Wednesday, April 29, 2015

చంద్రబాబునాయుడుపై కెసిఆర్ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపైన‌, నాగం జనార్దన్ రెడ్డి రాజకీయ వ్యూహంపైన వచ్చిన వూహాగానాలపై హెచ్.యం.టీ.వి.లో ఏప్రి 29, 2015న జరిగిన చర్చలో నాతో పాటు బిజెపి నాయకులు డా. నాగం జనార్దన్ రెడ్డి, టిడిపి నాయకులు శ్రీ రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ సమ్మారావు, టి.ఆర్.యస్. నాయకులు శ్రీ నాగేంద్ర గౌడ్ పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=eTW59P9wXu8

6టీవిలో ఏప్రిల్ 28 రాత్రి 'టిటిడి పాలక మండలి నియామకం _ సభ్యుల అర్హతలు' అన్న అంశంపై జరిగిన ప్రత్యేక చర్చలో నాతో పాటు ఆంధ్ర మేధావుల సంఘం, అధ్యక్షులు శ్రీ చలసాని శ్రీనివాస్, వై.యస్.ఆర్.సి.పి. నాయకురాలు శ్రీమతి లక్ష్మీపార్వతి, వి.హెచ్.పి.నాయకులు శ్రీ శ‌శిధర్ పాల్గొన్నారు. టిటిడి పాలక మండలి నియామకంలో సంకుచిత‌ రాజకీయ ప్రయోజనాలు, సభ్యులకు ఉండవలసిన‌ అర్హతలు, టిటిడి నిర్వర్తించాల్సిన‌ సామాజిక బాధ్యత, టిటిడి ఆర్థిక సహకారంతో నెలకొల్పబడిన విద్యా, వైద్య సంస్థలలో ఇతర మతాలకు చెందిన వారు ఉద్యోగాలకు, పదోన్నతులకు అనర్హులా! కాదా! అన్న పలు అంశాలపై చర్చ జరిగింది. నేను కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశాను. నేను మాట్లాడే సందర్భంలో వి.హెచ్.పి.నాయకులు కాస్త అడ్డుతగిలి మాట్లాడడంతో నేనూ కాస్త నోరుపెంచి మాట్లాడాల్సి వచ్చింది. ఆసక్తి ఉన్న మిత్రులు చూసి హేతుబద్ధమైన నిర్ధారణకు రాగలరు.

https://www.youtube.com/watch?v=SkYWOyYWXnE

Sunday, April 26, 2015

"ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా" అంశంపై కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా శీతారామన్ చేసిన వ్యాఖ్యలపైన, టి.ఆర్.యస్. ఫ్లీనం పైన హెచ్.యం.టీ.వి.లో ఈ రోజు ఉదయం జరిగిన చర్చలో నాతో పాటు కాంగ్రెస్ పార్టీ, ఆ.ప్ర. అధికార ప్రతినిథి డా. తులసిరెడ్డి, టిడిపి నాయకులు శ్రీ రామక్రిష్ణ, బిజెపి నాయకులు శ్రీ ప్రకాశ్ రెడ్డి, టి.ఆర్.యస్. నాయకులు శ్రీ గట్టు రామచంద్రరావులు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=mma1FDl81qc

వ్యవసాయ సంక్షోభం: రైతు ఆత్మ‌హత్యలు - భూసేకరణ చట్టానికి సవరణలు - ప్రభుత్వ నీతి

రెండు రోజుల క్రితం ఒక రైతు మిత్రుడు ఫోన్ చేశాడు. మేమిరువురం ఐదు నుండి పదవ తరగతి వరకు కడప జిల్లా చిట్వేలి ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకొన్నాం. అతను వ్యవసాయదారుడుగా వృత్తిని ఎంచుకొన్నాడు. ఇప్పుడు ఆర్థిక వడుదుడుకులతో సతమతమవుతున్నాడు. ఆశ పెట్టుకొన్న‌రుణ మాఫీ పథకం తనకు వర్తించ లేదని చెప్పాడు. ఆ మండలంలో ఆరేడు మంది రైతులు మాత్రమే రుణ మాఫీకి అర్హులుగా ఎంపికైనారని చెప్పాడు. ఆర్థికంగా నిలదొక్కుకొని, పిల్లల చదువులకు అంతరాయం కలగకుండా ఎలా నెట్టుకు రావాలనే ఆవేదన వ్యక్తం చేస్తూ ప్ర‌త్యామ్నాయ ఉపాథి కోసం గత కొంత కాల‍ంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఇవ్వలేదని బాధపడ్డాడు. ఇది రైతాంగం యొక్క‌ హృదయవిదారకమైన దుస్థితికి అద్దం పడుతున్న ఒక ఉదంతం.
దాదాపు 60% మందికి ఉపాథి కల్పిస్తూ, జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి బయటపడేసి, రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తున్న సమస్యల మూలాల్లోకెళ్ళి శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తేనే దేశం ప్రగతి బాటలో అడుగు ముందుకు వేయగలదు. అప్పుడే 120 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఆహార భద్రతకు భంగం కలగకుండా జాగ్రత్త పడగలం. సరళీకృత ఆర్థిక విధానాలతో రైతు కొనాల్సిన విత్తనాలు మొదలు రసాయనిక ఎరువులు, పురుగు మందులు, ఆధినిక యంత్ర సామగ్రి, పనిముట్లు వగైరా అన్నింటి ధరలూ హనుమంతుని తోకలా పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు రైతాంగం వెన్ను విరుస్తున్నాయి. మెట్ట ప్రాంతాల రైతాంగం, తమ‌ కళ్ళ ముందే వేసిన‌ పంటలు, పండ్ల తోటలు, ఇతర ఉద్యాన వన పంటలు మలమల మాడిపోతుంటే గుండె తరుక్కు పోయి, అడుగంటి పోతున్న భూగర్భ జలాల వెంట పరిగెడుతూ బోర్ల మీద బోర్లు వేసుకొంటూ అప్పుల ఊబిలో కూరుక పోతున్నారు.
మార్కెట్ లో ఖరీదైన‌ సరుకులుగా మారిపోయిన పిల్లల చదువు, కుటుంబ సభ్యులకు వైద్యం ఖర్చులకు అప్పుల మీదే ఆధారపడ వలసిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం వైపు పరుగులు తీస్తూనే ఉన్నాయి. రైతులపై ఆర్థిక భారం మోపే రంగాలను, పారిశ్రామిక వర్గాలను నియంత్రించక పోగా వారికే అన్ని రకాల రాయితీలు ఇస్తూ ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలిచి, ప్రోత్సహిస్తున్నాయి. వ్యవసాయ‌ రంగం సంక్షోభంలో కూరుకపోతున్న, నిరుద్యోగం పెరిగి పోతున్నా, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ముంచుకొస్తున్నా, పర్యావరణం ధ్వంసమౌతున్నా ఏ మాత్రం ఖాతరు చేయకుండా తాము పట్టిన‌ కుందేటికి మూడే కాళ్ళన్న నానుడిగా దేశ స్థూల జాతీయోత్ఫత్తి పెరగాలంటే విదేశీ మరియు స్వదేశీ కార్పోరేట్ సంస్థలకు ఎర్ర తివాచీ పరిచి, ఊడిగం చేస్తే తప్ప‌ పారిశ్రామికాభివృద్ధి జరగదన్న ఆర్థిక సిద్ధాంతాన్ని పాలకులు జపిస్తున్నారు.
రైతు పండించే పంటలకు మాత్రం లాభ సాటి ధరలను నిర్ణయించుకొనే కనీస‌ హక్కు లేదు. బ్రిటీష్ కాలం నాటి 1894 భూసేకరణ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని సాధించుకోవడానికి స్వాతంత్య్రానంతరం కూడా దశాబ్ధాల పాటు రైతాంగం అలుపెరగని ఉద్యమాలు చేసిన పలితంగా భూసేకరణ చట్టం_2013 వచ్చింది. అది 2014 జనవరి 1 నుండి అమలులోకి వస్తే కొన్ని నెలలు తిరగక ముందే పార్లమెంటు ఎన్నికలు రావడం, మోడీ నాయకత్వంలో నూతన ప్రభుత్వం అధికార పగ్గాలు చేబట్టడం చకచకా జరిగి పోయాయి. నూతన భూసేకరణ చట్టానికి ఏడాది వయసు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేయడానికి నిబంధనలను రూపొందించి, ప్రక్రియే మొదలు పెట్ట‌లేదు. అప్పుడే ఆ చట్టంలోని రైతాంగానికి అనుకూలమైన కీలకాంశాలను ఒక్క దెబ్బతో తొలగించే దుష్ట చర్యకు మోడీ ప్రభుత్వం పూనుకొన్నది. అత్యవసర ఉత్తర్వు(ఆర్డినెన్స్) ఒకటికి, రెండు సార్లు జారీ చేసింది. ఆరు నూరైనా అగ్రహారం పాడైనా లెక్క చేయను చట్టానికి సవరణలు చేసి తీరుతానన్న మూర్ఖత్వాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే తీరులో వ్యవహారాలను నడుపుతున్నది. రైతాంగ వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల ప్రభుత్వమన్న‌ ముద్ర పడినా వెనుకంజ వేయకపోవడాన్ని గమనిస్తే సంపన్న వర్గాలకు ప్రయోజనాలను వనగూడ్చి పెట్టడానికే ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నట్లు స్పష్టమవుతున్నది.
వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి, వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించి లాభసాటిగా మార్చాలి. రైతాంగ ఆత్మహత్యలను అరికట్టడానికి రాజకీయ‌ సంకల్పంతో అవసరమైన కార్యాచరణను అమలు చేయాలి. ఆహారభద్రతను మరియు పర్యావరణాన్ని పరిరక్షించుకొంటూ, ఉపాథి అవకాశాలను, ప్రజల కొనుగోలు శక్తిని, జీవన ప్రమాణాలను పెంపొందించే పారిశ్రామికాభివృద్ధి సాధన కోసం కృషి జరగాలి. ఈ దృక్పథంతో శక్తివంతమైన ప్రజా ఉద్యమాల ఆవశ్యకత రోజు రోజుకూ పెరుగుతున్నది. పాలకుల తాత్విక చింతన మారాలి. రెండున్న దశాబ్ధాలుగా అమలు చేయబడుతున్న‌ సరళీకృత ఆర్థిక విధానాలలోని మంచి చెడులపై లోతైన సమీక్ష జరగాలి. వాటిలో ఏ అంశాలైతే సమాజానికి మేలు చేశాయో! వాటిని స్వీకరించి, హానికరమైన అంశాలను నిర్ద్వందంగా తిరష్కరించాలి. 

Thursday, April 23, 2015

ఆ.ప్ర. నూతన రాజధాని చుట్టూ ముసురుకొన్న సమస్యలు

రాష్ట్ర విభజనతోనే విజయవాడ, గుంటూరు ప్రాంతాల భూయజమానుల మనస్తత్వంలో గణనీయమైన మార్పు చోటు చేసుకొన్నది. రాజధాని ప్రాంతంగా ప్రకటించబడిన తరువాత ఆ మనస్తత్వం మరింత బలపడిపోయింది. వారికి వ్యవసాయం కంటే భూముల ధరల పెరుగుదలపై బాగా మక్కువ పెరిగిందనడంలో నిస్సందేహం. భూమి ఖరీదైన‌ సరుకుగా మారిపోయి వాణిజ్య లక్షణాన్ని సంపూర్ణంగా సంతరించుకొని, షేర్ మార్కెట్ తరహాలో భూముల ధరల పెరుగుదల, తగ్గుదల ఒక జూదంగా పరిణమించింది.  కొద్ది కాలంలోనే ఆ దుష్పరిణామాల‌ పర్యవసానాలను గమనిస్తూనే ఉన్నాం. స్తిరాస్థి వ్యాపారస్తులు కొందరు ఆత్మహత్యలు చేసుకొన్న ఉదంతాలు వెలుగులోకి కూడా వచ్చాయి.
ఆహార భద్రత దేవుడెరుగు, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంలోను, దాని పరిసర ప్రాంతాల్లో సామాన్యులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం దుర్లబంగా మారనున్నది. ఉపాథిని వెతుక్కొంటూ నూతన రాజధానికి వచ్చే వెనుకబడ్డ‌ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులకు స్థిర నివాసం ఒక కలగానే మిగిలిపోతుంది. ఇంటి అద్దెలు కూడా చెల్లించుకోలేని దుస్థితి నెలకొని, ఇది సంపన్నుల రాజధాని, సామాన్యులకు ఇక్కడ చోటు లేదనే భావన ఏర్పడడం ఖాయం.
రాజధాని ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ‌ అతి పెద్ద సమస్యగా రూపుదాల్చే ప్రమాదం స్పష్టంగా కనబడుతున్నది. దాన్ని కొంత వరకైనా నివారించాలంటే పులిచింతల జలాశయం నుండి ప్రకాశం ఆనకట్ట వరకు, కృష్ణా నది ఒడ్డుకు రెండు, మూడు కిలో మీటర్ల వరకు 'గ్రీన్ బెల్ట్' గా ప్రకటిస్తూ ప్రత్యేక చట్టాన్ని తేవాలి. భష్టు పట్టిన ఈ రాజకీయ వ్యవస్థ భవిష్యత్తులో ఆ చట్టానికి తూట్లు పొడవరా! అంటే అలా జరగదని ఏ ఒక్కరూ బరోసా ఇవ్వలేరు. కాకపోతే తమ జీవితాలతో మెలివేసుకొన్న అలాంటి చట్టాన్ని పరిరక్షించుకొనే చైతన్యం ప్రజల్లో వస్తే దాన్ని ఎవరు అధికారంలోకి వచ్చినా బలహీన పరచడం అంత సులువు కాకపోవచ్చు. అలాంటి చట్టాన్నే రూపొందించక పోతే కృష్ణా నది పూర్తిగా కలుషితమై హైదరాబాదు మహానగరం మధ్యలో ప్రవహిస్తున్న మూసీలా తయారవ్వడం ముమ్మాటికీ ఖాయం.
తీవ్ర ఉష్ణోగ్రతలకు నెలవుగా ఉన్న రాజధాని ప్రాంతంలో వచ్చే నూతన నిర్మాణాల తరువాత ఉన్న పచ్చదనం కూడా ధ్వంసమై మరింత ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు విల‌విల్లాడవలసి వస్తుంది. ప్రత్యేక‌ చట్టాన్ని తీసుకు రాకపోతే భూములు రైతుల చేతుల్లో మిగిలే ప్రసక్తే లేదు. స్థిరాస్థి వ్యాపారస్తులు, పారిశ్రామిక వర్గాలు భూముల‌ ధరలు పెంచి, ప్రలోభ పెట్టి, రైతుల ను‍ండి భూములను కొనేసి వాణిజ్యపరం చేస్తారు. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకుండా కేవలం ప్రయివేటు వ్యవహారంగా వదిలేస్తే ల్యాండ్ మాఫియాలు విజృంభించే అవకాశం ఉన్నది. ఈ ప్రక్రియ అనివార్యంగా జరిగిపోతుంది. అది ఏ మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఈ తరహా అంశాలపైన లోతైన చర్చ జరగాలి.

Sunday, April 19, 2015

ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పటికి? రాయలసీమ దాహం తీరేదెన్నటికి ?? గాలేరు - నగరి ప్రాజెక్టుపై డాక్యుమెంటరీ

కరువుల్లో పుట్టి, కరువుల్లో పెరిగి, కరువుల్లోనే మరణిస్తున్న‌ రాయలసీమ వాసుల ఆర్తనాదాలు పాలకుల చెవికెక్కలేదు. ప్రకృతి నిరాధరణ, పాలకుల అత్యంత దారుణమైన నిర్లక్ష్యం రాయ‌లసీమ ప్రజల పాలిట శాపంగా పరిణమించాయి. కరువు కాటకాల నుండి రాయలసీమ శాశ్వత‍ంగా విముక్తి పొందాలంటే "కృష్ణా నదీ జలాల‌ తరలింపే ఏకైక మార్గం" అని ప్రజలు దశాబ్ధాలుగా నినదిస్తున్నా, అలుపెరగని పోరాటాలు చేస్తున్నా, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ‍ంలో క్షమించరాని జాప్యం చేస్తూనే ఉన్నారు.
* శ్రీశైలం జలాశయం నుండి 19 టి.యం.సి.ల నికర జలాల కేటాయింపుతో, కేంద్ర జల సంఘం అనుమతితో, ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో 1981 సం.లో నిర్మాణ పనులు ప్రారంభించబడిన‌ శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.) నేటికీ పూర్తి కాలేదు.
* 29 టి.యం.సి.ల కృష్ణా మిగులు జలాల ఆధారంగా 1983లో నిర్మాణం ప్రారంభించబడిన తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన జలాశయాలు, ప్రధాన కాలువలు నిర్మించబడ్డాయే కానీ పంట కాలువల వ్యవస్థ నిర్మాణం పట్ల ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు.
* 40 టి.యం.సి.ల‌ కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా హంద్రీ - నీవా సృజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి 1996లో శంఖుస్థాపన చేసినా ఇంకా మొదటి దశ & రెండవ దశ‌ నిర్మాణ పనులనే పూర్తి చేయలేదు.
* 38 టి.యం.సి.ల కృష్ణా నది మిగులు జలాల ఆధారంగానే గాలేరు - నగరి సృజల స్రవంతి పథకానికి 1988లో మొట్ట మొదట నాటి ముఖ్యమంత్రి దివంగత యన్. టి. రామారావు గారు శంఖుస్థాపన చేశారు. 26 ఏళ్ళు గడచి పోయినా ఇంకా గండికోట జలాశయానికి కూడా నీళ్ళు చేరలేదు. మొదటి దశ నిర్మాణ పనులే నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం రెండ దశ నిర్మాణ పనుల ఊసే ఎత్తడం లేదు. ఈ నేపథ్యంలో గాలేరు - నగరి ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై ఈ వీడియో రూపొందించబడింది. చూసి, స్పందించండి.

https://www.youtube.com/watch?v=4xOF2bVHxi8&feature=youtu.be

Thursday, April 16, 2015

"పెట్టుబడిదారీ వ్యవస్థలో నేరాలు, శిక్షలు: మార్క్సిజం" ఈ ఆసక్తికరమైన భావజాల‌ చర్చకు మీకూ ఆహ్వానం



ఈ చర్చకు నేపథ్యం, శేషాచలం అడవుల్లో జరిగిన ఘటన. వ్యవస్థీకృత నేరాలలో భాగస్వాములైన వారిని కూలీలుగా సంబోధించడం కార్మిక వర్గాన్ని అవమానించినట్లవుతుందని, ఎన్ కౌంటరా! ఫేక్ ఎన్ కౌంటరా! అన్న విషయాన్ని తేల్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలను బాధిత కుటుంబాలు కానీ, మరెవరైనా కానీ ఆశ్రయించవచ్చన్న అభిప్రాయాన్ని నేను టీవి5 చర్చలో వ్యాఖ్యానించాను. అదే అభిప్రాయాన్ని 6టీవి చర్చలోను వ్యక్తం చేశాను. రెండు చర్చలకు సంబంధించిన వీడియోలను ఫేస్ బుక్ లో పెట్టాను. నా మిత్రులకు ఇ మెయిల్స్ ద్వారా కూడా పంపాను. వాటిని వీక్షించిన నా శ్రేయోభిలాషి, అంకిత భావంతో పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం పరిత‌పిస్తున్న శాస్త్రవేత్త, మేధావి బాబురావు గారు కొన్ని మౌలికమైన ప్రశ్నలను నాకు సంధించారు. నేను పరిణతి చె‍ందిన‌ కమ్యూనిస్టును కాను, కేవల‍ం ఒక సాధారణ‌ కమ్యూనిస్టును, అందుకే వాటిపై నాలో ఆంత‌రంగిక సంఘర్షణ మొదలయ్యింది. ఆ భావజాల సంఘర్షణను పది మంది మిత్రుల దృష్టిలో పడేసి, దానికి ఒక అర్థవంతమైన ముగి‍ంపు పలికితే బాగుంటుందని భావించాను. బాబురావు గారు ఇ - మెయిల్స్ ద్వారా నాకు రెండు లేఖలు సందించారు. మొదటి దానికి నేనిచ్చిన సమాధానాన్ని ఫేస్ బుక్ మిత్రుల దృష్టికి ఏప్రిల్ 11వ తేదీన‌ తీసుకొచ్చాను. దానిపై కొంత మ‍ంది మిత్రులు వారి స్పందనను తెలియజేశారు.
నా సమాధానం తరువాత‌ బాబురావు గారు రె‍ండవ లేఖలో కొన్ని మౌలికమైన అంశాలను లేవనెత్తారు. అందుకే "పెట్టుబడిదారీ వ్యవస్థలో నేరాలు, శిక్షలు: మార్క్సిజం" అన్న అంశంపై మార్క్సిస్టు భావజాలాన్ని విశ్వసించే వారే కాకుండా అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు మేధోమదనం చేస్తే మంచిదని భావించి నా అభిప్రాయాలను మీ ముందుంచుతున్నాను. వాటిపై కొంత మంది అయినా స్పందించి, చర్చలో భాగస్వాములైతే ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాను. బాబురావు గారు తన రెండవ‌ ఇ-మెయిల్ లేఖలో ప్రస్తావించిన అంశాలన్నింటికీ అంశాల వారిగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ ముఖ పుస్తకంలో పెడుతున్నాను.
నేరాలు, నైతిక విలువలకు సంబంధించి కారల్ మార్క్స్, ఫ్రెడ్రిక్ ఏంగిల్స్ చేసిన వ్యాఖ్యలను 'కోట్' చేస్తూ వాటిని యదాతదంగా నేటి సమాజానికి వర్తింపచేస్తూ వాదనా పటిమను కొందరు ప్రదర్శిస్తున్నారు. తద్వారా వారు మార్క్సిజాన్ని సమకాలీన ప్రపంచానికి శాస్త్రీయ దృక్పథంతో అన్వయింప చేస్తున్నారా! లేదా! అపభ్రంశం పట్టిస్తున్నారా! అన్న అంశంపై సభ్యసమాజం చర్చించాలనే సదుద్ధేశంతో మా ఇరువురి మధ్య నడుస్తున్న వాదప్రతివాదనలను ముఖపుస్తక మిత్రుల దృష్టికి తెస్తున్నాను. తద్వారా మీరు ఈ చర్చలో భాగస్వాములైతే చర్చకు అర్థవంతమైన ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నాను.
చర్చనీయాంశాలను ప్రస్తావించుకొనే ముందు, వాటిని సక్రమంగా అర్థం చేసుకోవడానికి కొద్దిపాటి ఉపోద్ఘాతం అవసరమని భావిస్తున్నాను.  కారల్ మార్క్స్(1818-83), ఫ్రెడ్రిక్ ఏంగెల్స్ (1820-95) 19వ శతాబ్ధానికి చెందిన వారు, మార్క్సిస్టు భావజాలాన్ని ఆవిష్కరించిన మహోన్నతమైన మేధావులు. వారు సమాజ పరిణామ క్రమాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేసి, దోపిడి మూలాలను కనిపెట్టి 'అదనపు విలువ సిద్ధాంత‍‍ం' ద్వారా శ్రామిక వర్గాన్ని చైతన్యపరచి, దోపిడిరహిత సమాజ‍ నిర్మాణానికి కార్యోన్ముఖులను చేసే విప్లవ లక్ష్యంతో మార్క్సిస్టు భావజాలాన్ని ఆవిష్కరి‍ంచారు. మార్క్సిజం ఆవిర్భావంతో ప్రపంచ గమనమే మారిపోయింది. 1917లో రష్యాలో ఘనవిజయం సాధించిన‌ అక్టోబరు మహా విప్లవం పెట్టుబడిదారీ వ్యవస్థ మూలాలను కుదిపేసింది. రెండవ ప్రప్రంచ యుద్ధానంతర కాలంలో అజేయమైన, శక్తివ‍ంతమైన సోషలిస్టు కూటమి ఆవిర్భవించి, సామ్రాజ్యవాద ఆధిపత్యానికి, ఆగడాలకు అడ్డుకట్ట వేసింది. వలస పాలన అ‍తరి‍ంచి పోయి, భారత దేశం లాంటి అనేక దేశాలు స్వాతంత్య్రం సముపార్జించుకొన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలు మనుగడలోకి వచ్చాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణంలో ఉన్న దేశాలలోనే కాదు కడకు సామ్రాజ్యవాద దేశాలలోనూ సంక్షేమ రాజ్య నినాదం ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రామిక వర్గం, ప్రజల పోరాటాలు, అపార త్యాగాలతో పలు ప్రజానుకూల‌ చట్టాలు సాధించుకోబడ్డాయి. ఈ విప్లవాత్మకమైన మార్పులతో ప్రగతి సాధించిన ఆధునిక సమాజంలో నేడు మనం జీవిస్తున్నాం. మన దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణంలో అంతర్భాగంగా ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్ళూనుకొంటున్నది. ఈ పూర్వరంగాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వర్తమాన పరిణామాలను, ఘటనలను మార్క్సిస్టు దృక్కోణంలో ఆలోచించి, శాస్త్రీయమైన నిర్ధారణలకు రావాలి.
 ఆ మహోన్నతమైన విప్లవ సిద్ధాంతాన్ని పిడివాదంగా కాకుండా కాలమాన పరిస్థితులకు, ఆయా దేశాల్లోన్ని సమాజాల అభివృద్ధి దశలను బట్టి అన్వయింపజేసుకొని, శ్రామిక వర్గాలను సంఘటితపరచి, చైతన్యపరచి, సామాజిక మార్పుకు విప్లవోద్యమాలను నిర్మించడానికి కృషి సల్పాలి. ఇప్పుడు అసలు చర్చనీయాంశమైన అంశాలకు వద్దాం.
బాబురావు గారి లేఖలోని ముఖ్యాంశాలు:
1) "మీరు వరిష్ట కమ్యూనిస్టు నాయకులు. కేంద్ర కమిటీ సభ్యులుగా కూడా పని చేశారనుకుంటాను. నేను వివరణ ఇవ్వ వలసిన అవసరం లేదు, సాహిత్యం అందచేస్తే చాలనుకున్నాను. మార్క్సిజం తాత్విక దృష్టి అద్దంతో సమస్యని చూడాలని ఆ వ్యాసాలు పంపాను.
నా అభిప్రాయం: నేను వరిష్ఠ కమ్యూనిస్టును కాదు కానీ కమ్యూనిస్టునే. నేను కేంద్ర కమిటీ సభ్యుడు స్థాయికి ఎదగలేదు. విద్యార్థి ఉద్యమ ప్రతినిథిగా కొంత కాలం జాతీయ సమితికి ఆహ్వానితుడుగా ఉన్నానంతే. కానీ విద్యార్థి ఉద్యమంలో ఉన్నత పాఠశాల మొదలు జాతీయ స్థాయి వరకు ప్రధాన బాధ్య‌తలను అంకిత భావంతో నిర్వహించి, ఆచరణాత్మకమైన‌ అనుభవాన్ని మాత్రం గడించాను. ఇహ! మార్స్కిస్టు భావజాల అధ్యయనం అంశానికొస్తే, మార్క్సిజాన్ని ఆపోశనం పట్టిన వాడిని కాను, కానీ ఒక అంకిత భావ‍ం ఉన్న కార్యకర్తగా మార్క్సిస్టు మూల సూత్రాలను శాస్త్రీయ దృక్పథంతో అవగాహన చేసుకొనే కృషి కొనసాగిస్తున్నాను. ఆ మేరకు నిజాయితీతో సమాజాన్ని, ఘటనలను మార్స్కిస్టు దృక్కోణం, వర్గ దృష్టి నుండే విశ్లేషించుకొని, నిర్ధారణలకు వచ్చి, నికార్సుగా పినిపించే ప్రయత్నం చేస్తుంటాను. మార్స్కిజంపై పరిపూర్ణ‌మైన పట్టు సాధించిన మేధావులకు నా అభిప్రాయాలు లోపభూయిష్టంగా కనిపించవచ్చు. లోపాన్ని ఎత్తి చూపవచ్చు. అందులో తప్పు లేదు. పైపెచ్చు నేను స్వాగతిస్తాను.
2) మార్క్సిజాన్ని అందరూ ఒకేలా అర్ధం చేసుకుంటే ఇన్ని కమ్యూనిస్టు పార్టీలుండేవి కావు.
నా అభిప్రాయం: మార్క్సిజాన్ని శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవడంతో పాటు ఆయా దేశాలలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలకు అన్వయింప చేసుకొని, ఉద్యమాల నిర్మాణంలో అనుసరించాల్సిన భిన్నవైఖరుల మూలంగానే కమ్యూనిస్టు ఉద్యమం చీలికలు పేలికలుగా తయారయ్యింది. పర్య‌వసానంగా శ్రామికవర్గం తీవ్రంగా నష్టపోతున్నది.
3) యీ మధ్య ఒక కమ్యూనిస్టు పార్టీ  యువత నుద్దేశ్యించి మాట్లాడే అవకాశమొచ్చినపుడు మార్క్స్ ఫొటో వున్న స్లైడ్ ని చూపి యీయన ఎవరని అడిగితే సమాధానం రాలేదు.
నా అభిప్రాయం: పేదల పక్షాన పోరాడే పార్టీ అన్న సదభిప్రాయంతో ఆ యువత కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులై ఉండవచ్చు. అలాంటి వారికి మార్క్సిజాన్ని బోధించాల్సిన, ఫోటోను చూసి కారల్ మార్క్స్ ను గుర్తు పట్టే చైతన్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ఆయా కమ్యూనిస్టు పార్టీలపై ఉంటుంది. పార్టీల్లో నెలకొని ఉన్న ఆ బలహీనతను మీ వ్యగంతో కూడిన వాఖ్య వేలెత్తి చూపుతున్నది. అసందర్భం కాదని భావిస్తూ ఒక‌ అనుభవాన్ని వివరిస్తా. నేను తిరుపతిలో ఎ.ఐ.ఎస్.ఎఫ్. కార్యకర్తగా 1975-80 మధ్య కాలంలో పని చేస్తున్నప్పుడు సభ్యత్వ చేర్పింపును సెలవు దినాల్లోను, రాత్రి పూట విద్యార్థుల నివాస ప్రాంతాలు, హాస్టళ్ళలోని గది గదికి వెళ్ళి ఒక‌ ఉద్యమంగా చేపట్టేవాళ్ళం. ఒక రోజు శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల  అబ్బాయిల హాస్టలుకు వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నేను ఒక విద్యార్థితో పరిచయం చేసుకొంటూ అతని పేరడిగాను, కారల్ మార్క్స్ అని చెప్పాడు. ఏంటయ్యా జోక్ చేస్తున్నావా? అంటే లేదండీ నా పేరదే అన్నాడు. కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన ఒక కార్యకర్త దొరికాడని నేను సంబరపడిపోయి మీ వూరేది, మీ కుటుంబం కమ్యూనిస్టు కుటుంబమా? మీ నాన్న పేరేమిటి? తదితర ప్రశ్నలు వేశాను. అతను తాపీగా మా కుటుంబానికి రాజకీయాల వాసనే లేదని నా పేరు కారల్ మార్క్స్ అని పునరుద్ఘాటించాడు. పోనీ నీ పేరు ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహనీయుడెవరైనా ఉన్నారా? అని అడిగితే నాకు తెలియదన్నాడు. ఒకనాడు కమ్యూనిస్టు ప్రభావం పెద్ద ఎత్తున ఉన్న రోజుల్లో కమ్యూనిస్టు సానుభూతిపరులు తమ పసికందులను తీసుకెళ్ళి ఆశీర్వదించమని, నామకరణం చేయమని కోరడం, వారు తమకు నచ్చిన పేరు సూచించడం జరుగుతుండేదని తరువాత తెలుసుకొన్నాను. దీన్ని ఉదహరించడానికి కారణం కారల్ మార్క్స్ పేరు పెట్టుకొన్న వారు, ఫోటో చూసి కారల్ మార్క్స్ ను గుర్తు పట్టని వారి వల్ల మార్క్సిజానికి నష్టం లేదు.
కానీ,  అదే సందర్భంలో మరొక విషయాన్ని కూడా ప్రస్తావించుకోవడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నా. కొందరు తమకున్న‌ మేధా సంపత్తిన‍ంతా ఉపయోగించి, మార్క్సిజాన్నిఅవపోశనం పట్టామని తమకు తాము భావించుకొ‍ంటూ వక్రభాష్యాలు చెప్పే వారు కొందరైతే, తడికెగా వాడుకొనే వాళ్ళు కొందరైతే, మరికొందరు ఆ భావజాలాన్ని పిడివాదంగా తయారు చేసి మార్క్సిస్టు భావజాలానికున్న శాస్త్రీయ దృక్పథాన్ని అపభ్రంశం పట్టిస్తున్నారు. అలాంటి మేధావులు మార్క్సిజానికి చేస్తున్న హానితో పోలిస్తే ఫోటో చూసి మార్క్స్ ను గుర్తుపట్టని కమ్యూనిస్టు చైతన్యం లేని యువత వల్ల జరిగే నష్టం ఏ పాటిది. మహా అయితే వారున్న పార్టీ నాణ్యతాలోపాన్నిఎత్తి చూపుతుంది, అంతే.
4) మానవ హక్కుల వేదిక కరపత్రం జత పరుస్తున్నాను. ఒకప్పుడు కడప జిల్లాలో ఇంటి దూలాలకీ, ఎడ్ల బండ్లకీ వాడిన ఎర్రచందనం వ్యాపార వస్తువు కాగానే అది కొట్టే వారు నేరస్తులయ్యే పరిస్థితి రావడం, కార్ల్ మార్క్స్ జర్మనీలో పత్రికా సంపాదకుడుగా పనిచేస్తున్న రోజులలో ఉమ్మడి భూములను ( ఎంక్లోజర్స్ గా మార్చి) ప్రజలకు దూరం చేసి ఎండు కట్టెలు గృహ అవసరాలకు సేకరించిన సామాన్యులపై చట్టాన్ని ప్రయోగించి జైలు పాలు చేయడాన్ని విమర్శిస్తూ సంపాదకీయం రాసి జర్మనీ వదిలి వేయవలసిన పరిస్థితులు గుర్తు చేస్తుంది.  అలాగే బాలగోపాల్ గారు దొంగలకూ హక్కులుంటాయని రాసిన వ్యాసాన్నీ జత పరుస్తున్నాను.
నా అభిప్రాయం: మీ పోలిక, వాదన అసంబద్ధమైనది. మాఫియా ముఠాలు జాతి సంపదను కొల్లగొట్టడాన్ని, కొన్ని దశాబ్ధాల క్రితం కడప జిల్లా వాసులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం ఇళ్ళ నిర్మాణానికి అటవీ సంపదను దూలాలుగా, ఎడ్ల బండ్ల తయారీకి వినియోగించుకోవడానికి మధ్య ఉన్న విభజన రేఖను మీరు గమనించక పోవడం యాదృక్షికమైనదిగా నేను భావి‍చడం లేదు. ఎర్రచందనానికి విలువ (వ్యాపార వస్తువు) రాగానే ఆ చెట్లను నరికి తీసుకెళ్ళితే నేరమవుతుందా? అని మీరు ప్రశ్నించడం ద్వారా మీరు ఎర్రచందనం మాఫియాకు వత్తాసు పలికుతున్నట్లు ధ్వనిస్తున్నది. మీ అవగాహనా లోపానికి అది ప్రతిబి‍ంబం.
మీరు కోట్ చేసినట్లు ఉమ్మడి భూములను ప్రజలకు దూరం చేసి ఎండు కట్టెలు గృహావసరాలకు సేకరించుకొన్న సామాన్యులపై నాటి ప్యూడల్ సమాజం లేదా అప్పుడప్పుడే పురుడు పోసుకొంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థలోని పాలకులు చట్టాన్ని ప్రయోగించి, జైలు పాలు చేయడాన్ని విమర్శిస్తూ మార్క్స్ సంపాదకీయాన్ని వ్రాసి జర్మనీ వదిలి వెళ్ళిన పరిస్థితుల ఉదంతాన్ని గుర్తు చేసుకొంటూ నేడు జాతి సంపదగా భావించబడుతున్న‌ శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని మాఫియా ముఠాలు చట్టం కళ్ళు కప్పి కొల్లగొడుతూ, అక్రమార్జనకు పాల్పడడం ఒకటేనని పోల్చడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నాడు గృహావసరాలకు ఎండు కట్టెలను సేకరించు కోవడానికి, నేడు అక్రమార్జనపరులైన వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారుల భాగస్వామ్యతో ఏర్పడిన మాఫియా ముఠాలు అత్యంత విలువైన ఎర్రచందన‍ం చెట్లను నరికి, దొంగలించుకపోయి, విదేశాలకు అక్రమ రవాణా చేసి, అక్రమార్జనకు పాల్పడడం ఒక్కటేనని మీరు భావిస్తే నాకు ఏ మాత్రం అభ్యంతరం లేదు. కానీ, మీ లోపభూయిష్టమైన అవగాహనను సమర్థించుకోవడానికి కారల్ మార్క్స్ ను వాడుకోవడమే తీవ్ర అభ్యంతరకరం. అలా చేయడమంటే మార్క్స్ ను అవమానించడమే అవుతుంది.
మరొక విషయం, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలకు మద్దతుదారుగా ఉన్న మీరు అడవుల విధ్వంసానికి ఈ తీరులో మద్దతు పలకడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఎర్రచందనం మాఫియా ముఠాలే  శేషాచలం అడవులకు నిప్పు పెట్టి నాశనం చేస్తున్నారని ఆరోపణలున్నాయి.  ముందు అడవులను తగల పెట్టడం తరువాత ఎర్రచందనం చెట్టను నరికి తరలించుకు పోవడం నిరంతర కార్యక్రమంగా ఆ ముఠాలు పెట్టుకొన్నాయి. ఆ పని చేసే వాళ్ళు నేరస్తులు కాదని మీరు భావిస్తే భావించవచ్చు. కానీ నా దృష్టిలో ఆ పని చేసే వారు వాళ్ళు కూలీలు కానే కాదు, ముమ్మాటికీ నేరస్తులే. మాఫియా ముఠాలు వారికి చెల్లించే ప్రతిఫల‍ం, మరణిస్తే లేదా గాయపడితే వారి కుటుంబాలకు చెల్లించే నష్ట పరిహారానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకొన్న తరువాతే ప్రాణాలకు తెగించి ఈ తరహా నేరాలకు వాళ్ళు బరితెగిస్తున్నారు. అందుకే వ్యవస్థీకృత నేరాలలో భాగంగానే దీన్ని చూస్తున్నాను.
దొంగలకు హక్కులుంటాయని బాలగోపాల్ గారు వ్రాసిన వ్యాసాన్ని పంపారు. నిజమే దొంగలకే కాదు, ఉగ్రవాదులకు, మాఫియా ముఠాలకు, గ్రామ కక్షలు మరియు హత్యా రాజకీయాలు నెరపే ముఠాలకు, కరుడుగట్టిన నేరగాళ్ళకు, వగైరా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులకూ చట్టబద్ధమైన హక్కులున్నాయి. అందు వల్లనే నేరగాళ్ళు జైళ్ళలో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. శిక్ష పూర్తి చేసుకొనో, పెరోల్ పైనో, బైయిల్ పైనో, క్రమశిక్షణతో మెలిగినందులకు శిక్షలో రాయితీ ఇస్తూ మ‌హాత్మాగాంధీ జన్మదినం లేదా వర్థంతి వగైరా పేర్లతో ప్రభుత్వాలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినప్పుడు విడుదలై కేంద్ర కారాగారాల నుండి బయటికొచ్చినప్పుడు చూస్తే కొందరు కొత్త అల్లుళ్ళలాగా నున్నగా తయారై, ఆరోగ్యకరంగా కనబడుతున్నారు.
ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేస్తే, పోలీసులు అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో పెడుతున్న ఉద్యమకారులకు అలాంటి సౌకర్యాలు లభించడం లేదే. ఎటు వచ్చి సభ్య‌ సమాజానికే భద్రత లేదు. చట్టాలకు లోబడి జీవించే సామాన్య పౌరులు మాత్రం అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని, అభద్రతా భావంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళబుచ్చాలి. చట్టబద్ధంగా జీవనం గడుపుతున్న సాధారణ పౌరులకు ఉన్న జీవించే హక్కును హరి‍ంచివేస్తున్న కరడుగట్టిన‌ నేరస్తుల పట్ల ఉదాశీన వైఖరి ప్రదర్శించడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందో! కీడు జరుగుతుందో! విజ్ఞతతో, సామాజిక స్పృహతో ఆలోచి‍ంచాలి.
నేరస్తులైనంత మాత్రాన రాజ్య వ్యవస్థ పోలీసులకు స్వేచ్ఛనిచ్చి'ఫేక్ ఎన్ కౌంటర్' చేసి చంపవచ్చా! అంటే ముమ్మాటికీ ప్రభుత్వం అలాంటి ఆటవిక చర్యకు పాల్పడకూడదన్నదే నా అభిప్రాయమని చెప్పాను. నాకు స్వానుభవమున్నది. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా రెండు మాసాలకుపైగా వివిధ రూపాలలో ఆందోళనలు చేసిన మీదట ఛలో అసెంబ్లీ ఆందోళనకు పిలుపిచ్చి, యాభై వేల మందికిపైగా ప్రజలు తమ న్యాయ సమ్మతమైన డిమాండ్ల‌ను పరిష్కరించమని ప్రభుత్వంపై వత్తిడి తేవడానికి బషీర్ బాగ్ చేరుకొనప్పుడు నిరాయుధులైన ఉద్యమకారులపై తుపాకి తూటాలు ఎక్కుపెట్టి పిట్టల్ని కాల్చినట్లు గురిపెట్టి కాల్చి విష్ణువర్ధన్, బాలస్వామిని పొట్టన పెట్టుకొన్నారు. మరి కొద్ది దూరంలో రామక్రిష్ణను పైబర్ లాఠీలతో మోది చంపారు.
 నాటి ఉద్యమంలో ముందు వరసలో ఉన్న వారిని చితగ్గొట్టి, గుర్రాలతో తొక్కించి, రక్తపు గాయాలతో ఉన్న‌ 21 మంది వామపక్ష నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి బలవంతంగా పోలీసు వ్యాన్ లోకి ఎక్కించారు. ఆ 21 మందిలో నేనొకణ్ని. పోలీసుల దమనకాండతో రెచ్చిపోయిన ఉద్యమకారులు ప్రాణాలకు తెగించి పోలీసులపై తిరగబడ్డారు. అప్పుడు ఒక పోలీసు అధికారే ఒక పోలీసు చేతిని తుపాకితో కాల్చి, దాన్ని ఎలిబీగా చూపెట్టి ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఇదంతా మా కళ్ళ ముందే జరిగింది. వ్యాన్ లో ఉండి పోయాం కాబట్టి మేం బతికి పోయాం. పోలీసుల చేతుల్లో నుంచి తుపాకులు లాక్కొని ఒక పోలీసును కాల్చామని, మా 21 మందిపై అక్రమ కేసు నమోదు చేసి కోర్టులో మరుసటి రోజు హాజరు పరిచారు. ఆ హత్యా నేరం కేసులో నేను మూడో ముద్దాయిని. ఈ వివరాలను కోర్టులో మేజిస్టేట్ ముందు నేనే స్వయంగా వినిపించాను. ఆ కేసును ప్రభుత్వాలు మారినా సంవత్సరాల తరబడి అలా పెండింగ్ లో పెట్టి ఉపసంహరించుకొంటున్నట్లు ఏడాదిన్నర‌ క్రితం, రాష్ట్ర విభజనకు ముందు ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. పోలీసులకు స్వేచ్ఛనిస్తే ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతారో నాకు చాలా అనుభవాలున్నాయి.
5) నాకర్ధమైనంతవరకూ నేరమనేది సామాజిక రుగ్మతకి చిహ్నం. పెట్టుబడిదారీ ఆర్ధిక సంబంధాల సృష్టి. ఏ రకం నేరమైనా మార్క్సిస్టు దృక్పధం ఆర్ధిక అసమానతలే ప్రేరణగా భావిస్తుందని మార్క్సిస్టు క్రిమినాలజీ తెలుపుతోంది. వ్యవస్తీకృత నేరాలు (Organised Crime)  అందుకు భిన్నం కావు. ఎంగెల్స్ అన్నట్లు పెట్టుబడిదారీ సమాజం లేకుంటే నేరమే లేదు, దండన అవసర ముండదు. ఏనుగు దంతాల కోసం ఆఫ్రికాలో ఏనుగులను చంపడం, పులి అవయవాల కోసం పులులను చంపడం మొదలైనవన్నీ అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. అందులో చైనీయుల పాత్ర గణనీయమైనది. ప్రభుత్వాలన్నీ కూడబలుక్కుని వారి వారి దేశాలలోకి వాటిని రానివ్వకుండా చర్యలు తీసుకుంటే ఇలాటి వ్యవస్తీకృత  నేరాలకు తావుండదు. ఆ దారులు మూయకుండా lure of money కి లొంగి నేరంలో భాగస్వాములవుతున్న వారెందరి ప్రాణాలు తీసినా సమస్యకి ముగింపు ఉండదు. అమెరికాలో మాదకద్రవ్యాలపై యుద్ధం ఏం సాధించ లేక చివరికి మరిజువానా కలిగివుండడం నేరంకాదని నిషేధాన్ని ఎత్తి వేశారు. షికాగోలో మధ్య నిషేధం ఉన్న 20వ శతాబ్దపు తొలి దశకాలలో మాఫియాని ప్రోత్సహించింది రాజకీయులే. తరువాత వారిని కమ్యూనిస్టు కార్మిక నాయకులను ఏరి వేయడానికి వాడుకున్నారు.
నా అభిప్రాయం: నేరాలకు దోపిడీ వ్యవస్థే కారణం. ఈ వ్యవస్థ కూలిపోతే తప్ప నేరాలకు అంతం ఉండదని మార్క్స్, ఏంగిల్స్ ఉద్భోదించారని చెప్పడం ద్వారా వ్యవస్థను మార్చాలేగానీ, నేరాలను అరికట్టడానికి చర్యలు చేపట్టడం నిష్పలమని అపరమార్క్సిస్టు మేధావులు హితబోధలు చేయడంలో నాకు ఏ మాత్రం హేతుబద్ధత కనిపించడం లేదు. సమాజంలో అరాచకం పెరిగిపోతే విప్లవాలు వాటికవే తన్నుకొచ్చేస్తాయ‌నే అత్యంత లోపభూయిష్టమైన‌ అవగాహన కూడా ఈ తాత్విక చింతన వెనక ఉండవచ్చునేమోనని నా అభిప్రాయం. అలా భావించడమంటే మార్క్సిజానికి వక్రభాష్యం చెప్పడమే. మీరు ప్రస్తావించిన 'మార్క్సిస్టు క్రీమినాలజీ' ని మార్క్సిజంలో అంతర్భాగంగా చూడడం ఏ మాత్రం సముచితం కాదు. మార్క్స్, ఏంగిల్స్ తదనంతర కాలంలో 19వ శతాబ్ధం ఆఖరి భాగం మరియు 20వ శతాబ్ధ ప్రారంభంలో మార్క్సిస్టు మరియు మార్క్సిస్టేతర‌ తాత్విక చింతనలకు ప్రభావితులైన కొందరు మేధావులు పెట్టుబడిదారీ వ్యవస్థకు, నేరాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని, పోటీతత్వం, అహంభావం, వ్యక్తి స్వార్థం వగైరా కోణాలలో విశ్లేషిస్తూ 'క్రీమినాలజీ' అన్న తాత్విక చింతనను ప్రచారంలో పెట్టారు. దాన్ని మార్క్సిజంలో అంతర్భాగంగా చూడడం తప్పు. ఇది ఎలా ఉందంటే, ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభాలు కుదిపేసినప్పుడల్లా కొందరు మేధావులు మార్క్సిజాన్ని, కీన్స్ ఆర్థిక సిద్ధా‍ంతాన్ని కలగలిపి మాట్లాడినట్లుగా తోసున్నది.
దొంగతనం, లంచం తీసుకోవడం, బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం, టికెట్ కొనకుండా బస్సులో, రైల్ లో ప్రయాణించడం వగైరా నేరాలకు, అక్రమార్జనపరులైన‌ వ్యక్తులు - ముఠాలు - సంస్థలు - కార్పోరేట్ సంస్థలు, పాలక మరియు ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, అధికారులు అపవిత్ర కూటమిగా ఏర్పడి జాతి సంపదను(పెట్టుబడిదారీ వ్యవస్థలో జాతి సంపదంటూ ఏమీ లేదనే భావన ఎవరికైనా ఉంటే, అలాంటి వారికి చెప్పగలిగిందేమీ లేదు) కొల్లగొడుతున్న ఉదంతాలు రోజూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క కుంభకోణంలో వందల కోట్లు మొదలుకొని లక్షల కోట్ల ప్రజాధనం ప్రభుత్వ ఖజానాకు చేరవలసింది, దారి మళ్ళి పోయిందని న్యాయస్థానాల‌ విచారణల్లో రుజువు అవుతున్న దృష్టాంతాలు మన ముందున్నాయి. వీటికి పాల్పడుతున్న వారు వ్యక్తులు కావచ్చు, మాఫియా ముఠాలు కావచ్చు, కార్పోరేట్ సంస్థలు కావచ్చు. అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వం నుండి లైసెన్సు పొంది జాతి సంపదను కొల్లగొట్టడం.
ఉదా: బొగ్గు, స్పెక్ట్రం, ఓబులాపురం ఉక్కు గనులు, భూముల కుంభకోణం వగైరా. సత్యం, కామన్ వెల్త్ క్రీడలు, మైక్రో ఫైనాన్స్ వంటి ఆర్థిక కుంభకోణాలు వెలుగులోకి వాచ్చాయి. అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం చెట్లను నరికి, అక్రమంగా విదేశాలకు రవాణా చేసి అక్రమార్జనకు పాల్పడుతున్న మాఫియా ముఠాల కార్యకలాపాలను గమనిస్తున్నాం. గ్రామ కక్షలు, హత్యారాజకీయాలు, స్థిరాస్థి వ్యాపారంలో హత్యలు, టోల్ గేట్ మాఫియాలు, ఇందన కల్తీ మాఫియాలు,ఇసుక మాఫియాలు వగైరా దుష్ట శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. సంపదను దోచుకోవడమే కాకుండా వ్యతిరేకించిన పౌరులను అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు.
ఈ నేరల స్వభావంలో మౌలికమైన తేడాలు లేకపోలేదు. ఆర్థిక కుంభకోణాలు కొన్ని అయితే, జాతి సంపదను కొల్లగొట్టడమే కాకుండా ప్రభుత్వం నిర్ధేశించిఅ చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఉద్యోగులను, పోలీసులను హతమార్చుతున్న‌ మాఫియా ముఠా కార్యలాపాలు మరోరకం, జన కూడళ్ళలో బాంబులు పేల్చి, స్టెన్ ఘన్ లతో పౌరుల ప్రాణాలను పొట్టన పెట్టుకొంటున్న ఉగ్రవాదులు ఇలా కరుడుగట్టిన నేరస్తుల, మాఫియా ముఠాలు, ఉగ్రవాదుల ఆటవిక చర్యలతో సభ్య‌ సమాజం అభద్రతా భావ‍‍ంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నది. మార్క్సిస్టు భావజాలంతో సాయుధ పోరాట ప‍ంథాను అనుసరిస్తూ రాజ్య వ్యవస్థతో తలపడుతున్న మావోయిస్టు పార్టీ సాగిస్తున్న ఉద్యమంలో పోలీసులు పై చేయి సాధించినప్పుడు మావోయిస్టులు, మావోయిస్టులు పైచేయి సాధి‍ంచినప్పుడు పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారు.
వీటన్నింటినీ ఒకే గాటిన కట్టలేం. దోపిడీ వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకొని సాయుధ పోరాట పంథాను అనుసరిస్తున్న మావోయిస్టుల హింసాత్మక కారకలాపాలను పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారు వ్యతిరేకిస్తారు. మతోన్మాదాన్ని తలకెక్కించుకొని మారణహోమం సృషిస్తున్న ఉగ్రవాదుల ఆటవిక చర్యలను మొత్తం సమాజమే ముక్తకంఠంతో నిరసిస్తున్నది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వ ఉద్యోగులుగా(కార్మికులు) బాధ్యతలను నిర్వహిస్తున్న‌ అధికారులు, ఉద్యోగులు, పోలీసులను, మాఫియా ముఠాల‌ దోపిడీని వ్యతిరేకిస్తూ గళమెత్తిన పౌరులను మాఫియా ముఠాలు హతమారుస్తున్నాయి. ఇవన్నీ మన సమాజంలో నిత్యకృత్యంగా సాగిపోతున్నాయి. వీటి పట్ల ప్రజల చేత ఎన్నుకోబడిన‌ ప్రభుత్వం ఎలాంటి వైఖరి ప్రదర్శించాలి, వాటిని నిరోధించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? అన్నది ప్రశ్న‍.
సాధారణ నేరస్తులు, వ్యవస్థీకృత నేరాలలో భాగస్వాములైన వారిని, ఉగ్రవాదులు, దోపిడి వ్యవస్థను కూలగొట్టడానికే సాయుధ పోరాటం చేస్తున్నామని చెప్పుకొంటున్న మావోయిస్టులను మరెవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని చట్టాల పరిథిలోఏ శిక్షించాలని పౌర సమాజం కోరుకొంటున్నది. చట్టాలను అతిక్రమించి తుపాకులతో కాల్చిచంపమని కోరడం లేదు, అలా చంపితే సమర్థించడమూ లేదు. బాధ్యత గలిగిన పౌరులుగా ఔచిత్యంతో స్పందిస్తున్నారు.
నేనూ కమ్యూనిస్టుగా మార్క్సిస్టు దృక్కోణం, వర్గ దృష్టి నుండి వివేచనతో స్పందించి మాట్లాడాను. వ్యవస్థీకృత నేరాలలో భాగస్వాములైన వారిని కూలీలుగా సంబోధించడం కార్మిక వర్గాన్ని అవమానించడమేనని నా భావన. శేషాచలం అడవుల్లో జరిగింది, పోలీసులు చెప్పిన‌ట్లు ఎన్ కౌంటరా! లేదా పలువురు ఆరోపిస్తున్నట్లు ఫెక్ ఎన్ కౌంటరా! అన్నదాన్ని తేల్చడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను.
వ్యవస్థీకృత నేరాలు, అవినీతి, లంచగొండితనం ఇవన్నీ నేటి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న, పీల్చిపిప్పి చేస్తున్న, పౌరుల జీవితాలను మరియు రాజ్యాంగ బద్ధమైన(బూర్జువా రాజ్యాంగమే కావచ్చు) ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న ఏయిడ్స్ మహమ్మరి లాంటి భయంకరమైన వ్యాధులు. సామాజిక విప్లవం వచ్చినప్పుడు వాటంతకవే అదృశ్యమై పోతాయన్న తాత్విక చింతన ఊహాజనితమైనది మాత్రమే. రష్యా, చైనా పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. ఆర్థిక నేరాలే దేశానికి అత్యంత ప్రమాదకరమైనవని సుప్రీ‍ం కోర్టు కూడా వ్యాఖ్యానించిన అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఆర్థిక నేరాలనైనా, వ్యవస్థీకృత నేరాలనైనా చట్టాల పరిథిలో అరికట్టడానికి కఠినమైన చర్యలను, కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వాలు అమలు చేయాల్సిందే. సమగ్రమైన, శక్తి వంతమైన లోక్ పాల్ చట్టాన్ని తేవాలని కోరుతున్నాం కదా! మాఫియా ముఠాలు కమూనిస్టు నాయకులను అనేక మందిని పొట్టన పెట్టుకొన్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఇటీవలే టోల్ గేట్ వసూళ్ళలో అక్రమాలకు పాల్పడిన మాఫియా ముఠాకు వ్యతిరేకంగా గళమెత్తిన వెటరన్ కమ్యూనిస్టు నాయకుడు పన్సారేని పట్టపగలు కిరాయి హంతకులు కాల్చి చంపారు. నేరాలన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థ ముక్కపీతి పిందలు కాబట్టి ఈ వ్యవస్థ కూలిపోయి సోషలిజం వచ్చినప్పుడే అవి అంతమవుతాయని, వాటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సిన అవసరం లేదని మార్క్సిజం చెబుతున్నదని వాదించడం అర్థరహితం.      
6) "వాళ్ళు కూలీలు కాదు, వ్యవస్తీకృత నేరగాళ్ళని నిర్ద్వందంగా మీరు చెప్పగలగడానికి ఉన్న ఆధారాలు, ఎంకౌంటరో కాదో నిర్ధారించడానికి ఎందుకు లేవో స్పష్టత లేదు. బుల్లెట్లు మెడ కింది భాగంలో తగిలాయనీ, ఎక్కువ మందికి వెనుక వైపునుంచీ బుల్లెట్లు తగిలాయనీ నిజనిర్ధారణకు వెళ్ళిన వారూ, పత్రికా విలేఖరులూ చెబుతున్నదీ, రాస్తున్నదీ ఎందుకు నిష్పాక్షికంకాదో, పోలీసు వ్యవస్త ఎంకౌంటరు చరిత్ర ఏమిటో జగద్వితమైనా, వారి ప్రకటనల విశ్వశనీయత ఏమిటో? నాకు తెలియడం లేదు. వాళ్ళు కూలీలా? వ్యవస్తీకృత నేరగాళ్ళా? అన్న విషయం నిర్ణయంలో మీకు న్యాయస్థానాలెందుకు గుర్తుకు రాలేదు? విద్యావంతులై ప్రభుత్వ పదవులాక్రమించి లంచాలకు మరిగి ప్రజల ఆస్తులను దోపిడీదారులకు చట్ట బద్ధం చేస్తున్న అధికారులు వ్యవస్తీకృత నేరగాళ్లు కారా? వారినెవరైనా కాల్చి చంపుతున్నారా?"
నా అభిప్రాయం:. బాబురావు గారే ఆయన లేఖలో 'మార్క్సిజాన్ని అందరూ ఒకేలా అర్థం చేసుకొంటే ఇన్ని కమ్యూనిస్టు పార్టీలు ఎందుకుంటాయి' అని సెలవిచ్చారు. నిజమే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కమ్యూనిస్టులే పలు పార్టీలుగా, సాయుధ పోరాటమే ఒకైక మార్గమని చెప్పే వారు,  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరియు సాయుధ పోరాట ప‍ంథాను ఏక కాలంలో అనుసరి‍ంచే వారుగా చీలికలు పేలికలుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలాగే మార్క్సిస్టు మేధావులు మరో నాలుగాకులు ఎగ మేసిన వారుగా మార్క్సిజానికి వారి వారి పైత్యాలకు అనుగుణంగా వక్రభాష్యాలు చెబుతూనే ఉన్నారు. ఈ పరిస్థితి ఒక్క భారత దేశానికే పరిమితం కాదు, అంతర్జాతీయంగా నెలకొని ఉన్నదే. అందులో భాగంగానే మార్క్స్ తన కాలం నాటి నేరాల స్వభావాన్ని బట్టి స్థూలంగా, పరిమితంగా చేసిన విశ్లేషణ, వ్యాఖ్యలనే పిడివాదంగా మార్చి నేటి సమాజంలో వ్యవస్థీకృతమైన నేరాలకు కూడా వర్తింప చేయబూనడం పెద్ద సాహసమే.  అలాగే శేషాచలం అడవుల్లో జరిగిన ఘటనపై బాబురావుగారి లాగే అందరూ ఆలోచించాలనుకోవడం కూడా అసమంజసం కదా!
7) నైతికత అధికార వర్గాల నిర్వచనం. మానవ పరిణామ శాస్త్ర పరిశోధనలు హింస, యుద్ధం మానవ నైజం కాదనీ వ్యవసాయంతో మొదలైన నాగరికత, ఆర్ధిక, సామాజిక అసమానతల సృష్టనీ తెలుపుతున్నాయి. ఆదిమ సమాజాలలో తెగల మధ్య కొట్లాటలు అరుదు. మనం అసంకల్పితంగానే యీ సమాజంలో భాగంగా నైతికతా బావజాలం ప్రభావంలో పడతాం.
నా అభిప్రాయం: మార్క్స్, ఏంగెల్స్ మానవ సమాజ పరిణామ క్రమాన్నిలోతుగా అధ్యయనం చేసి, శాస్త్ర్రియ‌ దృక్కోణంలో విశ్లేషించారని ఇంతకు ముందే ప్రస్తావించుకొన్నాము. ఆనాటి సమాజంలోని సాధారణ‌ నేరాల స్వభావం, నైతికత పట్ల వారికున్న అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని ప్రామాణికంగా తీసుకొని నేడు వేళ్ళూనికొని, సామాజిక ప్రగతికి అవరోధంగా పరిణమించడమే కాకుండా ప్రమాదకరంగా తయారైన వ్యవస్థీకృత నేరాలు కొనసాగిస్తున్న దుష్ట శక్తుల పట్ల ఉదాశీనత ప్రదర్శిస్తే సమాజానికి జరిగే నష్టమెంతో ఆలోచించాలి.
ప్యూడల్ వ్యవస్థ ప్రబోధి‍ంచిన‌ నైతిక విలువలను, పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రబోధిస్తున్న‌ నైతిక విలువలను ఖాతరు చేయాల్సిన పని లేదని, అవి దోపిడి వ్యవస్థను పరిరక్షించుకోవడానికి ఉద్ధేశించబడినవని తృణీకార భావం ప్రదర్శించడంలో మార్క్సిస్టు దృక్కోణం ఉన్నదని నేను భావించడం లేదు. మార్క్స్, ఏంగెల్స్ మరణానంతరం 120 స‍ం.లకుపైగా అంటే ఐదు తరాల కాలం గడచిపోయింది. సమాజంలో అనేక మౌలిక మార్పులు సంబవించాయి. పరిమితంగానైనా ప్రజాస్వామ్య హక్కులు, మానవ హక్కులు, వాటికి సంబంధించిన చట్టాలు సాధించుకోబడ్డాయి. వర్గ స్వభావంతో పనిచేసే న్యాయ వ్యవస్థ అయినా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా అన్ని సందర్భాలలో కాకపోయినా కొన్ని సందర్భాలలో తీర్పులిస్తున్న ఉదంతాలు లేకపోలేదు. బూర్జువా నీతి దుష్టనీతని దాన్ని లోతుగా గోతి తవ్వి పూడ్చి పెట్టాలనడంలో నాకు హేతుబద్ధత కనబడడం లేదు. ఈ తరహా పెడదోరణుల దుష్ప్రభావం వల్లనే వావివరసలు లేకుండా స్త్రీ, పురుషులు కలిసి జీవించవచ్చని, జీవిత భాగస్వాములు కావచ్చని కొందరు ప్రచారం చేసిన దృష్టాంతాలు ఉన్నాయి. భారతీయ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, అలాగే నేటి సమాజం, రాజ్యాంగం, చట్టాల్లోని నీతిని నిశితంగా పరిశీలించి, మంచిని, క్రమశిక్షణను పె‍ంచి పోషించే ప్రగతికాముకమైన నైతిక విలువలను స్వీకరి‍ంచడానికి అభ్యంతరం ఎందుకుండాలో నాకున్న పరిమితమైన కమ్యూనిస్టు చైతన్యం ప్రశ్నిస్తున్నది. ఆయనకు సంబంధం ఉన్న సాహిత్యం, వ్యక్తులు, సంస్థలకు విలువల పట్ల భిన్నాభిప్రాయం ఉండవచ్చు. కానీ, కమ్యూనిస్టు నీతి అంటూ ఒకటున్నది. దాన్ని ప్రతి కమ్యూనిస్టు పాటించాలి. ఒక సామెత ఉన్నది. 'చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది......', అలా నీతి తప్పిన వాడు నా దృష్టిలో కమ్యూనిస్టే కాదు. 
8) నేరగాళ్ళకు హక్కులుండనవసరం లేదు, శిక్షించడం న్యాయమనే అధికారవర్గ దృక్పధాన్ని సొంతం చేసుకుంటాం. డేవిడ్ గ్రీన్‌బెర్గ్ సంపాదకీయంలో వచ్చిన "క్రైం అండ్ కాపిటలిజం" నుండి "మార్క్స్ అండ్ ఎంగెల్స్ ఆన్ క్రైం అండ్ పనిష్‌మెంట్" అనే వ్యాసాన్ని పంపుతున్నాను.
నా అభిప్రాయం: నిజమే దొంగలకే కాదు, ఉగ్రవాదులకు, మాఫియా ముఠాలకు, గ్రామ కక్షలు మరియు హత్యా రాజకీయాలు నెరపే ముఠాలకు, కరుడుగట్టిన నేరగాళ్ళకు, వగైరా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులకూ చట్టబద్ధమైన హక్కులున్నాయి. ఎటు వచ్చి సభ్య‌ సమాజానికే భద్రత లేదు. చట్టాలకు లోబడి జీవించే సామాన్య ప్రజానీకానికి ఉన్న జీవించే హక్కును మాత్రం వ్యవస్థీకృత నేరాలను నిర్భీతితో కొనసాగిస్తున్న కరడుగట్టిన నేరస్తులు అత్యంత కౄరంగా రక్తపు మడుగుల్లో కలిపేస్తుంటే నిరోధించ గలిగిన శక్తి ఈ వ్యవస్థకు లేదు. కారణం ఈ నేరమయ వ్యవస్థ పుట్టుకకు, పెరుగుదలకు ఈ దోపిడీ వ్యవస్థే కారణం. ఈ వ్యవస్థను కూల్చేస్తే గానీ నేరాలు అంతం కావు అన్నది ఒక తాత్విక చింతన. దానికి మార్స్క్ తాత్విక చింతనను తడికెగా వాడుకోవడమంటే మార్స్కిస్టు భావజాలాన్ని అపభ్రంశం పట్టించడంగా నేను భావిస్తున్నాను.
9) నేను చిన్నప్పుడు విన్నది విజయవాడలో ఎవరిదైనా జేబు కొట్టేస్తే ఒక కమ్యూనిస్టు నాయకుడి దగ్గరకు వెళితే కొట్టెసినవి తిరిగి వచ్చేవని. అంటే వారిని సంఘటిత పర్చే పని ఆ పార్టీ చేసిందనుకోవచ్చు కదా? ఐనా యీవాదన తప్పు. ఇలాటి వాదన మాకు చాలా పర్యాయాలు అనుభవమౌతుంది. చెప్పినవాడే చేయాలి అంటే మేధావి వర్గం ప్రయోజనం శూన్యం. యీ విషయంపై కూడా మార్క్సిస్టు సాహిత్యమున్నది. మార్క్సిస్టు క్రిమినాలజీ విశ్వవిద్యాలయాలలో బోధిస్తున్నారు.
నా అభిప్రాయం: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్/ ఫేక్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారిని కూలీలు అని సంబోధించడం కార్మిక వర్గాన్ని అవమానించడమేనని, వారు శ్రమ దోపిడీకి గురౌతున్న కూలీలుగా భావిస్తున్న వారు, ఆ కూలీలకు సంఘం పెట్టి సంఘటితపరిచవచ్చు కదా! అని నేను చేసిన విమర్శకు ప్రతి విమర్శగా అసంబద్ధమైన అంశాలతో ఆత్మసంతృప్తి పొందే ప్రయత్నం చేశారు.  విజయవాడలో నాటి తరం కమ్యూనిస్టులంటే నేరగాళ్ళకు, అసాంఘిక శక్తులకు వెన్నులో వణుకు పుట్టేదని నేనూ విన్నాను. అందు వల్లనే పోలీసు స్టేషన్ కు వెళ్ళడం కంటే కమ్యూనిస్టుల వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేస్తే న్యాయ‍ జరుగుతుందని బాధితులు ప్రగాడ విశ్వాసంతో ఆ పని చేసేవారు. నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకొన్న నేరస్తులు కేసు కమ్యూనిస్టుల దృష్టికి వెళ్ళిందని తెలియగానే తప్పొప్పుకొని దొంగలించిన వస్తువులను గుట్టు చప్పుడు కాకుండా అప్పగించి వెళ్ళే వారని, అలా చేయకపోతే నేరం ఎవరు చేశారో పసిగట్టి విరగ్గొడతారనే భయ‍ంతో అలా చేసే వారని విన్నాను. అంతే గానీ దొంగలకు ఏ విప్లకర పార్టీ సంఘాలు పెట్టలేదు, పెట్టదు.