Tuesday, June 28, 2011

మథనమే తప్ప మేధ లేదు

ఆంధ్రజ్యోతి దినపత్రిక జూన్ 28, 2011

సైద్ధాంతిక, ఆర్థిక, రాజకీయాంశాలపై సద్విమర్శలను ఆహ్వానించాలి. విమర్శకులు నమ్రత, విజ్ఞత ప్రదర్శించాలి. తద్భిన్నంగా, సోషలిస్టు భావజాలం, కమ్యూనిస్టులపై విషం వెళ్ళగక్కడమే లక్ష్యంగా జాహ్నవి వ్యాసరచనా వ్యాసంగం సాగుతున్నది. ఆయనకున్నంత తెలివి తేటలు మరొకరికి లేకపోవచ్చు.

అందుకే కాబోలు సోషలిస్టు భావజాలాన్ని తాలిబాన్‌ల భావజాలంతో పోల్చ గలిగారు. పెద్ద సాహసమే చేయగలిగారు. 'వేల సంవత్సరాల క్రితం రాసిన మత గ్రంథాల ఆధారంగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, సమాజాన్ని మెడలు వంచి నడిపించాలని కోరుకునేవారు కొందరు; అలా తాలిబాన్‌ల ఆధిపత్యంలో నడిచిన అఫ్ఘానిస్తాన్ కడు పేదరికంతో, అవిద్యతో నరకప్రాయంగా తయారైన విషయం కళ్ళముందు కనిపించినా వారి మతస్వప్నం వీడదు.

అలాగే అహేతుకం, అశాస్త్రీయం అని తేలినా, తెలిసినా కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన సోషలిస్టు పవిత్ర గ్రంథాల ఆధారంగా కార్మిక వర్గంపేరిట నియంతృత్వాన్ని నడపాలని కోరుకునేవారు మరి కొందరు. ఇద్దరూ అధర్మవాదులే, ఇద్దరికీ ఆదర్శం నియంతృత్వమే. ఇద్దరి స్వభావం ఒక్కటే, కానీ ఇద్దరూ బద్ద శత్రువులు. ఇద్దరూ వ్యక్తి స్వేచ్ఛకు, వ్యక్తి వికాసానికి శాశ్వత శత్రువులు'- జాహ్నవి రాసిన ఈ మాటలను చదివాక ఆయనెంత కూపస్థ మండూకమో అనిపించింది.

'బురఖా ధరించడం మంచిదో, కాదో! వేసుకోకుండా ఉండే స్వేచ్ఛ, ఏ స్త్ర్రీకి ఉండదు. స్త్రీలు ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళకూడదు' అని చక్కగానే రాశారు. కానీ, ఆ స్వేచ్ఛను కల్పించే సోషలిస్టు భావజాలాన్ని, మత మౌఢ్యాన్ని పెంచి పోషించిన తాలిబాన్‌ల భావజాలానికి తేడా లేదని చెప్పడం ద్వారా తన మూర్ఖత్వాన్ని మాత్రం నగ్నంగా బయపెట్టుకున్నారని చెప్పక తప్పదు. సోషలిజాన్ని, మత మౌఢ్యాన్ని ఒకే గాటన కట్టిన మహా మేధావి జాహ్నవి.

అఫ్ఘాన్‌లో 'ఏప్రిల్ విప్లవం' ద్వారా కమ్యూనిస్టుల భాగస్వామ్యంతో అధికారంలోకి వచ్చిన నజీబుల్లా నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో యువతులుస్వేచ్ఛగా, బురఖాలు లేకుండా, వారికి నచ్చిన బట్టలు ధరించి, కళాశాలలకు వెళ్ళి విద్య నభ్యసించినడం నేను కళ్ళారా చూశాను. 1988 ఫిబ్రవరి 11-13 తేదీలలో కాబూల్‌లో 'విద్య, అభివృద్ధి, సమాజం-విద్యార్థుల దృక్పథం' అన్న అంశంపై ఆసియా ప్రాంత విద్యార్థుల సమాచార కేంద్రం, అఫ్ఘానిస్తాన్ ప్రజాతంత్ర యువజనసంఘం సంయుక్తంగా నిర్వహించిన ఒక సదస్సులో నేను పాల్గొన్నాను.

ఆ సందర్భంగా ఆ వ్యవస్థను పరిశీలించే అవకాశం నాకు లభించింది. విద్యా ఉద్యోగాలు, సమాజాభివృద్ధిలో పురుషులతో పోటీ పడాలనే తపనతో పాలీటెక్నిక్ మొదలుకొని అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థినులు విద్యనభ్యసించడం చూశాను. మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం వెలుగులో 'జాతీయ పునర్నిర్మాణ విధానాన్ని' రూపొందించుకొని అమలు చేయడం ద్వారా మంచి సత్ఫలితాలను సాధిస్తూ నజీబుల్లా ప్రభుత్వం ఆ ప్రగతికి బాటవేసింది. తరువాత అమెరికన్ సామ్రాజ్యవాదుల అండదండలతో నజీబుల్లా ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చిన తాలిబాన్‌లు అఫ్ఘాన్‌ను నేటి దుస్థితికి దిగజార్చారు.

ఈ నిప్పులాంటి నిజాన్ని గుర్తించగలిగిన చైతన్యం జాహ్నవికి లేనట్లుంది. 'మరి వ్యక్తి స్వేచ్ఛ ఏ పాటిదో ఊహించుకోగలం' అని నొక్కి వక్కాణించిన జాహ్నవికి ఏ తరహా స్వేచ్ఛ కావాలో! వ్యవస్థ కావాలో! నిర్ణయించుకునే స్వేచ్ఛ మాత్రం ఉంది. అంతే కాని సోషలిస్టు భావజాలంపై అవగాహనారాహిత్యంతో కూడిన అర్థరహితమైన కువిమర్శలకు పాల్పడడం తగనిపని.

అమానుషమైన దోపిడీకి, అసమానతలకు నిలయమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు ఊడిగం చేసే మనస్తత్వంతో జాహ్నవి ఉద్దేశపూర్వకంగానే సైద్ధాంతిక ఘర్షణకు తెరలేపుతున్నారు. తద్వారా సోషలిస్టు భావజాలానికి ప్రభావితులైన శ్రామిక ప్రజానీకంలో గందరగోళాన్ని, అపనమ్మకాన్ని కల్గించడానికి పూనుకున్నారు. ఆ దుర్భుద్దితోనే పుంఖానుపుంఖాలుగా అశాస్త్రీయమైన భావాలను తన వ్యాసాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

విజ్ఞానాధార వ్యవస్థ ప్రారంభదశలో నేడు మనం ఉన్నాం. మేధో సంపత్తిపై యాజమాన్య హక్కు, దాన్ని వినియోగించుకొనే సామర్థ్యంపైన ఆధారపడి సంపద సృష్టిలో దాని పాత్ర ఇనుమడిస్తుంది. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థలో భూమే ప్రధానమైన ఉత్పత్తి సాధనం. తరువాత పారిశ్రామిక ఆధారిత ఆర్థిక వ్యవస్థలో భూమితో పాటు పరిశ్రమలు ప్రధానమైన ఉత్పత్తి సాధనాలుగా ఉన్నాయి.

ఇప్పుడు పురోగమిస్తున్న విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థలో మేధో సంపత్తి ఉత్పత్తి శక్తుల అభివృద్ధిలో అంతర్భాగమే. భూమిపై హక్కులేని వ్యవసాయ కూలి ఎంత నైపుణ్యంతో ఆరుగాలం పనిచేసినా భూస్వామి కాలేడు. పారిశ్రామిక కార్మికుడు వృత్తి నైపుణ్యంతో జీవితకాలం ఒళ్లు గుల్ల చేసుకొని శ్రమించినా చిన్న పరిశ్రమకు కూడా యజమాని కాలేడు. మేధో కార్మికులు చేతల కంటే మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే తేడా. కాకపోతే భౌతిక శ్రమకు, మేధో శ్రమకు విలువ కట్టడంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు కన్పించవచ్చు.

'ఈ వ్యవస్థలో ఏ స్థాయి వారయినా యజమాని కావచ్చు. జీతానికి పనిచేసే వారైనా కావచ్చు. అది వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడిఉంటుందే తప్ప అసహాయత కాదు' అన్న గొప్ప సత్యాన్ని జాహ్నవి వెల్లడించారు. వివిధరంగాలలో చరిత్ర పుటలకెక్కిన ప్రఖ్యాత మేధావులు, నోబెల్ గ్రహీతలైన ప్రముఖ ఆర్థికవేత్తలు, మేధా సంపన్నులు కుబేరులు కాలేదు. మన ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఇద్దరు ఏ మేధా సంపత్తితో ప్రపంచ కుబేరులలో నాల్గవ, ఐదవ స్థానానికి ఎగబాకగలిగారో జాహ్నవి హేతుబద్ధంగా వివరించగలరా? 'రైతైనా, రాక్‌ఫెల్లరైనా ఉత్పత్తి చేయాలంటే మేధస్సు కావాలి, స్వలాభాపేక్ష ఉండాలి, చెయ్యనిచ్చే స్వేచ్ఛ ఉండాలి. వీటిలోఏదీ లేకున్నా, ఉత్పత్తి జరగదు' అని జాహ్నవి అన్నారు.

మరి ఇప్పుడు ఎవరికి ఏది అడ్డుగా ఉన్నదో కూడా సెలవీయండి. అలాగే రైతన్నలు వారికున్న మెళకులవలన్నిటినీ వినియోగించి పగలనక, రాత్రనక ఆరుగాలం పనిచేసినా వ్యవసాయం జూదంగా మారిపోవడంతో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఏ ఒక్క రైతు అయినా కుబేరుడుగా మారిన చరిత్ర ఉందా? కార్పొరేట్ అధిపతులు ఆత్మహత్యలు చేసుకోకపోగా జాతీయ బ్యాంకులను ముంచి తాము మాత్రం కుబేరులుగా అవతరిస్తున్నారు. దేశాన్ని, జనాన్నినిండా ముంచుతున్నారు. ఇందులో ఉన్న మేధో సంపన్నమైన మర్మమేంటో జాహ్నవికే బోధపడాలి.

'లేని వర్గాలను సృజించి, లేకి భాషలో వాళ్ళ మధ్య సంఘర్షణ, నిస్పృహల విషం చిలకరించే దోపిడీదారులు ఇంకెవరు?' అని తనకున్న 'లేకి'తనాన్ని, మానసిక వర్గస్వభావాన్ని, శ్రామిక వర్గ, కమ్యూనిస్టు బద్ధ వ్యతిరేకతను జాహ్నవి నిస్సిగ్గుగా వెల్లడించుకున్నారు. ఇందుకు ఆయనను అభినందించాల్సిందే. అందరికీ అన్నం పెట్టే రైతుకు తక్కువ వడ్డీకి పంటరుణాలు ఇచ్చినా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కాస్త రుణాలు మాఫీచేసినా, ఎరువులపైన, క్రిమిసంహారక మందులపైన, హైబ్రిడ్ విత్తనాలపైన ప్రభుత్వం రాయితీలు వగైరా సహాయం, సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని ఆదుకోవడానికి ఉచిత విద్యుత్తు లాంటి పథకాలను అమలు చేసినా ఆయనకు చిర్రెత్తుకొస్తుంది.

పేదరికం నిర్మూలనకు, ఆహార భద్రతకు, సామాజిక సంక్షేమానికి ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తే సహించలేరు. ఎప్పుడొస్తుందో తెలియని ఆహార భద్రతా చట్టానికి, రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకపోవడానికి లేని లింకు పెట్టి జాహ్నవి అసంబద్ధమైన అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదని 'డిమాండ్-సప్లయ్' సూత్రం ప్రకారం మార్కెట్ శక్తులే ధరలను నిర్ణయించుకొనే సంపూర్ణ స్వేచ్ఛ కావాలంటున్నారు.

సరళీకృత ఆర్థిక విధానాల పర్యవసానంగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో, ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేయడంతో హద్దు పద్దు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరల పెనుభారంతో సామాన్య ప్రజలు ఎలా బతకాలో దిక్కుతోచక ఘోరంగా జీవిత పోరు సాగిస్తున్నారు. జాహ్నవి ఇవేమీ పట్టించుకోకుండా మార్కెట్ శక్తులకు ఇంకా స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

కార్పొరేటు సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు రాయితీలను వార్షిక బడ్జెట్ల ద్వారా రాజమార్గంలోనే దోచిపెడుతున్నా జాహ్నవి పల్లెత్తు విమర్శచేయరు. ఆయన పెట్టుబడిదారీ విధానం పట్ల కనబరుస్తున్న స్వామి భక్తికిది ప్రబల నిదర్శనం. సోషలిస్టు భావజాలంపై దుమ్మెత్తి పోయడం, 'మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం' పై శ్రామికవర్గ ప్రజానీకంలో గందరగోళాన్ని సృష్టించడం, ప్రజానీకంలో కమ్యూనిస్టు వ్యతిరేక విషబీజాలను నాటడమే జాహ్నవి వృత్తిగా పెట్టుకున్నారు.

'మేధో మథనం' శీర్షికన ఆయన గత కొంతకాలంగా 'ఎవరి శ్రమ ఎవరు దోస్తున్నా రు?'; 'సోషలిజం మత్తు మందు కాదా?', 'విప్లవం ఒక ఉన్మాదం', 'ఒసామావాదం సశేషం', 'గెలిచిందెవరు?', 'వ్యర్థ సిద్ధాంతాలు', ధాన్యం-దైన్యం' వగైరా శీర్షికలతో వ్యాసపరంపర కొనసాగిస్తున్నారు. ఇలాంటి కరుడుగట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకులెందరో కాలగర్భంలో కలిసిపోయారు. మార్క్సిజం అజరామరమైనది. శ్రామికు ల మెదళ్ళకు పదును పెట్టి, వారి చేతుల్లో శక్తిమంతమైన ఆయుధమై, దోపిడీ వ్యవస్థకు సమాధి కడుతుంది. అదే సత్యం.

-టి.లక్ష్మీనారాయణ
భాతర కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు