Wednesday, April 20, 2016

చంద్రబాబు గారు! 'దామాషా'పై లోతుగా తర్కించారా!


క్రిష్ణా నదీ జలాలను, నదీ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ అంగీకరిస్తే దామాషా విధానంలో వినియోగించుకోవడానికి సిద్ధమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రికలో చదివాను. ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనపై స్పందించి వ్యాసం వ్రాస్తే బాగుంటుందని, ఈ తరహా అంశాలపై విస్తృత చర్చ జరిగితే ప్రయోజనకరంగా ఉంటుందని, ఒక మిత్రుడు సూచించారు.
సమస్య గంభీరమైనది. నీటి సమస్యపై నాకున్న పరిమితమైన అవగాహనతోనైనా లోతైన అంశాలను తడుముతూ ఈ వ్యాసం వ్రాస్తున్నాను. కాస్తా పెద్దదే! కొందరిని విసుగు చెందించే అవకాశం ఉన్నా గంణాంకాలు ప్రస్తావించక తప్పని పరిస్థితి. ఆసక్తి ఉన్న మిత్రులు ఓపికగా చదవమని విజ్ఞప్తి.
1) క్రిష్ణా జలాల వినియోగానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు - దాని అమలు, ఆ తీర్పు గడువు ముగిసిన తరువాత కేంద్ర ప్రభుత్వం నియమించిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు, దానిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ట్రిబ్యునల్ తీర్పులోని ఏఏ అంశాలు తెలుగు ప్రజలకు శరాఘాతంగా పరిణమిస్తాయని తీవ్ర ఆందోళన చెందుతున్నామో, రాష్ట్ర విభజన తదనంతరం తలెత్తిన సమస్యలు, ముందుకొచ్చిన కొత్త వివాదాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసి, పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో! అంచనా వేసుకొని, ప్రత్యేకించి క్రిష్ణా నదీ పరివాహక ప్రాంతంలో చివరి రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ లోని నిత్యకరవు పీడిత ప్రాంతమైన రాయలసీమ మరియు ప్రకాశం జిల్లా నీటి అవసరాలు - ఉత్ఫన్నమవుతున్న సమస్యలు - పరిష్కార మార్గాలను పరిగణలోకి తీసుకొని, మేధోమదనం చేసి చంద్రబాబునాయుడు గారు ఆ వ్యాఖ్య చేశారా! అన్న అనుమానం నాకొచ్చింది.
నా అనుమానానికి ప్రాతిపధికలు లేక పోలేదు. అవి లోపభూయిష్టమైనవి కావచ్చేమో! కానీ, వాటికి హేతుబద్ధమైన సమాధానాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వలోని పెద్దలు ఇచ్చి, నాలాంటి వారి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం వారిపై ఉన్నది.
2) ఈ ఏడాది క్రిష్ణా నదికి వరదలు రాలేదు. కర్నాటక నుంచి శ్రీశైలం జలాశయానికి 60 టియంసిలకు లోపే నీరొచ్చిచేరింది. వర్షపు నీటినంతా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు, వారి జలాశయాల్లో నింపుకొని, వాడుకోవడంతో, మనకు నీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చాయని, నష్టం జరిగిందన్న భావనతో దామాషా విధానంలో నీటిని వాడుకోవాలన్న ఆలోచన రేకెత్తినట్లు కనబడుతున్నది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి వచ్చిన తరువాత గడచిన 40 సం.ల కాలంలో ఇలాంటి దుస్థితిని ఎదుర్కొన్న సం.లు చాలానే ఉన్నాయి. అదే సందర్భంలో, అధిక నీటి ప్రవాహం వచ్చిన సం.లలో లభించిన నీటినంతటిని, శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాల్లో భవిష్యత్ అవసరాల కోసం నిల్వ ఉంచుకోవలసిన '150 టియంసిల క్యారీ ఓవర్ స్టోరేజ్' నీటితో సహా విచ్చలవిడిగా వాడుకొన్న సందర్భాలూ ఉన్నాయి.
3) బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో స్కీం - ఎ, స్కీం - బి లను ప్రతిపాదించారు. స్కీం - ఎ అమలులోకి వచ్చింది. పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల అంగీకారంతో 'క్రిష్ణా రివర్ వ్యాలీ అథారిటీని' ఏర్పాటు చేసిగానీ లేదా పార్లమెంటు చట్టం చేసిగానీ స్కీం - బి అమలు చేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొన్నారు. నాడు ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించడంతో స్కీం-బి అమలులోకి రాలేదు. ఎందుకు వ్యతిరేకించింది? కారణాలేమిటి? ఆ కారణాలకు నేడు విలువ లేదా? దామాషా విధానంలో నీటిని వాడుకోవాలంటే తలెత్తే సమస్యలేమిటి? దామాషా విధానాన్ని బచావత్ ట్రిబ్యునల్ తీర్పు సందర్భంలో కర్నాటక, మహారాష్ట్రలు కోరాయి కదా! ఎందుకు కోరాయి? ఇప్పుడు దామాషా విధానంలో నీటిని వాడుకోవడానికి వాళ్ళు ఎలాంటి అభ్యంతరాలను పెడతారని ఊహించుకొంటున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్ఫన్నమతున్నాయి.
4) క్రిష్ణా నది మొత్తం పరివాక ప్రాంతం 2,58,947 చ.కి.మీ.ఉన్నది. నదీ పరివాహక ప్రాంతాన్ని 12 బేసిన్లుగా విభజించారు. ఏఏ బేసిన్ పరిథి ఏఏ రాష్ట్రంలో ఏ మేరకు విస్తరించి ఉన్నదో నిర్ధారించబడింది. 75% నీటి లభ్యతను ప్రామాణికంగా తీసుకొని 2,060 టియంసిల నీరు లభిస్తుందని బచావత్ ట్రిబ్యునల్ నిర్ధారించింది. నదీ పరివాక ప్రాంతంలోని రాష్ట్రాల పరిథిలో ఉన్న పరివాహక ప్రాంతమెంత? ఆయా రాష్ట్రాల నుండి బేసిన్ల వారిగా క్రిష్ణా నదికి నీటి సహాయమెంత? అన్నదాన్ని కూడా నిర్ధారించారు. తాజా అధ్యయనాలు కూడా నాటి అంచనాలనే స్థూలంగా ఖరారు చేశాయి. బేసిన్ల వారిగా నీటి లభ్యత, ఎంత నీటిని ఆయా బేసిన్లలో వినియోగించుకోవాలన్న అంశాన్ని కూడా బచావత్ ట్రిబ్యునల్ తన తీర్పులో విస్పష్టంగా పేర్కొన్నది.
మహారాష్ట్రలోని పరివాహక ప్రాంతం 69,425(26.81%)చ.కి.మీ., నీటి సహాయం 962.5(46.72%) టియంసిలు, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీరు 560(27.18%) టియంసిలు.
కర్నాటక 1,13,271(43.74%) చ.కి.మీ., నీటి సహాయం 760.9(36.94%) టియంసి, కేటాయింపు 700(33.98%) టియంసిలు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరివాహక ప్రాంతం 76,252(29.45%) చ.కి.మీ., నీటి సహాయం 336.6(16.34%) టియంసి, కేటాయింపు 800(38.83%) టియంసిలు.
రాష్ట్రం విడిపోయింది. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల వివరాలను కూడా వేరువేరుగా పరిగణలోకి తీసుకోవాలి. తెలంగాణలో పరివాహక ప్రాంతం 52,233(20.17%), నీటి కేటాయింపు 280(13.59%) టియంసిలు. ఆంధ్రప్రదేశ్ లో పరివాహక ప్రాంతం 24,019(9.28%) చ.కి.మీ., నీటి కేటాయింపు 520(25.24%) టియంసిలు.
గమనిక -1: రాయలసీమ ప్రాంతంలో పరివాక ప్రాంతం 14,022(5.42%) చ.కి.మీ., నీటి కేటాయింపు 130(6.3%) టియంసిలు. కోస్తాంధ్ర ప్రాంతంలో పరివాహక ప్రాంతం 9,997(3.86%) చ.కి.మీ., నీటి కేటాయింపు 390(18.93%) టియంసిలు.
గమనిక -2: ఉమ్మడి రాష్ట్రంలో నికర జలాల వినియోగానికి సంబంధించి కొన్ని సర్దుబాట్లు చేయడం జరిగింది. క్రిష్ణా డెల్టా ఆధునీకీకరణ ద్వారా ఆదా అయ్యే నీటి నుండి 20 టియంసి భీమా పథకానికి కేటాయించారు. అలాగే పునరుత్ఫత్తి జలాలతో కలిపి 19 టియంసిలను యస్.ఆర్.బి.సి.కి కేటాయించారు. కె.సి.కెనాల్ కు శ్రీశైలం జలాశయం నుండి 10 టియంసిలు సర్దుబాటు చేసి, తుంగభద్ర జలాశయం నుండి కె.సి.కెనాల్ కు ఇవాల్సిన నీటిని పి.ఎ.బి.ఆర్.కు సర్దుబాటు చేశారు.
గమనిక -3: శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి పద్దు క్రింద పేర్కొన్న 33 టియంసిలను రెండు రాష్ట్రాల మధ్య కాస్తా అటు ఇటుగా విభజించడం జరిగింది. తెలంగాణ పద్దు క్రింద 13, రాయలసీమ పద్దు క్రింద 7, కోస్తాంధ్ర పద్దు క్రింద 13 టియంసిల చొప్పున కలపడం జరిగింది.
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్దుబాట్లను ప్రక్కన పెట్టి, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను మాత్రమే నేను ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాన్ని గమనంలో ఉంచుకోవాలని విజ్ఞప్తి.
5) బచావత్ ట్రిబ్యునల్ నికరజలాల కేటాయింపుకు ప్రాతిపథికగా ఆనాటికి నీటిని వినియోగించుకొంటున్న ప్రాజెక్టుల వాస్తవిక నీటి అవసరాలను, అప్పటికి ఆమోదించబడిన ప్రాజెక్టుల నీటి అవసరాలను మాత్రమే పరిగణలోకి తీసుకొన్నది. ఆయా రాష్ట్రాలలోని నదీ పరివాహక ప్రాంతం విస్తీర్ణాన్నిగానీ, నదికి నీటిని ఏఏ రాష్ట్రం ఎంత మేరకు సమకూర్చుతున్నదనే అంశాన్నిగానీ పరిగణలోకి తీసుకోలేదు.
1956 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం మేరకు పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు నికరజలాలను కేటాయించింది. దాని ఫలితంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరివాహక ప్రాంతం మరియు నదికి నీటి సహాయం తక్కువ శాతమే ఉన్నా 800(38.83%) టియంసిలు కేటాయించబడ్డాయి. కర్నాటకకు 700, మహారాష్ట్రకు 560 టియంసి చొప్పున కేటాయించింది.
6) 70 టియంసిలు పునరుత్ఫత్తి ద్వారా లభిస్తాయని నిర్ధారించి మహారాష్ట్రకు 25(35.7%), కర్నాటకకు 34(48.57%), ఆంధ్రప్రదేశ్ కు 11(15.71%)టియంసి చొప్పున ట్రిబ్యునల్ కేటాయించింది. నికరజలాల కేటాయింపులో కంటే పునరుత్ఫత్తి జలాల కేటాయింపులో కర్నాటక, మహారాష్ట్రలకు ఎక్కువ శాతం కేటాయించింది. 2,060 మరియు 70, మొత్తం 2,130 టియంసిలు, అంత కంటేమించి లభించే మిగులు జలాలను 25:50:25 నిష్పత్తిలో వినియోగించుకోవాలని పథకం - బి లో బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్నది. దాన్ని అమలు చేయాలంటే 'క్రిష్ణా రివర్ వ్యాలీ అథారిటి'ని ఏర్పాటు చేయాలని లేదా పార్లమెంటు చట్టం చేయాలని, లేనియడల అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నది. పరివాక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం కాబట్టి అనేక కష్ట నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని వాదించి, పథకం - బి ని వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో కూడా అదే వాదనను వినిపించింది, పర్యవసానంగా స్కీం - బి అటకెక్కింది.
బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగియగానే వివాదాన్ని లేవదీసి, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మళ్ళీ ఈ అంశాన్ని కర్నాటక, మహారాష్ట్ర చర్చకు తీసుకొచ్చి విజయం సాధించాయి. ఫలితంగానే బచావత్ ట్రిబ్యునల్ 75% నీటి లభ్యత ప్రామాణికంగా నిర్ధారించిన నికర జలాల(2,060 మరియు 70) కేటాయింపులను యదాతథంగా కొనసాగిస్తూనే 65% ప్రామాణికంగా అదనంగా లభించే 163 టియంసిలలో మహారాష్ట్రకు 46, కర్నాటకకు 72, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 45 టియంసిల చొప్పున బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది.
ఆపైన అంటే 2,293(65% ప్రామాణికం)టియంసిలకు పైన కూడా 285 టియంసిల మిగులుజలాలు లభిస్తాయని నిర్ధారించి, వాటిని కూడా మహారాష్ట్రకు 35, కర్నాటకకు 105, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 145 టియంసిల చొప్పున బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ పంపిణి చేసేసింది. ఈ కేటాయింపులు అంటే 65% ప్రామాణికంగా లభించే అదనపు నికర జలాలు, ఆపైన లభించే మిగులు జలాల పంపిణీని సవాల్ చేస్తూ, బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో ఏ విధంగా మిగులు జలాలను వాడుకొనే స్వేఛ్చను ఆంధ్రప్రదేశ్ కు కల్పించిందో, ఆ స్వేఛ్చను కొనసాగించాలని వాదిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళాం. ఆ వ్యాజ్యం నడుస్తున్నది.
7) రాష్ట విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ తీర్పులోనే తెలంగాణకు నష్టం చేశారని, కొత్త ట్రిబ్యునల్ వేయాలన్న వాదనను సుప్రీంకోర్టులో వినిపించింది. ఆ వాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దాంతో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ వాదన వీగిపోయింది.
8) ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందుకు తెచ్చిన 'దామాషా విధానంలో క్రిష్ణా నదీ జలాలను వినియోగించుకొనే ప్రతిపాదన' ఏ ప్రాతిపథికన అన్నదే ప్రశ్న.
9) 75% ప్రామాణికంగా కేటాయించబడిన నీటిని అన్ని రాష్ట్రాలు వినియోగించుకొన్న తరువాత 65% ప్రామాణికంగా నిర్ధారించి కేటాయించిన నీటిని పై రాష్ట్రాలు వాడుకోవాలని, అలాగే 65% ప్రామాణికంగా కేటాయించబడిన నీటిని దిగువ రాష్ట్రం వాడుకొన్న తరువాతే మిగులు జలాలలో కేటాయించిన నీటిని వాడుకోవాలన్న షరతులను బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నది.
10) ఈ పరిణామాలు, ట్రిబ్యునల్స్ తీర్పుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం మరియు ప్రకాశం జిల్లాకు ప్రయోజనం వనగూడే విధంగా దామాషా విధానంలో నీటిని వాడుకోవడానికి ఉన్న మార్గమేంటో ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సవివరంగా వివరించాలి. సాగునీటి పారుదల రంగ నిపుణులతోను, రాజకీయ పక్షాలతోను, సంబంధిత ప్రజాసంఘాలతోను, ప్రజలతోనూ చర్చించిన మీదటనే ఈ ప్రతిపాదనపై అడుగు ముందుకు చేయాల్సి ఉంటుంది.
- టి.లక్ష్మీనారాయణ

Monday, April 18, 2016

నీటిపై కెసిఆర్ కొత్త పల్లవి!


మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమై ఒక ఒప్పందాన్ని చేసుకొన్నాక తెలంగాణ శాసనసభలో 'పవర్ పాయింట్ ప్రజెంటేషన్' ద్వారా తెలంగాణ జల దృశ్యాన్ని ఆవిష్కరించారు. శాసనసభ వేదికగా కొన్ని ఆసక్తికరమైన, కీలకమైన అంశాలపై విస్పష్టంగా వ్యాఖ్యలు చేశారు. అటుపై శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పర్యటనకు వెళ్ళి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తో సస్సంబంధాలను కోరుకొంటున్నానని, నీటి సమస్యలపై వివాదాలను కోరుకోవడం లేదని పునరుద్ఘాటించారు. ఆ మేరకు మంచిదే. ఆ వ్యాఖ్యల అంతరార్థాన్ని మాత్రం 'కీడెంచి మేలెంచాలన్న' నానుడిని దృష్టిలో పెట్టుకొని నిశితంగా పరిశీలించాలి. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల పట్ల ఆయన వైఖరి ఎలా ఉన్నది, విభజన తరువాత కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో జలవనరుల సమస్యపై ఆయన వైఖరి ఎలా ఉన్నది, మరీ ప్రత్యేకించి కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నది అన్న అంశాలపై లోతుగా ఆలోచించాలి.
మాకు అందుబాటులో ఉన్న నీళ్ళన్నీ మావే, మేము వినియోగించుకోలేక పోవడంతో క్రిందికి ప్రవహిస్తున్న నీరంతా మీరు స్వేఛ్చగా వాడుకోవచ్చు. సముద్రం పాలయ్యే నీటిని వినియోగించుకోండి, శ్రీకాళహస్తి వరకు తీసుకెళ్ళండని ఎంతో ఉదారంగా సలహా కూడా ఇచ్చారు. మంచిదే. కాకపోతే ఇక్కడ ఒక్క విషయాన్ని ఆలోచించాలి.
గోదావరిలో పుష్కలంగా నీళ్ళున్నాయి, సముద్రం పాలౌతున్నాయన్నది అందరూ అంగీకరిస్తున్న నిర్వివాదాంశం. ఆ నీటిని ఒక్క పోలవరం ప్రాజెక్టు ద్వారానే పూర్తిగా వినియోగించుకోవడం సాధ్యం కాదు. కాబట్టే, దుమ్మగూడెం - నాగార్జునసాగర్ టేల్ పాండ్ పథకాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ పూనుకొన్నది. ఆ ప్రాజెక్టును నేడు తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాకే కుదించి వేసింది. ఫలితంగా దాదాపు 165 టియంసిల గోదావరి నీటిని ఈ పథకం ద్వారా తరలించి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తూ, సాగర్ టేల్ పాండ్ కు 100 టియంసిల వరకు నీటిని తరలించాలనే లక్ష్యానికి ఎందుకు గండికొడుతున్నట్టు.
ఆ ప్రాజెక్టును నిర్మిస్తే, కృష్ణా జలాలను ఆదా చేసుకొని, దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ జిల్లాలో వరద నీటిపై ఆధారపడి నిర్మించబడుతున్న నెట్టంపాడు, కల్వకుర్తి, నల్లగొండ జిల్లాలో నిర్మించబడిన మాధవరెడ్డి ఎత్తిపోతల పథకానికి, నిర్మాణంలో ఉన్న యస్.యల్.బి.సి. నీటి అవసరాలు తీర్చవచ్చు కదా!
అలాగే మరొక మంచి మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు కూడా మన తెలుగు వాళ్ళే, వాళ్ళ నీటి కష్టాలు తీరితే సంతోషిస్తామని కెసిఆర్ గారన్నారు. మరి, కరువు కాటకాలతో విలవిల్లాడిపోతున్న రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, హంద్రీ -నీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీటిని అందించడం ద్వారా ఆ వెనుకబడ్డ ప్రాంతాల ప్రజల గొంతులు తడపడానికి కూడా ఈ పథకం తోడ్పడుతుంది కదా!
ఎందుకు, దుమ్మగూడెం - సాగర్ టేల్ పాండ్ పథకాన్ని అటకెక్కించారు. నిథుల సమస్య అయితే, ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నదీ జలాల అనుసంధాన పథకంలో అంతర్భాగంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్మించమని రెండు తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలు ఉమ్మడిగా కోరవచ్చు కదా! పైపెచ్చు ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీ పరివాహక రాష్ట్రాలన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రయోజనం కలుగుతుంది. కారణం, కృష్ణా నదీ జలాలపై ఉన్న తీవ్రమైన వత్తిడికి ఉపశమనం కలుగుతుంది. చెన్నయ్ మహానగరానికి త్రాగునీటి కోసం సరఫరా చేయాల్సిన 15 టియంసిల తరలింపుకు వెసులుబాటు వస్తుంది. బహుళ ప్రయోజనాలున్న దుమ్మగూడెం- సాగర్ టేల్ పాండ్ పథకం నిర్మాణంపై ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరిస్తేనే సముద్రం పాలౌతున్న గోదావరి నీటిని మరింత వినియోగంలోకి తెచ్చి దక్షిణ తెలంగాణ, రాయలసీమ, ప్రకాశం జిల్లా లాంటి కరువు పీడిత ప్రాంతాల నీటి అవసరాలను తీర్చడానికి దోహదపడిన వారౌతారు.
2. నదీ జలాల వినియోగ అంశంపై పై రాష్ట్రాలతో తగాదా పడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కెసిఆర్ తేల్చేశారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ప్రాజెక్టులు, ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు మొత్తం 450కి పైగా నిర్మించుకొని క్రిందికి నీరు ప్రవహించకుండా మొత్తం నీటిని వాడేసుకొంటున్నారని, ఇప్పుడు వారితో తగాదా పెట్టుకొని లాభం లేదని శసబిసలు లేకుండా ప్రకటించారు. అంటే బాబ్లీ వంటి ప్రాజెక్టులను మహారాష్ట్ర నిర్మించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు రాకుండా వాడేసుకొంటున్నా మనమేం చేయలేమని చేతులెత్తేశారు.
ఆదే సందర్భంలో గోదావరి ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, వాటి ఉపనదుల ద్వారా తెలంగాణాలో లభించే నీటిని సంపూర్ణంగా వాడుకోవడానికి నిర్మాణంలో ఉన్న పథకాల ఆకృతులను మార్చి నిర్మిస్తామని, కొత్త పథకాలను చేపడతామని సెలవిచ్చారు. అందులో భాగంగానే ప్రాణహిత - చేవెళ్ళ ఎత్తిపోతల పథకం ఆకృతి మార్చి రెండుగా విడగొట్టి కాళేశ్వరం వద్ద మరొక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని తలపెట్టారు.
అలాగే ఉమ్మడి ప్రభుత్వ కాలంలో ఇందిర, రాజీవ్(దుమ్మగూడెం) ఎత్తిపోతల పథకాల ఆకృతి మార్చి ఖమ్మం జిల్లాకు ఎక్కువ లబ్ధి చేకూర్చే లక్ష్యంతో శ్రీరామా, భక్తరామదాసు పథకాల నిర్మాణానికి పూనుకొన్నారు. ఇంత వరకు అభ్యంతర పెట్టాల్సిందేమీ లేదు. గోదావరి జలాలను వీలైనంత ఎక్కువగా సద్వినియోగం చేసి తెలంగాణ మెట్ట ప్రాంతాలను సమగ్రాభివృద్ధి వైపు అడుగులు వేయిస్తే మనస్ఫూర్తిగా అభినందించవచ్చు.
గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుల వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు వాటిల్లే నష్టం పెద్దగా ఉండదు. కారణం భద్రాచలం క్రింది భాగంలో గోదావరిలో వచ్చి కలిసే శబరి ఉపనది ద్వారా లభించే నీరు ఎలాంటి అవరోధం లేకుండా నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు చేరుతుంది. గోదావరి జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి1480 టియంసిల నికరజలాల వినియోగానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. 600 టియంసిలకుపైగా నికర జలాలతో పాటు మొత్తం 3,000 టియంసిలకుపైగా ప్రతి ఏడాది సముద్రం పాలౌతున్నాయి. కాబట్టి దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు గోదావరి జలాల వినియోగంలో నష్టం వాటిల్లే అవకాశం లేదన్నది నిపుణుల మాట.
3. నీటి సమస్య చాలా జఠిలమైనది, సంక్లిష్టమైనది, అత్యంత వివాదాస్పదమైనది. గోదావరి జలాల వినియోగానికి సంబంధించినంత వరకు పెద్ద సమస్యల్లేవు. కానీ, క్రిష్ణా నదీ జలాల వినియోగంపై అప్పుడప్పుడూ యుద్ధ వాతావరణ నెలకొంటుండడాన్ని చూస్తూనే ఉన్నాం కదా!
ఉమ్మడి రాష్ట్రంలో రాజోలి బండ మళ్ళింపు పథకం(ఆర్డియస్) వద్ద మహబూబ్ నగర్, కర్నూలు జిల్లా ప్రజలు సిగ పట్లు పట్టుకొనే వారు. రాష్ట్ర విభజనానంతరం శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాల వద్ద బాబా బాహీ అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు తలపడ్డాయి. క్రిష్ణా నదీ జలాల వినియోగంలో తలెత్తిన, తలెత్తుతున్న, భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలు, వివాదాలు తీవ్ర రూపం దాల్చే అవకాశాలే మెండుగా ఉన్నాయన్నది నిర్వివాదాంశం.
క్రిష్ణా నదీ జలాల వినియోగంపై నెలకొన్న వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ బ్రజేష్ కుమార్ నేతృత్వంలో రెండవ కృష్ణా జలాల వివాద పరిష్కారాల ట్రిబ్యునల్ ను నియమించింది. విచారణానంతరం ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తెలుగు ప్రజలకు శరాఘాతంగా తగిలింది. న్యాయం చేయమని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. కేసు విచారణలో ఉన్నది. ఆ కారణంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పెండింగ్ లో ఉన్నది.
మరొక వైపు రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారు. పర్యవసానంగా క్రిష్ణా జలాల వినియోగం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మరింత జఠిలంగా, సంక్లిష్టంగా, వివాదాస్పదంగా పరిణమించింది. దీని పరిష్కారం బాధ్యతను కూడా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కే కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దానికున్న గడువును కూడా రెండేళ్ళు పొడిగించింది. ఆ విచారణ మరొక వైపు జరుగుతున్నది.
విభజన చట్టం మేరకు నెలకొల్పబడిన క్రిష్ణా నది నిర్వహణ బోర్డు పూర్తి స్థాయిలో తన బాధ్యతలను నిర్వర్తించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుండి 90 టియంసిల నీటి తరలింపుకు వీలుగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, అలాగే డిండి ఎత్తిపోతల పథకాన్ని 30 టియంసిల సామర్థ్యంతోను, హైదరాబాదు నగరానికి మరో 20 టియంసిల త్రాగు నీటి పథకాన్ని యుద్ధ ప్రాతిపదికపై నిర్మించడానికి కార్యాచరణకు పూనుకొన్నది.
క్రిష్ణా నది మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణాన్ని చేపట్టిన నెట్టంపాడు, కల్వకుర్తి, యస్.యల్.బి.సి., మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం, హంద్రీ - నీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులకే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల పద్దులో కూడా నీటి కేటాయింపులు చేయలేదు. ఈ పూర్వరంగంలో నిర్మించ తలపేట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, డిండి ఎత్తిపోతలకు ఆంధ్రప్రదేశ్ నుండి వ్యతిరేకత వ్యక్తం కాకూండా చేయడానికే కెసిఆర్ మంచి మాటలు మాట్లాడుతున్నట్లు కనబడుతున్నది.
జల వనరుల వినియోగంలో ఒక నూతన తాత్విక చింతనను కెసిఆర్ ప్రవేశ పెట్టినట్లు అనిపిస్తున్నది. పై రాష్ట్రాలు ఏం చేసినా ప్రశ్నించి ప్రయోజనం లేదన్నదే దాని అంతరార్థం. ఇది ప్రమాదకరమైనది. నదీ జలాల సమస్యలపై ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం. వాటికి లోబడే నదీ పరివాహక ప్రాంతాల్లోని రాష్ట్రాలు వ్యవహరించక తప్పదు. ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే తీరులో ఏ రాష్ట్రం వ్యవహరించినా వివాదాలకు ఆజ్యం పోసినట్లే అవుతుంది. అలాంటి వైఖరి ఏ మాత్రం సమర్థనీయం కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సస్సంబంధాలకు విఘాతం కలుగుతుంది.
ప్రజలకు ప్రాణాధారమైన నీటి సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా, విజ్ఞతతో వ్యవహరించడం తక్షణావసరం

Friday, April 15, 2016

ఇసుక 'ఉచిత పథకం' లాభసాటి వ్యాపారం!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం అమలు అనుభవం ఏం చెబుతున్నది? ప్రజలేమనుకొంటున్నారు? ఉచిత ఇసుక పథకం సత్ఫలితాలిస్తున్నదా! దుష్పలితాలకు బాటలు వేస్తున్నదా? కడప జిల్లాలో 'ఎర్రచందనం మాఫియా' ఇప్పుడు ఇసుక మీద కన్నేసినట్లు వార్తలొస్తున్నాయి. లారీ ఇసుక ధర తిరుపతిలో రు.25,000 ఉంటే బెంగుళూరులో రు.60,000 పైగా పలుకుతున్నదట. అవకాశాన్ని సొమ్ము చేసుకొని కోట్లకు పడగలెత్తాలని కొత్త లారీలను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మకై అక్రమ రవాణా చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. మరి, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయండని చేసిన ప్రకటన 'ఇసుక మాఫియా'కు కళ్ళెం వెస్తుందా!
ఎండలు మండి పోతున్నాయి. రక్షిత మంచి నీటి లభ్యత ఎండ మావిగా మారింది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఒకప్పుడు నదీ పరివాహక ప్రాంతాలలో జనావాసాలు ఏర్పాటు చేసుకొనే వారని, అక్కడే నాగరికత అభివృద్ధి చెందేదని చదువుకొన్నాం. కాలం మారి పోయింది. నదుల ప్రక్కనున్న గ్రామాల్లో త్రాగు నీరు కూడా లభించని దుర్గతి ఎదురయ్యిందని నేడు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతాల్లోని జనఘోష ఇది.
కరువుకు ఆట పట్టు రాయలసీమ. కరువుల్లో పుట్టి కరువులతో సహజీవనం చేసి, కరువుల్లోనే కడతేరి పోతున్న దుర్భర జీవితాలు ఆ ప్రాంత వాసులది. వర్షం రాక పోకలు అంతుపట్టని అంశం. పెన్నా నది పారేదెప్పుడో! భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అడవులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ మార్పుల దుష్ప్రభావం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది.
ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాను నియంత్రించలేని ప్రభుత్వం 'ఇసుకను ఉచిత పథకాల' జాబితాలో చేర్చింది. మార్కెట్ లో ఖరీదైన సరుకుగా ఇసుకకు డిమాండ్ ఉన్నది. నిర్ధేశించిన ప్రాంతాలలోని 'రీచ్' లలోనే ఇసుకను తవ్వి తీసుకెళ్ళడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. సహజవనరులను కొల్లగొట్టి ధనార్జన చేయాలని కక్కుర్తి పడే వారికి ఇది తలకెక్కుతుందా! చెప్పండి.
పెన్నా నది, దాని ఉప నది చెయ్యేరు నుండి ఇష్టారాజ్యంగా అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల నుండి అడ్డగోలుగా తవ్వి ఇసుకను తీసుకెళ్ళి పోతున్నారు. పరిస్థితి ఎలా తయారయ్యింది అంటే నదీకి సమీపంలోని గ్రామాల్లోని కొందరు కొత్త టిప్పర్లు,ట్రాక్టర్లను కొనుగోలు చేసి ఇసుక వ్యాపారాన్ని మొదలు పెట్టారట. 'ఎర్ర మాఫియా' కొత్త లారీలను ఫైనాన్స్ సంస్థల ద్వారా కొనుగోలు చేసి, అక్రమ రవాణా సందర్భంలో దొరికిపోతే వాటిని రోర్డు మీదే వదిలేసిపోయే వ్యూహాలు కూడా రూపొందించుకొన్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతగా ఇసుక వ్యాపారం చేస్తూ అక్రమ సంపాదనకు రాచబాట వేసుకొన్నారు. ప్రభుత్వం అనుమతించిన 'రీచ్' ల నుండి, అనుమతిలేని ప్రాంతాల నుండి కూడా యదేఛ్చగా ఇసుకను తరలిస్తున్నారు. అడ్డుపెట్టే వారే లేరు. రెవెన్యూ అధికారులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ప్రభుత్వ అనుమతిలేని ప్రాంతాల నుండి ఇసుక తవ్వి తీసుకెళ్ళడం నేరం కదా! ఎందుకు నిరోధించరని ఎవరైనా ప్రశ్నిస్తే మాకెందుకండి ఆ తలనొప్పి, ముఖ్యమంత్రే స్వయంగా బహిరంగంగా ప్రకటించారు కదా! అవసరమైతే అడ్దొచ్చిన అధికారులను కొట్టి అయినా ఇసుక తీసుకెళ్ళండి, నేను చూసుకొంటానని. దాన్ని అవకాశంగా మలుచుకొని ఇసుక వ్యాపారం జోరుగా సాగుతున్నది.
పెన్నా నది నుండి ఇసుక తోడేస్తున్నారు. సహజ వనరైన ఇసుక త్రవ్వకాల వల్ల స్థానిక సంస్థలకు రాయల్టీ ద్వారా కొంత ఆదాయం వచ్చేది. దానికి గండి పడింది. ఒకవైపున ప్రభుత్వానికొచ్చే ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా ఉచిత పథకాన్ని అమలు చేయడానికి, సహజవనరైన ఇసుకను చట్టానికి మరియు ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి అనుమతించడానికి ప్రభుత్వ ఖజానా నుండి ఎదురు ఖర్చు పెట్టాల్సిన అనివార్య పరిస్థితి. పోనీ, అవినీతి తగ్గిందా అంటే పెరిగిందంటున్నారు. సామాన్య ప్రజలకు జరిగిన మేలెంత అంటే చెప్పలేని పరిస్థితి. కాంట్రాక్టర్లు, బిల్డర్లు రేట్లు తగ్గించారా అంటే అదీ లేదు. ఇహ! ప్రజలకు ఈ ఉచిత ఇసుక పథకం ద్వారా జరిగిన ప్రయోజనమేంటి?
జిల్లా ప్రజలు సొంత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్ళడం వరకు పరిమితం కాలేదు. ఇసుక రాష్ట్ర సరిహద్దు దాట కూడదని ప్రభుత్వం హుకుం జారీ చేశారు. కానీ, అటు చెన్నయ్, ఇటు బెంగుళూరు, ప్రక్కనున్న కర్నూలు జిల్లా పట్టణ ప్రాంతాలకు నిరంతరాయంగా ఇసుకను అక్రమంగా రవాణా చేసి వినియోగదారులకు, కాంట్రాక్టర్లకు, భవన నిర్మాణ సంస్థలకు, దళారులకు ఆ రోజున్న డిమాండును బట్టి అమ్మేసి సొమ్ము చేసుకొంటున్నారు. డిమాండు పెద్దగా లేని రోజు ట్రాక్టర్ బాడుగ, కూలీల ఖర్చు వచ్చినా పరవాలేదన్న భావనతో దళారులకు అమ్మేసుకొని ఇంటి దారి పడుతున్నారు. దళారులు, వ్యాపారస్తులు ఇసుకను కొని నిల్వ చేసి, డిమాండు వచ్చినప్పుడు అమ్మి లాభాలు గడిస్తున్నారు. ఇదీ జరుగుతున్న తంతు.
నదీ గర్భం మరియు నది పొడవునా ఇసుకను త్రవ్వి తీసుకెళ్ళిపోవడం పర్యవసానంగా సంబవించే దుష్పలితాలపై ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు మరింత అడుగంటి పోతాయని, త్రాగు నీరు కూడా లభించని దుస్థితి నెలకొన్నదని, పర్యావరణం దెబ్బతింటున్నదని ఆవేదన చెందుతున్నారు. రాజంపేట సమీపంలో చెయ్యేరు ఆధారంగా నిర్మించబడిన ఓబిలి రక్షిత మంచి నీటి పథకం ఒట్టి పోయిందన్న వార్తలొచ్చాయి.
గండికోట జలాశయం, మైలవరం జలాశయం, ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద నుండి ఇసుకను తరలించుకుపోతే అక్కడ నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, వర్షం పడ్డప్పుడైనా కనీసం నీటి నిల్వ పెరుగుతుంది కదా! అలా చేయకుండా నది పొడవునా అనువైన అన్ని చోట్ల నుండి తరలించుకపోతున్నారు. దీని వల్ల భవిష్యత్తులో భూగర్భ జలాలు ఇంకా పతనమైపోతాయన్న భయాందోళనలకు సామాన్య ప్రజలు గురౌతున్నారు. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాపితంగా ఈ పథకం లోపభూయిష్టంగా అమలౌతున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రభుత్వం ప్రజల ఆందోళనను అర్థం చేసుకొని, తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలి. భూగర్భజలాల పెంపుదలకు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన కార్యాచరణను అమలు చేయాల్సిన బాధ్యతను గుర్తించాలి.

Wednesday, April 13, 2016

ప్రజల విశ్వాసాలు, మహిళల సాధికారత పట్ల‌ స్వరూపానందకు గౌరవం లేదా?

ప్రజల విశ్వాసాలను గాయ పరచడమే కాదు, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా 'ఒక పకీరును(షిరిడి సాయి బాబా) ఆరాధించడం మూర్ఖత్వమని, పర్యవసానంగానే మహారాష్ట్రలో కరువు విలయతాండవం చేస్తున్నదని అక్కసు వెళ్ళగక్కడం, మహిళల సాధికారతను తిరస్కరించడమే కాదు, శని దేవుడ్ని ఆరాధిస్తే మానభంగాల సంఖ్య పెరుగుతుందని నీచాతినీచంగా స్వరూపానంద వ్యఖ్యానించడం పీఠాధిపతుల దిగజారుడుతనానికి అద్దం పడుతున్నది.
మతపరమైన మరియు స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను పెంచి పోషించడానికి స్వామీజీలు ఎంతటి నిబద్ధతతో కృషి చేస్తున్నారో బోధపడుతున్నది. శాంతియుత సహజీవనాన్ని గడపమని ప్రజలకు ప్రబోధించడానికి బదులు సమాజంలో అలజడులకు, అశాంతికి, హింసకు ఆజ్యం పోసే విధంగా రెచ్చగొట్టే రీతిలో వివాదాస్పదమైన వ్యాఖ్యలను బాధ్యతారహితంగా చేయడాన్ని సభ్యసమాజం గర్హించాలి.
భారత దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది, దాన్ని అమలు చేసే న్యాయ వ్యవస్థ ఉన్నదన్న స్పృహ పీఠాధిపతులకు, స్వామీజీలకు లేదా! అంటే ఉన్నదనే సమాధానమే వస్తుంది. కానీ, వాటికి అతీతులమన్న భావనతో పీఠాధిపతులు, స్వామీజీలు, బాబాలు వ్యవహరిస్తున్నారనడానికి ఈ ఉదంతం ఒక ప్రబల నిదర్శనం. లౌకిక వ్యవస్థకు, ప్రజాస్వామ్య మరియు మానవ హక్కులకు, భారత రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే తీరులో నిత్యం వ్యాఖ్యలు చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు స్పందించవు?
హిందూ ధర్మ పరిరక్షకులం తామేనని తమకు తాము ప్రకటించుకొంటూ అన్ని రకాల అప్రాచ్యపు పనులు చేస్తున్న కొందరి పీఠాధిపతుల, స్వామీజీల, బాబాల భాగోతాలను, గుట్టు రట్టు చేస్తూ ప్రసార మాధ్యమాల ద్వారా అనేక ఉదంతాలు విస్తృతంగానే వెలుగులోకి వచ్చాయి, వస్తున్నాయి.
ప్రఖ్యాతిగాంచిన కంచికామకోఠి పీఠాధిపతి ఆస్తి వివాదంలో ఇరుక్కొని, ఏకంగా హత్య కేసులో ముద్ధాయిగా జైలు పాలైన ఘటన గతంలో జరిగింది. యోగా బాబా రామ్ దేవ్ లాంటి వారి వెకిలి చేష్టల్ని చూస్తూనే ఉన్నాం. ఆధ్యాత్మిక కార్యకలాపాల ముసుగులో అమాయకత్వం, మూఢత్వం ఊబిలో కూరుకపోయిన మహిళలను ప్రలోబ పెట్టి లేదా బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకోవడం, విలాసవంతమైన జీవితం కోసం అర్రులు చాస్తూ దారి తప్పిన మహిళలను లోబరుచుకొని సభ్యసమాజం అసహ్యించుకొనే విధంగా అనైతికంగా శృంగార జీవితాన్ని గడుపుతున్న నిత్యానంద స్వామీజీ వంటి వారి నిజ జీవితాల, చీకటి బతుకుల భాగోతాలు వెల్లడౌతూనే ఉన్నాయి.
పీఠాధిపతుల, స్వామీజీల వ్యవస్థకే కళంకం తెస్తున్న, భ్రష్టు పట్టించిన ఉదంతాల జాబితా చాంతాడంత ఉన్నది. సరళీకృత విధానాలు, మార్కెట్ శక్తుల ప్రభావం ఈ వ్యవస్థపైన కూడా బాగానే ప్రసరించింది. దోపిడీ వ్యవస్థ ప్రయోజనాలను పరిరక్షించడమే ధేయంగా పుట్టి, పెరిగి, బలంగా వేళ్ళూనుకొన్న ఈ వ్యవస్థ నేటి సమాజాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తూనే ఉన్నది. ఆ వ్యవస్థ డొల్లతనాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయినా ఉపేక్షిస్తూనే ఉన్నారు. ఆరాధిస్తూనే ఉన్నారు. వారి ఉపదేశాలు వినడానికి తండోప తండాలుగా వారి వెంట పరుగులు తీస్తూనే ఉన్నారు. చదువుకొన్న వారు, చదుకోనివారన్న తేడా కనపడడం లేదు. గ్రామీణ, పట్టణ, నగరవాసులు, నాగరికులు, అనాగరికులన్న తేడా కూడా కనిపించడం లేదు. కళ్ళకు మతం గంతలు కట్టుకొని ఛాందస భావాలు, మూడత్వంతో ప్రజలు తమ ప్రయాణాన్ని కొనసాగించినంత కాలం సమాజ ప్రగతి ఎండమావే!
బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ శక్తులు మరింత పెట్రేగిపోతుంటాయి. మత ప్రాతిపథికపైన సమాజాన్ని చీల్చి, ప్రజల మధ్య అగాధాన్ని, వైషమ్యాలను, ఘర్షణ వాతావరణాన్ని పెంచిపోయడానికి నిరంతరాయంగా పని చేస్తుండడాన్ని చూస్తూనే ఉన్నాం. ఆ దుష్టశక్తులకు కళ్ళెం వేసే పరిస్థితులే కనపడడం లేదు.
ఇతర మతాలకు చెందిన వ్యవస్థలు కూడా ఇలాగే దొందూ దొందూ లాగే నడుస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం పెంపొందకుండా దోపిడీ వ్యవస్థకు రక్షణ కవచంగా, మనోభావాలతో మిళితమై ఉన్న ఈ లోపభూయిష్టమైన వ్యవస్థను బలహీనపరచడం, ధ్వంసం చేయడం సాధ్యం కాదు.

ఆర్థిక నేరస్తులకు రక్షకభటులెవరు?


పాలకులు గడచిన రెండున్నర దశాబ్ధాలుగా ఒక ఆర్థిక నీతిని(సరళీకృత ఆర్థిక విధానాలు) నిబద్ధతతో అమలు చేస్తున్నారు. ఆ ఆర్థిక నీతికి ఒక వర్గ స్వభావం ఉన్నది. దానికి లోబడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వ్యవహరిస్తారు తప్ప భిన్నంగా వ్యవహరించే అవకాశమే లేదు. వ్యక్తుల గొంతుల స్వరాన్ని బట్టి, వారి మాటల్లో మాధుర్యం తొణికిసలాడవచ్చు, కానీ ఆ స్వరాల్లోని సారం మాత్రం ప్రభుత్వ ఆర్థిక నీతినే ప్రతిధ్వనిస్తుంది. ఆ కుర్చీలో 1990 దశకం నుంచి శ్రీ యస్. వెంకటరామన్, డా. సి.రంగరాజన్, డా. బిమాల్ జలాన్, డా. వై.వి.రెడ్డి, డా.డి.సుబ్బారావు, ప్రస్తుతం డా. రంఘురాం జి. రాజన్ ఎవరు కూర్చొన్నా ఒకటే గొంతు వినిపిస్తారు, ప్రభుత్వ ఆర్థిక నీతినే వల్లెవేస్తారు.
వస్తూత్ఫత్తి, ఉపాథి కల్పన, దేశ ప్రజల జీవన ప్రమాణాలతో ఏ విధంగాను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సంబంధం లేని 'షేర్ మార్కెట్ సెంటిమెంట్' మీద ప్రధానంగా ఆధారపడి కృత్రిమ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం వైపు ప్రభుత్వాలు పరుగులు తీస్తున్నంత కాలం ఆర్థిక సంక్షోభాలు తప్పవు, ఆర్థిక నేరస్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగక మానదు. ఈ విధానాల పర్యవసానంగా కొందరు అమాంతం వందలు, వేలు, లక్షల కోట్లకు పడగలెత్తి నూతన సంపన్న వర్గంగా ఆవిర్భవిస్తున్నారు. అదే సందర్భంలో దివాలా తీసే వారిని చూస్తున్నాం. వ్యక్తులే కాదు, సంస్థలు కూడా. ఏక కాలంలో సంభవిస్తున్న రెండు పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం.
ఉదా: ఒక వ్యక్తి ఒక పరిశ్రమను నెలకొల్పి, వస్తూత్ఫత్తి చేసి, వస్తువులను అమ్ముకొని వచ్చే లాభాన్ని అనుభవించడం ఒక తరహా పెట్టుబడిదారీ ఆర్థిక నీతి. నేడు తద్భిన్నంగా పెట్టుబడిదారి వ్యవస్థ చరిత్ర గమనాన్ని చూస్తున్నాం. పరిశ్రమను స్థాపించి, షేర్ల ముఖ విలువను వందలు, వేలు రెట్లు పెంచి షేర్ మార్కెట్లో అమ్మడం ద్వారా సంపదను పోగేసుకోవడం, లేదా ఆర్థిక సంస్థలు మరియు బ్యాంకులకు ఆ పరిశ్రమను తాకట్టు పెట్టి దాని విలువకు మించి అనేక రెట్లు అధికంగా రుణం తీసుకొని, ఆ నిథులను దారి మళ్ళించి బ్యాంకులకు టోపి పెట్టడం ద్వారా సంపన్నులుగా మారడం. రాజకీయ నాయకత్వం, ఉద్యోగ వ్యవస్థ, కార్పోరేట్ సంస్థలు/ పారిశ్రామిక వేత్తల అపవిత్ర కలయికతోనే ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఈ తంతుకు ఆస్కారం మెండుగా ఉంటుంది. ఇలా నూతన దోపిడి విధానాలను, ఎత్తుగడలను అన్వేషిస్తున్న ఘరానా పారిశ్రామికవేత్తలే ఆర్థిక వ్యవస్థ పునాదులను పెకలించేస్తున్నారు.
హర్షద్ మెహతా మరొక అడుగు ముందుకేసి పరిశ్రమలను నెలకొల్పకుండానే, నెలకొల్పినట్లు రికార్డులు సృష్టించి, బ్యాంకులను మోసం చేసి, స్టాక్ మార్కెట్ లో సంస్థల పేర్లు నమోదు చేసి, షేర్లు అమ్మి, భారీ కుంభకోణానికి బరితెగించి పాల్పడిన ఉదంతం బహిర్గతమైన తరువాత అయినా కళ్ళు తెరవలేదు కదా! అంటే అర్థమేంటి? పర్యవసానంగా వ్యవస్థ మొత్తాన్ని ఆర్థిక సంక్షోభాల ఊబిలోకి బలవంతంగా ప్రభుత్వాలే నెట్టాయి.
వార్షిక బడ్జెట్స్ ను రూపొందించడం మొదలు ఆర్థికాంశాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా విధాన నిర్ణేతల మెదళ్ళలో మొదటగా మెదిలేది 'స్టాక్ ఎక్సేంజ్'(షేర్ల అమ్మకం, కొనుగోళ్ళ వ్యవహారాలను నిర్వహించే లేదా నియంత్రించే దుకాణాలు, మరోలా చెప్పాలంటే జూద గృహాలు)లు ఎలా స్పందిస్తాయోనన్న ఆలోచనే. రియల్ ఎకానమీకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కృత్రిమ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ప్రభుత్వాలు అగ్రపీఠం వేశాయో, అప్పటి నుంచే మన ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి నడక సాగిస్తున్నది.
సంపద సృష్టించబడడం లేదా అంటే సృష్టించబడుతున్నది. స్థూల జాతీయోత్ఫత్తి పెరగడం లేదా అంటే పెరుగుతున్నది. తలసరి ఆదాయం పెరుగుతున్నది. కానీ, సృష్టించిన సంపదలో ప్రజల వాటా ఎంత? ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా అంటే లేదు. ఉపాథి కల్పన ఎండమావిగా తయారయ్యింది. ఉపాథి కల్పన ఎక్కడన్నా ఉన్నది అంటే ఎలాంటి సామాజిక భద్రతలేని అసంఘటిత రంగానికే పరిమితమయ్యింది. ప్రభుత్వం రంగం యొక్క పిక నులిమేస్తున్నారు. సంఘటిత రంగం కుచించుకపోతున్నది.
ఈ నేపథ్యం నుండి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ ఆలోచనలను, ఆర్థిక నీతిని, ఆచరణను పరిశీలించాల్సి ఉంటుంది. గడచిన మూడు దశాబ్ధాలుగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వహించిన వారందరూ ఐయంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఆలోచనలను పుణికి పుచ్చుకొన్న వారే. మార్కెట్ శక్తులకు ఊడిగం చేసే ఆర్థిక నీతికి కట్టుబడిన వారే. అందరూ తేనె పూసిన కత్తెల్లాంటి ఆర్థిక వేత్తలే.
బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని చెల్లించని ఘరానా పారిశ్రామికవేత్తల జాబితాను, అందులోనూ రు.500 కోట్లకు పైగా మొండి బాకీదారుల జాబితాను బహిరంగ పరచాలని సుప్రీంకోర్టు చాలా రోజుల క్రితమే సూచించింది. మళ్ళీ తాజాగా ప్రజా ప్రయోజనాల కేసు విచారణలో భాగంగా ఎందుకు బహిరంగపరచరని రిజర్వ్ బ్యాంకును నిగ్గదీసింది. గవర్నర్ రఘురాం రాజన్ సన్నాయి నొక్కులు నొక్కుతూ 'విల్ పుల్ డిపాల్టర్స్' కు, నిజాయితీతో పరిశ్రమను నెలకొల్పి లేదా వ్యాపారం చేసి నష్టపోయి దివాలాతీసి అప్పు చెల్లించని వారిని వేరు వేరుగా చూడాలని, ఉద్ధేశ పూర్వకంగా బ్యాంకులను మోసం చేసిన వ్యక్తుల పేర్లను బహిరంగపరచడానికి అభ్యంతరం లేదని, కానీ నిజాయితీతో వ్యాపారం/సంస్థను నెలకొల్పి దివాలా తీసిన మొండి బకాయిదారులుగా ఉన్న వారి పేర్లను వెల్లడిస్తే మన ఆర్థిక వ్యవస్థే కుప్ప కూలుతుందని సెలవిచ్చారు. పోనీ, ఆయన అంగీకరించిన మేరకైనా 'విల్ పుల్ డిపాల్టర్స్' జాబితానైనా బహిరంగపరిచారా! అంటే ఆ పని చేయలేదు. ఒక సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు అందించారంట. బ్యాంకులను మోసం చేసి, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఆర్థిక నేరస్తుల పేర్లను వెల్లడించడానికి మీనేషాలెందుకు వేయాలి? మన ఆర్థిక వ్యవస్థ అంత బలహీనంగా ఉన్నదా?
2008లో అమెరికాలో సంభవించిన ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేసినా మన దేశం నిలదొక్కుకోగలిగిందని, దానికి కారణం బలంగా వేళ్ళూనుకొని ఉన్న మన బ్యాంకింగ్ వ్యవస్థేనని సగర్వంగా పాలకులు ప్రకటించారు కదా! మరి, ఈ ఆరేడేళ్ళలో ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ అంత బలహీనమై పోయిందా? ఒకవేళ అయితే దానికి బాధ్యులెవరు?
వ్యవసాయం సంక్షోభంలో కూరకపోయి ఉన్నది, రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు, పంట రుణాలు తీసుకొన్న రైతులను మాత్రం బ్యాంకులు అవమానాల పాలు చేస్తూ, ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు కల్పిస్తున్నాయి. చిన్న, మధ్య తరగతి పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వకుండా తిప్పుకొంటారు. ఇచ్చినా అధిక వడ్డీలు చెల్లించుకోవాలి. క్రమం తప్పకుండా చెల్లించాలి. లేదంటే వెంటాడతారు. కానీ, కార్పోరేట్ సంస్థల అధిపతులుగా ఉన్న వారు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని, ఎగ్గొడితే పేర్లను బహిరంగపరచడానికి కూడా వీల్లేదంటున్నారు. ఇదెక్కడి నీతి?
దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా మొండి బాకీలున్నాయని, వడ్డీ మొత్తాలతో కలిపితే ఆ మొత్తం ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. ఎ.ఐ.బి.ఇ.ఎ. లాంటి ఉద్యోగ సంఘాలు గడచిన ఐదారేళ్ళుగా మొండి బాకీదారుల జాబితాను బహిరంగంగా వెల్లడిస్తూనే ఉన్నాయి. వారి ఆస్తులను జప్తు చేయాలని, బాకీలను వసూలు చేసి, ప్రభుత్వ రంగ బ్యాంకులను రక్షించాలని ప్రభుత్వాన్ని, బ్యాంకుల యాజమాన్యాలను పదే పదే డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేసిన ఏ మాత్రం చలనం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రత్యేకించి ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడనే ప్రశ్నించేలా మారిన ఈ సమస్య సుప్రీంకోర్టు తలుపుతట్టింది. కాంగ్రెస్ పాలనా కాలంలో దొంగలు పడ్డారని, నేనొచ్చాక దొంగలు దేశం విడిచి పారిపోతున్నారని సెలవిచ్చిన మోడి గారు, ఇటీవలే రు.9000 కోట్లకుపైగా మొండిబాకీ ఉన్న విజయ్ మాల్యా, ప్రభుత్వ కన్నుగప్పి రాజమార్గంలో దేశం విడిచి పారిపోవడానికి ద్వారాలు తెరిచింది ఎవరు? అంటే సమాధానం ఇవ్వగలిగిన స్థితిలో మోడి ప్రభుత్వం లేదు. దొంగలకు, దోపిడీదారులకు, మోసగాళ్ళకు రక్షణ కవచంగా ప్రభుత్వాలే ఉన్న కాలంలో జీవిస్తున్నాం. చూద్దాం! ఏం జరుగుతుందో!