ఆంధ్రజ్యోతి దినపత్రిక సెప్టంబర్ 15, 2011
పంట పండించమని, అక్టోబర్ పట్టిన రైతాంగ సమస్యలపై సమగ్ర అధ్యయనానంతరం మోహన్ కందా నేతృత్వంలోని కమిటీ శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టిసారించి మెరుగైన సిఫార్సులతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుందని అందరూ ఆశించారు. పై పై విచారణలతో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి కొన్ని సూచనలను మాత్రమే చేసింది. రైతాంగాన్ని ఈ దుస్థితికి నెట్టిన లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానాలపై వేలెత్తి చూపలేదు. ఈ సమస్య ఉత్పన్నం కావడంలో, కమిటీ స్పృశించిన అంశాలే కాకుండా ఇతర అనేక జటిలమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి పంట విరామం (క్రాప్ హాలిడే) ఒక ప్రమాద ఘంటిక మాత్రమే. దేశ జనాభాలో 62 శాతం మందికి జీవనోపాధి కల్పిస్తున్న అత్యంత కీలకమైన వ్యవసాయరంగం తీవ్ర ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతున్నది. సేద్యం జూదంగా మారిపోయింది. వ్యవసాయం మీద ఆధారపడి మనుగడ సాగించడం దుర్లభమనే నిర్ధారణకు రైతాంగం వచ్చింది. కాకపోతే బ్రతుకుదెరువుకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో విధిలేకనే భూమిని నమ్ముకొని బతుకు పోరు సాగిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి, మెరుగైన జీవనం కోసం పట్టణ ప్రాంతాలకు సన్నకారు చిన్నకారు రైతులే కాక మధ్యతరగతి రైతులూ వలస పోతున్నారు.
ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో వరి ధాన్యం పండించే రైతులు పంట విరామాన్ని స్వచ్ఛందంగా ప్రకటించారు. వారి ఈ చర్య వ్యవసాయ రంగంలో సమస్యల తీవ్రతను తెలియజేస్తుంది. కౌలు రైతులకయితే కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. కౌలుకు సేద్యం చేయ డం కంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలిపని సంపాదించుకొంటే గంజైనా తాగవచ్చనే దుర్దశలో కౌలు రైతులు ఉన్నారు. పంట పండించకపోతే చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు పొట్టలు మాడ్చుకోవలసిందే. అయినా దానికి సిద్ధపడే ఈ ఆందోళనకు కోనసీమ రైతులు శ్రీకారం చుట్టారు. ఇది అంటు వ్యాధిలా ఇతర జిల్లాలకు కూడా కొంతమేరకు విస్తరించింది.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాల దుష్ఫలితంగానే రైతులు ఈ తరహా కఠినమైన నిర్ణయం తీసుకొన్నారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై మోజు, గ్రామీణ ప్రాంతాల వ్యవసాయరంగం అభివృద్ధిపై సవతి తల్లి ప్రేమ కనబరచడం మూలంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన అగాధం పెరిగిపోతున్నది. ఇందుకు కారణమైన, ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలలో కొన్నిటిని స్థూలంగా పరిశీలిద్దాం.
(అ) రసాయనిక ఎరువుల ధరలను పెంచడం - యూరియా మినహా మిగిలిన రసాయనిక ఎరువుల ధరలపై ఉన్న ప్రభుత్వ నియంత్రణను 2010 ఏప్రిల్ 1 నుంచి తొలగించి, కనీసం అమ్మకం ధరను కంపెనీలు లేదా ఎరువుల ఎగుమతిదారులే స్వేచ్ఛగా నిర్ణయించుకొని అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. పొటాష్ 50 కిలోల బస్తా ధర 2001లో రూ.170 ఉంటే 2011లో రూ.450కి పెరిగింది. 2010 ఏప్రిల్ నాటికి డిఎపి ధర రూ.467 ఉంటే ప్రస్తుతం రూ.600కి పెరిగింది. కొన్ని సంస్థలు రూ.700 వసూలు చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. యూరియాపై నియంత్రణ ఉండడంతో రూ.241 నుంచి రూ.268కి పెరిగింది. యూరియాపై కూడా నియంత్రణ ఎత్తివేయాలని కేంద్ర మంత్రుల బృందం ఇటీవల ప్రభుత్వానికి సిఫారసుచేసింది. అదే జరిగితే రైతులపై మరింత భారం పడుతుంది.
(ఆ) డీజిల్ ధర పెంపు-పెట్రోలుపై ప్రభుత్వ నియంత్రణ తొలగించినట్లుగానే సమీప భవిష్యత్తులో డీజిల్‌పైన కూడా ధరల నియంత్రణను ఎత్తివేయబోతున్నట్లు వి«ధాన ప్రకటనలు వెలువడుతున్నాయి. పర్యవసానంగా ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, డీజిల్ మోటార్లు వగైరా వినియోగ రైతులపై మోయలేని భారం పడుతుంది. లారీల కిరాయి పెరిగి వ్యవసాయోత్పత్తుల రవాణా చార్జీలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి మరింత పడిపోతుంది.
(ఇ) కొరవడిన విత్తన భద్రత-హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తంతా ప్రైవేటు కంపెనీల ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది. కార్పొరేట్ సంస్థల నిలువు దోపిడీకి రైతులు బలైపోతున్నారు. ఉదాహరణకు పత్తి విత్తనాల ధరలను పెంచి మోన్ శాంటో బహుళజాతి సంస్థ ఎలాంటి ఘరానా దోపిడీకి పూనుకొన్నదో, రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు ఏ విధంగా తోడ్పడిందో అందరికీ విదితమే. పైపెచ్చు విత్తనాల కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్, నకిలీ విత్తనాల సమస్యలు రైతాంగాన్ని నిలువునా ముంచెత్తుతున్నాయి.
(ఈ) లోపభూయిష్టమైన పంటల బీమా - అకాల వర్షాలు, తుపాన్‌లు, వరదలు, దుర్భిక్షం లాంటి ప్రకృతి వైపరీత్యాలు, తెగు ళ్ళు వగైరా సమస్యలు రైతాంగం వెన్నువిరుస్తున్నాయి. అన్నంపె ట్టే రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. పంటల బీమా పథకం లోపభూయిష్టంగా అమలవుతోంది.
తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి అండగా నిలవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిన పరిస్థితిని ఇటీవల కళ్ళారా చూశాము. తుపాన్‌లు, అధిక వర్షాల సమయాల్లో వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకోవడానికి, దాచుకోవడానికి అవసరమైన గోదాములు వగైరా మౌలికసదుపాయాల కల్పనలో ప్రభుత్వం ఘోరమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.
(ఉ) వరికి కనీస మద్దతుధర పెంచాలన్న డిమాండ్ అరణ్యరోదనగానే మిగిలిపోయింది. క్వింటాల్‌కు రూ.2070గా కనీస మద్దతు ధరను నిర్ణయించమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మన శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపితే ఖాతరే చేయలేదు. కేంద్ర ప్రభుత్వానికి ధరల విధానంపై సలహాలు ఇచ్చే నిమిత్తం నియమించబడిన వ్యవసాయ ఖర్చులు, ధరల నిర్ణాయక కమిషన్‌కు రైతుల గోడు పట్టలేదు. అరకొరా పెంపుదల తప్ప శాస్త్రీయమైన, న్యాయమైన మద్దతు ధర ఏనాడు లభించలేదు.
సాగు సీజన్ ప్రారంభంలోనే కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ భరోసాతో పంటను పండించడానికి రైతులు అష్టకష్టాలు పడతారు. కొండంత ఆశతో పంటను అమ్ముకోవడానికి సిద్ధమైతే, తీరా కళ్ళంలోకి పంట వచ్చేనాటికి కొనే నాథుడు ఉండడం లేదు. 2000-01లో 100 కిలోలకు రూ.510 ఉంటే 2004-05 నాటికి రూ.560కి పెరిగింది. 2010-11లో మొదటిరకం రూ.1030, రెండవరకం రూ.1000గా కనీస అమ్మకం ధర ఉన్నా రూ.700 లేదా 800లకు మించి రైస్ మిల్లర్లు, వ్యాపారస్తులు కొనలేదు. ప్రభుత్వ సంస్థలు మొండిచేయి చూపించాయి.
ఇప్పుడు 2011-12లో సేకరణ ధరను మొదటిరకం రూ.1110, రెండవ రకం రూ.1080లుగా నిర్ణయించారు. మార్కెట్ ఆర్థిక విధానాల అమలు పుణ్యంతో ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరను కూడా రైతు తన ధాన్యానికి పొందలేక కుదేలవుతున్నాడు. రైస్ మ్లిలర్లు, దళారుల దోపిడీకి గురౌతూ కష్టార్జితాన్ని కారు చౌకగా అమ్ముకోక తప్పని పరిస్థితులు కల్పించబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి ఎఫ్‌సిఐ, ఇందిర క్రాంతి పథకం, పౌర సరఫరాల శాఖల ద్వారా ఎంఎస్‌పికి అనుగుణంగా కొంటామని కబుర్లు చెప్పడమేగానీ ఆచరణలో చేసింది తక్కువ. కడకు అవసరమైన గోనె సంచులను కూడా సరఫరా చేయలేని దౌర్భాగ్యస్థితి చవిచూపించింది.
తీరా రైతుల నుంచి ధాన్యం వ్యాపారస్తుల చేతుల్లోకి చేరాక అంతర్‌రాష్ట్ర ఎగుమతులకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వ చర్య అత్యంత హేయమైనది. (ఊ) కొంప ముంచుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థ - ఎరువులు, క్రిమి సంహారక మందులు, విత్తనాలు, డీజిల్ ధరల పెరుగుదలతో రైతులకు పెట్టుబడుల భారం పెరిగిపోయింది. ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా నిరంతరం ధరలను పెంచుకోవడానికి పారిశ్రామికాధిపతులకు, వ్యాపారస్తులకు పూర్తిగా లైసెన్స్‌లు ఇచ్చారు. ప్రజల ఆహార భద్రత పేరు చెప్పి వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరలను స్వామినాథన్ కమిషన్ చేసిన సిపార్సుల ప్రకారం కూడా నిర్ణయించడం లేదు.
వరి ధాన్యం, ఇతర వ్యవసాయోత్పత్తులను కూడా అంతర్జాతీయ మార్కెట్ ధరల కనుగుణంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించి కొనే లేదా అమలు చేసే బాధ్యతను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వహించాలి. ప్రజలకు ఆహార భద్రతను కల్పించే బాధ్యత ప్రభుత్వానిది, సమాజానిదే తప్ప ఆ భారాన్ని రైతుల నెత్తిమీద ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రుద్దకూడదు. ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించి, సమర్థంగా నిర్వహించడం ద్వారా అర్హులైన ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడానికి అవసరమైన రాయితీలిచ్చి, ఆ భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి తప్ప ఆ పేరుతో వ్యవసాయోత్పత్తుల ధరలను నియంత్రించడం సమంజసం కాదు.
(ఎ) రైతుల జీవనోపాధికి 'సమగ్ర రక్షణ పథకం' నొకదాన్ని రూపొందించి అమలు చేయాలి. నాణ్యమైన విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, డీజిల్ తదితర 'ఇన్‌పుట్స్'ను సరసమైన ధరలకు అందించాలి. (ఏ) పట్టాదారు రైతులకుండే హక్కులు సహజంగానే కౌలు రైతులకు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కౌలురైతుల సమస్యల పరిష్కారానికి ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. 'సాగు రక్షణ హస్తం' పథకం క్రింద కౌలు రైతులకు 'రుణ అర్హత కార్డులను' దాదాపు ఐదున్నర లక్షల మందికి జారీ చేశామని ప్రభుత్వం చెబుతున్నది.
వాటి ఆధారంగా బ్యాంకుల ద్వారా ఆ పంట రుణాలను పొందే అర్హత కల్పించారు. తద్వారా భూయాజమాన్య హక్కులకు భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లుతుందేమోనన్న సందేహాలు పట్టాదారుల్లో రేకెత్తాయి. ఒక వైపు వ్యవసాయం జూదంగామారి గిట్టుబాటుగా లేకపోవటం, మరొక వైపు భూయాజమాన్య హక్కులకే భంగం కలిగే ప్రమాదం ముంచుకొస్తున్నదేమో! రిస్క్ ఎందుకు తీసుకోవాలన్న బలమైన ఆలోచనలు కూడా పంట విరామాన్ని ప్రోత్సహించినదేమో! అన్న సందేహాలు లేకపోలేదు. వీటిని నివృత్తిచేస్తూ సమగ్రమైన కౌలుదారుల చట్టాన్ని తక్షణమే రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
'పంట విరామం' సమస్యపై లోతైన అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, వార్షిక బడ్జెట్‌లలో ప్రత్యేక ఆర్థిక వనరులను కేటాయించి, ప్రణాళికా బద్ధంగా వ్యవసాయరంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. రైతాంగం కూడా తామెదుర్కొంటున్న సమస్యలకు పంట విరామం ప్రకటించడం పరిష్కారం కాదన్న విషయాన్ని గుర్తించి, సమస్యల పరిష్కారానికి ఇతర పోరాట రూపాలను ఎంచుకోవడం శ్రేయస్కరం.
- టి.లక్ష్మీనారాయణ
సిపిఐ రాష్ట్ర నాయకులు
No comments:
Post a Comment