పాలకులు గడచిన రెండున్నర దశాబ్ధాలుగా ఒక ఆర్థిక నీతిని(సరళీకృత ఆర్థిక విధానాలు) నిబద్ధతతో అమలు చేస్తున్నారు. ఆ ఆర్థిక నీతికి ఒక వర్గ స్వభావం ఉన్నది. దానికి లోబడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వ్యవహరిస్తారు తప్ప భిన్నంగా వ్యవహరించే అవకాశమే లేదు. వ్యక్తుల గొంతుల స్వరాన్ని బట్టి, వారి మాటల్లో మాధుర్యం తొణికిసలాడవచ్చు, కానీ ఆ స్వరాల్లోని సారం మాత్రం ప్రభుత్వ ఆర్థిక నీతినే ప్రతిధ్వనిస్తుంది. ఆ కుర్చీలో 1990 దశకం నుంచి శ్రీ యస్. వెంకటరామన్, డా. సి.రంగరాజన్, డా. బిమాల్ జలాన్, డా. వై.వి.రెడ్డి, డా.డి.సుబ్బారావు, ప్రస్తుతం డా. రంఘురాం జి. రాజన్ ఎవరు కూర్చొన్నా ఒకటే గొంతు వినిపిస్తారు, ప్రభుత్వ ఆర్థిక నీతినే వల్లెవేస్తారు.
వస్తూత్ఫత్తి, ఉపాథి కల్పన, దేశ ప్రజల జీవన ప్రమాణాలతో ఏ విధంగాను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సంబంధం లేని 'షేర్ మార్కెట్ సెంటిమెంట్' మీద ప్రధానంగా ఆధారపడి కృత్రిమ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం వైపు ప్రభుత్వాలు పరుగులు తీస్తున్నంత కాలం ఆర్థిక సంక్షోభాలు తప్పవు, ఆర్థిక నేరస్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగక మానదు. ఈ విధానాల పర్యవసానంగా కొందరు అమాంతం వందలు, వేలు, లక్షల కోట్లకు పడగలెత్తి నూతన సంపన్న వర్గంగా ఆవిర్భవిస్తున్నారు. అదే సందర్భంలో దివాలా తీసే వారిని చూస్తున్నాం. వ్యక్తులే కాదు, సంస్థలు కూడా. ఏక కాలంలో సంభవిస్తున్న రెండు పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం.
ఉదా: ఒక వ్యక్తి ఒక పరిశ్రమను నెలకొల్పి, వస్తూత్ఫత్తి చేసి, వస్తువులను అమ్ముకొని వచ్చే లాభాన్ని అనుభవించడం ఒక తరహా పెట్టుబడిదారీ ఆర్థిక నీతి. నేడు తద్భిన్నంగా పెట్టుబడిదారి వ్యవస్థ చరిత్ర గమనాన్ని చూస్తున్నాం. పరిశ్రమను స్థాపించి, షేర్ల ముఖ విలువను వందలు, వేలు రెట్లు పెంచి షేర్ మార్కెట్లో అమ్మడం ద్వారా సంపదను పోగేసుకోవడం, లేదా ఆర్థిక సంస్థలు మరియు బ్యాంకులకు ఆ పరిశ్రమను తాకట్టు పెట్టి దాని విలువకు మించి అనేక రెట్లు అధికంగా రుణం తీసుకొని, ఆ నిథులను దారి మళ్ళించి బ్యాంకులకు టోపి పెట్టడం ద్వారా సంపన్నులుగా మారడం. రాజకీయ నాయకత్వం, ఉద్యోగ వ్యవస్థ, కార్పోరేట్ సంస్థలు/ పారిశ్రామిక వేత్తల అపవిత్ర కలయికతోనే ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఈ తంతుకు ఆస్కారం మెండుగా ఉంటుంది. ఇలా నూతన దోపిడి విధానాలను, ఎత్తుగడలను అన్వేషిస్తున్న ఘరానా పారిశ్రామికవేత్తలే ఆర్థిక వ్యవస్థ పునాదులను పెకలించేస్తున్నారు.
హర్షద్ మెహతా మరొక అడుగు ముందుకేసి పరిశ్రమలను నెలకొల్పకుండానే, నెలకొల్పినట్లు రికార్డులు సృష్టించి, బ్యాంకులను మోసం చేసి, స్టాక్ మార్కెట్ లో సంస్థల పేర్లు నమోదు చేసి, షేర్లు అమ్మి, భారీ కుంభకోణానికి బరితెగించి పాల్పడిన ఉదంతం బహిర్గతమైన తరువాత అయినా కళ్ళు తెరవలేదు కదా! అంటే అర్థమేంటి? పర్యవసానంగా వ్యవస్థ మొత్తాన్ని ఆర్థిక సంక్షోభాల ఊబిలోకి బలవంతంగా ప్రభుత్వాలే నెట్టాయి.
వార్షిక బడ్జెట్స్ ను రూపొందించడం మొదలు ఆర్థికాంశాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా విధాన నిర్ణేతల మెదళ్ళలో మొదటగా మెదిలేది 'స్టాక్ ఎక్సేంజ్'(షేర్ల అమ్మకం, కొనుగోళ్ళ వ్యవహారాలను నిర్వహించే లేదా నియంత్రించే దుకాణాలు, మరోలా చెప్పాలంటే జూద గృహాలు)లు ఎలా స్పందిస్తాయోనన్న ఆలోచనే. రియల్ ఎకానమీకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కృత్రిమ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ప్రభుత్వాలు అగ్రపీఠం వేశాయో, అప్పటి నుంచే మన ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి నడక సాగిస్తున్నది.
సంపద సృష్టించబడడం లేదా అంటే సృష్టించబడుతున్నది. స్థూల జాతీయోత్ఫత్తి పెరగడం లేదా అంటే పెరుగుతున్నది. తలసరి ఆదాయం పెరుగుతున్నది. కానీ, సృష్టించిన సంపదలో ప్రజల వాటా ఎంత? ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా అంటే లేదు. ఉపాథి కల్పన ఎండమావిగా తయారయ్యింది. ఉపాథి కల్పన ఎక్కడన్నా ఉన్నది అంటే ఎలాంటి సామాజిక భద్రతలేని అసంఘటిత రంగానికే పరిమితమయ్యింది. ప్రభుత్వం రంగం యొక్క పిక నులిమేస్తున్నారు. సంఘటిత రంగం కుచించుకపోతున్నది.
ఈ నేపథ్యం నుండి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ ఆలోచనలను, ఆర్థిక నీతిని, ఆచరణను పరిశీలించాల్సి ఉంటుంది. గడచిన మూడు దశాబ్ధాలుగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వహించిన వారందరూ ఐయంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఆలోచనలను పుణికి పుచ్చుకొన్న వారే. మార్కెట్ శక్తులకు ఊడిగం చేసే ఆర్థిక నీతికి కట్టుబడిన వారే. అందరూ తేనె పూసిన కత్తెల్లాంటి ఆర్థిక వేత్తలే.
బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని చెల్లించని ఘరానా పారిశ్రామికవేత్తల జాబితాను, అందులోనూ రు.500 కోట్లకు పైగా మొండి బాకీదారుల జాబితాను బహిరంగ పరచాలని సుప్రీంకోర్టు చాలా రోజుల క్రితమే సూచించింది. మళ్ళీ తాజాగా ప్రజా ప్రయోజనాల కేసు విచారణలో భాగంగా ఎందుకు బహిరంగపరచరని రిజర్వ్ బ్యాంకును నిగ్గదీసింది. గవర్నర్ రఘురాం రాజన్ సన్నాయి నొక్కులు నొక్కుతూ 'విల్ పుల్ డిపాల్టర్స్' కు, నిజాయితీతో పరిశ్రమను నెలకొల్పి లేదా వ్యాపారం చేసి నష్టపోయి దివాలాతీసి అప్పు చెల్లించని వారిని వేరు వేరుగా చూడాలని, ఉద్ధేశ పూర్వకంగా బ్యాంకులను మోసం చేసిన వ్యక్తుల పేర్లను బహిరంగపరచడానికి అభ్యంతరం లేదని, కానీ నిజాయితీతో వ్యాపారం/సంస్థను నెలకొల్పి దివాలా తీసిన మొండి బకాయిదారులుగా ఉన్న వారి పేర్లను వెల్లడిస్తే మన ఆర్థిక వ్యవస్థే కుప్ప కూలుతుందని సెలవిచ్చారు. పోనీ, ఆయన అంగీకరించిన మేరకైనా 'విల్ పుల్ డిపాల్టర్స్' జాబితానైనా బహిరంగపరిచారా! అంటే ఆ పని చేయలేదు. ఒక సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు అందించారంట. బ్యాంకులను మోసం చేసి, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఆర్థిక నేరస్తుల పేర్లను వెల్లడించడానికి మీనేషాలెందుకు వేయాలి? మన ఆర్థిక వ్యవస్థ అంత బలహీనంగా ఉన్నదా?
2008లో అమెరికాలో సంభవించిన ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేసినా మన దేశం నిలదొక్కుకోగలిగిందని, దానికి కారణం బలంగా వేళ్ళూనుకొని ఉన్న మన బ్యాంకింగ్ వ్యవస్థేనని సగర్వంగా పాలకులు ప్రకటించారు కదా! మరి, ఈ ఆరేడేళ్ళలో ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ అంత బలహీనమై పోయిందా? ఒకవేళ అయితే దానికి బాధ్యులెవరు?
వ్యవసాయం సంక్షోభంలో కూరకపోయి ఉన్నది, రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు, పంట రుణాలు తీసుకొన్న రైతులను మాత్రం బ్యాంకులు అవమానాల పాలు చేస్తూ, ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు కల్పిస్తున్నాయి. చిన్న, మధ్య తరగతి పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వకుండా తిప్పుకొంటారు. ఇచ్చినా అధిక వడ్డీలు చెల్లించుకోవాలి. క్రమం తప్పకుండా చెల్లించాలి. లేదంటే వెంటాడతారు. కానీ, కార్పోరేట్ సంస్థల అధిపతులుగా ఉన్న వారు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని, ఎగ్గొడితే పేర్లను బహిరంగపరచడానికి కూడా వీల్లేదంటున్నారు. ఇదెక్కడి నీతి?
దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా మొండి బాకీలున్నాయని, వడ్డీ మొత్తాలతో కలిపితే ఆ మొత్తం ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. ఎ.ఐ.బి.ఇ.ఎ. లాంటి ఉద్యోగ సంఘాలు గడచిన ఐదారేళ్ళుగా మొండి బాకీదారుల జాబితాను బహిరంగంగా వెల్లడిస్తూనే ఉన్నాయి. వారి ఆస్తులను జప్తు చేయాలని, బాకీలను వసూలు చేసి, ప్రభుత్వ రంగ బ్యాంకులను రక్షించాలని ప్రభుత్వాన్ని, బ్యాంకుల యాజమాన్యాలను పదే పదే డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేసిన ఏ మాత్రం చలనం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రత్యేకించి ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడనే ప్రశ్నించేలా మారిన ఈ సమస్య సుప్రీంకోర్టు తలుపుతట్టింది. కాంగ్రెస్ పాలనా కాలంలో దొంగలు పడ్డారని, నేనొచ్చాక దొంగలు దేశం విడిచి పారిపోతున్నారని సెలవిచ్చిన మోడి గారు, ఇటీవలే రు.9000 కోట్లకుపైగా మొండిబాకీ ఉన్న విజయ్ మాల్యా, ప్రభుత్వ కన్నుగప్పి రాజమార్గంలో దేశం విడిచి పారిపోవడానికి ద్వారాలు తెరిచింది ఎవరు? అంటే సమాధానం ఇవ్వగలిగిన స్థితిలో మోడి ప్రభుత్వం లేదు. దొంగలకు, దోపిడీదారులకు, మోసగాళ్ళకు రక్షణ కవచంగా ప్రభుత్వాలే ఉన్న కాలంలో జీవిస్తున్నాం. చూద్దాం! ఏం జరుగుతుందో!
No comments:
Post a Comment