Sunday, May 14, 2017

తెలంగాణ‌ రాష్ట్ర సామాజిక, ఆర్థిక దృశ్యం –20 17: ప్రధానమైన‌ అంశాలు

తెలంగాణ వైశాల్యం: 1,62,970 చదరపు కి.మీ. వైశాల్యం రీత్యా దేశంలో 8వ పెద్ద రాష్ట్రం. 
అడవుల విస్తీర్ణం: 36,909.36 చ.కి.మీ.
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 3,50,03,674. పురుషులు 1,76,11,633, స్త్రీలు 1,73,92,041, పిల్లలు 38,99,166. దళితులు 54,08,800(15.45%), గిరిజనులు 31,77,940(9.08%)
*గ్రామీణులు 2,13,95,009
*పట్టణ జనాభా 1,36,08,665(38.88%). జాతీయ స్థాయి పట్టణ జనాభా సగటు 31.15%
*జనాభా వృద్ధి రేటు 13.58%, జాతీయ స్థాయిలో 17.69%
*జనసాంద్రత  312, జాతీయ స్థాయిలో 382
*స్త్రీ, పురుష నిష్పత్తి 988:1000, జాతీయ స్థాయిలో 943:1000
కుటుంబాల సంఖ్య: 83,03,612
స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తి(జి.యస్.డి.పి.): స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తి వృద్ధి రేటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ యొక్క ఆరోగ్యం, స్థితి గతులపై స్థూలమైన అవగాహన కల్పిస్తుంది. కేంద్ర గణాంకాల కార్యాలయం(సి.యస్.ఓ.) స్థిర ధరల ప్రామాణిక సంవత్సరాన్ని 2004-05 నుండి 2011-12కు మార్చడంతో పాటు స్థూల దేశీయోత్పత్తి(జి.డి,పి.) గణన విధానాన్ని కూడా మార్చింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ & స్టాటిస్టిక్స్ అధికారిక గణాంకాల మేరకు ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తి(జి.యస్.డి.పి.) 2015-16 ఆర్థిక సంవత్సరంలో రు.5.76 లక్షల కోట్లు, 2016-17 లో ముందస్తు అంచనాల ప్రకారం రు.6.54 లక్షల కోట్లు. వృద్ధి రేటు 13.7%. స్థిర ధరల్లో (2011-12) 2015-16లో రు.4,64,389 కోట్లు ఉంటే  2016-17లో ముందస్తు అంచనాల ప్రకారం రు.5,11,286 కోట్లు. దీని ప్రకారం వృద్ధి రేటు 10.1%.
దేశీయ స్థూల ఉత్ఫత్తి(జిడిపి)లో తెలంగాణ వాటా 2015-16లో 4.21% అయితే 2016-17లో 4.28%కు పెరిగింది. దేశీయ స్థూల ఉత్ఫత్తి 2015-16లో స్థిర ధరల ప్రకారం రు.1,13,57,529 కోట్లుగా ఉంటే 2016-17లో రు.1,21,65,481కోట్లకు పెరిగింది. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 2015-16లో 7.9% ఉంటే 2016-17లో 7.1% కు పడి పోయింది.
స్థూల జిల్లాల దేశీయ ఉత్ఫత్తి(జిడిడిపి): 2015-16లో హైదరాబాదు జిల్లా రు.1,36,388 కోట్లు. రంగారెడ్డి జిల్లా రు.82,359 కోట్లు. మేడ్చల్-మల్కాజ్ గిరి రు.47,604 కోట్లు. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, సంగారెడ్డి, ఈ నాలుగు జిల్లాల జిడిడిపి మొత్తం తెలంగాణ రాష్ట్ర జి.యస్.డి.పి.లో 52%గా ఉన్నది. దీన్ని బట్టి రాష్ట్ర రాజధాని చుట్టే ఆర్థిక కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉన్నాయన్న విషయం స్పష్టమవుతున్నది.
ఆర్థిక వనరుల వర్గీకరణ: ఆర్థిక వ్యవస్థను స్థూలంగా మూడు విభాగాలుగా వర్గీకరించుకొని విశ్లేషించుకోవడం జరుగుతున్నది. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలను ప్రాథమిక రంగంగాను, పారిశ్రామిక రంగాన్ని ద్వితీయ రంగంగాను, సేవా రంగాన్ని తృతీయ రంగంగాను పరిగణిస్తున్నారు. రంగాల వారిగా జి.యస్.డి.పి.లో వాటాను పరిశీలిస్తే ప్రాథమిక రంగం 18%, ద్వితీయ రంగం 19%, తృతీయ రంగం దాదాపు 63%. స్థూల రాష్ట్ర అదనపు విలువ(జి.ఎస్.వి.ఎ.) వృద్ధి రేటును పరిశీలిస్తే, ప్రస్తుత ధరల ప్రకారం 2016-17లో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల్లో 17.2%, పారిశ్రామిక రంగంలో 9.8%, సేవా రంగంలో 14.6% గా నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇదే కాలానికి సంబంధించి జాతీయ స్థాయిలో ముందస్తు అంచనాల మేరకు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో 9%, 8.7%, 11.9%గా ఉన్నది.
తలసరి ఆదాయం(పి.సి.పి.): ప్రజల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి సాధారణంగా తలసరి ఆదాయాన్ని మెరుగైన కొలబద్ధగా ప్రభుత్వాలు పరిగణిస్తున్నాయి. ప్రస్తుత ధరల్లో 2015-16లో రు.1,40,683 ఉంటే 2016-17లో ముందస్తు అంచనాల ప్రకారం రు.1,58,360 కు పెరిగి 12.6% వృద్ధిని తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది. జాతీయ స్థాయిలో రు.94,178 నుండి రు.1,03,818 లకు పెరిగి, వృద్ధి రేటు 10.2%గా నమోదయ్యింది. తలసరి ఆదాయంలో కూడా హైదరాబాదు రు.2,99,997, రంగారెడ్డి రు. 2,88,408, సంగారెడ్డి రు. 1,69,481, మేడ్చల్-మల్కాజ్ గిరి రు.1,62,327. 18 జిల్లాల్లో తలసరి ఆదాయం రు.1,00,000 లోపు ఉంటే 14 జిల్లాలలో జాతీయ తలసరి ఆదాయం కంటే తక్కువగా రు.94,178 ఉన్నది.
*నా వ్యాఖ్య: జనాభా సంఖ్యతో స్థూల దేశీయోత్ఫత్తి(జి.డి.పి.)ని విభజించి, తలసరి ఆదాయాన్ని లెక్కించే విధానం అమలులో ఉన్నది. ప్రజల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి, తలసరి ఆదాయాన్ని ప్రామాణికమైన కొలబద్ధగా పరిగణించడం అశాస్త్రీయమైనది.  మానవాభివృద్ధి నివేదికను ప్రామాణికంగా తీసుకొని, ప్రజల ఆర్థికాభివృద్ధిని, జీవన ప్రమాణాలను హేతుబద్ధంగా అంచనా వేస్తే శాస్త్రీయంగా ఉంటుంది. జి.డి.పి. పెరిగితే, ఉపాథి కల్పనావకాశాలు పెరుగుతాయన్న భావనకు కాలం చెల్లిపోయింది. గడచిన కొన్ని సంవత్సరాల అనుభవాలను విశ్లేషించుకొంటే జిడిపి పెరుగుదలకు, ఉపాథి కల్పనకు పొంతన లేదని స్పష్టమవుతున్నది.
ఉపాథి కల్పన: కార్మిక శాఖ ప్రచురించిన ఉపాథి - నిరుద్యోగ అధ్యయన నివేదిక(2015-16) ప్రకారం తెలంగాణలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలోనే అత్యధిక మంది కార్మికులు శ్రమిస్తున్నారు, అటుపై సేవా మరియు పారిశ్రామిక రంగాలలోఉపాథి పొందుతున్నారు.
*జి.యస్.డి.పి.లో వ్యవసాయ రంగం వాటా 2015-16లో 14.7% మాత్రమే అయినా 54% మంది ఉపాథి పొందుతున్నారు. 2013-14 గణాంకాలతో పోల్చి చూస్తే 2015-16 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో ఉపాథి పొందుతున్న వారి సంఖ్య‌ 1.8% తగ్గింది. ఆ మేరకు పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక మరియు సేవా రంగాల్లో ఉపాథి కల్పన పెరిగింది. 
*జి.యస్.డి.పి.లో 62% వాటా ఉన్న సేవా రంగంలో మొత్తంగా చూస్తే 28%, పట్టణ ప్రాంతాల వరకే పరిగణలోకి తీసుకొంటే 64% మందికి ఉపాథి కల్పిస్తూ అగ్రభాగాన నిలిచింది. 
కార్మిక జనాభా నిష్పత్తి: 15 సం.లకు పైబడిన వయస్సు ఉన్న కార్మిక శక్తి భాగస్వామ్య నిష్పత్తిని చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 63%, పట్టణ ప్రాంతాల్లో 49.1%, రాష్ట్రం మొత్తంగా 58.1%గా ఉన్నది.
నిరుద్యోగ నిష్పత్తి: గ్రామీణ ప్రాంతాల్లో 1.2%, పట్టణ ప్రాంతాల్లో 6.1%, రాష్ట్రం మొత్తంగా 2.7%గా 2015-16లో నమోదయ్యింది. జాతీయ స్థాయిలో 3.7% ఉన్నది.
ద్రవ్యోల్భణం: వినిమయ వస్తువుల ధరల సూచిక(పారిశ్రామిక కార్మికులు) గణాంకాలను పరిశీలిస్తే 2011-12 నుండి 2016-17 మధ్య కాలంలో క్రమేపీ తగ్గుముఖం పట్టింది. 2013-14లో 10.2% ఉన్న ద్రవ్యోల్భణం 2.23% తగ్గింది. జాతీయ స్థాయికి అనుగుణంగానే ఈ తగ్గుదల ఉన్నది.
దృక్పథం: సూక్ష్మ ఆర్థిక మూల సూత్రాల ఆధారంగా పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు, పన్ను వసూళ్ళు, ద్రవ్యోల్భణం మరియు ఉపాథి కల్పన అంశాలలో గతం కంటే శక్తివంతంగా ఉన్నది. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుండి జి.యస్.డి.పి. పెరుగుదల వైపు నడక ఉన్నది. 2016-17 ఆర్థిక సం.లో రెండంకెల వృద్ధి రేటుతో రాష్ట్ర సొంత పన్ను వనరుల ద్వారా సమకూరే ఆదాయం అధికమవుతుంది. గడచిన రెండేళ్ళుగా మిగులు రెవెన్యూ రాబడి ఉన్నకొన్ని రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా ఉన్నది.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణ: రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించడం జరిగింది. 1. హైదరాబాద్, 2. అదిలాబాద్, 3. భద్రాద్రి-కొత్తగూడెం, 4. జగిత్యాల్, 5. జనగాం, 6. జయశంకర్, 7. జోగులాంబ_గద్వాల్, 8. కామారెడ్డి, 9. కరీంనగర్, 10. ఖమ్మం, 11. కుమురం భీం, 12. మహబూబాబాద్, 13. మహబూబ్ నగర్, 14. మంచిర్యాల్, 15. మెదక్, 16. మేడ్చల్, 17. నాగర్ కర్నూల్, 18. నల్లగొండ, 19. నిర్మల్, 20. నిజామాబాద్, 21. పెద్దపల్లి, 22. రాజన్న సిరిసిల్ల, 23. రంగారెడ్డి, 24. సంగారెడ్డి, 25. సిద్దిపేట్, 26. సూర్యాపేట, 27. వికారాబాద్, 28. వనపర్తి, 29. వరంగల్ (రూరల్), 30. వరంగల్ (అర్బన్), 31. యాదాద్రి భువనగిరి.
* స్థానిక సంస్థలు: మొత్తం గ్రామ పంచాయితీల సంఖ్య 8,695. మండలాల సంఖ్య 584కు పెరిగింది.
భూమి: మొత్తం భూ విస్తీర్ణంలో నికర సాగు విస్తీర్ణం 2015-16లో 37.3%, అడవుల విస్తీర్ణం 22.7%, ప్రస్తుతం బీడుగా ఉన్న భూములు 5.4%, వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూమి దాదాపు 8%, వ్యవసాయానికి పనికిరాని భూమి 1.6%, శాశ్వత పచ్చిక బయళ్ళు, మైదానాలు 2.7%, పండ్ల తోటలు, చెట్లు, పొదలు ఉన్న భూమి 1%,  ప్రస్తుతం సాగులో లేని భూమి 14%, సాగులో లేని ఇతర భూములు 7.3%.

భూమి కమతాలు: సగటు భూమి కమతాల విస్తీర్ణం 2005-06లో 1.30 హెక్టార్లు ఉంటే 2010-11 నాటికి 1.12 హెక్టార్లకు తగ్గింది.
వర్షపాతం: సగటు వర్షపాతం 713.5 మి.మీ. లభించాల్సి ఉండగా 2016-17లో 912 మి.మీ. నమోదయ్యింది. 2015-16లో 611.2 మి.మీ. నైరుతీ రుతు పవనాల ద్వారా 28% అధికంగా వర్షపాతం నమోదయ్యింది.
సాగుదల: 2014-15 గణాంకాలను పరిశీలిస్తే బావుల మీద ఆధారపడిన సాగు దాదాపు 84%గా ఉంటే కాలువల ద్వారా 10%, చెరువుల క్రింద 4%గా ఉన్నది.
వ్యవసాయ రుణాలు: రాష్ట్ర ప్రభుత్వ రుణ ప్రణాళిక ప్రకారం 2016-17లో రు.90,776 కోట్లు. అందులో పంట రుణాల మంజూరు లక్ష్యం రు.29,101 కోట్లు. 2015-16లో పంట రుణాల మంజూరు లక్ష్యం రు.27,800 కోట్లకు గాను రు.23,400 కోట్లు మంజూరు చేశారు.
విద్యుత్తు రంగం: 2016 డిసెంబరు 31 నాటికి 5235.26  మెగా వాట్స్ విద్యుత్ ఉత్ఫాదనా సామర్థ్యం కలిగి ఉన్నది. ఇందులో థర్మల్ విద్యుత్తు 2882.5 మె.వా., జల విద్యుత్తు 2351.7 మె.వా., సోలార్ 1 మె.వా. ప్రస్తుతం 5,880 మె.వా. ఉత్పాదక సామర్థ్యంతో విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
*తలసరి విద్యుత్తు వినియోగం 2015-16లో 1439 యూనిట్స్ గా ఉన్నది. జాతీయ తలసరి విద్యుత్తు వినియోగం 2014-15లో 1,010 యూనిట్స్.
ప్రధానమైన ఆరోగ్య గణాంకాలు: ప్రసూతి మరణాల రేటు - MMR(లక్ష సజీవ జననాలకు)‍ 92 ఉంటే జాతీయ స్థాయిలో 167. శిశు మరణాల రేటు- IMR(1000 సజీవ జననాలకు) 28 ఉంటే జాతీయ స్థాయిలో 41. పురుషుల, స్త్రీల‌ నిష్పత్తి 1000:980 ఉంటే జాతీయ స్థాయిలో 1000:940. జననాల రేటు 18 ఉంటే జాతీయ స్థాయిలో 21.  మరణాల రేటు జాతీయ స్థాయితో సరిసమానంగా 6.7 ఉన్నది.
ప్రజారోగ్యం మౌలిక సదుపాయాలు: ఉప కేంద్రాలు 4797, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 876, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 107, ప్రాంతీయ ఆసుపత్రులు 31, జిల్లా ఆసుపత్రులు 7, డాక్టర్, రోగుల నిష్పత్తి 1:1700
అక్షరాస్యత: 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఏడు సంవత్సరాల వయసుకు పైబడ్డ జనాభా 3,11,04,508. పురుషులు 1,55,93,698, మహిళలు 1,55,10,810. వీరిలో అక్షరాస్యులు 2,06,96,778(66.5%). జాతీయ సగటు 72.9% కంటే తక్కువగా ఉన్నది. తెలంగాణలోని పట్టణాలలో 81% ఉంటే, గ్రామాలలో 57%గా ఉన్నది. పురుషుల్లో 75%, మహిళల్లో 57.9%గా ఉన్నది. షెడ్యూల్డ్ కులాలలో 58.9%, గిరిజనుల్లో 49.5% గా ఉన్నది.
*వయస్సు పరంగా వర్గీకరణ: 7 నుండి 24 సం.ల మధ్య వయస్సు ఉన్న వారిలో 88.56%. ఇది జాతీయ స్థాయి 86.98% కంటే ఎక్కువ. 18-24 సం.ల మధ్య వయస్సు ఉన్న పురుషుల్లో 90%, మహిళల్లో 79.5% అక్షరాస్యత ఉన్నది. ఇది జాతీయ స్థాయిలో ఉన్న 89.3%, 79.1% కంటే ఎక్కువ. జాతీయ స్థాయిలో 24 సం.ల దాటిన వయస్సు వాళ్ళ అక్షరాస్యత తెలంగాణ‌ కంటే ఎక్కువగా ఉంటే యువతలో 9% అధికంగా తెలంగాణలో ఉన్నది.
*హైదరాబాదు 83.25%తో జిల్లా అగ్రస్థానంలో ఉంటే, 49.87% తో జోగులాంభ - గద్వాల్ జిల్లా చివరి స్థానంలో ఉన్నది. మొత్తం 31 జిల్లాలలో 26 జిల్లాలు రాష్ట్ర సగటు అక్షరాస్యత కంటే తక్కువగా ఉన్నాయి. హైదరాబాదు 83.25%, మేడ్చల్ 82.49%, వరంగల్ అర్బన్ 76.17%, రంగారెడ్డి 71.95%, కరీంనగర్ 69.16% తో రాష్ట్ర సగటు కంటే పై స్థాయిలో ఉన్నాయి.
*2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యుల్లో 48.6% మంది మాధ్యమిక పాఠశాల విద్యకు లోపు, 17.9% విశ్వవిద్యాలయ విద్యకు లోపు, 1.6% సాంకేతిక డిప్లొమా విద్య, 0.3% సాంకేతికేతర డిప్లొమా విద్య, 21.9% డిగ్రీ మరియు ఆ పై విద్యార్హత, 0.9% వర్గీకరణ చేయని విద్య, 8.8% విద్యార్హతలు లేని అక్షరాస్యులు.
విద్యా రంగం: ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు 41,337 ఉన్నాయి. వాటిలో 70% ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలలు. 28% ప్రయివేటు పాఠశాలలు. కేంద్రీయ పాఠశాలలు 1%. ప్రభుత్వ ఆర్థిక సహాయంలేని(అన్ ఎయిడెడ్) పాఠశాలలు 2% ఉన్నాయి. హైదరాబాదులోనే 6,048 పాఠశాలలు ఉన్నాయి. జోగులాంభ -గద్వాల్ జిల్లాలో మాత్రమే 716 ఉన్నాయి.
మొత్తం పాఠశాలల సంఖ్యలో 70% గా ఉన్న ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలల్లో మొత్తం ఉపాధ్యాయుల సంఖ్యలో 55% మంది, 30% గా ఉన్న ప్రయివేటు పాఠశాలల్లో 45% మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి హేతుబద్ధంగా లేదని స్పష్టమవుతున్నది.
*విద్యార్థుల నమోదు: 2016-17 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు 60.63 లక్షల మంది. ఇందులో 52% పిల్లలు ప్రయివేటు పాఠశాలల్లోను, 45% ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలల్లో ప్రవేశాలు తీసుకొన్నారు. అన్ ఎయిడెడ్ పాఠశాలలో 2%, కేంద్రీయ పాఠశాలలో 1% గా ఉన్నది. ప్రీ - ప్రైమరి 1,33,740, I-V తరగతులు 31,08,997, VI-VIII తరగతులు 17,08,975, IX-X తరగతులు 10,48,814,  XI-XII తరగతులు 32,670, మొత్తం 60,33,196.
*6-10 మధ్య వయస్సు పిల్లల్లో 102.48%, 11-13 వయస్సు వారిలో 90.34%, 14-15 వయస్సు వారిలో 80.2% నమోదయ్యారు.
*చదువును అర్థాంతరంగా మానేస్తున్న పిల్లలు: I – V తరగతుల మధ్య‌ బడి మానేసే పిల్లల సంఖ్య‌ 2014-15లో 37.56% గా ఉంటే 2016-17 నాటికి 34.70% కు తగ్గింది. ప్రీ _ ప్రైమరి 1,33,740, I-V తరగతులు 31,08,997, VI-VIII తరగతులు 17,08,975 IX-X తరగతులు 10,48,814,  XI-XII తరగతులు 32,670, మొత్తం 60,33,196.
I – V అబ్బాయిలు 16.30%, అమ్మాయిలు15.70%, మొత్తం 16%, VI-VIII తరగతులు అబ్బాయిలు 30.61%, అమ్మాయిలు 29.24%, మొత్తం 29.95%,  IX-X తరగతులు అబ్బాయిలు 35.50%, అమ్మాయిలు 33.84%, మొత్తం 34.7%.
ఇంటర్ మీడియేట్ విద్య: రాష్ట్రంలో ఇంటర్ మీడియేట్ మరియు హైయర్ సెకండరీ విద్యా సంస్థులు 2,537 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 404, ప్రయివేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 41, ప్రయివేటు జూనియర్ కళాశాలలు 2,092 ఉన్నాయి. రెండు సంవత్సరాల విద్యార్థుల సంఖ్య 6.9 లక్షల మంది ఉన్నారు.
ఉన్నత విద్య: 4.26 లక్షల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించ గల సామర్థ్యంతో 1,196 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 130 ప్రభుత్వ కళాశాలలు, 69 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 84,068, ఎయిడెడ్ కళాశాలలు 59,338 మందికి ప్రవేశం కల్పించబడింది.
విద్యార్థి వసతి గృహాలు: షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, వెనుకబడిన కులాలు మరియు ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల పిల్లలు నిర్విఘ్నంగా విద్యార్జనను కొనసాగించడానికి వీలుగా ప్రీ-మెట్రిక్ విద్యార్థులకు ఎస్.సి.లకు 734, ఎస్.టి. లకు 170, బి.సి.లకు 454, మొత్త‍ం 1,358 వసతి గృహాలను నిర్వహిస్తున్నది. వీటిలో 2016-17 సం.లో 1,34,161 విద్యార్థులకు ప్రవేశం కల్పించబడింది. వారిలో ఎస్.సి. 59,928, ఎస్.టి. 30,882, బి.సి. 43,351 విద్యార్థులు ఉన్నారు.
కళాశాల విద్యార్థులకు సంబంధించి 153 గిరిజన, 169 ఎస్.సి., 246 బి.సి., మొత్తం 559 వసతి గృహాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. వీటిలో 18377 ఎస్.టి., 19077 ఎస్.సి., 24517 బి.సి. విద్యార్థులు 2016-17లో ప్రవేశం కలిగి ఉన్నారు. Vవ‌ తరగతి నుండి ఇంటర్ మీడియేట్ వరకు 'రెసిడెన్షియల్' విద్యా సంస్థలను ఎస్.సి.ల కోసం 267, ఎస్.టి.ల కోసం 145 నిర్వహిస్తున్నారు. వీటిలో 34,176 మంది విద్యార్థులున్నారు. 2016 మార్చిలో జరిగిన ఎస్.ఎస్.సి. పరీక్షల్లో 81%, ఇంటర్ మీడియేటులో 86% ఉత్తీర్ణులైనారు. బి.సి. విద్యార్థులకు 37 'రెసిడెన్షియల్' విద్యా సంస్థలను నెలకొల్పి, 11,720 మందికి ప్రవేశం కల్పించబడింది.
కార్మిక శక్తి: మొత్తం కార్మికులు 1,63,41,942, వ్యవసాయదారులు 31,51,389, మెయిన్ కార్మికులు 1,37,19,879, వ్యవసాయ కార్మికులు 59,15,151, మార్జినల్ వర్కర్స్ 26,22,063, కుటీర పరిశ్రమల్లో పని చేసే కార్మికులు 7,76,529, నాన్ వర్కర్స్ 1,86,61,732, ఇతర కార్మికులు 64,98,873.
గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు:
*వ్యక్తిగత మరుగు దొడ్లు 16,63,839                                                                                         *రక్షిత త్రాగు నీటి వనరులు 1,85,147
*విద్యుత్తు(ఇంటి కనెక్షన్స్) 95,04,305
*వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్స్ 20,80,706
*ప్రాథమిక పాఠశాలలు 21,948
*మాధ్యమిక పాఠశాలలు 7,189
*ఉన్నత పాఠశాలలు 11,333
*కళాశాలలు 4,655
*ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 683
*ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు: 4,797
*అంగన్ వాడి కేంద్రాలు: 35,700
*స్వయం సహాయ బృందాలు: 4,26,705
*సమాచార వ్యవస్థ: ఫోస్టాపీసులు 5,835. టెలిఫోన్ కనెక్షన్స్ 5,10,070
*రహదారులు: కంకర్రాళ్ళతో వేసిన‌ రోడ్డులు 16,343 కి.మీ., మట్టి రోడ్డులు18,235 కి.మీ.
*రవాణా సదుపాయాలు: ఆర్.టి.సి. బస్సులు 10,482
*బ్యాంకింగ్ వ్యవస్థ: బ్యాంకు బ్రాంచీలు 5,332
సామాజిక భద్రత పింఛను పథకం(ఆసరా): వృద్ధులకు 13,23,764, వికలాంగులకు 4,55,835, వితంతువులకు 13,32,919, చేనేత కార్మికులకు 34,138, గీత కార్మికులకు 57,434, బీడి కార్మికులకు 3,47,581 ప్రభుత్వం ఇస్తున్నది.
ప్రజా పంపిణీ వ్యవస్థ: చౌక దుకాణాలు 17,159, రేషన్ కార్డులు 79,72,968, అంత్యోదయ ఆహార భద్రత కార్డులు 5,55,823, అన్నపూర్ణ కార్డులు 5,040 ఉన్నాయి.


టి.లక్ష్మీనారాయణ‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ సామాజిక, ఆర్థిక అధ్యయన నివేదిక 2016 – 17: ముఖ్యమైన అంశాలు


  1. ఆంధ్రప్రదేశ్ వైశాల్యం: 1,62,970 చదరపు కి.మీ. వైశాల్యం రీత్యా దేశంలో 8వ‌ పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.         
  2. సముద్ర తీరం: 974 కి.మీ. తో దేశంలోని సముద్ర తీర రాష్ట్రాలలో రెండవ పెద్ద రాష్ట్రం. 
  3. అడవుల విస్తీర్ణం: 36,909.36 చ.కి.మీ. 
  4. జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం10% జనాభాతో దేశంలో పదవ స్థానంలో ఉన్నది. జనాభా వృద్ధి రేటు 1961-71 దశాబ్ధంలో 18.88%, 1981-91లో 21.13%, 2001-11 దశకానికి గణనీయంగా 9.21%కి తగ్గింది. ఇది దేశ జనాభా వృద్ధి రేటు 17.72% కంటే చాలా తక్కువ. 2011 జనాభా గణాంకాల మేరకు దేశంలో చ.కి.మీ.కు జన సాంద్రత సగటున‌ 382 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 304. స్త్రీ, పురుష నిష్పత్తి 2001లో 983 ఉంటే 2011 నాటికి 997కు పెరిగింది. జాతీయ స్థాయిలో 943 మాత్రమే. రాష్ట్రంలో పట్టణ జనాభా 24.13 శాతం నుంచి 29.47 శాతానికి (2001 నుంచి 2011లో) పెరిగింది. అయితే జాతీయసగటు 31.14 శాతంతో పోలిస్తే మాత్రం తక్కువే. అత్యధికంగా పట్టణ జనాభా విశాఖపట్నం జిల్లాలో 47.45 శాతం, కృష్ణా జిల్లాలో 40.81 శాతం ఉంది. 
  5. స్త్రీ, పురుష నిష్పత్తి: రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు. జాతీయస్థాయిలో ఈ సగటు 943 మాత్రమే. లింగ నిష్పత్తి రాష్ట్రంలో 2001లో వెయ్యి మంది పురుషులకు 943 ఉండగా 2011 నాటికి 997కు పెరిగింది. విజయనగరం జిల్లాలో వెయ్యి మంది పురుషులకు 1,019 మంది మహిళలు, శ్రీకాకుళం జిల్లాలో 1,015 మంది మహిళలు ఉన్నారు. ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో కూడా పురుషుల కంటే మహిళల సంఖ్యే అధికం. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 977 మంది మహిళలున్నారు. 
  6. అక్షరాస్యత: 2001లో07% అక్షరాస్యత నమోదైతే 2011 నాటికి 67.35% కు పెరిగింది. కానీ, జాతీయ స్థాయి అక్షరాస్యత 72.98% కంటే వెనుకబడి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో స్త్రీల అక్షరాస్యత 2001లో 52.72% ఉంటే 2011 నాటికి 59.96% కి పెరిగింది. అక్షరాస్యత రేటు దళితుల్లో 64.47%, గిరిజనుల్లో 48.83% ఉంది. జిల్లాల వారీగా చూస్తే సగటు అక్షరాస్యతలో పశ్చిమగోదావరి జిల్లా 74.32% తో అగ్రస్థానంలో ఉంది. అత్యల్పంగా విజయనగరం జిల్లా 58.89%. 
  7. భూమి: మొత్తం భూ విస్తీర్ణంలో నికర సాగు విస్తీర్ణం08 (38.09%) లక్షల హెక్టార్లు, అడవుల విస్తీర్ణం 36.88 (22.63%) ల.హె., ప్రస్తుతం బీడుగా ఉన్న భూములు 14.10 (8.65%) ల.హె., వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న‌ భూమి 20.32 (12.47%) ల.హె., వ్యవసాయానికి పనికిరాని పడావు భూమి 13.47(8.27 %) ల.హె., శాశ్వత పచ్చిక బయళ్ళు, మైదానాలు 12.43(7.63%) ల.హె., పండ్ల తోటలు, చెట్లు, పొదలు ఉన్న భూమి 3.69(2.26%) ల.హె. 
  8. స్థూల రాష్ట్ర దేశీయ‌ ఉత్ఫత్తి: కేంద్ర గణాంకాల కార్యాలయం(సి.యస్.ఓ.) స్థిర ధరల బేస్ సంవత్సరాన్ని 2004-05 నుండి 2011-12కు మార్చడంతో పాటు విధానాన్ని కూడా మార్చింది. ప్రస్తుత ధరల్లో ప్రకారం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తి(జి.యస్.డి.పి.) 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొదటి సవరించిన అంచనాల ప్రకారం రు.6,09,934 కోట్లు, ముందస్తు అంచనాల ప్రకారం 2016-17 లో రు.6,99,307 కోట్లు. స్థిర ధరల్లో (2011-12) 2015-16లో రు.4,90,134 ఉంటే ముందస్తు అంచనాల ప్రకారం 2016-17లో రు.5,47,021 కోట్లు. దీని ప్రకారం ఆర్థిక వృద్ధి రేటు 11.61% గా ఉన్నది. దేశీయ స్థూల ఉత్ఫత్తి(జిడిపి) 2016-17లో 7.1% మాత్రమే. వృద్ధి రేటును రంగాల వారిగా చూస్తే, వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల్లో 14.03%, పారిశ్రామిక రంగంలో 10.05%, సేవా రంగంలో 10.16% గా ఉన్నది. తలసరి ఆదాయం(ఎన్.ఎస్.డి.పి.) ప్రస్తుత ధరల్లో 2015-16లో రు.1,08,163 ఉంటే 2016-17లో ముందస్తు అంచనా ప్రకారం రు.1,22,376 కు పెరిగి 13.14% వృద్ధిని నమోదు చేసింది. 
  9. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం: 2015-16 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల ద్వారా రాబడి రు.39,922 కోట్లు, సొంత పన్నేతర మార్గాలలో రాబడి రు.4,920 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఆర్థిక వనరులు రు.45,249 కోట్లు. సొంత పన్నేతర మార్గాలలో రాబడి ప్రధానంగా గనులు మరియు ఖనిజాలు(25%), అడవులు (20%), విద్య మరియు ఇతర ఆదాయ మార్గాలు(21%). కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక వనరులు సవరించిన అంచనాల ప్రకారం 2016-17లో రు.54,011 కోట్లు. వీటిలో ఆర్థిక సంఘం కేటాయించిన నిథులే అత్యధికం. 2015-16లో రు.30,078 కోట్లు, సవరించిన అంచనాల ప్రకారం 2016-17లో రు.33,630 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ వ్యయం 2015-16లో రు.1,10,510 కోట్లు. 2016-17లో సవరించిన అంచనాల మేరకు రు.1,26,871కోట్లు. రెవెన్యూ పద్దు క్రింద వ్యయం 2015-16లో రు.95,950 కోట్లు, మూలధనం వ్యయం పద్దు క్రింద ఖర్చు చేసింది రు.14,172. 2016-17లో సవరించిన అంచనాల ప్రకారం రు.1,12,306 కోట్లు. 
  10. రెవెన్యూ మరియు ద్రవ్య లోటు: 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రు.7,302 కోట్ల రెవెన్యూ లోటు, రు.21,863 కోట్లు ద్రవ్య లోటు ఉన్నది. ఆర్థిక క్రమ శిక్షణ మరియు నిర్వహణ పర్యవసానంగా 2016-17 సవరించిన అంచనాల మేరకు రెవెన్యూ లోటు రు.4,598 కోట్లకు, ద్రవ్య లోటు రు.19,163 కోట్లకు తగ్గింది.                                                                                                                           * గమనిక: 2017-18 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు కేవలం రు.416 కోట్లు, ద్రవ్య లోటు రు,23,054 కోట్లుగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖామాత్యులు యనమల రామకృష్ణ గారు శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 
  11. అప్పులు మరియు వడ్డీల చెల్లింపు: 2015-16 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రాష్ట్ర రుణ భారం రు.1,73,854 కోట్లు. 2016-17 ఆఖరుకు సవరించిన అంచనాల ప్రకారం రు.1,92,984 కోట్లు. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంకా పంపిణీ చేయని రుణాల మొత్తం రు.33,478 కోట్లు కూడా కలిసి ఉన్నది. 2015-16లో రు.9,848 కోట్లు వడ్డీల పద్దు క్రింద చెల్లిస్తే, 2016-17లో సవరించిన అంచనాల మేరకు రు.12,208 కోట్లు చెల్లించడం జరిగింది. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తిలో అప్పులు 2015-16లో 28.50% గా ఉంటే 2016-17లో సవరించిన అంచనాల ప్రకారం 27.60% కు తగ్గాయి. దీనికి జి.యస్.డి.పి. వృద్ధి కారణంగా చెప్పబడింది. రాష్ట్ర రుణ భారంలో కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకొన్నవి 5%, మార్కెట్ ద్వారా సమీకరించుకొన్నవి 59%, చిన్న పొదుపు పథకాల నుండి సేకరించుకొన్నవి 8%, ప్రావిడెంట్ ఫండ్ ద్వారా 9%, ఇతర రుణాలు 19% గా ఉన్నాయి.                                                       * గమనిక: 2017-18 ఆర్థిక సంవత్సరం ఆఖరుకు రు.2,16,027 కోట్లకు రుణ భారం చేరుకొంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖామాత్యులు యనమల రామకృష్ణ గారు శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 
  12. ర్షపాతం: నైరుతీ రుతుపవనాల ద్వారా సగటు వర్షపాతం 556 మి.మీ. లభించాల్సి ఉండగా 2016-17లో 534 మి.మీ. నమోదయ్యింది. ఈశాన్య ఋతుపవనాల ద్వారా 296 మి.మీ. సగటు వర్షపాతానికి గాను కేవలం 85 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. ఏడాది మొత్తంగా చూస్తే దాదాపు 28% లోటు వర్షపాతం నమోదయ్యింది. 
  13. భూగర్భ జలాలు: భూగర్భ జలాల లభ్యతను అంచనా వేయడానికి రాష్ట్రం మొత్తాన్ని 748 వాటర్ షేడ్స్ గా విభజించారు. భూగర్భ జలాలపై ఆధారపడిన సాగు భూమి స్థూలంగా 16.43 లక్షల హెక్టార్లు. అందులో 15.09 లక్షల హెక్టార్లు బోరు బావులపై ఆధారపడిన సాగు భూమి. 2015-16లో నికరం సాగైన భూమి 11.93 లక్షల హెక్టార్లు. భూగర్భ జలాల మట్టాన్ని అంచనా వేయడానికి 1,254 ఫీజోమీటర్స్ పని చేస్తున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో 0.22 మీటర్ల మేరకు భూగర్భ జలాల నీటి మట్టం పెరిగితే, రాయలసీమ ప్రాంతంలో 3.94 మీటర్ల మేరకు భూగర్భ జలాల నీటి మట్టం తగ్గి పోయింది. నీటి సంరక్షణ మరియు నిర్వహణ లక్ష్యంగా నీరు-చెట్టు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. కరవు నివారణా పథకాల రూపకల్పనకు కృషి చేస్తున్నది.
  14. సాగు నీటి రంగం: కృష్ణా నదీ జలాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512.040 టియంసిలను వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించడంతో పాటు మిగులు జలాలను వాడుకొనే స్వేచ్ఛ కల్పిస్తూ కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్(బచావత్ ట్రిబ్యునల్) తీర్పు ఇచ్చింది. కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా తెలుగు గంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి, వెలుగొండ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. గోదావరి నదీ జలాలకు సంబంధించి 308.703 టియంసిలు వినియోగించు కోబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏడు ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో 2017-18 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి పూనుకొన్నది. అవి: 1.పట్టిసీమ ఎత్తిపోతల పథకం, 2. తోటపల్లి ఆనకట్ట, 3.హంద్రీ-నీవా సుజల స్రవంతి, 4. గాలేరు-నగరి సుజల స్రవంతి – మొదటి దశ‌, 5.బి.ఆర్.ఆర్. వంశధార(రెండవ దశ-రెండవ విభాగం), 6. పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, 7. గుండ్లకమ్మ జలాశయం. వీటిలో పట్టిసీమ, తోటపల్లి, గుండ్లకమ్మ ప్రాజెక్టులను, పోలవరం కుడి కాలువ నిర్మాణం పూర్తి అయ్యింది.                                                        చిన్ననీటి పారుదల రంగం: 40,817 చెరువుల క్రింద 25.60 క్షల ఎకరాల భూమి సాగవుతున్నది.
  15. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు: 2015-16లో 41.36 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల ఉత్ఫత్తికి సాగు చేస్తే, 2016-17లో 41.34 ల.హె. లలో సాగు చేయబడింది. అయినా 2015-16లో 143.78 లక్షల టన్నుల ఉత్ఫత్తి జరిగితే, 2016-17లో 156.85 లక్షల టన్నుల ఉత్ఫత్తి జరిగింది. లోటు వర్షపాతం, సాగు భూమి విస్తీర్ణం తగ్గినా ఆహార ధాన్యాల ఉత్ఫత్తిలో 9.09% వృద్ధి ఉన్నది.
  16. భూమి కమతాలు: సగటు భూమి కమతాల విస్తీర్ణం 2005-06లో 1.13 హెక్టార్లు ఉంటే 2010-11 నాటికి 1.06 హెక్టార్లకు తగ్గింది. కమతాల సంఖ్య 72.16 లక్షల నుండి 76.21 లక్షలకు పెరిగింది.
  17. వ్యవసాయ రుణాలు: రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2015-16లో వ్యవసాయ రుణాలు రు.65,272 కోట్లకు గాను రు.75,448(116%) కోట్లు మంజూరు చేస్తే, 2016-17లో మంజూరు రు.83,003 కోట్లకు గాను 2016 సెప్టంబరు నాటికి రు.43,125.44 కోట్లు(51.96%) విడుదల చేశారు. 2015-16లో 5,00,275 కౌలు రైతులకు రుణ అర్హత కార్డులలను రెవెన్యూ శాఖ‌ జారీ చేసినా కేవలం 1,00,431 మందికి రు.243.41 కోట్లు విడుదల చేశారు. 2016-17లో 5,90,708 కార్డులు జారీ చేసి, వారిలో 71,940 మందికి రు.182.12 కోట్లు మంజూరు చేశారు.
  18. వాణిజ్యం మరియు ఎగుమతులు: 2016-17 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం(ఏప్రిల్ నుండి సెప్టంబరు)లో ఎగుమతులు రు.29,629.65 కోట్లు. ఎగుమతుల్లో ప్రధానమైనవి, మందులు, సముద్ర ఉత్ఫత్తులు, వ్యవసాయోత్ఫత్తులు, వ్యవసాయాధార ఉత్ఫత్తులు, కుటీర పరిశ్రమలు మరియు చేతి వృత్తుల‌ ఉత్ఫత్తులు, ఖనిజాలు మరియు ఖనిజ ఉత్ఫత్తులు, సాప్ట్ వేర్ ఉత్ఫత్తులు ఉన్నాయి.
  19. విద్యుత్తు రంగం: 13,885.38 మెగా వాట్స్ విద్యుత్ ఉత్ఫాదనా సామర్థ్యం కలిగి ఉన్నది. తలసరి విద్యుత్తు వినియోగం 987 యూనిట్స్ గా ఉన్నది. 2014 జూన్ నాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఉంటే ఆ పరిస్థితిని అదిగమించి, విద్యుత్తు మిగులు రాష్ట్రంగా ముందడుగు వేసి, గృహ వినియోగదారులందరికీ 24 x 7 ప్రాతిపదికన‌ నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం జరుగుతున్నది. 2016-17లో 50,000 వ్యవసాయ పంప్ సెట్లకు కొత్తగా కనెక్ష‌న్స్ మంజూరు చేయాలనే లక్ష్యం నిర్ధేశించుకొని, 2016 డిసెంబరు 31 నాటికి 46,295 కనెక్షన్స్ విడుదల చేయడం జరిగింది. 2016 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలో మొత్తం 16.28 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. విద్యుత్తు నిర్వహణా సామర్థ్యం మరియు సాంప్రదాయేతర ఇంధన పరిష్కారాలకు సంబంధించి ఐదు దఫాలు జాతీయ అవార్డులను రాష్ట్రం సాధించుకొన్నది.
  20. రహదారులు: 2016 మార్చి 31 నాటికి 47,002 కి.మీ. రహదార్ల వ్యవస్థ ఉన్నది. ఇందులో 15,406 కి.మీ. రాష్ట్ర రహదార్లు, 26,038 కి.మీ. పెద్ద తరహా జిల్లా రహదార్లు, 5,558 కి.మీ. గ్రామీణ రహదార్లు ఉన్నాయి. 5,293.43 కి.మీ. మేరకు 26 జాతీయ రహదార్లు రాష్ట్రంలో ఉన్నాయి. జాతీయ స్థాయిలో సగటున 1,000 చ.కి.మీ. కు 30.45 కి.మీ. ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 32.82 కి.మీ. రహదార్లు ఉన్నాయి.
  21. రవాణా రంగం: 2016 డిసెంబరు 1 నాటికి రాష్ట్రంలో రవాణా శాఖ వద్ద‌ రిజిస్టరయిన వాహనాల సంఖ్య‌ 95.36 లక్షల.
  22. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ రోడ్డు రవాణా సంస్థ: ఎ.పి.యస్.ఆర్.టి.సి. నాలుగు జోన్లు, 12 రీజియన్స్ గా విభజించబడి,127 డిపోలు, 11,962 బస్సులతో నిర్వహించబడుతున్నది. 2016 అక్టోబరు నాటికి 57,651 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కొక్క బస్సు , దినసరి సగటు ఉత్ఫాదకత 378 కి.మీ.గా ఉన్నది. టైర్లు మరియు ఇంధన వినియోగ సామర్థ్యం, ఉత్ఫాదకతకు సంబంధించి సంస్థ జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతిని సంపాదించుకొని, వాహనాల వినియోగ సామర్థ్యం, వనరుల వినియోగం, ప్రయాణికుల రవాణా, సమర్థవంతంగా ఇంధన వినియోగం, బస్సుల ‘బ్రేక్ డౌన్’ మరియు ప్రమాదాల నిష్పత్తి ప్రాతిపదికగా మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఎ.పి.యస్.ఆర్.టి.సి. ప్రథమ స్థానంలో నిలిచింది.
  23. విమానాశ్రయాలు: విజయవాడ, తిరుపతి, కడప, రాజమహేంద్రవరం విమానాశ్రయాల స్థాయి పెంపుదలకు, ఆధునీకీకరణకు రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వ‌ విమానయాన స‍ంస్థతోఒప్పందాలు కుదుర్చుకొన్నది. విమానయాన రవాణా సదుపాయాలను విస్తరించడానికి, అనుసంధానం చేయడానికి, మెరుగు పరచడానికి, అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు లలో ప్రాంతీయ విమానాశ్రయాలను నెలకొల్పాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
  24. ఓడ రేవులు: 974 కి.మీ. సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ఓడ రేవు దేశంలోని పెద్ద ఓడ రేవుల్లో ఒకటి. భారత ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహించబడుతున్నది. మరో 14 నోటిపైడ్ ఓడ రేవులు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. వాటిలో నాలుగు కాప్టివ్ పోర్ట్స్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దుర్గరాజమట్నం వద్ద మరొక ఓడ రేవుకు ప్రతిపాదన ఉన్నది. కాకినాడ సెజ్ ను చిన్న ఓడ రేవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కాప్టివ్ పోర్ట్ ద్వారా సెజ్ కు సంబంధించిన సరుకు రవాణా కార్యకలాపాలన్నీ నిర్వహించబడతాయి.
  25. పర్యాటకం: రాష్ట్రం పలు పవిత్ర పుణ్య క్షేత్రాలకు, ఆకర్షణీయ మరియు ఆహ్లాదకరమైన‌ ప్రాంతాలకు, మ్యూజియమ్స్, బీచ్ లు, ఓడ రేవులు, నదులు, హిల్ స్టేషన్స్ తదితర పర్యాటక స్థలాలు, కేంద్రాలకు నెలవుగా ఉన్నది. 300 లకు పైగా పర్యాటక స్థలాలున్నాయి. పట్టిసీమ, పాపికొండల మధ్య గోదావరి నదిలో పడవ ప్రయాణం అత్యంత పాచుర్యం పొందినది. ప్రతి సంవత్సరం 75 లక్షలకుపైగా పర్యాటకులు సందర్శిస్తుంటారు. పర్యాటక రంగం అభివృద్ధికి కృషి జరుగుతున్నది.
  26. పాఠశాల విద్య: మొత్తం నమోదైన విద్యార్థుల సంఖ్య 68.47 లక్షలు. వారిలో I-V తరగతులలో 34.76, VI-VIII తరగతులలో 20.85, IX-X 12.87 తరగతుల విద్యార్థులు. 2016-17 విద్యా సంవత్సరంలో మధ్యలో మానేసిన వారి సంఖ్య I-V (ప్రాథమిక) 9.68%, I-VIII (మాధ్యమిక) 12.77%  , I-X (ఉన్నత పాఠశాల) 20.67%. 2015-16లో ఎస్.ఎస్.సి. విద్యార్థుల ఉత్తీర్ణత 94.53%. విద్యార్థులకు ఒక పూట‌ పోషకాహారాన్ని ఇవ్వడం, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు అయ్యేలా ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు I-VIII  విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని 60:40 నిష్పత్తిలో నిథులను సమకూర్చి అమలు చేస్తున్నాయి. IX-X తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 100% నిథులతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం క్రింద 2016-17లో 36.66 లక్షల మంది ప్రాథమిక స్థాయి విద్యార్థులు(యన్.సి.యల్.పి. పాఠశాలల విద్యార్థులతో కలిపి), 11.15 లక్షల మంది మాధ్యమిక, 7.24 లక్షల మంది ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రయోజనం వనగూడింది.                                             * కేంద్ర ప్రభుత్వం 163 ఆదర్శ పాఠశాలలను మంజూరు చేయగా, ప్రస్తుతం 160 పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. వీటిలో VIవ‌ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్య వరకు విద్యాబోధన జరుగుతుంది. తరగతికి 80 మంది చొప్పున విద్యార్థినీ, విద్యార్థులకు ప్రవేశం కల్పించబడుతుంది. విద్యా పరంగా వెనుకబడిన మండలాలలో నిర్వహించబడుతున్న ఈ తరహా ఆంగ్ల మాధ్యమం పాఠశాలలలో 2016-17 విద్యా సంవత్సరంలో 70,540 మంది విద్యార్థులు విద్యనార్జించారు. 2015-16లో ఆదర్శ పాఠశాలల ఎస్.ఎస్.సి. విద్యార్థుల ఉత్తీర్ణత 96.84%. కడప జిల్లా రాయచోటి ఆదర్శ పాఠశాల 10/10 జిపిఎ సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణత 74.91%. సర్వ శిక్షా అబియాన్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించబడుతున్న 352 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ను నెలకొల్పడం జరిగింది.                                                                                   * ఇంటర్మీడియట్ విద్య: రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ బోర్డు నిర్వహణ క్రింది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 447, వృత్తి విద్యా బోధనా జూనియర్ కళాశాలలు 8 ఉన్నాయి. ప్రయివేటు యాజమాన్యంలో 1,749 జూనియర్ కళాశాలలు ఉన్నాయి.                                                                                         ఉన్నత విద్య: రాష్ట్రంలో 146 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఓరియంటల్ కళాశాల. ప్రయివేట్ ఎయిడెడ్ కళాశాలలు 141. వాటిలో 15 ఓరియంటల్ కళాశాలలు. మొత్తం విద్యార్థుల సంఖ్య 2,06,705.     * సాంకేతిక‌ విద్య: రాష్ట్రంలో డిప్లొమా మరియు డిగ్రీ స్థాయి వృత్తి విద్యా సంస్థలు 1,360 ఉన్నాయి. వాటిలో 3,21,003 మంది విద్యార్థులకు ప్రవేశం అవకాశం ఉన్నది. 87,681 మంది విద్యార్థులకు ప్రవేశ అవకాశం ఉన్న‌313 పాలిటెక్నిక్స్, 1,080 మందికి ప్రవేశ అవకాశం ఉన్న 18 డి.పార్మసీ విద్యా సంస్థలు ఉన్నాయి. పాలిటెక్నిక్స్ లో సాంకేతిక, పారిశ్రామిక‌ నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో 41 కేంద్రాలను నెలకొల్పబడ్డాయి. విశాఖపట్నంలో ఐఐయం, చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పరిథిలో ఐఐటి, ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్., ఐఐఐటి(శ్రీసిటీ), తాడేపల్లిగూడెంలో నిట్, కర్నూలులో ఐఐఐటి సంస్థలు 2015-16లో నెలకొల్పబడ్డాయి. 2016-17లో జాతీయ స్థాయి విద్యా సంస్థలైన గిరిజన విశ్వ విద్యాలయాన్ని విజయనగరం జిల్లాలోను, కేంద్ర విశ్వ విద్యాలయాన్ని అనంతపురం జిల్లాలో నెలకొల్పబోతున్నారు.
  27. కుటుంబ సంక్షేమం: రాష్ట్రంలో 7,659 ఉప కేంద్రాలు, 1,156 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 193 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, 31 ప్రాంతీయ ఆసుపత్రులు, 8 జిల్లా ఆసుపత్రులు, 3 తల్లీ & పిల్లల ఆరోగ్య కేంద్రాలు, 11 బోధనాసుపత్రులు ఉన్నాయి. ఇవి కాకుండా 73 పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రాలు, 48 పోస్ట్ మార్టమ్ యూనిట్స్, 222 ఇ‍-ప్రాథమిక వైద్య కేంద్రాలు, 21 గిరిజన ఆసుపత్రులు రాష్ట్ర పరిథిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నిర్వహణలో 116 ఆసుపత్రులు, 26 బ్లడ్ బ్యాంక్స్, 38 రక్తం నిల్వ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. 1,563 మంది వైద్యులు, 2,022 మంది నర్సులు, 1,149 మంది పారా మెడికల్ సిబ్బంది, 386 మంది పరిపాలనా సిబ్బంది పని చేస్తున్నారు.
  28. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం: ఈ శాఖ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల సంక్షేమం, అవసరాలు తీర్చడానికి పిల్లల కోసం 46, మహిళల కోసం 21 సంస్థలు నిర్వహించబడుతున్నాయి. అంగన్ వాడి కేంద్రాలలో దాదాపు 9.07 లక్షల మంది పిల్లలు ప్రీ స్కూల్ విద్యా శిక్షణ పొందుతున్నారు. 2,571 ఐసిడియస్ పథకాలు అమలులో ఉన్నాయి. 2016-17(సెప్తంబరు 2016 వరకు)లో పోషకాహార పథకం ద్వారా 31.87 లక్షల మంది ప్రయోజనం పొందారు.
  29. వికలాంగుల సంక్షేమం: తూర్పు గోదావరి, విజయనగరం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలలో వికలాంగుల పునరావాస కేంద్రాలను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖపట్నంలో వికలాంగుల క్రీడల కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ద్వారా నెలకొల్పడానికి అనుమతి ఇచ్చింది.
  30. వెనుకబడిన కులాల సంక్షేమం: రాష్ట్రంలో 897(692 బాయిస్ హాస్టల్స్, 205 విద్యార్థినులకు) ప్రభుత్వ బి.సి. వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి. వీటిలో 2016-17లో 96,997 మంది విద్యార్థులను చేర్చుకోవడం జరిగింది. 32 బి.సి.రెసిడెన్సియల్ పాఠశాలలు(17 అబ్బాయిలకు, 15 అమ్మాయిలకు) ఉన్నాయి. వీటిలో 2016-17లో 12,292 మందికి ప్రవేశం కల్పించబడింది. 2015-16లో ఎస్.ఎస్.సి. విద్యార్థుల రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 94.77% ఉంటే బి.సి.వసతి గృహాల్లోని విద్యార్థుల ఉత్తీర్ణత 96.75%. రాష్ట్రంలో 11,960 ప్రాథమిక సహకార సంస్థలను పది సమాఖ్యలలో నమోదు చేయడం జరిగింది.
  31. సాంఘిక సంక్షేమం: 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో దళితుల జనాభా 17.08%. వీరిలో 79.98% మంది గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తున్నారు. పాఠశాలలో యస్.సి. పిల్లల నమోదు 82.29%. వీరిలో 39.64% మంది మధ్యలో మానేస్తున్నారు. 958 వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి. 2016-17లో వాటిలో 89,840 మంది విద్యార్థులు ప్రవేశం పొందడానికి అవకాశమున్నది. 566 ప్రత్యేక వసతి గృహాలు మరియు 27 ఇంటెగ్రేటెడ్ హాస్టల్ వెల్ ఫేర్ కాంప్లెక్సెస్ నిర్వహించబడుతున్నాయి.
  32. గిరిజన సంక్షేమం: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో గిరిజన వసతి గృహాలను దశల వారిగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చే ప్రక్రయను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. 2016_17లో 80 వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చబడ్డాయి. వీటిలో మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుతున్న 5,242 మందికి ప్రయోజనం కలిగింది. ఎస్.ఎస్.సి. విద్యార్థుల ఉత్తీర్ణత 90.87%.
  33. పేదరికం: పేదరిక నిష్పత్తి గ్రామీణ ప్రాంతంలో 10.96%, పట్టణ ప్రాంతాలలో 5.81%, రాష్ట్ర సగటు నిష్పత్తి 9.20%. జాతీయ సగటు నిష్పత్తి గ్రామీణ ప్రాంతాలలో 25.70%, పట్టణ ప్రాంతాలలో 13.70%, మొత్తంగా 21.92%.
  34. ప్రజా పంపిణీ వ్యవస్థ: 2016 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలో 29,054 రేషన్ షాపులు ఉన్నాయి. సగటున ఒక్కొక్క రేషన్ షాపుకు 450 కార్డులు/కుటుంబాలు ఉన్నాయి. భారత ప్రభుత్వ నిబంధనల మేరకు 2,000 జనాభాకు ఒక షాపు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో 1,725 జనాభాకు ఒక షాపు ఉన్నది.
  35. ఉపాథి- నిరుద్యోగం: 2011-12లో నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్(యన్.యస్.యస్.ఓ), 68వ నివేదిక గణాంకాల ప్రకారం నిరుద్యోగుల నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలలో 12%, పట్టణ ప్రాంతాల్లో 43%గా ఉంటే జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 17%, పట్టణ ప్రాంతాల్లో 34%గా ఉన్నది.                 * ఉపాథి & శిక్షణ: సంఘటిత రంగంలో ఉన్న 9,244 పరిశ్రమల్లో 8.60 లక్షల మందికి ఉపాథి కల్పించబడింది. వీటిలో ప్రభుత్వ రంగంలో ఉన్న 6,470 సంస్థల్లో 6.04 లక్షల మందికి, ప్రయివేటు రంగంలోని 2,774 సంస్థల్లో 2.56 లక్షల మందికి ఉపాథి కల్పించబడింది.
  36. ఆధార్ కార్డులు: రాష్ట్రంలో 507.01 లక్షల ఆధార్ కార్డులు జారీ చేయబడ్డాయి.                                                                                                                                                               టి.లక్ష్మీనారాయణ‌                                                                                                      గమనిక: ఈ వ్యాసం ఆర్.సి.రెడ్డి పబ్లికేషన్స్ “వివేక్” మాసపత్రిక, 2017 మే సంచిక‌లో ప్రచురించబడింది.

Saturday, January 28, 2017

విశాఖ సిఐఐ సదస్సు వల్ల వనగూడే ఫలితాలేంటి!

ప్రత్యేక తరగతి హోదా సాధన కోసం ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని, సిఐఐ సదస్సు నిర్వహణను వేరు వేరుగా చూడాలి.

1. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బిజెపి రెండు భాగస్వాములే. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రత్యేక తరగతి హోదా కల్పిస్తామని రాజ్యసభ వేదికగా వాగ్ధానం చేసింది. నేడు అధికారంలో ఉన్నబిజెపి ఆ వాగ్ధానాన్ని అమలు చేయకుండా మోసం చేసిందన్న బలమైన భావన ప్రజానీకంలో ఉన్నది. దాన్ని చూడ నిరాకరించడం గర్హనీయం. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం, ప్రణాళిక మరియు ప్రణాళికేతర పద్దులను కలిపి వార్షిక బడ్జెటును రూపొందించడానికి నిర్ణయించడం, కేంద్ర ప్రయోజిక పథకాల సంఖ్యను కుదించడంతో పాటు నిథుల కేటాయింపుకు సంబంధించి 70:30 నిష్పత్తి స్థానంలో 60:40 చేసి భారాన్ని రాష్ట్రాల మీదికి నెట్టడం వగైరా చర్యలతో ప్రత్యేక తరగతి హోదా వల్ల వనగూడే ప్రయోజనాలను నిర్వీర్యం చేసింది. ప్రత్యేక తరగతి హోదా వల్ల వనగూడే ప్రయోజనాలేంటి అన్న అప్రజాస్వామికమైన, అడ్డగోలు వాదనను ప్రక్కన బెట్టి చట్టసభలో ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధి ప్రదర్శించాలి.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాపితంగా 'హై అలర్ట్' ప్రకటించి ఉన్నందున మరియు సిఐఐ సదస్సు జరగబోతున్న నేపథ్యంలో  ఆందోళనకు అనుమతించ లేక పోతున్నామన్నదాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ, శాసనసభ ప్రతిపక్ష నాయకుడిని విమానాశ్రయం 'రన్ వే' పైనే అరెస్టు చేయడం దుర్మార్గం. ఇది దుస్సాంప్రదాయానికి దారి దీస్తుంది.

2. సిఐఐ సదస్సు నిర్వహణను సానుకూల దృక్పథంతో చూడాలి. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయాధారత రాష్ట్రంగా మిగిలిపోయింది. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది. ఉపాథి అవకాశాలు లేవు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం హుద్ హుద్ తుఫాన్ దెబ్బతో విలవిల్లాడి పోయింది. తీవ్రమైన నష్టం వాటిల్లింది. విశాఖ ఆర్థికాభివృద్ధి మందగిస్తుందేమోనని రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందారు. విశాఖపట్నానికి భౌగోళికంగా ఉన్న సానుకూలాంశాల వల్ల కావచ్చు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పట్టణం కావడం వల్ల కావచ్చు, రాజకీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించి చేపట్టిన చర్యల వల్ల కావచ్చు ఏదో ఒక మేరకు సత్ఫలితాలు వస్తున్నాయన్న వాస్తవాన్ని తృణీకార భావంతో తిరస్కరించడం వల్ల ప్రయోజనం లేదు.

ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన హైదరాబాదును విభజనతో కోల్పోయిన చేదు అనుభవంతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది ప్రజల బలమైన ఆకాంక్ష. మొదటి సిఐఐ సదస్సులో జరిగిన భాగస్వామ్య ఒప్పందాలను పరిశీలించిన, తాజా సదస్సు ఒప్పందాలను పరిశీలించినా ఆ అంశం కొరవడినట్లు స్పష్టంగా కనబడుతున్నది.

మొదటి సదస్సులో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం కల్పించే భాగస్వామ్య ఒప్పందాలు జరిగాయని, వాటిలో 40% వరకు కార్యరూపం దాల్చాయని ప్రభుత్వం చెబుతున్న దాంట్లో అంతా వాస్తవం కాకపోవచ్చు. ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో కనబడుతున్న దానికి పొంతన లేని మాట వాస్తవమే కావచ్చు. అయితే, కార్యరూపం దాల్చుతున్న యం.ఓ.యు.లు వివిధ దశల్లో ఉండవచ్చు, అవి పూర్తి స్థాయిలో అమలు కావడానికి, ఫలితాలు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కూడా! అయితే, మొదటి సదస్సు వల్ల కానీ, రెండవ సదస్సు వల్ల కానీ, పారిశ్రామిక రంగంలో ఒక విధమైన కదలిక, సానుకూలమైన వాతావరణం సృష్టించబడ్డాయనడంలో సందేహం లేదు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ఏ చిన్న ప్రయత్నం చేసినా సానుకూల దృక్పథంతో పరిశీలించడం రాష్ట్రానికి మేలు చేకూర్చుతుంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నపారిశ్రామిక విధానంలోని లోపభూయిష్టమైన అంశాలను నిర్మాణాత్మక దృష్టితో నిశితంగా పరిశీలించాలి, ఎత్తి చూపాలి, ఎండగట్టాలి, వాటికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిందే.

పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ప్రభుత్వ పెట్టుబడులు, ప్రయివేటు పెట్టుబడులను రెండు వేరు వేరు కోణాల్లో పరిశీలించాలి. రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, సహజ వనరులు, మానవ వనరులకు సంబంధించిన సమాచారాన్ని పారిశ్రామిక వేత్తలకు వివరించడం ద్వారా పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నం భాగస్వామ్య సదస్సుల ద్వారా చేస్తున్నారు. విశాఖపట్నం వేదికగా చేసుకొంటున్న భాగస్వామ్య ఒప్పందాలు అమలుకు నోచుకొని రాష్ట్రానికి మేలు జరిగితే మంచిదే. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధానత్య లోపించినట్లు స్పష్టంగా కనబడుతున్నది. విశాఖపట్నం, అమరావతి, కోస్తా తీరంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే ఒప్పందాలే అత్యధికంగా ఉన్నట్లు బహిరంగ పరచిన ఒప్పందాలఇవరాలను బట్టి అర్థమవుతున్నది. సముద్ర తీరంతో పాటు నీటి వనరులు, భౌగోళిక పరిస్థితుల మూలంగా ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించడానికి కోస్తా ప్రాంతానికి అదనపు సానుకూలతలు ఉండవచ్చు. కానీ, మానవ వనరులు, భూములు, ఖనిజ సంపద, విద్యుత్తు, రవాణా సౌకర్యాలు వగైరా మౌలిక సదుపాయాలు ఉన్న వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి నీటి సదుపాయాన్ని కల్పించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలను చేపట్టాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం లోపభూయిష్టంగా ఉన్నదని చెప్పక తప్పదు.

రాష్త్ర విభజన చట్టంలో పొందుపరచిన కడప ఉక్కు పరిశ్రమ సంగతేంటి? బి.హెచ్.సి.యల్._యన్.టి.పి.సి. సంయుక్తంగా నిర్మాణాన్ని చేపట్టిన మన్నవరం పరిశ్రమను ఎందుకు అటకెక్కించారు? కర్నూలు సమీపంలో యుపిఏ ప్రభుత్వ కాలంలో నిర్మించ తలపెట్టిన వ్యాగన్ తయారీ పరిశ్రమ ఏమయ్యింది? రేణిగుంట వ్యాగన్ రిపేర్ వర్క షాప్ దశాబ్ధాలు గడచి పోతున్నా విస్తరణకు ఎందుకు నోచుకోవడం లేదు? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులతో నెలకొల్పబడాల్సిన పరిశ్రమలు. వాటిపైన ఏ మాత్రం ద్యాస పెట్టడం లేదు.

నిజమే, కోస్తా తీరం లేదా ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి జరిగినా రాష్ట్ర స్థూల ఉత్ఫత్తి పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. దాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించవచ్చు. కానీ, వెనుకబడిన, కరవు పీడిత ప్రాంతాలలో పారిశ్రామికాభివృద్ది, ఉపాథి అవకాశాల కల్పన, ఆర్థికాభివృద్ధిలో ఆ ప్రాంతాల ప్రజలను భాగస్వాములను చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి కదా! విభజన చట్టంలో పేర్కొన్న వాటినీ అమలు చేయడం లేదు. పెట్టుబడులపై 15%, యంత్రాల తరుగుదలపై 15% రాయితీలు ప్రకటించారు. వాటి వల్ల ఒక్క పరిశ్రమైనా వెనుకబడిన ప్రాంతాల్లో వచ్చిందా? సిఐఐ సదస్సును ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ ఈ వాస్తవాన్ని గుర్తించి రాయితీలను పెంచే అంశాన్ని మాట వరసకు కూడా ప్రస్తావించ లేదు. సోలార్ ప్లాట్లను నెలకొల్పుతున్నామనో లేదా చిన్న చితక పరిశ్రమల స్థాపనకు ప్రయత్నిస్తున్నామనో! నమ్మబలికే ప్రయత్నం చేయడం వృదా ప్రయాసగానే మిగిలి పోతుంది.

టీవి5లో జరిగిన చర్చలో నాతో పాటు సీనియర్ పాత్రికేయులు శ్రీ ప్రసాద్ రెడ్డి, స్వచ్ఛా ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ డా. వెంకట్రావు, ఆర్థికాంశాల విశ్లేషకులు శ్రీ దిలీప్ పాల్గొన్నారు

టి.లక్ష్మీనారాయణ

Part 1: https://www.youtube.com/watch?v=H_oWMIxFj1E

Part 2: https://www.youtube.com/watch?v=sNMKGpTx7FE

Monday, January 23, 2017

ఒక్క ప్రత్యేక తరగతి హోదా కోసమే కాదు ఉద్యమం చేయాల్సింది, విభజన చట్టంలో పొందుపరచిన అన్ని అంశాల అమలు కోసం ఉద్యమించాలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి. ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతాల సమగ్రాభివృద్ధి ప్రణాళిక అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిగ్గదీయాలి. భారత్ టుడే 'న్యూస్ ట్రాక్' చర్చలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయాల సారాంశం అది.

ఇరుగు పొరుగు ప్రాంతాల్లో జరిగే ఆందోళనల ప్రభావం ఎంతో కొంత మేరకు మనపై కూడా ఉంటుంది. జల్లికట్టు సమస్యపై తమిళనాడులో జరుగుతున్న ఆందోళన హేతుబద్ధతపై వేరుగా చర్చించుకోవాలి. ఆ క్రీడలో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. జంతు ప్రేమికులేమో, జంతువులు హింసకు గురౌతున్నాయి కాబట్టి దాన్ని నిషేధించమంటున్నారు. సంస్కృతిలో భాగమంటూ ఆ రాష్ట్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా వీథుల్లోకి వచ్చారు. ఆ ఆందోళనను స్ఫూర్తిగా తీసుకోని ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమించాలనడంలో ఔచిత్యం లేదు. ప్రత్యేక తరగతి హోదా అంశం యొక్క స్వభావం వేరు.

రాష్ట్ర విభజన సందర్భంలో రాజ్యసభ వేదికగా ఇచ్చిన ప్రత్యేక తరగతి హోదా హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. దాని వల్ల వనగూడే ప్రయోజనాలేంటి అన్న చర్చను ప్రభుత్వంలోని పెద్దలు లేవదీయడం అసంబద్ధం. చట్ట సభల విశ్వసనీయతతో కూడా ఈ అంశం ముడిపడి ఉన్నది.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తరగతి హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానీకాన్ని దగా చేయడమే కాదు, విభజన చట్టంలో పేర్కొన్న కీలకమైన పలు అంశాల అమలులోనూ బాధ్యతారహిత్యంగా, అలసత్వంతో వ్యవహరిస్తున్నది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి ప్యాకేజీని అమలు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రు.24,000 కోట్లతో ఒక పథకాన్ని రూపొందించి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందన్న వార్తలు వచ్చాయి. కానీ, జిల్లాకు, ఏడాదికి రు.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు రు.350, అలా ఐదేళ్ళకు మొత్తం రు.1750 కోట్లు మాత్రమే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొని, ఆ మేరకే నిథులిస్తున్నది. ఇది వెనుకబడిన జిల్లాల ప్రజానీకాన్ని అమమానించడం కాదా?

వెనుకబడ్డ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతామని చట్టంలో పేర్కొన్నారు. 'ఫీజిబిలిటీ' లేదంటూ దాన్ని అటకెక్కించారు. రైల్వే జోన్ అంశాన్ని నాన్చుతూనే ఉన్నారు. కొత్త‌ ఓడ‌ రేవు నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని పట్టించుకోలేదు. రెవెన్యూ లోటు భర్తీపై ఇంకా లెక్కలే తేలలేదు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఎంత ఆర్థిక సహాయం చేస్తారో అంతు చిక్కని సమస్యగానే కొనసాగుతున్నది.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కానీ, 2010 -11 అంచనా వ్యయాన్ని అంటే రు.16,000 కోట్లను మాత్రమే కొలబద్ధగా తీసుకొని, అందులో 2014 ఏప్రిల్ 1కి ముందు చేసిన వ్యయం, జల విద్యుత్ ప్లాంటును నెలకొల్పడానికయ్యే వ్యయాన్ని, విశాఖపట్నం త్రాగు నీటి పథకానికయ్యే వ్యయాన్ని మినహాయించి, దాదాపు రు.8,000 కోట్లు ఇవ్వడానికి ఆమోదించి, నాబార్డు నుండి రుణం తీసుకొని సర్దుబాటు చేస్తున్నారు. ఈ తరహా ఆర్థిక తోడ్పాటుతో ఆ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018 లేదా 19 నాటికి పూర్తి చేయగలరా?

విభజన చట్టంలో పొందుపరచిన అంశాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు, విడుదల చేసిన నిథుల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేత పత్రాలు విడుదల చేయాలి.

టి.లక్ష్మీనారాయణ‌

Part 1: https://www.youtube.com/watch?v=WBV00IbLhnk
Part 2: https://www.youtube.com/watch?v=MnjXz2qqpqM

Saturday, January 14, 2017

వైయస్ కలను సాకారం చేసిన చంద్రబాబు!

యన్.టి.ఆర్. మానస పుత్రిక అయినగాలేరు - నగరి సృజల స్రవంతి నిర్ధేశిత లక్ష్యానికి అనుగుణంగా ఒంటిమిట్ట, రాజంపేట, కోడూరు, రేణిగుంట, పుత్తూరు, నగరి వరకు సాగు నీరు, త్రాగు నీరు అందించాల్సిన రెండవ దశ నిర్మాణ పనులను అటకెక్కించి, రాజకీయంగా పాత మిత్రుడు, ప్రత్యర్థి అయిన డా.వై.యస్.ఆర్. కలను చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికపై నెరవేర్చినందుకు అభినందించాలా! ప్రాజెక్టు అసలు లక్ష్యాన్ని విస్మరించినందుకు విమర్శించాలా! అన్న సందిగ్ధంలో పడ్డాను.
గాలేరు - నగరి ప్రాజెక్టు ద్వారా గండికోట జలాశయం నుండి చిత్తూరు జిల్లా నగరి వరకు సాగు నీరు అందుతుందా! అన్న అనుమానాలు ప్రజల్లో మొదటి నుంచి వ్యక్తమవుతూనే ఉన్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగా గండికోట జలాశయం నుండి ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రాజెక్టు పరిథిలో లేని పులివెందుల ప్రాంతానికి నీటిని తరలించుకొని పోవడానికి వై.యస్. వ్యూహ రచన చేశారు. గండికోట ఎత్తిపోతల పథకం, గండికోట - చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం, గాలేరు - నగరి (రెండవ దశ) పరిథిలోని ప్రాంతాల ప్రయోజనాలకు నిస్సందేహంగా హానికరం. గాలేరు - నగరి ప్రాజెక్టు నిర్మాణానికి ముందే అసలు లక్ష్యాలకు వై.యస్. విధంగా గండి కొట్టారు. వై.యస్. చేపట్టిన పథకాలను చంద్రబాబు పూర్తి చేసి వై.యస్. కన్న కలను నెరవేర్చారు. ప్రాజెక్టు నిర్ధేశిత ఆయకట్టు ప్రయోజనాలను పణంగా పెట్టడాన్ని ఎవరైనా ఎలా సమర్థించుకోగలరు!
గాలేరు - నగరి అసలు లక్ష్యానికి ఎసరు!
గాలేరు - నగరి ప్రాజెక్టుకు ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసి 1988 సెప్టంబరు 22 జీ..యం.యస్. నెం.236ను జారీ చేసింది. నాటి ముఖ్యమంత్రి యన్.టి.రామారావు గారు కడప జిల్లా బాక్రాపేట సమీపంలో ఉద్దిమడుగు సాగరంకు, చిత్తూరు జిల్లా కరకంబాడి వద్ద శ్రీనివాస సాగరంకు శంకుస్థాపన చేశారు. అటుపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో వామికొండ సాగరంకు  ఉప ముఖ్యమంత్రి హోదాలో కోనేరు రంగారావు గారు 1994 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. 1996లో చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా మరొకసారి గండికోట వద్ద శంకుస్థాపన చేశారు. మూడు శంకుస్థాపనలు జరిగాయి. దాదాపు ముప్పయ్ ఏళ్ళు గడిచి పోయాయి. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసి, ప్రజలకు స్పష్టత కల్పించాలి.
 కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా గాలేరు - నగరి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నది. శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 38 టి.యం.సి. కృష్ణా నది మిగులు జలాలను గండికోట ప్రధాన జలాశయానికి తరలించి, గండికోట జలాశయానికి దిగువన 8 చిన్న చిన్న జలాశయాలను(వామికొండ సాగరం, సర్వరాజ సాగరం, ఉద్ధిమడుగు సాగరం, వెలిగొండ సాగరం, కృష్ణ సాగరం, శ్రీ బాలాజీ జలాశయం, పద్మ సాగరం, శ్రీనివాస సాగరం) నిర్మించి, వాటి ద్వారా కడప జిల్లాలోని 15 మండలాల్లో 1,30,000, చిత్తూరు జిల్లాలోని 13 మండలాల్లో 1,60,000, నెల్లూరు జిల్లాలోని 4 మండలాల్లో 35,000, మొత్తం 3.25 లక్షల ఎకరాలకు  సాగు నీటిని, మార్గమధ్యంలో పలు పట్టణాలకు, గ్రామాలకు త్రాగు నీటిని సరఫరా చేసే లక్ష్యంతో పథకాన్ని రూపొందించారు. తరువాత కాలంలో సాగుదల లక్ష్యాన్ని 3,25,000 నుండి 2,60,000 ఎకరాలకు(కడప జిల్లాలో 1,55,000, చిత్తూరు జిల్లాలో 1,03,500, నెల్లూరు జిల్లాలో 1,500) ప్రభుత్వం కుదించి వేసింది.
 ప్రాజెక్టు నిర్మాణానికి రు.1,500 కోట్లు వ్యయం అవుతుందని 1993-94 ఆర్థిక సం.లో ప్రభుత్వం అంచనా వేసింది. అది కాస్తా, 1999-2000 నాటికి  రు.3,310 కోట్లుకు పెరిగింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశలుగా విడగొట్టారు. మొదటి దశ క్రింద రు.4,940 కోట్ల అంచనా వ్యయంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి గండికోట జలాశయ వరకు నీటిని తరలించే నిర్మాణ పనులు(సొరంగం నిర్మాణంతో సహా), గండికోట జలాశయం, వామికొండ మరియు సర్వరాజ సాగరం, వాటి వరకు ప్రధాన కాలువ, జలాశయాల క్రింద 35,000 ఎకరాలకు సాగు నీటి సరఫరాకు వీలుగా పంట కాల్వలనిర్మాణ పనులు పేర్కొనబడ్డాయి. మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు మూడు దశాబ్ధాల కాలం పట్టింది. ప్రాజెక్టుకు తలమానికమైన గండికోట జలాశయాన్ని 26.84 టి.యం.సి. సామర్థ్యంతో నిర్మించారు. దానికి నీటిని తరలించడానికి వీలుగా సొరంగ మార్గ నిర్మాణం పూర్తయ్యింది. కరవు సీమ ప్రజల మూడు దశాబ్ధాల కల పాక్షికంగానైనా సాకారం అయినందుకు సంతోషం. గాలేరు - నగరి ప్రాజెక్టుకు తలమానికమైన గండికోట జలాశయం నిర్మాణాన్ని పూర్తి చేయడంలో వై.యస్. శ్రద్ధ వహించారు. ఖ్యాతి ఆయనకు తప్పని సరిగా దక్కుతుంది.
కానీ, ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణానికి సంబంధించిన పనులను ప్రభుత్వం అటకెక్కించింది. ప్రాజెక్టు లక్ష్యంగా నిర్ధేశించుకొన్న 2.60 లక్షల ఎకరాల ఆయకట్టులో కడప, ఒంటిమిట్ట, రాజంపేట, కోడూరు, చిత్తూరు జిల్లాలోని నగరి వరకు విస్తరించి ఉన్న 2.25 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేయాల్సిన ప్రధాన కాలువ, రిజర్వాయర్ల నిర్మాణంపై మాత్రం దృష్టి సారించకనే గాలేరు-నగరి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేశామన్న భ్రమలను ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కల్పించడం గర్హనీయం. గాలేరు - నగరి (రెండవ దశ) నిర్మాణానికి రు.2,526 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసి, నేటికి కేవలం రు.333 కోట్లు ఖర్చు చేశారు

గాలేరు - నగరి సృజల స్రవంతి పథకంలో గండికోట ఎత్తిపోతల పథకం(పైడిపాళెం జలాశయం), గండికోట - చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాలు అంతర్భాగం కాదు. ఇవి వై.యస్. మానస పుత్రికలుగా 2006లో రూపొందించబడ్డాయి. గండికోట ఎత్తిపోతల పథకాన్ని రు.837 కోట్లతోను, గండికోటచిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సిబిఆర్) ఎత్తిపోతల పథకాన్ని రు.1461 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాన్ని చేపట్టి, శర వేగంతో నిర్మించారు. అదే సందర్భంలో గాలేరు _ నగరి ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణ పనులపై మాత్రం శ్రద్ధ పెట్ట లేదు. దాని పరిథిలోకి వచ్చే ప్రాంతాల ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించినట్లు కనబడుతున్నది.
ప్రాజెక్టు పరిథిలో లేని ప్రాంతాలకే ముందస్తుగా నీళ్ళా!
కాస్త, పూర్వరంగాన్ని పరిశీలిద్ధాం! పులివెందుల బ్రాంచి కాల్వకు తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్.ఎల్.సి.) ద్వారా 4.4, పెన్నా నది నుండి 2 టియంసిల నికర జలాల కేటాయింపు ఉన్నది. దీని క్రింద కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో 55,000, అనంతపురం జిల్లాలో 5,000 ఎకరాలు ఆయకట్టు ఉన్నది. తుంగభద్ర జలాలు సక్రమంగా అందక, పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందడం లేదు. ఇది ముమ్మాటికీ నిజం.
చిత్రావతి నదిపై పార్నపల్లి వద్ద చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు10 టియంసిల సామర్థ్యంతో నిర్మించబడింది. పెన్నా నదికి ఉప నది చిత్రావతి. చిత్రావతిలో నీటి లభ్యత పెద్దగా లేదు కాబట్టి గండికోట నుండి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించాలన్న డిమాండ్ కొన్ని సంవత్సరాలుగా ఉన్నది.
పులివెందుల బ్రాంచి కాల్వ, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, పనిలో పనిగా మరికొన్ని వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు గండికోట జలాశయం నుండి కృష్ణా నది మిగులు జలాలను తరలించడానికి వై.యస్. పథకాన్ని రచించారు. అందులో భాగంగా 6 టియంసిల సామర్థ్యంతో పైడిపాళెం జలాశయాన్ని నిర్మించి, దానికి నీటి సరఫరా కోసం గండికోట ఎత్తిపోతల పథకాన్ని రు. 983 కోట్లతో నిర్మించ తలపెట్టారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 41,000 ఎకరాల ఆయకట్టు, మరో 47,500 ఎకరాల పులివెందుల బ్యాంచి కాలువ ఆయకట్టు స్థిరీకరణకు సాగు నీరు అందించే లక్ష్యాన్ని నిర్ధేశించుకొన్నారు. అలాగే గండికోట - చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాన్ని రు. 627 కోట్లతో నిర్మించి, ప్రత్యక్షంగా 20,750 ఎకరాల ఆయకట్టు తోపాటు చిత్రావతి కుడి కాలువ క్రింద 59,400 ఎకరాలకు నీటి సరఫరాను లక్ష్యంగా పెట్టుకొన్నారు.

"చేతిలో కర్ర ఉన్న వాడిదే బర్రె" అన్న నానుడి గుర్తుకొస్తున్నది. గాలేరు -  నగరి సృజల స్రవంతి ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్న అసలు లక్ష్యాన్ని వమ్ము చేస్తూ గండికోట జలాశయానికి కృష్ణా నది నుండి తరలించబడే 38 టియంసిల మిగులు జలాల్లో 14.3 టియంసిలను రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రాజెక్టు పరిథిలో లేని ప్రాంతాలకు తరలించడం అన్యాయం.
చివరిలో ఒక్క మాట:
రాయలసీమకు కృష్ణా నదీ జలాలను తరలించాలని కమ్యూనిస్టులు అలుపెరగని ఉద్యమాలు నిర్వహించారు. ఇతర రాజకీయ పార్టీలు, సంస్థలు, అనేక మంది వ్యక్తులుగా వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహించారు. గాలేరు - నగరి ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలన్న డిమాండుతో సిపిఐ, కడప జిల్లా అగ్రనేతలు కా.యన్.శివరామిరెడ్డి, జె.వెంకట్రామిరెడ్డి, కె.సుబ్బన్న, అబ్దుల్ ఖాదర్ లను నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోబెట్టాలని 1996లో నిర్ణయించాం. వత్తిడి వల్ల నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు గారు, అప్పుడు సిపిఐ, శాసన సభాపక్ష నాయకుడుగా ఉండిన కా.సి.హెచ్.రాజేశ్వరరావును వెంట బెట్టుకొచ్చి గండికోట వద్ద శంకుస్థాపన చేశారు
రాయలసీమ ప్రాంత దాహార్తిని తీర్చడానికి కృష్ణా జలాల మళ్ళింపే ఏకైక మార్గమని దశాబ్ధాల పాటు పోరు సల్పినవారిలో అగ్రగన్యులు, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రముఖ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు అమరజీవి కా.ఎద్దుల ఈశ్వరరెడ్డి గారి పేరును గండికోట జలాశయానికి పెట్టమని ఒకబృందంగా వెళ్ళి నాటి ముఖ్యమంత్రి డా. వై.యస్.రాజశేఖరరెడ్డి గారికి విజ్ఞప్తి చేశాం. ఆయనవెంటనే స్పందించి, ఉత్తర్వు జారీ చేయించారు. సైద్ధాంతిక, రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఆయన స్పందించిన తీరు మరువలేనిది. మాట ఇక్కడప్రస్తావించడానికి కారణం పైడిపాళెం జలాశయానికి యన్.టి.ఆర్. పేరు పెట్టినట్లుగా ప్రసారమాధ్యమాల్లో చూశాను. గాలేరు - నగరి సృజల స్రవంతి పథకం యన్.టి.ఆర్. మానస పుత్రిక అయితే గండికోట ఎత్తిపోతల(పైడిపాళెం జలాశయంతో సహా) పథకం వై.యస్. మానస పుత్రిక అని చెప్పక తప్పదు. అందు వల్ల, గండికోట ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మించబడిన పైడిపాళెం జలాశయానికి యన్.టి.ఆర్. పేరుకు బదులు వై.యస్. పేరు పెట్టి ఉంటే సముచితంగా ఉండేది.

టి.లక్ష్మీనారాయణ