Friday, April 15, 2016

ఇసుక 'ఉచిత పథకం' లాభసాటి వ్యాపారం!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం అమలు అనుభవం ఏం చెబుతున్నది? ప్రజలేమనుకొంటున్నారు? ఉచిత ఇసుక పథకం సత్ఫలితాలిస్తున్నదా! దుష్పలితాలకు బాటలు వేస్తున్నదా? కడప జిల్లాలో 'ఎర్రచందనం మాఫియా' ఇప్పుడు ఇసుక మీద కన్నేసినట్లు వార్తలొస్తున్నాయి. లారీ ఇసుక ధర తిరుపతిలో రు.25,000 ఉంటే బెంగుళూరులో రు.60,000 పైగా పలుకుతున్నదట. అవకాశాన్ని సొమ్ము చేసుకొని కోట్లకు పడగలెత్తాలని కొత్త లారీలను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మకై అక్రమ రవాణా చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. మరి, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయండని చేసిన ప్రకటన 'ఇసుక మాఫియా'కు కళ్ళెం వెస్తుందా!
ఎండలు మండి పోతున్నాయి. రక్షిత మంచి నీటి లభ్యత ఎండ మావిగా మారింది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఒకప్పుడు నదీ పరివాహక ప్రాంతాలలో జనావాసాలు ఏర్పాటు చేసుకొనే వారని, అక్కడే నాగరికత అభివృద్ధి చెందేదని చదువుకొన్నాం. కాలం మారి పోయింది. నదుల ప్రక్కనున్న గ్రామాల్లో త్రాగు నీరు కూడా లభించని దుర్గతి ఎదురయ్యిందని నేడు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతాల్లోని జనఘోష ఇది.
కరువుకు ఆట పట్టు రాయలసీమ. కరువుల్లో పుట్టి కరువులతో సహజీవనం చేసి, కరువుల్లోనే కడతేరి పోతున్న దుర్భర జీవితాలు ఆ ప్రాంత వాసులది. వర్షం రాక పోకలు అంతుపట్టని అంశం. పెన్నా నది పారేదెప్పుడో! భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అడవులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ మార్పుల దుష్ప్రభావం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది.
ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాను నియంత్రించలేని ప్రభుత్వం 'ఇసుకను ఉచిత పథకాల' జాబితాలో చేర్చింది. మార్కెట్ లో ఖరీదైన సరుకుగా ఇసుకకు డిమాండ్ ఉన్నది. నిర్ధేశించిన ప్రాంతాలలోని 'రీచ్' లలోనే ఇసుకను తవ్వి తీసుకెళ్ళడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. సహజవనరులను కొల్లగొట్టి ధనార్జన చేయాలని కక్కుర్తి పడే వారికి ఇది తలకెక్కుతుందా! చెప్పండి.
పెన్నా నది, దాని ఉప నది చెయ్యేరు నుండి ఇష్టారాజ్యంగా అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల నుండి అడ్డగోలుగా తవ్వి ఇసుకను తీసుకెళ్ళి పోతున్నారు. పరిస్థితి ఎలా తయారయ్యింది అంటే నదీకి సమీపంలోని గ్రామాల్లోని కొందరు కొత్త టిప్పర్లు,ట్రాక్టర్లను కొనుగోలు చేసి ఇసుక వ్యాపారాన్ని మొదలు పెట్టారట. 'ఎర్ర మాఫియా' కొత్త లారీలను ఫైనాన్స్ సంస్థల ద్వారా కొనుగోలు చేసి, అక్రమ రవాణా సందర్భంలో దొరికిపోతే వాటిని రోర్డు మీదే వదిలేసిపోయే వ్యూహాలు కూడా రూపొందించుకొన్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతగా ఇసుక వ్యాపారం చేస్తూ అక్రమ సంపాదనకు రాచబాట వేసుకొన్నారు. ప్రభుత్వం అనుమతించిన 'రీచ్' ల నుండి, అనుమతిలేని ప్రాంతాల నుండి కూడా యదేఛ్చగా ఇసుకను తరలిస్తున్నారు. అడ్డుపెట్టే వారే లేరు. రెవెన్యూ అధికారులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ప్రభుత్వ అనుమతిలేని ప్రాంతాల నుండి ఇసుక తవ్వి తీసుకెళ్ళడం నేరం కదా! ఎందుకు నిరోధించరని ఎవరైనా ప్రశ్నిస్తే మాకెందుకండి ఆ తలనొప్పి, ముఖ్యమంత్రే స్వయంగా బహిరంగంగా ప్రకటించారు కదా! అవసరమైతే అడ్దొచ్చిన అధికారులను కొట్టి అయినా ఇసుక తీసుకెళ్ళండి, నేను చూసుకొంటానని. దాన్ని అవకాశంగా మలుచుకొని ఇసుక వ్యాపారం జోరుగా సాగుతున్నది.
పెన్నా నది నుండి ఇసుక తోడేస్తున్నారు. సహజ వనరైన ఇసుక త్రవ్వకాల వల్ల స్థానిక సంస్థలకు రాయల్టీ ద్వారా కొంత ఆదాయం వచ్చేది. దానికి గండి పడింది. ఒకవైపున ప్రభుత్వానికొచ్చే ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా ఉచిత పథకాన్ని అమలు చేయడానికి, సహజవనరైన ఇసుకను చట్టానికి మరియు ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి అనుమతించడానికి ప్రభుత్వ ఖజానా నుండి ఎదురు ఖర్చు పెట్టాల్సిన అనివార్య పరిస్థితి. పోనీ, అవినీతి తగ్గిందా అంటే పెరిగిందంటున్నారు. సామాన్య ప్రజలకు జరిగిన మేలెంత అంటే చెప్పలేని పరిస్థితి. కాంట్రాక్టర్లు, బిల్డర్లు రేట్లు తగ్గించారా అంటే అదీ లేదు. ఇహ! ప్రజలకు ఈ ఉచిత ఇసుక పథకం ద్వారా జరిగిన ప్రయోజనమేంటి?
జిల్లా ప్రజలు సొంత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్ళడం వరకు పరిమితం కాలేదు. ఇసుక రాష్ట్ర సరిహద్దు దాట కూడదని ప్రభుత్వం హుకుం జారీ చేశారు. కానీ, అటు చెన్నయ్, ఇటు బెంగుళూరు, ప్రక్కనున్న కర్నూలు జిల్లా పట్టణ ప్రాంతాలకు నిరంతరాయంగా ఇసుకను అక్రమంగా రవాణా చేసి వినియోగదారులకు, కాంట్రాక్టర్లకు, భవన నిర్మాణ సంస్థలకు, దళారులకు ఆ రోజున్న డిమాండును బట్టి అమ్మేసి సొమ్ము చేసుకొంటున్నారు. డిమాండు పెద్దగా లేని రోజు ట్రాక్టర్ బాడుగ, కూలీల ఖర్చు వచ్చినా పరవాలేదన్న భావనతో దళారులకు అమ్మేసుకొని ఇంటి దారి పడుతున్నారు. దళారులు, వ్యాపారస్తులు ఇసుకను కొని నిల్వ చేసి, డిమాండు వచ్చినప్పుడు అమ్మి లాభాలు గడిస్తున్నారు. ఇదీ జరుగుతున్న తంతు.
నదీ గర్భం మరియు నది పొడవునా ఇసుకను త్రవ్వి తీసుకెళ్ళిపోవడం పర్యవసానంగా సంబవించే దుష్పలితాలపై ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు మరింత అడుగంటి పోతాయని, త్రాగు నీరు కూడా లభించని దుస్థితి నెలకొన్నదని, పర్యావరణం దెబ్బతింటున్నదని ఆవేదన చెందుతున్నారు. రాజంపేట సమీపంలో చెయ్యేరు ఆధారంగా నిర్మించబడిన ఓబిలి రక్షిత మంచి నీటి పథకం ఒట్టి పోయిందన్న వార్తలొచ్చాయి.
గండికోట జలాశయం, మైలవరం జలాశయం, ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద నుండి ఇసుకను తరలించుకుపోతే అక్కడ నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, వర్షం పడ్డప్పుడైనా కనీసం నీటి నిల్వ పెరుగుతుంది కదా! అలా చేయకుండా నది పొడవునా అనువైన అన్ని చోట్ల నుండి తరలించుకపోతున్నారు. దీని వల్ల భవిష్యత్తులో భూగర్భ జలాలు ఇంకా పతనమైపోతాయన్న భయాందోళనలకు సామాన్య ప్రజలు గురౌతున్నారు. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాపితంగా ఈ పథకం లోపభూయిష్టంగా అమలౌతున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రభుత్వం ప్రజల ఆందోళనను అర్థం చేసుకొని, తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలి. భూగర్భజలాల పెంపుదలకు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన కార్యాచరణను అమలు చేయాల్సిన బాధ్యతను గుర్తించాలి.

No comments:

Post a Comment