విజ్ఞప్తి: ఆంధ్రప్రదేశ్ విభజన-ప్రభావం అన్న అంశంపై నూతన రాజధానిగా ప్రకటించబడిన
విజయవాడలో సెప్టంబరు 20, 2014 వ తేదీన ఆంధ్రప్రదేశ్
వర్కింగ్ జర్నలిస్టు పెడరేషన్ చర్చా వేదికను నిర్వహించింది. ఆచార్యులు యన్.అంజయ్య
సమన్వయ కర్తగా వ్యవహరించిన ఈ చర్చా కార్యక్రమానికి నాగార్జునా విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నాతో
పాటు వివిధ రాజకీయ పక్షాల ప్రతినిథులు, నాగార్జునా విశ్వవిద్యాలయం ఆచార్యులు, జిల్లా సమాచార శాఖ విశ్రాంత అధికారి ఒకరు
చర్చలో పాల్గొన్నారు. ఎ.పి.డబ్లు.జె.ఎఫ్. నాయకత్వంతో పాటు మరికొందరు
విలేఖరులు, తదితరులు హాజరయ్యారు. నేను
మాట్లాడడంతో పాటు కొన్ని అంశాలపై వ్రాత పూర్వకంగా తయారు చేసుకొని పోయిన
పత్రాన్నినిర్వాహకులకు అందజేశాను. దాన్ని నా బ్లాగ్, ఫేస్ బుక్, ఇ_మెయిల్స్ ద్వారా మిత్రులతో పంచుకొంటున్నాను. కాస్త పెద్దదిగా అనిపించినా
ఆసక్తి ఉన్న వారు చదివి, స్పందించి మీ విలువైన
అభిప్రాయాలను తెలయజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ విభజన - ప్రభావం
రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నవ్వుల
పాలుచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి అనుసరించిన పద్ధతులు
ప్రజాస్వామ్య పునాదులనే బలహీనపరిచాయి. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం అపవిత్ర కలయికతో ఎంతటి
నిరంకుశమైన చట్టానికైనా పార్లమెంటు చేత ఆమోదముద్ర వేయించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్
విభజన చట్టం ద్వారా ప్రపంచమంతటికీ తెలిసిపోయింది. అత్యధిక ప్రాంతీయ పార్టీలు
వ్యక్తం చేసిన అభిప్రాయాలకు వీసమంత విలువ ఇవ్వలేదు. దేశ వ్యాపితంగా వెల్లువెత్తుతున్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్సును పరిగణలోకి తీసుకోలేదు.
రాష్ట్రాల విభజనకు ఒక జాతీయ విధానమంటూ లేక పోయింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను మాత్రం నిర్ధాక్షిణ్యంగా, నిరంకుశంగా రెండుగా చీల్చేశారు. ఈ పరిణామం భారత దేశ
సమాఖ్య వ్యవస్థకే ప్రమాదకరం.
సుదీర్ఘ పోరాటాలు, అపారమైన త్యాగాలతో తెలుగు జాతి సాధించుకొన్న సమైక్య ఆంధ్రప్రదేశ్ స్వార్థ రాజకీయాలకు బలైపోయింది.
తెలుగు జాతి ఒకే పరిపాలనా వ్యవస్థలో ఉంటూ సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ఉన్న
అవకాశం చేజారిపోయింది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్న నినాదం కలగానే మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు, విషభీజాలు నాటబడ్డాయి. రెండు రాష్ట్రాల మధ్య జఠిలమైన సమస్యలున్నాయి.
పర్యవసానంగా ఎడముఖం, పెడముఖంగా కొత్త జీవితం మొదలయ్యింది.
పదమూడు జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలవంతంగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థకున్న సహజ
లక్షణాలకు అనుగుణంగానే ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్
ఏర్పడిన 1956 నాటికి విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డు, హైదరాబాద్ ఆల్విన్, నిజామాబాద్‌లో నిజాం చక్కెర పరిశ్రమలు మాత్రమే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి. 1960-80 దశాబ్దాల మధ్య కాలంలో కేంద్ర
ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ఇ.సి.ఐ.యల్., బి.హెచ్.ఇ.యల్., ఐ.డి.పి.యల్., హెచ్.యం.టి., మిధాని, యన్.యం.డి.సి., యన్.యఫ్.సి., విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం, బి.హెచ్.పి.వి., యన్.టి.పి.సి. లాంటి భారీ పరిశ్రమలను ప్రభుత్వ
రంగంలోనూ, కోరమాండల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రయివేటు రంగంలోనూ నెలకొల్పడంతో
పారిశ్రామికాభివృద్ధి ఊపందుకొన్నది. ఈ భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన పర్యవసానంగా ప్రధానంగా
హైదరాబాదు, కొంత వరకు విశాఖపట్నం కేంద్రాలుగా పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాదులు
పడ్డాయి. పారిశ్రామిక వికేంద్రీకరణ వైపు ఏ ఒక్క ప్రభుత్వమూ కనీసం ఆలోచన కూడా
చేయలేదు. ఫలితంగానే, హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధంతా
కేంద్రీకరించబడింది. సంఘటిత, అసంఘటిత రంగాలలో ఉపాధికల్పనావకాశాలు మెండుగా
కల్పించబడ్డాయి. ఈ అభివృద్ధి ఫలాల నుంచి ఉమ్మడి రాష్ట్ర ఖజనాకు అత్యధికంగా ఆదాయం
ఒనగూడుతూ వచ్చింది. ఆ అభివృద్ధిలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల శ్రమ, పెట్టుబడులు ముఖ్యమైన భూమిక పోషించాయి. విభజనతో ఆ
అభివృద్ధి చెందిన ఆర్థిక వనరుల నుండి, మౌలిక సదుపాయాల నుండి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను వేరు చేసి, లక్షా పది వేల కోట్ల అప్పుల భారంతో, పారిశ్రామిక ఉపాథి అవకాశాలు లేని, రాజధాని నగరం కూడా
లేని అనాధలుగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలను వీధిన పడేశారు.
1990 నుండి ఆర్థిక సంస్కరణల
యుగం నడుస్తున్నది. ప్రభుత్వ పెట్టుబడులతో పారిశ్రామికాభివృద్ధికి పాటు పడడం కాదు గదా! ప్రభుత్వ రంగ సంస్థల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను
కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. పారిశ్రామికంగా వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాన్ని, ప్రత్యేకించి కరవుకాటకాలతో మగ్గిపోతున్న రాయలసీమ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్రను
సమగ్రాభివృద్ధి వైపు అడుగులు వేయించాలంటే కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో
పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంస్కరణల
విధానాల అమలును వేగవతం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పోకడలు చూస్తే ప్రభుత్వ
పెట్టుబడులకు ఉన్న అవకాశాలు తక్కువే. విభజన చట్టంలో రేఖా మాత్రంగా ప్రస్తావించిన
అంశాలను పరిశీలించినా, తాజా కేంద్ర వార్షిక బడ్జెట్ ను గమనించినా నిరాశాజనకంగానే ఉన్నది. రాజధాని నిర్మాణానికి సంబంధించి
ఏ మేరకు ఆర్థిక సహాయం అందిస్తారో ప్రధాన మంత్రి నోటి నుండి స్పష్టమైన వాగ్ధానం
కూడా వినపడలేదు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ భారమంతా ప్రయివేటు పెట్టుబడులపై
మోపే ఆలోచనలే చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ దోరణి వెనుకబడ్డ ప్రాంతాల
సమగ్రాభివృద్ధికి ఏ మాత్రం దోహదపడదు. విభజన వల్ల
ఆంధ్రప్రదేశ్ కు మేలు జరిగిందన్న అభిప్రాయాలను ఇటీవల
కొందరు ప్రముఖులు వ్యక్త చేశారు. విభజన వల్ల
జరిగిన వినాశనాన్ని కళ్ళుండీ చూడలేని కబోదులా వారు అనిపిస్తోంది. విభజన
వల్ల గుండె కోతకు గురైన ప్రజానీకంలో కసి, పట్టుదల పెరిగింది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని
శరవేగంగా అభివృద్ధి చేసుకోవాలన్న తపన ప్రజల్లో కనబడుతున్నది. వారి కలను సాకారం
చేయగల రాజకీయ నాయకత్వం కావాలన్న కోరిక విభజనానంతరం జరిగిన ఎన్నికల్లో ప్రస్ఫుటంగా
వెల్లడయ్యింది. ఇదొక్కటే ఆంధ్రప్రదేశ్ సత్వరాభివృద్ధికి నేడు అందివచ్చిన
సానుకూలాంశం.
తెలంగాణా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ప్రధానంగా హైదరాబాదుపై ఆధారపడి ఉన్నది. అందుకే హైదరాబాదుకున్న 'బ్రాండ్ ఇమేజ్'ను నిలబెట్టుకోవడమన్నది తెలంగాణ ప్రభుత్వం
ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. అప్పులను జనాభా ప్రాతిపదికపై పంచి, విద్యుత్తును మాత్రం
వినియోగం ప్రాతిపదికపై 52% కేటాయించినా విద్యుత్ కొరతతో విలవిల్లాడి పోయింది.
కాకపోతే, విభజన వల్ల కొంత మందికి రాజ్యాధికారం దక్కింది. తెలంగాణ సమాజానికి జరిగిన
మేలేంటో నిర్ధిష్టంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలున్నారనిపిస్తుంది. స్థూలంగా
రాష్ట్ర విభజనతో తెలుగు నాట ప్రజాస్వామ్యం బలహీనపడింది. బడుగు బలహీన వర్గాలు, శ్రామిక
ప్రజానీకానికి, వెనుకబడిన మరియు కరవు పీడిత ప్రాంతాలకు తీరని అన్యాయం జరిగింది.
రాజకీయ రంగం: విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో పెనుమార్పులు
సంబవించాయి. గతంలో 16 సం.ల పాటు అధికారంలో ఉండిన కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీ అయిన తెలుగు దేశంకు, ప్రత్యేకించి పాలనానుభవం
ఉన్న శ్రీ నారా చంద్రబాబునాయుడుకు ప్రజలు అధికారాన్ని అప్పగించారు. మరొక ప్రాంతీయ పార్టీ అయిన
వై.యస్.ఆర్.కాంగ్రెసును ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు. టిడిపితో పొత్తు
పెట్టుకొని భాజపా నాలుగు స్థానాల్లో గెలిచి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. ఇటీవల
జరిగిన శాసనసభ సమావేశాల తీరుతెన్నులను చూశాం. విభజన పర్యవసానంగా రాష్ట్రం
ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుండి ఎలా బయటపడాలి, ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి
అనుసరించాల్సన కార్యాచరణ, కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలను ఎలా
రాబట్టుకోవాలి, అభివృద్ధి నమూనా ఎలా ఉండాలి, వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన
చర్యలేంటి, నదీ జలాల సమస్య తదితర అంశాలపై చట్ట సభలో చర్చించడానికి బదులు ఏ విధంగా
సమయాన్ని వృధా చేశారో చూశాం. ఈ రీతిలోనే ఐదేళ్ళ కాలం శాసనసభా పనితీరు ఉంటే రాష్ట్ర
ప్రగతికి చట్టసభ ఎలాంటి దిశానిర్ధేశం చేస్తుందో! ఊహించవచ్చు.
ఆంధ్ర రాష్ట్రం, అటుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక గడచిన 61 సం.లలో 44 సం.ల పాటు
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేటి శాసన సభలో ప్రాతినిథ్యానికే నోచుకోలేదు.
తెలంగాణ సమస్యను తమ అంబుల పొదలో భద్రపరుచుకొని సంకుచిత రాజకీయ లబ్ధి కోసం అవసరం
వచ్చినప్పుడల్లా వాడుకొంటూ వచ్చిన ఆ పార్టీ అంత్యమంగా తెలుగు జాతిని రెండు ముక్కలు
చేసి ఫలితం అనుభవించింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని
హీనస్థితిని ఎదుర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఛీత్కారానికి గురై శాసనసభలో ఉనికి
కోల్పోవడమే కాదు తమ అభ్యర్థులు అవమానకరమైన రీతిలో దరావత్తులు కోల్పోయారు.
తెలుగు జాతి ఐక్యత కోసం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదంతో ఆంధ్ర రాష్ట్ర
సాధన, అటుపై ఆంధ్రప్రదేశ్ సాధన, 1969 మరియు 1972 విచ్ఛిన్నకర ఉద్యమాలను దీటుగా ఎదుర్కొని సమైక్య
రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడంలో క్రియాశీలమైన పాత్ర పోషించిన కమ్యూనిస్టుల
ప్రాతినిథ్యం నేటి శాసన సభలో లేకుండా పోయింది. ఒకనాడు పాలక పార్టీ అయిన కాంగ్రెస్
పార్టీకి ప్రధాన ప్రత్యర్థులుగా వెలుగొందిన కమ్యూనిస్టులు సోదిలోనే లేకుండా పోవడం
శ్రామిక ప్రజానీకానికి తీవ్రహాని కలిగించే దుష్పరిణామం. తెలుగు జాతి ఐక్యతను
పరిరక్షించడంలో నిబద్ధతతో, స్థిరమైన విధానాన్ని అనుసరించక పోవడంతో ఆ పార్టీలు
ప్రజల నిరాధరణకు గురైనాయి.
రాష్ట్ర రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే రాజకీయ పార్టీల
వ్యవస్థ బాగా బలహీనపడిందనిపిస్తుంది. ఆ మేరకు ప్రజాస్వామ్యం కూడా బలహీనపడిందనే
భావించాలి. రాజధాని ఎక్కడన్న జఠిలమైన సమస్యను తేల్చకుండా పార్లమెంటు ముందుకొచ్చిన
విభజన చట్టానికి మద్ధతు పలికిన పార్టీలు రాజధాని ఎక్కడన్న అంశంపై అభిప్రాయం
చెప్పే నైతిక హక్కునే కోల్పోయాయి. దీన్ని ఆసరాగా చేసుకొని రాజధాని ఎంపిక
ప్రక్రియలో శాసనసభలో ప్రాతినిథ్యం లేని పార్టీలను సంప్రదించాల్సిన అవసరమేలేదన్న
దోరణిని పాలక పక్షం ప్రదర్శించింది. ఈ పరిణామాలు
ప్రజాస్వామ్య వ్యవస్థను పరిపుష్టం చేయడానికి దోహదపడవు.
నదీ జలాల సమస్య: ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్ర
రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటంలో అంతర్భాగంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల కాంగ్రెస్ నాయకులు 1937లో చేసుకొన్న చారిత్రాత్మకమైన "శ్రీబాగ్
ఒడంబడిక" బుట్టదాఖలా చేయబడింది. కృష్ణా, తుంగభద్ర నదీజలాల
వినియోగంలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అందులో పేర్కొని మొండి చేయి
చూపెట్టారు. పర్యవసానంగా దశాబ్దాల పాటు వెనుకబాటుతనానికి ఆ ప్రాంతం గురయ్యింది.
ఇప్పుడు విభజన వల్ల రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలో మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో
ఉన్నభారీ నీటిపారుదల ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది. ఆ ప్రాంతానికి కేటాయించిన నికర జలాలను కూడా తెలంగాణ వారు వివాదాస్పదం
చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి నీటి సమస్య జీవన్మరణ సమస్య గా పరిణమిచింది.
1. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ కు 19 టియంసిల నికరజలాలను కేటాయించి, కేంద్ర జల సంఘం ఆమోదముద్రతో 1981 సం.లో నిర్మాణాన్ని మొదలుపెట్టినా ఇంకా పూర్తికాలేదు. ఆ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి 11 టియంసిల కేటాయింపే ఉన్నదని తెలంగాణ వారు
వివాదాన్నిలేవదీస్తున్నారు. 2. అత్యంత కరవు పీడిత
జిల్లా అయిన అనంతపురం జిల్లాలో నిర్మించబడిన పి.ఎ.బి.ఆర్.కు తుంగభద్ర జలాశయం నుండి
కె.సి.కెనాల్ కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 10 టి.యంల.సి.లను సర్దుబాటు చేసి ఆ మేరకు
ప్రత్యామ్నాయంగా కె.సి.కెనాల్ కు శ్రీశైలం జలాశయం నుండి నీటిని కేటాయిస్తూ ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.జారీ చేసింది. దాన్నితెలంగాణ వారు వివాదాస్పదం
చేస్తున్నారు.
యస్.ఆర్.బి.సి., కె.సి.కెనాల్ కు చేసిన కేటాయింపులను వివాదాస్పదం
చేస్తే కృష్ణా డెల్టా ఆధునీకీకరణ ద్వారా ఆదా అయ్యే నీటిలో 20 టి.యంల.సి.లను
మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భీమా ప్రాజెక్టుకు కేటాయించిన అంశాన్ని అనివార్యంగా వివాదాస్పదం చేయవలసి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నీటి
కేటాయింపుల సర్దుబాట్లను గౌరవిస్తే ఉభయులకు మేలు.
3. ముఖ్యమంత్రిగా
యన్.టి.రామారావుగారు 1983 ఏప్రిల్ 27న తెలుగు గంగ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిర్మాణ
పనులు ప్రారంభించారు. అలాగే గాలేరు-నగరి సృజల స్రవంతి, హంద్రీ-నీవా సృజల స్రవంతి ప్రాజెక్టులకు 1989లో శంకుస్థాపనలు
చేశారు. రాష్ట్ర విభజన మూలంగా మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టులకు నీరు లభించని దుస్థితి నెలకొన్నది.
క్రిష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు
భిన్నంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల లభ్యతను కూడా అంచనా వేసి నదీ పైభాగంలో ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు కూడా కేటాయింపులు చేసింది.
తద్వారా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన హాని
చేసింది. విభజనతో తెలంగాణ రాష్ట్రం కూడా పై రాష్ట్రాల జాబితాలో చేరడంతో
దిగువనున్నఆంధ్రప్రదేశ్ నీటి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. మిగులు జలాలలో చుక్క
నీరు క్రిందికి ప్రవహించని పరిస్థితులు నెలకొంటున్నాయి.
జూరాలా జలాశయం కేంద్రంగా ఇప్పటికే మిగులు జలాల ఆధారంగా నెట్టంపాడు(22 టియంసి) నిర్మాణంలో
ఉన్నది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 160 టియంసి ల మిగులు జలాల తరలింపుకు వీలుగా పాలమూరు
ఎత్తిపోతల పథకాన్ని, జూరాల-పాకాల అనుసంధాన పథకాన్ని చేపట్టడానికి సంకల్పించింది. కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరిగిందని, వివిధ పథకాలకు 379
టియంసిలను అదనంగా కేటాయించాలని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు తాజాగా తెలంగాణ
ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
కృష్ణా నదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన,
నిర్మించబడుతున్న ప్రాజెక్టులన్నింటికీ శ్రీశైలం జలాశయం గుండెకాయ లాంటిది. కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్
కుడి కాలువ, యస్.ఆర్.బి.సి., కె.సి.కెనాల్(10 టియంసి)లకు నికర జలాలు, తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ -నీవా, వెలుగొండ ప్రాజెక్టులకు మిగులు జలాలు శ్రీశైలం జలాశయం
నుండే విడుదల చేయాలి. ఈ జలాశయం నుండి కూడా అధిక నీటిని తరలించుకు పోవడానికి
తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో
ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం జలాశయంలో
805 అడుగులు మరియు యస్.యల్.బి.సి. ప్రాజెక్టుకు
824 అడుగుల యం.డి.డి.యల్. నుండి నీటిని తీసుకెళ్ళడానికి వీలుగా నిర్మాణాలు
జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి
నీటిని విడుదల చేయాలంటే శ్రీశైలంలో కనీసం 854 అడుగుల నీటి మట్టం ఉండాలి. తెలంగాణ
ప్రభుత్వ వైఖరి చూస్తుంటే మిగులు జలాల్లో చుక్క నీరి క్రిందికి ప్రవహించకుండా
చేసేలా ఉంది. అందుకే రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులకు నీటి సరఫరాకు
అవరోధం కలగకుండా ఉండాలంటే ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జి.ఓ.నెం.69ని సవరించి
శ్రీశైలం జలాశయం వద్ద 854 అడుగుల నీటి మట్టాన్ని పరిరక్షించాలని రాయలసీమ ప్రాంత ప్రజలు
డిమాండు చేస్తున్నారు.
అలాగే, తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టులకు 150.5 టి.యం.సి.లు అవసరం ఉంది. జాతీయ ప్రాజెక్టుగా నిర్మించబడుతున్న పోలవరం నుండి కృష్ణా డెల్టాకు మళ్ళించే 80 టి.యం.సి. లలో మన రాష్ట్రానికి దక్కే 45 టి.యం.సి.లకు తోడు
పులిచింతల జలాశయం నిర్మాణం ద్వారా ఆదా అయ్యే 40 టి.యం.సి.లు, నాగార్జున సాగర్ కుడి కాలువ ఆధునీకీకరణ, పంట మార్పిడి మరియు
నీటి వినియోగంలో పొదుపు చర్యల ద్వారా మొత్తం 150 టి.యం.సి.లను ఆదా చేసి ఈ ప్రాజెక్టులకు నికరజలాలను
కేటాయించాలి. రాయలసీమ ప్రాంతం మనుగడ సాగిస్తూ అభివృద్ధి మార్గంలో
అడుగు ముందుకు వేయాలంటే ప్రాణాధారమైన కృష్ణా నదీ జలాలను సత్వరం మళ్ళించడం ద్వారా
గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని
చూపెడితే అపారమైన భూసంపదను, ఖనిజ సంపదను, మానవ వనరులను ఉపయోగించుకొని వ్యవసాయకంగా, పారిశ్రామికంగా శరవేగంతో
అభివృద్ధి చెందడానికి రాయలసీమ ప్రాంతంలో పుష్కలంగా అవకాశాలున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం పోలవరం నుండి ఆంధ్రప్రదేశ్ కు లభించే 45 టియంసి లను తమకే ఇవ్వాలన్న
డిమాండును ముందుకు తెస్తున్నది. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్ళున్నాయి. దుమ్మగూడెం-నాగార్జున సాగర్ టేల్ పాండ్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే
దాదాపు 160 టియంసిలను గోదావరి నుండి తరలించవచ్చు. తద్వారా ఉభయ రాష్ట్రాలకు నీటి అవసరాలు
తీరుతాయి. ఆ వైపు చర్చలు జరపాలి.
అభివృద్ధి నమూనా: ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకొంటూ, ప్రణాళికా వ్యయాన్ని
పెంచుకొంటూ పోతేనే అభివృద్ధి సాధ్యపడుతుంది. ఇటీవలి చర్యలు చూస్తే ప్రణాళికేతర
వ్యయాన్నే పెంచుకొంటూ పోతున్నారు. వీటి ద్వారా స్థిరాస్థులు పెరగవు, రాష్ట్ర స్థూల
ఉత్పత్తి పెరగదు, ఆదాయ వనరులు పెరగవు, అప్పులు మాత్రమే పెరుగుతాయి. పారిశ్రామికంగా వెనుకబడ్ద ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి
రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెడితేనే ప్రారిశ్రామికాభివృద్ధి
సమతుల్యంగా సాగుతుంది. ప్రభుత్వం అమలు చేయబోయే ఆర్థిక, పారిశ్రామిక, సామాజికాభివృద్ధి పథకాలేవైనా వికేంద్రీకరణ దృష్టితో
రూపొందించి, అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని ప్రాంతాల
సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టినట్లవుతుంది. లేనిపక్షంలో ప్రాంతీయ
అసమానతలు మరింత పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నాటి నుంచే ప్రత్యేక తెలంగాణ
వాదన వినిపించినట్లే నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుండే ప్రత్యేక రాయలసీమ వాదనను
కొందరు వినిపిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మేము నిర్లక్ష్యానికి
గురౌతున్నామనే భావన వెనుకబడిన ప్రాంత ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్న నేపథ్యంలో
భవిష్యత్ పథకాల అమలులో జాగ్రత్త వహించకపోతే మరొక విచ్ఛిన్నకర ఆందోళనకు భీజాలు
నాటినట్లవుతుంది.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య సామాజికాభివృద్ధిలో తీవ్రమైన
వ్యత్యాసాలు ఉన్నాయి. రాయలసీమ అత్యంత వెనుకబడి, వరుస కరవులతో
అభివృద్ధికి నోచుకోని ప్రాంతం. రాష్ట్ర తలసరి ఆదాయం రు. 74,525. రాయలసీమ
ప్రాంతలోని మూడు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలు రాష్ట్ర తలసరి ఆదాయం
కంటే తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్నాయి. ప్రస్తుత ధరల సూచిక ఆధారంగా ప్రణాళికా
సంఘం గణాంకాల ప్రకారం జిల్లాల వారిగా తలసరి ఆదాయాలు: 1) విశాఖపట్నం రు. 1,09,800 , 2) క్రిష్ణా రు.
89,398,3) ప్రకాశం రు.81,516, 4) గుంటూరు రు.78,762, 5) నెల్లూరు రు.78,537, 6) పశ్చిమ గోదావరి రు. 78,345, 7) తూర్పు గోదావరి రు.75,977, 8) అనంతపురం
రు.75,463 9) కడప రు.66,015 10) చిత్తూరు
రు.64,816 11) విజయనగరం రు.60,178 12) కర్నూలు రు. 57,311 13) శ్రీకాకుళం
రు.52,701. ప్రస్తుతం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ఏకైక మహానగరం
విశాఖపట్నం. ఆ జిల్లా తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. మధ్య
కోస్తాంధ్ర వ్యవసాయాభివృద్ధిలో ముందంజలో ఉన్నది. వ్యవసాయాధార పరిశ్రమలున్నాయి. ఓడ
రేవులు, కృష్ణా-గోదావరి లోయలో లభించే సహజవాయువు నిక్షేపాలు, పరిశ్రమల
పర్యవసానంగా తలసరి ఆదాయం ఎక్కువ. ప్రభుత్వం అభివృద్ధి
ప్రణాళికలను రూపొందించే సందర్భంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, వెనుకబడ్ద ప్రాంతాల
సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆర్థిక ప్రగతికి చోధక శక్తిగా
ఉపకరించే విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్నచొరవ బాగుంది. రాయలసీమ
ప్రాంతంలో సౌర విద్యుదుత్పాదనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొనే వైపు
నిర్ధిష్టమైన చర్యలు చేపట్టింది.
జిల్లాకొక ఓడరేవు నిర్మిస్తే "వయబులిటీ" ఉన్నదో లేదో ఆలోచించాలి.
విశాఖ, కాకినాడ, క్రిష్ణపట్నంలలో నాలుగు పెద్ద ఓడరేవులున్నాయి. మచిలీపట్నంతో పాటు ఇంకా ఒకటి
రెండు ప్రతిపాదనల్లో ఉన్నాయి. వీటన్నింటికీ సరిపడ వాణిజ్య కార్యకలాపాలు ఉంటాయా!
అన్నది అనుమానమే. ప్రతి జిల్లాలో విమానాశ్రయాలు అవసరమా? అభివృద్ధి పథకాలను అమలు చేసేటప్పుడు ప్రాధాన్యతలు
అవసరం. విశాఖ-కాకినాడ పెట్రో కారిడార్, విశాఖ-చెన్నయ్, బెంగుళూరు-చెన్నయ్, హైదరాబాదు-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లు చెప్పుకోవడానికి
ఇవన్నీ బాగున్నాయి. వీటికి పెట్టుబడులు ఎక్కడి నుండి వస్తాయి, ప్రభుత్వాల పాత్ర
ఏమిటి? భూసేకరణ, పర్యావరణ పరిరక్షణ, ఆహారభద్రత, ప్రజల జీవనోపాథి వగైరా అనేక సమస్యలున్నాయన్న విషయాన్ని
మరిచిపోకూడదు. దేశంలో అమలు చేయబడుతున్నఆశ్రిత పెట్టుబడిదారి విధానాల పర్యవసానాలను
చూస్తూనే ఉన్నాం. సహజ వనరులను ఏ విధంగా లూటీ చేస్తున్నారో,
సామాన్య ప్రజలను వీధిన
పడేస్తున్నారో గమనిస్తునే ఉన్నాం.
ఉపాథి కల్పన: ఉద్యోగులకు జీతభత్యాలే చెల్లించుకోలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం, సంక్షేమ పథకాలకు నిథులను కేటాయించి పేదరికంలో మగ్గిపోతున్న ప్రజానీకాన్ని సామాజిక బాధ్యతగా ఆదుకొంటూ, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి రైతు రుణ మాఫీ లాంటి పథకాలకు నిథులను సమీకరించుకొంటూ, అత్యధికులకు ఉపాథి
కల్పిస్తున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించాల్సిన గురుతరబాధ్యత
ప్రభుత్వంపై ఉన్నది. హైదరాబాదును కోల్పోవడంతో యువత ఉపాథి అవకాశాలను కోల్పోయింది.
నూతన రాష్ట్రంలో యువతకు ఉపాథి కల్పన అతిపెద్ద సవాలుగా ఉన్నది. పట్టణ మరియు గ్రామీణ
ప్రాంతాలలో, ఉత్పత్తి, సేవా రంగాలలో, వ్యవసాయ రంగంలో ఉపాథి కల్పనకు అధిక ప్రాధాన్యత
ఇచ్చి పథకాలను అమలు చేయాలి. ఈ రంగాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెడితే
సత్ఫలితాలుంటాయి. నాణ్యమైన వృత్తి విద్యను అందుబాటులోకి తెచ్చి నిపుణులను తయారు
చేయడం ద్వారా దేశంలో, ప్రపంచ
మార్కెటులో మన యువత ఉపాథి అవకాశాలను అందిపుచ్చుకొనే వీలుంటుంది. తద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం
అమలు చేయబోయే ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి ప్రణాళిక ఉపాథి కల్పనా సామర్థ్యాన్ని
పెంచడానికి, అన్ని ప్రాంతాలలో సమతుల్యమైన, సమగ్రాభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. రాష్ట్ర
విభజన చట్టంలో నిర్ధిష్టమైన అభివృద్ధి ప్రణాళికను ప్రకటించకుండా తేలికపాటి మాటలతో
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి,
ఆర్థికంగా తోడ్పాటును
అందిస్తామని చెప్పడంతోనే సరిపుచ్చుకొన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసుకు
ప్రజలు ఉద్వాసన పలికారు, విభజనకు సహకరించిన భాజపా నేడు అధికారంలో ఉన్నది, విభజనతో ఆర్థిక
సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం
వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత ఉన్నది. మాటల్లో కాదు, చేతల్లో చూపెట్టాలి. ప్రభుత్వ, ప్రయివేటు
భాగస్వామ్యం(పిపిపి) విధానంలో పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తామని చెప్పడం కాదు, ప్రభుత్వమే పెట్టుబడులు
భారీగా పెడుతూ, ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించాలి. అప్పుడే దేశంలోని అభివృద్ధి చెందిన
రాష్ట్రాలతో సరిసమానంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుంది.
రాజధాని నిర్మాణం: హైదరాబాదు మహానగరాన్ని తలదన్నే విధంగా రాష్ట్ర
రాజధానీ నగరాన్ని నిర్మిస్తామని గొప్పలకు పోవలసిన అవసరం ఉందా! ఇ_క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఇ_గవర్నెన్స్ ద్వారా పారదర్శకతే కాదు, స్థలం, కాలాన్ని, వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. ఆ
వైపు దృష్టి సారించకుండా ప్రపంచంలోని సుందరమైన నగరాలన్నింటీ అధ్యయనం చేసి వాటి
కంటే సుందరమైన మహానగరాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అలాంటి నగరం
నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు కావాలంటున్నారు. డిల్లీ పెద్దలు ఆర్థిక సహాయంపై
నోరు మెదపడం లేదు. పట్టణాభివృద్ధి శాఖామాత్యులు స్మార్ట్ సిటీల నిర్మాణ కోటాలో
నుండి ఒక స్మార్ట్ సిటిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని సెలవిచ్చారు. అలా అంటూనే
అంతా కేంద్ర ప్రభుత్వం చేయదు. ప్రజలు అధిక పన్నులు చెల్లించడానికి సిద్ధపడాలని హితబోధ
కూడా చేశారు. మరొక వైపు విరళాలిమ్మని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి
చేసింది. అందువల్ల భూమి మీద నిలబడి రాష్ట్రానికి అంత ఆర్థిక స్తోమత ఉన్నదో, లేదో విజ్ఞతతో ఆలోచించి, కార్యాచరణకు
పూనుకోవాలి. అసలు అలాంటి మహానగర నిర్మాణం అవసరం ఉన్నదా? పర్యవసానాలెలా ఉంటాయి అన్న అంశాలపై లోతుగా
ఆలోచించాలి. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ పరిథినంతటినీ రాజధానీ పరిథిగా పరిగణిస్తామంటున్నారు. కేంద్ర
మంత్రివర్యులొకరు గుంటూరు నుండి ఏలూరు వరకు విస్తరిస్తామని ఇటీవలే సెలవిచ్చారు.
ఇబ్రహీంపట్నం-గన్నవరం-తెనాలి-గుంటూరులను కలుపుతూ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తామంటున్నారు. గుంటూరు-విజయవాడ-ఏలూరు-మచిలీపట్నం-తెనాలి పట్టణాలను
అనుసంధానం చేస్తూ అవుటర్ రింగ్ రోడ్డును నిర్మించాలనే దురాశాపరులు లేకపోలేదు. ఈ ఆలోచనలే ఆచరణలోకి వస్తే సంబవించే దుష్పరిణామాలపై
హేతుబద్ధంగా ఆలోచించే వారు కరవైనట్లుంది.
టి.లక్ష్మీనారాయణ
Has happened. Let us strive for development and prosperity of all us... Regards
ReplyDelete