అసోషియేషన్ ఫర్ సోషల్ రీసర్చ్ అండ్
అడ్వాన్స్ మెంట్(అస్రా) సంస్థ ఆధ్వర్యంలో " ప్రకాశం జిల్లా- సమగ్రాభివృద్ధి"
అన్న అంశంపై ఏఫ్రిల్ 4న ఒంగోలులో
నిర్వహించబడిన సదస్సుకు వక్తగా వెళ్ళాను. నాతో పాటు సభలో పాల్గొన్న వక్తలు చేసిన ఆవేదనాభరితమైన
ప్రసంగాలలో ప్రస్తావించబడ్డ అంశాలు, సమస్యలు
ప్రకాశం జిల్లా ప్రజల మనోవేదనకు, పాలకుల
నిర్లక్ష్యానికి, నిరాధరణకు అద్దం
పట్టాయి. ఒక వెనుకబడ్డ, నిత్యకరవు
కాటకాలకు బలైపోతున్న జిల్లా
ప్రజల ఘోష వర్ణనాతీతం.
కర్నూలు, నెల్లూరు, గుంటూరు
జిల్లాలలోని కొన్ని
భాగాలను విడగొట్టి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలు నీటి
సమస్యతో విలవిల్లాడి పోతున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నోచుకోలేదు. జిల్లాలోని రామాయపట్నం
దగ్గర ఓడరేవు నెలకొల్పబడితే
పారిశ్రామికాభివృద్ధికి పునాదులు పడతాయన్న కొండంత ఆశ పడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది. ఓడ రేవు
వచ్చినట్లే వచ్చి రాజకీయ దళారులు, అవినీతి
రాజకీయ నాయకుల వల్ల చేజారి
పోయిందనే భావన బలంగా వేళ్ళూనుకొన్నది. రాష్ట్ర విభజన చట్టంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను వెనుకబడ్డ ప్రాంతాలుగా గుర్తించిన కేంద్ర
ప్రభుత్వం ప్రకాశం జిల్లాను గుర్తించక పోవడం దారుణమన్న న్యాయబద్ధమైన భావన ఆ జిల్లా
ప్రజల మనస్సులను తొలిచేస్తున్నది. విభజన చట్టంలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక
ప్యాకేజీ అమలు చేస్తామని
విభజన చట్టంలో పొందుపరచి, ఇప్పటి
వరకు చేసిందేమీ లేక పోయినా ప్రకాశం జిల్లాను కూడా కనీసం వెనుకబడ్డ జిల్లాగా గుర్తించ లేదే
అన్న బాధ వారిలో
తన్నుకొస్తున్నది. జిల్లా భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆ సభలో ప్రస్తావించబడ్డ ఒక అంశం నాకు ఆశ్చర్యం కలిగించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం దృష్టికి జిల్లా సమస్యలను తీసుకెళ్ళి న్యాయం చేయమని కోరడానికి వెళ్ళిన ఒక ప్రతినిథి బృందానికి ఎదురైన చేదు అనుభవాన్ని ప్రస్తావించారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి సంధించిన ప్రశ్న"మీ జిల్లా వాళ్ళు నాకేం చేశారు(అంటే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలిపించారు) అన్న భావగర్భిత ప్రశ్న వేశారంట. నిజంగా అలా జరిగి ఉంటే అది ప్రజాస్వామ్యవాదికి తగని పని. స్వేచ్ఛగా ఓట్లు వేసి తమకు నచ్చిన వారిని ప్రజాప్రతినిథులుగా ఎన్నుకొనే హక్కు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం ప్రజలకు కల్పించింది. ఆ హక్కును గౌరవించడమే కాదు, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపైన ఉన్నది. ఎన్నికల తదనంతరం ఏర్పడే ప్రభుత్వం ప్రజలందరికీ ప్రాతినిథ్యం వహిస్తుంది. సంకుచిత రాజకీయాలకు అతీతంగా ప్రజలందరి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం రాగ ద్వేషాలకు అతీతంగా, రాజ్యాంగం, చట్టాల పరిథిలో అంకిత భావంతో పని చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ భావనను పలచన చేసే విధంగా ప్రభుత్వాధినేతల నోటి నుండి అనాలోచితంగా మాటలు దొర్లినా అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తుంది. ఆ వైఖరి ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఓట్లు, సీట్లు ఇవ్వక పోయినా నిష్పక్షపాతంగా పాలన సాగించి ప్రజల ఆదరాభిమానాలను చూరగొనాలనే సంకల్పం, లక్షణం రాజకీయ నాయకత్వాలకు ఉండాలి.
No comments:
Post a Comment