గమనిక: ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో మార్చి 18న ప్రచురించబడింది. స్థలాభావ సమస్య వల్లనేమో గణాంకాలను, అలాగే వ్యాసంలో కొన్ని భాగాలను తొలగించి ప్రచురించారు.
నిత్యం ప్రకృతి వైపరీత్యాలకు గురౌతూ తీవ్రంగా నష్టపోతున్న రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్. ఉప్పెనలు, తుఫానులు, వరదలతో క్రిష్ణా, గుంటూరు, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు నష్టపోతుంటే, రాయలసీమ ప్రాంతం మరియు
ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలు నిత్య కరవులతో కునారిల్లి పోతున్నాయి. ఈ
పూర్వరంగంలో నీరున్న ప్రాంతం నుండి నీరులేని ప్రాంతానికి నీటిని తరలించి కరవు
పీడిత ప్రజల కడగండ్లకు శాశ్వత పరిష్కారానికి రాజకీయ సంకల్పంతో ప్రభుత్వం కృషి
చేయాల్సి ఉంది. గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం ద్వారా మాత్రమే కరవు పీడిత ప్రాంతాల
సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు
వట్టి వసంత కుమార్ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ హై కోర్టులో కేసు
వేసినట్లు ప్రసారమాధ్యమాల్లో వారలొచ్చాయి. ఈ అంశంపై శాసనసభలో అసమగ్రమైన చర్చ
జరిగింది. గోదావరి నదీ జలాల సద్వినియోగం అంశాన్ని సంకుచిత రాజకీయాలకు అతీతంగా
పరిశీలించాలి.
I. పోలవరం: ఏడు దశాబ్దాల క్రితమే
ప్రతిపాదించబడి, వివాదాల నడుమ నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరం
ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, నిర్మాణ బాధ్యతను
స్వీకరించింది. ఈ ప్రాజెక్టు నిరాణంపై నిన్నటి వరకు తెలంగాణ వాసులు పేచీ పెట్టేవారు. రాష్ట్ర విభజనలో భాగంగా ప్రాజెక్టు ముంపు ప్రాంతాలన్నిoటినీ ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగం చేయడంతో నేడు ఆ గోల
తప్పింది. కానీ, ఒడిశా, చత్తిస్ ఘర్ రాష్ట్రాల అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఒడిశా
ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసు విచారణలోనే ఉన్నది. అంటే ఇరుగు పొరుగు
రాష్ట్రాలలోని ముంపు ప్రాంతాల సమస్యకు సంబంధించి తలెత్తిన వివాదం అపరిష్కృతంగానే
ఉన్నది. దాని నుండి బయటపడాల్సి ఉన్నది.
నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో!: జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన కేంద్ర
ప్రభుత్వం ఎన్నేళ్ళలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుందో స్పష్టంగా కార్యాచరణ
ప్రణాళికను ప్రకటించలేదు. పోలవరం అథారిటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి, దానికి బాధ్యతలు
అప్పజెప్పుతామని చెబుతున్నారు. 2015 -16 వార్షిక బడ్జెట్
లో కేవలం రు.100 కోట్లు విదిలించారు. ఈ తరహా నామమాత్రపు నిథుల కేటాయింపులు చేస్తే రు.16,000 కోట్లకు పైగా వ్యయం
చేయవలసిన పోలవరం నిర్మాణం పూర్తి కావడానికి ఎన్నేళ్ళుపడుతుందో! ఊహించడం కష్టం. ఇప్పటి వరకు రు.3,500 కోట్లు ఖర్చు అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది.
కాలం గడిచే కొద్దీ నిర్మాణ వ్యయం పెరిగిపోతూనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలోని
పెద్దలు మాత్రం 2018 నాటికి నిర్మాణం
పూర్తి చేసి తీరుతామని పదే పదే
ప్రకటనలు చేస్తున్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో గత ప్రభుత్వాలు
చెప్పిన మాటలు, ఆచరణకు సంబంధించిన అనుభవాలు తెలుగు ప్రజలకు చాలా ఉన్నాయి.
పోలవరం నిర్మాణ లక్ష్యాలు: 1) గోదావరి డెల్టాలోని పది
లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ కల్పించాలని, 2)
నూతనంగా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగు నీటిని
అందించాలని, 3) 80 టి.యం.సి.లను కృష్ణా నదికి మళ్ళించాలని, 4) 23.44 టి.యం.సి.లను
విశాఖ త్రాగు నీటికి, పరిశ్రమలకు మరియు దారి మధ్యలో 540 గ్రామాలకు రక్షిత త్రాగు నీరు సరఫరా చేయాలని, 5) 960 మెగావాట్ల
జలవిద్యుత్తు ఉత్పత్తి, 6) ఇందిరసాగర్(పోలవరం) జలాశయం నుండి ఎత్తిపోతల పథకాల ద్వారా
ఖమ్మం జిల్లాలో 1.30 లక్షల ఎకరాలకు, కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో 70,000 ఎకరాలకు సాగు
నీరందించాలన్న లక్ష్యాలకు అనుగుణంగా పోలవరం జలాశయాన్ని 150 అడుగుల ఎత్తుతో నిర్మించబడుతున్నది. ఈ లక్ష్యాలకు
అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పట్ల ఆంధ్రప్రదేశ్ లో ఏకాభిప్రాయం ఉన్నది.
క్రిష్ణా డెల్టాకు నీటి తరలింపు: ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం యం. వెంకటరావు నేతృత్వంలో పది
మందితో నియమించబడిన నిపుణుల కమిటి 2006 జనవరి 9న సమర్పించిన నివేదికలో గోదావరి నది నుండి 80 టి.యం.సి.లను కృష్ణా
డెల్టాకు తరలింపుకు సంబంధించిన నెల వారి డిమాండ్ పట్టికను కూడా పొందుపరిచారు. దాని
ప్రకారం జూన్- 10.61, జూలై- 16.22, ఆగస్ట్- 14.21, సెప్టంబర్- 12.57, అక్టోబర్- 11.87, నవంబర్- 7.62, అలాగే డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు 11.6, మొత్తం 84.7 టి.యం.సి.లు. ఇందులో 4.7 టి.యం.సి.లు ఆవిరి
పద్దు. ప్రాజెక్టు నిర్మాణం తరువాత ఈ మేరకు నీటిని క్రిష్ణా డెల్టాకు తరలించడానికి
ఎవరికీ అభ్యంతరం లేదు.
II. గోదావరి డెల్టా నీటి అవసరాలు: గోదావరి డెల్టా ఆయకట్టులో ఖరీప్ పంటకు జూన్ - 18.03, జూలై - 34.61, ఆగస్టు - 34.60, సెప్టంబరు - 31.03, అక్టోబరు - 30.30, మొత్తం 148.57 టి.యం.సి.లు అవసరమతాయని నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. ఆ ఐదు
మాసాల కాలంలో ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర సగటున లభించే గోదావరి నీళ్ళు 726.45 టి.యం.సి.లు. అని పేర్కొన్నారు. మనం 1991-92 నుండి 2005-06 సం. వరకు గణాంకాలను
పరిశీలిస్తే 1640 నుండి 6082 టి.యం.సి.లు సముద్రంలోకి వెళ్ళాయి. సగటున మూడు వేల టి.యం.సి.లకు పైగా ప్రతి సంవత్సరం సముద్రంలోకి వెళుతున్నాయని నిపుణులు
చెబుతున్నారు.
గడచిన ఐదేళ్ళ గణాంకాలను పరిశీలిద్దాం. ప్రతి ఏడాది జూలై 31వ తేదీన నదీ ప్రవాహ
గణాంకాలను పరిశీలిస్తే 2010లో 6,93,644, 2011లో 85,648, 2012లో 3,33,144, 2013లో 6,74,619, 2014లో 2,84,469 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం ఆనకట్ట నుండి సముద్ర గర్భంలోకి
వెళ్ళాయి. ఖరీప్ సీజన్ లో ఆయకట్టుకు నీటి సమస్య లేదు. పైపెచ్చు వేలాది టి.యం.సి.ల
నీరు సముద్రంలోకి వెళుతున్నది. రబీ సీజన్ లో ఆయకట్టుకు 118 టి.య.సి.లు కావలసి ఉంటే సగటున 91 టి.యం.సి.లు లభ్యత ఉన్నది. వర్షా కాలంలో లభించే నీటిని
నిల్వ చేసుకోవడానికి జలాశయం లేకపోవడంతో నీరు సముద్రం పాలౌతున్నది. పోలవరం నిర్మాణం
ద్వారా మాత్రమే గోదావరి ఆయకట్టులో రబీ పంటకు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
లభిస్తుంది.
III. కృష్ణా నదీ జాలలపై తీవ్ర వత్తిడి: గోదావరి నదీ ప్రవాహంలో 84% నైరుతీ రుతు పవనాల (జూన్ నుండి సెప్టంబరు మాసాల మధ్య) ద్వారా నీరు లభిస్తుంది. కృష్ణా నదీ ప్రవాహంలో 73% నీరు నైరుతీ రుతు పవనాల
ద్వారానే లభిస్తుంది. కృష్ణా నదీ జలాలు సంపూర్ణంగా వినియోగించుకోబడుతున్నాయి. ఉమ్మడి
రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ 811 టి.యం.సి.లు కేటాయిoచింది. కర్నాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలను నిర్మించాక నదీ ప్రవాహంలో గణనీయమైన
మార్పు చోటు చేసుకొన్నది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలులోకి
వస్తే తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన నికరజలాలు సకాలంలో పొందే పరిస్థితులు కనబడడం
లేదు. కృష్ణా నదీ జలాలపై
ఆధారపడిన తెలుగు ప్రాంతాలలో సాగు నీరు, త్రాగు నీరు మరియు ఇతర అవసరాల మేరకు నీటి లభ్యత లేకపోవడంతో
నీటి వినియోగంపై తీవ్రమైన వత్తిడి ఉన్నది. రాష్ట్ర విభజన తరువాత శ్రీశైలం మరియు
నాగార్జునసాగర్ జలాశయాల వద్ద నీటి వినియోగానికి సంబంధించి తలెత్తిన వివాదాలను
చూశాం. ఈ పూర్వరంగంలో మిగులు జలాలపై ఆధారపడి వెనుకబడ్ద రాయలసీమ ప్రాంతం మరియు
ప్రకాశం జిల్లాలో నిరించబడుతున్న తెలుగు గంగ, హంద్రీ - నీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం
ద్వారా మాత్రమే వరుస కరవులతో తల్లడిల్లిపోతున్న రాయలసీమ దప్పిక తీర్చడానికి
వీలవుతుoది.
క్రిష్ణా డెల్టా ఆయకట్టు దుస్థితి: బచావత్ ట్రిబ్యునల్ 181.2 టి.యం.సి.ల నికర జలాలను కేటాయించింది. ఉమ్మడి రాష్ట్ర
ప్రభుత్వం 1996 జూన్ 15న విడుదల చేసిన జి.ఓ.నెం.69 ప్రకారం క్రిష్ణా డెల్టాకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి నీటిని
విడుదల చేయాలి. జూన్ లో నార్లు పోసుకొని పంటను సకాలంలో సాగు చేసుకోక పోతే
డిసెంబరులో సంబవించే తుఫాన్ల బారినపడి తీవ్రనష్టం జరుగుతున్నది. క్రిష్ణా డెల్టా
ఆయకట్టు ద్వారా లభించే ఆదాయం దాదాపు మూడు వేల కోట్లు ఉంటుందని అంచనా. గడచిన ఐదు
సంవత్సరాల నీటి లభ్యత గణాంకాలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి బోధపడుతుంది.
శ్రీశైలం జలాశయంలో 834 అడుగుల నీటి మట్టంపైన ఉన్న నీటిని మాత్రమే విద్యుదుత్పాదన
చేసుకొంటూ క్రిష్ణా డెల్టా మరియు నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలకు నీటిని
వినియోగించుకోవాలని, అలాగే నాగార్జునసాగర్ జలాశయంలో 510
అడుగుల నీటి మట్టంపైన నీరుంటేనే క్రిష్ణా
డెల్టాకు నీటిని విడుదల చేయాలని జి.ఓ.నెం.69లో విస్పష్టంగా చెప్పబడింది. జూలై 31వ తేదీని ప్రాతిపదికగా తీసుకొని నాగార్జునసాగర్ జలాశయం వద్ద
నీటి మట్టాలను పరిశీలిస్తే 2010లో 520 (పూర్తి నీటి మట్టం 590 అడుగులు), 2011లో 552, 2012లో 511, 2013లో 528, 2014లో 511 అడుగులు రికార్డయ్యింది. ప్రకాశం బ్యారేజి వద్ద 2012లో 2.78(పూర్తి నీటి మట్టం 3.071 అడుగులు), 2013లో 2.67, 2014లో 2.88 అడుగులు రికార్డయ్యింది. అంటే ఆ సంవత్సరాలలో జూలై 31 నాటికి కూడా క్రిష్ణా
డెల్టా ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేని దుస్థితి నెలకొన్నది. దాని దుష్పలితాలను
రైతాంగం అనుభవించింది.
IV. పట్టిసీమ ఎత్తిపోతల పథకం : పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి మూడు నాలుగేళ్ళు పడుతుంది
కాబట్టి ఈ లోపు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 80 టి.యం.సి.ల గోదావరి వరద నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా
తరలించి త్రాగు, సాగు, పారిశ్రామిక
మరియు ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టి రు.1300 కోట్లు మంజూరు చేస్తూ 2015 జనవరి 1 వ తేదీన ఉత్తర్వులు జారీ
చేసింది. ఈ పథకం ఆవశ్యకతపై విమర్శలు, ప్రతివిమర్శలతో చర్చ జరుగుతున్నది. ఒకవైపున పోలవరం నిర్మించబడుతుంటే పట్టిసీమ ఎత్తిపోతల
అవసరమేమిటి? పోలవరం నిర్మాణం తరువాత ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా పడిపోతుంది కదా? దాని కోసం ఖర్చు
పెట్టబోయే రు.1300 కోట్ల అత్యంత విలువైన ప్రజాధనం వృధా అవుతుంది కదా?
ఈ తరహా అనుమానాలు వ్యక్తం చేయడం, ప్రశ్నలు వేయడం
గమనిస్తున్నాము. పోలవరం నిర్మాణాన్ని జాప్యం చేయడానికే ఈ పథకాన్ని ముందుకు
తెచ్చారని, తమకు సంబంధించిన కాంట్రాక్టర్ల ఆర్థిక ప్రయోజనాలకు, కమీషన్ల కోసమే దీని నిర్మాణం తలపెట్టారనే విమర్శలు
ఉన్నాయి. వాటిని తృణీకార భావంతో కొట్టి పారేయలేం. కారణం అలాంటి అవినీతి సమాజంలో
జీవిస్తున్నాం. గొంగళ్ళో కూర్చొని అన్నం తింటున్నాం. అన్నంతో పాటు వెంట్రుకలు
నోట్లోకి పోతాయి. అందులో అనుమానం లేదు. అలా అని అన్నం తినకుండా ఉండలేము కదా! ఈ
ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కూడా అవినీతి జరిగే అవకాశం లేదా అంటే ఉంటుందనే
సమాధానమే వస్తుంది. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. దాన్ని నివారించడానికి
ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు వత్తిడి చేయడమొక్కటే మార్గం. ఈ పథకం
అమలుపై హేతుబద్ధమైన చర్చ జరిగితే స్వాగతించవచ్చు. కేవలం సంకుచిత రాజకీయ కోణంలో
వ్యతిరేకించడాన్ని ప్రజలు సమర్థించకూడదు. ఈ పథకం అమలుకు ప్రతిబంధకాలూ ఉన్నాయి, దీన్ని యుద్ధ
ప్రాతిపదికపై నిర్మించ గలిగితే ప్రయోజనాలు వనకూడవచ్చు.
1. ఈ పథకం ద్వారా
గోదావరి వరద నీటిని క్రిష్ణా డెల్టాకు సరఫరా చేసి, ఆ మేరకు ఆదా అయ్యే కృష్ణా నదీ జలాలను వెనుకబడ్డ రాయలసీమకు
అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతావుంది. ప్రభుత్వంలోని పెద్దలు చెప్పే మాటలపై
రాయలసీమ ప్రాంత ప్రజలకు విశ్వాసం కలగడం లేదు. కారణం నిర్మాణంలో ఉన్న హంద్రీ - నీవా, గాలేరు-నగరి, వెలుగొండ, అలాగే పెండింగ్ లో ఉన్న
తెలుగు గంగ ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తి చేయకుండా నీరిస్తామంటే ఎలా నమ్మాలి
అన్న ప్రశ్న వారిని వేధిస్తున్నది. రాయలసీమ వాసులకు భరోసా కల్పించాలంటే ప్రభుత్వం
బడ్జెట్ లో ఆ ప్రాజెక్టులకు అవసరమైన నిథులను కేటాయించి, కనీసం మొదటి మరియు రెండవ దశ నిర్మాణ పనులను యుద్ధ
ప్రాతిపదికపై పూర్తి చేయాలి. అలా చేయకపోతే గోదావరి నీటిని క్రిష్ణా డెల్టాకు మళ్ళించుకొనడానికి
రాయలసీమను పావుగా వాడుకొంటున్నారనే అభిప్రాయం మరింత బలపడుతుంది. అది ప్రమాదకరం.
2. పోలవరం కుడి
కాలువ పనులు దాదాపు 90% పూర్తయ్యాయని చెబుతున్నారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణ
పనులను పూర్తి చేసి కాలువను వినియోగంలోకి తీసుకొని రాకపోతే పాడయ్యే అవకాశాలు
మెండు. దానికి మరమ్మత్తులు చేయడానికి మళ్ళీ నిథులు వెచ్చించాల్సి వస్తుంది.
భూసేకరణకు సంబంధించి న్యాయ స్థానాల్లో కొన్ని కేసులు నడుస్తున్నాయని చెబుతున్నారు.
వాటి నుండి త్వరగా బయటపడి భూసేకరణను పూర్తి చేసి, ప్రధాన కాలువ నిర్మాణ పనులను పూర్తి చేస్తేనే పట్టిసీమ
ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించగలరు. క్రిష్ణా డెల్టాలో సాగుకు సకాలంలో
నీటిని సరఫరా చేయడానికి వీలవుతుoది. లేనియడల ఆ పథకం మూలనపడే ప్రమాదం లేకపోలేదు.
3. గోదావరి, కృష్ణా నదులకు
ఏకకాలంలో వరదలు వస్తాయి కదా? అన్న ప్రశ్న
కొందరు వేస్తున్నారు. నిజమే, నైరుతీ రుతు
పవనాల ద్వారానే రెండు నదులకు అత్యధిక నీరు లభిస్తుంది. ఈ అంశంపై గణాంకాలతో పైన
వివరిoచడం జరిగింది. ఒక వైపున
గోదావరి నదీ జలాలు సముద్రం పాలవుతుంటే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో దిగువనున్నఆంధ్రప్రదేశ్
రాష్ట్రం నీటి ఎద్దడి వల్ల ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నదో ప్రస్తావించడం
జరిగింది. కాస్త లోతుగా దృష్టి సారించి, రెండు నదులకు
సంబంధిoచిన నీటి ప్రవాహ గణాంకాల
ఆధారంగా వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి.
4. నిథులు వృధా: పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి వెచ్చించే రు.1300 కోట్లు మట్టి పాలవుతుందని కొందరు విమర్శిసున్నారు. ఈ
విమర్శను సహృదయంతో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర విభజనతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో
కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ ఈ తరహా పథకాలకు నిథులను ఖర్చు చేయడం భావ్యమా!
అన్నది ఆలోచిoచ వలసిన అంశమే.
కానీ, ఈ వ్యయం వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తుల పెరుగుదలకు, త్రాగు నీటి అవసరాలు తీర్చడానికి దోహదపడుతుందనుకొన్నప్పుడు
తప్పు పట్టకూడదు. అప్పుల ఊబిలో కూరుకపోయిన రైతుల రుణాల రద్దును సమర్థిస్తున్నాం.
సంపద సృష్టిలో ప్రత్యక్షంగా భాగస్వాములుకాని ఉద్యోగుల జీతాలను 43% పిట్మెంటుతో పెంచినా మనం ప్రశ్నించే స్థితిలో లేము.
ఎందుకంటే ద్రవ్యోల్బణం, రూపాయి విలువ
దిగజారిపోవడం, కొనుగోలు శక్తి
పడిపోవడం. వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి.
5. పోలవరం పూర్తి అయ్యాక ఎత్తిపోతల వృధానే కదా?: ఈ ప్రశ్న సముచితమైనదే. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన
జి.ఓ.లో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగానే
నిర్మించ తలపెట్టినట్లు పేర్కొన్నారు. దాని అoతరార్థం ఏమిటో స్పష్టంగా బోధపడడం లేదు. జాతీయ ప్రాజెక్టు
కాబట్టి అలా చెప్పి ఈ పథకానికి కూడా ఆర్థిక సహకారాన్ని కోరవచ్చనే ఆలోచనలో రాష్ట్ర
ప్రభుత్వం ఉన్నదేమో! ఎందుకంటే ఇందిర సాగర్ (పోలవరం జలాశయం) నుండి రెండు లక్షల
ఎకరాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు నీటి సరఫరా అంశం కూడా ఉన్నది. అందులో
క్రిష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో
70,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. కానీ, ఈ పథకంపై
వెచ్చించే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందనే భ్రమలు నాకు లేవు. పోలవరం నిర్మాణం తరువాత పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి వాడిన
మోటార్లను, ఇతర యంత్ర
సామగ్రిని వినియోగించుకొనే అవకాశమూ లేకపోలేదు. అప్పటికి తరుగుదల పోను వాటి విలువ
కూడా తగ్గుతుంది.
ముగింపు: పోలవరం
ప్రాజెక్టు నిర్మాణానికి అనివార్యంగా
కొన్నేళ్ళు పడతాయి, కాబట్టి ఈ మధ్య
కాలంలో గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకొని క్రిష్టా డెల్టాలో సకాలంలో
సాగుకు నీరందించి సత్పలితాలు
పొందడం, తద్వారా ఆదా అయ్యే కృష్ణా నదీ జలాలను శ్రీశైలం జలాశయం నుండి
రాయలసీమలోని ప్రాజెక్టులకు మళ్ళిస్తే సమర్థనీయమే. ఈ పథకం త్వరితగతిన అమలులోకి
వస్తే పోలవరం కుడి ప్రధాన కాలువ పూడికకు గురి కాకుండా కూడా పరిరక్షించబడుతుంది. పై
అన్ని అంశాలపైన హేతుబద్దమైన ఆలోచనకు పదును పెట్టాలి.
No comments:
Post a Comment