదు" అన్న నానుడిగా తయారయింది. స్థితి ఇలాగే కొనసాగితే భావి తరాలు క్షమించవు.

అడ్డుకాళ్ళుపెట్టే దుష్టశక్తులు అడ్డుతొలగాలి: ప్రాజెక్టులను సత్వరం నిర్మించాలనే విశాల దృక్పథం, పట్టుదల, అంకితభావం, పాలకులకు, అధికార యంత్రాంగానికి ఉండాలి. అది కూడా కొరవడింది. నీళ్ళెక్కడున్నాయ్! నిథులెక్కడున్నాయ్! అనే వాదనలు వెలికితీసి మోకాలడ్డుపెట్టే బ్యూరోక్రాట్స్ ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం వివాదాలను రెచ్చగొట్టే స్వార్థపర రాజకీయ శక్తులున్నాయి. వాటి మూలంగా ఇప్పటికే తీరని నష్టం జరిగింది. ఈహ! మాత్రం కాలహరణ జరగడానికి వీలులేదు.

తెల్లవాళ్ళ హయాంలో నిర్మించబడిన తుంగభద్ర రిజర్వాయరు క్రింద కాలువల నిర్మాణం నాటికీ పూర్తి కాలేదు. 1955 సం.లో ప్రారంభించబడ్డ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు మొత్తానికి నీరందించే స్థితికి ఇంకా కాలువల నిర్మాణ పనులు చేరుకోలేదు. 1964 సం.లో చేపట్టబడిన శ్రీరాం సాగర్ పని అంతే. నిత్యం పెరుగుతున్న ధరలు, అవినీతి, కాంట్రాక్టర్లు సిండికేట్స్ గా ఏర్పడి అధిక లాభాల నిష్పత్తితో టెండర్లు వేయడం, కాంట్రాక్టర్లు _ ఇంజనీర్లు_ నీతి తప్పిన రాజకీయ నాయకుల మధ్య స్థిరపడి పోయిన "పర్స్ంటేజీ" అక్రమార్జన ఒప్పందాల మూలంగా, ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాల అంచనాలు తారుమారై తడిసి మోపెడవుతున్నాయి. ఖజానా కొల్లగొట్టబడి ప్రభుత్వాలు దివాలా తీస్తున్నాయి. ఫలితంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే నిథులను కేటాయించలేని దుస్థితిలో ప్రభుత్వం పడిపోయింది. విషమ పరిస్థితి, కరువు ప్రాంతాలలో ప్రస్తుతం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు శాపమైకూర్చున్నది.

నీరు_నిథులు పుష్కలం_ కావలసింది రాజకీయ సంకల్పం: వర్షా కాలంలో సముద్రం పాలౌతున్న వేలాది టియంసిల కృష్ణ నీటిని వాడుకొనే హక్కు నేటికీ మనకున్నది. కృష్ణా -పెన్నా నదులలో నీటి కొరత కొన్ని సందర్భాలలో ఏర్పడినా, లోటును పూడ్చి రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలను సస్యశ్యామలం చేయగల గోదావరి నది ఉన్నది. ఏడాదికి దాదాపు 3,000 టియంసిల నీరు సముద్రం పాలవుతున్నదని నిపుణుల అంచనా. వేల కోట్ల రూపాయల వ్యవసాయోత్ఫత్తులను సృష్టించడానికి బదులు గోదావరి నీరు వరదలుగా ప్రవహించి వందల కోట్లు రూపాయల పంటలను బుగ్గిపాలు చేస్తున్నది. పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టుల నిర్మాణం, మరియు కృష్ణా -గోదావరి నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్ సమతుల్య ప్రగతికి పెద్ద మలుపు అవుతుంది. గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్ కలయిక యావత్తు తెలుగుజాతి సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడి, సమైక్యత పదిలం చేయబడుతుంది.

అలాగే, కరువు ప్రాంతాల ప్రజల దాహాన్ని తీర్చి, వారి జీవన ప్రమాణాల పెరుగుదలకు స్నేహహస్తాన్ని అందించే చైతన్యంతో డెల్టా ప్రాంతంలోని రైతాంగం రెండవ పంటకు భూగర్భ జల సందప మీద ఆధారపడడం, పంట మార్పిడి, సక్రమ నీటి వినియోగం ద్వారా వృధాను అరికట్టడం లాంటి చర్యలను పూనుకొంటే కరువు నాట కనీసం ఒక పంటకు "గ్యారెంటీ" కల్పించవచ్చు. అందుచేత నీరులేదనే ప్రసక్తే లేదు.

ఇక నిథులంటామా కృష్ణా నది మిగులు జలాలపై ఆధారపడి నిర్మించ తలపెట్టబడిన ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతి మంజూరు చేయదనే విషయంలో ఎవరికీ సందేహం ఉండాల్సిన పనిలేదు. నడుస్తున్న చరిత్ర దానికి నిదర్శనం. కేంద్ర జల సంఘం అనుమతిలేని ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం లభించదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహాయమూ లభించదు.

కావున గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మార్గాన్నే మన ప్రభుత్వమూ ఆర్థిక వనరుల సేకరణకు తక్షణం కార్ఫోరేషన్ ఏర్పాటు చేసి పూనుకోవాలి. వార్షిక బడ్జెట్ లో నిధుల కేటాయింపును పెంచడం, విధిగా ఖర్చు పెట్టడం జరగాలి. రైతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఎన్.ఆర్..లు, బ్యాంకులు, తదితర సంస్థల నుండి బాండ్స్ రూపంలోను, టి.టి.డి. మరియు స్వచ్ఛంద సంస్థల నుండి విరాళాల రూపంలో నిథులను సేకరించాలి. వాణిజ్య వర్గాలు ఎంత పన్ను చెల్లిస్తున్నారో వాణిజ్య పన్నుతో పాటు అంతే మొత్తాన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి వారిని అప్పుగా ఇమ్మనికోరాలి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం లబ్ధి పొందుతున్న రైతాంగం నుండి కూడా కొంత మొత్తాన్ని వసూలు చేయడానికి పూనుకోవాలి. ఇలాంటి కార్యాచరణ పథకాన్ని రూపొందించుకొని చిత్తశుద్ధితో కృషి చేస్తే నిథుల కొరత అన్న సమస్యను అధిగమించడం కష్టమేమీ కాదు.

అన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఒకే గాటన కట్టలేం: కరువుకు నిలయమైన ప్రాంతాలలో నిర్మిస్తున్న, నిర్మించతలపెట్టిన నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలి. ప్రాంతాలకు చెందిన గాలేరు_నగరి, హంద్రీ_నీవా, వెలుగొండ, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ, భీమా మరియు అసంపూర్తిగా ఉన్న తెలుగు గంగ ప్రాజెక్టుల నిర్మాణానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలు అవసరమని ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంచనాలను బట్టి తెలుస్తున్నది. రాష్ట్రం మొత్తంగా నిర్మాణంలో ఉన్న మరియు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించిన ప్రాజెక్టుల పూర్తికి రు.20,000 కోట్లు కావలసి ఉంటుందని పాలకులు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యతను నిర్ణయించుకోవాలి. బచావత్ అవార్డు పున:పరిశీలన గడువు దగ్గర పడుతున్న కారణంగా ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి కృష్ణా మిగులు జలాలపై ఆధారపడిన వీటిని యుద్ధప్రాతిపధికపై నిర్మించడానికి వెంటనే పూనుకోవాలి. లేదా "ఆలస్యం అమృతం విషం" అన్న నానుడిలా మారుతుంది.

ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వమన్నామంటే అర్థం ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, శ్రీరాంసాగర్ లకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిన 30% నిథులను సక్రమంగా అందించాలి. వంశధార మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసి, రెండవ దశ చేపట్టాలి. కె.సి.కెనాల్, తుంగభద్ర ఎగువ కాలువ, కృష్ణా డెల్టా కాలువల  ఆధునీకీకరణకు జపాన్ లాంటి దేశాలు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని త్వరితగతిన పూర్తి చేయాలి. కేంద్రం అనుమతి లభించిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపట్టాలి. అలాగే మీడియం ప్రాజెక్టుల నిర్మాణం దశాబ్ధాలు గడుస్తున్నా "ఎక్కడవేసిన గొంగళి అక్కడే" అన్న సామెతగా ఉంది. వాటికి నిథుల కేటాయింపు పెంచి నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి.

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో పై కార్యాచరణ పథకాలను అమలు చేయడం ద్వారా నీటి లభ్యత - వినియోగం, వ్యవసాయోగ్యమైన భూమి _పంటల ఉత్ఫత్తి, గ్రామీణ శ్రమజీవుల శక్తిసామర్థ్యాల వినియోగం తదితరాల మధ్య సమన్వయాన్ని వృద్ధిచేసి వ్యవసాయ రంగాన్ని మరింత ప్రగతి మార్గం పట్టించాలి. దృకథంతో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాపితంగాను, జిల్లా స్థాయిలోను నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ, వివిధ వర్గాల ప్రజానీకాన్ని కూడగట్టి పాలకులపై ఒత్తిడి తెస్తున్నది. నిర్మాణంలో ఉన్న, నిర్మాణాన్ని చేపట్టవలసిన ప్రాజెక్టుల సత్వర సాధనకు మరింత ఉధృత పోరాటాలు అనివార్యమని ప్రజలు గుర్తించాలి’.










Sunday, May 13, 2018


ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కు: మన ప్రజలకు అదెంత దూరంలో ఉన్నది!

1. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండు పర్యటన సందర్భంగా అక్కడి ఆరోగ్య వ్యవస్థను పరిశీలించే సదవకాశం నాకు లభించింది.  కొంత ఆసక్తి కనబరిచాను.

2. ఆ సమయంలో, నా మెదడులో ఒక విషయం మెదలాడింది. లండన్ కేంద్రంగానే కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగెల్స్ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని గ్రంధస్తం చేశారు. మార్క్సిజం మార్గదర్శకత్వంలో రష్యాలో 1917 అక్టోబరు మహావిప్లవం ఘనవిజయం సాధించింది. అటుపై రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఫాసిజంపై సోవియట్ యూనియన్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దాని ప్రభావం ప్రపంచం మీద, ప్రత్యేకించి యూరప్ ఖండం, పశ్చిమ దేశాలపై గణనీయంగా పడింది. తూర్పు ఐరోపా దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించాయి. ఈ నేపథ్యంలో తమను తాము రక్షించు కోవాలంటే సంక్షేమ పథకాలను కొన్నింటిని అమలు చేసి, శ్రామిక వర్గాన్ని కొంత సంతృప్తి పరిస్తే తప్ప కమ్యూనిస్టు భావజాలం నుండి పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోలేమన్న భయం అమెరికా, బ్రిటన్ మొదలుకొని వివిధ దేశాలను వెంటాడిందని, దాంతో జాతీయ ఆరోగ్య పథకం, పెన్షన్ స్కీమ్స్ అమలు, పేద విద్యార్థులు చదువు కోవడానికి వీలు కల్పిస్తూ విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి ధనికులు, పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు ఆర్థిక వనరులను సమకూర్చాలన్న నిర్ణయానికి వచ్చి ప్రభుత్వాలు ఆ వైపు కార్యాచరణకు పూనుకొన్నాయని చరిత్ర పుటల నుండి గ్రహించిన అంశం గుర్తొచ్చింది. అందులో భాగంగానే జాతీయ ఆరోగ్య పథకం(నేషనల్ హెల్త్ స్కీమ్)ను యునైటెడ్ కింగ్డమ్(యు.కె.) 1948 నుండి అమలు చేయడం మొదలు పెట్టిందని చరిత్ర చెబుతున్నది.

3. నా శ్రీమతి, ప్రశాంతి డాక్టర్. ఆమెకు వైద్య కళాశాలలో సహ విద్యార్థులైన డా.జి.లక్ష్మీనారాయణ, డా.లలిత చలసాని, మరో ముగ్గురు ఇంగ్లండులో వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. మా పర్యటన సందర్భంగా డా.లలిత చలసాని, ఆమె భర్త డా.సత్యప్రసాద్ కోయ గారు చొరవ తీసుకొని, వారి పూర్వ సహచర విద్యార్థులతో పాటు మిత్రులైన మరికొందరు డాక్టర్స్ కుటుంబాలను వారింటికి ఆహ్వానించి, విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా పిచ్చాపాటి కబుర్లుతో పాటు మన దేశం, తెలుగు నాట రాజకీయాలు, వామపక్ష ఉద్యమానికి సంబంధించి ముచ్చటించు కోవడం జరిగింది. ఇంగ్లండులోని ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పని తీరు కేంద్ర బిందువుగా సంభాషణ జరిగింది.  

4. లివర్ పూల్ ప్రాంతం పరిథిలో డా.సత్యప్రసాద్ కోయ, డా.లలిత చలసాని గార్లు నిర్వహిస్తున్న"హౌ గ్రీన్ హెల్త్ పార్క్" ను సందర్శించి అక్కడి ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పని తీరును తెలుసుకొనే ప్రయత్నం చేశాను. ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా కేంద్రాల వ్యవస్థ, మౌలిక వసతులు, వాటి పని తీరును తెలుసుకొనే సదవకాశం కలిగింది. ఆక్స్ పర్డ్ నుండి కోవెంట్రీ కు బస్సులో వెళ్ళి, అక్కడ నుండి లివర్ పూల్ కు డా.జి.లక్ష్మీనారాయణ గారితో కలిసి కారులో ప్రయాణం చేసిన సమయంలో ఆరోగ్య విధానం, స్థూల జాతీయోత్ఫత్తిలో ఆ దేశం వెచ్చిస్తున్న నిథుల నిష్పత్తి, తదితర కొంత సమాచారాన్ని ఆయన తెలియజేశారు. లండన్ లో ఉద్యోగం చేస్తున్న మరొక మిత్రుడు, తన జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నదని, ఆమెకు అందుతున్న ఉచిత(అత్యంత ఖరీదైన) వైద్య సహయాన్ని గురించి అతను వివరించాడు.

5. పిల్లల ఆరోగ్య పరిరక్షణ, పోషణ, విద్యకు సంబంధించిన అంశాలపై ఆ ప్రభుత్వ విధానాన్ని మరి కొందరు మిత్రులు తెలియజేశారు. పుట్టిన రోజు మొదలు 16 సం.ల వయస్సు వచ్చే వరకు ఏడాదికి 1500 పౌండ్లు చొప్పున బిడ్డ పేరుతో బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. ఐర్లండులో కూడా ఇదే రీతిలో పిల్లల పోషణకు నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానం అమలులో ఉన్నదని, ఇద్దరు పిల్లల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని విధిగా అందిస్తున్నదని, ఒకవేళ కవల పిల్లలు పుడితే మూడింతలు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నదని ఒక మిత్రుడు తెలియజేశాడు. పిల్లలను హింసిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందితే సత్వరం స్పందించి తల్లిదండ్రులపై చర్యలకు ఉపక్రమిస్తారని, ఒకసారి వారి పిల్లాడు పొరపాటున పోలీసుల అత్యవసర నెంబరుకు ఫోన్ చేస్తే పోలీసులు ఇంటికొచ్చారని, జరిగిన పొరపాటును తెలియజేసి, వివరణ ఇచ్చుకొన్నామని, ఈ తరహా ఘటన పునరావృతం కాకుండా చూసుకొమ్మని హెచ్చరించి వెళ్ళారని, ఒక మిత్రుడు చెప్పాడు.

6. యునైటెడ్ కింగ్డమ్(యు.కె.) ఒక సామ్రాజ్యవాద దేశం. సూర్యుడస్తమించని సామ్రాజ్యాన్ని ఒకనాడు ఏలిన దేశం. భారత దేశంతో సహా పలు ప్రపంచ దేశాలను అడ్డంగా దోచుకొని, సంపదను పోగేసుకొన్న దేశం. ఆ దేశానికి సంబంధించిన నాటి, నేటి చరిత్ర సామ్రాజ్యవాద దోపిడీ చరిత్రే. నేను దాని జోలికి వెళ్ళడం లేదు. ఆ దేశంలో అమలులో ఉన్న ఆరోగ్య వ్యవస్థ, అందులోని సానుకూలాంశాలేమైనా ఉన్నాయా! మన ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచు కోవడానికి దోహదపడే అంశాలేమైనా ఉన్నాయా! అన్న అంశం వరకే పరిమితమౌ తున్నాను.

7. సామాజిక, ఆర్థిక, లింగ, జాతి, కుల, మతపరమైన వివక్ష లేకుండా దేశ పౌరులందరికీ "ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు"గా గుర్తించాలని ప్రపంచ వ్యాపితంగా ఉద్యమాలు నడుస్తున్నాయి. మన దేశంలోనే కాదు అంతర్జాతీయ సమాజం కూడా ఈ దృక్పథంతోనే కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు.హెచ్.ఒ.) కూడా ఈ లక్ష్య సాధన కోసం ప్రపంచ దేశాలపై వత్తిడి చేస్తున్నది. సహస్రాబ్ధి లక్ష్యాలలో కూడా ఇదొక ప్రధానమైన లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి నిర్ధేశించింది. సమాజాభివృద్ధిలో పౌరుల ఆరోగ్యం ముఖ్యభూమిక పోషిస్తుందన్న అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు.

8. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా విడుదల చేసిన 2014 సం. గణాంకాల ప్రకారం మన నేతలు ఆదర్శంగా చూపెడుతున్న అభివృద్ధి చెందిన దేశాలు, అలాగే మన ఇరుగుపొరుగు దేశాల ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్ల ద్వారా వెచ్చించిన నిథులను పరిశీలిద్దాం. అమెరికా 21.3%, యు.కె. 16.5%, శ్రీలంక 11.2%, నేపాల్ 11.2%, చైనా 10.4% వెచ్చించాయి. ఆ దేశాల స్థూల జాతీయోత్ఫత్తిలో ఆరోగ్య రంగంపై చేసిన ప్రభుత్వ మరియు ప్రయివేటు మొత్తం వ్యయం వివరాలను పరిశీలిస్తే అమెరికా 8.3%, యు.కె. 7.6%, చైనా 3.1%, నేపాల్ 2.3%, శ్రీలంక 2% గా ఉన్నాయి. మన దేశంలో 2018 -19 వార్షిక బడ్జెట్ లో 5% కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. జిడిపిలో 1.15% మాత్రమే. 2025 నాటికి జిడిపిలో 2.5% కు తీసుకెళ్ళాలని జాతీయ ఆరోగ్య విధానం - 2017లో లక్ష్యంగా పెట్టుకొన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రస్తుతం ఖర్చు చేస్తున్న రెండు లక్షల కోట్ల నుండి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పెంచితే తప్ప మన ఆరోగ్య వ్యవస్థ మెరుగైన సేవలను అందించలేదని నిపుణులు చెబుతున్న మాట.

9. యునైటెడ్ కింగ్డమ్(యు.కె.)లో ఇంగ్లండు, నార్త్ ఐర్లండు, స్కాట్ లాండ్, వేల్స్ ప్రాంతాలు వేరు వేరుగా ఆరోగ్య వ్యవస్థలను నెలకొల్పుకొని, ప్రభుత్వ నిథులతో నిర్వహిస్తున్నాయి. జాతీయ ఆరోగ్య సేవ(ఎన్.హెచ్.యస్.) పేరిట ఇంగ్లండు ప్రభుత్వం 1948 నుండి ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నది. పౌరులందరి ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా బాధ్యతను జనరల్ ప్రాక్టీషనర్స్(జీ.పి.)లకు అప్పగించబడింది. జీ.పి.లకు నిర్ధేశించిన ప్రాంతంలో నివాసముంటున్న పౌరులందరూ, పసి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు తప్పని సరిగా పేర్లు నమోదు చేసుకోవాలి.  రోగులు తమకందే వైద్య సేవల నిమిత్తం ఫీజులు చెల్లించాల్సిన పని లేదు. ప్రభుత్వమే నెల వారిగా నిథులను సమకూర్చుతుంది. అందులో నర్సులు, వైద్య సిబ్బంది, టెక్నీషియన్స్, ఇతర సిబ్బంది వేతనాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు చేరి ఉంటాయి. అంతే కాదు జీ.పి.లు నిర్వహించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలకు కూడా అద్దె ప్రభుత్వమే చెల్లిస్తుంది.  పౌరులందరి ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా బాధ్యతను జనరల్ ప్రాక్టీషనర్స్(జి.పి.)లకు అప్పగించబడింది. ప్రాథమిక వైద్య సేవలన్నింటినీ జీ.పి. లే అందిస్తారు. వ్యాధిగ్రస్తులు (ప్రజాప్రతినిథులు, ప్రభుత్వ పెద్దలతో సహా) ముందు జీ.పి.ల వద్దకు వెళ్ళి ప్రాథమిక చికిత్స చేయించుకోవాలి. జబ్బుల తీవ్రతను బట్టీ అవసరమైతే ఆపై స్థాయి ఆసుపత్రులకు రోగులను 'రెపర్' చేస్తారు.

10. తీవ్రమైన జబ్బు చేసినప్పుడు అత్యవసర చికిత్స నిమిత్తం రోగులు నేరుగా 'రెపరల్' ఆసుపత్రులకు వెళ్ళి చేరినా, ఆ వెంటనే ఆ విషయాన్ని వారి సంబంధిత జీ.పి.కి విధిగా తెలియజేయాలి. జీ.పి.ల వద్ద నిక్షిప్తం చేయబడి ఉన్న పౌరుల ఆరోగ్యానికి సంబంధించిన పూర్వ సమాచారం, జన్మదినం, నివాసం, జీ.పి. వద్ద నమోదు సంఖ్య వగైరా వ్యక్తిగత వివరాలను సేకరించుకోవాలి. ఆధునిక, సాంకేతిక యుగంలో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండడం మూలంగా క్షణాల మీద సమాచార మార్పిడి చేసుకోగలుగు తున్నారు.

11. రోగులు జీ.పి.ల వద్ద అపాయింట్ మెంట్స్ తీసుకోవడం, చికిత్సకు సంబంధిన మందుల సమాచారాన్ని నేరుగా  మందుల దుకాణాలకు పంపడం లాంటి లావాదేవీలనన్నింటినీ కూడా ఇంటర్నెట్ ద్వారానే సాగిస్తున్నారు. తద్వారా మందుల చీటీల వ్రాతల్లో తప్పులు దొర్లడానికి అవకాశం ఉండదు. గంటల తరబడి ఆసుపత్రులు, మందుల షాపుల వద్ద వేచి ఉండే బాధ రోగులకు లేకుండా సాంకేతిక పరిజ్ణానాన్ని, పరికరాలను సద్వినియోగం చేసుకొంటున్నారు.

12. ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రంలో ఉన్న మౌలిక సదుపాయాలను చూసి ఆశ్చర్య పోయాను. పరిశుభ్రమైన, విశాలమైన వాతావరణం. వాహనాల పార్కింగ్ కు విధిగా స్థలం. డాక్టర్లకే కాదు, నర్సింగ్ స్టాఫ్ కు, టెక్నీషియన్స్ కు, వైద్య పరీక్షలకు వేరు వేరుగా గదులున్నాయి. ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రానికి అనుబంధంగా పని చేసే స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలు స్థానిక ప్రజలతో మమేకమై పని చేస్తుంటారు. స్థానిక పరిపాలనా సంస్థలకు ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రాలు జవాబుదారిగా ఉండాలి. ఆసుపత్రిలో ఒక సభా మందిరం ఉన్నది. నెల కొకసారి లేదా అవసరాన్ని బట్టి పక్షం రోజుల కొకసారి స్థానిక సంస్థల ప్రతినిథులు, ఆరోగ్య కార్యకర్తలతో కూడిన సంయుక్త సమావేశాలను నిర్వహిస్తూ, సేవా కేంద్రం పని విధానాన్ని సమీక్షిస్తూ ఉండాలి.  

13. ఇంగ్లండులో వైద్యానికి అయ్యే ఖర్చులో అత్యధిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్య రంగానికి 2017-18 బడ్జెటులో122.5 బిలియన్ పౌండ్స్ కేటాయించారు. వైద్య భీమా సంస్థలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.

14. మన దేశంలో ఉన్న దాదాపు 29,000 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, లక్షా యాభై వేలకుపైగా ఉపకేంద్రాలు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయి. చాలా వరకు ఒక డాక్టర్ తోనే నిర్వహించ బడుతున్నాయి. అనేక పి.హెచ్.సి.లలో డాక్టర్స్, నర్సులు, టెక్నీషియన్స్, ఉపకేంద్రాలలో పని చేసే ఎ.యన్.యం.లు కొరత తీవ్రంగా ఉన్నది.  మారుమూల గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో సిబ్బంది సమస్య, మందుల కొరత జఠిలంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న సిబ్బందిని వైద్యేతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. జనరల్ ఫిజీషియన్స్ కనుమరుగై పోయారు. మౌలిక సదుపాయాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. రోగుల సంతృప్తి నమోదుపై ద్యాసే లేదు. స్థానిక సంస్థల పరిథిలోకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీసుకురావాలని 73, 74 రాజ్యాంగ సవరణలలో పొందు పరచినా అమలుకు నోచుకోలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ఆరోగ్య సేవలను మెరుగుపరచ వచ్చు.

15. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యానికి బరోసా లభిస్తుంది. అనేక రోగాలు ప్రాథమిక దశలోనే నివారించబడతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులపై వత్తిడి తగ్గుతుంది. వైద్యాన్ని అంగడి సరుకుగా మార్చి సొమ్ము చేసుకొంటున్న ప్రయివేటు, కార్పోరేట్ ఆసుపత్రుల దోపిడీ బారి నుండి ప్రజలను కాపాడవచ్చు. కొన్ని అధ్యయనాలను బట్టి సామాన్య ప్రజలు, వారి ఆదాయంలో అత్యధిక భాగాన్ని వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారని వెల్లడయ్యింది. మన దేశ జనాభా 130 కోట్లు దాటింది. పర్యవసానంగా మౌలిక సమస్యలు జఠిలమౌతున్నాయి. ఆర్థికాభివృద్ధిలో ముఖ్యభూమిక పోషించే ఆరోగ్యాన్ని రాజ్యాంగ పరమైన ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించి, ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసి, ప్రజలకు బరోసా కల్పించాలి.

టి.లక్ష్మీనారాయణ

Friday, May 4, 2018

కారల్ మార్క్స్ ద్విశత జయంతి నేడే

మార్క్సిజం - అజరామరమైనది

1. కారల్ మార్క్స్ దేవుడా! మత ప్రవాక్తా! ఋషా! కాదే. మరి, మార్క్స్ ను మానవాళి ఎందుకు మననం చేసుకోవాలి? నిజమే, కారల్ మార్క్స్ ఒక సామాన్య మానవుడు. అందుకే ఆయన, ఆయన కుటుంబ సభ్యులు నికృష్టమైన దారిద్ర్యాన్ని అనుభవించారు. అష్టకష్టాలు పడ్డారు. కానీ, కారల్ మార్క్స్ మానవాళి యావత్తు గర్వించతగ్గ అరుదైన గొప్ప మేధావి. దోపిడీ వ్యవస్థకు సమాధికట్టి, సంపద సృష్టికర్తలైన శ్రామిక వర్గాన్ని దోపిడీ సంకెళ్ళ నుండి శాశ్వతంగా విముక్తి చేసే, సమసమాజ నిర్మాణం కోసం పరితపిస్తూ, తన ముందు తరాల తత్వవేత్తలు సిద్ధాంతీకరించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విజ్ఞానాన్ని శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసి, తన అపారమైన మేధస్సుతో విమర్శనాత్మకంగా విశ్లేషించి,  కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించి, శ్రామిక జన బాహుళ్యానికి ఆరాధ్యుడుగా మానవాళి చరిత్ర పుటల్లోకెక్కారు.

2. పెట్టుబడిదారీ వ్యవస్థ 15వ శతాబ్ధంలో పురుడు పోసుకొని, 16వ శతాబ్ధంలో పట్టాలెక్కి, అభివృద్ధి చెందడం మొదలైన నాటి నుంచి సామాజిక, ఆర్థిక రంగాలలో దాని ప్రభావం ప్రజలపై పడడం మొదలయ్యింది. నాటి నుంచే ఆ వ్యవస్థ నుండి బయటపడే ఆలోచనలకు అంకురార్పణ కూడా జరిగింది. అవి అశాస్త్రీయమైనవి కాబట్టి ఊహాజనిత భావాల పరిథికే పరిమితమైనాయి. మార్క్సిజం మానవ జాతికి ఒక నూతన తత్వశాస్త్రాన్ని, రాజకీయ అర్థ శాస్త్రాన్ని, శ్రామిక వర్గానికి ఒక విప్ల సిద్ధాంతాన్ని అందించింది.

3. మానవ విజ్ఞాన పరిథి విస్తృతం కావడానికి రసాయన శాస్త్రం, ఖగోళశాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయ అర్థశాస్త్రం, భాషా శాస్త్రం, భూగోళశాస్త్రం, తదితర శాస్త్ర రంగాలలో విప్లవాత్మకమైన పరిశోధనలు, ఫలితాలు సాధించబడ్డాయి. డార్విన్ పరిణామ సిద్ధాంతం. జీవజాలంలో కణ నిర్మాణాన్ని కనుగొనటం, శక్తి రూపం, నిత్యత్వ సూత్రం, నూతన విజ్ఞాన పరిశోదనలు ప్రకృతి శాస్త్రానికి సంబంధించి పాత భావనలను పటాపంచలు చేశాయి. విశ్వం, సమాజం, మానవ చైతన్యానికి సంబంధించిన మానవుని ఆలోచనా విధానంలో మౌలిక మార్పుకు దారి తీశాయి.

4. మరొక వైపు జర్మన్ తత్వశాస్త్రం, ఇంగ్లండ్ అర్థశాస్త్రం, ఫ్రెంచ్ సోషలిస్టు భావాలు అభివృద్ధి చెందాయి. తన ముందు తరాలకు చెందిన తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తల భావాలను నిక్షిప్తం చేసిన విజ్ఞానాన్ని కారల్ మార్క్స్ ఆపోశనం పట్టారు. భావవాద పునాదిగా ఉన్న హెగెల్ తాత్విక చింతన, భౌతికవాద పునాదిగా ఉన్న ఫ్యూర్ బా తాత్విక చింతనను, ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డోల రాజకీయ అర్థశాస్త్రాలను అధ్యయనం చేసిన మీదట "తత్వవేత్తలు ప్రపంచానికి రకరకాలుగా భాష్యాలు చెప్పారు. అయితే సమస్య ఏమిటంటే - ప్రపంచాన్ని 'మార్చటం' ఎలా అన్నదే" అని కారల్ మార్క్స్ వ్యాఖ్యానించారు. 19వ శతాబ్ధం మధ్య కాలానికి శ్రామికవర్గం ఒక శక్తిగా ఆవిర్భవించి, వర్గ పోరాటాలకు అంకురార్పణ చేసింది.

5. ఈ ఆలోచనా స్రవంతులన్నింటినీ, ముందుకు తీసుకు పోవడమే కాదు, తన మేదడుకు పదును పెట్టి, ఫెడరిక్ ఏంగెల్స్ తో కలిసి, శాస్త్రీయ దృక్పథంతో విమర్శనాత్మక వివేచన చేసి, గతితార్కిక - చారిత్రక భౌతికవాదం, పెట్టుబడిదారీ విధానపు అర్థశాస్త్రం,  శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించారు. 

6. ప్రకృతి, సమాజ పరిణామాన్ని శాసిస్తున్న సార్వత్రిక నియమాలను, మానవుడి ఆలోచనల అభివృద్ధిని వివేచనతో లోతైన అధ్యయనం, పరిశోధనల ద్వారా పసిగట్టి శాస్త్రీయ విజ్ఞానాన్నిసిద్ధాంతీకరించి సమాజానికి అందించిన విలక్షణమైన, అరుదైన సామాజిక శాస్త్రవేత్త కారల్ మార్క్స్.

7. మానవుడి ఆవిర్భావానికి ముందే ప్రకృతి ఉనికిలో ఉన్నది. ప్రకృతి పదార్థ నిర్మితమేనన్న శాస్త్రీయ విజ్ఞానాన్ని కారల్ మార్క్స్ , ఫెడరిక్ ఏంగిల్స్ పదిలం చేశారు. పదార్థమే ప్రాథమికం. మానవుని ఆవిర్బావంతోటే ఆలోచన/ భావం పుట్టింది. దేవుడు మానవుడి సృష్టే . దేవుడి చుట్టూ మత విశ్వాసాల అల్లిక జరిగింది. దేవుడు లేడని ప్రభోదించే మత భావనలు కొన్ని మార్క్స్ కాలం నాటికే ఉన్నాయి. కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగిల్స్ పదార్థమే ప్రాథమికమని శాస్త్రీయ విజ్ఞానంతో భావవాదాన్ని తునాతునకలు చేస్తూ గతితార్కిక భౌతికవాదం, నూతన తాత్విక చింతనను ఆవిష్కరించారు.

8. సమాజ పరిణామక్రమాన్ని, మానవాళి అభివృద్ధి దశలను, చరిత్రను శాస్త్రీయ దృక్పథంతో మూలాల్లోకెళ్ళి అధ్యయనం చేసి, విమర్శనాత్మకంగా విశ్లేషించి, చారిత్రక భౌతికవాదాన్ని ఆవిష్కరించి, మానవాళి చరిత్ర అధ్యయనానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చి మార్గదర్శులుగా కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగల్స్ చరిత్రలో నిలిచి పోయారు.

9. సంపద సృష్టికి శ్రమే మూలమని రాజకీయ అర్థశాస్త్రంతో నిగ్గుదేల్చి, దోపిడీ వర్గమైన భూస్వాములు, పెట్టుబడిదారులు, సంపద సృష్టికర్తలైన కార్మిక వర్గాన్నిఎలా దోపిడీ చేస్తున్నారో "పెట్టుబడి" గ్రంథం ద్వారా శాస్త్రీయ ఆధారాలతో శ్రామిక వర్గానికి కనువిప్పు కల్పిస్తూ, అదనపు విలువ సిద్ధాంతాన్ని కార్మిక వర్గానికి శక్తివంతమైన ఆయుధంగా అందించారు. దోపిడీ చేసే వర్గం, దోపిడీకి గురయ్యే వర్గం ఉన్నంత కాలం వర్గాల మధ్య వైరుధ్యాలు అనివార్యమని, వాటి మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూనే ఉంటుందని, ఆ వర్గ సంఘర్షణే విప్లవాలకు బాటలు వేసి, సామాజిక మార్పుకు అనివార్యంగా దారితీస్తుందన్న శాస్త్రీయ భావజాలాన్నికారల్ మార్క్స్ ఆవిష్కరించి, సమాజ భవిష్యత్తును దర్శింప చేశారు. 

10. కారల్ మార్క్స్ కాలం నాటికి ఎలక్ట్రానిక్స్, సైబర్నెటిక్స్, స్పేస్ టెక్నాలజీ, ఇంటర్నెట్, రోబోస్, రాకెట్స్, శాటలైట్స్, డ్రోన్స్ వగైరా వగైరా శాస్త్ర సాంకేతిక, సమాచార రంగాలలో విప్లవాత్మక మార్పులు జరగలేదు. శ్రమ దోపిడీ పునాదులపై అభివృద్ధి చెందుతున్న ఆనాటి పెట్టుబడిదారీ సమాజ గమనాన్ని, దాని బలం - బలహీనతలను పసిగట్టి, భవిష్యత్తు సమాజ పరిణామక్రమాన్ని తన మేధో సంపత్తితో శాస్త్రీయ సోషలిజాన్ని ఆవిష్కరించిన మహోన్నతమైన దార్శనికుడు కారల్ మార్క్స్.

11. కారల్ మార్క్స్ తదనంతర కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంబవించిన విప్లవాత్మక మార్పులను నేడు మనం చూస్తున్నాం, వాటి వల్ల వనగూడుతున్న సత్ఫలితాలను అనుభవిస్తున్నాం, సమాజపరం కావలసిన ఆ శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానంపై యాజమాన్య హక్కులు దోపిడీ శక్తుల వశం కావడంతో సంబవిస్తున్న దుష్పలితాలను శ్రామిక ప్రజలు అనుభవిస్తున్నారు. కంటికి కనపడని రీతిలో, కార్మిక వర్గం పసిగట్టలేని స్థాయిలో దోపిడీ నిష్పత్తి పెరిగి పోయింది. సంపద గుట్టలు గుట్టలుగా పోగుబడుతున్నది. మరొక వైపున దారిద్ర్యం, నిరుద్యోగం, ఆర్థిక _ సాంఘిక అసమానతలు పెరిగి పోతున్నాయి. సామాజిక భద్రత లేదు.

12. కారల్ మార్క్స్ ద్వితీయ శత జయంతి సందర్భంగా ఆయనను మననం చేసుకోవడమంటే మార్క్సిజం భావజాలానికి పునరంకితం కావడమే. ప్రపంచ గమనాన్ని త్వరితం చేసే, మార్చే శక్తి, మార్క్సిజానికి మాత్రమే ఉన్నదని శ్రామిక జన బాహుళ్యం విశ్వసించడమే కాదు, పెట్టుబడిదారీ వర్గం గుండె చప్పుళ్ళు విన్నాబోధపడుతుంది.

13. సామ్రాజ్యవాద దేశంగా అభివృద్ధి చెంది, ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని పరితపిస్తున్న అమెరికా 2008లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ఆ సంక్షోభం నుండి బయట పడడానికి పాక్షాత్య దేశాల ఆర్థిక వేత్తలు సహితం మార్క్సిజం ఏమైనా దారి చూపెడుతుందేమోనని గంపెడాశతో మార్క్సిస్టు గ్రంథాలను, ప్రత్యేకించి రాజకీయ అర్థశాస్త్రాన్ని అధ్యయన చేస్తున్నారన్న వార్తలు, 'పెట్టుబడి' గ్రంథం అమ్మకాలకు మంచి గిరాకీ వచ్చిందన్న వార్తలు కొంత కాలం క్రితం హల్ చల్ చేశాయి. మార్క్సిస్టు భావజాలం ఎంతటి మహాశక్తి సంపన్నమైనదో ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.

14. మానవ సమాజం ఏఏ దశలను దాటుకొని నేటి దశకు ఎలా చేరుకొన్నదో, చరిత్రకు సంబంధించిన భౌతికవాద దృక్పథంతో అధ్యయనం చేసి, విశ్లేషించి, "ఇంత వరకు నడచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే", దోపిడీ పునాదులపై నిర్మితమైన పెట్టుబడిదారీ సమాజం ఆంతరంగిక వైరుధ్యాల మూలంగానే కుప్పకూలి పోతుందని, కారల్ మార్క్స్  భవిష్యత్తు దర్శనాన్నిఅంచనా వేశారు. "సకల దేశాల కార్మికులారా ఏకం కండి" అంటూ విప్లవ శంఖారావాన్ని పూరించారు.

15. "యూరప్ ను ఒక భూతం ఆవహించింది _ కమ్యూనిజం అనే భూతం" అన్న మొదటి వాక్యంతో కారల్ మార్క్స్, ఫెడిరిక్ ఏంగిల్స్ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను రచించారు.

రష్యా గడ్డపై 1917 అక్టోబరు మహావిప్లవం ఘనవిజయం సాధించి, ప్రపంచ గమనాన్ని మార్చి వేసింది. బ్రిటీష్ సామ్రాజ్యవాదం కబంద హస్తాల నుండి విముక్తి పొందడానికి భారత దేశం లాంటి వలస దేశాల్లో స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం సాగిస్తున్న వీరోచిత పోరాటాలకు స్ఫూర్తినిచ్చి, విజయపథాన నడిచేలా చేసింది. 1990 దశకానికి ముందు ప్రపంచంలో మూడవ వంతు జనాభా కలిగిన దేశాలలో సోషలిస్టు ప్రభుత్వాలు రాజ్యమేలినాయి.

మార్క్సిజం - లెనినిజం సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడంలో, సోషలిజం నిర్మాణంలో పొడచూపిన తప్పిదాల పర్యవసానంగా సోవియట్ యూనియన్ మరియు తూర్పు యూరప్ దేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాలు కుప్పకూలి పోయాయి. దాని దుష్ప్రభావం అంతర్జాతీయ కమ్యూనిస్టు, కార్మికోద్యమాలపై పడింది.

నేడు మనుగడలో ఉన్న అతిపెద్ద దేశమైన చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం నిర్మిస్తున్న వ్యవస్థ సోషలిస్టు వ్యవస్థేనా! అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సోషలిస్టు దేశాలలో సంబవించిన దుష్పరిణామాలను అవకాశంగా మలచుకొని పెట్టుబడిదారీ ఆర్థిక వేత్తలు మార్క్సిజంపై ముప్పేట దాడి చేస్తున్నారు.
నేడు అంతర్జాతీయంగా కమ్యూనిస్టు ఉద్యమం పెనుసవాళ్ళను ఎదుర్కొంటున్నది. మార్క్సిజం పిడివాదం కాదు, శాస్త్రీయ భావజాలం. శాస్త్రీయ విజ్ఞానంతో ఆవిష్కరించబడిన సిద్ధాంతం. కాబట్టే మార్క్సిజం అజరామరమైనది.

2018 మార్చి 6వ తేదీన లండన్ హైగేట్ సిమెటరీలో కారల్ మార్క్స్ సమాథి వద్ద నేను, నా జీవిత భాగస్వామి డా.కొల్లి ప్రశాంతి నివాళులర్పిస్తున్న దృశ్యాలు. కారల్ మార్క్స్ సమాథి వద్ద గడపిన ఆ సమయం, నా జీవితంలో అత్యంత సంతృప్తిని కలిగించిన అపురూపమైన, అరుదైన ఘటన.

టి.లక్ష్మీనారాయణ