Wednesday, April 20, 2016

చంద్రబాబు గారు! 'దామాషా'పై లోతుగా తర్కించారా!


క్రిష్ణా నదీ జలాలను, నదీ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ అంగీకరిస్తే దామాషా విధానంలో వినియోగించుకోవడానికి సిద్ధమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రికలో చదివాను. ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనపై స్పందించి వ్యాసం వ్రాస్తే బాగుంటుందని, ఈ తరహా అంశాలపై విస్తృత చర్చ జరిగితే ప్రయోజనకరంగా ఉంటుందని, ఒక మిత్రుడు సూచించారు.
సమస్య గంభీరమైనది. నీటి సమస్యపై నాకున్న పరిమితమైన అవగాహనతోనైనా లోతైన అంశాలను తడుముతూ ఈ వ్యాసం వ్రాస్తున్నాను. కాస్తా పెద్దదే! కొందరిని విసుగు చెందించే అవకాశం ఉన్నా గంణాంకాలు ప్రస్తావించక తప్పని పరిస్థితి. ఆసక్తి ఉన్న మిత్రులు ఓపికగా చదవమని విజ్ఞప్తి.
1) క్రిష్ణా జలాల వినియోగానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు - దాని అమలు, ఆ తీర్పు గడువు ముగిసిన తరువాత కేంద్ర ప్రభుత్వం నియమించిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు, దానిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ట్రిబ్యునల్ తీర్పులోని ఏఏ అంశాలు తెలుగు ప్రజలకు శరాఘాతంగా పరిణమిస్తాయని తీవ్ర ఆందోళన చెందుతున్నామో, రాష్ట్ర విభజన తదనంతరం తలెత్తిన సమస్యలు, ముందుకొచ్చిన కొత్త వివాదాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసి, పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో! అంచనా వేసుకొని, ప్రత్యేకించి క్రిష్ణా నదీ పరివాహక ప్రాంతంలో చివరి రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ లోని నిత్యకరవు పీడిత ప్రాంతమైన రాయలసీమ మరియు ప్రకాశం జిల్లా నీటి అవసరాలు - ఉత్ఫన్నమవుతున్న సమస్యలు - పరిష్కార మార్గాలను పరిగణలోకి తీసుకొని, మేధోమదనం చేసి చంద్రబాబునాయుడు గారు ఆ వ్యాఖ్య చేశారా! అన్న అనుమానం నాకొచ్చింది.
నా అనుమానానికి ప్రాతిపధికలు లేక పోలేదు. అవి లోపభూయిష్టమైనవి కావచ్చేమో! కానీ, వాటికి హేతుబద్ధమైన సమాధానాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వలోని పెద్దలు ఇచ్చి, నాలాంటి వారి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం వారిపై ఉన్నది.
2) ఈ ఏడాది క్రిష్ణా నదికి వరదలు రాలేదు. కర్నాటక నుంచి శ్రీశైలం జలాశయానికి 60 టియంసిలకు లోపే నీరొచ్చిచేరింది. వర్షపు నీటినంతా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు, వారి జలాశయాల్లో నింపుకొని, వాడుకోవడంతో, మనకు నీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చాయని, నష్టం జరిగిందన్న భావనతో దామాషా విధానంలో నీటిని వాడుకోవాలన్న ఆలోచన రేకెత్తినట్లు కనబడుతున్నది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి వచ్చిన తరువాత గడచిన 40 సం.ల కాలంలో ఇలాంటి దుస్థితిని ఎదుర్కొన్న సం.లు చాలానే ఉన్నాయి. అదే సందర్భంలో, అధిక నీటి ప్రవాహం వచ్చిన సం.లలో లభించిన నీటినంతటిని, శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాల్లో భవిష్యత్ అవసరాల కోసం నిల్వ ఉంచుకోవలసిన '150 టియంసిల క్యారీ ఓవర్ స్టోరేజ్' నీటితో సహా విచ్చలవిడిగా వాడుకొన్న సందర్భాలూ ఉన్నాయి.
3) బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో స్కీం - ఎ, స్కీం - బి లను ప్రతిపాదించారు. స్కీం - ఎ అమలులోకి వచ్చింది. పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల అంగీకారంతో 'క్రిష్ణా రివర్ వ్యాలీ అథారిటీని' ఏర్పాటు చేసిగానీ లేదా పార్లమెంటు చట్టం చేసిగానీ స్కీం - బి అమలు చేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొన్నారు. నాడు ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించడంతో స్కీం-బి అమలులోకి రాలేదు. ఎందుకు వ్యతిరేకించింది? కారణాలేమిటి? ఆ కారణాలకు నేడు విలువ లేదా? దామాషా విధానంలో నీటిని వాడుకోవాలంటే తలెత్తే సమస్యలేమిటి? దామాషా విధానాన్ని బచావత్ ట్రిబ్యునల్ తీర్పు సందర్భంలో కర్నాటక, మహారాష్ట్రలు కోరాయి కదా! ఎందుకు కోరాయి? ఇప్పుడు దామాషా విధానంలో నీటిని వాడుకోవడానికి వాళ్ళు ఎలాంటి అభ్యంతరాలను పెడతారని ఊహించుకొంటున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్ఫన్నమతున్నాయి.
4) క్రిష్ణా నది మొత్తం పరివాక ప్రాంతం 2,58,947 చ.కి.మీ.ఉన్నది. నదీ పరివాహక ప్రాంతాన్ని 12 బేసిన్లుగా విభజించారు. ఏఏ బేసిన్ పరిథి ఏఏ రాష్ట్రంలో ఏ మేరకు విస్తరించి ఉన్నదో నిర్ధారించబడింది. 75% నీటి లభ్యతను ప్రామాణికంగా తీసుకొని 2,060 టియంసిల నీరు లభిస్తుందని బచావత్ ట్రిబ్యునల్ నిర్ధారించింది. నదీ పరివాక ప్రాంతంలోని రాష్ట్రాల పరిథిలో ఉన్న పరివాహక ప్రాంతమెంత? ఆయా రాష్ట్రాల నుండి బేసిన్ల వారిగా క్రిష్ణా నదికి నీటి సహాయమెంత? అన్నదాన్ని కూడా నిర్ధారించారు. తాజా అధ్యయనాలు కూడా నాటి అంచనాలనే స్థూలంగా ఖరారు చేశాయి. బేసిన్ల వారిగా నీటి లభ్యత, ఎంత నీటిని ఆయా బేసిన్లలో వినియోగించుకోవాలన్న అంశాన్ని కూడా బచావత్ ట్రిబ్యునల్ తన తీర్పులో విస్పష్టంగా పేర్కొన్నది.
మహారాష్ట్రలోని పరివాహక ప్రాంతం 69,425(26.81%)చ.కి.మీ., నీటి సహాయం 962.5(46.72%) టియంసిలు, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీరు 560(27.18%) టియంసిలు.
కర్నాటక 1,13,271(43.74%) చ.కి.మీ., నీటి సహాయం 760.9(36.94%) టియంసి, కేటాయింపు 700(33.98%) టియంసిలు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరివాహక ప్రాంతం 76,252(29.45%) చ.కి.మీ., నీటి సహాయం 336.6(16.34%) టియంసి, కేటాయింపు 800(38.83%) టియంసిలు.
రాష్ట్రం విడిపోయింది. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల వివరాలను కూడా వేరువేరుగా పరిగణలోకి తీసుకోవాలి. తెలంగాణలో పరివాహక ప్రాంతం 52,233(20.17%), నీటి కేటాయింపు 280(13.59%) టియంసిలు. ఆంధ్రప్రదేశ్ లో పరివాహక ప్రాంతం 24,019(9.28%) చ.కి.మీ., నీటి కేటాయింపు 520(25.24%) టియంసిలు.
గమనిక -1: రాయలసీమ ప్రాంతంలో పరివాక ప్రాంతం 14,022(5.42%) చ.కి.మీ., నీటి కేటాయింపు 130(6.3%) టియంసిలు. కోస్తాంధ్ర ప్రాంతంలో పరివాహక ప్రాంతం 9,997(3.86%) చ.కి.మీ., నీటి కేటాయింపు 390(18.93%) టియంసిలు.
గమనిక -2: ఉమ్మడి రాష్ట్రంలో నికర జలాల వినియోగానికి సంబంధించి కొన్ని సర్దుబాట్లు చేయడం జరిగింది. క్రిష్ణా డెల్టా ఆధునీకీకరణ ద్వారా ఆదా అయ్యే నీటి నుండి 20 టియంసి భీమా పథకానికి కేటాయించారు. అలాగే పునరుత్ఫత్తి జలాలతో కలిపి 19 టియంసిలను యస్.ఆర్.బి.సి.కి కేటాయించారు. కె.సి.కెనాల్ కు శ్రీశైలం జలాశయం నుండి 10 టియంసిలు సర్దుబాటు చేసి, తుంగభద్ర జలాశయం నుండి కె.సి.కెనాల్ కు ఇవాల్సిన నీటిని పి.ఎ.బి.ఆర్.కు సర్దుబాటు చేశారు.
గమనిక -3: శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి పద్దు క్రింద పేర్కొన్న 33 టియంసిలను రెండు రాష్ట్రాల మధ్య కాస్తా అటు ఇటుగా విభజించడం జరిగింది. తెలంగాణ పద్దు క్రింద 13, రాయలసీమ పద్దు క్రింద 7, కోస్తాంధ్ర పద్దు క్రింద 13 టియంసిల చొప్పున కలపడం జరిగింది.
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్దుబాట్లను ప్రక్కన పెట్టి, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను మాత్రమే నేను ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాన్ని గమనంలో ఉంచుకోవాలని విజ్ఞప్తి.
5) బచావత్ ట్రిబ్యునల్ నికరజలాల కేటాయింపుకు ప్రాతిపథికగా ఆనాటికి నీటిని వినియోగించుకొంటున్న ప్రాజెక్టుల వాస్తవిక నీటి అవసరాలను, అప్పటికి ఆమోదించబడిన ప్రాజెక్టుల నీటి అవసరాలను మాత్రమే పరిగణలోకి తీసుకొన్నది. ఆయా రాష్ట్రాలలోని నదీ పరివాహక ప్రాంతం విస్తీర్ణాన్నిగానీ, నదికి నీటిని ఏఏ రాష్ట్రం ఎంత మేరకు సమకూర్చుతున్నదనే అంశాన్నిగానీ పరిగణలోకి తీసుకోలేదు.
1956 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం మేరకు పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు నికరజలాలను కేటాయించింది. దాని ఫలితంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరివాహక ప్రాంతం మరియు నదికి నీటి సహాయం తక్కువ శాతమే ఉన్నా 800(38.83%) టియంసిలు కేటాయించబడ్డాయి. కర్నాటకకు 700, మహారాష్ట్రకు 560 టియంసి చొప్పున కేటాయించింది.
6) 70 టియంసిలు పునరుత్ఫత్తి ద్వారా లభిస్తాయని నిర్ధారించి మహారాష్ట్రకు 25(35.7%), కర్నాటకకు 34(48.57%), ఆంధ్రప్రదేశ్ కు 11(15.71%)టియంసి చొప్పున ట్రిబ్యునల్ కేటాయించింది. నికరజలాల కేటాయింపులో కంటే పునరుత్ఫత్తి జలాల కేటాయింపులో కర్నాటక, మహారాష్ట్రలకు ఎక్కువ శాతం కేటాయించింది. 2,060 మరియు 70, మొత్తం 2,130 టియంసిలు, అంత కంటేమించి లభించే మిగులు జలాలను 25:50:25 నిష్పత్తిలో వినియోగించుకోవాలని పథకం - బి లో బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్నది. దాన్ని అమలు చేయాలంటే 'క్రిష్ణా రివర్ వ్యాలీ అథారిటి'ని ఏర్పాటు చేయాలని లేదా పార్లమెంటు చట్టం చేయాలని, లేనియడల అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నది. పరివాక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం కాబట్టి అనేక కష్ట నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని వాదించి, పథకం - బి ని వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో కూడా అదే వాదనను వినిపించింది, పర్యవసానంగా స్కీం - బి అటకెక్కింది.
బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగియగానే వివాదాన్ని లేవదీసి, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మళ్ళీ ఈ అంశాన్ని కర్నాటక, మహారాష్ట్ర చర్చకు తీసుకొచ్చి విజయం సాధించాయి. ఫలితంగానే బచావత్ ట్రిబ్యునల్ 75% నీటి లభ్యత ప్రామాణికంగా నిర్ధారించిన నికర జలాల(2,060 మరియు 70) కేటాయింపులను యదాతథంగా కొనసాగిస్తూనే 65% ప్రామాణికంగా అదనంగా లభించే 163 టియంసిలలో మహారాష్ట్రకు 46, కర్నాటకకు 72, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 45 టియంసిల చొప్పున బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది.
ఆపైన అంటే 2,293(65% ప్రామాణికం)టియంసిలకు పైన కూడా 285 టియంసిల మిగులుజలాలు లభిస్తాయని నిర్ధారించి, వాటిని కూడా మహారాష్ట్రకు 35, కర్నాటకకు 105, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 145 టియంసిల చొప్పున బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ పంపిణి చేసేసింది. ఈ కేటాయింపులు అంటే 65% ప్రామాణికంగా లభించే అదనపు నికర జలాలు, ఆపైన లభించే మిగులు జలాల పంపిణీని సవాల్ చేస్తూ, బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో ఏ విధంగా మిగులు జలాలను వాడుకొనే స్వేఛ్చను ఆంధ్రప్రదేశ్ కు కల్పించిందో, ఆ స్వేఛ్చను కొనసాగించాలని వాదిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళాం. ఆ వ్యాజ్యం నడుస్తున్నది.
7) రాష్ట విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ తీర్పులోనే తెలంగాణకు నష్టం చేశారని, కొత్త ట్రిబ్యునల్ వేయాలన్న వాదనను సుప్రీంకోర్టులో వినిపించింది. ఆ వాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దాంతో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ వాదన వీగిపోయింది.
8) ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందుకు తెచ్చిన 'దామాషా విధానంలో క్రిష్ణా నదీ జలాలను వినియోగించుకొనే ప్రతిపాదన' ఏ ప్రాతిపథికన అన్నదే ప్రశ్న.
9) 75% ప్రామాణికంగా కేటాయించబడిన నీటిని అన్ని రాష్ట్రాలు వినియోగించుకొన్న తరువాత 65% ప్రామాణికంగా నిర్ధారించి కేటాయించిన నీటిని పై రాష్ట్రాలు వాడుకోవాలని, అలాగే 65% ప్రామాణికంగా కేటాయించబడిన నీటిని దిగువ రాష్ట్రం వాడుకొన్న తరువాతే మిగులు జలాలలో కేటాయించిన నీటిని వాడుకోవాలన్న షరతులను బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నది.
10) ఈ పరిణామాలు, ట్రిబ్యునల్స్ తీర్పుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం మరియు ప్రకాశం జిల్లాకు ప్రయోజనం వనగూడే విధంగా దామాషా విధానంలో నీటిని వాడుకోవడానికి ఉన్న మార్గమేంటో ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సవివరంగా వివరించాలి. సాగునీటి పారుదల రంగ నిపుణులతోను, రాజకీయ పక్షాలతోను, సంబంధిత ప్రజాసంఘాలతోను, ప్రజలతోనూ చర్చించిన మీదటనే ఈ ప్రతిపాదనపై అడుగు ముందుకు చేయాల్సి ఉంటుంది.
- టి.లక్ష్మీనారాయణ

No comments:

Post a Comment