Thursday, September 11, 2014

"నేటి ఆంధ్రప్రదేశ్-రాయలసీమ సమగ్రాభివృద్ధి"అన్న అంశంపై కీ.శే.వై.ఈశ్వరరెడ్డి వర్థ‍ంతి సభలో నేను చేసిన స్మారకోపన్యాసం.




ఆంధ్ర ప్రదేశ్ - రాయలసీమ సమగ్రాభివృద్ధిఅన్న అంశంపై అమరజీవి ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్థంతి(ఆగస్టు 3) సంద‌ర్భాన్నిపురస్కరించుకొని సెప్టంబరు 3న సి.పి.ఐ. కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో స్మారకోపన్యాస సభ నిర్వహించబడింది. అన్నగా కడప జిల్లా ప్రజల చేత ఆప్యాయంగా పిలిపించుకోబడిన‌ కీ.శే. వై. ఈశ్వరరెడ్డి గారి గురించి రెండు మాటలు.  మొదటి లోక్ సభకు 1951లో జరిగిన సార్వత్రిక‌ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా కడప‌ లోక్ సభ స్థానం నుంచి  ఎద్దుల‌ ఈశ్వరరెడ్డి గారు ఘనవిజయం సాధించారు. తరువాత 1962,1967,1971 సం.లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుస‌ విజయాలతో రెండు దశాబ్దాల పాటు పార్లమెంటు సభ్యులుగా ఉండి చరిత్ర పుటలకెక్కిన ధన్యజీవి. కమ్యూనిస్టు నైతిక విలువలకు, త్యాగానికి, నిస్వార్థ‌ ప్రజాజీవితానికి, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తిత్వం ఆయనది. రాజకీయాలు వ్యాపారంగా మారిన తరువాత అలాంటి మహనీయుల కోవకు చెందిన పార్లమెంటు సభ్యులు కరువై పోయారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వ‌రయ్య అధ్యక్షతన జరిగిన‌ నాటి సభకు వక్తలుగా నాతో పాటు డా. యన్. తులసిరెడ్డి, జి.ఓబులేసు, సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి, బి.నారాయణ తదితరులు హాజరయ్యారు. నా ప్రస‍ంగంలోని ముఖ్యాంశాలను నా బ్లాగ్ ద్వారా మిత్రులతో పంచుకొంటున్నాను.
విశాలాంధ్రలో ప్రజారాజ్యం కల చెదిరిపోయింది. తెలుగు జాతి రెండు ముక్కలయ్యింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడినప్పుడు కర్నూలు పట్టణాన్ని రాజథానిగా ఎంపిక చేసుకొన్న మీదటనే 1953 అక్టోబరు 1వ తేదీన ప్రప్రథమ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్బిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి పురుడుపోసి, అభివృద్ధి చెందిన‌ హైదరాబాదు మహానగరాన్ని అప్పజెప్పి, మిగిలిన‌ పదమూడు జిల్లాలతో కూడిన కోస్తాంధ్ర, అత్యంత వెనుకబడ్డ‌ రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ అన్న పేరుతోనే రాష్ట్రాన్ని పునర్యవస్థీకరించారు. ఒక నాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నడుంకట్టి, ఉద్యమించి విజయదుంధుభి మ్రోగించిన‌ తెలుగు జాతే విచ్ఛిన్నమై భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకొంటుంటే గుండె తరుక్కుపోతున్నది.
ఈ పూర్వరంగంలో అవశేష‌ ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, మధ్య కోస్తా ప్రాంతాల భౌగోళిక, సామాజిక‌, ఆర్థిక, రాజకీయాంశాలను, చరిత్ర, సంస్కృతి మరియు భాషాపరమైన‌ మాండలికాంశాలను పరిగణలోకి తీసుకొంటే ఈ ప్రాంతాల మధ్య ఉన్న‌ వైవిద్యం, అభివృద్ధిలో ఉన్న అంతరం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఒడిస్సా రాష్ట్ర సరిహద్దుల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్రా, గోదావరి నదికి అటు ఇటు ఉన్న తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా నదికి అటు ఇటు ఉన్న కృష్ణా మరియు గుంటూరు జిల్లాలతో కూడిన‌ మధ్య కోస్తా, ప్రకాశం మ‌రియు నెల్లూరు జిల్లాలతో కూడిన దక్షిణ కోస్తా, నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లిపోతున్న రాయలసీమ ప్రాంతాల స్థితిగతులపై శాస్త్రీయమైన అధ్యయనం చేసి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, రాజకీయ సంకల్పంతో అమలు చేయాలి. సమగ్రాభివృద్ధిని సాకల్యం చేసుకోవడం ద్వారా నేటి ఆంధ్రప్రదేశ్ సమైక్యతకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించడ‍ం నేటి తరంపై ఉన్న చారిత్రక కర్తవ్యం.  
కోస్తాంధ్ర ప్రాంతానికి 974 కి.మీ. విస్తరించి ఉన్న సముద్ర తీరం భౌగోళికంగా ప్రకృతి ప్రసాదించిన వరం. కోస్తాంధ్రలో సగటు వర్షపాతం 1050 మి.మీ. పైగా ఉన్నది. కాటన్ దొర పుణ్యమాని జీవ నదులుగా పరిగణించబడే కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ముందు పీఠిన నిలిచి వ్యవసాయాభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయ రంగంలో ఆర్జించిన మిగులును పెట్టుబడులుగా మార్చి పారిశ్రామికాభివృద్ధికి, పట్టణీకరణకు, సామాజిక ప్రగతికి ఆ ప్రాంతంలో ఆరేడు దశాబ్దాల క్రితమే పునాదులు వేయబడ్డాయి. బ్రిటీష్ వాళ్ళ పాలనా కాలంలోనే పారిశ్రామికాభివృద్ధికి శ్రీకారం చుట్టబడిన విశాఖపట్నం అవశేష ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఆవిర్భవించింది. సామాజికంగా, ఆర్థికంగా కోస్తాంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతాని కంటే బాగా ముందంజలో ఉన్నది. జిల్లాల తలసరి ఆదాయాలను ప్రామాణికంగా తీసుకొంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మిగిలిన పదకొండు జిల్లాల కంటే వెనుకబడి ఉన్నాయి. ప్రాంతాల తలసరి ఆదాయాన్ని లెక్కిస్తే రాయలసీమ అట్టడుగున ఉన్నది.
రాయలసీమ భౌగోళికంగా కొంత‌ అననుకూల ప్రాంతంగా ఉన్నాఅభివృద్ధి చెందిన‌ మూడు మహానగరాలు (హైదరాబాదు, బెంగుళూరు, చెన్నయ్) సమీపంలో ఉన్నాయి. లక్షలాది ఎకరాల భూమి సాగుకు లాకీగా ఉన్నది. ఈ ప్రాంతానికి నీరే జీవన్మరణ సమస్య. సగటు వర్షపాతం 700 మి.మీ.లోపే. అడవులు అంతరించి పోతున్నాయి. భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. కొన్నిప్రాంతాలలో వెయ్యి అడుగులకుపైన బోర్లు వేస్తే తప్ప నీళ్ళు లభించని దుస్థితి నెలకొన్నది. పర్యావరణ మార్పులు ఆందోళనకరంగా పరిణమిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజలు కరవుల్లో పుట్టి, కరవుల్లో పెరిగి, కరవులతో సహజీవనం చేస్తూ మరణిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం: ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక‌ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటంలో అంతర్భాగంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల‌  కాంగ్రెస్ నాయకులు 1937 సం.లో చేసుకొన్న చారిత్రాత్మకమైన "శ్రీబాగ్ ఒడంబడిక" బుట్టదాఖలా చేయబడింది. కృష్ణా, తుంగభద్ర నదీజలాల వినియోగంలో రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అందులో పేర్కొని మొండి చేయి చూపెట్టారు. పర్యవసానంగా దశాబ్దాల పాటు వెనుకబాటుతనానికి ఈ ప్రాంతం గురయ్యింది. రాయలసీమ దుస్థితికి ఇతర ప్రాంతాల వారు కారణమని నిందించి లాభం లేదు. సుదీర్ఘ కాలం పాటు వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం నుంచే నీలం సంజీవరెడ్డి మొదలుకొని దామోదరం సంజీవయ్య, కోట్ల విజభాస్కరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, వై.యస్.రాజశేఖరరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు 27 సంవత్సరాలకుపైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేసి రికార్డు సృష్టించారు. కానీ, ఈ ప్రాంతాన్ని కరవుల బారి నుండి విముక్తి చేయలేక పోయారు. వ్యవసాయక, పారిశ్రామిక అభివృద్ధికే కాదు రక్షిత మంచి నీటికి కూడా నోచుకోని అభాగ్యులుగా రాయలసీమ ప్రజలు మిగిలిపోయారు.
శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.) నిర్మాణం 1981లో టి.అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో  మొదలయ్యింది. రాయలసీమకు దత్తపుత్రుడుగా తనకు తాను ప్రకటించుకొని తిరుపతి శాసన సభా నియోజకవర్గానికి ప్రాతినిథ్యంవహిస్తూ ముఖ్యమంత్రి అయిన యన్.టి.రామారావు 1983 ఏప్రిల్ 27న తెలుగు గంగ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. అలాగే హిందూపురం శాసన సభా నియోజకవర్గానికి ప్రాతినిథ్యంవహిస్తూ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గాలేరు‍-నగరి సృజల స్రవంతి, హంద్రీ-నీవా సృజల స్రవంతి ప్రాజెక్టులకు 1989లో శంకుస్థాపనలు చేశారు. ఈవాళ మిగులు జలాల ఆధారంగానైనా తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు వాస్తవ రూపం దాల్చడానికి కారకుడైన‌ కీ.శే. యన్.టి.ఆర్. గారిని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం సముచిత‍ంగా ఉంటుంది. న‌త్తలతో పోటీపడుతూ నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, శంకుస్థాపనలకే పరిమితమైన గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంత‍ం చేసి ఆశలు చిగురింపజేసింది కీ.శే. డా. వై.యస్. రాజశేఖరరెడ్డి గారు. ఇప్పుడు రాష్ట్ర విభజనతో మిగులు జలాలు/వరద నీటికి కూడా నోచుకోని దుస్థితి నెలకొన్నది.
క్రిష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు భిన్నంగా మిగులు జలాల లభ్యతను కూడా అంచనా వేసి ఎగువ కృష్ణా ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు కూడా కేటాయింపులు చేయడం ద్వారా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన హాని చేసింది. ఇప్పుడు తెలంగాణ కూడా పై రాష్ట్రాల జాబితాలో చేరడంతో దిగువనున్నఆంధ్రప్రదేశ్ కష్టాలు వర్ణనాతీతంగా పరిణమించాయి. ప్రత్యేకించి మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారయ్యింది. ఈ ప్రాజెక్టులకు 150.5 టి.యం.సి.లు అవసరం. జాతీయ ప్రాజెక్టుగా నిర్మించబడుతున్న‌ పోలవరం నుండి కృష్ణా డెల్టాకు మళ్ళించే 80 టి.యం.సి. లలో మన‌ రాష్ట్రానికి దక్కే 45 టి.యం.సి.లకు తోడు పులిచింతల జలాశయం నిర్మాణం ద్వారా ఆదా అయ్యే 40 టి.యం.సి.లు, నాగార్జున సాగర్ కుడి కాలువ ఆధునీకీకరణ, పంట మార్పిడి మరియు నీటి వినియోగంలో పొదుపు ద్వారా మొత్తం 150 టి.యం.సి.లను ఆదా చేసి ఈ ప్రాజెక్టులకు నికరజలాలను కేటాయించాలి. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు శ్రీశైలం జలాశయం నుండి 19 టి.యం.సి. లకు రక్షణ కల్పించాలి. అలాగే తుంగభద్ర జలాశయం నుండి కె.సి.కెనాల్ కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 10 టి.య‍ం.సి.లను పి.ఎ.బి.ఆర్. కు సర్దుబాటు చేసి ఆ మేరకు ప్రత్యామ్నాయంగా కె.సి.కెనాల్ కు శ్రీశైలం జలాశయం నుండి కేటాయిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ‍ం జారీ చేసిన జి.ఓ.కు రక్షణ కల్పించాలి. వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన నీటి కేటాయింపు చేయాలి. నేడు రాష్ట్ర‌ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడుపై ఈ చారిత్రక బాధ్యత ఉన్నది. రాయలసీమ ప్రజలను కరవుల భారి నుండి శాశ్వతంగా విముక్తి చేయడానికి మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన 150 టి.యం.సి.ల మేరకు నికర జలాలను కేటాయించే విధంగా చర్యలు చేపడితే చంద్రబాబునాయుడు చరిత్ర పుటలకెక్కుతారు. కృష్ణా నదీ నికర జలాలను పున: పంపిణీ చేయాలని కొందరు వాదిస్తున్నారు. నికర జలాల పంపిణీకి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తిరగదోడే అవకాశం లేదని బ్ర‌జేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా నిర్ధారించి వాటి జోలికి పోలేదన్న సంగతిని గుర్తుంచుకోవాలి. ఆచరణ సాధ్య‍ం కాని కోర్కెలతో ప్రజలను గందరగోళపరచడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపెడితే అపారమైన భూసంపదను, ఖనిజ సంపదను, మానవ వనరులను ఉపయోగించుకొని వ్యవసాయకంగా, పారిశ్రామికంగా శ‌రవేగంతో అభివృద్ధి చెందడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. రాయలసీమ వెనుకబాటుతనానికి వ్యవస్థీకృతమైన హత్యా రాజకీయాలు, గ్రామ కక్షలే కారణమనే అపవాదును నిత్యం వింటూనే ఉన్నాం. దాన్నితృణీకార భావంతో కొట్టిపారేయలేం.
రహదారుల నిర్మాణం: రాయలసీమ ప్రాంతాన్ని అవశేష‌ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందిన ప్రాంతాలైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు తదితర ప్రాంతాలతో అనుసంధానించాలి. ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే మెరుగైన, నాణ్యమైన రైల్వే, రహదారుల నిర్మాణం ద్వారా మాత్రమే అభివృద్ధి కల సాకారమవుతుంది.  * విజయవాడ - గుంటూరు - మార్కాపురం - కడప - మదనపల్లి - బెంగుళూరు నగరాన్ని కలుపుతూ జాతీయ రహదారిని నిర్మించాలి.  * కర్నూలు - మార్కాపుర‍ం - ఒంగోలు, అనంతపురం ‍- ప్రొద్దుటూరు బద్వేల్ - నెల్లూరు, అనంతపురం - చిత్తూరు జిల్లా కేంద్రాలను కలుపుతూ నాలుగు లైన్ల జాతీయ రహదారులను నిర్మించాలి.  * రాజంపేట - రాపూర్ -నెల్లూరు రోడ్డును అభివృద్ధి చేయాలి.  తద్వారా రాయలసీమలోని జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లతో కోల్ కతా - చెన్నయ్,  హైదరాబాదు  -  బెంగుళూరు, హైదరాబాదు-చెన్నయ్ జాతీయ రహదారులతో అనుసంధానం ఏర్పడి మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించబడతాయి.
రైలు మార్గాలు: * విజయవాడ గుంటూరు - కడప - బెంగుళూరులను కలుపుతూ రైలు మార్గాన్నినిర్మించాలి. విజయవాడ - నంద్యాల - అనంతపురం - బెంగుళూరు మార్గంలోని గిద్దలూరు నుండి పోరుమామిళ్ళ, బద్వేలి, బాకరాపేట, కడపకు రైలు మార్గాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నది. కడప-బెంగుళూరు రైలు మార్గ నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణాన్ని చేపట్టిన‌ ఈ పథకానికి రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ తన వాటాను చెల్లించే స్థితిలో లేదు. పర్యవసానంగా  నిర్మాణ పనులు మూలనపడే ప్రమాదమున్నది. ఈ రైలు మార్గాన్ని త్వరితగతిన నిర్మిస్తే మెరుగైన‌ రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.  * గుంటూరు - గుంతకల్ మధ్య ఉన్న రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసి, విద్యుదీకరణ చేయాలి.  * సర్వేకే పరిమితమై ఉన్న నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేమార్గాన్నిత్వరితగతిన‌ నిర్మిస్తే విజయవాడ - చెన్నయ్ రైలు మార్గ‍ంలో ట్రాఫిక్ వత్తిడి తగ్గడమే కాకుండా తుఫాన్లు సంబవించిన సందర్భాలలో విజయవాడ - గూడూరు మార్గానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల మధ్య‌ సమాంతరంగా నిర్మించ తలపెట్టిన ఈ రైలు మార్గం ద్వారా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని మెట్ట ప్రాంతాలతో తిరుపతికి రవాణా సౌకర్యాలు మెరుగౌతాయి.  * కడప జిల్లాలోని ఓబులవారిపల్లి - క్రిష్ణపట్నం ఓడరేవుల మధ్య నిర్మాణంలో ఉన్న రైలు మార్గాన్ని సత్వరం పూర్తి చేయడం ద్వారా రాయలసీమ ప్రాంతానికి వస్తు రవాణాకు, రాయలసీమ థర్మల్ విద్యుత్ ప్లాంటుకు అవసరమైన బొగ్గు సరఫరాకు, కడప జిల్లాలో అర్థాంత‌రంగా ఆగిపోయిన బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం స్థానంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్మాగారాన్ని నిర్మిస్తే ఉత్ఫత్తుల ఎగుమతికి, అలాగే ఖనిజ సంపద రవాణాకు చౌకైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. 
వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ప్రకటిస్తామని రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన మేరకు ఈ ప్రాంత‌ సమగ్రాభివృద్ధికి ఉపకరించే రైలు మార్గాలు, జాతీయ రహదారుల నిర్మాణ బాధ్యతను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలి.
విద్యుత్ రంగ‍ం: ఆర్థికాభివృద్ధికి చోధక శక్తిగా పనిచేసే మౌలిక సదుపాయాలలో అత్యంత‌ కీలకమైన భూమిక పోషించేది విద్యుత్తు. ఈ రంగంలో రాయలసీమ ప్రాంతం స్వయం పోషకత్వాన్ని సాధించే వైపు కార్యచరణ ప్రణాళికను రూపొందించి, అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న‌ఆర్.టి.పి.పి., శ్రీశైలం జల విద్యుదుత్ఫత్తి కేంద్రం, పి.ఎ.బి.ఆర్. మినీ జలవిద్యుత్ కేంద్రం, తుంగభద్ర జల విద్యుదుత్ఫత్తి కేంద్రం ద్వారా ఉత్ఫత్తి అవుతున్నవిద్యుత్తును రాయలసీమ అవసరాలకు మాత్రమే కేటాయించబడడం లేదు. రాష్ట్ర‌ గ్రిడ్ కు అనుసంధానం చేసి వినియోగించుకోవడం జరుగుతున్నది. రాష్ట్ర విభజనలో భాగంగా ప్రస్తుత వినియోగం ప్రాతిపదికన విద్యుత్ పంపిణీ చేయడంతో అవశేష‌ ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగింది.
రాయలసీమ‌ ప్రాంతంలో సౌర మరియు పవన విద్యుదుత్ఫాదనకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా విద్యుదుత్ఫత్తిలో స్వయం పోషకత్వాన్నిసాధించవచ్చు. బొగ్గు మీద ఆధారపడే దుస్థితి నుంచి వెసులుబాటు వస్తుంది. సౌర విద్యుదుత్ఫత్తి కేంద్రాలను జెన్కో యాజమాన్యంలో నెలకొల్పాలి. పర్యావరణాన్ని రక్షించుకొంటూ విద్యుదుత్పాదన చేసుకోవచ్చు. విద్యుత్ లభ్యత మీద ఆధారపడే వ్యవసాయాభివృద్ధి గానీ, పారిశ్రామికాభివృద్ధి గానీ, మానవ నాగరికత అభివృద్ధి గానీ ఉంటుంది. సౌర మరియు పవన విద్యుదుత్ఫాదనకున్న అవకాశాలన్నింటినీ సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. దీని కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పిపిపి) నమూనాలో అభివృద్ధి చేస్తామంటే ఈ రంగాన్ని ప్రయివేటు యాజమాన్యాల గుత్తాధిపత్యంలోకి నెట్టి వేయడమే అవుతుంది.
అవశేష ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనా రూపకల్పనలో దృష్టంతా విశాఖపట్నం, నెల్లూరు మధ్య విస్తరించిన ప్రాంతంపైనే కేంద్రీకరించకుండా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలపై కూడా దృష్టి సారించి సమతుల్యమైన, సమగ్రాభివృద్ధికి పథక రచన చేసి, దీర్ఘకాలిక దృష్టితో, రాజకీయ సంకల్పంతో కృషి చేయాలి. సంకుచిత రాజకీయ కోణంతో కొన్ని ప్రాంతాలను సవతి తల్లి ప్రేమకు గురిచేయకూడదు. అత్యంత జాగరూకతతో, జవాబుదారితనంతో, పారదర్శకంగా, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి నమూనాను రూపొందించి, చిత్తశుద్ధితో అమలు చేయాలి.
రాజధాని సమస్య: రాష్ట్ర రాజథాని ఎంపికలో రాజకీయ నాయకత్వం పరిణతితో వ్యవహరించాలి. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకొని, చేదు అనుభవాలు పునరావృతం కానిరీతిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్య మరియు దక్షిణ కోస్తాంధ్ర‌ ప్రాంతాల ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఏకభిప్రాయ సాధన ద్వారా శ్రేష్టమైన నిర్ణయాన్నితీసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన‌ 1953 నాటికి, నేటికీ రాజకీయ రంగంలో పెనుమార్పులు సంబవించాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల‌ ప్రజలందరి జీవితాలని ప్రభావితం చేసే రాజధాని నిర్మాణానికి అనువైన‌ స్థలం ఎంపిక విషయంలో అందరూ రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. అన్ని రాజకీయ పార్టీల, సంస్థల, వివిధ ప్రాంతాల, వర్గాల‌ ప్రజల మధ్య‌ ఏకాభిప్రాయ సాధనకు అధికారంలో ఉన్నవారు చిత్తశుద్ధితో కృషి చేయాలి. రాజకీయ విజ్ఞతతో ఈ సమస్యపై బహుముఖ కోణాలలో పరిశీలన చేసిన మీదటనే తుది నిర్ణయం తీసుకోవలసిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
సమగ్రాభివృద్ధికి ప్రణాళిక అవశ్యం: నిరంతర క్షామ పీడిత, వెనుకబడ్డ రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధికి రాష్ట్ర విభజన చట్టంలో ఎలాంటి నిర్ధిష్టమైన ప్రణాళికను పొందుపరచలేదు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ కోస్తాంధ్ర కేంద్ర బిందువుగానే ఉన్నాయి. సముద్రతీరం, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు, జాతీయ రహదారి, నీటి వనరులు, విద్యుదుత్పాదన వగైరా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనే కారణాలను చూపెట్టి అభివృద్ధి ప్రణాళికలపై చర్చంతా పాశ్చిక దృష్టితో సాగుతున్నది. విశాఖ-నెల్లూరు మధ్య ఉన్న‌ ప్రాంతంపైనే కేంద్రీకరించబడింది. వికేంద్రీకరణ జపం చేస్తూనే ఆచరణలో కేంద్రీకృత అభివృద్ధి మంత్రాన్ని ఆలాపిస్తున్నారు. గత‌ అనుభవాల ఆధారంగా భవిష్యత్ పరిణామాలను ఊహించుకొంటున్న రాయలసీమ ప్రజానీకానికి విశ్వాసం కలిగించే ప్రయత్నం ఏ మాత్రం జరగడం లేదనిపిస్తున్నది. ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖ కేంద్ర బిందువుగా జరుగుతున్న అభివృద్ధి కనీసం కొంత వూరట కల్పించవచ్చునేమో! కానీ రాయలసీమ ప్రజలకు అలాంటి ఆశాకిరణమే కనిపించడం లేదు. తెలుగు జాతి సమైక్యత కోసం వెనకాముందు ఆలోచించకుండా అపార‌ త్యాగాలు చేసిన రాయలసీమ నేడు దిక్కుతోచని స్థితిలో పడిందన్నది ముమ్మాటికీ నిజం.
రాయలసీమ, ఉత్తరాంధ్ర‌ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించి, అవసరమైన నిథులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి, అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించగలరు. చెన్నయ్ నుండి కలకత్తా మధ్యలో ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. విశాఖ, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. రాయలసీమకు మూడు వైపులా అందుబాటులో అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. కర్నూలుకు సమీపంలో హైదరాబాదు, అనంతపురంకు సమీపంలో బెంగుళూరు, తిరుపతి, కడపకు సమీపంలో చెన్నయ్ ఉన్నాయి. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రమంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్ధానం చేసింది. "సమగ్ర దృష్టి, సమగ్రాభివృద్ధి, సమన్యాయం" ప్రాతిపదికన నవ్యాంధ్రప్రదేశ్ లో సుపరిపాలనను ప్రజలు కోరుకొంటున్నారు.   

మన బతుకేదో మనం బతుకుదాం అన్న‌ నిరాశ నిస్పృహలతో కొంత మంది ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని కోరుతున్నారు. అది ఏ మాత్రం వాంఛనీయం కాదు. చిన్న రాష్ట్రాల భావజాలాన్ని పుణికిపుచ్చుకొన్న బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నది. పొరపాటున రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర డిమాండును అంగీకరిస్తే ఈ ప్రాంతం మనుగడే ప్రశ్నార్థకమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకనాడు పాలెగాళ్ళ రాజ్యంలో మగ్గిపోయిన రాయలసీమ మళ్ళీ ఆ దుస్థితికి నెట్టబడకూడదు. అదే జరిగితే ఈ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతుంది. సాగునీటికి, తాగునీటికి శాశ్వత కరువు తప్పదు. తాగడానికే నీళ్ళు లేనిచోట పారిశ్రామికాభివృద్ధి కలలోని మాట. ఇది ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది.



2 comments: