సూర్య దినపత్రిక
- ప్రైవేట్ పరమవుతున్న జాతీయ సంపద
- సరళీకృత ఆర్ధిక విధానాలే కారణం
- కుబేరులవుతున్న దోపిడీదారులు
- బికారులవుతున్న సామాన్యులు
- నిబంధనలను కాలరాసిన రిలయన్స్
- ఓఎన్‌జీసీకి అప్పగించాలి!
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. నిన్న 2-జి స్పెక్ట్రమ్, నేడు కృష్ణ- గోదావరి బేసిన్ సహజవాయు నిక్షేపాల నిలువుదోపిడీ ఉదంతాలను కాగ్ వెలుగులోకి తీసుకొచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ లక్షల కోట్ల విలువైన జాతీయ సంపదను అక్రమ మార్గంలో తరలించుకుపోతున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టు బహిర్గతం చేసింది. కేంద్ర ప్రభుత్వం అవినీతి ఊబిలో పీకల్లోతు కూరుకుపోయి చేసిన నిర్వాకమే జాతి సంపద దారిమళ్ళడానికి కారణం. ఇప్పుడు కాగ్ నివేదికపై యుపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నోరు మెదపడం లేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో ఎందుకు నోటికి ‘ప్లాస్టర్’ వేసుకున్నట్టు?
కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే సరళీకృత ఆర్ధిక విధానాల అమలు పర్యవసానంగానే ఈ చట్టబద్ధమైన, చట్ట వ్యతిరేకమైన దోపిడీ, అవినీతి, అక్రమాలు కొనసాగుతున్నాయి. జాతి సంపదను కొల్లగొట్టకుండా పరిరక్షిస్తామని నమ్మబలికిన ప్రభుత్వాధినేతలు, దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అక్రమార్జనపరులకు లైసెన్స్‌లు మంజూరు చేశారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ మార్కెట్ ఆర్ధిక వ్యవస్థకు కంకణబద్ధులై, ప్రభుత్వ రంగాన్ని ధ్వసం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని భుజాలకెత్తుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో నాల్గవ స్థానానికి ఎగబాకారని పోర్బ్‌స సంస్థ ప్రకటించినప్పుడు, ఆయన అంత సంపదను ఎలా పోగేసుకున్నారన్న హేతుబద్ధమైన ప్రశ్న ఎదురు కాలేదు. మన దేశ జనాభాలో 77 శాతం మంది కేవలం రూ. 20 సగటు దినసరి ఆదాయంతో కటిక దారిద్య్రంలో మగ్గిపోతున్నారని అర్జున్ సేన్ గుప్తా కమిటీ పేర్కొంది. మన దేశం పేదది కాదు, మన ప్రజలే పేదలు. దేశం అభివృద్ధి చెందుతూ సాధించిన ఆర్ధిక ఫలితాలు కార్పొరేట్ సంస్థల అధిపతుల సొంతమవుతున్నాయి. అందుకు ముఖేష్ అంబానీ పోగేసుకున్న సంపదే తార్కాణం. ఆయన వార్షిక వేతనం పద్దు కింద 2007-08లో తీసుకున్నది రూ. 44 కోట్లు అని ఆయన కంపెనీ ఆడిట్ అకౌంట్లను బట్టి వెల్లడయ్యింది.
ఇది అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం కంటె ఇరవై రెట్లు అధికం. ముఖేష్ నిర్మించుకున్న బహుళ అంతస్తుల సౌధాలు, ఆయన సతీమణికి జన్మదిన కానుకగా వందల కోట్ల రూపాలయ విలువ చేసే విమానాల బహుమతులు వగైరా ఆర్భాటాల గురించిన వార్తలు ప్రసారమాధ్యమాల్లో వస్తే, ముక్కుమీద వేళ్ళు వేసుకుని ఆశ్చర్యపోయిన వారే గాని, ఈ వైభోగం వెనుకన ఉన్న ఘరానా దోపిడీని జనం పసిగట్టలేకపోయారు. ఎటువంటి అడ్డదారులు తొక్కితే త్వరితగతిన సంపదను గుట్టలు గుట్టలుగా వేసుకోవచ్చో- దేశంలో ఒక్కొటొక్కిటిగా వెలుగు చూస్తున్న ఆర్ధిక కుంభకోణాలు బయటపెడుతున్నాయి.
ప్రకృతి సిద్ధమైన భూమి, సముద్ర గర్భంలో, తీర ప్రాంతాల్లో లభిస్తున్న అపార సహజ వాయువు, చమురు నిక్షేపాలు, ఇనుము, బొగ్గు, బెరైటీస్, లైంస్టోన్, గ్రానైట్ తదితర భూగర్భ ఖనిజ సంపద, నదుల్లోని ఇసుక, సాగర తీరాల్లో బీచ్ శాండ్ సంపదలతో సహా సెల్యుటార్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వగైరా సాంకేతికాభివృద్ధి ఫలితాలను ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా పెట్టుబడిదారులు వక్రమార్గాల ద్వారా సొంతం చేసుకుంటున్నారు. ఇందుకు ప్రబల నిదర్శనమే కాగ్ నివేదికలు.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న భూ సంపదను పారిశ్రామికాభివృద్ధి ముసుగులో ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు (సెజ్‌లు), ఓడ రేవులు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలకు అవసరాలకు మించి ఇష్టానుసారం పందారం చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించి, భూమి విలువను కృత్రిమంగా ఇబ్బడి ముబ్బడిగా పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసింది.
ఖనిజ సంపదను గాలి జనార్దన రెడ్డి వంటి వ్యక్తులకో, జిందాల్ వంటి సంస్థలకో ధారాదత్తం చేసింది. కృష్ణ- గోదావరి బేసిన్ లోని సముద్ర గర్భంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదపై యాజమాన్య హక్కు కేంద్ర ప్రభుత్వానిదే. సాగర తీరంలోని భూగర్భ ఖనిజ సంపదపైనే రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలోని కె.జి. బేసిన్‌లో చమురు, సహజ వాయువు నిక్షేపాలను అన్వేషించి వెలికితీసే పని కోసం ప్రభుత్వ రంగంలోని చమురు, సహజవాయువుల సంస్థ గ్లోబల్ టెండర్లు పిలిచి రిలయన్స్‌ను, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థను ఎంపిక చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో అటువంటి కార్యకలాపాలు నిర్వహించే సంస్థను నెలకొల్పలేక పోయింది.
పర్యవసానంగా ఈ అవకాశాన్ని కోల్పోయాము. మన సముద్ర తీరంలో నిక్షిప్తమై ఉన్న అమూల్యమైన జాతి సంపదలో మన వాటా దక్కక పోగా, మన రాష్ట్ర అవసరాలకు కావలసిన సహజ వాయువు కోసం ప్రైవేట్ రంగంలోని రిలయెన్స్ సంస్థపై ఆధారపడవలసి వచ్చింది.
కేంద్ర చమురు, సహజవాయువుల మంత్రిత్వ శాఖ రిలయన్స్ సంస్థతో కుమ్మకై్క, వారికి కేజీ బేసిన్‌లో లభించే అపారమైన చమురు, సహజవాయువు నిక్షేపాలను ధారాదత్తం చేసింది. దేశ సహజ వాయువు అవసరాలను 25 శాతం తీర్చడానికి సరిపడ నిల్వలు కేజీ బేసిన్‌లో ఉన్నాయని అంచనా. సరళీకృత ఆర్ధిక విధానాలలో భాగంగా 1997లో రూపొందించిన నూతన అన్వేషణా లైసెన్స్ విధానం, ఈ జాతి సంపదను రిలయన్స్ వంటి సంస్థలు దోచుకోవడానికి రాచబాట వేసింది.
రిలయన్స్ పెట్టుబడులపై ముఖేష్ అంబానీ చెప్పిన వాటిపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేసినా కేంద్ర మంత్రిత్వశాఖ, దాని ఆధీనంలో పని చేసే డైరెక్టరేట్ ఆఫ్ హైడ్రో కార్బన్స్ గుడ్డిగా ఆమోద ముద్ర వేయడం ద్వారా ఘరానా దోపిడీకి లైసెన్స్‌నిచ్చింది. ఒప్పందాన్ని తుంగలో తొక్కి యథేచ్ఛగా అక్రమార్జన చేస్తూ జాతి సంపదను కొల్లగొడుతున్నా గుడ్లప్పగించి చూస్తున్నది ేంద్ర ప్రభుత్వం. కాగ్ నివేదిక ఇదే విషయాన్ని బట్టబయలు చేసింది. తమ పెట్టుబడి వ్యయం 2.4 బిలియన్ డాలర్లనుంచి 8.8 బిలియన్ డాలర్లకు పెరిగిందని రిలయన్స్ నివేదించగానే ప్రభుత్వం దానిని ఆమోదించడం దారుణం. దాదాపు నాలుగు రెట్లు పెరగడమేమిటని ప్రశ్నించిన పాపాన పోలేదంటే విధాన నిర్ణేతలు రిలయన్స్ సంస్థకు నిస్సిగ్గుగా లొంగిపోయారని అర్ధమవుతున్నది.
ఒప్పందంలోని షరతు మేరకు- వచ్చిన ఆదాయంలో ఉత్పత్తి వ్యయాన్ని పూర్తిగా రాబట్టుకున్న తర్వాత వచ్చే లాభాలను మాత్రమే పంచుకోవాలి. అంటే, అంతవరకూ కేజీ బేసిన్ డి-6 బ్లాకు నుంచి వెలికితీసే సహజవాయువు నిక్షేపాలనుంచి చిల్లిగవ్వగూడా రాబడి రాకుండా ప్రభుత్వానికి రిలయన్స్ గండికొట్టింది. ఒప్పందం ప్రకారం అన్వేషణ ప్రక్రియ కొనసాగుతున్న కాలంలో మొదటి దశ పూర్తి కాగానే, అన్వేషణలో ఉన్న ప్రాంతంలో 25 శాతం చొప్పున మొత్తం 7,645 చదరపు కిలోమీటర్లలో 1,911 చ.కి.మీ. ప్రాంతాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. ఈ నిబంధనను రిలయన్స్ కాలరాసింది. అందుకు వత్తాసు పలుకుతూ మొత్తం ప్రాంతాన్ని అన్వేషణలో ఉన్న ప్రాంతంగానే పరిగణిస్తూ కేంద్రం ఆమోద ముద్రవేసి, తనకు తానుగానే ఒప్పందాన్ని బుట్టదాఖలా చేసింది.
ఆదాయపు పన్ను చట్టం 35 ఎ, డి సెక్షన్లను ఉపయోగించుకుని సహజవాయువు, ముడి చమురు పైప్‌లైన్ ఏర్పాటు, నిర్వహణకు అయ్యే పెట్టుబడి వ్యయంపై పన్నును 100 శాతం మినహాయింపునివ్వడం ద్వారా ప్రభుత్వం ముఖేష్ అంబానీకి రూ.20,000 కోట్ల ప్రయోజనం కల్పించిందన్న విమర్శలున్నాయి.సహజవాయువు అమ్మకం ధర నిర్ణయంలోనూ రిలయన్స్ సంస్థకు ప్రభుత్వం దాసోహం పలికింది. జాతి సంపద అయిన కేజీ బేసిన్ డి-6 సహజవాయువు నిక్షేపాలను ముఖేష్ కుటుంబ ఆస్తిగా పరిగణించిన ముంబయి హైకోర్టు సహజవాయువు వెలికితీత కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను ముఖేష్ అంబానీి, విద్యుదుత్పత్తి కంపెనీలను అనిల్ అంబానీకీ కేటాయించింది. అలాగే యూనిట్ గ్యాస్ ధరను రూ.105కు సరఫరా చేయాలని తీర్పు చెప్పింది. జాతి సంపదనను ఒక కుటుంబ సంపదగా పరిగణించే వీలు లేదని వాదించవలసిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదు. ఈ వివాదం చిలికి చిలికి సుప్రీం కోర్టుకు చేరిన తర్వాత మాత్రమే ప్రభుత్వానికి చలనం వచ్చి, సహజవాయు నిక్షేపాలను జాతి సంపదగా పరిగణించాలని నోరు విప్పింది.
ముంబయి హైకోర్టు యూనిట్ గ్యాస్ ధరను రూ.105గా నిర్ణయించి, అనిల్ అంబానీకి చెందిన విద్యుదుత్పత్తి కంపెనీలకు సరఫరా చేయాలని చెప్పిన తీర్పుకు అనుగుణంగా, అదే రేటుకు ప్రభుత్వ రంగ సంస్థలకు, మన రాష్ట్ర అవసరాలకు సరఫరా చేయాలి పలువురు డిమాండ్ చేసినా కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. పైపెచ్చు, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థలకు యూనిట్ గ్యాస్ ధరను రూ. 189గా నిర్ణయించడం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,770 మెగా వాట్ల ఉత్పత్తి సామర్ధ్యమున్న 9 గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు రోజుకు పది లక్షల ఘనపు మీటర్ల గ్యాస్‌ను కేంద్రప్రభుత్వం కేటాయించింది.
విశాఖ ఉక్కు కార్మాగారానికి, ఎరువుల ఫ్యాక్టరీలకు, విద్యుదుత్పత్తి కేంద్రాలకు, గృహావసరాలకు మన కేసీ బేసిన్‌లో పుష్కలంగా లభిస్తున్న సహజవాయువును వినియోగించుకోగలిగితే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అదెంతో తోడ్పడుతుంది. కాగ్ నివేదిక నేపథ్యంలో ఒప్పందాలను ఉల్లంఘించిన రిలయన్స్‌తో తెగతెంపులు చేసుకుని, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఒఎన్‌జీసీ ఆధ్వర్యంలో గ్యాస్ వెలికితీత పనులను నిర్వహించాలి. సరసమైన ధరలకు గ్యాస్‌ను సరఫరా చేయాలి.
కాగ్ నివేదికలకు విలువనిచ్చే నైజం ప్రభుత్వాలకు లేదు. 2-జి స్పెక్ట్రమ్ కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానాకు రావలసిన రూ. 1,76,000 కోట్ల ఆదాయం దారిమళ్ళిపోయిందని కాగ్ అంచనా వేస్తే అవినీతి మరకలేని ప్రధాని నోటిమాటలతో కొట్టివేశారు. కేంద్ర చమురు, సహజవాయువుల మంత్రిత్వశాఖలోని అధికారులు కాగ్ నివేదికపై ఇప్పటికే పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం మెడలు వంచడానికి ప్రజలే నడుం బిగించాలి. అవినీతి అంతంకోసం జనలోక్‌పాల్ చట్టం కోసం పోరాడుతున్న అన్నా హజారే, ఆయన బృందం కార్పొరేట్ సంస్థల అవినీతి, అక్రమార్జనలపైన, అవినీతికి ఆస్కారం కల్పిస్తున్న సరళీకృత ఆర్ధిక విధానాలపైనా మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం.
No comments:
Post a Comment