Saturday, September 13, 2014

ప్రణాళికా సంఘం ఉద్వాసన సమంజసమా?

 ప్రచురణ: సెప్టంబరు 14, 2014   సూర్య దినపత్రిక‌

దేశ పునర్మిర్మాణంలో కీలక పాత్ర
ఆరున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర
చరిత్ర పుటల్లో చేరనున్న గత కీర్తి
మేధో మథనం జరగాల్సిందే!
వనరుల వినియోగానికి ప్రణాళికలు
సంస్కరణల యుగంలో గాడి తప్పిందా?
సద్విమర్శలు సైతం అనేకం
ప్రక్షాళనకు బదులు ఉద్వాసనా!
పార్లమెంట్‌లో చర్చ అవసరం
ఏకపక్ష నిర్ణయం అనర్ధదాయకం


స్వాతంత్య్రానంతరం దేశ పునర్నిర్మా ణంలో క్రియాశీలమైన, చారిత్రాత్మ కమైన పాత్ర పోషించిన ప్రణాళికా సంఘాన్ని కనుమరుగు చేయాలన్న కృతనిశ్చయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మేధోమథనానికి, ప్రణాళికల రూపకల్పనకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ సంస్థకు కాలం చెల్లిపోయిందని ప్రధాన మంత్రిగా మోడీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతి నుద్దేంచి చేసిన తొలి ప్రసంగంలో విస్ఫష్టంగా పేర్కొన్నారు. దాని అమలులో భాగంగా అడుగు ముందుకేస్తూ- ప్రణాళికా సంఘం స్థానంలో మరొక నూతన సంస్థను నెలకొల్పడానికి సలహాలిమ్మని మోడీ తాజాగా ప్రజానీకానికి బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అంటే ప్రణాళికా సంఘాన్ని గురించి ఇ మీదట చరిత్ర పుస్తకాలలో చదువుకోవలసిందేనా! భ్రష్ఠు పట్టిన ఒక సంస్థను రద్దుచేసి, మరొక సంస్థను నెలకొల్పడంలో తప్పేముందని ప్రశ్నించే మేధావులు లేకపోలేదు. ఈ అంశంపై దేశ వ్యాపితంగా మేధోమథనం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

పైపైన చూస్తే ఈ అంశానికి అంత ప్రాధాన్యత ఏమున్నదనిపించవచ్చు- కానీ ఈ ఆలోచన లోతుల్లోకి వెళ్ళి పరికిస్తే, దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించి అనుసరించాల్సిన పంథాకు సంబంధించిన భావజాల సంఘర్షణ ఉన్నదని గమనిం చవచ్చు. మోడీ తాను విశ్వసిస్తున్న భావజాలం అమలులో భాగంగానే ప్రణాళికా సంఘానికి మంగళం పలికే చర్యకు ఉపక్రమించారు. దేశ సహజవనరులు, పెట్టుబడులు, మానవ వనరులను, వాటిలో ప్రత్యేకించి అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అంచనావేసి, సామాజిక న్యాయం, సమతుల్యమైన, సమగ్రాభివృద్ధే ధ్యేయంగా వనరులను ప్రణాళికా బద్ధంగా వినియోగించు కొంటూ దీర్ఘకాలిక దృక్పథంతో పనిచేయాలన్న లక్ష్యంతో ప్రణాళికా సంఘం ఏర్పాటైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల పంపిణీలో తలెత్తుతున్న వివాదాల పరిష్కారంలో ఈ సంస్థ మధ్యవర్తి పాత్ర కూడా పోషిస్తున్నది.ఆర్థిక సంస్కరణల యుగంలో ఈ సంస్థ గాడితప్పి పనిచేస్తున్నదన్న అపవాదును కూడగట్టుకొన్నది.

బ్యూరోక్రటిక్‌ పని విధానంతో కేవలం చర్చా వేదికగా తయారయ్యిందని, రాజ్యాంగ బద్ధమైన ఆర్థిక సంఘం, ఆర్థిక మంత్రిత్వ శాఖల హక్కులను కాలరాస్తున్నదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయతలపెట్టిన సంక్షేమ పథకాల రూపకల్పనలో అవరోధంగా తయారయ్యిందన్న సద్విమర్శలు ప్రణాళికా సంఘంపై లేకపోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్లలో ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయంలకు నిధుల కేటాయింపులలో సమతుల్యత సాధించే విధంగా ఈ సంస్థ్‌ కృషి చేసేది. దేశం మొత్తానికి వర్తించేలా కేంద్ర పథకాలు రూపొందుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకొనే వీలుకల్పించక పోవడంతో సమాఖ్య స్ఫూర్తి ప్రతిబింబించడం లేదని విమర్శలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు దీర్ఘకాలిక ప్రణాళికలకు తగిన ప్రాధాన్యత నివ్వడానికి బదులు ఎన్నికల వాగ్దానాల అమలుకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఐదేళ్ళ కొకసారి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనల వరకే నేటి తరం పాలకులు పరిమితమవుతున్నారన్న అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి.

ఈ నేపథ్యంలో ఆరున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగి దేశ ఆర్థికాభివృద్ధిలో ముఖ్యమెన పాత్ర పోషించిన ప్రణాళికా సంఘ భవిష్యత్తుపై హేతుబద్ధమైన ఆలోచనతో అడుగు ముందుకు వేయాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. ప్రతిష్ఠాత్మకమైన ఆ సంస్థను ప్రక్షాళన చేసి ప్రస్తుత దేశ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా కొనసాగించడానికి తగుచర్యలు తీసుకొంటే సముచితంగా ఉంటుంది. ప్రణాళికా సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ కాకపోవచ్చు, నెహ్రూ నేతృత్వంలోని నాటి కేంద్ర మంత్రివర్గం కేవలం ఒక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేసి ఉండవచ్చు, కానీ భారత జాతి సర్వతోముఖాభివృద్ధికి గర్వకారణమైన కృషి చేసిన సంస్థను రద్దుచేసే ముందు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పార్లమెంటులో చర్చించిన మీదట ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. అలా కాకుండా అధికారం చేతిలో ఉందికదా అని అప్రజాస్వామ్యంగా, ఏకపక్షంగా, పెత్తందారీతనంతో ఒక అత్యున్నత సంస్థను పనికిరాని సంస్థగా ముద్రవేసి, మూసి వేయడం తొందరపాటే అవుతుంది.

స్వాతంత్య్రానంతరం 1980వ దశకం వరకు ప్రభుత్వ రంగానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి, భారీ పెట్టుబడులు పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధే లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికలను స్థూలంగా అమలు చేయడం జరిగింది. ఈ కర్తవ్య నిర్వహణలో ప్రణాళికా సంఘం పాత్ర ప్రశంశనీయమైనది. నెహ్రూ కాలంనుండి అమలు చేసిన మిశ్రమ ఆర్థిక విధానాల తాత్విక చింతన నుండి- ఆర్థిక సంస్కరణల పేరుతో 1990 దశకం ప్రారంభం నుండి ప్రభుత్వం ప్రక్కకు జరిగింది. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ, ఆర్థిక వ్యవస్థను ప్రయివేటు పెట్టుబడులకు, మరీ ప్రత్యేకించి స్వదేశీ కార్పొరేట్‌ సంస్థల, బహుళ జాతి సంస్థల ఆధిపత్యం క్రిందకు నెట్టివేసే ప్రక్రియను కొనసాగిస్తున్నది. రాజ్యాంగంలో నిర్దేశించుకొన్న అభివృద్ధి పంథాకు భిన్నంగా నేటి పాలకులు నడుస్తున్నారు. నెహ్రూ తాత్విక చింతనకు పూర్తిగా తిలోదకాలిచ్చి సంఘ్‌ పరివార్‌ తాత్విక చింతనకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను మార్చడానికి మోడీ కార్యాచరణకు పూనుకొన్నట్లు స్పష్టమవుతున్నది.

కేంద్ర ప్రణాళికా సంఘం నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా, జవాబుదారీ తనంతో పనిచేయడానికి బదులు గాడి తప్పిందనడంలో భిన్నాభిప్రాయం లేదు. లోపభూయిష్టంగా తయారైన ప్రణాళికా సంఘాన్ని ప్రక్షాళన చేయడానికి బదులు ఉనికిలోనే లేకుండా చేయాలనే నిర్ణయం దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుందా, లేక, దుష్పరిణామాలకు దారితీస్తుందా- అన్న అంశంపై మేధావి వర్గం దృష్టి సారించాలి. వలస పాలనలో మగ్గిపోయిన భారత జాతి సమతుల్యమైన అభివృద్ధి కి ప్రణాళికాబద్ధమైన కృషి అవసరమని స్వాతంత్య్రోద్యమ కాలంలోనే జాతీయోద్యమ నాయకులు గుర్తించారు. తదనుగుణంగా కార్యాచరణను రూపొందించడానికి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. అలా మొగ్గ తొడిగిన ఆలోచనలకు ప్రతిబింబంగానే స్వాతంత్య్రానంతరం అధికార పగ్గాలు చేబట్టిన తొలి ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ 1950 సంవత్సరంలో ప్రణాళికా సంఘానికి జీవం పోశారు.

నాటి సోవియట్‌ యూనియన్‌ భావజాలానికి ప్రభావితుడై నెహ్రూ ఈ సంస్థను నెలకొల్పారని, వామపక్ష మేధావులకు అది నెలవుగా తయారయ్యిందన్న అసంబద్ధమైన వాదనలు నాటినుంచి వినిపిస్తూనే ఉన్నాయి. పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రభుత్వ రంగాన్ని పెంచి పోషించే విధానాన్ని మౌలికంగా వ్యతిరేకించే బూర్జువా మేధావి వర్గానికి ఈ దేశంలో కొదవలేదు. ఈ భావజాల సంఘర్షణ నాటి నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉన్నది. ఒకనాడు నిఖార్సయిన మేధావివర్గానికి కేంద్ర స్థానంగా పేరెన్నికగన్న ఈ సంస్థ నేడు ప్రపంచ బ్యాంకు తాబేదార్లు, ఆర్థిక సంస్కరణల అమలును భుజానికెత్తుకొన్న ఆర్థికవేత్తలు, పదవీ విరమణ చేసిన ఉన్నత శ్రేణి ఉద్యోగులు, అధికార గుమ్మం చుట్టూ తిరుగాడే దళారులకు పునరావాస స్థావరంగా మారిందనడంలోనూ ఎలాంటి సందేహం లేదు.

ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలని, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా కార్పొరేట్‌, గుత్త పెట్టుబడిదారీ, బడా వ్యాపార వర్గం చేతుల్లో పెట్టాలనే భావజాలానికి కట్టుబడిన- మోడీ అధికారంలోకి వచ్చాక తన భావజాలానికి అనుగుణంగా చర్యలు చేపట్టడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే ప్రణాళికా సంఘానికి శుభం కార్డు వేశారు.
స్వాతంత్య్రానంతరం ఏ లక్ష్యాల సాధన కోసం ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పారో వాటిని సంపూర్ణంగా నెరవేర్చడం జరిగిందా అంటే, లేదనే సమాధానమే ఎవరి నోటినుండైనా వినిపిస్తుంది. దేశ సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరికిస్తే- వ్యక్తుల మధ్య, కులాల మధ్య, వివిధ జాతులు- తెగల మధ్య, ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య అసమానతలు, అసమగ్రమైన అభివృద్ధి దృశ్యాలే కళ్ళ ముందు కదలాడుతున్నాయి.

గడచిన ఆరున్నర దశాబ్దాల కాలంలో ప్రణాళికా సంఘం పనితీరంతా లోపభూయిష్టంగానే ఉన్నదా? భ్రష్ఠు పట్టిన ఆర్థిక వ్యవస్థను సంస్కరించడానికి సంస్కరణలను అమలు చేస్తున్నామని చెప్పుకొంటున్న కేంద్ర ప్రభుత్వం గాడి తప్పిన ప్రణాళికాసంఘాన్ని ప్రక్షాళనచేసి నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పని చేయించడానికి సంకల్పశుద్ధితో కృషి చేయలేదా? ఆపని చేయడానికి బదులు ఆ సంస్థ బోర్డునే మూసేయాలనే నిర్ణయానికి ప్రధానమంత్రి రావడం వల్ల భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో అన్న అంశంపై మేధోమదనం జరగాలి.దేశంలోని సహజ వనరుల నిల్వలను శాస్ర్తీయ పద్ధతుల్లో అంచనావేసి, వాటిని ప్రణాళికా బద్ధంగాను, హేతుబద్ధంగాను, సమర్థవంతంగాను వినియోగించుకొంటూ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని, ప్రజల జీవన ప్రమాణాలను త్వరితగతిన పెంచడానికి కృషి చేయాలన్న సంకల్పమే ప్రణాళికా సంఘం ఆవిర్భావానికి దారి తీసింది.

దేశాభివృద్ధికి సంబంధించి రంగాలవారీగా ప్రాధాన్యతలను నిర్ధారించడం, మానవవనరుల అభివృద్ధి- వినియోగం, ప్రజలందరికీ సమానావకాశాలను కల్పించడం, ఉపాథికల్పన, దేశ స్థూల జాతీయోత్పత్తిని పెంచడం వగైరా మౌలిక లక్ష్యాల సాధనకు నిష్ణాతులైన మేథావుల సేవల వినియోగానికి ఒక సంస్థ ఆవశ్యకతను నాటి రాజకీయ నాయకత్వ గుర్తించింది. అందువల్లనే ప్రథమ ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఈ సంస్థకు ప్రప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణంలో అంతర్భాగంగానే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడానికి నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను రూపకల్పన చేసుకొని అమలుకు పూనుకొన్నది. మొదటి పంచవర్ష ప్రణాళిక అమలు 1951లో ప్రారంభమయ్యింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ప్రభుత్వ రంగాన్ని పటిష్ఠంగా నిర్మించడంలో ప్రణాళికా సంఘం పోషించిన చారిత్రాత్మకమైన పాత్ర దేశ ఆధునిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమయింది.

ప్రభుత్వ రంగం బలోపేతం కావడం మూలంగానే అంతో ఇంతో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయి. బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల సామాజిక న్యాయం కొంతైనా జరుగుతున్నది. ఆర్థిక స్వావలంబనను సాధించడంలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర అనిర్వచనీయమైనది. గడచిన ఐదేళ్ళ కాలంలో ఆర్థిక సంక్షోభానికి అమెరికా విలవిల్లాడిపోతే, దాని దుష్ప్రభావానికి ప్రపంచ దేశాలు వణికి పోయాయి. ప్రభుత్వ రంగంలో పటిష్ఠంగా వేళ్ళూనికొని ఉన్న బ్యాంకింగ్‌ వ్యవస్థ వల్ల మన దేశం తట్టుకొని నిలబడగలిగింది. ఆర్థిక సంస్కరణలలో భాగంగా ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టకపోగా, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వార్షిక బడ్జెట్ల లోటును భర్తీ చేసుకొనే దుస్థితికి కేంద్ర ప్రభుత్వం చేరుకొన్నది. ప్రయివేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ జపంచేస్తూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.

అన్ని రంరగాలలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ దేశ ఆర్థిక స్వావలంబన, భద్రతకు ప్రమాదం తెచ్చి పెడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజాగా ప్రణాళికా సంఘాన్నే కనుమరుగు చేయడానికి ప్రధాని మోడీ నిశ్చయించుకొన్నారు. పంచవర్ష ప్రణాళికల విధానానికి స్వస్తి చెప్పాలని వాదించే మేధావులు లేకపోలేదు. ప్రణాళికా సంఘం కాలం చెల్లిన వ్యవస్థకు ప్రతీకగా అభివర్ణిస్తూ దాన్ని చరిత్ర పుటలకు ఎక్కించి, మరొక కొత్త సంస్థను నెలకొల్పి హిందుత్వ భావజాలానికి వత్తాసు పలికే మేధావుల చేతుల్లో మన దేశ ఆర్థిక వ్యవస్థను పెట్టే ప్రమాదం గోచరిస్తున్నది.

No comments:

Post a Comment