సూర్య దిన పత్రిక
- ఐదున్నర లక్షల మందికే రుణ అర్హత కార్డులు
- భూ యజమానుల భయాలు తొలగించాలి
- రుణాలు అందని చిన్న, సన్నకారు రైతులు
- మైక్రో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులే దిక్కు
- ప్రైవేట్ రుణ భారంతో ఆత్మహత్యలు
కౌలు రైతులపై అవ్యాజమైన ప్రేమ ఒలకబోసి రాష్ట్ర రెవెన్యూమంత్రి ఎన్. రఘువీరారెడ్డి రాజకీయాలను బాగా రక్తి కట్టించారు. పాలక, ప్రతిపక్ష పాత్రలు రెండింటిని ఆయనే సమర్ధవంతంగా పోషించడం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయ నీతిని ప్రదర్శించారనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుల ఆధారంగా జాతీయ బ్యాంకులు రైతులందరికీ రుణాలివ్వక పోవడంపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారని వార్తలు వెలువడ్డాయి. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది కౌలు రైతులుంటే, ఐదున్నర లక్షల మందికి మాత్రమే ‘సాగు రైతు రక్షణ పథకం’ పేరిట రుణ అర్హత కార్డులు జారీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మిగిలినవారికి కార్డులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంతే కాదు, కార్డులు పొందినవారిలో కూడా సుమారు 60 వేలమందికే బ్యాంకులు రుణాలు మంజూరు చేయడమేమిటని ఆయన చిర్రుబుర్రులాడారు. రాష్ట్రంలో రుణ వసూళ్ళు ప్రోత్సాహకరంగా లేవని బ్యాంకుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేసి ప్రభుత్వం దానిపై దృష్టి సారిం చాలని కోరినట్టు సమాచారం.
కౌలు రైతుల్లో అత్యధికులు భూమిలేని పేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందినవారే. వారికి ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చి రుణాలు మంజూరు చేయించాలే గాని బ్యాంకర్లమీద కోపం ప్రదర్శిస్తే ప్రయోజనం ఏమిటి? బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడానికి గల కారణాలను పరిశీలించి, పరిష్కార మార్గాలను అన్వేషించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. భూ యజమానులు తనఖా పెట్టి రుణాలు తీసుకున్న భూమిని కౌలుకు తీసుకున్న రైతుల పేరిట మళ్ళీ రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులు తిరస్కరించాయన్న వాదన ఉంది. అలాగే భూ యజమాని ఆమోదం తెలియజేస్తే గాని కౌలుదారులు రుణ అర్హత కార్డులను పొందలేరు. కౌలుదార్లకు ఇచ్చే పంట రుణాలవల్ల భూయజమానుల హక్కులకు భంగం కలగరాదు.
కౌలు రైతులు రుణాలు పొందిన తర్వాత, తమకు భూములపై ఉన్న రుణ సౌకర్యాన్ని కోల్పోతామనే భయాలు భూ యజమానులకున్నాయి. ఈ తరహా సమస్యలకు పరిష్కారం చూపాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టపోతే దేశానికే నష్టం. ఇటీవల యావత్ ప్రపంచం చవి చూసిన ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశ ఆర్ధిక వ్యవస్థను రక్షించింది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థే అని మరచిపోరాదు. ఈ వాస్తవాన్ని విస్మరించి నష్టాల్లో కూరుకుపోయాయనే నెపంతో జాతీయ బ్యాంకుల్ని ప్రైవేటీకరించే పనిలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉన్నది. ఈ నేపథ్యంలో బ్యాంకులను ముంచే ఆలోచన కాకుండా, కౌలు రైతుల్ని చిత్తశుద్ధితో ఆదుకునే ఆచరణాత్మకమైన విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి.
వ్యవసాయానికి రుణాలను అడిగిన ప్రతి రైతుకు బ్యాంకుల ద్వారా మంజూరు చేయిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లలో వాగ్దానాలు గుప్పించడం, ఆచరణలో అందుకు భిన్నంగా ప్రవర్తించడం ఆనవాయితీగా మారింది. గత ఏడాది ప్రకటించిన రూ. 3, 75, 000 కోట్లనుంచి 2011-12లో రూ. 4, 75, 000కు పెంచి 7 శాతం వడ్డీకే రుణాలను రైతులకు అందజేస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు. సక్రమంగా రుణాలు చెల్లించే రైతులకు గతంలో ఇచ్చిన 2 శాతం వడ్డీ రాయితీని 3 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. నాబార్డ్ పెట్టుబడుల సామర్ధ్యాన్ని పెంచే లక్ష్యంతో అదనంగా రూ 3 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు.
రూ. 10 వేల కోట్లతో స్వల్పకాలిక గ్రామీణ రుణ నిధిని ఏర్పాటు చేసి చిన్న సన్నకారు రైతాంగానికి పరపతి సంఘాల ద్వారా స్వల్పకాలిక పంట రుణాలను మంజూరు చేస్తామని వాగ్దానం చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో చిన్న సన్నకారు రైతులకు సంస్థాగత రుణాలు బ్యాంకులనుంచి లభించక మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించి అధిక వడ్డీలు చెల్లించలేక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కోకొల్లలు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారుల బారిన కౌలు రైతులు పడకుండా కాపాడాలంటే రాష్ట్ర ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించాలి. అటకెక్కించిన పావలా వడ్డీ పథకాన్ని విధిగా అమలు చేయాలి. ఆహార ద్రవ్యోల్బణం 2010 ఫిబ్రవరిలో 20.2 శాతానికి చేరుకున్న చేదు అనుభవం చవిచూశాము.
తరువాత గణనీయంగా తగ్గినా మళ్ళీ విజృంభించింది. ప్రస్తుతం అది 10 శాతానికి దగ్గరగా ఉన్నది. ఇది సామాన్యులకు ఆందోళన కలిగిస్తున్నది. కౌలు రైతులు మనుగడ సాగిస్తూ వ్యవసాయోత్పత్తులను పెంచడం ద్వారా సమాజానికి ఆహార భద్రత కలిగించడంలో భాగస్వాములు కావాలంటే ప్రభుత్వం వారికి అండగా నిలబడాలి. సుదీర్ఘ పోరాటాల తర్వాత కౌలు రైతుల పట్ల ప్రభుత్వం కాస్త స్పందించినట్టు కనుపిస్తున్నది. ఆ మేరకు ‘ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ లైసెన్స్‌డ్ కల్టివేటర్స్ ఆర్డినెన్స్- 2011’ను జూన్ నెలలో జారీ చేసింది. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోని భూములను దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న లక్షలాదిమంది కౌలు రైతులను ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి తీసుకురాకపోవడం ప్రభుత్వ దురాలోచనకు నిదర్శనం.
కౌలుదారులందరికీ రక్షణ, ప్రయోజనం కలిగించే సమగ్రమైన విధానాలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఇందుకు తీసుకోవలసిన తక్షణ చర్యలు కొన్ని ఉన్నాయి. అవి: 1. పావలా వడ్డీకి పంట రుణాలను ప్రభుత్వ పూచీకత్తుపై బ్యాంకులనుంచి రుణాలు మంజూరు చేయాలి. 2. భూ యజమానులు ఇప్పటికే తీసుకున్న పంట రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్పించాలి.
3. కౌలుదారులకు సంస్థాగత రుణాలు ఇచ్చినా, ఆ భూమిపై భూయజమానులు రుణం పొందే హక్కుకు భంగం కలిగించకూడదు. 4. సహకార పరపతి సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేసి, వాటి ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించాలి. 5. ప్రకృతి వైపరీత్యాల బారిన పడినప్పుడు నష్టపరిహారం పొందడానికి వీలుగా చిన్న సన్నకారు రైతులు, కౌలుదారులు చెల్లించాల్సిన పంటల బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. 6. వ్యవసాయ ఉత్పత్తులకు పెట్టుబడి ఖర్చుపై కనీసం 50 శాతాన్ని అదనంగా కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలి. 7. ఆరోగ్యబీమా పథకాన్ని వర్తింపచేయాలి. 8. వ్యసాయ రాయితీలకు కోత విధించే విధానాలకు స్వస్తి పలకాలి. ఈ తరహా ప్రణాళికను ప్రభుత్వం అమలు చేస్తే కౌలు రైతులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించగలరనే విశ్వాసం బ్యాంకులకు కలుగుతుంది.
No comments:
Post a Comment