Thursday, May 24, 2012

సమ్మిళిత అభివృధ్ధి ఇదేనా?

Published in Surya Daily on 24th May 2012 and also Janabalam Monthly
జనాభా గణనలో అంతర్భాగంగా 2011 సంవత్సరం సేకరించిన గృహ వసతి, ఇళ్ళలోని మౌలిక సదుపాయాలు, ఆస్తుల వివరాలకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖ వెల్లడించింది. ఆ గణాంకాలు స్థూలమైనవి అయినప్పటికీ రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల ప్రగతి నివేదికగా భావించవచ్చు. అయినా సంస్కరణల లక్ష్యం అభివృద్ధేనని ప్రభుత్వాధినేతలు బల్లగుద్ది వాదిస్తున్నారు, ఈ ఆర్థిక విధానాలను సమర్థిస్తున్న ఆర్థికవేత్తలు ప్రజల చెవుల్లో ఇల్లు కట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి నినాదంలోని డొల్లతనాన్ని మాత్రం జనాభా గణాంకాలు బహిర్గతం చేస్తున్నాయి. అమెరికాతో సహా ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా మన దేశం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 6.9శాతం ఆర్థిక వృద్ధి రేటుతో ముందు వరుసలో పయనిస్తున్నదని ప్రముఖ ఆర్థిక వేత్త డా: మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నది.

అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు చేరుతున్నాయని దగాకోరు మాటలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జనాభా గణన శాఖ క్షేత్ర స్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా రూపొందించిన నివేదికను వాస్తవిక దృష్టితో విశ్లేషిస్తే ప్రజల జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో విస్పష్టంగా బోధపడుతుంది . మానవ నాగరికతకు, సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి అద్దం పట్టే కొన్ని అంశాలను పరిశీలిద్దాం.1) మరుగుదొడ్ల సౌకర్యం. 2) ఇళ్ళ నిర్మాణం. 3) రక్షిత మంచి నీటి సదుపాయం. 4) విద్యుత్తు వినియోగం. 5) వంట గ్యాసు వినియోగం. 6) గ్రామీణ- పట్టణ ప్రాంతాల ప్రజల మధ్య పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అంతరాలు. 2011 గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం ఆవాసాల సంఖ్య 24,66,92,667. గ్రామీణ ప్రాంతాలలో 16,78,26,730, పట్టణాలలో 7,88,65,937 ఉన్నాయి. మన రాష్ట్రంలో మొత్తం ఆవాసాల సంఖ్య 2,10,24,534. గ్రామాల్లో 1,42,46,309, పట్టణాల్లో 67,78,225 ఉన్నాయి.

దేశం మొత్తంగా చూస్తే గ్రామసీమల్లో ఆవాసాల పెరుగుదల 21.4 శాతం , పట్టణాలలో 46.9 శాతం ఉంటే మన రాష్ట్రంలో గ్రామాల్లో 12.4 శాతం, పట్టణాల్లో 62.4 శాతం పెరుగుదల నమోదయ్యింది. జీవనాధారంగా ఉన్న వ్యవసాయం సంక్షోభంలో కూరుక పోవడం, చేతి వృ త్తులు కనుమరుగెై పోతుండడం , ఉపాథి అవకాశాలు తగ్గిపోవడం, నాణ్యమైన విద్య, వెైద్యం, విద్యు త్తు, రహదారులు వగెైరా మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం- పర్యవసానంగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వలసల ప్రక్రియ కొనసాగుతున్నది.
దేశంలో 36.4 శాతం, రాష్ట్రంలో 43.1 శాతం మాత్రమే పక్కాగా పెైపుల ద్వారా నీటి సరఫరాతో పారిశుద్ధ్య సౌకర్యం కలిగిన మెరుగెైన మరుగుదొడ్లు ఉన్నాయి. దేశంలో 53.1 శాతం, రాష్ట్రంలో 50.4 శాతం ఆవాసాలకు అసలు మరుగుదొడ్ల సదుపాయాలే లేవు. జార్ఖండ్‌లో 76.6 శాతం, ఒడిషాలో 76.6 శాతం, బీహార్‌లో 75.8 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు.

వీరిలో అత్యధికులు పేదరికంలో మగ్గుతున్నవారు లేదా సామాజికంగా వెనుకబడ్డవారే అన్నది వివాదరహితం. అంతర్జాతీయ సమాజం అనేకాంశాలను కనీసావసరాలుగా ప్రకటించింది. 2015 నాటికి ఆకలికి, పేదరికానికి ముగింపు పలకాలన్న లక్ష్యంతో పాటు 8 సహస్రాబ్ది లక్ష్యాలను సాధించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాల ముందు అజెండాగా ఉంచింది. అందుకు మన ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కూడు, గుడ్డ, ఇల్లు కనీసావరసరాలని అందరూ చెప్పే మాట. వాటిలో ఇళ్ళ సమస్యను పరిశీలిద్దాం. సొంతత ఇళ్ళున్న వారు గ్రామీణ ప్రాంతాలలో 9.7 శాతం మంది ఉండగా పట్టణ ప్రాంతాలలో 69.2 శాతం మాత్రమే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో సొంతింటి కల సాఫల్యం కాక, అద్దె ఇళ్ళల్లో నివసిస్తున్న వారు 27.5శాతంగా ఉన్నారు. సంపాదనలో గణనీయమైన భాగం అద్దెలు చెల్లించడానికే వెచ్చించాల్సి రావడంతో ఆహారంపెై చేసే ఖర్చు తగ్గిపోతున్నదని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

ఇళ్ళ నిర్మాణానికి వినియోగించే మెటీరియల్‌ను బట్టి ప్రజల ఆర్థిక స్థోమతను అంచనా వేయవచ్చు. గడ్డి, బోద, ఎదురు బొంగులు వంటి సామాగ్రితో నిర్మించుకున్న ఇళ్ళు దేవంలో 9 శాతం ఉంటే గ్రామాల్లో 11.9 శాతం, పట్టణాల్లో 2.7 శాతం, మట్టి/కాల్చని ఇటుకలతో నిర్మించుకున్నవి దేశంలో 23.7 శాతం అయితే గ్రామాల్లో 30.5 శాతం, పట్టణాల్లో 9.3 శాతం ఉన్నాయి. కల్చిన ఇటుకులతో నిర్మించుకున్నవి దేశంలో 47.5 శాతం ఉంటే గ్రామాల్లో 40 శాతం, పట్టణాల్లో 63.5 శాతం ఉన్నాయి. కాంక్రీట్‌ నిర్మాణాలు దేశంలో 3.5 శాతం అయితే గ్రామాల్లో కేవలం 1.7 శాతం, పట్టణాల్లో 7.2 శాతం ఉన్నాయి. ఇళ్ళ లోపల మట్టి నేల ఉన్నవి గ్రామసీమల్లో 62.6 శాతం ఉంటే పట్టణాల్లో 12.2 శాతం, సిమెంటు నేల 24.2 శాతం, 45.8 శాతం, మొసాయిక్‌ లేదా టైల్‌ వేసినవి 3.7 శాతం, 25.8 శాతం చొప్పున నిర్మించినవి ఉన్నాయి. స్నానాల కోసం ప్రత్యేక గదుల సౌకర్యంలేని ఆవాసాలు గ్రామాల్లో 55 శాతం, పట్టణాల్లో 13 శాతం ఉన్నాయి.

ఇంటిబయటనే వంటావార్పూ చేసుకుంటున్న వారు గ్రామాల్లో 16.4 శాతం, పట్టణాల్లో 3.7 శాతం ఉన్నారు. కట్టెల మీదే ఆధారపడి వంట చేసుకుంటున్న వారి సంఖ్య గ్రామాల్లో 62.5 శాతం, పట్టణాల్లో 20.1 శాతం ఉన్నది. నాగరికతకు ప్రతిబింబంగా చూసే వంట గ్యాస్‌ వినియోగించుకుంటున్న వారు గ్రామాల్లో 11.4 శాతం మాత్రమే, పట్టణాల్లో కూడా 65 శాతం మందే ఉన్నారు. మురికి వాడల్లో జీవిస్తున్న పేదలకు, గ్రామాల నుండి వలస వచ్చిన పేదలకు వంట గ్యాస్‌ అందుబాటులో లేదు. కిరోసిన్‌ను వంట సరకుగా వాడుకుంటున్న వారు 7.5 శాతం మంది పట్టణాలలోనే ఉన్నారు. విద్యుత్‌ దీపాలకు నోచుకోని గ్రామీణ ప్రజలు 43.2 శాతం మంది ఉన్నారు. కిరోసిన్‌ దీపాల వెలుగుల్లో రాత్రిపూట కాలం గడుపుతున్నారు. కడకు పట్టణాల్లో కూడా 6.5 శాతం మందికి కిరోసిన్‌ దీపాలే దిక్కు. మురుగు నీటి కాలువల నిర్మాణంలేని గ్రామాలు 63.2 శాతం, అలాగే 18.2 శాతం పట్టణాలూ ఉన్నాయి. పట్టణాల్లో కేవలం 44.5 శాతం మాత్రమే భూమి లోపల లేదా మూసివేసిన మురుగు కాల్వల నిర్మాణాలున్నాయి. గ్రామాల్లో అయితే 5.7 శాతం మాత్రమే. మూసివేయని మురుగు కాలవల్లో గ్రామాల్లో 31 శాతం, పట్టణాల్లో 37.3 శాతం ఉన్నాయి.

ఆ ప్రాంతాల్లో ఆవాసాలున్న ప్రజలు దుర్గంధం, కాలుష్య వాతావరణం మధ్య తరచు అంటు వ్యాధుల బారిన పడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారు.పెైపుల ద్వారా రక్షిత త్రాగు నీటి సరఫరా లబ్ధిదారులు గ్రామాల్లో కేవలం 17.8 శాతం ఉండగా, పట్టణాల్లో 62 శాతంఉన్నారు. అంటే నగరాలు, పెద్ద పెద్ద పట్టణాల్లోని మురికివాడల్లో, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో నివసిస్తున్న 38 శాతం ప్రజలు రక్షిత త్రాగు నీటికి నోచుకోవడం లేదన్న మాట. గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి మరీ దారుణం. శుద్ధి చేయని నీటిని పెైపుల ద్వారా పొందుతున్న వారు 13 శాతం, బావుల మీద 13.3 శాతం, బోరు బావుల మీద 8.3 శాతం ఆధారపడి ఉన్నారు. ఈ తరహా వనరుపెై ఆధారపడ్డ వారు తీవ్రమైన విద్యుత్‌ కొరతతో సతమతమవుతున్న మనలాంటి రాష్ట్రాలలో తాగు నీటికి కటకటలాడిపోయే దుస్థితి దాపురిస్తుంటుంది. అత్యధికంగా 43.6 శాతం మంది తాగు నీటి కోసం చేతి పంపుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. నిత్య కరవు పీడిత, మెట్ట ప్రాంతాలలోని భూగర్భ జలాలు తరగిపోతున్నాయి.

చేతి పంపులు వట్టిపోవడంతో గొంతులు తడారిపోతున్నాయి. బిందెడు తాగు నీటి కోసం గంటల తరబడి క్యూలెైన్లలో మహిళలు నిలబడ్డాలు, ఘర్షణలు, చిన్న పాటి యుద్ధాలను తలపించే దృశ్యాలు సర్వ సాధారణమైపోయాయి. తాగునీటి వ్యాపారం అత్యంత లాభదాయకమైనదిగా తయారెైంది. అనేక జబ్బులు కలుషిత తాగు నీటి నుండే సంక్రమిస్తాయి. అనేక ప్రాంతాల ప్రజలు ఫ్లోరెైడ్‌ సమస్యతో బాధపడుతున్నారు. కానీ కనీసం రక్షిత తాగు నీరందించలేని ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నాం. నిజమే, దేశం ఆర్థికాభివృద్ధిలో వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నది. స్థూల జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల సూచిక ప్రకారం 2010-11లో 71.57, 412 కోట్లుగా కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా వేసింది. సంపద పెరుగుతున్నది.
కుబేరులు, సంపన్నుల సంఖ్య పెరిగిపోతున్నది. కానీ పెై అంశాలన్నింటినీ నిశితంగా శాస్ర్తీయ పద్ధతిలో విశ్లేషిస్తే గ్రామీణ, పట్టణ ప్రజానీకం, పట్టణాల్లోని మురికివాడల్లోని ఆవాసాల్లో నివసించే ప్రజలకు సంపన్నులకు మధ్య ఉన్న ఆర్థిక అసమానతలు, సామాజిక అంతరాలు, మౌలిక సదుపాయాల లేమి వంటి అత్యంత తీవ్రమైన సమస్యలను భారత జాతి ఎదుర్కొంటున్నదన్న అంశం నిర్వివాదం.పన్నెండవ పంచవర్ష (2012-17) కాలంలోనెైనా ఆర్థికాభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ దక్కేలా చేయాలంటే నయా ఉదారవాద ఆర్థిక విధానాలలో సమూలమైన మార్పులు అనివార్యంగా చేయాలి. కేవలం వంచనతో కూడిన నినాదాలతో పరిమితం కాకుండా సమ్మిళిత ఆర్థికాభివృద్ధి విధానాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడం ద్వారా పెైన పేర్కొన్న రంగాలలో ప్రగతి సాధించి, ప్రజలందరికీ నాణ్యమైన జీవితం గడిపేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపెై ఉన్నది.

పేదలపై ఆర్థిక సంస్కరణవాదుల దాడి


Published in Visalaandhra Daily on 19th May 2012            
                                     
సమ్మిళిత ఆర్థికాభివృద్ధిలో పేదరికాన్ని తగ్గించడమన్నది ప్రధాన వ్యూహమని డా: మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యు.పి.ఎ. 2 ప్రభుత్వం పదేపదే వల్లెవేస్తుంటుంది . ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మన దేశం మాత్రం 2011_12 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.) 6.9% వృద్ధి రేటు నమోదు చేసుకొని ముందు వరుసలో పయనిస్తున్నదని , కానీ 11వ పంచవర్ష ప్రణాళికా (2007_12) కాలంలో 9% లక్ష్యంగా పెట్టుకొన్నా సగటున 8.2 శాతాన్ని సాధించామని, 12వ పంచవర్ష ప్రణాళికా(2012_17) కాలంలోనైనా 9% చేరుకోవాలంటే సంస్కరణల అమలులో మరింత దూకుడుగా వ్యవహరించాలని నిర్ధ్వందంగా ప్రకటించింది . సంపద వృద్ధి చెందితే ప్రజల భవిష్యత్తుకు బరోసా లభిస్తుందని ఆశిస్తాం . ఆ జాతి సంపద‌లో పేదలకు వాటా దక్కకపోతే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు . జి.డి.పి. పెరుగుదలకు అనుగుణంగా ఉపాథి అవకాశాలు మెరుగుపడాలి , ప్రజల కొనుగోలు శక్తి మరియు జీవన ప్రమాణాలు పెరగాలి. పేదరిక నిర్మూలనలో వేగంగా అడుగు ముందుకు పడాలి. ప్రజలందరికీ నివాసం , విద్య , వైద్యం వగైరా మానవ హక్కులను అనిభవించే భౌతిక పరిస్థితులు కల్పించబడాలి . అప్పుడే అభివృద్ధి అన్న పదానికి అర్థం , పరమార్థం ఉంటుంది . అలా కాకుండా నయవంచనతో కూడిన ఆర్థికాభివృద్ధి జపం చేస్తూ , సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పాలన్న రాజ్యాంగ స్ఫూర్థికి తూట్లుపొడ‌డం అభివృద్ధి అని ఎలా అనిపించుకొంటుంది?

నేడు వివిధ తరగతుల ప్రజానీకానికి ఇస్తున్న సబ్సీడీలను పథకం ప్రకారం తొలగించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించాలనే మాయ మాటలతో జి.డి.పి.లో సబ్సీడీల శాతాన్ని 2012_13 ఆర్థిక సంవత్సరంలో 2% నికి , అటుపై 1.75% నికి , అలా క్రమేఫీ కుదించుకొంటూ పోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసుకొన్నది. ఆహారం , చమురు ఉత్పత్తులు , ఎరువులపై  ప్రభుత్వం వెచ్చిస్తున్న సబ్సీడీల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని పథకం ప్రకారం పావులు కదుపుతున్నది . ప్రప్రథమ చర్యగా దారిద్ర రేఖ నిర్ధారణకు అసంబద్ధమైన , అశాస్త్రీయమైన ప్రాతిపదికలను వర్తింపజేస్తూ పేదల సంఖ్యను కృత్రిమంగా తగ్గించి చూపెట్టే దుర్మార్గానికి పాల్పడింది . అందులో అంతర్భాగంగా కేంద్ర ప్రణాళికా సంఘం రూపొందించిన నివేదిక నవ్వుల పాలైయ్యింది . పట్టణ ప్రాంతాలలో రు.32/‍.. , గ్రామీణ ప్రాంతాలలో రు.26/.. లు రోజువారి ఆదాయం లోపు ఉన్న వారు మాత్రమే దారిద్ర రేఖ ( బి.పి.యల్.) క్రింద జీవిస్తున్న వారుగా పరిగణించబడతారని ఆ నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నారు . ఆ గణాంకాలు చూసి సభ్య సమాజం ముక్కున వేలేసుకొన్నది .ఇంత కంటే దారుణమైన , కౄరమైన "జోక్" మరొకటి ఉంటుందా ? అన్న సందేహం పామరులకు సహితం కలిగింది . దారిద్య రేఖ క్రింద జీవిస్తున్న జనాభాను తగ్గించి చూపడం ద్వారా సబ్సీడీల భారాన్ని తగ్గించుకోవాలనే కక్కుర్తి ఆలోచన తప్ప మరొకటి కాదు ." ఆమ్ ఆద్మీ" పేరు చెప్పుకొని అధికార పీఠమెక్కి , పేదల బ్రతుకులను చిద్రం చేసే ఆర్థిక విధానాలను అమలు చేస్తున్నారు . ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కనీసం నియంత్రించలేని చేతకాని ప్రభుత్వం , పతనమైపోతున్న ప్రజల కొనుగోలు శక్తిని , జీవన ప్రమాణాలను, నిరుద్యోగాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా అత్యంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం ప్రజా ప్రభుత్వానికి తగునా ? మరొక వైపున "మూలిగే నక్క మీద‌ తాటిపండు పడ్డట్లు" ప్రజలపై పెనుభారాలు మోపుతూనే ఉన్నారు .

సబ్సీడీల వ్యవస్థకు మంగళం పాడి , పేదల మెడలకు ఉరితాళ్ళు బిగించాలని నిశ్చయించుకొన్నది . ఈ పథకంలో అంతర్భాగంగా నందన్ నీలేకర్ నేతృత్వంలోని " టాస్క్ పోర్స్ " చేసిన సిఫార్సును ఆమోదించి "తేనె బూసిన కత్తెలాంటి"  నగదు బదిలీ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది . సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఆహారం , చమురు ఉత్పత్తులు , ఎరువులపై ఇస్తున్న రాయితీలు దుర్వినియోగం , అవినీతిపరుల పాలు కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్న ముసుగేసుకొన్నది . ఆధార్ కార్డు ఆధారితంగా అర్హులను నిర్ధారించి , ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకొన్న కొన్ని ప్రాంతాలు , రంగాలలో అమలుకు శ్రీకారం చుట్టింది . మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల ఆధ్వర్యంలో  వంట గ్యాస్ ను మార్కెట్ ధరకు అంటే 14.5 కే.జి.ల సిలెండర్ ను రు.750 లకు పైగా విక్రయించి , సబ్సీడీ మొత్తాన్నినేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేసే " పైలెట్ ప్రాజెక్టు "ను మైసూర్ లో అమలు చేయడానికి పచ్చ జెండా ఊపారు . ఇదే తరహాలో కిరోసిన్ పథకాన్ని రాజస్తాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లాలో అమలుకు పూనుకొన్నారు . ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళన పేరుతో ఆధార్ కార్డుల ఆధారంగా రేషన్ కార్డులను కుదించే ప్రయోగశాలగా మొదట జార్కండ్ రాష్టాన్ని ఎంపిక చేసుకొన్నారు . ఇలా మూడు పైలెట్ ప్రాజెక్టులతో మొదలు పెట్టి దేశ వ్యాపితంగా వీటిని విస్తరించే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసుకొని కార్యాచరణకు దిగింది . దీన్నిబట్టి "ఆమ్ ఆద్మీ" సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో! తేటతెల్లమయ్యింది . మన రాష్ట్రంలో "స్మాట్ కార్డ్ " రూపంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని చౌక డిపోల్లో జరుగుతున్న అవకతవకల ప్రక్షాళన చేసే పేరిట‌ రంగారెడ్డి జిల్లా , చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోను ఒక పైలెట్ ప్రాజెక్టు అమలుకు సర్వే  చేశారు . కరీంనగర్ , తూర్పు గోదావరి జిల్లాలలో కూడా చేయబోతున్నారు . అత్యమంగా రాష్ట్రం మొత్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణను రూపొందించుకొన్నది . ఆ డాలు ఎవరికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టారో! భవిష్యత్తులో తేలుతుంది . రాజకీయ లబ్ధి కోసం పొడుగు చేతుల పందేరం చేసి అనర్హులకు రేషన్ కార్డులను పంపిణీ చేసిన ప్రభుత్వం తరువాత దశలో బోగస్ కార్డుల ఏరివేత పేరిట పేదల వద్ద ఉన్న రేషన్ కార్డులకు ఎసరు పెట్టటానికి బరితెగించిన ఉదంతాల అనుభవాలున్నాయి .

కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న కార్యాచరణలో అంతర్భాగంగానే దారిద్య్ర రేఖ క్రింద జీవిస్తున్న అభాగ్యుల గణాంకాల తయారీలో అంకెల గారడీకి పూనుకొన్నదని చెప్పక తప్పదు . బి.పి.యల్. పై సురేష్ టెండూల్కర్ కమిటీ రూపొందించిన నివేదికకు కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోద ముద్రవేసి మార్చి14, 2012న బహిరంగ ప్రకటన విడుదల చేసింది . దాని ప్రకారం 2009_10 సం. లో గ్రామీణ ప్రాంతంలో నెలకు రు. 672 . 80పై. ( రోజుకు రు.22 . 42 పై.), పట్టణ ప్రాంతాలలో రు.859 . 60పై. (రోజుకు రు.28 . 65పై.) లోపు సంపాదన ఉన్న వారు మాత్రమే దారిద్య్ర రేఖ క్రింద జీవిస్తున్న ప్రజానీకంగా గుర్తించబడతారు . మరొక ప్రకటనలో 2010_11లో గ్రామసీమల్లో  రు.26 , పట్టణ ప్రాంతాలలో రు.32 లకు లోపు సంపాదన ఉన్నవారు బి.పి.యల్. క్రింద ఉన్నట్లుగా పరిగణించబడతారని ముక్తాయింపు పలుకులు పలికారు . ఈ తరహా ఆదాయంతో ప్రస్తుత ధరల్లో ఏ కుటుంబమైనా అసలు మనుగడ సాగించ‌గలదా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న . తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఒక్కడుగు వెనక్కి వేసి మరొక‌ నిపుణుల కమిటీతో సమీక్షిస్తామని వాగ్దానం చేసి ప్రజాగ్రహాన్ని చల్లబరిచే ప్రయత్నం చేసింది .

సామాజిక భద్రతను కొంత మేరకైనా కల్పించే సదుద్దేశంతో ప్రవేశ పెట్టబడిన సంక్షేమ పథకాలకు ప్రస్తుత‌ ప్రభుత్వం ఎసరు పెట్టడానికే కృత్రిమంగా పేదల సంఖ్యను తగ్గించి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది .1993_1994 నుండి 2004_05 ఆర్థిక సంవత్సరాల‌ మధ్య కాలంలో ఏడాదికి 0.74% పేదరికం తగ్గుతూ వస్తే 2004_05 నుండి 2009_10 మధ్య యు.పి.ఎ. పాలనా కాల‍ంలో ఏడాదికి 1.5% చొప్పున తగ్గిందని పేర్కొన్నారు . 2005 మార్చి 1 జనాభా లెక్కల ప్రాతిపదికన 2004 లో 37.2% ఉంటే 2010 మార్చి 1 నాటి జనాభా ఆధారంగా 29.8% కి దారిద్య్ర రేఖ క్రింద జీవిస్తున్న జనాభా సంఖ్య తగ్గిందని వెల్లడించారు . దీన్ని పరిగణలోకి తీసుకొన్నా దేశంలో దాదాపు 36 కోట్ల మంది పేదరికంలో మగ్గిపోతున్నారు .  సమ్మిళిత ఆర్థికాభివృద్ధి విధానాలు సాధించిన సత్ఫలితం ఇదేనా? పేదరిక నిర్ధారణకు రోజు వారి వేతనాన్ని కాకుండా నెలసరి సంపాదనను ప్రాతిపదికగా తీసుకొన్నామని చెప్పారు . ఈ గణన చేయడానికి  వినియోగించిన కొలబద్ద , అనుసరించిన అసంబద్ధమైన వైఖరి వల్ల పేదరికం నిర్వచనంపైనే సహజంగా అనుమానాలు రేకెత్తించాయి . ఈ అశాస్త్రీయమైన గణాంకాలనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు దృష్టికి కూడా ప్రణాళికా సంఘం తీసుకెళ్ళింది .  పేదరికాన్ని లెక్క గట్టడానికి శాస్త్రీయమైన కొలబద్దలను , ప్రామాణికాలను వినియోగించలేదు .పేదల ఆదాయ వ్యయాలను అంచనా వేసే యంత్రాంగమే లేని పరిస్థితి దేశంలో నెలకొని ఉన్నది .గడచిన ముప్పయ్ ఏడ్లుగా అనుసరిస్తున్న లోపభూయిష్టమైన పద్ధతులే కొనసాగుతున్నాయి.

పేదరిక నిర్ధారణ శాస్రీయ పద్ధతుల్లో నిర్వహించబడడం లేదన్న సద్విమర్శలున్నాయి . తాజా నివేదికలను బట్టి దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది అవసరానికి తక్కువగా ఆహారాన్ని తీసుకొంటున్నారు . ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నపూర్వరంగంలో ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం .  1993_94 లో గ్రామీణ ప్రాంతంలోని ఒక వ్యక్తి 2,153 క్యాల‌రీల ఆహారాన్ని తీసుకొంటే 2009_10 లో 2,020 క్యాలరీలకు , పట్టణ ప్రాంతాలలో 2,071 నుండి 1,946 క్యాలరీలకు పడిపోయిందని నేషనల్ శాంపుల్ సర్వేఆర్గనైజేషన్ (యన్.యస్.యస్.ఒ.) తన 66 వ అధ్యయన నివేదికలో పేర్కొంది . ప్రోటీన్ ఆహారమైన మాంసం , కోడి గుడ్లు , చేపలు మరియు పాల వినియోగం గ్రామసీమల్లో 60.2 నుండి 55 గ్రాములకు , పట్టణాలలో 57.2 నుండి 53.5 గ్రాములకు పడిపోయిందని చెప్పింది .గ్రామీణులు 2,400 , పట్టణవాసులు 2,100 క్యాలరీల మేరకు దినసరి ఆహారం తీసుకోలేక పోతున్నారన్న వాస్తవాన్ని టెండూల్కర్ కమిటీ కూడా విభేదించలేదు . 18 నుండి 29 సం.ల మధ్య వయస్సులో ఉన్న సాధారణ పురుషులకు 2,320 క్యాలరీలు అవసరమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ చెబుతున్నది .

కఠిక దారిద్య్రం పర్యవసానంగా ఆకలి బాధలు అనుభవించే వారి సంఖ్య పెరుగుతున్నది . పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో  పలు పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు పలుకుతున్నా పిల్లలు , మహిళల్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది . శిశు మరణాల సంఖ్యను తగ్గించలేని దుస్థితి కొనసాగుతున్నది . అదుపు చేయలేని ద్రవ్యోల్భణం, ఒకానొక దశలో ఇరవై శాతానికి మించిన‌ ఆహార ద్రవ్యోల్భణం , నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు , పతనమవుతున్న రూపాయి విలువ , ప్రజల కొనుగోలు శక్తి , క్షీణిస్తున్న జీవన ప్రమాణాలు, నిరుద్యోగం , బలంగా వేళ్ళూనుకొని ఉన్న బాల కార్మిక వ్యవస్థ , విద్య , వైద్యం , నివాసం వగైరా కనీస మానవ హక్కుల అమలు స్థితిగతులను గానీ ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు . పేదరిక నిర్మూలనా పథకాలపైన , సబ్సీడీల రూపంలొ చేస్తున్న ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా కుదించుకోవాలన్నదే దీని వెనకాల దాగి ఉన్నఅసలు సిసలైన‌ చిదంబర రహస్యమని స్పష్టమవుతున్నది  . కానీ పైకి మాత్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం , విద్యా హక్కు చట్టం , రాబోయే ఆహార భద్రతా చట్టం బి.పి.యల్. ప్రాతిపదికపైన అమలు చేయడం లేదని కేంద్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా మోసపూరిత ప్రకటనలు చేశారు . కానీ ఆచరణలో తద్భిన్నంగా పథకం ప్రకారం చర్యలు చేపడుతున్నారు . ప్రజా సంక్షేమాని కంటే ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణంలో శర‌వేగంతో అడుగులు ముందుకు వేయాలన్న కృతనిశ్చయంతో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ఆర్థిక సంస్కరణవాదుల బృందం ఉన్నట్లు దీన్ని బట్టి రూడీ అవుతున్నది . 12వ‌ పంచవర్ష ప్రణాళికలో మొదటి ఏడాది అయిన‌ 2012_13 సం. వార్షిక బడ్జట్టే దీనికి ప్రబల నిదర్శనం.

 దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే అధికారంలో కొనసాగే అవకాశాలు మృగ్యమైపోయాయన్న నిర్ధారణకు కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లుంది . అందుకే కాబోలు, ఆ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వం ప్రజలపై కక్ష గట్టి , ముప్పేటా దాడికి పూనుకొన్నది . అయాచితంగా లభించిన ప్రధాన మంత్రి పదవిలో డా: మన్మోహన్ సింగ్ రికార్డు స్థాయిలో కొనసాగారు . మూడోసారి గద్దెనెక్కే ముచ్చట లేదని తేలిపోయింది . అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆర్థిక వేత్తగా ఆయన్ను ఆ నోటా ఈ నోటా కొందరు ప్రశంసిస్తూ ఉంటారు . నయా ఉదారవాద ఆర్థిక విధానాల జపం చేస్తున్న ఆయన బృందంలోని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా: మాంటెక్ సింగ్ అహ్లువాలియా , ప్రధానికి ప్రధాన ఆర్థిక సలహాదారు డా: యన్. రంగరాజన్ , రిజర్వ్ బ్యాంకు గవర్నర్ డా: సుబ్బారావు , ఆర్థిక శాఖామాత్యులు ప్రణాబ్ ముఖర్జీ పోటీలు పడుతూ ఆర్థిక సంస్కరణల అమలులో వేగాన్ని పెంచ‌వలసిన ఆవశ్యకతను నొక్కివక్కాణిస్తున్నారు . వీరందరూ పేదసాదల బాగోగుల కంటే సంస్కరణల ముసుగులో విదేశీ , స్వదేశీ పెట్టుబడిదారులకు అత్యంత నమ్మిన బంట్లుగా సేవలందించడంలో తన్మయత్నం చెందుతున్నారంటే అతిశయోక్తి కాదు . ప్రస్తుతానికి తన ప్రభుత్వాన్ని , ప్రధాన మంత్రి పదవిని కాపాడుకొంటూ తన మానసిక పుత్రికైన నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల అమలును సంపూర్ణంగా సాకారం చేసుకోవాలని మన్మోహన్ సింగ్ పట్టుదలగా పని చేస్తున్నారు . భాగస్వామ్య పార్టీల అధినేతలు , ప్రత్యేకించి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఎన్ని అవమానాలు చేసినా దిగమింగుతూ , మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నా తలవొగ్గి , గుంబనంగా పైకి కనపడుతూ , అంతా సజావుగా జరిగిపోతున్నట్లు ప్రవర్తిస్తున్నారు . దోపిడీ శక్తుల పక్షాన నికార్సుగా నిలబడ్డ మన్మోహన్ సింగ్ ప్రఖ్యాత బూర్జువా ఆర్థిక వేత్తగా చరిత్రకెక్కవచ్చేమో! గానీ , రాజకీయ నాయకత్వ లక్షణాలు లేని , పేదసాదల సంక్షేమం పట్ల శ్రద్ద ఏ మాత్రం లేని దేశ ప్రధాన మంత్రిగా నడుస్తున్న చరిత్ర నూటికి నూటాయాబై శాతం తేల్చేసింది .





Tuesday, May 15, 2012

వడ్డీ రేట్ల తగ్గింపు అమలు చేయని బ్యాంకులు

Surya Daily   May 15, 2012
ద్రవ్య నియంత్రణ చర్యల్లో భాగంగా భారత రిజర్వు బ్యాంకు తీసుకొన్న కఠినమైన నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థకు సత్ఫలితాలు ఒనగూడాయా, లేదా అన్న చర్చలు జరుగుతున్న పూర్వ రంగంలోనే ఏప్రిల్‌ 17న రేపో రేటును 0.50 శాతం తగ్గించింది. గృహ రుణాలు తీసుకొని, పెరిగిపోయిన వడ్డీ రేట్లతో కుదేలైన రుణ గ్రహీతలు 0.50 శాతం వడ్డీ రేటన్నా తగ్గుతుందని సంబరపడ్డారు. కానీ ఆచరణ ఎండమావిని తలపిస్తున్నది. ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయకపోతే దేశ ఆర్థికవ్యవస్థే ప్రమాదంలో పడుతుందని రిజర్వు బ్యాంకు 15 నెలలలో 13 సార్లు రెపో రేటు పెంచింది. పర్యవసానంగా 2010 పిబ్రవరిలో 4.75 శాతం ఉన్న రేపో రేటు 8.50 శాతంకు చేరుకొన్నది. రేపో రేటు పెరిగినప్పుడల్లా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్లను పెంచేసి, రుణ గ్రహీతలపై ఆర్థిక భారాన్ని వేసి, ముక్కుపిండి వసూలు చేశాయి.

గృ రుణాలు మొదలుకొని అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు 2.75శాతం కు పైగా పెరిగిపోయాయి.
ప్రజల చేతుల్లో డబ్బు లేకుండా చేస్తే వస్తువుల వినియోగం తగ్గి, డిమాండ్‌ తగ్గుతుందని తద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్న రిజర్వుబ్యాంకు అంచనాలు సత్ఫలితాలిచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. సామాన్య ప్రజలు మాత్రం నెల వారీ వాయిదాల మొత్తం పెరిగి, ఆర్థిక ఒడిదుడుకుల్లో పడాడ్డారు. మధ్య తరగతి ఉద్యోగులు తమ వేతనాల్లో 60-70 శాతం వాయిదాల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తున్నది .

ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు రేపో రేటును 0.50 శాతం తగ్గించింది. ఈ చర్యపై నయా ఉదారవాద ఆర్థిక వేత్తలు , పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. రేపో రేటు పెరిగిన మరుక్షణమే వడ్డీ రేట్లు పెంచి వినియోగదాలపై భారం మోపిన ఆర్థిక సంస్థలు ప్రస్తుతం తగ్గిన రేపో రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించక పోవడం దారుణం. ప్రభుత్వ రంగంలోని ఎల్‌.ఐ.సి. మొదలుకొని ప్రైవేట్‌ రంగంలోని హెచ్‌.డి.ఎఫ్‌.సి. వరకు అన్ని సంస్థలూ అదే కోవలో ఆలోచిస్తున్నట్లుంది. రిజర్వు బ్యాంకు నిర్ణయం వెలువడి నెల రోజులు గడుస్తున్నా వడ్డీరేట్లు తగ్గించాలనే ఆలోచనే చేయడం లేదు. ఒకటి రెండు బ్యాంకులు మాత్రం వడ్డీ రేటును 0.25 శాతం మేరకు తగ్గించడానికి చర్యలు చేపట్టాయి.

రేపో రేటు తగ్గింపు ప్రయోజనం ప్రజలకు అందేలా చర్యలు చేపట్టడంపై రిజర్వు బ్యాంకు గానీ, ప్రభుత్వం గానీ చర్యలు లేదు. ఆర్థిక సంస్థలు వడ్డీ తగ్గింపునకు ముందుకు రాకపోవడంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. జనాభా గణనలో రూపొందించి గృహవసతి, ఇళ్ళలోని మౌలిక సదుపాయాలు, ఆస్తుల వివరాల నివేదికను కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖ ఇటీవలే వెల్లడించింది. ఆ ప్రకారం సొంత ఇళ్ళున్న వారు గ్రామీణ ప్రాంతాలలో 94.7 శాతం, పట్టణ ప్రాంతాలలో 69.2 శాతం మాత్రమే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్ళల్లో నివశిస్తున్న వారు 27.5 శాతం ఉన్నారని ఆ నివేదిక తేల్చింది. సంపాదనలో గణనీయమైన భాగం అద్దెలు చెల్లించడానికే వెచ్చించాల్సి రావడంతో ఆహారంపై చేసే ఖర్చు తగ్గిపోతున్నది.

నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభం నుండి ఆదుకోవాలని కార్పొరేట్‌ రంగానికి, బడా పారిశ్రామిక సంస్థలకు ఉద్ధీపన పథకాల పేరిట లక్షల కోట్ల రూపాయల రాయితీలను, ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కానీ, నిర్మాణ రంగంపట్ల సాచివేత వైఖరి ప్రదర్శిస్తున్నది. నిర్మాణ రంగం అభివృద్ధి చెందితే ప్రభుత్వ ఖజానాకు వివిధ రూపాలలో ఆదాయం సమకూరుతుంది. ఈ రంగంపై ఆధారపడ్డ కోట్లాది మంది అసంఘటిత కార్మికులకు ఉపాథి దొరుకుతుంది. గృహ రుణాలు తీసుకొన్న ఉద్యోగులకు వడ్డీ మొత్తంలో లక్షన్నర రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించింది.
నెలసరి వాయిదాల అసలు మొత్తాన్ని సేవింగ్స్‌ పద్దు క్రింద చేర్చింది. మొత్తం సేవింగ్స్‌పై లక్ష రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయించింది. ఇప్పుడు రేపో రేటును రిజర్వు బ్యాంకు తగ్గించినా ఫలితం మాత్రం గృహ రుణాలు తీసుకొన్న వినియోగ దారులకు దక్కలేదు. ఈ విధానాలు ఇలాగే కొనసాగితే నిర్మాణ రంగం మరింత సంక్షోభంలో పడుతుంది. రేపో రేటు తగ్గింపునకు అనుగుణంగా గృహ రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో కూడా రిజర్వు బ్యాంకు సత్వరం జోక్యం చేసుకొని గృహ రుణ గహ్రీతలకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఉన్నది.

Tuesday, May 1, 2012

శ్రమకు తగ్గ ఫలితం దక్కేదెన్నడు?

May 1st  2012  Surya Daily
విముక్తి కోసం శ్రమ శక్తి సాగిస్తున్న సమరశీల ఉద్యమాలకు ప్రతీక మే డే. నాడు (1886 మే 1) చికాగో నగరంలోని కార్మికు లు 8 గంటల పని దినం కోసం సమ్మె పోరాటం చేసి, రక్తం చిందించారు. 126 సంవత్సరాల అనంతరం నేడు కూడా 8 గంటల పని దినం కోసం, మెరుగైన పని పరిస్థితులు, ఉపాధి, సామాజిక భద్రతల కోసం, అనేక రెట్లు పెరిగిపో యిన శ్రమ దోపిడీకి అంతం పలకాలని ప్రపంచ వ్యాపితంగా శ్రామిక వర్గం ఉద్యమాల నిర్వహణలో నూతన పుంతలు తొక్కుతున్నది. నాటి చారిత్రాత్మకమైన కార్మికోద్యమానికి నేతృత్వం వహించి అమరులైన కార్మిక నేతల త్యాగాలు ఆరని జ్యోతిలా కార్మిక వర్గానికి స్ఫూర్తి నింపుతున్నాయి . ప్రపంచ కార్మికవర్గాన్ని అజేయమైన శక్తిగా ఆనాటి వీరోచిత హే మార్కెట్‌ సంఘటన నిలబెట్టింది.

సంపన్నదేశాల కూటమికి నాయకత్వంవహిస్తున్న అమెరికాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో వీధిన పడ్డ కార్మికులు, సామాన్య ప్రజలు ‘ఆక్యుపై వాల్‌ స్ట్రీట్‌’, ‘మేం 99 శాతం మీరు ఒక్క శాతం మాత్రమే’ నినాదాలతో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తడంతో దోపిడీ శక్తులకు ముచ్చెమ టలు పట్టాయి. ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న ఈ తరహా పోరాటాల్లో పాల్గొం టున్న ఉద్యమకారులకు మార్స్కిజం లెనినిజం పట్ల స్పష్టమైన అవగాహన లేకపో యినా రాజకీయ, సైద్ధాంతిక అనుబంధాలకు అతీతంగా ఉద్యమాల్లో ఉరకలు వేస్తున్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలను అమలు చేస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానే ప్రజానుకూల, సామాజిక న్యాయాన్ని అందించే ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ఉద్యమాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. సక్రమమైన పంథాలో దిశానిర్దేశం చేసి ఆ పోరాటాలను నడిపించగల రాజకీయశక్తి లేని కారణంగా అనేక దేశాలలో విపరిణామాలు చోటు చేసుకొంటున్నాయి.

అధిక లాభాల వేటలో పడ్డ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తాను తవ్వుకొన్న గోతిలోనే పడి, సమస్యల వలయంలో చిక్కుకొన్నది. పెట్టుబడిదారీ వ్యవస్థను ఆధునికీకరించుకోవడం ద్వారా సంక్షోభం నుండి బయట పడవచ్చని కొందరు ఆర్థికవేతలు కూనిరాగాలు తీస్తున్నారు. పాలక వర్గాలు ఆర్థిక సంక్షోభ దుష్ఫలితాలను శ్రామికవర్గం, సామాన్య ప్రజలపైకి నెట్టేస్తున్నారు. దోపిడీ వ్యవస్థను కాపాడుకొనే పనిలో పెట్టుబడిదారీ వర్గం నిమగ్నమై ఉన్నది. సహజవనరులు, ఉత్పత్తిసాధనాలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకొని, అతి తక్కువ వేతనాలతో శ్రమ శక్తిని ఉపయోగించుకొని లాభాల శాతాన్ని పెంచుకోవాలని, ఉత్పత్తులకు విశాలమైన మార్కెట్‌, ప్రసార మాధ్యమాలు, రాజకీయ రంగాలపై పటు ్టబిగించడం ద్వారా దోపిడీని నిర్విఘ్నంగా కొనసాగించాలని బహుళజాతి సంస్థలు పావులు కదుపుతున్నాయి.

మన దేశంలోని గుత్త సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు వాటితో జత కలిసి దేశ ఆర్థిక స్వావలంబనకు ప్రమాదం తెచ్చి పెడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ రంగంపై, జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధిలో క్రియాశీల భూమిక పోషిస్తున్న కార్మిక వర్గంపైన ముప్పేటా దాడి చేస్తున్నాయి.
ఆ దోపిడీ శక్తులకు వత్తాసు పలుకుతూ, స్థిరమైన ఆర్థికాభివృద్ధిని త్వరితగతిన సాధించాలంటే ప్రజాసంక్షేమాన్ని అటకెక్కించి, నయా ఉదారవాద ఆర్థికసంస్కర ణల అమలులో వేగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకొన్నది. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మన దేశం 2011-12 లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 6.9 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకొన్నదని చెప్పుకొంటూనే, సంక్షోభం బారిన పడకుండా దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించి, ప్రభుత్వరంగ సంస్థలను మాత్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో గొడ్డలి వేటుకు గురిచేస్తున్నది.

పెట్టుబడుల ఉపసంహరణతో మహారత్నాలు, నవరత్నాలుగా పేరొందినతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసే జాతి వ్యతిరేక విధానాన్ని- జాతీయ కార్మిక సంఘాలన్నీ ముక్త కంఠంతో నిరసిస్తూ దేశ వ్యాపిత ఉద్యమాలు నిర్వహిస్తున్నా ఖాతరు చేయకుండా మన్మోహన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ పద్దు కింద 2011-12లో రూ.40,000 కోట్లతో ఖజానా నింపుకోవాలని ప్రయత్నించి రూ.14,000 కోట్లు పోగేసుకొన్నది. 2012-13 బడ్జెట్లో రూ.30,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. బ్యాంకింగ్‌ రంగంలో ప్రైవేటీకరణ చర్యలకు పదును పెడుతున్నది. బ్యాంకు చట్టాల సవరణ బిల్లు 2011, బీమా చట్టాల సవరణ బిల్లు 2008, పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవెలెప్‌ మెంట్‌ అథారిటీ 2011- పార్లమెంటరీ స్థారుూ సంఘాల సిఫార్సులు అందాయని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొనడాన్ని బట్టి ప్రభుత్వరంగ, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. విదేశీ, స్వదేశీ కార్పోరేట్‌ సంస్థలకు, సంపన్నులకు ఊడిగం చేస్తూ జాతి సంపదను దోచిపెడుతున్నది.

జీడీపీ వృద్ధి రేటు 9 శాతానికి చేరుకోవాలంటే సంస్కరణల వేగాన్ని పెంచడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని ప్రభుత్వం ప్రకటించింది. జాతి సంపద వృద్ధి చెందాలనే ప్రజలందరూ కోరుకొంటారు. కానీ సమస్యల్లా, ఆ అభివృద్ధిలో శ్రామికులకు దక్కుతున్న వాటా ఎంవ అన్నదే. జీడీపీ వృద్ధి రేటుకు అనుగుణంగా ఉపాథి అవకాశాలు మెరుగుపడాలి. ప్రజల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు పెరగాలి. పేదరిక నిర్మూలనలో అడుగు ముందుకు పడాలి. ప్రజలందరికీ నివాసం, నాణ్యమైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను ప్రాథమిక హక్కుగా పొందగలిగిన పరిస్థితులు కల్పించాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు. అభివృద్ధి అన్న పదానికి అర్థం, పరమార్థం ఉండదు.

స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించాలనే మాయమాటలతో స్థూల జాతీయోత్పత్తిలో సబ్సీడీల శాతాన్ని 2012-13లో 2 శాతానికి, అటుపై 1.75 శాతానికి- అలా కుదించుకొంటూ పోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసుకొన్నది. ఆహారం, పెట్రోల్‌ ఉత్పత్తులు, ఎరువులపై ఇస్తున్న సబ్సీడీలను తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. రెండంకెలకు అటు ఇటూ కదలాడుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయకపోతే ఆర్థిక వ్యవస్థే తీవ్రమైన సంక్షోభంలో పడుతుందని చెప్పి, రిజర్వు బ్యాంకు ద్రవ్యనియంత్రణకు పూనుకొన్నది. పర్యవసానంగా కార్మికులు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు- బ్యాంకులు తదితర ఆర్థిక సంస్థల నుండి తీసుకొన్న గృహరుణాల వడ్డీ రేట్లు 13 సార్లు పెరిగాయి. నెలవారీ చెల్లింపులలో అత్యధిక భాగం వడ్డీ పద్దు కిందే జమైపోతుండడంతో రుణ విముక్తులు కాలేని దుస్థితి ఏర్పడుతున్నది. ఆహార ద్రవ్యోల్బణం 2010 ఫిబ్రవరిలో 20.2 శాతానికి ఎగబాకి క్రమేపీ తగ్గింది.

ఆహార వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం తగ్గితే ధరలు తగ్గుతాయన్నది ఆర్థిక వేత్తల సూత్రీకరణ. కానీ ఆచరణలో పెరిగినధరలు తగ్గడం లేదు. పతనమవుతున్న రూపాయి మారకం విలువ, తరిగిపోతున్న కార్మికుల నిజవేతనాలు, ఖరీదై పోయిన విద్య, వైద్యం, ఇళ్ళ కిరాయి ప్రజల కొనుగోలు శక్తిని క్షీణింపచేశాయి. వేతనాల మీదే ఆధారపడి జీవిస్తున్న శ్రామిక ప్రజానీకానికి, అసంఘటిత కార్మికుల ఆహార భద్రతకు పెనుముప్పు సంభవిస్తున్నది. గడచిన రెండు దశాబ్దాలుగా సంస్కరణలను అమలు చేస్తున్నారు. శాశ్వత ఉద్యోగాలు కనుమరుగై పోతున్నాయి. సంఘటిత, అసంఘటిత, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలన్నింటిలో కాంట్రాక్టు కార్మికులనే నియమించుకొంటున్నారు. క్యాజువల్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతుల్లో కార్మికులను, ఉద్యోగులను నియమించుకొని నికృష్టమైన దోపిడీకి గురిచేస్తున్నారు .

అసంఘటిత కార్మికుల సంఖ్య పెరిగిపోతున్నది. దేశ శ్రామిక జనాభా దాదాపు 46 కోట్లుంటే, అందులో 42.5 కోట్లు అసంఘటిత కార్మికులే.సాధించుకొన్న కార్మిక చట్టాలు చట్టుబండ లుగా మారిపోయాయి. పోషకార లోపంతో బాధపడే వారి సంఖ్య అధికమ వుతున్నది. కోటాను కోట్ల మంది మురికి వాడల్లో నివసిస్తున్నారు. నిరుద్యోగుల, అర్థ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపో తున్నది. రవాణా, విద్యుత్తు వగైరా ఖరీదై పోయి అందుబాటులో లేకుండా పోయాయి. కార్మిక హక్కులు, మానవ హక్కులపై దాడి జరుగుతున్నది. ప్రైవేటీకరణ, వేతనాలు, పెన్షన్లలో కోతలు విధించడం, లేఆఫ్‌, సంఘం పెట్టుకొనే హక్కునే హరించివేయడం, ఉమ్మడి బేరసారాలాడే శక్తిని బలహీనపరచడం, న్యాయబద్ధమైన, శాంతియుతమైన నిరసనలను కూడా సహించ లేని వాతావరణం నెలకొన్నది.
ఆర్థిక సంక్షోభం పేరిట ఉద్దీపన పథకాల ద్వారా ప్రజాధనాన్ని కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వం పంచిపెట్టింది. లక్షల కోట్ల సంపద సంపన్నులు, కార్పొరేట్‌ సంస్థల వద్ద పోగయ్యింది. దేశంలో కుబేరుల సంఖ్య పెరిగిపోతున్నది. దీన్ని బట్టి కార్మిక వర్గం ఏ స్థాయిలో దోపిడీకి గురౌతున్నదో బోధడుతుంది. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి జపం చేస్తూ శ్రామిక ప్రజల సంక్షేమానికంటే ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధికి అడుగులు ముందుకు వేస్తున్న పాలక వర్గాల ఆటలు కట్టించాలంటే కార్మిక వర్గం మేడే స్ఫూర్తితో చైతన్యయుతంగా, సమైక్య ఉద్యమాలకు పదును పెట్టాలి.

(నేడు మే డే!)