ప్రచురణ: సెప్టంబరు 17, 2014 సూర్యా దినపత్రిక
"నిజాం నిరంకుశ పాలన నుంచి,
భూస్వాముల అమానుష పీడన నుంచి, విముక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం, తెలుగు జాతి సమైక్యత
కోసం గుండె నెత్తురులు తర్పణ చేసిన నాలుగు వేల మా తెలంగాణా వీరులకు అంకితం” అన్న ఈ మాటలు 'వీర తెలంగాణా నా అనుభవాలు - జ్ఞాపకాలు' శీర్షికతో అమరజీవి రావి నారాయణరెడ్డి గారు తెలంగాణా సాయుధ పోరాటం రజతోత్సవాల
సందర్భంగా రచించిన పుస్తకాన్ని అంకితం చేస్తూ అక్షరబద్దం చేయబడినవి. మహోజ్వలమైన
తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ఒక
సువర్ణాధ్యాయంగా లిఖించబడింది. ఈ వీరోచిత పోరాటం తరాలు మారినా చైతన్య స్ఫూర్తిని
నింపుతూనే ఉన్నది. నైజాం నిరంకుశ పాలనకు సమాధికట్టి ప్రజలకు స్వేచ్ఛా
స్వాతంత్య్రాలను సముపార్జించి పెట్టిన మహోద్యమం. స్వదేశీ సంస్థానాలలోకెల్లా నైజాం
సంస్థానమే అతిపెద్దది. బ్రిటీషు పాలకులకు నమ్మిన బంటుగా ఉన్న నైజాం
నిరంకుశ పాలనలో
మగ్గిపోతున్న హైదరాబాదు సంస్థానం భారత దేశంలో విలీనం కాకుండా దేశ స్వాతంత్య్రం
పరిపూర్ణతను సంతరించుకోజాలదు. నాటి ఆ వీరోచిత పోరాటం ద్వారా ఉత్తర, దక్షిణాది
ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న నైజాం నిరంకుశ పాలనలోని తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాలను
విముక్తి చేసి భారత దేశంలో విలీనం చేసి ఉండక పోతే నేడు దేశ ముఖచిత్రం ఎలా ఉండేదో
ఊహించడం కష్టం. దేశ విభజన
పర్యవసానాలను చవి చూస్తూనే ఉన్నాం. స్వతంత్ర దేశంగా మనుగడ సాగించాలన్న నైజాం కల
నెరవేరి ఉంటే మన దేశ సార్వభౌమత్వం, ఐక్యత ప్రశ్నార్థకమయ్యేవి. ఈ సమరశీల పోరాటం ద్వారా
తమను తాము విముక్తి చేసుకోవడమే కాదు దేశాన్ని ఆ పెనుముప్పు నుండి రక్షించిన
ఘనకీర్తి కూడా వీర తెలంగాణా సాయుధ పోరాట యోధులకే దక్కుతుంది.
స్వాతంత్య్రానంతరం బ్రిటీష్ సామ్రాజ్యవాదులు దేశాన్ని వదిలి వెళ్ళుతూ మౌంట్
బాటన్ పథకాన్ని అమలుపరిచారు. దాని ప్రకారం ఏ స్వదేశీ సంస్థానమైనా స్వతంత్ర్యంగా
మనుగడ సాగించడానికి స్వేచ్ఛ కల్పించడం జరిగింది. బ్రిటీష్ వలస పాలకులకు నమ్మిన
బంటుగా ఉన్న నిజాం నవాబు లాంటి వారు తమ సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయకుండా
స్వతంత్రంగా మనుగడ సాగిస్తే తమ దోపిడీ విధానాలను మరొక రూపంలో కొనసాగించవచ్చని
కుట్రపూరితంగా వలసవాదులు వ్యవహరించారు. దేశంలోని 550 పైచిలుకు సంస్థానాలలో
హైదరాబాదు, జమ్మూ కాశ్మీర్ లాంటి రెండు మూడు సంస్థానాలు మినహాయించి అన్నీ
స్వాతంత్ర్యానంతరం భారత దేశంలో విలీనమైనాయి. దేశంలోనే అతిపెద్ద సంస్థానమైన హైదరాబాదు సంస్థానాన్ని భారత దేశంలో విలీనం
చేయడానికి నిజాం నవాబు నిరాకరించి, తాను స్వతంత్రుడనని, హైదరాబాద్
సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా 1947 ఆగస్టు 7న ప్రకటించుకొన్నాడు.
దాంతో సంస్థాన ప్రజలంతా తిరగబడ్డారు. కాంగ్రెస్ సత్యాగ్రహ ఆందోళనతో మొదలై మొత్తం
ప్రజల ప్రతిఘటనోద్యమంగా పరిణతి చెంది కడకు సాయుధ పోరాటంగా
ఉగ్రరూపందాల్చింది. రైతాంగం, వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక కార్మికులు, విద్యార్థులు, వకీళ్ళు అందరూ ఉద్యమ బాట పట్టారు. పల్లెపల్లే పోరాట
కేంద్రాలుగా రూపుదాల్చాయి. నైజాం జెండాను పీకిపారేసి జాతీయ పతాకాన్ని గ్రామ
గ్రామానా ప్రతిష్టించారు. హైదరాబాద్ లోని రైల్వే వర్క్ షాప్, జౌళి పరిశ్రమ, డ్రైనేజి, నాందేడ్ జౌళి
కార్మికులు సమ్మె చేశారు. రైల్వే వర్క్ షాప్, ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్
కార్యాలయాలపైన మరియు ఇతర కేంద్రాలలో భారత ప్రభుత్వ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
దేశంలో బ్రిటిష్ వలస పాలన, హైదరాబాదు సంస్థానంలో నైజాం ప్యూడల్ రాచరిక వ్యవస్థ
ఉండేది. దేశమంతటా స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగసిపడుతున్న రోజులవి. కానీ నైజాం
సంస్థానంలో అణిగిమణిగి జీవించే బానిస వ్యవస్థ కొనసాగుతున్న కాలమది.
ప్రప్రథమంగా 1938లో కామ్రేడ్స్ అసోషియేషన్ పేరిట కమ్యూనిస్టు గ్రూపు
ఏర్పడింది. కామ్రేడ్స్ అసోషియేషన్ లోని కార్యకర్తలు అత్యధిక కాలం అజ్ఞాతంలో ఉంటూనే
కార్యకలాపాలు నిర్వహించేవారు. వారి కార్యకలాపాలపై నిషేధం, నిర్బంధకాండ
కొనసాగేది. నిజాం ప్రభుత్వం నాయకులను అరెస్టు చేసి, శిక్షలు విధించేది. "ప్రజల ఆకాంక్షలకు, స్వాతంత్య్ర ఉద్యమానికి 'వందేమాతరం' దేశంలోని ప్రజాతంత్ర శక్తులకు స్ఫూర్తి గీతం. నైజాం
సంస్థానంలో వందేమాతరం ఉద్యమం ప్రగతిశీల ప్రజాతంత్ర భావాలు గల విద్యార్థులను
ఎంతగానో ప్రభావితుల్ని చేసింది. రాజకీయ ఉద్యమాల పట్ల ఆసక్తిని పెంపొందించింది.
మతం, భాషా విషయాల్లో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షత, అమలులో ఉన్న నిర్బంధాలు, ప్రజాస్వామ్య హక్కులు లేక పోవడం అన్ని వర్గాల వారిని ఉద్యమబాటకు పురికొల్పాయి. దేశ వ్యాపితంగా ఉవ్వెత్తున సాగుతున్న స్వాతంత్య్రోద్యమం పూర్వరంగంలో హైదరాబాదు
స్టేట్ లో 1945 - 46 లలో రైతాంగ మరియు కార్మికవర్గ పోరాటాలు
పెల్లుబికాయి. గ్రామీణ ప్రాంతంలో
జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, భూస్వామ్య రాచరిక కుటుంబాలు సాగిస్తున్న
నికృష్టమైన దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. కడవెండిలో 1946 జూలై 4 న దేశ్ ముఖ్ ల గూండాలు దొడ్డి కొమరయ్యను కాల్చి
చంపడంతో ఆ పోరాటం ఉవ్వెత్తున ప్రజ్వరిల్లింది. తెలంగాణ పల్లెల్లో నిర్బందకాండ పెరిగింది. ఆంధ్ర
మహాసభ, కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఎ.హెచ్.టి.యు.సి. ని కూడా ప్రభుత్వం నిషేధించి, నాయకులపై అరెస్టు
వారంట్లను జారీ చేసింది.
నైజాం వెన్నుదన్నుగా నిలవగా - ఖాసింరజ్వీ నాయకత్వంలోని రజాకార్లు సాయుధులై
గ్రామాలపై విరుచుకుపడి ప్రజాఉద్యమాన్ని అణగదొక్కడానికి పూనుకొన్నాడు. వారికి
పోలీసులు, మిలిటరీ కూడా అండగా నిలబడింది. ప్రజాఉద్యమంపై దమనకాండ తీవ్రమయ్యింది. పరిస్థితుల్లో వచ్చిన గుణాత్మకమైన
మార్పును గమనించిన ఉద్యమ నాయకత్వం రాజకీయ విముక్తి నినాదంతో పోరాటాన్ని ఉధృతం
చేసింది. హైదరాబాదు
సంస్థానాన్ని భారత దేశంలో అంతర్భాగం చేయాలని డిమాండ్ చేస్తూ 1947 సెప్టంబరు 11న సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ మరియు
ఆల్ హైదరాబాద్ ట్రెడ్ యూనియన్ కాంగ్రెస్ లు పిలుపిచ్చాయి. నైజాం నిరంకుశ పాలన అంతం కోసం తెలంగాణ రైతాంగ
సాయుధ పోరాటానికి పిలుపిస్తూ విడుదల చేసిన ప్రకటనపై సంతకాలు చేసిన ముగ్గురు
ప్రముఖుల్లో ఎ.హెచ్.టి.యు.సి. వ్యవస్థాపక అధ్యక్షులు మఖ్దూం మొహియిద్దీన్ ఒకరు.
రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు భారాత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ
ప్రతినిథులుగా సంతకాలు పెట్టారు. పోరాటంలో పురుషులతో పాటు మహిళలు అమోఘమైన, వీరోచితమైన పాత్ర
పోషించారు. అపారమైన త్యాగాలు చేశారు. పౌర హక్కులు, సాంస్కృతిక స్వాతంత్ర్యం కోసం, వెట్టిచాకిరికి
వ్యతిరేకంగా వివిధ రూపాలలో ఉద్యమించారు. గ్రంథాలయోద్యమం, వందేమాతరం ఉద్యమం, సాంస్కృతికోద్యమాలు నిర్వహించబడ్డాయి. ఆంధ్ర
మహాసభ, కమ్యూనిస్టు పార్టీ, ఆల్ హైదరాబాదు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఆల్ హైదరాబాద్
స్టూడెంట్స్ యూనియన్ తదితర సంస్థలు ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ప్రధానమైన భూమికను
పోషించాయి.
ఆంధ్ర ప్రజలు, ప్రత్యేకించి కమ్యూనిస్టు శ్రేణులు, కష్టజీవులు అండగా
నిలవడమే కాదు అనేక మంది ప్రత్యక్షంగా సాయుధ పోరాటంలో పాల్గొని ప్రాణ త్యాగాలు
చేశారు. ప్రజాపోరాటం తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించి మహోధృతంగా
ఉగ్రరూపందాల్చడంతో నైజాం పాలన పూర్తిగా స్థంభించిన నేపథ్యంలో యథాతథపు స్థితిని
కొనసాగించే ఒడంబడికను కాంగ్రెస్ నాయకత్వం నైజాం నవాబుతో కుదుర్చుకొన్నది. దాని
ప్రకారం నిజాం తన జనరల్స్ ను ఇతర దేశాల్లో తన ప్రతినిథులుగా నియమించుకోవచ్చు.
అలాగే కేంద్ర ప్రభుత్వం తమ ప్రతినిథులను హైదరాబాదులో నియమించుకోవచ్చు. ఈ రాజీ
ఒప్పందం మేరకే సర్దార్ పటేల్ శిష్యుడైన కె.యం.మున్షీ హైదరాబాదులో భారత ఏజెంట్
జనరల్ గా నియమించబడ్డాడు. కార్మిక నాయకుడుగా ఉన్న ఫతేహుల్లా ఖాన్ కార్మికులకు
ద్రోహం చేసి, ఫిరాయించి రజాకార్ల పంచన చేరి, హైదరాబాదు నైజాం ప్రభుత్వ ప్రతినిథిగా కరాచిలో
నియమితుడైనాడు. అంటే నైజాం నవాబుకు పాక్షికంగానైనా స్వతంత్రతను
కేంద్ర ప్రభుత్వం ప్రసాదించింది. ఈ ఒడంబడికలో ప్రజోద్యమానికి సంబంధించిన
ప్రస్తావనే లేకపోవడంతో ప్రజాగ్రహం పెల్లుబికింది.
పోలీసు చర్య: ఉప్పెనలా ఎగసిపడుతూ విస్తరిస్తున్న ఉద్యమంతో కమ్యూనిస్టుల ప్రాబల్యం
దినదినాభివృద్ధి చెందుతుండడంతో కంగుతిన్న కేంద్ర ప్రభుత్వం యథాతథపు ఒడంబడిక గడువు
ముగియక ముందే యూనియన్ సైన్యాలను 1948 సెప్టంబరు 13న హైదరాబాదు సంస్థానం మీదకు పంపి పోలీసు చర్యకు
పూనుకొన్నది. నిజాం ప్రభుత్వ
పాలనకు అంతం పలికి హైదరాబాదు సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయడం, భూస్వామ్య శక్తుల
ఆగడాలకు కొంత వరకు అడ్డుకట్ట వేయడం, కమ్యూనిస్టు పార్టీని అణగదొక్కడం, సాధ్యమైతే నిర్మూలించడమనే
లక్ష్యంతోనే - నాటి హోం శాఖామాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ పథకం ప్రకారం పోలీస్ చర్యకు పూనుకొన్నారు.
నైజాం పాలనకు సమాధి కట్టబడిందని ప్రజలు పోలీసు చర్యకు మద్దతు
పలికారు. ప్రజల్లో వచ్చిన గుణాత్మకమైన మార్పును కమ్యూనిస్టులు గుర్తించ
నిరాకరించారు. యూనియన్ సైన్యం ప్రదర్శించిన పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకత, సాగించిన దమనకాండతో ప్రతీకారెచ్చతో రగిలిపోయిన
కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని కొనసాగించి నిర్మాణ రీత్యా తీవ్రంగా నష్టపోయారు.
కానీ, తరతరాల నుండి పీల్చి పిప్పిజేస్తున్న మధ్య యుగాల నాటి నికృష్టమైన దోపిడీ విధానానికి, నైజాం నిరంకుశ
పాలనకు సమాధికట్టే మహదాశయంతో తెలంగాణ ప్రజలు సాగించిన అజరామరమైన పోరాటంగా
"తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం" ప్రపంచ దృష్టిని
ఆకర్షించింది. తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజల మాతృ భాషలను అణచి వేసి, ఉర్దూ భాషను
నిర్భంధంగా రుద్దడం జరిగింది. భూమి సమస్య కేంద్ర బిందువుగా సాగిన ఈ వీరోచిత
పోరాటం ద్వారా భూస్వాముల కబంధ హస్తాల
నుండి పది లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకొని దున్నేవానికే భూమి నినాదాన్నిసాకారం
చేసి భారత రైతాంగానికి తెలంగాణ రైతు, కూలీలు మార్గదర్శకులైనారు. ఆర్థిక దోపిడీకి
వ్యతిరేకంగా పోరాడాలన్న ఆకాంక్షతో పాటు సమాన హక్కుల కోసం,
అంటరానితనానికి
వ్యతిరేకంగా ఉద్యమించాలన్న చైతన్యానికి బీజాలు
పడ్డాయి. నాలుగు వేల మందికిపైగా వీరయోధులు బలయ్యారు. వేలాది మంది జైళ్ళలో కౄరమైన
నిర్బంధాలకు, చిత్రహింసలకు గురైనారు. పోలీసు కాల్పులు, లాఠీదెబ్బలు, గృహదహనాలు, మానభంగాలు మొదలైన
అమానుషమైన నిర్బందకాండకు సామాన్య ప్రజలు ఎదురొడ్డి ధీరోదాత్తులుగా చరిత్ర
పుటలకెక్కారు.
ఈ చరిత్రాత్మకమైన పోరాటానికి నాయకత్వం వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల
హృదయాలలో చెరగని స్థానాన్ని సముపార్జించుకొన్నది. పర్యవసానంగా 1952లో జరిగిన
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో 44 స్థానాల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ప్రంట్
(పిడిఎఫ్) పేరు మీద పోటీ చేసిన కమ్యూనిస్టులను 36 స్థానాల్లో గెలిపించి బ్రహ్మరథం పట్టారు. కన్నడ, మరాఠీ ప్రాంతాలలో
కమ్యూనిస్టుల ప్రాబల్యం లేకపోవడం మూలంగా కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించి
హైదరాబాదు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కనాకష్టం మీద ఏర్పాటు చేయగలిగింది. ఈ పోరాటం వల్ల
ప్రజల్లో విప్లవ చైతన్యం పెల్లుబికింది. భూస్వాములు, పెట్టుబడిదారులు తమ నికృష్టమైన, నగ్నమైన దోపిడీకి నూకలు చెల్లాయని గ్రహించి దోపిడీ రూపాల్లో కొన్ని మార్పులు
చేసుకొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణం ద్వారా దోపిడిని యధేచ్ఛగా
కొనసాగిస్తున్నారు. దళిత బడుగు బలహీన వర్గాలు, శ్రామిక వర్గాల జీవన పరిస్థితుల్లో ఆశించిన ప్రగతి
సాకారం కాలేదు.
ఆరున్నర దశాబ్దాలు గడచిపోయాయి. తెలంగాణ సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో
వచ్చిన పరిణామాలపై సమగ్రమైన అధ్యయనం జరగాలి. దేశ స్వాతంత్య్రం, నైజాం నిరంకుశ పాలన
అంతం పర్యవసానంగా ప్రజల జీవితాల్లో సంబవించిన మార్పు, మౌలిక సమస్యల పరిష్కారంలో సాధించిన ప్రగతిని నాడు
తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ వారసులు
వర్గ దృక్పథంతో పరిశీలించి, నాటి సమరశీల ఉద్యమ లక్ష్యాలను పరిపూర్తి చేయడానికి
పునరంకితం కావడం ద్వారా మాత్రమే అమరజీవులకు నిజమైన నివాళి అర్పించిన వారవుతారు.
Email:
lntunga@yahoo.com
No comments:
Post a Comment