Sunday, April 19, 2015

ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పటికి? రాయలసీమ దాహం తీరేదెన్నటికి ?? గాలేరు - నగరి ప్రాజెక్టుపై డాక్యుమెంటరీ

కరువుల్లో పుట్టి, కరువుల్లో పెరిగి, కరువుల్లోనే మరణిస్తున్న‌ రాయలసీమ వాసుల ఆర్తనాదాలు పాలకుల చెవికెక్కలేదు. ప్రకృతి నిరాధరణ, పాలకుల అత్యంత దారుణమైన నిర్లక్ష్యం రాయ‌లసీమ ప్రజల పాలిట శాపంగా పరిణమించాయి. కరువు కాటకాల నుండి రాయలసీమ శాశ్వత‍ంగా విముక్తి పొందాలంటే "కృష్ణా నదీ జలాల‌ తరలింపే ఏకైక మార్గం" అని ప్రజలు దశాబ్ధాలుగా నినదిస్తున్నా, అలుపెరగని పోరాటాలు చేస్తున్నా, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ‍ంలో క్షమించరాని జాప్యం చేస్తూనే ఉన్నారు.
* శ్రీశైలం జలాశయం నుండి 19 టి.యం.సి.ల నికర జలాల కేటాయింపుతో, కేంద్ర జల సంఘం అనుమతితో, ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో 1981 సం.లో నిర్మాణ పనులు ప్రారంభించబడిన‌ శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.) నేటికీ పూర్తి కాలేదు.
* 29 టి.యం.సి.ల కృష్ణా మిగులు జలాల ఆధారంగా 1983లో నిర్మాణం ప్రారంభించబడిన తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన జలాశయాలు, ప్రధాన కాలువలు నిర్మించబడ్డాయే కానీ పంట కాలువల వ్యవస్థ నిర్మాణం పట్ల ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు.
* 40 టి.యం.సి.ల‌ కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా హంద్రీ - నీవా సృజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి 1996లో శంఖుస్థాపన చేసినా ఇంకా మొదటి దశ & రెండవ దశ‌ నిర్మాణ పనులనే పూర్తి చేయలేదు.
* 38 టి.యం.సి.ల కృష్ణా నది మిగులు జలాల ఆధారంగానే గాలేరు - నగరి సృజల స్రవంతి పథకానికి 1988లో మొట్ట మొదట నాటి ముఖ్యమంత్రి దివంగత యన్. టి. రామారావు గారు శంఖుస్థాపన చేశారు. 26 ఏళ్ళు గడచి పోయినా ఇంకా గండికోట జలాశయానికి కూడా నీళ్ళు చేరలేదు. మొదటి దశ నిర్మాణ పనులే నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం రెండ దశ నిర్మాణ పనుల ఊసే ఎత్తడం లేదు. ఈ నేపథ్యంలో గాలేరు - నగరి ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై ఈ వీడియో రూపొందించబడింది. చూసి, స్పందించండి.

https://www.youtube.com/watch?v=4xOF2bVHxi8&feature=youtu.be

No comments:

Post a Comment