ఈ రోజు శాసన సభలో పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై జరిగిన వాడి వేడి చర్చను తిలకించాను. ఈ అంశంపై నేరు వ్రాసిన సవివరమైన వ్యాసాన్ని నా బ్లాగ్ ద్వారా ఫేస్ బుక్ లో రెండు రోజుల క్రితమే పోస్ట్ చేశాను. ఈ రోజు ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ఆ వ్యాసాన్ని కొంత ఎడిట్ చేసి ప్రచురించారు. శాసనసభ చర్చల్లో లేవనెత్తబడిన ఒకటి రెండు అంశాలపై నాకున్న అవగాహనను మిత్రులతో పంచుకోదలిచాను.
1. కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. గోదావరి నదీ జలాలకు సంబంధించి పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్(ప్రస్తుతం చత్తిస్ ఘర్), ఒడిశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చలు జరుపుకొని అంతర్రాష్ట్ర ఒడంబడికలు చేసుకొన్నాయి. ఐదు రాష్ట్రాలు ఆ ఒడంబడికల సారాంశంతో ఒక పత్రాన్ని ఏకాభిప్రాయంతో రూపొందించి బచావత్ ట్రిబ్యునల్ కు సమర్పించాయి. ఆ పత్రం ఆధారంగా గోదావరి నదీ జలాలను పంపకం చేస్తూ ఒక ప్రకటన చేసింది. అంతే తప్ప కృష్ణా నదీ జలాల వివాదంపై లోతైన అధ్యయనం చేసి నీటి పంపకం చేస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినట్లు గోదావరి జలాల పంపకంపై ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వలేదు.
2. బచావత్ ట్రిబ్యునల్ ప్రకటన మేరకు గోదావరి నదిపై 150 అడుగుల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టును నిర్మించి 80 టి.యం.సి.లను క్రిష్ణా డెల్టాకు సరఫరా చేయడం ద్వారా కృష్ణా నదీ జలాలలో ఆదా అయ్యే 80 టి.యం.సి.లలో తమకు వాటా దక్కుతుందన్న ఆశతో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు పోలవరం నిర్మాణానికి అనుకూలంగా వ్యవహరించి, ఆంధ్రప్రదేశ్ తో ద్వైపాక్షిక ఒడంబడికలు చేసుకొన్నాయి. ఆ మేరకు 80 టి.యం.సి.లలో మహారాష్ట్ర వాటా 14, కర్నాటక వాటా 21, మిగిలిన 45 టి.యం.సి.లు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డాయి. అవి నికర జలాలు.
3. ఈవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వినియోగించుకోదలచిన నీరు వరద నీరు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో చివరన ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సముద్రం పాలైయ్యే వరద నీటిని వినియోగించుకోవడం వల్ల గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో పైభాగంలో ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్ ఘడ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు ఏ మాత్రం నష్టం లేదు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకటన మేరకు ఆ రాష్ట్రాలకు కేటాయించబడిన నికర జలాల వాటాకు భంగం కలగదు. ఆ రాష్ట్రాలు తమ వాటా నీటిని వాడుకొన్న తదుపరి క్రిందికి ప్రహవహించి, సముద్రంలో కలిసిపోతున్న వరద నీటిని సద్వినియోగం చేసుకొంటే పై రాష్ట్రాలకు నికర జలాలలో వాటా ఇవ్వాల్సి వస్తుందనడం అర్థరహితం, చట్ట సమ్మతం కాదు.
వరద నీటిని వాడుకొన్నందుకు పరివాహక ప్రాంతంలో పై భాగంలో ఉన్న రాష్ట్రాలకు నీటిలో వాటా ఇవ్వాలని బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో లేదు. మరే రాజ్యాంగ బద్ధమైన సంస్థ కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యి వినియోగంలోకి రాగానే పట్టిసీమ ద్వారా నీటి పంపింగ్ ఉండదని ప్రభుత్వం చెబుతున్నది. వాస్తవానికి దాని అవసరం కూడా ఉండదు. అలాంటప్పుడు పై రాష్ట్రాలు నీటిలో వాటా కావాలని డిమాండ్ చేసే అవకాశం కూడా ఉండదు.
ఈ పూర్వరంగంలో సంకుచిత రాజకీయ కోణంలో పట్టిసీమను వ్యతిరేకించడమే కాకుండా పై రాష్ట్రాలు నీటిలో వాటాను కోరతాయని చెప్పడం ద్వారా పై రాష్ట్రాలను పరోక్షంగా ఉసిగొలిపి ఆచరణ సాధ్యం కాని డిమాండ్ చేసేలా ప్రోత్సహించడమే అవుతుంది. తద్వారా చట్ట బద్ధంగా ఆ డిమాండు ఆమోదయోగ్యం కాకపోయినా ఒక 'న్యూసెన్స్' గా తయారయ్యే అవకాశం లేక పోలేదు. దాని వల్ల రాష్ట్రానికి నష్టం జరుగవచ్చు.
4. ఈ పథకం వల్ల ముంపుకు గురయ్యే ప్రాంతం లేదు. కాబట్టి పై రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. మా అనుమతి తీసుకోలేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. గారు వ్యక్తం చేసిన అభ్యంతరానికి ప్రాతిపదికే లేదు.
5. జీవన్మరణ సమస్యగా తయారైన నీటి సమస్యను మరింత జఠిలం చేయకుండా నీరున్న చోటి నుంచి నీరు లేక విలవిల్లాడి పోతున్న కరవు పీడిత ప్రాంతాలకు నీటిని యుద్ధ ప్రాతిపదికపైన తరలించే కారాచరణపై దృష్టి సారింఆలి. ప్రజా ధనం పందికొక్కుల పరం కాకుండా, అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా నీటి పారుదల పథకాల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలని ప్రభుత్వంపై వత్తిడి చేయాలి.
No comments:
Post a Comment