Wednesday, December 20, 2023

నీళ్ళు ప్రాణం పోస్తాయి! తీస్తాయి కూడా!

నీళ్ళు ప్రాణం పోస్తాయి! తీస్తాయి కూడా!

జలసంరక్షణపై ప్రజల్లోనూ - పాలకుల్లోనూ చైతన్యం పెరగాలి!

గుంజనపై చిన్నచిన్న ఆనకట్టలు కట్టలేరా!


1. నీరు అమూల్యమైన ప్రకృతి వనరు. నదులు, వాగులు, వంకల్లో ప్రవహించే వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ప్రతి నీటిచుక్కను పొదుపు చేయాలని, జలసంరక్షణపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని, కేంద్ర భూగర్భ జలవనరుల మండలి(సీజీడబ్లూబీ) సందేశం. ప్రజల్లో చైతన్యంతో పాటు పాలకుల్లో చైతన్యం - సంకల్పం కూడా ఉండాలి. ఒక సజీవమైన అంశాన్ని సోదాహరణంగా వివరించడం ద్వారా ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలిచాను.  


2. అన్నమయ్య జిల్లాలోని గుంజన వ్యాలీ ప్రాంతంలో సాగునీటి పారుదల సౌకర్యాలు లేవు. చిన్న నీటి పారుదల రంగంలోని పురాతన చెరువులు కూడా నిరుపయోగంగా తయారయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దుర్భిక్ష పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఈ పూర్వరంగంలో "మిచౌంగ్" తుఫాను ప్రభావంతో పడిన వర్షం ఉపశమనం కలుగజేసింది. వరద నీటితో గుంజన పరవళ్ళు తొక్కింది. ఈ ప్రాంత ప్రజానీకం ఆనందంలో మునిగితేలారు. సోషల్ మీడియాలో గుంజన వరద ప్రవాహ దృశ్యాల వీడియోలను కొందరు మిత్రులు 'షేర్' చేశారు. 


3. నా చిన్నతనంలో పెద్ద వాళ్ళ నోట ఒక మాట వినేవాడిని. నెల్లూరులో కుంభవృష్టిగా వర్షం కురిస్తే మనకు సాధారణ వర్షం పడుతుందనే వారు. ఆ మాట అక్షర సత్యమని నాటి నుండి నేటి వరకు నా అనుభవం కూడా చెబుతున్నది. దానికి కారణం లేకపోలేదు. నెల్లూరు జిల్లా బంగాళాఖాతానికి తీర ప్రాంతం, మా ప్రాంతానికి సరిహద్దు ప్రాంతం. మా మండల కేంద్రమైన చిట్వేలి నుండి నెల్లూరు జిల్లాలోని రాపూరుకు వెళ్ళాలంటే కొండల మధ్య గాట్ రోడ్ మీదుగా వెళ్ళాలి. నా చిన్నప్పుడు ఆ మార్గంలో బస్సుల రాకపోకలు లేవు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని  వెంకటగిరి ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నది. తూర్పు కనుమల్లో భాగమైన వెలిగొండల ఎత్తైన కొండల శ్రేణి, దట్టమైన అడవులు, రెండు ప్రాంతాలను విభజిస్తూ, సరిహద్దుగా నిలిచాయి. 


4. నైరుతి రుతుపవనాల కాలంలో మా ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈశాన్య రుతపవనాల కాలంలోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇటీవల సంభవించిన "మిచౌంగ్" తుఫాను సముద్ర తీర ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టించి, రైతాంగానికి భారీగా నష్టం చేసింది. చెన్నయ్ మహానగరాన్ని అతలాకుతలం చేసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలో భారీ వర్షాల వల్ల ప్రజలు అష్టకష్టాలుపడ్డారు. కోడూరు, రాజంపేట ప్రాంతాల్లో బలంగా వీచిన గాలులకు బొప్పాయి, నిమ్మ, మామిడి చెట్లు ధ్వంసమై రైతాంగం నష్టపోయింది. మరోవైపున, గడచిన రెండేళ్ళుగా దుర్భిక్షంతో బాధపడుతున్న ప్రజానీకానికి వర్షం పెద్ద ఊరటనిచ్చింది. 


5. మా స్వగ్రామం చిట్వేలి మండలంలోని కె. కందులవారిపల్లి. గంజన మా గ్రామం సమీపంలోనే ప్రవహిస్తుంది. అడవులు, కొండల శ్రేణులు, వృక్ష జాతి తోటలు, వాణిజ్య పంట పొలాలతో గుంజన వ్యాలీలోని పచ్చదనం, పర్యావరణం  ఆహ్లాదకరంగా ఉండేది. ఆ చక్కటి వాతావరణంలో నేను 1955లో పుట్టి, పెరిగాను. ఆ అనుభూతులు అత్యంత మధురమైనవి. ఆ కాలంలో ప్రతి ఏడాది గుంజన ప్రవహించేది. గుంజన పొడవునా కొన్ని చోట్ల చిన్నపాటి కొలనులను తలపించేలా మడుగులు ఏడాదంతా నీటితో కళకళలాడుతూ ఉండేవి. మా వూరు పరిధిలోని గుంజనలో రెండు లోతైన మడుగులు ఉండేవి. ఒకసారి నేను ఒక్కడినే పొలాల్లో నడుచుకొంటూ వెళ్ళి, సరదాగా ఒక మడుగులోకి దిగాను. అక్కడున్న నీటి లోతుపై నాకు అవగాహన లేదు. ఈత రాదు. మునిగిపోతూ కేకలు వేశాను. ఆ సమయంలో, గుంజన దారిలో వెళుతున్న మా బంధువు పొట్టయ్య మామ నేను ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతున్నానని గమనించి, పరిగెత్తుకొచ్చి కాపాడారు. నీటి గండం నుంచి బయటపడ్డావులే అంటూ ధైర్యం చెప్పి, ఇంటికి పంపించారు. "నీళ్ళు ప్రాణం పోస్తాయి - తీస్తాయి" అన్న నానుడి నా మెదడులో పదిలంగా ఉండిపోయింది. కొన్ని దశాబ్ధాల క్రితమే గుంజనలోని ఆ నీటి నిల్వల మడుగులు  ఎండిపోయి, కనుమరుగైపోయాయి. 


6. శేషాచలం అడవుల్లో, సముద్ర మట్టానికి 1050 మీటర్ల ఎత్తులో, గుంజన పుట్టి, వెలిగొండ కొండ శ్రేణుల సమీపంలో 50 కిలోమీటర్ల పొడవైన ప్రవహించి, సముద్ర మట్టానికి దాదాపు 100 మీటర్ల ఎత్తులో చెయ్యేరు నదిలో కలుస్తుంది. రైల్వే కోడూరు, చిట్వేలి, పెనగలూరు మండలాల్లో విస్తరించి ఉన్న గుంజన పరీవాహక ప్రాంతం ఒక లోయను తలపిస్తుంది. వరదలొచ్చినప్పుడు గుంజన ఉదృతంగా ప్రవహిస్తుంది. నేను చిట్వేలి జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువుతున్న కాలంలో ఒక ఏడాది గుంజనకు భారీ వరదలొచ్చాయి. వారం రోజులకుపైగా దాటడానికి వీలుపడక స్కూలుకు వెళ్ళలేదు. నాడు చిట్వేలి వద్ద గుంజనపై బ్రిడ్జ్ లేదు. 


7. గుంజనను నదిగా పరిగణించరు. అలాగని, వాగు కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మూడవ పెద్ద నది పెన్నా. దానికి చిత్రావతి, పాపాఘ్ని, కుందు, సగిలేరు, చెయ్యేరు ఉపనదులు. చెయ్యేరులో మా గుంజన కలుస్తుంది. వాగేటికోన, గుండ్లవంక, ముష్టీరు, గొట్టిమానుకోన, గుండాలేరు, అలుగువంక, తదితర కొండవాగులు వచ్చి గుంజనలో కలుస్తాయి.   


8. గుండాలకోన నుండి మొదలై గుంజనలో కలిసే గుండాలేరుకు అడ్డంగా పురాతన కాలంలో యెల్లంరాజుచెరువు నిర్మించబడింది. ఇది రెండు కొండలను కలుపుతూ నిర్మించబడిన పెద్ద చెరువు. కానీ, అది ఏనాడో వచ్చిన ఉపద్రవమైన వరదలకు తెగిపోయిందని పెద్దలు చెప్పేవారు. దాన్ని యదాతదంగా పునర్నిర్మాణం చేయకుండా కుదించి పునర్నిర్మాణం చేశారు. చిట్వేలికి నాలుగైదు కి.మీ. దూరంలో, రాపూరుకు వెళ్ళే దారిలో ఈ చెరువు ఉన్నది. ఈ చెరువు వరకు సోమశిల జలాశయం నుండి నీటిని తరలించే ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రు.215 కోట్ల వ్యయ అంచనాతో పరిపాలనానుమతిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎత్తిపోతల పథకం నిర్మించబడితే గుంజన పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలకు నీటి సమస్య కొంతవరకైనా పరిష్కారం అవుతుంది. ఆ మేరకు మంచిదే. కానీ, గుంజన వ్యాలీలోని ప్రాంత ప్రజల నీటి సమస్య పరిష్కారం కాదు.   


9. గుంజన పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షపు నీరంతా చెయ్యేరులో కలుస్తుంది. చెయ్యేరు నీరు పెన్నా ద్వారా సోమశిలకు చేరుతోంది. గుంజనపై పలుచోట్ల చిన్నచిన్న ఆనకట్టలు నిర్మించి, వరద నీటిని నిల్వచేస్తే భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లో పుష్కలంగా నీరు లభిస్తుంది. ప్రజలు దశాబ్ధాలుగా విజ్ఞప్తిచేస్తున్నా ప్రభుత్వాలు చెవికెక్కించుకోవడం లేదు. పర్యవసానంగా సోమశిల చేరిన నీటిని నెల్లూరు జిల్లాలో వినియోగించుకోగా మిగిలిన నీరు బంగాళాఖాతంలో కలిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి, గుంజన పరీవాహక ప్రాంతంలోని ప్రజల డిమాండును పరిగణలోకి తీసుకొని, ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించి, ఒక పథకాన్ని రూపొందించి, అనువైన చోట్ల చిన్నచిన్న ఆనకట్టలు నిర్మిస్తే వరద నీటిని వడిసిపట్టుకొని భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా త్రాగునీటి సమస్య పరిష్కారానికి, బోరు బావుల క్రింద వ్యవసాయానికి స్థిరత్వం కల్పించవచ్చు. కొంత మేరకు చెరువులకు తరలిస్తే ఉపరితల నీటిని వాడుకోవచ్చు. చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలను చేపట్టవచ్చు.


10. ఒకటి, రెండు సజీవమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఏడెనిమిది దశాబ్ధాల క్రితమే గుంజనపై పెద్దరాచపల్లి (కోడూరు - చిట్వేలి రోడ్డు మార్గంలో ఉన్నది) సమీపంలో చిన్న ఆనకట్ట(కోటకొమ్మదిన్నె) కట్టారు. ఫలితంగా చుట్టు ప్రక్కల భూగర్భ జలాలు పెరిగాయి. ఆ ఆనకట్ట నుంచి నగిరిపాడు చెరువుకు నీటిని సరఫరా చేయడానికి కాలువ తవ్వారు. చెరువు క్రింద ఉన్న ఆయకట్టు రైతులే ఒకప్పుడు వర్షాకాలం ప్రారంభంలో ఆ కాలువకు మరమ్మత్తులు చేసుకొని, ప్రవాహానికి అడ్డంకులు లేకుండా తొలగించుకొనే వారు. ఆ చెరువు క్రింద నా చిన్నతనంలో,  మాకు కూడా  కొద్దిపాటి సాగు భూమి ఉండేది. నాడు చెరువుల క్రిందే వరి పండించుకొనేవారు. అప్పుడు మా ప్రాంతంలో విద్యుత్తు లేదు. నేడు గుంజన ప్రవహించినా ఆ చెరువులోకి నీరు తరలించలేని దుస్థితి నెలకొన్నది. 


11. పెద్దరాచపల్లి సమీపంలోనే గుంజనలో కలిసే గొట్టిమానుకోనపై కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన చిన్న రిజర్వాయరు వల్ల కూడా చుట్టు ప్రక్కల భూగర్భ జలాలు పెరిగాయి. 


12. ప్రాజెక్టులు, ఆనకట్టలు, రిజర్వాయర్లు, చెక్ డ్యామ్ లు, అడవులలో కందకాలు తవ్వడం వంటి జలసంరక్షణ చర్యల వల్ల భూగర్భ జలాలు అధికంగా పెరుగుతాయని కేంద్ర భూగర్భ జలవనరుల మండలి(సీజీడబ్లూబీ) అధ్యయన నివేదికలు వెల్లడిస్తున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలుగా మార్చే జలసంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. దేశంలో 7-16 అడుగుల లోతులోనే పుష్కలంగా భూగర్భజలాలు లభ్యమయ్యే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకొన్నది. కానీ, చిట్వేలి, పెనగలూరు మండలాల పరిధిలోని కొన్ని గ్రామాల్లో వెయ్యి అడుగుల లోతు బోర్లు వేసినా నీరు లభించని దుస్థితి దశాబ్దాల క్రితమే ఏర్పడింది. 


13. 1970 దశకానికి పూర్వం అత్యధిక భూములు బావుల మీద ఆధారపడి, చెరువుల కింద కొంత భూమి సాగు చేసేవారు. చాలా సారవంతమైన భూములు ఉన్న ప్రాంతం. చెరువులకు మరమ్మత్తులు చేయడం మానేశారు. వాటిలోకి నీరు చేరడంలేదు. ఆక్రమణలతో చెవురుల విస్తీర్ణం కూడా తగ్గిపోయింది. నాడున్న కుంటలు, ఊట కాలువలు పూర్తిగా కనుమరుగైపోయాయి. బావుల స్థానంలో బోరుబావులొచ్చాయి. నేడు వ్యవసాయం బోరుబావులపైనే ఆధారపడి ఉన్నది. కరెంటు సమస్య రైతాంగానికి తీవ్రమైన సమస్యగా పరిణమించింది. అటవీ దొంగల విధ్వంసం - తగలపెట్టడం లాంటి దుశ్చర్యల పర్యవసానంగా దట్టమైన అడవులు పలచపడిపోయాయి. పర్యావరణ మార్పుల పర్యవసానంగా వర్షాలు కురవడం లేదు. కరవులు వెంటాడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. త్రాగునీరు కొనుక్కొని దప్పిక తీర్చుకొనే దుస్థితిలోకి ప్రజలు నెట్టబడ్డారు. వ్యవసాయం తీవ్రసంక్షోభంలోకి నెట్టివేయబడింది. ఉపాధి అవకాశాలు మృగ్యం. ప్రజలు ఉపాధి వెతుక్కొంటూ కువైట్, సౌదీ అరేబియా, తదితర గల్ఫ్ దేశాలకు వేల సంఖ్యలో వలస వెళ్లారు.


14. గుంజన ఒడ్డున ఉన్న చిట్వేలికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. ప్రస్తుతం మండల కేంద్రం. ఒకనాడు చిట్వేలి సమితిగా ఉండేది. బ్రిటిష్ వలస పాలకుల కాలంలో ఫిర్కా హెడ్ క్వార్టర్. బట్రారాజుల కాలం నాటి పురాతన కట్టడాలున్న పాత చిట్వేలి గుంజన ఒడ్డునే ఉన్నది. చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుంజనకు అతిసమీపంలోనే ఉన్నది. చిట్వేలి త్రాగునీటి సమస్య పరిష్కారానికి గుంజన వరద నీటిని నిల్వ చేసుకొని, వినియోగించుకొనే శాశ్వత రక్షిత మంచి నీటి పథకాన్ని నిర్మించాలి. 


15. గుంజన వరద నీరు చెయ్యేరు ద్వారా పెన్నా నదిలో కలిసి సోమశిల జలాశయంలో నిల్వచేసి, సోమశిల విస్తరణ ప్రాంతం నుండి ఎత్తిపోతల పథకం ద్వారా గుంజన పరీవాహక ప్రాంతానికి నీటిని తరలించే పథకానికంటే ఉత్తమమైన పథకం గుంజనపైన కోడూరు నుంచి పెనగలూరు వరకు అనుకూలమైన చోట్ల చిన్నచిన్న ఆనకట్టలు నిర్మించే పథకంపై ప్రభుత్వం సత్వరం దృష్టిసారించాలి.  


టి. లక్ష్మీనారాయణ 

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక 

Saturday, December 9, 2023

దుర్భిక్షం - మిచౌంగ్ తుఫాను - ప్రభుత్వ అలసత్వం

 దుర్భిక్షం - మిచౌంగ్ తుఫాను - ప్రభుత్వ అలసత్వం 

రైతుల ఆక్రందన - సంక్షోభంలో వ్యవసాయం 


1. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వందల మండలాలకుపైగా దుర్భిక్షం కోరల్లో చిక్కుకున్నా, గ్రామాలకు గ్రామాలే వలసలు వెళుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని రైతులు , వ్యవసాయ కార్మికులు తీవ్రఆందోళన చెందుతున్న నేపథ్యంలో "మిచౌంగ్" తుఫాను విరుచుకుపడింది. చేతికందాల్సిన వరి పంట బుగ్గిపాలయ్యిందని, అరటి - బొప్పాయి - నిమ్మ, తదితర పండ్ల తోటలు ధ్వంసమైనాయని రైతులు ఆవేదనతో కృంగిపోతున్నారు. ఏడెనిమిది వేల కోట్ల రూపాయల వరకు నష్టం జరిగి ఉండవచ్చంటున్నారు. రైతుల పరిస్థితి "గోరు చుట్టపై రోకటి పోటన్న" నానుడిగా తయారయ్యింది.


2. బంగాళాఖాతంలో ప్రతి ఏడాది నవంబరు - డిసెంబరు మాసాల్లో వాయుగుండాలు సంభవిస్తాయని అందరికీ విధితమే. వాటి ప్రభావం ఒక్కోసారి తక్కువగా ఉండవచ్చు, ఒక్కోసారి తీవ్రంగా ఉండవచ్చు. 1977లో దివిసీమపై ఉప్పెన విరుచుకుపడ్డట్లు పడానూ వచ్చు. నేడు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వాలు అంచనా వేసి, ముందస్తు కార్యాచరణ అమలు చేయాలి. అలా చేస్తే, ప్రకృతి విపత్తు వల్ల సంభవించే నష్టాన్ని పూర్తిగా నిరోధించలేకపోయినా, కొంత మేరకు నివారించవచ్చు. 


3. డెల్టా ప్రాంతంలో జూన్ 15 నాటికే నారుమళ్లకు నీటిని విడుదలచేస్తే, నవంబరు చివరి నాటికి పంట చేతికొచ్చేస్తుంది. ఆ మేరకు ప్రణాళిక అమలు చేయాలన్న విధాన నిర్ణయానికి కట్టుబడి కార్యాచరణ అమలు చేయాల్సి ఉన్నది. ఈ సంవత్సరం కరవు వచ్చింది. కృష్ణా నది ఎగవ నుండి శ్రీశైలానికి, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద ప్రవాహం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని, అందుబాటులో ఉన్న పులిచింతల నీటిని మరియు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని తరలించి, ఆ మేరకు ప్రణాళికాబద్ధంగా సాగు నీటిని సరఫరా చేసి, నవంబరులోపే పంట చేతికొచ్చేలా కార్యాచరణను ప్రభుత్వం అమలు చేసి ఉండాల్సింది. అలా జరిగిందా!


4. తాజాగా "మిచౌంగ్" తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసాయి. చేతికొచ్చిన పంట నీట మునిగింది. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ప్రకృతి విపత్తు, దానికి ప్రభుత్వం ఏంచేస్తుందని, ఎవరైనా అమాయకంగా అనవచ్చు! ప్రభుత్వం చేయాల్సిన పనులు చేసిందా? అన్నదే ప్రశ్న. 


5. వర్షపు నీరు పంట పొలాల్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి వీలుగా డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, మరమ్మత్తులపై ప్రభుత్వం దృష్టి సారించిందా! నీటి ప్రవాహానికి అవరోధాలు లేకుండా పంట కాలువల వ్యవస్థను నిర్వహించాల్సిన బాధ్యత నీటి పారుదల శాఖదే కదా! అవసరమైన నిధులు కేటాయించి, ఆ పనులు చేశారా!


6. కృష్ణా డెల్టాలో ఆధునికీకరణకు ఒక పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. దశాబ్దాలు గడిచిపోయినా ఆ పథకంలోని నిర్మాణ పనులు పూర్తి కాకపోవడానికి ప్రభుత్వమే కదా! బాధ్యత వహించాలి.


7. తెనాలి ప్రాంతం నుండి ప్రొ.విశ్వనాథంగారు ఫోన్ చేశారు. ఆయన వ్యవసాయం చేస్తున్నారు. ఒక వైపున తుపాను ముంచుకొస్తున్నదని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తూనే, మరొక వైపు డెల్టా పంట కాలువలకు నీటిని వదిలిపెట్టారని, పర్యవసానంగా వర్షపు నీరు పొలాల్లో నిల్వ ఉండిపోయి, చేతికొచ్చిన పంట నీట మునిగిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయారని బాధపడ్డారు. దీనికి ఎవరు బాధ్యతవహించాలి? సాగునీటి పారుదల శాఖ బాధ్యతవహించదా!


8. ముఖ్యమంత్రిగానీ, జలవనరుల శాఖామంత్రిగానీ, "మిచౌంగ్" తుపాన్ హెచ్చరికల పూర్వరంగంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమై ముందస్తు కార్యాచరణను రూపొందించి, అమలు చేశారా! కృష్ణా డెల్టా ఆధునీకీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయకపోవడం, పంట కాలువల వ్యవస్థకు మరమ్మత్తులు చేసి - సక్రమంగా నిర్వహించక పోవడం, తుపాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తుందన్న అంచనా ఉన్నా కాలువలకు నీళ్ళు వదలడం, ప్రభుత్వ తప్పిదమా! లేదా, ప్రకృతి వైపరీత్యమా!


9. ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి? తడిసిన ధాన్యాన్ని రైతుల నుండి యుద్ధప్రాతిపదికన కొనాలి. బోనస్ ఇవ్వాలి. పెట్టుబడి రాయితీ ఇచ్చి ఆదుకోవాలి. దాదాపు 80%గా ఉన్న కౌలు రైతులకు సమన్యాయం అందించాలి. 


10. డెల్టా ప్రాంతంతోపాటు మెట్ట ప్రాంతాల్లోని రైతాంగం ఒకవైపు కరవు వల్ల, "మిచౌంగ్" తుపాన్ వల్ల నష్టపోయింది. అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో గాలుల వల్ల అరటి, బొప్పాయి, నిమ్మ, వగైరా నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి ఆర్థిక తోడ్పాటును అందజేసి, భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.


టి. లక్ష్మీనారాయణ