Monday, April 18, 2016

నీటిపై కెసిఆర్ కొత్త పల్లవి!


మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమై ఒక ఒప్పందాన్ని చేసుకొన్నాక తెలంగాణ శాసనసభలో 'పవర్ పాయింట్ ప్రజెంటేషన్' ద్వారా తెలంగాణ జల దృశ్యాన్ని ఆవిష్కరించారు. శాసనసభ వేదికగా కొన్ని ఆసక్తికరమైన, కీలకమైన అంశాలపై విస్పష్టంగా వ్యాఖ్యలు చేశారు. అటుపై శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పర్యటనకు వెళ్ళి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తో సస్సంబంధాలను కోరుకొంటున్నానని, నీటి సమస్యలపై వివాదాలను కోరుకోవడం లేదని పునరుద్ఘాటించారు. ఆ మేరకు మంచిదే. ఆ వ్యాఖ్యల అంతరార్థాన్ని మాత్రం 'కీడెంచి మేలెంచాలన్న' నానుడిని దృష్టిలో పెట్టుకొని నిశితంగా పరిశీలించాలి. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల పట్ల ఆయన వైఖరి ఎలా ఉన్నది, విభజన తరువాత కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో జలవనరుల సమస్యపై ఆయన వైఖరి ఎలా ఉన్నది, మరీ ప్రత్యేకించి కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నది అన్న అంశాలపై లోతుగా ఆలోచించాలి.
మాకు అందుబాటులో ఉన్న నీళ్ళన్నీ మావే, మేము వినియోగించుకోలేక పోవడంతో క్రిందికి ప్రవహిస్తున్న నీరంతా మీరు స్వేఛ్చగా వాడుకోవచ్చు. సముద్రం పాలయ్యే నీటిని వినియోగించుకోండి, శ్రీకాళహస్తి వరకు తీసుకెళ్ళండని ఎంతో ఉదారంగా సలహా కూడా ఇచ్చారు. మంచిదే. కాకపోతే ఇక్కడ ఒక్క విషయాన్ని ఆలోచించాలి.
గోదావరిలో పుష్కలంగా నీళ్ళున్నాయి, సముద్రం పాలౌతున్నాయన్నది అందరూ అంగీకరిస్తున్న నిర్వివాదాంశం. ఆ నీటిని ఒక్క పోలవరం ప్రాజెక్టు ద్వారానే పూర్తిగా వినియోగించుకోవడం సాధ్యం కాదు. కాబట్టే, దుమ్మగూడెం - నాగార్జునసాగర్ టేల్ పాండ్ పథకాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ పూనుకొన్నది. ఆ ప్రాజెక్టును నేడు తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాకే కుదించి వేసింది. ఫలితంగా దాదాపు 165 టియంసిల గోదావరి నీటిని ఈ పథకం ద్వారా తరలించి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తూ, సాగర్ టేల్ పాండ్ కు 100 టియంసిల వరకు నీటిని తరలించాలనే లక్ష్యానికి ఎందుకు గండికొడుతున్నట్టు.
ఆ ప్రాజెక్టును నిర్మిస్తే, కృష్ణా జలాలను ఆదా చేసుకొని, దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ జిల్లాలో వరద నీటిపై ఆధారపడి నిర్మించబడుతున్న నెట్టంపాడు, కల్వకుర్తి, నల్లగొండ జిల్లాలో నిర్మించబడిన మాధవరెడ్డి ఎత్తిపోతల పథకానికి, నిర్మాణంలో ఉన్న యస్.యల్.బి.సి. నీటి అవసరాలు తీర్చవచ్చు కదా!
అలాగే మరొక మంచి మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు కూడా మన తెలుగు వాళ్ళే, వాళ్ళ నీటి కష్టాలు తీరితే సంతోషిస్తామని కెసిఆర్ గారన్నారు. మరి, కరువు కాటకాలతో విలవిల్లాడిపోతున్న రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, హంద్రీ -నీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీటిని అందించడం ద్వారా ఆ వెనుకబడ్డ ప్రాంతాల ప్రజల గొంతులు తడపడానికి కూడా ఈ పథకం తోడ్పడుతుంది కదా!
ఎందుకు, దుమ్మగూడెం - సాగర్ టేల్ పాండ్ పథకాన్ని అటకెక్కించారు. నిథుల సమస్య అయితే, ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నదీ జలాల అనుసంధాన పథకంలో అంతర్భాగంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్మించమని రెండు తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలు ఉమ్మడిగా కోరవచ్చు కదా! పైపెచ్చు ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీ పరివాహక రాష్ట్రాలన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రయోజనం కలుగుతుంది. కారణం, కృష్ణా నదీ జలాలపై ఉన్న తీవ్రమైన వత్తిడికి ఉపశమనం కలుగుతుంది. చెన్నయ్ మహానగరానికి త్రాగునీటి కోసం సరఫరా చేయాల్సిన 15 టియంసిల తరలింపుకు వెసులుబాటు వస్తుంది. బహుళ ప్రయోజనాలున్న దుమ్మగూడెం- సాగర్ టేల్ పాండ్ పథకం నిర్మాణంపై ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరిస్తేనే సముద్రం పాలౌతున్న గోదావరి నీటిని మరింత వినియోగంలోకి తెచ్చి దక్షిణ తెలంగాణ, రాయలసీమ, ప్రకాశం జిల్లా లాంటి కరువు పీడిత ప్రాంతాల నీటి అవసరాలను తీర్చడానికి దోహదపడిన వారౌతారు.
2. నదీ జలాల వినియోగ అంశంపై పై రాష్ట్రాలతో తగాదా పడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కెసిఆర్ తేల్చేశారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ప్రాజెక్టులు, ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు మొత్తం 450కి పైగా నిర్మించుకొని క్రిందికి నీరు ప్రవహించకుండా మొత్తం నీటిని వాడేసుకొంటున్నారని, ఇప్పుడు వారితో తగాదా పెట్టుకొని లాభం లేదని శసబిసలు లేకుండా ప్రకటించారు. అంటే బాబ్లీ వంటి ప్రాజెక్టులను మహారాష్ట్ర నిర్మించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు రాకుండా వాడేసుకొంటున్నా మనమేం చేయలేమని చేతులెత్తేశారు.
ఆదే సందర్భంలో గోదావరి ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, వాటి ఉపనదుల ద్వారా తెలంగాణాలో లభించే నీటిని సంపూర్ణంగా వాడుకోవడానికి నిర్మాణంలో ఉన్న పథకాల ఆకృతులను మార్చి నిర్మిస్తామని, కొత్త పథకాలను చేపడతామని సెలవిచ్చారు. అందులో భాగంగానే ప్రాణహిత - చేవెళ్ళ ఎత్తిపోతల పథకం ఆకృతి మార్చి రెండుగా విడగొట్టి కాళేశ్వరం వద్ద మరొక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని తలపెట్టారు.
అలాగే ఉమ్మడి ప్రభుత్వ కాలంలో ఇందిర, రాజీవ్(దుమ్మగూడెం) ఎత్తిపోతల పథకాల ఆకృతి మార్చి ఖమ్మం జిల్లాకు ఎక్కువ లబ్ధి చేకూర్చే లక్ష్యంతో శ్రీరామా, భక్తరామదాసు పథకాల నిర్మాణానికి పూనుకొన్నారు. ఇంత వరకు అభ్యంతర పెట్టాల్సిందేమీ లేదు. గోదావరి జలాలను వీలైనంత ఎక్కువగా సద్వినియోగం చేసి తెలంగాణ మెట్ట ప్రాంతాలను సమగ్రాభివృద్ధి వైపు అడుగులు వేయిస్తే మనస్ఫూర్తిగా అభినందించవచ్చు.
గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుల వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు వాటిల్లే నష్టం పెద్దగా ఉండదు. కారణం భద్రాచలం క్రింది భాగంలో గోదావరిలో వచ్చి కలిసే శబరి ఉపనది ద్వారా లభించే నీరు ఎలాంటి అవరోధం లేకుండా నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు చేరుతుంది. గోదావరి జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి1480 టియంసిల నికరజలాల వినియోగానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. 600 టియంసిలకుపైగా నికర జలాలతో పాటు మొత్తం 3,000 టియంసిలకుపైగా ప్రతి ఏడాది సముద్రం పాలౌతున్నాయి. కాబట్టి దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు గోదావరి జలాల వినియోగంలో నష్టం వాటిల్లే అవకాశం లేదన్నది నిపుణుల మాట.
3. నీటి సమస్య చాలా జఠిలమైనది, సంక్లిష్టమైనది, అత్యంత వివాదాస్పదమైనది. గోదావరి జలాల వినియోగానికి సంబంధించినంత వరకు పెద్ద సమస్యల్లేవు. కానీ, క్రిష్ణా నదీ జలాల వినియోగంపై అప్పుడప్పుడూ యుద్ధ వాతావరణ నెలకొంటుండడాన్ని చూస్తూనే ఉన్నాం కదా!
ఉమ్మడి రాష్ట్రంలో రాజోలి బండ మళ్ళింపు పథకం(ఆర్డియస్) వద్ద మహబూబ్ నగర్, కర్నూలు జిల్లా ప్రజలు సిగ పట్లు పట్టుకొనే వారు. రాష్ట్ర విభజనానంతరం శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాల వద్ద బాబా బాహీ అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు తలపడ్డాయి. క్రిష్ణా నదీ జలాల వినియోగంలో తలెత్తిన, తలెత్తుతున్న, భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలు, వివాదాలు తీవ్ర రూపం దాల్చే అవకాశాలే మెండుగా ఉన్నాయన్నది నిర్వివాదాంశం.
క్రిష్ణా నదీ జలాల వినియోగంపై నెలకొన్న వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ బ్రజేష్ కుమార్ నేతృత్వంలో రెండవ కృష్ణా జలాల వివాద పరిష్కారాల ట్రిబ్యునల్ ను నియమించింది. విచారణానంతరం ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తెలుగు ప్రజలకు శరాఘాతంగా తగిలింది. న్యాయం చేయమని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. కేసు విచారణలో ఉన్నది. ఆ కారణంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పెండింగ్ లో ఉన్నది.
మరొక వైపు రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారు. పర్యవసానంగా క్రిష్ణా జలాల వినియోగం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మరింత జఠిలంగా, సంక్లిష్టంగా, వివాదాస్పదంగా పరిణమించింది. దీని పరిష్కారం బాధ్యతను కూడా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కే కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దానికున్న గడువును కూడా రెండేళ్ళు పొడిగించింది. ఆ విచారణ మరొక వైపు జరుగుతున్నది.
విభజన చట్టం మేరకు నెలకొల్పబడిన క్రిష్ణా నది నిర్వహణ బోర్డు పూర్తి స్థాయిలో తన బాధ్యతలను నిర్వర్తించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుండి 90 టియంసిల నీటి తరలింపుకు వీలుగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, అలాగే డిండి ఎత్తిపోతల పథకాన్ని 30 టియంసిల సామర్థ్యంతోను, హైదరాబాదు నగరానికి మరో 20 టియంసిల త్రాగు నీటి పథకాన్ని యుద్ధ ప్రాతిపదికపై నిర్మించడానికి కార్యాచరణకు పూనుకొన్నది.
క్రిష్ణా నది మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణాన్ని చేపట్టిన నెట్టంపాడు, కల్వకుర్తి, యస్.యల్.బి.సి., మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం, హంద్రీ - నీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులకే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల పద్దులో కూడా నీటి కేటాయింపులు చేయలేదు. ఈ పూర్వరంగంలో నిర్మించ తలపేట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, డిండి ఎత్తిపోతలకు ఆంధ్రప్రదేశ్ నుండి వ్యతిరేకత వ్యక్తం కాకూండా చేయడానికే కెసిఆర్ మంచి మాటలు మాట్లాడుతున్నట్లు కనబడుతున్నది.
జల వనరుల వినియోగంలో ఒక నూతన తాత్విక చింతనను కెసిఆర్ ప్రవేశ పెట్టినట్లు అనిపిస్తున్నది. పై రాష్ట్రాలు ఏం చేసినా ప్రశ్నించి ప్రయోజనం లేదన్నదే దాని అంతరార్థం. ఇది ప్రమాదకరమైనది. నదీ జలాల సమస్యలపై ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం. వాటికి లోబడే నదీ పరివాహక ప్రాంతాల్లోని రాష్ట్రాలు వ్యవహరించక తప్పదు. ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే తీరులో ఏ రాష్ట్రం వ్యవహరించినా వివాదాలకు ఆజ్యం పోసినట్లే అవుతుంది. అలాంటి వైఖరి ఏ మాత్రం సమర్థనీయం కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సస్సంబంధాలకు విఘాతం కలుగుతుంది.
ప్రజలకు ప్రాణాధారమైన నీటి సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా, విజ్ఞతతో వ్యవహరించడం తక్షణావసరం

No comments:

Post a Comment