https://www.youtube.com/watch?v=iTZ939R5jcU
Saturday, April 11, 2015
శేషాచలం అడవుల్లో ఎన్ కౌంటర్: చర్చ
టీవి5 చర్చలో నేను
వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించి అభిప్రాయాలను తెలియజేసిన మిత్రులకు
ధన్యవాదాలు.
శేషాచలం అడవుల్లో జరిగింది ఎన్ కౌంటర్ ఔవునా? కాదా? అన్న ప్రశ్నకు 'ఔను, కాదు' అన్న నిర్ధిష్టమైన సమాధానం చెప్పడానికి నా వద్ద ఆధారాలు
లేవు. ఆధారాలున్న వారు నొక్కి వక్కాణించవచ్చు. అనుమానాలపై ఆధారపడి ఆరోపణలు, ప్రత్యారోపణలు, డిమాండ్లు చేసే వారుండవచ్చు.
నేను ఆకోవకు చెందిన వాడిని కానని వినమ్రతతో విన్నవించుకొంటున్నాను.
ఈ ఉదంతాన్ని నేను రెండు కోణాల నుంచి చూస్తున్నాను. 1)
ఎన్ కౌంటరా ? లేదా ఫేక్ ఎన్ కౌంటరా? 'సబ్జెటివ్ రియాక్షన్' తో ఒక నిర్ధారణకు వచ్చి ఈ ప్రశ్నకు నిర్ధిష్టమైన సమాధానం
చెప్పడం అసంబద్ధమైనదని నేను భావిస్తున్నాను. ప్రజల్లో రెకెత్తిన అనుమానాలపై సమగ్ర
విచారణ జరిపి నిజనిద్ధారణ చేయవలసిన బాధ్యత న్యాయస్థానాలపై ఉన్నది. ఆ ప్రక్రియ
కొనసాగుతున్నది. న్యాయ స్థానాలపై విశ్వాసం లేదంటే అదివేరే విషయం. పెట్టుబడిదారీ
వ్యవస్థలోని చట్టాలకు, న్యాయ వ్యవస్థకు వర్గ స్వభావం ఉంటుందన్న విషయం నిర్వివాదాంశం.
అలా అని న్యాయ వ్యవస్థను తృణీకార భావంతో చూడగలమా! అందుకనే జరిగిన ఎన్ కౌంటర్
నిజమైనదా? లేదా ఫేక్ ఎన్
కౌంటరా? తేల్చవలసింది నాయస్థానాలన్నది
నా అభిప్రాయం. దాన్నే టీవి చర్చలో చెప్పాను.
2) వ్యవస్థీకృత నేరాల పట్ల వైఖరి: సమాజాన్ని అతలాకుతం చేస్తూ
అశాంతిని, అభద్రతను, దోపిడీని మూడు పువ్వులు
ఆరు కాయలుగా ఈ వ్యవస్థీకృత నేరాల వ్యవస్థ పెంచి పోషిస్తున్నది. దోపిడీ వర్గాలు ఈ
దుష్టశక్తులను పెంచి పోషిస్తున్నాయి. బొగ్గు మాఫియా, ఎర్రచందనం మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, భూముల మాఫియా, టోల్ టాక్స్ మాఫియా, పెట్రోల్ మాఫియా, ఎన్నికల్లో బూతుల ఆక్రమణ మరియు రిగ్గింగ్ మాఫియా, గ్రామ కక్షలు మరియు హత్యా
రాజకీయాలను కొనసాగించే హంతక ముఠాలు, వగైరా చట్ట వ్యతిరేకమైన, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన, పౌర హక్కులను
కాలరాస్తున్న వ్యవస్థీకృత నేరాల వ్యవస్థ పట్ల, అందులో అంతర్భాగమైన మాఫియా గ్యాంగ్స్ కార్యకలాపాల పట్ల
ఎలాంటి వైఖరి ప్రదర్శించాలో వారి వారి చైతన్యంపై ఆధారపడి ఉంటుంది. వ్యవస్థీకృత
నేరాలలో తెలిసి తెలిసి భాగస్వాములై, ప్రాణాలకు తెగించి అక్రమార్జనాపరులకు తోడ్పడుతూ, తామూ ఆ అక్రమార్జనలో ఏదో
ఒక మేరక లబ్ధి పొందుదామని నేరాలకు పాల్పడుతున్న వారిని సమర్థించాలన్న చైతన్యాన్ని
నాకు మార్కిస్టు భావజాలం కల్పించలేదు.
3) ఎవర్ని కార్మికులంటాం? కూలీలంటాం? కార్మిక వర్గం అంటాం? చట్టబద్ధమైన కార్యకలాపాలలో పాల్గొంటూ తమ శారీరక, మేధోపరమైన శ్రమ శక్తిని
అమ్ముకొంటూ, జాతి సంపదను సృష్టించే వారిని కార్మికులు, కూలీలు, వారి సమూహాన్ని కార్మిక వర్గం అంటాం. అంతే కానీ వ్యవస్థీకృత
నేరాలలో పాల్గొంటున్న 'లుంపెన్' గ్యాంగ్స్ ను, ముఠాలను కార్మిక వర్గంలో అంతర్భాగంగా చూడాలనే విశాలమైన
కమ్యూనిస్టు చైతన్యం నాకు లేదు. టోల్ గేట్ అక్రమ వసూళ్ళకు వ్యతిరేకంగా గళం
విప్పిన వెటరర్న్ కమ్యూనిస్టు పన్సారేను ఈ
మధ్య కాలంలోనే టోల్ గేట్ మాఫియా గ్యాంగుకు చెందిన కిరాయి గూండాలు అత్యంత దారుణంగా
కాల్చి చంపారు. హత్యలు చేయడమే వృత్తిగా పెట్టుకొని కిరాయి గుండాలుగా మారిన వారికి, జాతి సంపదను కొల్లగొట్టే
మాఫియా ముఠాలతో చేతులు కలిపిన కిరాయి వ్యక్తులను కూలీలుగా అభివర్ణించడం
కమ్యూనిస్టు చైతన్యం అనుకొంటే నేను చెప్పగలిగిందేమీ లేదు. మానవ హక్కులు, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, సాంఘిక వెనుకబాటుతనం
లాంటి గొడుగుల నీడన రాజ్యాంగ బద్ధం కాని, చట్టబద్ధం కాని, సమాజంలోని మిగిలిన పౌరుల హక్కులను కాలరాచే దుష్టశక్తులకు
ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వత్తాసు పలకడం పరనింద, ఆత్మవంచన అవుతుంది. దాని
వల్ల సమాజానికి ఏ మాత్రం మేలు జరగక పోగా తీవ్ర హాని జరుగుతుంది. అరాచకం, దోపిడీ ఇంకా వెర్రితలలు
వేస్తాయని మార్క్సిస్టు భావజాలంలో నాకున్న మిడిమిడి జ్ఞానంతో చెబుతున్న మాట.
కార్మిక వర్గానికి వెన్నుదన్నుగా నిలవాలే గానీ వ్యవస్థీకృత నేరాల వ్యవస్థలో
భాగస్వాములైన 'లుంపెన్ గ్యాంగ్స్'కు కాదు. ఈ దృక్పథంతోనే శేషాచలం అడవుల్లో జరిగిన ఘటనను, తెలంగాణ గడ్డపై ఉగ్రవాద
ముఠాకు చెందిన కొందరిని హతమార్చిన ఘటనను చూస్తున్నాను. ఆయా ఘటనలను విశ్లేషించుకోవడంలో
నాకున్న దృక్పథం లోపభూయిష్టమైనదేమో! మేధావులెవరైనా అందులోని లోపాన్ని ఎత్తి చూపి
నన్ను సరిచేస్తే సంతోషమే.
Thursday, April 9, 2015
ఏప్రిల్ 9,2015: టీవి5లో ఉ. వార్తల విశ్లేషణలో భాగంగా "రైతులకు పంట నష్ట పరిహారం, ఎర్రచందనం మాఫియా _ ఎన్ కౌంటర్, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం" అంశాలపై జరిగిన చర్చలో నాతో పాటు టిడిపి నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి, రాజకీయ విశ్లేషకులు శ్రీ సి.నరసింహరావు, వై.యస్.ఆర్.సి.పి. నాయకురాలు శ్రీమతి వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.
Sunday, April 5, 2015
'గవర్నర్' వ్యవహార శైలిపై సద్విమర్శ
ఈ విమర్శను నేను నూటికి నూటాయాభై శాతం బలపరుస్తున్నాను. లౌకిక రాజ్యమని రోజూ కబుర్లు చెబుతూ రాష్ట్రానికి ప్రథమ పౌరుడుగా అన్ని రకాల సౌకర్యాలను, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ, తెలుగు నాట ఉన్న గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడమే ఆయన నిత్యకృత్యంగా పెట్టుకొని, తీర్త యాత్రలు చేసుకొంటూ కుటుంబ సమేతంగా 'రిటైర్డ్ లైఫ్'ను ఆహ్లాదకరంగా గడిపేస్తున్నారు. తెలుగు నాట రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా పట్టదు. త్రాగడానికి మంచి నీళ్ళు కరవై పోయి గొతులెండి పోతున్న ప్రజల గోష ఎవరికీ వినిపించుకోరు. రాష్ట్ర విభజన పర్యవసానంగా రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న వివాదాల పరిష్కారంలో క్రియాశీలంగా వ్యవహరించడం అటుంచి, అసలు సమస్యలే లేవన్నట్లు బాహ్య ప్రపంచానికి సొల్లుకబుర్లు చెబుతుంటారు.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వం నియమించిన వివిధ రాష్ట్రాల గవరర్లను తొలగించడానికి పూనుకొన్న బిజెపి నేతృత్వంలోని యన్.డి.ఎ. కూటమి ప్రభుత్వం ఎందు చేత 'నరసింహన్' పై దృష్టి సారించలేదు. దీని వెనక చిదంబర రహస్యమేమైనా దాగి ఉన్నదేమోనని పిస్తున్నది. కాషాయ కూటమి మద్ధతు కూడగట్టుకొన్నారేమోనని కూడా అనుమానమొస్తోంది! తెలుగు ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు మాత్రం నిజంగానే 'లైఫ్ ను ఎంజాయ్' చేస్తున్నారు. ఇది మన లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సాధ్యమవుతుందేమో!
ప్రకాశం జిల్లా ప్రజల మనోవేదన
అసోషియేషన్ ఫర్ సోషల్ రీసర్చ్ అండ్
అడ్వాన్స్ మెంట్(అస్రా) సంస్థ ఆధ్వర్యంలో " ప్రకాశం జిల్లా- సమగ్రాభివృద్ధి"
అన్న అంశంపై ఏఫ్రిల్ 4న ఒంగోలులో
నిర్వహించబడిన సదస్సుకు వక్తగా వెళ్ళాను. నాతో పాటు సభలో పాల్గొన్న వక్తలు చేసిన ఆవేదనాభరితమైన
ప్రసంగాలలో ప్రస్తావించబడ్డ అంశాలు, సమస్యలు
ప్రకాశం జిల్లా ప్రజల మనోవేదనకు, పాలకుల
నిర్లక్ష్యానికి, నిరాధరణకు అద్దం
పట్టాయి. ఒక వెనుకబడ్డ, నిత్యకరవు
కాటకాలకు బలైపోతున్న జిల్లా
ప్రజల ఘోష వర్ణనాతీతం.
కర్నూలు, నెల్లూరు, గుంటూరు
జిల్లాలలోని కొన్ని
భాగాలను విడగొట్టి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలు నీటి
సమస్యతో విలవిల్లాడి పోతున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నోచుకోలేదు. జిల్లాలోని రామాయపట్నం
దగ్గర ఓడరేవు నెలకొల్పబడితే
పారిశ్రామికాభివృద్ధికి పునాదులు పడతాయన్న కొండంత ఆశ పడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది. ఓడ రేవు
వచ్చినట్లే వచ్చి రాజకీయ దళారులు, అవినీతి
రాజకీయ నాయకుల వల్ల చేజారి
పోయిందనే భావన బలంగా వేళ్ళూనుకొన్నది. రాష్ట్ర విభజన చట్టంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను వెనుకబడ్డ ప్రాంతాలుగా గుర్తించిన కేంద్ర
ప్రభుత్వం ప్రకాశం జిల్లాను గుర్తించక పోవడం దారుణమన్న న్యాయబద్ధమైన భావన ఆ జిల్లా
ప్రజల మనస్సులను తొలిచేస్తున్నది. విభజన చట్టంలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక
ప్యాకేజీ అమలు చేస్తామని
విభజన చట్టంలో పొందుపరచి, ఇప్పటి
వరకు చేసిందేమీ లేక పోయినా ప్రకాశం జిల్లాను కూడా కనీసం వెనుకబడ్డ జిల్లాగా గుర్తించ లేదే
అన్న బాధ వారిలో
తన్నుకొస్తున్నది. జిల్లా భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆ సభలో ప్రస్తావించబడ్డ ఒక అంశం నాకు ఆశ్చర్యం కలిగించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం దృష్టికి జిల్లా సమస్యలను తీసుకెళ్ళి న్యాయం చేయమని కోరడానికి వెళ్ళిన ఒక ప్రతినిథి బృందానికి ఎదురైన చేదు అనుభవాన్ని ప్రస్తావించారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి సంధించిన ప్రశ్న"మీ జిల్లా వాళ్ళు నాకేం చేశారు(అంటే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలిపించారు) అన్న భావగర్భిత ప్రశ్న వేశారంట. నిజంగా అలా జరిగి ఉంటే అది ప్రజాస్వామ్యవాదికి తగని పని. స్వేచ్ఛగా ఓట్లు వేసి తమకు నచ్చిన వారిని ప్రజాప్రతినిథులుగా ఎన్నుకొనే హక్కు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం ప్రజలకు కల్పించింది. ఆ హక్కును గౌరవించడమే కాదు, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపైన ఉన్నది. ఎన్నికల తదనంతరం ఏర్పడే ప్రభుత్వం ప్రజలందరికీ ప్రాతినిథ్యం వహిస్తుంది. సంకుచిత రాజకీయాలకు అతీతంగా ప్రజలందరి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం రాగ ద్వేషాలకు అతీతంగా, రాజ్యాంగం, చట్టాల పరిథిలో అంకిత భావంతో పని చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ భావనను పలచన చేసే విధంగా ప్రభుత్వాధినేతల నోటి నుండి అనాలోచితంగా మాటలు దొర్లినా అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తుంది. ఆ వైఖరి ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఓట్లు, సీట్లు ఇవ్వక పోయినా నిష్పక్షపాతంగా పాలన సాగించి ప్రజల ఆదరాభిమానాలను చూరగొనాలనే సంకల్పం, లక్షణం రాజకీయ నాయకత్వాలకు ఉండాలి.
Friday, April 3, 2015
నైతిక పతనం వైపు చట్ట సభల సభ్యుల అడుగులు!
ప్రచురణ: సూర్య దినపత్రిక, ఏప్రిల్ 3, 2014
పార్లమెంటు ఉభయ సభలు, రెండు తెలుగు రాష్ట్రాలు, కేరళ, జమ్మూ & కాశ్మీర్, చత్తీస్ ఘర్ శాసన సభల సమావేశాల తీరు తెన్నులను గమనించిన వారికి జుగుప్స కలిగింది. చట్ట సభల సభ్యుల్లో దిగజారిపోతున్న ప్రమాణాల పట్ల ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పట్టు గొమ్మలు చట్ట సభలు. చట్ట సభల సభ్యులు ఉన్నతమైన నైతిక ప్రమాణాలను, చట్టాలను, చట్ట సభల నియమ నిబంధనలను, సాంప్రదాయాలను, క్రమశిక్షణను పాటించినప్పుడే చట్ట సభలకు వన్నె వస్తుంది. అప్పుడే చట్ట సభలపైన, సభ్యులపైన ప్రజలకు విశ్వాసం, గౌరవం పెరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లుతుంది. రాజకీయాలు, నైతికత మధ్య విడదీయలేని బంధం ఉన్నది. ఈ బంధాన్ని రాజకీయ నాయకత్వం అపభ్రంశం పట్టించడం మూలంగా సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. ప్రజా ప్రాతినిథ్య వేదికలు పతనం వైపు పయనిస్తున్నాయి. స్వాతంత్ర్యోద్యమంలోనూ, స్వాతంత్ర్యానంతరం రెండు మూడు దశాబ్దాల వరకు రాజకీయ రంగం త్యాగధనులతో నిండి ఉన్నది. నిస్వార్థ ప్రజా సేవే గీటురాయిగా రాజకీయ రంగంలో ప్రవేశించిన వారు చట్ట సభలకు ఎన్నుకోబడినంత కాలం దేశం, ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాలే కొలబద్దగా చర్చలు జరిగేవి. సహజంగానే ప్రభుత్వాల వర్గ స్వభావాన్ని బట్టి విధానాల రూపకల్పన, అమలు జరిగేవి. భిన్న భావజాలాలు, దృక్పథాలు కలిగి ఉన్నప్పటికీ చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని పరిరక్షించడంలో ఆదర్శప్రాయంగా నిలిచారని చెప్పవచ్చు. అందు వల్ల వారి మాటకు సమాజం విలువిచ్చేది. ఎప్పుడైతే నైతిక విలువలకు పాతరేసి, డ(గ)బ్బు రాజకీయాలు ఆధిపత్యంలోకి వచ్చాయో సమాజంలో కూడా అవినీతి, అక్రమాలు పెరిగాయి. ఆశ్రిత పక్షపాతం పెరిగింది. నైతిక విలువలకు విలువలేని దుస్థితి నెలకొన్నది.
పార్లమెంటు ఉభయ సభలు, రెండు తెలుగు రాష్ట్రాలు, కేరళ, జమ్మూ & కాశ్మీర్, చత్తీస్ ఘర్ శాసన సభల సమావేశాల తీరు తెన్నులను గమనించిన వారికి జుగుప్స కలిగింది. చట్ట సభల సభ్యుల్లో దిగజారిపోతున్న ప్రమాణాల పట్ల ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పట్టు గొమ్మలు చట్ట సభలు. చట్ట సభల సభ్యులు ఉన్నతమైన నైతిక ప్రమాణాలను, చట్టాలను, చట్ట సభల నియమ నిబంధనలను, సాంప్రదాయాలను, క్రమశిక్షణను పాటించినప్పుడే చట్ట సభలకు వన్నె వస్తుంది. అప్పుడే చట్ట సభలపైన, సభ్యులపైన ప్రజలకు విశ్వాసం, గౌరవం పెరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లుతుంది. రాజకీయాలు, నైతికత మధ్య విడదీయలేని బంధం ఉన్నది. ఈ బంధాన్ని రాజకీయ నాయకత్వం అపభ్రంశం పట్టించడం మూలంగా సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. ప్రజా ప్రాతినిథ్య వేదికలు పతనం వైపు పయనిస్తున్నాయి. స్వాతంత్ర్యోద్యమంలోనూ, స్వాతంత్ర్యానంతరం రెండు మూడు దశాబ్దాల వరకు రాజకీయ రంగం త్యాగధనులతో నిండి ఉన్నది. నిస్వార్థ ప్రజా సేవే గీటురాయిగా రాజకీయ రంగంలో ప్రవేశించిన వారు చట్ట సభలకు ఎన్నుకోబడినంత కాలం దేశం, ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాలే కొలబద్దగా చర్చలు జరిగేవి. సహజంగానే ప్రభుత్వాల వర్గ స్వభావాన్ని బట్టి విధానాల రూపకల్పన, అమలు జరిగేవి. భిన్న భావజాలాలు, దృక్పథాలు కలిగి ఉన్నప్పటికీ చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని పరిరక్షించడంలో ఆదర్శప్రాయంగా నిలిచారని చెప్పవచ్చు. అందు వల్ల వారి మాటకు సమాజం విలువిచ్చేది. ఎప్పుడైతే నైతిక విలువలకు పాతరేసి, డ(గ)బ్బు రాజకీయాలు ఆధిపత్యంలోకి వచ్చాయో సమాజంలో కూడా అవినీతి, అక్రమాలు పెరిగాయి. ఆశ్రిత పక్షపాతం పెరిగింది. నైతిక విలువలకు విలువలేని దుస్థితి నెలకొన్నది.
ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న ఉద్యమాలను పరిశీలిస్తే ప్రజాస్వామ్యం కోసం
ప్రజలు తెగించి ఉద్యమాలు చేస్తున్నారు. అప్రజాస్వామిక, నియంతృత్వ పోకడలు
అనుసరిస్తున్న ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసి పోతున్నాయి. మన దేశంలో ఉనికిలో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టవంతం
చేసుకోవడానికి బదులు పునాదులనే గొడ్డలి పెట్టుకు గురిచేస్తున్న దుష్పరిణామాలు
ఇటీవల కాలంలో చోటు చేసుకొన్నాయి. యు.పి.ఎ.-2 ప్రభుత్వ నిర్వాకాన్ని
ఒకసారి పరిశీలిస్తే ఎలాంటి హానికరమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయో, వాటి దుష్ప్రభావం వల్ల
చట్ట సభల స్థాయి ఏ విధంగా దిగజార్చబడిందో బోధపడుతుంది. దేశ స్వావలంబనకు
ప్రమాదకరమైన మరియు ప్రజావ్యతిరేకమైన చట్టాలకు ఆమోద ముద్ర వేయించుకోవడానికి పాలక
పక్షం ఎలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందో, కడకు సి.బి.ఐ.ని రాజకీయ ఆయుధంగా దుర్వినియోగం చేసిందో
చూశాం.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ
చట్టానికి పార్లమెంటు ఉభయ సభల ఆమోద ముద్ర వేయించుకోవడానికి కాంగ్రెస్ అనుసరించిన
పద్ధతులు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నవ్వుల పాలు చేయడమే కాదు, గొడ్డలి పెట్టుకు
గురిచేసింది. రాజ్యాంగస్ఫూర్తిని, సాంప్రదాయాలను, నిబంధనలను తుంగలో తొక్కి, లోక్ సభ ద్వారాలు మూసేసి, ప్రసారమాధ్యమాలను
అనుమతించ కుండా, బిల్లును వ్యతిరేకించిన గౌరవ సభ్యులపై భౌతిక దాడి, అరుపులు, కేకలు, ఆర్తనాదాలు, సభలో ఏం జరుగుతున్నదో సభలో ఉన్న సభ్యులకే బోధపడని తీవ్ర
గందరగోళ పరిస్థితుల మధ్య ఎనిమిది కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన
చీకటి బిల్లు ఆమోదించబడిందని ప్రకటించబడింది. పాలక పక్షం,
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కుమ్మక్కైతే ఏంతటి
నిరంకుశ చట్టాన్నైనా తీసుకురావచ్చని ఈ ఘటన రుజువు చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలో
పదేళ్ళ పాటు పాలన సాగించిన యుపిఏ ప్రభుత్వం ప్రజావ్యతిరేక చట్టాల ఆమోదానికి అనైతిక
పద్ధతులకు పాల్పడడం, మరీ ప్రత్యేకించి ఎన్నికలకు ముందు అనేక కీలకాంశాలపై చట్టాలు
తీసుకురావడం ప్రబల నిదర్శనం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! అన్న నానుడిగా
పార్లమెంటే గాడి తప్పి పని చేస్తుంటే ఇహ శాసన సభల సంగతి చెప్పాలా! అత్యున్నత
వేదికైన పార్లమెంటు స్థాయిని ఆ దుస్థితికి చేర్చిన తరువాత మిగిలిన చట్ట సభల
పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకోవడం దురాశ అవుతుందేమో!
గడచిన మూడు దశాబ్దాలుగా క్రమేపీ రాజకీయ రంగంలో అనైతికత, అవినీతి పెరిగిపోయాయి.
హత్యా నేరాల కంటే ఆర్థిక నేరాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను తొలిచేస్తాయని
అత్యున్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించింది. అలాంటి దేశ
ద్రోహం చేసిన వ్యక్తులు నిర్భీతిగా చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. సహజంగానే వారి
రక్షణార్థం నేరచరితులను తమ వెంట చట్ట సభల్లోకి
తీసుకొస్తున్నారు. రాజకీయ పార్టీలు నేరచరితులను అభ్యర్థులుగా నిలుచోబెడితే, చైతన్యరాహిత్యంతో డబ్బు, మద్యం, కులం, మతం, తెగ, ప్రాంతం వంటి వాటికి
ప్రభావితులౌతున్న ప్రజలు ఓట్లేసి నేరచరితులను గెలిపిస్తున్నారు. అలాంటి వారికి భారత
రాజ్యాంగం, చట్టాలు, చట్ట సభల నియమ నిబంధనలు, చట్ట సభల సభ్యుల కుండవలసిన నైతికత పట్ల శ్రద్ధా భక్తులుగానీ, గౌరవంగానీ ఉంటాయనుకోవడం
అత్యాశే అవుతుంది. ప్రత్యర్థులపైన ఆవేశంతో ఊగి పోవడం, దాడులకు పూనుకోవడం, సభ్య సమాజం
అసహ్యించుకొనే పదజాలంతో దూషించడం, మైకులు, బెంచీలను విరగ్గొట్టడం, కాగితాలను చించి వెదజల్లడం లాంటి చర్యలు నిత్యకృత్యంగా తయారయ్యాయి. అత్యంత దయనీయంగా చట్ట సభల
సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. ఈ దుస్థితికి కేవలం ప్రతిపక్షాలనే నిందించలేం, పాలక పక్షాలు అనుసరిస్తున్న వైఖరులు కూడా కారణమని చెప్పక
తప్పదు. ప్రజా సమస్యలు, రాష్ట్రాన్ని, దేశాన్ని
పట్టిపీడిస్తున్న సమస్యలపై చట్ట సభల్లో చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించే తీరుతెన్నులతో సభలు జరగడం
లేదు. సమావేశాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయబడుతున్నదనే ఆవేదన ప్రజల్లో
సర్వత్రా నెలకొని ఉన్నది.
ప్రతి ఏడాది మార్చి 31 లోపు వార్షిక బడ్జెట్లకు చట్ట సభలైన పార్లమెంటు లేదా ఆయా
శాసన సభల ఆమోదం లేకపోతే ప్రభుత్వ ఆర్థిక
కార్యకలాపాలు స్థంభించి పోతాయి. కాబట్టి ఆదాయ, వ్యయాల అంచనాలతో కూడిన వార్షిక బడ్జెట్లను రూపొందించి
చట్ట సభల్లో ప్రవేశ పెట్టి తూతూ మంత్రంగా చర్చలు జరిపి, ఆమోద ముద్ర వేయించుకోవడం ఒక తంతుగా మారింది. రాజ్యాంగ
బద్ధమైన నిబంధనలను సంతృప్తి పరచడం కోసమేనన్నట్లు చట్ట సభల నిర్వహణను పాలక పార్టీలు
దిగజార్చాయి. సభా సమావేశాలను వేదికగా ఉపయోగించుకొని ప్రభుత్వం, పాలక పార్టీపైన
దుమ్మెత్తి పోయడమే తమ పని అన్నట్లు ప్రతిపక్షాలు తలపోస్తున్నాయి. ఫలితంగా చట్ట
సభలు కాస్తా రంచ బండల కంటే అధ్వాన్నంగా తయారైనాయి.
ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాలపైన, ప్రజా ఉద్యమాల వాణిని శక్తివంతంగా వినిపించడానికి ప్రయత్నించే సభ్యుల నోరు
నొక్కడానికి పాలక పక్షాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఉన్నాయి. అవినీతి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఆర్థిక
శాఖామాత్యులు కె.యం.మణి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడానికి అనర్హుడని వామపక్ష, ప్రజాతంత్ర కూటమి సభ్యులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తూ సభా
నిర్వహణను అడ్డుకోవడం,
సభలో విధ్వంసం సృష్టించారని ఐదుగురు సభ్యులను
శాసన సభ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్
కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీపై రాజస్తాన్ శాసనసభలో గొడవ చేసిన 8 మంది కాంగ్రెస్
శాసన సభ్యులను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. చత్తీస్ ఘర్ మరియు జమ్మూ&కాశ్మీర్ శాసన సభలలో కూడా ఈ తరహా అల్లర్లే జరిగాయి.
ఎన్నికల వాగ్దానాలు - చిత్తశుద్ధి: ఎలాగైనా
అధికారాన్ని చెరబట్టాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యం కాని, అలివిగాని ఎన్నికల
వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక మోసపూరిత మాటలతో
కాలం వెళ్ళబుచ్చడానికి ప్రయత్నించడం పరిపాటిగా మారిపోయింది. దాని ప్రభావం చట్ట సభల
పనితీరుపై అనివార్యంగా పడుతున్నది. ఎన్నికల వాగ్దానాల అమలుపై ప్రతిపక్షాలు పాలక
పక్షాన్ని నిలదీయడం ద్వారా ఆ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని సహజంగానే
ప్రయత్నిస్తాయి. దానిని నుంచి తప్పించుకోవడానికి పాలక పక్షం చర్చను ప్రక్క
దారి పట్టించడానికి ఉద్దేశ్యపూర్వకంగా అప్రస్తుతమైన, అసంబద్ధమైన అంశాలను, వివాదాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేయడం నిత్యం చూస్తూనే
ఉన్నాం. ఫలితంగా వాదప్రతివాదనలు, ఒకరి నేర చరిత్రను మరొకరు తవ్వి దుమ్మెత్తి పోయడానికి పూనుకోవడం, దుర్భాషలాడుకోవడం, హావభావాలతో తోటి సభ్యుల
హుందాతనానికి భంగం కలిగించేలా వ్యవహరించడం నిత్యకృత్యంగా మారిపోయింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసన సభలో చోటు చేసుకొన్న ఘటనల పట్ల సభ్యసమాజం తీవ్ర
అభ్యంతరం, నిరసన తెలియజేసే
పరిస్థితులు కల్పించబడ్డాయి. సభ లోపల, వెలుపల కొంత మంది సభ్యుల ప్రవర్తన,
ఉచ్చరించిన భాష, హావభావాలు చట్ట
సభల సభ్యుల గౌరవ మర్యాదలను బుగ్గి పాలు చేశాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక
మహిళా సభ్యురాలు ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకొని ప్రసార మాధ్యమాల ముందు "నన్నేమి చేయగలరు రేప్ చేస్తారా? హత్య చేస్తారా? వాళ్ళకు రేప్ చేసే ధైర్యం
లేదు, హత్య చేసే శక్తి
లేదు, ఏం పీకుతారు? " అని బహిరంగంగా మాట్లాడడం, పాలక పక్ష సభ్యుడొకరు సభ లోపలే "ఒరేయ్ నిన్ను
పాతరేస్తాను" అని హెచ్చరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఆ గౌరవ సభ్యుల
స్థాయి ఏ పాటిదో వీటిని బట్టి అంచనా వేసుకోవచ్చు. ఈ తరహా భూతులతో సభ్యులు వారి
గౌరవ మర్యాదలను వారే మట్టిమాలు చేసుకోవడమే కాకుండా చట్ట సభల ఔన్నత్యానికి
తీవ్రభంగం కలిగించారు. ఈ దుస్థితికి కారకులు మీరంటే మీరని పాలక, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొంటూ
క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు, డిమాండ్లు చేసుకొన్నారు. వాటిని అలా ఉంచితే కొంత మంది సభ్యుల ప్రవర్తన అత్యంత
జుగుప్సాకరంగాను, అభ్యంతరకరంగాను, సభ్యసమాజం ఛీదరించుకొనేలా
ఉన్నాయి.
ఇలాంటి వారినా మనం శాసన
సభ్యులుగా ఎన్నుకొన్నదని పక్షాత్తాపపడే
దుస్థితికి ప్రజలు నెట్టబడ్డారు.
నవ్వుల పాలౌతున్న ఫిరాయింపుల నిరోధక చట్టం: భారత రాజ్యాంగానికి 52వ సవరణ ద్వారా తీసుకురాబడిన 'ఫిరాయింపుల వ్యతిరేక చట్టం' 1985 మార్చి 1 నుండి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ సవరణ 91 ద్వారా సవరించబడిన ఫిరాయింపుల
వ్యతిరేక చట్టం 2004 జనవరి 1 నుండి అమలులో ఉన్నది. దీని ప్రకారం శాసన సభాపక్షంలో 2/3 వ వంతు సభ్యులు మాతృపార్టీ నుంచి
చీలిపోయి, వేరే కుంపటి పెట్టుకోవడంగానీ లేదా మరొక
పార్టీలో చేరడం గానీ జరిగినప్పుడు మాత్రమే సభ్యులు అనర్హులుగా ప్రకటించబడరు. అలాగే
మొత్తం పార్టీని మరొక పార్టీలో విలీనం చేయాలన్నా ఒక్క సభ్యుడు లేదా సభ్యురాలు
వ్యతిరేకించినా వారు సభ్యత్వం కోల్పోకుండా మాతృ పార్టీకి వారసులుగా కొనసాగుతారు.
ఉదాహరణకు చిరంజీవి నెలకొల్పిన ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం
చేసినప్పుడు శాసన సభ్యురాలుగా ఉండిన కీ.శే.శోభానాగిరెడ్డి
గారు విలీనాన్ని వ్యతిరేకించినా ఆమె అనర్హురాలుగా ప్రకటించబడ లేదు.
తెలంగాణ
రాష్ట్ర శాసన సభ,
శాసన మండలిలలో చోటు
చేసుకొన్న తాజా పరిణామాలు రాజకీయ రంగంలో అనారోగ్యకరమైన దోరణులకు ప్రతిబింబాలుగా
నిలిచాయి. టిడిపి ఎన్నికల చిహ్నంపై గెలుపొందిన ఒక శాసన సభ్యుడు పార్టీ ఫిరాయించి, పాలక పార్టీలో చేరి మంత్రి బాధ్యతలు
చేపట్టడం జరిగింది. ఆయన తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసినా దాన్ని ఇంకా
ఆమోదించలేదు. ఇది అనైతికమైనది, చట్ట
వ్యతిరేకమైనదని ఆ సభ్యుని మాతృ
పార్టీకి చెందిన మిగిలిన సభ్యులు శాసన సభా వేదికలో నిరసన తెలియజేయడంతో ఆ సభ్యులను సభా సమావేశాలు ముగిసే వరకు సభ నుండి సస్పెoడ్
చేయడం జరిగింది.
శాసన మండలిలో తెలుగు దేశం పార్టీకి చెందిన మెజారిటి సభ్యులు టి.ఆర్.యస్. పార్టీలో
చేరడంతో మొత్తం శాసన సభా పక్షమే టి.ఆర్.యస్.లో విలీనమైనట్లు ప్రకటించబడింది.
సర్వసాధారణంగా శాసన సభా పక్షం నాయకత్వాన్ని శాసన సభ మరియు శాసన మండలి సభ్యులు
మొత్తం కలిసి ఎన్నుకొంటారు. మరి ఈ చర్య న్యాయ సమీక్షకు నిలుస్తుందా! లేదా అన్నది అటు
ప్రక్కన బెట్టి చూసినా ఇప్పటికీ టిడిపికి ప్రాతినిథ్యం వహిస్తున్న శాసన మండలి
సభ్యుల ఉనికి ప్రశ్నార్థకమయ్యింది.
ఫిరాంయిపుల
వ్యతిరేక చట్టం అమలులోకి వచ్చిన తరువాత అమెరికా, భారత దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం
పొందడానికి నాటి యు.పి.ఏ. ప్రభుత్వం ప్రోత్సహించిన ఫిరాయింపుల ఘటన వరకు 62 మంది లోక్ సభ సభ్యులపై పిర్యాదు
చేయబడితే వారిలో 26 మంది అనర్హులుగా ప్రకటించబడ్డారు.
పెద్దల సభ అయిన రాజ్యసభ సభ్యులు నలుగురిపైన ఫిర్యాదులు చేయబడ్డాయి. వివిధ
రాష్ట్రాలలో 2004 వరకు 268 మంది శాసన సభ్యులపై పార్టీ ఫిరాయింపుల కేసులు నమోదైతే వారిలో 155 మంది అనర్హులుగా ప్రకటించబడ్డారు. అయినా
పిరాయింపుల నిరోధక చట్టం ఒక చట్టుబండలాగా మిగిలిపోయింది.
ప్రశ్నార్థకమవుతున్న చట్ట సభల ఔన్నత్యం: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభాపతి
అత్యంత కీలకమైన పాత్రదారి. నిష్పాక్షికంగా, రాగ ద్వేషాలకు అతీతంగా, పారదర్శకంగా, రాజ్యాంగ
స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య
పునాదులను పటిష్టపరిచే తీరుతెన్నులతో సభను నిర్వహిచాల్సిన బాధ్యత సభాపతిపై
ఉన్నది. అందుకే సభాపతిగా ఎన్నికైన వారు తమ పార్టీకి రాజీనామా చేస్తే రాజకీయ
అనుబంధాలకు అతీతంగా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆ స్థానానికి వన్నె తెచ్చిన
వారవుతారని భావించబడుతున్నది. ఆ సస్సాంప్రదాయాన్ని చట్టం కూడా ప్రోత్సహిస్తున్నది.
ఆ దృష్టితోనే సభాపతిగా ఎన్నికైన సభ్యుడు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ
పార్టీకి రాజీనామా చేసినా సభ్యత్వం కోల్పోరని పిరాయింపుల నిరోధక చట్టంలో కూడా
మినహాయింపు ఇవ్వబడింది. అప్పుడే సభాపతి తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా
నిర్వహించడానికి ఉపకరిస్తుందని, సాధ్యమైనంత
వరకు విమర్శలకు తావు లేకుండా సభాకార్యక్రమాలను నిష్పాక్షికంగా ఫలవంతంగా
నిర్వహించడానికి వాతావరణం సృష్టించ బడుతుందన్నది నిర్వివాదాంశం. కానీ ఆ
సస్సాంప్రదాయం ఆచరించక పోవడం మూలంగా సభాపతి నిష్పాక్షికతపై తరచూ విపక్షాలు పెదవి
విరిచే పరిస్థితులు నెలకొంటున్నాయి. సభాపతి పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న
ఆరోపణలను కొన్ని సందర్భాలలో ప్రతిపక్షాలు చేయడాన్ని గమనిస్తూనే ఉన్నాం. ఇవాళ
అలాంటి అనారోగ్యకరమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ శాసన సభలో నెలకొనడాన్ని గమనిస్తూనే
ఉన్నాం. కడకు సభ్యులు విజ్ఞత కోల్పోయి ఆవేశాలతో ఊగిపోతూ ప్రవర్తించిన తీరు, ఎనిమిది మంది ప్రతిపక్ష సభ్యుల మూడు
రోజుల సస్పెంషన్,
వాకౌట్ చేస్తున్నామని
ప్రకటించకుండానే ప్రతిపక్షం సభ నుండి నిష్క్రమించడం, గవర్నరుకు ఫిర్యాదు, సభాపతిపై అవిశ్వాస తీర్మానాన్ని అందజేయడం, ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి
అనుమతించే వరకు సభా సమావేశాలకు హాజరు కాబోమని ఆవేశంతో ప్రతిజ్ఞ చేయడం లాంటి దురదృష్టకరమైన
ఘటనలు జరిగాయి. ప్రతిపక్ష పార్టీ నాయకత్వం పునరాలోచించుకొని సభా సమావేశాలకు
హాజరుకావడం, స్పీకర్ పై ఇచ్చిన అవిశ్వాస
తీర్మానాన్ని ఉపసంహరిచుకోవడం ద్వారా కథ సుఖాంత మయ్యిందనిపించారు. కానీ, అనుచితంగా ప్రవర్తించిన సభ్యులపై
క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలని చేసిన పిర్యాదులు అలా పెండింగ్ లోనే
ఉన్నాయి.
మన
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నాణ్యత రోజు రోజుకూ పలచనౌతున్నది. సభాకార్యక్రమాలను
ప్రసారమాధ్యమాలు ప్రజలకు త్వరితగతిన చేరవేస్తున్నాయి. సభ్యుల పనితీరుపైన, ప్రవర్తనపైన అవగాహన చేసుకోవడానికి
వార్తలు, టివిల్లో ప్రసారమవుతున్నదృశ్యాలు
ప్రజలకు ఎంతగానో దోహదపడుతున్నాయి. చట్ట సభల్లో జరుగుతున్న అల్లరి దృశ్యాలు
జుగుప్సాకరంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చట సభల్లో పాటిoచాల్సిన సాంప్రదాయాలు, నియమ నిబంధనలు, హుందాతనానికి భంగం కలిగించే చర్యలకు
పాలక, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు
సభ్యులు పాల్పడాన్ని ఆయా పార్టీల నాయకత్వాలు కట్టడి చేయకపోతే ప్రజల నుండి
విమర్శలను ఎదుర్కోక తప్పదు. ఈ దిగజారుడు ప్రక్రియకు అడ్డుకట్ట వేయకపోతే మన ప్రజాస్వామ్య
వ్యవస్థ భవిష్యత్తు అంధకారంగా తయారవుతుంది. చట్ట సభల సభ్యులను ప్రజలు 'రోల్ మోడల్స్'గా భావిస్తారు. సమాజానికి
మార్గదర్శకులుగా ఉండవలసిన చట్ట సభల సభ్యులే దారి తప్పి ప్రవర్తిస్తే ప్రజాస్వామ్య
వ్యవస్థ గాడి తప్పుతుంది. చట్ట సభలను సమర్థవంతంగా పని చేయించడంలో పాలక, ప్రతిపక్షాలకు గురుతరమైన బాధ్యత
ఉన్నదని గుర్తించాలి.
చట్ట సభలు అత్యంత జాగరూకతతో, బాధ్యతాయుతంగా, పారదర్శకoగా తమ పని విధానాన్ని మెరుగు పరచుకొంటూ సమాజ ప్రగతికి బాటలు
వేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం, పరమార్థం ఉంటుంది. వైవిద్యభరితమైన మన దేశంలో నిజమైన
ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకొనడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. అలాగే ప్రస్తుత
రాజ్యాంగానికి వర్గ స్వభావం ఉన్నది, తదనుగుణంగా అనేక పరిమితులు ఉన్నాయి. అందులో ఇమిడి ఉన్న
ప్రజాస్వామిక భావనలను పరిరక్షించుకొంటూ, వాటికి కార్యరూపం సముపార్జించుకొంటూ, మెరుగైన రాజ్య వ్యవస్థ
కోసం అడుగు ముందుకు వేయాలి. బహుళ పార్టీ వ్యవస్థను పటిష్టవంతం చేసుకోవాలి. ఈ
నేపథ్యంలో చట్ట సభలు పట్టాలు తప్పి నడకసాగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం. ఆర్థిక
నేరస్తులు, వ్యవస్థీకృత నేరాల చరిత్ర ఉన్నవారు చట్టసభల్లోకి
ప్రవేశించకుండా సమగ్రమైన, పటిష్టమైన ఎన్నికల
సంస్కరణలు తక్షణావసరం. తద్వారా మాత్రమే దిగజారుతున్న చట్ట సభల ప్రమాణాలకు
అడ్డుకట్ట వేసి, వాటి ఔన్నత్యాన్ని పునరుద్ధించడానికి వీలౌతుంది.
Subscribe to:
Posts (Atom)